Sunday, 18 July 2021

భూతల నరకం

 భూతల నరకం

(Socio fantasies play On AIDS)

నాటిక

 


రచన

పి.సుబ్బరాయుడు.

42/490 భాగ్యనగర్ కాలనీ

కడప 516002

సెల్-9966504951

ఇందలి పాత్రలు

 

 

1.యమధర్మరాజు

2.చిత్ర గుప్తుడు

3.డాక్టర్ అమరం

4.ప్రదీప్ (27)

5. చలమయ్య (35)

6.కలెక్టర్

7.అమ్మాయి (8) గెస్ట్

8.  పాపి (50)

 

 

  

 

భూతల నరకం

(ఎయిడ్స్- నాటిక)

 
(యమలోకం - యముడుచిత్రగుప్తుడు వారి వారి ఆసనాలలో వారు కూర్చొని వుంటారు)
 
యముడు:- పరేతలోక పాలకుండ. సమవర్తి నామధేయుండ. చిత్రగుప్తా! ఇట్టినాకే యీ జారులైన పాపీ జనులను విచారించి విచారించి విసుగు జనించుచున్నది. ఆఁ!  ఈనాడు విచారించవలసిన పాపు లింకెంద రున్నారు.
 
చిత్రగుప్త:-ప్రభూ..ఈనాడిప్పటికి ఐదువందలా ఇద్దరిని విచారించితిమి. ఇంకనూ వందాయిరవై మంది మిగిలి యున్నారు. మీరేకాదు నేనునూ బాగా అలసి పోతిని ప్రభూ.. ఈవిధంగా పని చేస్తూపోతే యెంత దేవతలమైనా నీరసించి పోకతప్పదు ప్రభూ..
 
యముడు:- మరెంచేద్దాం చిత్రగుప్తా. భూలోకంలో పాపులు విపరీతంగా పెరిగిపోయారు. అక్రమసంబంధాలు వ్యభిచారాలైతే మరీ మితిమీరి పోయాయినరకానికి వచ్చే జనం పెరిగి పోయారు. స్వర్గ వైకుంఠ కైలాసాది ఉత్తమ లోకాలకు వెళ్ళే వారేలేక ఆ లోకాధిపతులుపనీపాటలేక హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
 
చిత్రగుప్త:-ఔను ప్రభూ.. మీరన్నట్లు నీతిబాహ్యులైన వ్యభిచారులను విచారించి శిక్షలు అమలుజరుపుతూ మనమూ మనభటులూ విసిగి వేసారి పోయాం. ఈకార్యభారము కొంతకు కొంతైనా తగ్గించుకొనుటకు మార్గాంతరమే లేదా ప్రభూ!
 
యమ:- మార్గాంతరమాలేదయ్యా! మనభారం తగ్గించుకొనే మార్గమే లేదయ్యా.
 
చిత్ర:- మీరు కోపగించుకోమంటే.. ఒకమాటచెబుతాను ప్రభువులు మన్నించాలి.
 
యమ:- ఇందులో కోపగించుకునేదేముంది సలహాయేగదా! చెప్పు చూద్దాం.
 
చిత్ర:- ప్రభూ.. భూలోకాన్ని కర్మభూమి అంటారుగదా!
 
యమ:- అంటే మీ ఉద్దేశ్యం...
 
చిత్ర:- అంటే యేమీలేదు ప్రభూ..అక్కడే యీ  వ్యభిచార నేరాలకైనా శిక్ష అనుభవించే యేర్పాట్లేవైనా చేసేస్తే సరిపోదా! అని నా అలోచన.
 
యమ:- లేదు చిత్రగుప్తా! ఇవి చాలా తీవ్రమైన పాపాలు. వ్యభిచారం సామాన్యమైన పాపం కాదు. ఇందులో వాడు చెడిపోవడమేగాకుండా మరొకర్ని కూడా చెరుస్తాడు. కుటుంబాలుకుటుంబాలు యీ పాపాలతో కూలిపోతాయి. సంఘమే భ్రష్టుపట్టిపోతుంది. అసలు వ్యభిచారుల జీవితమే వృధా! ఒక్కమాటలో చెప్పాలంటే యే దోషికైనా భూమిపై శిక్షానంతరం మోక్షముందేమోగాని వ్యభిచారికి మాత్రం ఆ జన్మలో మోక్షమన్న మాట లేనేలేదుకదా! కనుక వారు నరకం రాకాతప్పదూ మనకీ శ్రమా తప్పదు. (ఇంతలో ఒక పాపి ముందుకు త్రోయబడతాడు) సరిసరిఇక యీ పాపి విషయం చూద్దాం.. చదివి విని పించు వీని పాపపు చిట్టా.
 
