Saturday, 24 October 2020

సరళ మార్గము (క్రైస్తవ పద్య నాటకము)

  

సరళ మార్గము

(క్రైస్తవ పద్య నాటకము)



(యోహాను)

రచన

పిసుబ్బరాయుడు,

42/490 ఎన్.జి. కాలని

కడప--516002

సెల్9966504951



ఇందలి పాత్రలు

1యోహాను(50)            

2. శిష్యుడు-1(25)                  

3శిష్యుడు-2(25)                 

4.యాజకుడు(50)

5క్రీస్తు

6. హెరోదు

7. హెరోదు కూతురు. 

8సైతాను



సరళ మార్గము

(క్రైస్తవ పద్య నాటకము)

మొదటి రంగము

నాంది

 దేవుడు లోకమును యెంతో ప్రేమించెనువిశ్వము శాంతిమయమై భక్తి ప్రకంపనలతో నిండి యుండుట ఆయన కిష్టముమొదటి మానవుడైన "ఆదాముఅవిశ్వాస ఫలితముగా పోగుట్టుకొనిన దైవసామ్రాజ్యాన్ని తిరిగీ మానవుల కందజేయుటకైదైవమే అవకాశాన్ని కలుగ జేయ నున్నాడు. కార్యమునకై ఆయన తన ప్రియ పుత్రుని భూమిపై అవతరింప జేసినాడుఆయనే క్రీస్తుఆపతిత పావనుని దారిని సుగమము చేసి ఆయన రాకకై యీ అరణ్యమున "యోర్దాను " నదీతీరమున ఒంటెరోమముల వస్త్రములనుమొలకు తోలుదట్టియు ధరించి తేనెయు మిడుతలను ఆహారముగా తీసుకొనుచూ "యోషయాగ్రంధ లేఖనాను సారముగా కారనజన్ముడై వెలసియున్న  మహనీయుడే "యోహాను". అడుగో యిటే  అరుదెంచుచున్న ఆయనే యోహాను మహాశయుడు... యోహాను మహాశయుడు....

 

యోహాను:- (అరణ్యములో పాట

 

శరణు శరణు మమ్మేలు నాయక - శరను దైవసుపుత్రకా

శరణు దీనరక్షైకారంభక - శరణు ప్రేమస్వరూపకా

 

కొండకోనలు అడవి దారులు - చెట్టు గుట్టలు ఝరములూ

క్రమముతో నీరాకకై యిట - ఎదురుచూపులు చూచెనూ......./శరణు/

 

దైవభక్తులు సుమతులుత్తమ - జనులు ఙ్ఞానులు దీనులూ

ప్రియముతో నీరాకకై యిల - కాచుకొని యున్నారయా......../శరణు/

 

అందునన్ నీ దాసుడను నే - నిన్ను గొల్వగ నిలిచితీ

నిన్నపము వినవయ్య స్వామీ - మమ్ము గావగరావయా....../శరణు/

 

శిష్యుడు-1 :-  అడుగో..

 

కం అతడే భక్తశిఖామణి

      హితకరి యోహాననంగ నిమ్మహి మెలగున్

      సతతమ్ము మేము కొలుతుము

      పతనమ్మై పోవ పాప పంక్తి చయమ్ముల్.

 

శిష్యుడు 2:- మహాశయావీరు మీ దర్శనము కోసమే దయచేశారు..

 

యాజకుడు:- ఓహో! .. యోహానంటే నీ వన్న మాట.

 

యోహాను:- చిత్తం నన్నే యోహానని పిలుస్తారుతమరిటు దయచేసి యీ శిలా పీ ఠాన్నలంకరించండి.. .. తమరెవరో సెలనిచ్చారు కాదు..

 

యాజకుడు:- మేము యొరుషలేం వాస్తవ్యులంఆలయ ప్రధాన యాజకులం

 

యోహాను:- నమస్కారంతమరి దర్శనం వల్ల మాకు మహదానందమైనదితమరింతదూరం..  సామాన్యునికోసం వెతుక్కొంటూ రావడానికి గల కారణమేమిటో సెలవిస్తారాఅఁమరచాను .. ప్రియమిత్రులారా వెళ్ళి పళ్ళూ తేనె తీసుకరండియాజకోత్తములకు సమర్పించుకొందాం.

 

శిష్యుడు-1 :-చిత్తంసేకరించి పెట్టిన పళ్ళు తేనె సిద్ధంగా వున్నాయ్ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను.(వెళ్ళును)

 

యాజ:- నిన్ను గురించి మేము విన్నదానికి ఇప్పుడు కల్లారాచూస్తున్నదానికి చాలా తేడా వుంది

 

యోహాను:- నాగురించి.. నాగురించి విన్నారా?  ఏమని విన్నారు?

 

యాజ:- మేము మహోన్నతులైన యూదుల ప్రధానుల నుండి వారి ఆఙ్ఞ మేరకు  నిన్నుగూర్చి తెలసుకోవడానికి వచ్చాము

 

యోహాను:- నేను మీ వంటి పెద్దలు విచారించి తెలుసుకోదగ్గ గొప్పవాడిని కాను.. మరీ..

 

యాజ:- నీ గొప్పతనం కాదునీ దోషములను విచారించి తెలుసుకొనుటకు మేమింత దూరము రావలసి వచ్చినది.

 

యోహాను:- ఏమంటిరినేను దోషినా?

 

చం:- ఎవరికి నెగ్గుచేసెఱుగనీ యటవీస్థలి నుండి నేవిధిన్

        ఎవరికి కీడుసేయగల నెట్టులసేయగలాడ చూడగన్

        వివరమెఱుంగ కిచ్చటకు వేగిరపాటున వచ్చియుందు రిం

           దెవరును లేరు దోషజనులియ్యది నిక్కము నమ్ము డయ్యరో.

 

యాజ:- సరి సరి.. అది ఇప్పుడే తేలగలదు.. నీవు చూస్తే ఆటవికుని వలె నున్నావునీవేమిటీ బోధ చేయడమేమిటితత్వశాస్త్ర పారంగతులము,   ధర్మాధర్మ విచక్షణాపరులముప్రార్థనాలయయాజకులము నైన మేముండగా బోధ చేయుటకు నీ వెవడవు.

 

   ఎవ్వరి యాఙ్ఞలంబడసి యేమని బోధలు సేయుచుంటి వీ

      వెవ్విధి నేమి నేర్చితివి యెవ్వడు నీగురు డేమిపేరు నీ

      వివ్వనభూమి నందుగల యేటి జలంబుల బాప్తిజమ్మనుచు

      న్నివ్విధి దీక్షలిచ్చు విధి యెక్కడనున్నది తెల్పుమంతయున్.

 

యోహాను:- అయ్యలారామంచిమాటలు చెప్పుటగూడా నేరమా?  నేనీకార్యమునకే జన్మించిన వాడనుఇది నా జన్మహక్కు.