చిత్ర:- పభూ వీడు గురువుభార్యను మాయమాటలతో మోసగించిఆమెను చె ఱచుటేగాక ఆమెను నగానట్రా డబ్బుతో సహా లేవదీసుకపోయి ఆమె దగ్గరున్నదంతా విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చుచేసి  డబ్బైపోగానే ఆమెను విడిచిపెట్టి బిక్షగత్తెగా మార్చేశాడు. ఆతర్వాత యింకో ఉంపుడుగత్తెతో కులుకుతుండగా ఆ ఉంపుడుగత్తె మొగుడు ఓర్పు నశించి వీణ్ని గొడ్డలితో నరికాడు. చక్కగా వీడు నరకానికొచ్చాడు. ఇదీ ప్రభూ వీని చరిత్ర.
 
యముడు:-ఒకే ఒక్క గొడ్డలి వ్రేటుతో వీడు చచ్చి నాడు. భూలోకమున వీడనుభవిచిన గొడ్డలివ్రేటు వీడు చేసిన పాపములకసలు శిక్షే కాదు. అది స్వల్పాతి స్వల్పం. వీడు పరసతులగూడినాడుపరుల ధనమపహరించినాడు. అందులకు రౌరవమహారౌరవము లందు సర్పములచే యీతని కండలు బయటపడునట్లు కరిపించవలెను. గురుధనమపహరించి గురువునవమానపరచినాడు. అందులకు తామిశ్రనరకమున  చర్మము వూడివచ్చువరకు కొరడాలతో కొట్టించికలాసూత్ర నరకమున వేడి చేసిన యినుప పలకలపై నడిపించవలెను. గురుపత్ని బంగారు నగల నపహరించి ఆమెను చెరచినాడు. అందులకు తప్తమూర్తనరకమున కొలిమిలోవైచి కాల్పింపవలె. ఇనుపబొ మ్మ లను ఎఱ్ఱగాకాల్చి వాటిని కౌగిలించుకొనజేయుటకు సాల్మలీనరకమున త్రోయవలె. స్త్రీలను మోసగించి వారినేడిపించెను గనుక వీనిని  పుయోదుకనరకమునద్రోసి మలముమూత్రముచెమటచీముశ్లేష్మాదులలో  యీదులాడించవలెను. వీడి పాపప్రక్షాళన జరుగునంతవరకు మాటిమాటికి యాతనాశరీరములనిప్పించి దండననమలు పరచండి.
(అది విని పాపి బోరున యేడ్చును)
 
చిత్ర:- వీడి పాపములకన్నింటికి మూలము వీడి వ్యభిచారగుణమేకదా ప్రభూ! భూలోకవాసులకు మన నరకలోక శిక్షలు తెలియవు. తెలిసినచో యిట్టి దోషములకు వారు పాల్పడరుకదా!  కనుక భూలోకమున వారి కళ్ళయెదుటే కఠిన శిక్షలమలుజరిగిన వారు కొంతకు కొంతైనా జాగ్రత్త పడెదరు కదా ప్రభూ!
 
యమ:- చిత్రగుప్తా! ఎందుకు తెలియవయ్యానరకలోకమును గురించి ఇక్కడి శిక్షలనుగురించి భులోకములోని మతములన్నియు ప్రస్తావించినవి. అంతేగాదు గరుడపురాణమున మనము విధించు శిక్షలన్నీ విశదంగా వ్రాయబడి యున్నవిగదా!
 
చిత్ర:- ఆ మతపెద్దలబోధలుపురాణములు నమ్మువారిప్పుడు లేరు ప్రభూ..అంతేగాదు అసలు బోధకులే  ఇప్పుడునమ్మడములేదు. వారొక వైపు శుష్కబోధలు చేస్తూ మరోవైపు వారే యీ పరమచండాలపు  పాపములు చేయుచున్నారు. కనుక వారికి తెలిసివచ్చునట్లు తమరే యేదైనా చేసితీరాలి ప్రభూ..
 