 

యాజ:- అట్లయిన నీవు ప్రవక్తవా?

 

యోహాను:- అట్లని నేను అనలేదే?

 

యాజ:- మరి నీవెవరు?

 

 

తే;గీ:  నీవు క్రీస్తువామరి యేలియావకాక

        శాస్త్రమేమైన నినుగూర్చి సాక్ష మిడెన

        లేక భూటక స్వామివానీకు నీవె

        ఇంతకేమని తలతువు సుంత చెపుమా?

యోహాను:- అయ్యానేను శాస్త్రములో తెలుపబడిన క్రీస్తునూ గాను యేలియానూ గాను.

 

యాజ:- అట్లయిన మరి నీవెవరుమళ్ళీ అడుగుతున్నానుఈపని చేయుటకు నీ కెవరధికారమిచ్చినారుఅసలు నిన్ను గురించి నీ వేమని చెప్పుకొంటున్నావువిసిగించక వాస్తవం చెప్పు.

 

యోహాను:- మీ ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్పియే తీరవలెనాఅసలు నేను చెప్పినను మీరంగీకరింతురా?

 

యాజ:- మమ్ము పంపినవారికి మేమీ వివరములు తెలియజేయవలసి యున్నదికనుక తెలుసుకొనియే మేమిక్కడనుండి వెళ్ళవలసియున్నది.

 

యోహాను:- అయితే వినండినేను ప్రవక్తయోషయా ప్రవచనానుసారం జన్మించిన వాడను.

 

యాజ:- అంటే..

 

యోహావు:- "ప్రభువు మార్గము సిద్ధ పరచుడి

               ఆయన త్రోవలు సరాళము చేయుడి

               ప్రతి పల్లము పూడ్చబడును

               ప్రతికొండయు మిట్టయు పల్లము చేయబడును

               వంకర మార్గములు తిన్నని వగును

 

               కరకు మార్గములు నున్నని వగును

               సకల శరీరు లూ దేవుని రక్షణ చూతురు "  

అని "అరణ్యమున యెలుగెత్తి పలుకు నొక శబ్దము"  అని వ్రాయబడియుండుట మీకు తెలియదా!

యాజ:- తెలియును.

యోహాను:-

:   ఆవనమియ్యదే యచటి  యా స్వరమేగదనా యెలుంగునే

      నీవనమందు గ్రమ్మరుచు యేమరకన్ ప్రభువొచ్చునంచు నే

      సేవకవృత్తి బూని శుభచింతనజేయుచు దారులూడ్చుచున్

      దైవసుపుత్రు రాకడను త థ్యముగా తెలియంగబల్కితిన్.

 

క్రీస్తు రాకకు నేను కేవలము సూచన మాత్రమేకాని ఆయన సాటివచ్చు వాడనుకానువాస్తవమునకు నే నాయన చెప్పులు మోయుటకు కూడా అర్హుడను కాను,  కానని మీకు విన్నవించుకొనుచున్నాను.

 

శిష్యుడు1:- (వచ్చిమహాశయాఇవిగో .

.

శిష్యుడు 2:-పళ్లు తేనె తేసుకొని వచ్చితిమి.

 

యోహాను:- యాజకులవారి కివ్వండి నాయనా... యజకోత్తమా గ్రహించండి సంతృప్తిగా భుజించండి.

 

యాజ:- అక్కరలేదునీవినయవిధేయతలకు నీవు చేస్తున్న పనులకు పొంతనలేదునీమాటలు మేము ససేమిరా నమ్మముపవిత్ర యోషయా గ్రంథప్రవచనాలను నీతో పొల్చు కొనుట మాకేంతమాత్రమూనచ్చలేదుఆటవికుడవు నీవెక్కడ యోషయా గ్రంథమెక్కడ..

 

కం:  చాలున్ చాలును ప్రేలెద

      వేలా పెక్కులు పలుకకు మింకే పల్కుల్

      మేలౌను నీకు నికపై

      నాలుకపై నదుపు గలిగి నడుచుకొనంగన్.

 

  లేనిచో మేమిదేపొయి నీమోసపూరిత వ్యర్థప్రసంగములను మా యూదుప్రధానులకు తెలియజేసి నీ ఆటకట్టించెదము.

 

శిష్యులు:-( కోపముతొమహాశయా!

 

యోహాను:- భయము లేదు... వారిని సురక్షితముగా వెళ్ళనిండు.(చురచుర జూచి యాజకుడు వెళ్ళిపోవును -  యోహాను చిరునవ్వు నవ్వి)  ఆటవికుడా గ్రామీణుడా లేక నాగరీకుడా అన్న భేదము మన కుండటానికి వీలు లేదుఅగ్రజాతులవారికే  భగవంతుడన్న వారి వాదన అహంకారపూరితమైనది.  వారినాదేవుడే రక్షించాలి.

:     దైవము దృష్టిలో సమత తప్పక యుండునుహెచ్చు తగ్గులా

      దైవమునందు లేవుదరిదాపులచేరవుదూర్తులెప్పుడున్

      దేవుని చేరలేరుకడుదీనలనెప్పుడు గాచు దైవమున్

      గావున వీరి మాటలిక ఖాతరు చేయుట మానగావలెన్.

 

పదండి యీ ఫలాలనూ తేనెనూ మమే ఆరగిద్దాంవారికి వీటి రసాస్వాదన చేయు ప్రాప్తము లేదు గాబోలు.

 

శిష్య 1:- దానికి మనమేంచేద్దాంఎవరి ప్రాప్తంవారిది.

 

శిష్య 2 :- మహాశయా!

 

తే:గీ:  మిమ్ము వెతుకుచు వచ్చిన మిత్రుడనుచు

         పిలుచుకొని వచ్చినారము తులవ నిటకు

         నేరకపరాధ మొనరించినారమయ్య

         కరుణ మా తప్పు సైరించి కావుమయ్య.

 

శిష్య 1:-దారి తెలియక వెతుకుతుంటేఇటు పిలుచుకొని వచ్చాంఅంతేగానీ మిమ్ములను దడించడానికి వచ్చిన పాపి యనుకోలేదు.

 

శిష్య 2 :- ఆఙ్ఞాపించండి.  అతడు యీ లోయ దా టే  లోపే ఒక ఆట పట్టించి  బుద్దిచెప్పి మరీ పంపిస్తాం.

 

శిష్య1:- అవునౌను అటువంటి పాపిని ఊరికే వదలి పెట్టకూడదుతగిన బుద్ది చెప్పవలసిందే.

 

యోహాను:- వలదు నాయనా..  

 

మత్త కోకిల:  పంతమూనగ నేల చెప్పుమ పాపకర్ముల చేష్టకున్

               సుంత ఓర్మి వహించి శాంతము చూపగావలె కూర్మితోన్

               చింతజెందగ నేల దుష్టులు చీదరించిన యంతటన్

               యింతకున్ మనకేమి లోటగు నిట్టినారలమాటలన్

 

రానున్నవాడు శాంతి స్వరూపుడు.దయామయుడుఅతని రాకకై మనము దారిని శుభ్రపరచవలసిన వారముఅటువంటిది మనం ఆగ్రహావేశాలకు లోను కారాదు..

 

శిష్యుడు 1:- అంటే వారి అరాచకాలను చూస్తూ వూరకుండవలసిందేనా?

 

శిష్యుడు 2:- అసలు ఎందుకలా వుండాలి.

 

యోహాను:- ఆవేశము వదలండిఇకచాలు మనహృదయములను కల్మషరహితము గావించుకొనిశాంతిదయకరుణ మన మాటలలో చేతలలో అగుపడునట్లు నడుచుకొనవలెఅప్పుడే  ప్రభువు దారి సరళమౌతుందిలోకకల్యాణం జరుగుతుంది.

తే:గీ:   మెలగ వలయును మదిప్రేమ కలుగు నటుల

         పలుక వలయును హృదిభక్తి పరిఢవిల్ల

         నడువ వలయును సజ్జనుల్ నడచు దారి

         విడువ వలయిను విద్వేష విషయ చయము.

 

విన్నారుగదాఇక పదండి చాలా ప్రొద్దు పోయి0ది ఫలాహారాలారగిద్దాంపదండి.

(  తెరపడును)

 

 

 

2, రంగము

(యోర్దాను నదీ తీర అడవి ప్రాంతము)

 

యోహాను:-ఆహాఁ!.. ఎంత పవిత్రత సంతరించుకొన్నదీయోర్ధాను నదీ తీర ప్రాంతము.

 

:    హాయిని గూర్చు మారుతము ఆకస మంటెడు వృక్షజాతులున్

      తీయని నీటనిండి నతితేటగ పారు నదీజలంబులున్

      ఊయలలూగి నీటి యలలుత్సుకతన్ తిరుగాడు పుల్గులున్

      శ్రేయమునిచ్చు నీ స్థలము చేరి కనుంగొను వారి కెంతయున్.

 

శిష్యులు:- యోహాను మహాశయులకు ప్రణామములు.

 

యోహాను:- దైవానుగ్రహ ప్రాప్తిరస్తు!

 

శిష్య1:- మహాశయాయూదయ మరియు యొరూషలేము నుండి కొందరు భక్తులు మీకొరకు వచ్చియున్నారు.  వారు మీ నుండి దీక్షతీసుకొని తరించాలని తొందరపడుచున్నారు.

 

శిష్య2:- వారు మీకోసం అరణ్యమార్గము గుండా నడచి ఇంతకు ముందుగానే ఇక్కడకు చేరుకున్నారు యోర్ధాను నదిఒడ్డున  కుటీరములో వారిని విశ్రమింపజేసి  మేము మీ కొరకై ఇటు వచ్చాము మహాశయామిరాకకోసం వారుచాలా ఆత్రుతతో యెదురుచూస్తున్నారు.

 

యోహాను:- వారు ధన్యులు నాయనా.. నిరీక్షణకు చాలామహత్తున్నదిమహోన్నతవస్తువునకై వారుచేస్తున్న నిరీక్షణ వారి ఆత్మోన్నతికి సహాయపడుతుంది

 

శిష్య 1 :- ఔనౌను నిరీక్షణాకాలమంతా వారు లోకవ్యవహారముల నుండి  దూరమై పవిత్రచింతనతోనే నిండివుంటారు.. అది తప్పక వారికి మేలు చేస్తుంది.

 

యోహాను:- సరిగ్గా గ్రహించావుఇన్ని మాటలేల.. ఇన్ని సంవత్సరాల నుండి 

నేనుచేస్తున్నదీ  పనేకదా నాయనా.. దైవము మనపై దయగలిగి యున్నాడుపాపభూయిష్టమైన యీ మానవలోకాన్ని ఉద్దరించటానికి తన ప్రియపుత్రుని యీలోకమునకు అనుగ్రహించియున్నాడు.

 

తే:గీ:   మహాత్ముడు లోకమందవతరించి

          వె లు గులోనికి వచ్చెడు వేళయయ్యె

         ననుచు నినదించు నాహృది ననవరతము

        హెచ్చె నాత్రుత నాస్వామి వచ్చె ననుచు.

 

 తేజోమయుని దివ్య సందర్శనార్థమే నా యీ నిరీక్షణాతహతహ.

 

శిష్య 2 :- ఏమో మహాత్మామాకైతే యేమీ తెలియదుమిమ్ము నమ్ముకొని సేవించుకుంటూ మీచెంత పడియున్నాముమాకు మీరే దిక్కు.

 

యోహాను:- మిమ్మూ నన్నే కాదుయీ సమస్తమానవాళిని రక్షించి బ్రోచు  ప్రభువు రానున్నాడునా మాట నమ్మండిఆయన వచ్చునప్పటికి మార్గము సి ద్ధ ముచేసి ఆయవ త్రోవలు సరాళముగను శుభ్రముగను వుంచండి.ఇదే నా బోధ పనేనాకు ప్రస్తుత దైవారాధన.

 

శిష్య 1:- నిజమే మహాత్మా అస్తవ్యస్తమై ధర్మచ్యుతి నొంది పతనావస్తలో పయనిస్తున్న జనాన్ని దై వము వైపు మళ్లించి ప్రభువు వచ్చి నిలుచుటకు తగు శుభ్రమైన స్థానాన్ని యేర్పాటుచేస్తూ  మీరు చేస్తున్న కృషి అనన్యసామాన్యమైనది.

 

శిష్య 2:- నిన్నవచ్చిన  యెరూషలేము యాజకులు మిమ్ము ధిక్కరించి నిందించివెళ్ళారు వారికంత ఆక్రోశమెందుకోమరి?

 

యోహాను:- ఏమున్నదయ్యాప్రజలు నిజము గ్రహించి మనవద్దకొస్తున్నారుఅలా జనులు వాస్తవమెరిగి మేల్కొంటే  యాజకుల ఉనికికే ప్రమాదమేర్పడగలదు కనుక మనల్ని నిదించి తప్పుమోపి ప్రజలను వారి వైపునకు త్రిప్పుకొని వారి బూటకపు మాటలతో వారి ఔన్నత్యాన్ని కాపాడుకొంటున్నారు.

 

శిష్య1:- మరి వీరినుండి జనులెలా తప్పించు కోగలరు మహాశయా?

 

యోహాను:- ఆవిషయమై మీకెలాంటీ అనుమానమూ అక్కరలేదు.

 

చం:  పరుశువు వృక్షమూలములపైనిడి యున్నదివ్రేటువేయు నా

      పరుశువుపూసికాయక నపాయము దెచ్చెడి చెట్లవేర్లపై

      తిరుగదిలేదు  దైవసుతు తీర్పునకా విషతుల్యులందరున్

      విరుగుదురింక మారకవివేకము జూపక మూర్ఖులైచనన్.