యమ:- సరి అర్థమైనది నీ ఆవేదన. ఇదిగో చూడు యిప్పుడే మందులేని ఒక మహారోగాన్ని సృష్టిస్తున్నాను. వ్యభిచారులీరోగము బారినపడి కృంగి కృషించి నశించి చస్తారు. దీనిదెబ్బకిక భయపడి వ్యభిచారము జోలికి పోరు. ఓం.. రీం.. క్లీం..ఏ..యి..డ్స్.
 
చిత:- ఈ "ఎయిడ్స్" యేమిటి ప్రభూ!
 
యమ:-ఎయిడ్స్ అంటే అక్వయిర్డ్ ఇమ్యునో డిఫీషియన్సీ సిం డ్రో మ్. ఆంగ్లములో చెబితేనే గదయ్యా యిప్పుడు జనులు వినేది.
 
చిత్ర:- స్వామీ! తమరు చెప్పినది పిల్లి అంటే మార్జాలం అన్నట్లుంది. కాస్తా అర్థమయ్యేట్లు చెప్పండి మహానుభావా..
యమ:- ఏమీలేదయ్యా! వ్యాధినిరోధక శక్తిని హరింపజేసిశరీరమును రోగములకాలవాలముగా మార్చివేయు రోగము కాని రోగము. ఇప్పటికున్న శగరోగముకొరుకుడువడిశగడ్డల కున్నట్లు దీనికే ఔషదములూ వుండవూపనిచేయవు. అసలు ఔషదసత్వము గ్రహించి సరీరమునకు పటుత్వమొసగు విధానమే దేహమున దెబ్బతినును. దీనితో నరకము వారికి భూలోకముననే కానవచ్చును. సరియేనా?
 
చిత్ర:-బాగున్నది ప్రభూ.. ఈ జబ్బు దెబ్బకు జనులు వ్యభిచారమన్న భయపడి జాగ్రత్తగా నుందురు. అది అటు వారికి ఇటు మనకూ మంచిది. ఉభయతారకం ప్రభూ.. ఇకనైనా మనకు కాసింత విశ్రాంతి దొరుకుతుంది.
 
యమ:- సరిసరి.. ఇక యీ పాపిని నా ఆఙ్ఞ మేరకు వివిధ నరక శిక్షలలనుభవించునట్లు యేర్పాట్లు గావించితదుపరి దోషిని ప్రవేశ పెట్టుడు.
 
చిత్ర:- చిత్తం ప్రభూ.. ఎవరక్కడ... (పాపి ఏడ్వడం మొదలెడతాడు)
 
(తెర పడును)
 
 
 
రెండవరంగము
 
(ఆసుపత్రిలో రూము - బెడ్ మీద ఒక యువకుడైన రోగి ప్రదీప్ - ప్రక్కన ఒక కుర్చీ ఒక స్టూల్ వుంటాయి. డాక్టర్ వచ్చి రోగిని పరీక్షిస్తూ వుంటాడు.)
 
ప్రదీప్:- డాక్టర్..బ్లడ్ రిపోర్ట్ వచ్చింది. (బెడ్ క్రింద నున్న కవర్ తీసి డాక్టర్‍కిస్తాడు.)
 
డాక్టర్:- (సీరియస్ గా కవర్ చించి పరి శీ లించి) సారీ..మిస్టర్ ప్రదీప్.. నీకు ఎయిడ్స్ వచ్చింది. నీకీవిషయం తెలియజేయడానికి  నాకూ బాధ గానేవుంది. నాకు తెలుసు ప్రదీప్ నీవీ మధ్యనే ఐ.ఎ.ఎస్ పరీక్షలు పాసయ్యావు. పోస్టింగ్స్ కోసం యెదురుచూస్తున్నావు. రేపో మాపొ డ్యూటీలో జాయినై దేశానికి ఉత్తమ సేవ లందించ వలసిన వాడివి. బంగారం లాంటి బ్రతుకును బుగ్గిపాలు జేసుకున్నావ్. ఆశాజనకమైన భవిష్యత్తును చేజేతులా  నాశనం చేసుకున్నావ్మిస్టర్ ప్రదీప్ యీ మహమ్మారిని యెలా తెచ్చుకున్నావయ్యా?
 