మంచి ఫలముల నియ్యని ప్రతి జీవికీ ముప్పు తప్పదునమ్మికగల్గి యుండుటే మన  విధి.

 

శిష్య 2:- అలాగే మహాత్మ ఇక మనం బాప్తిజ మిచ్చు కార్యక్రమం మొదలు పెట్టుటకు వెళ్ళెదమా?

 

యోహాను:- మంచిది మీరు ముందువెళ్ళి భక్తబృందాన్ని సాదరంగా వెంటగొని రండివారి కీ జలములలో దీక్ష నొసంగెదనువెళ్ళిరండి.

 

శిష్యులు:- చిత్తం (ఇద్దరూ వెళ్ళుదురు)

 

యోహాను:- ఏమది.  ఏమాప్రశాంత దివ్యకాంతినావైపే వస్తున్నదిఆఁఆకాంతి ఒక దివ్యపురుషుని రూపు ధరించి ప్రసన్న వదనారవిందంతో దరహాసపు రుచులతో సమీపించుచున్నది... ప్రభూ.. వచ్చావా ప్రభూవచ్చావానాపై కృపజూపి నా కొరకై వచ్చావా! (మోకాళ్ళపై నిలబడి ప్రణమిల్లును)

 

క్రీస్తు:- (లేపివచ్చాను యోహాను మహాశయా వచ్చానుమీ కోసమేవచ్చాను.

 

కం:  వచ్చితి మీ చరితము విని

      వచ్చితి మీరిచ్చు దీక్ష వడయుటకొరకై

      వచ్చితి మీదీవెన నే

      వచ్చిన పని మొదలిడంగ వసుధాస్థలిపై.

 

యోహాను:- నేను మీకు బాప్తిజమిచ్చుటయాఏమిటి ప్రభూ మీరంతున్నది.ఈదీనునిపై పరిహాసమా ప్రభూ?

 

క్రీస్తు:- లేదు యోహానుమహాశయాపరిహాసమేమాతమూ కాదు . నీ నుండి దీక్ష పొందుటకే నే నింతదూరము వచ్చితిని.

 

యోహాను:- ప్ర భూ.. మీనుండి మేము దీక్షపొందవలసి యుండగా....

 

క్రీస్తు:- యోహాను మహాశయా మీరు దైవానుగ్రహ సంపన్నులు.నా కంటే పెద్దవారుగాన లోకాచార యుక్తముగా పెద్దవాడవైన నీ చేత నేను దీక్ష పొందవలసి యున్నదిఅంతేకాదు..

 

తే:గీ:    శాస్త్రలేఖన మిట్లుండెజరుగ వలదె

           దాని నెదిరించి తప్పింప దగునె వినుము

           బాప్తిజమ్మిమ్ము నాకింక భావ్య మనుచు

           దైవ సమ్మతమిది యోయుదార చరిత. 

 

యోహాను:- తమరి యాఙ్ఞ మాకిక శిరోధార్యము.

 

క్రీస్తు:- మహాశయా.. జలాశయం వద్దకు వెళదాం పదండిఅక్కడ అందరి తోపాటు నాకునూ దీక్ష నిత్తురు గాక!

 

యోహాను:- మంచిది .. ఇటు దయచేయండి.. పదండి(ఇద్దరూ నిష్క్రమింతురు)

(ఎర్రనికాంతి రంగస్థలంపై క్రమ్ముకొనును ఒక పెద్దపామును

 వ్రే లాడునట్లుచేసి నాగస్వరం వినిపించి తర్వాత నాగస్వరం తగ్గించి మాటవినబడునట్లు చేయాలి పామే సైతాను అనుకోవాలి)

 

సైతాను:- (పెద్దగా నవ్వి)జనము నపమార్గము పట్టించి దేవునిపై నమ్మకము వమ్ము జేసి అల్లకల్లోలము సృష్టిస్తున్న సైతానును నేను (మళ్ళీ పెద్దగానవ్వు)నాకార్యముల కడ్డుపడుదురా యీయోహాను మరియు నీ మరియ పుత్రుడుచూచెదగాకవారు నా మాయకు లొంగెదరా సరిలేకున్న నా విషాగ్నికి బలై పోయెదరు.(భయంకరంగా అరచి నవ్వునుచిన్నగా పాము వెనక్కి వెళ్ళి పొవునుపరిస్థితి సామాన్యమై పోవును)

 

యోహాను:- (శిష్యులుక్రీస్తు వచ్చెదరునాయనలారామీరు కళ్ళారా చూచితిరిగదాఈయన నన్నాదరించ దలచి నా చేత బాప్తిజము పొందెనుగానీ లేకున్న నే నెంతటి వాడనునేను నీటియందు బాప్తిజము నిచ్చితిని గానీ యీయన అగ్నితోను పరిశుద్దాత్మతోనూ బాప్తిజమియ్య సమర్థుడు . మహనీయుని దర్శనభాగ్యమున మన జన్మలు ధన్యములైనవి.(క్రీస్తు వైపు తిరిగి)

 

 

సీ    ఏదీను వేదనల్ యెరిగి దీర్పగ నెంచి

              ధరణి కేతెంచితో పరమ పురుష

      ఏపతితుని పాప మెంచక బ్రోవంగ

              భువికేగుదెంచితో బోధ గురుడ

      ఏరోగి బాధల నేరిపారగద్రోల

              నవనికేతెంచితో అమృత మూర్తి

      ఏభక్తజనముల బెంచి మోక్షమునియ్య

              నిల నడుగిడితివో యేసుప్రభువ

 

తే:    అట్టి నినుగన నీవనమందు నిలచి

      కనుల వత్తుల నిడికొని వినతు లిడుచు

      బాటలన్నియు పరిశుభ్ర పరచుకొనుచు

      కాచుకొని యుంటిమో ప్రభూకావు మమ్ము

(అందరూమ్రొక్కుదురు)

 

క్రీస్తు:- దైవానుగ్రహ ప్రాప్తిరస్తు!(ఆకాశంవైపు చుస్తూ చెతులు ప్రార్థనాపద్దతిలో తెరచి యుంచిఇక నాకు సెలవు. (వెళ్ళిపోవును)

 

యోహాను:- ఆయన సాక్షాత్తూ దేవుని బిడ్డఅందుకు సం దేహము లేదునాచేత దీక్షగైకొన్న మరు క్షణమే పరిశుద్దాత్మ పావురము రూపమున వచ్చి ఆయనపై వ్రాలెనుఆకాశము తెరువబడి యితడే నా ప్ర్రియతనయుడుఈతని ద్వారా నా మహిమ ప్రకటింపనున్నానని దైవవాణి ఘోషించినది.కనుక మీరు ఆలసింపవలదుఆయన వెంట వెళ్ళండివెళ్ళీ ఆయనను సేవించండి.

 

శిష్యులు:- తమరి ఆఙ్ఞ.. సెలవు.

 

(తెర వ్రాలును)

 

 

3, రంగము

 

(పెద్దపాము రంగస్థలము మీద వ్రేలాడుచుండునుఅదే సైతాను.  ఎర్రని కాంతి నిండి యుండును)

 

సైతాను:-  మరియపుత్రుడు దేవుని బిడ్డయట.. దేవునిబిడ్డ.. నామాయాజాలమున చిక్కువడి నలువది అహోరాత్రములు అన్నపానీయములు లేక ఉపవసించుచున్నాడు ఇప్పుడు కనుగొనియెదగాకఈతనికి దైవముపై గల విశ్వాసమెంతటిదో?  ఓయేసూ! ..మరియాసుతా!

 

క్రీస్తు:- (వస్తూఎవరు.. ఎవరు నన్ను పిలుస్తున్నది.

 

సైతాను:- నేనే సైతానునుఏసూ.. ఆకలిగనున్నదా?

 క్రీస్తు:- ఆఁ...

 

సైతాను:- నీవు దేవుని ప్రియపుత్రుడవుగదా!

 

క్రీస్తు:- ఔను...

 

సైతాను:- నీవు నిజముగా దేవుని పుత్రుడివేఐతే నీ తండ్రిపై నీకు అచంచల విశ్వాసమే వుంటే యీ రాళ్ళను రొట్టెలగునట్లు చేయమనుమునీవు భు జిం చవచ్చును.

 

క్రీస్తు:- మనిష్యుడు రొట్టెల వలన మాత్రమే జీవింపడుదైవ వాక్యము వలన జీవించునుఇది సత్యముపవిత్రగ్రంధములందు యిదే లిఖింపబడి యున్నది.

 

(లైట్లు అఫ్ చేయబడి ఒక శబ్దము చేయడంద్వారా తెరమార్చి లైట్లు ఆన్ చేయవలెను)

 

సైతాను:- ఇదిగో నా మంత్ర శక్తి వలన పరిశుద్దపట్టణము లోని ఆలయశిఖరమునకు చేరుకొన్నామునీవు ఇక్కడనుండి క్రిందకు దుముకుమునీ దేవుడు దూతలను బంపి నిన్ను క్రిందపడకుండా పట్టుకొనునట్లు జేసి కాపాడు నేమోజూతము.

 

క్రీస్తు:- అవశ్యమునీవన్నట్లే జరుగునుకానీ నేను దూకనునాతండ్రిని నేను అనవసరముగా శంకించి పరీక్షింపను.

 

(లైట్లు ఆఫ్ చేసి ఒక శబ్దము చేసి తెర మార్చనలెను తర్వాత లైట్లు వెలుగును)

 

సైతాను:-సరిసరి... నా మహిమ వలన యిదిగో మనం ఒకకొండ శిఖరంపై చేరితిమిచూడుము నీకు స్పష్టముగా కనబడుతున్న యీ రాజ్యము లన్నింటినీ జూడుముఇవన్నీ నా అధీనములుఒక్కసారి నాకు సాగిలబడి మ్రొక్కుమునాకు దండప్రణామము లాచరించి నా నాయ కత్వ మంగీకరింపుమునేను యీ రాజ్యములన్నింటికీ నిన్ను చక్రవర్తిని చేసెదనునిన్ను భోగభాగ్యలలో తేల్చెదనునీ వెంట వేలాది కన్యలను భృత్యులను నియమించెదనునీవు కోరినవెల్ల సమకూర్చెదను.

 

క్రీస్తు:- అందరికీ ప్రభువు  దేవుడేఆయనకు మ్రొక్కి ఆయననే సేవింపవలెనుయివి పవిత్ర గ్రంధములన్నీ నొక్కివ క్కా ణించు చున్నవి.ఇది సత్యముదీనికి విరుద్దముగా నేను ప్రవర్తింతుననుకొనుట కేవలమూ నీ భ్రమనీవు చూపు ప్రలోభములకులొంగు నంతటి బలహీనుడనుగానుదైవానుగ్రహము నాయందు నిండుగానున్నదివెళ్ళు..  నన్ను వీడి వెళ్ళు.. అదిగో నా దేవుడు సర్వలోకైకనాధుడునన్ను రక్షించుటకై నన్ను సేవించుటకై తన దూతలను పంపుచున్నాడువారిదే వచ్చుచున్నారుఇకనీవు వెళ్ళు.. వెళ్ళిపో.. నేనున్న చోటికి యికనీవు రాలేవునీ ఆటలు నారాకతో కట్టు.. వెళ్ళు...

(ఒకశబ్దంతో సైతాను శబ్డం నిలచిపోవును-రంగస్థలంపై పూర్తి వెలుగు నిండును)

 

శిష్యులు;-(పరిగెత్తుకొంటూ వచ్చి యేసు కాళ్ళపై బడిఏసు ప్రభూ!

 

శిష్య 1 :- ఇక మీ రే మాకు రక్ష.

 

శిష్య2:- మా గురువర్యులు యోహాను మహాశయుని ఆఙ్ఞానుసారం మీ పాదసన్నిధికి యిప్పటికి జేరుకోగలిగితిమి.

 

శిష్య 1:- ప్రభూమమ్ముల నంగీకరించండి.

 

క్రీస్తు:- నన్ననుసరించుటకు అయోగ్యులను వారలెవ్వరునూ లేరుసర్వజనులకూ నా మర్గమెప్పుడూ తెరువబడే వుంటుందిదైవసామ్రాజ్యమునకు నేనే ద్వారమును.

 

(ఏసు బయలుదేరును వెంట శిష్యులూ వెళ్ళుదురు.)

 

(తెరవ్రాలును)

 

 

4, రంగము

 

(కారాగారంలో యోహానుండును.- హెరోదురాజుఅతనిఉంపుడుగత్తె కూతురు ప్రవేశం)

 

హేరోదు:- (నవ్విఆఁ!.. ఏమోయ్ యోహన్ యిప్పటికైనా బుద్ధివచ్చిందా?

 

యోహాను:- బుద్ధిబుద్ధిఙ్ఞానము దేవుడు నాకు పుట్టుకతోనే అనుగ్ర హించాడుఅసలు బుద్ధి రావలసింది నాకు గాదు యేండ్లుపై బడినా యింకాబుద్ధి రాని నీకు.

 

హేరోదు:- నోరుమూయ్.. ఎంత కడకావరంరా నీకు (చెంపచెళ్ళు మనిపించును)

 

కుమార్తె:- ఏంటినాన్న గారూ.. నాకు భయంవేస్తూంది . పిచ్చివాడా యితడు.

 

హేరోదు;- అవును తల్లీ పిచ్చివాడేఅయినా గొలుసులతో కట్టించానుగాభయంలేదు.