ప్రదీప్:- డాక్టర్... (కాసేపు ఆగిపోయి మెల్లిగా) నాకు ముందూ వెనుకా
 ఎవ్వరూ లేరు. అనాధశరణాలయంలో పెరిగాను దాతల ఔదార్యంతో బాగాచదువుకున్నాను. తెలివైన వాడినని  నన్ను ఓ దాత ఐ.ఎ.ఎస్ కోచింగ్‍కు ఢిల్లీ  పంపించారు. అక్కడ మెస్ నడుపుతున్న నాకంటే పెద్దదైన ఓఅమ్మాయితో పరిచయమేర్పడింది. చాలా మంచిదనుకున్నాను. నిజంగా చాలా మంచిదే. నన్ను చాలా బాగా ఆదరించింది. నాకెంతో అండగా నిలబడింది. ఇద్దరం కలిసి తప్పుచేశాం ఆతప్పు సరిదిద్దుకోవడానికి ఆమెనే పెళ్ళి చేసుకోవాలనుకున్నా కూడా. (బోరున యేడ్చును)
 
డాక్టర్:-ప్రదీప్.. నీవు ఐ.ఏ.ఏస్. ఆఫీసరౌతావని ఆమె కరెక్ట్‍గా అంచనావేసింది. ముందూవెనుకా లేనివాడివని నిన్ను వలలో వేసుకుంటే యే అడ్డూ లేకుండా హాయిగా గడిపేయచ్చనుకొంది. అందుకే నీతో శారీరకసంబంధం పెట్టుకొంది. నీలోని బలహీనతను కనిపెట్టి నీకు దగ్గరై ఉపాయంగా నీజీవితంలోకి ప్రవేశించాలని ప్రయత్నించింది.
 
ప్రదీప్:- నిజమే.. అప్పుడది నాకు తప్పనిపించలేదు డాక్టర్.
 
డాక్టర్:- అంతాసరే గానీ.. పెళ్లికి ముందు పరస్త్రీతో శారీరకసంబంధం తప్పుకాదా ప్రదీప్.
 
ప్రదీప్:- కానీ.. నేను.. నేను..
 
డాక్టర్:- కానీలేదు గీనీలేదు. అదేనీవు చేసిన పెద్దతప్పు. ఉద్యోగం వచ్చేవరకు ఆగి  చదుకొన్నవారు విఙ్ఞానవంతులు చేయించుకొంటున్న ఎయిడ్స్ టెస్ట్ యిద్దరూ చే యిం చుకొని  తర్వాత పెళ్లిచేసుకొనే  ప్రయత్నం చేసివుంటే యీ ఆపద తప్పేది. ఆమెకు ఎయిడ్స్ వుందని ముందే తెలిసేది.
 
ప్రదీప్:- పెళ్ళికి ముందు ఎయిడ్స్ టెస్ట్ అంతవసరమని అనుకోలేదు డాక్టర్.
 
డాక్టర్:- ఇలాంటి దూరప్రాంతపు స్త్రీ పురుషుల విషయంలో మంచీ చెడూ విచారించడానికి వీలుండదుకదా!  కనీసం అందుకైనా మనం జాగ్రత్త పడవద్దా..ఏదియేమైనా ప్రదీప్ ఐయామ్ వెరీ వెరీ సారీ..రేపో మాపో ఐ.ఏ.ఎస్  అధికారివై దేశానికి వెలుగు బాటలు వెయ్యాల్సినవాడివి జీవితం పాడుచేసుకున్నావ్.  నీవేకాదు దేశమూ నష్టపోయింది. నేనెందరికో యిటువంటి  దారుణమైన విషయం అప్పుడప్పుడూ చెప్పాల్సి వస్తూ వుంటుంది  కానీ నీవిషయంలో నాకు ఎప్పుడూ లేనంత బాధ కలుగు తోంది. ఎంతో ఔదార్యంతో నిన్ను పైకి తెచ్చిన  ఆ దాతల శ్రమ వృధాఅయి పోయింది కదయ్యా..  ఐ యామ్  సో సారీ ప్రదీప్ ఐ యామ్ సో సారీ..
 
(లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)
 
 
మూడవరంగం
(డాక్టర్ కుర్చీలో కూర్చొని వుంటాడు. పత్రిక తిరగేస్తు వుంటాడు. కార్పొరేటర్ చలమయ్య పరుగు పరుగున వస్తాడు)
 
చలమయ్య:- డాక్టర్..డాక్టర్..రక్షించండి.. రక్షించండి..
 