 

యోహాను:- అవును పిచ్చివాడనేతప్పతాగి వివేకహీనుడై సోదరుని ఇల్లాలనే యింగిత ఙ్ఞానమైనాలేక పరస్త్రీలోలుడైన ఉన్మత్తుని దృష్టిలో నేను పిచ్చివాడనే ... పాముపిల్లానీకుగూడా నేను పిచ్చివాడిలాగానె కనిపిస్తున్నానా?

 

హేరోదు:- ఎవరక్కడ దోషిని చీకటి గదిలో బందించండిదారికొచ్చేవరకు అన్నపానాదులివ్వకండి.

 

యోహాను;మీ పాడు మొగాలు చూస్తూ ఉండటంకంటే చీకటిగదే మేలు.. తూ..(వెనక్కి తిరిగి వెళ్లును)

 

కుమార్తె:- ఏమిటి నాన్నగారునన్నిక్కడికి తీసుకవచ్చారు.

 

హేరోదు:- నీవేగదమ్మా.. చెరసాల చూద్దామన్నావు?

 

కుమార్తె:- చెరసాలంటే యిదావద్దు బాబు నేనిక చూడలేను వెళదాంపద.

 

హేరోదు:- అంతగా చూడాలని వచ్చావుగదామిగిలిన గదులు కూడా చూచే వెళదాం తల్లీ!

 

కుమార్తె:- వద్దు నాన్నగారూ..  ఇక బయటికి వెళ్ళిపోదాంఅవునాన్నగారు.. ఇతనెవరుఏంనేరం చేశాడుచూస్తే పిచ్చివాడు కాదేమో ననిపిస్తుంది.

 

హేరోదు:- పిచ్చివాడేనమ్మాకాకపోతే ప్రభువునైన నన్ను జూచి

ప్రా ధేయపడి క్షమాపణ కోరవలసినది పోయియిలా పిచ్చిగా

 వాగుతాడాఇతడు.

తే:గీ:   పిచ్చి తలకెక్కి నోటికివచ్చినట్లు

          ప్రభువుననియైన తలపక పాపి యనుచు

          దిట్టుచున్నాడు మమ్ముల తెలివిదప్పి

          కాన వేసితి నితనికి కఠిన శిక్ష.

 

అంతేకాదు మీ అమ్మను మరీ మరీ దూషించాడు తల్లీ!

 

కుమార్తె:- ఆఁ!..

 

కం మామాతను దిట్టెనుగా!

      యేమీతని కండక్రొవ్వు యేమని తలచున్

      ఈమాత్రపు శిక్షలితని

      కేమాత్రము చాలవయ్య హేరోదుప్రభూ!

 

చూడు వీని గతి అమ్మతో చెప్పి వీని పనిపట్టిస్తాను.

 

హేరోదు:- నీలాగే నాకూ కోపమొచ్చిందమ్మా.. చంపేద్దామనుకొన్నాను.. గానీ..

 

కుమార్తె:- కాని...

 

హేరోదు:-కానీ వీడి వెనుక జనమున్నారువారితన్ని దైవాంశ సంభూతునిగా భావిస్తున్నారువీణ్ని చంపితే జనం మన మీదికి తిరగబడతారు.

 

కుమార్తె:- అంత భయమెందుకు నాన్నగారు.. వీడి మాటలు వినవద్దని ప్రజలకు హేరోదు మహారాజుగా మీరు నచ్చజెప్ప వచ్చుగదా!

 

హేరోదు:-నీకు తెలియదు తల్లీ.. వారు నమ్మరు . వారినిశ్వాసము వారిది.  అసలు వీడి పుట్టుకే అసమాన్యమైనది.

 

:    ఈతడు పండు నృద్ధులకు నే విధి బుట్టెనో నాకె చిత్రమౌ

      నీతని జన్మమా పితరు డెవ్విధి మున్నె నెఱుంగ గల్గెనో

      నీతని వాక్కులున్ పనులు నీతని వేషము తిండి తిప్పలున్

      చూతముగాదె యేవియును సుంతయు నర్థముగావు నెంతకున్.

 

కుమార్తె:- అయితే వీడొక విచిత్రమైన మనిషన్నమాట

 

హేరొదు:-అవును తల్లీ.. సరిసరి యివన్నీ ఆలోచించి నీ మనసు పాడుచేసుకోకుఇక వెళదాం పద.(బయటికి వెళతారురంగ స్థ లం చీకటై మళ్ళి చిన్నగా వెలుగు పరచుకొంటుంది)

 

క్రీస్తు:- యోహానూ..  యోహానూ..నేనొచ్చానయ్యా రా బయటికి... రా..

 

యోహాను:-(వచ్చిప్రభూ!

 

క్రీస్తు:- నీ చీకటిగదిద్వారం తెరువబడిందివెలుగు ప్రసాదింపబడిందిరా యోహానూ రా..

 

యోహాను:- ప్రభూనన్ను కరుణించావా.. నామొరవిని నన్ను

అనుగ్ర హించవచ్చావా..

 

సీ:    నీచింతనన్ మున్గి నీయండ నాశించు

              నాపన్నులన్ జేరి ఆర్తిబాపి

      నీబోధనల్ విని నీవెంట నడచెడు

              సజ్జనులకు గల్గు శంకదీర్చి

      నీపాదముల జేరి నీకు శరణముజొచ్చు

              పాపులదోషముల్ పారద్రోలి

      నీవెదిక్కని నమ్మి నినుజేరి రోదించు

              రోగుల రుగ్మతల్ బాగుజేసి

 

తే:గీ:   దైవపుత్రుడవీవన ధరణి యందు

        వెలసి నా వయ్య యేసయ్య తెలిసి నీదు

       మార్గమందున చరియించు మానవులను

       దైవసన్నిధి జేర్తువు దారి చూపి.

 

క్రీస్తు:- యోహాను.. నీవుజన్మించినవారందరిలో మిక్కుటముగా అనుగ్ర హింప బడిన వాడవు.

 

యోహాను:- ప్రభూ యికచాలు జీవితానికిది చాలు.

 

క్రీస్తు:- నీ కార్యభారాన్ని నీవు ఓర్పుతో మోసి కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించావు.

 

యోహాను:- తమరి ఆశీర్వాదము ప్రభూ.. ఇప్పుడు నాకు చాలా

సంతోషముగానున్నదినాబాధ్యతలను నేను నిర్వహించానన్న

 సంతృప్తి కలిగినదిఇక తమరు పనిని చేపట్టారుఫలితములు కనులున్నవారికి గోచరిస్తూనేయున్నవి లోకంలో నా పని పూర్తయిందిఇకనాకు పరలోకయాత్రకు అనుమతించండి ప్రభూ..

 

క్రీస్తు:- యోహానుమంచిది అందులకు నీ వు సమీపములోనే ఉన్నావయ్యానీ వు వచ్చుట వెళ్ళుట కూడా సంచలనాత్మకమేకాగలదు.

 

కం:  శ్రమకోర్చుకొనెడు శక్తిని

      క్రమగతి నీ కొసగబడియె కాలంబయెన్

      నీమనమిక శాంతించున్

      ధీమంతుడ నీవు గొనుము దీవెన లిడితిన్.

 

యోహాను:- మహాప్రసాదము.(నమస్కరించును)అంతా యిక దైవేక్ష.

 

క్రీస్తు:- దైవసామ్రాజ్యమున నీకొక ఉన్నత స్థానము కేటాయింపబడినదిత్వరలోనే నీవాస్థానాన్ని అలకరించగలవు.

 

యోహాను:- ధన్యుడను ప్రభూ.. ధన్యుడను.

 

క్రీస్తు:- ఇక సెలవు.

 

(తెర వ్రాలును)

 

 

5, రంగము

(హేరోదు ఆసవం సే విస్తూవుంటాడుకుమార్తె వస్తుంది)

 

కుమార్తె:- నాన్నగారు.. నాన్నగారు.. నోరు తెరవండీ..

 

హేరోదు:- ఏమిటమ్మా...

 

కుమా:- ముందు మీరు నోరు తెరవండీ..

 

హేరోదు:- సరే..(మిఠాయి నోట్లో పెడుతుందిభలే వుందిరా యెంతమధురంగా వుందిఏమిటమ్మా యిదీ..

 

కుమా:- మీకేం తెలియదు నాన్నగారుపాలు పంచదార ఖర్జూరాలు వేసి అమ్మ తయారు చేసిన మిఠాయి యిది రోజు మీ పుట్టినరోజు గదాఅందుకని అమ్మే ప్రత్యేకంగా తయారు చేసింది.

 

హేరోదు:- ఆఁ!.. మిఠాయి మీఅమ్మలాగే కమ్మాగా ఉందిరా!

 

కుమా:- మీపుట్టినరోజు సందర్భగా నేనొక కవిత చెబుతానుఏమంటారు.

 

హేరోదు:- అబ్బో కవితే..చెప్పరా నిందాం.

 

కుమా:   జన్మదినం వచ్చింది - భూనాధులకీదినం

             జన్మంతా మరచిపోదు - జనం యీదినం

             సంబరాలయీదినం - సంతోషసమన్వితం

             జనులందరి పర్వదినం - జననాయకు జన్మదినం... /జన్మదినం/

 

      కోయిల ఎలుగెత్తి పలికె - ఈరోజును రార మ్మని

      నెమలి ఫింఛము విప్పిస్వాగతమ్మును తెలిపె

      రాజహంసగణము - రాజుఘనతను చాట

      గగనాని కీనాడు - గర్వముగ నెగసె...../జన్మదినమ్/

 

      పావురాళ్ళ గుంపు - పరమమోదముదెల్పి

      పక్షతాళద్వనులు - మాటిమాటికి జేసే

      కుసుమాలు వికసించి - నవ్యకాంతులనీనె

      షట్పదమ్ములు జేరి - శ్రావ్యనాదము జేసే..../జన్మదినమ్/

 

హేరోదు:బ్రహ్మాండంగా వుందిరా.. నీకవిత.

 

కుమార్తె:- నేనొక నాట్యంనేర్చు కొన్నానుచెయ్యమంటారానాన్నగారు.

 

హేరోదు:- నువ్వు నాట్యంచేస్తానంటే వద్దంటానాచేసెయ్

 

కుమార్తె పాటా-ఆటా

 

సగీత సహిత్య సారంబు - గ్రహియించి

లయలు హొయలను గూర్చి - అభినయంబున జూపు

నటనమె కడు రమణము - నా నాట్యమె రమణీయము

 

  నాహావ భావాల - నటనమునకు పొంగి

కొండచరియల ఝరులు - త్రుళ్ళింతలిడిజారె

నా మేని జిగిబిగి - వయ్యారముగని

విద్యుల్లత చాల విప్పారి మెఱిసె................./సంగీత/

 

 

కాలి గజ్జలరవళి - మేఘనినదముబోలు

కనుల కొసచూపులె - మెఱపు తీవలసాటి

చిరుమందహాసంబు - తళుకు తారల తోడు

మేనీ వొంపుల సొంపు - సితచం ద్రి కల సమము......./సంగీత/

 

హేరోదు:- అద్భుతం బ్రహ్మాండంగావుందిరా నీ ఆటా పాట కొరుకో నీ కిష్టమైన బహుమానం యిచ్చేస్తా.

 

కుమార్తె:- బహుమానమాఏంకోరుకోవాలబ్బా!

 

హేరోదు:- కోరుకోరానీ యిష్టమోచ్చింది కోరుకో.. నేనివ్వడానికి సిద్ధం.

 

కుమార్తె:ఉండండి అమ్మనడిగి వస్తాను.(లెళ్ళును)

 

హేరోదు:- పిచ్చిపిల్లకోరుకొనే బహుమానం కూడా తల్లి నడీగే కోరుకోవాలాఔను.. అంతా దానిష్టమేమరిఈపిల్ల విషయమేకాదు నా విషయంకూడా అంతేమరి.. దాని యిష్టానికి వ్యతిరేకంగా నేను మాత్రం ఒక్క అడుగైనా వెయ్యగలనాదాని అందానికి నేను దాసుడనై పోయానుఆహాఁ! .. ఏమి దాని యందము..

 

సీ    కాంచనవర్ణమై కాంతులీనెడు మేను

              నిడివి చాల గలట్టి నీలి కనులు

      రత్నవర్ణంబై మెఱయు నట్టి యధరంబు

              ధవళ కాంతులు జిమ్ము దంతచయము

      సమపీనవైభవ సాధిత స్థనములు

              సన్మోహనంబైన సన్న నడుము

      నాణ్యమై యోప్పారు నవకంపు కరములు

              మెత్తగ నొత్తుగ మెఱయు కురులు

 

తే:గీ:  అన్ని విధముల నాయింతి యందమందు

        సాటి లేనట్టి దనుచును చాటనొప్పు

        నెలత వయ్యార మిదియంచు నిర్వచింప

        వచ్చు నియ్యింతి యవయవ వరుస జూపి.

 

అంతటి అందగత్తె యదిదాని మాటంటే మాటే మరి..

 

కుమార్తె:- (తిరిగి వచ్చికోరుకోమంటారా నాన్నగారు.

 

హేరోదు:ఊఁ.. కోరుకో..

 

కుమా:- మాటతప్పకూడదుమరి.

 

హేరోదు:-  హేరోదు ఎన్నటికీ మాటతప్పడుకోరుకో.. ఆలస్యమెందుకూ కోరుకో.

 

కుమా:- అయితే కోరుకుంటున్నా...

 

హేరోదు:- ఊఁ!.

.

కుమా:- నాకీ రాజనగరులో కొదువేమీ లేదుసకల వైభోగములూ నాసొత్తునాకంటూ ప్రత్యేకంగా కోరుకోవలసిదేమీ లేదుమా తల్లిని ఆనందపరచడమే నాకు కావలసిది.

 

హేరోదు:-  ఉపోద్ఘాతాలెందుకూతల్లీ కూతుళ్ళు కలసి కోరుకోదలచిందేదో చెప్పండి.. వెంటనే యిప్పిస్తాం.

 

కుమార్తె:- అయితే కోరుకుంటున్నాను వినండి.

 

కం అమ్మను దిట్టినవాడిక

      నిమ్మహి జీవింపరాదు హేరోదు ప్రభూ!

      తెమ్మనుమా యోహాన్ తల

      కొమ్మని మాయమ్మకిత్తు కొండాడ ననున్.

 

వెంటనే  యోహాను తల నరికి తె ప్పించి మాచేతిలో పెట్టించండిఇదేనా కోరిక.

 

హేరోదు:- ఆఁ!.. యోహాను తలా?

 

కుమా:- అవును యోహాను శిరమే.

 

హేరోదు:- వద్దు బిడ్డా వద్దుఅంత కఠిన కసాయి కఱకు కోరిక కోరదగదువద్దు తల్లీ నీ మనసు మార్చుకోఇంకేదైనా కోరుకో..

 

కుమార్తె:- మా మనసుమారదుమాకు యోహాను మస్తకమే కావాలి ఇదేమా ఆఖరు నిర్ణయం.

 

హేరోదు:- వద్దమ్మ.. అతడు ప్రజలమనిషిఅతనికి కారాగారశిక్ష వేసినందుకే ప్రజల్లో అలజడి మొదలైందివాని తిట్లకునిందలకూ భరించలేక చెరసాలలో వేయించి ప్రజల్లో రాజకుటుంబంపై వస్తున్న అసహ్యాన్ని నిలుపుదల చేయించానువాడు చస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందిఅది అనేక అనర్థాలకు దారితీస్తుందినామాట విను తల్లీ..  విపరీతపు కోరిక మానుకో నీ యిష్టమొచ్చినదింకేమైనా కోరుకో తప్పక తీరుస్తాను.

 

కుమార్తె:- నాకింకేమీ అక్కరలేదుయోహాను శిరం యిప్పిస్తారా లేక మాట తప్పుతారాతేల్చుకోండి.

 

హేరోదు:- స్త్రీ బుద్ది ప్రళయాంతకమని తెలిసి తెలిసి ఆపద కొనితెచ్చుకొన్నానుసరిసరి.. ఏమైననూగానీ యీ హేరోదు మాటతప్పడు.. ఎవరక్కడ?

 

అంతఃపుర రక్షకుడు:- (బయటనుండేప్రభూ!.. (హేరోదు మాట్లాడేంత లోపలే)

 

కుమార్తె:- మీకెందుకు ప్రభూ శ్రమ.. నేనే చెబుతానుఇది హేరోదు మహారాజుగారి ఆఙ్ఞ తలారులను వెంటగైకొనివెళ్ళి  యోహాన్ను శిరచ్ఛేదము చేయించి తలను పళ్ళెరములో నుంచుకొని ఇక్కడకు వెంటనేరమ్ము.. వెళ్ళు.

 

అంతఃపురరక్షకుడు:- (ఆశ్చర్యముతో బయటినుండేప్రభూ!

 

హేరోదు:- వెళ్ళు.. కారాగారాధికారికి మా ఆఙ్ఞ నెరిగించి పని పూర్తిగావించు కొని రా.. ఆగూ.. అంతకంటేముందు నగరసంరక్షనాధికారికి విషయమెఱిగించి రహస్యముగా కట్టు దిట్టమైన యేర్పాట్లు గావించి యెక్కడా అలజడి జరగకుండా జాగ్రత్త వహించమనుఎప్పటికప్పుడు మా ఆఙ్ఞలకై యెదురుచూస్తూ వుండమని కూడా చెప్పుఇక వెళ్ళిరా..

 

అంతఃపురరక్షకుడు:- (బయటి నుండేచిత్తం తమరి ఆఙ్ఞ ప్రభూ!

 

(హేరోదు ఆసవం సేవిస్తూ తూగుతూ ఆసవంపైనే వాలి పోతాడుఅతడు మత్తులో మునిగి పోతుండగా ఉంపుడుగత్తె కూతురు నాగిన్ నృత్యం చేస్తుందినృత్యం చాలా కఱకుగా నూ వికృతం గాను సాగుతూ వుంటుంది (కాసేపటికి)

 

అంతఃపురరక్షకుడు:- (బయట నుండే)ప్రభూ.. యోహాను శిరము తీసుకరాబడింది.

 

కుమార్తె:- (నాట్య మాపిఆఁ!  యోహాను శిరం ఖండించి తేసుకొచ్చారా..(పెద్దగానవ్విబయటకువెళ్ళి పళ్ళెరంలో వస్త్రం కప్పియున్న తలను తీసుకొని వచ్చి వెనక్కు తిరిగి వస్త్రం తొలగించి చూచుకొని మళ్ళీ పెద్దగానవ్వి చేతిలో పళ్ళెరంతో నృత్యం చేసుకొంటూ లోనికి వెళ్ళిపోతుందిరాజు మత్తులో తూలి ఆసనం నుండి క్రింద వెల్లెలికల పడి కలవరిస్తూ వుంటాడు.)

 

(తెర వ్రాలుతూవుండగా నాటకాంతపు వ్యాఖ్యానం వినబడుతూ వుంటుంది)

 

వ్యాఖ్యానము

అలా జకర్యా కుమారుడైన యోహానుమహాశయుని జీవితం ముగిసిందిమహాత్ముల రక్తధారలే  ఆధారంగా దైవరాజ్యం యేర్పడవలసియున్నదిఅది దైవేచ్ఛదానికి తిరుగు లేదుమహనీయుడైన  యోహానుసత్పురుషచరిత్ర బైబిలు పవిత్రగ్రంథమున సువర్ణాక్షరములతో లిఖింపబడిందిఅమ్మహాత్ముని జీవితగాథను దృశ్యకావ్య రూపమున తిలకించిన మీకందరకూ శుభమగగాక!..   ఆమెన్.

 

(నాటకము సమాప్తము)

 

6--4--212 గుడ్ ఫ్రైడే  సందర్భమున ఆకాశవాణి కడప ద్వారా

:9-౦౦ //  నాటకాన్ని(పద్యాలులేకుండాప్రసారం చేయడం జరిగింది]

v     

 

No comments:

Post a Comment

నాకు చదువురాదు, Naaku Chaduvu Raadu

  నాకు   చదువు   రాదు ( ఏకపాత్రభినయము )     (పాత్ర: ఓ 50 సంవత్సరాల  పేద పెద్దమనిషి ) అమ్మా!  శారదా ... ( బోరున   యేడ్చును ).  తల్లీ   యీ   గ...