డాక్టర్:- (లేచి  యెదురొచ్చి) ఏమైంది కార్పొరేటర్‍గారు ఎందుకంత కంగారుగా ఉన్నారు. ముందు కూర్చోండి.
 
చలమ:-(కూర్చో కుండానే) డాక్టర్‍గారూ.. వెంటనే నాకు బ్లెడ్ టెస్ట్ చేయించి ఎయిడ్స్ వుందో లేదో  చెప్పండి.
 
డాక్టర్:- ఏమంత తొందర. ఎందుకొచ్చింది మీకా అనుమానం.
 
చలమ:-చేసిన పాపమండీ..చేసినపాపం... అందుకేవచ్చింద ని అనుమానం.
 
డాక్టర్:- సరే.. మీకనుమానమెందుకొచ్చినా ఎయిడ్స్ టెస్ట్ చేయించు కోవడం మంచిదే.  అయినా లాబ్‍టెక్నీషియన్  రావడానికి ఓఅరగంట పడుతుంది. తొందరపడకుండా  మీకనుమాన మెందుకొచ్చిందో ముందు చెప్పండి.
 
చలమ:- డాక్టర్ దగ్గర చెప్పకతప్పుతుందా! ఇంటిగుట్టు వ్యాధి రట్టూ అన్నారు. ఇంటిగుట్టని ఊరకుందామా? లేక వ్యాధి రట్టని చెప్పుకుందామా? ఏమ్జేయాలబ్బా.
 
డాక్టర్:- నేనెవ్వరికీ చెప్పనులేవయ్యా.. చెప్పు.
 
చలమ:- ఆఁ.. అలాగన్నారు బావుంది.అయినామేము ప్రజల మనుషులంగదా! అన్నీ చెప్పుకోలేమండీ డాక్టరూ..
 
డాక్టర్:-సరే..ఇంకమీయిష్టం..
 
చలమ:- అట్లా కోప్పడకయ్యా డాక్టరూ..చెబుతాలే వినూ..
 
డాక్టర్:- సరే.. చె ప్ప0డి.
 
చలమ:- నాలుగేండ్ల కిందట ఓపిల్లకు లైనేసుంటి.
 
డాక్టర్:- ఏమిటీ..లైనా?
 
చలమ:- లైనంటే తెలీదా..ఏండాక్టర్‍వయ్యా నువ్వు. పెళ్ళి జేసుకుంటానని ఏవో నాలుగు మాటలు అవీ ఇవీ జెప్పి లొంగదీసుకున్నాలే.
 
డాక్టర్:- ఐతే..
 
చలమయ్య:- అయితేఏంల్యా.. ఇంతలో మానాయన ఓమంచి సంబంధం చూశ. సుమారో కోటి దాక కట్నమిస్తామన్నారు. కాదనలేక చేసుకున్నా. రెండేళ్ళయిందిలే..
 
డాక్టర్:- మరి ఆ పిల్లో.
 
చలమ:- మామూలే.. రోంత గలభాజేశ. బెదిరించి యింత డబ్బుబారేసి వదిలించుకున్నా వెళ్ళిపోయింది.
 
డాక్టర్:- మరి ఇంకేంటి.
 
చలమ:- ఏమ్లేదయ్యా.. ఆపిల్ల మల్లా ఓనెలకిందట కనబడింది.
 
డాక్టర్:- కనబడి..
 
చలమ:- కనబడి కహానీ చెప్పిందయ్యా.. కల్లబొల్లి మాటలుచెప్పి పెండ్లంటే చేసుకోకబోతివి. ఉంచుకో .. నన్నుంచుకో మని ఏడ్చి కాళ్ళావేళ్ళా బడిందయ్యా.
 
డాక్టర్:-ఇన్నేండ్లకొచ్చి అలా అడిగిందా! మరి ఇప్పటిదాకా యెక్కడకెళ్ళింది. అడగలేదా?
 
చలమ:- అడిగా.. నేనుకాదన్నాక దుబాయ్ బోదామని నే నిచ్చిన డబ్బు దీసుకొని ముందు బొంబాయ్ బోయిందట. అక్కడ మోసగాళ్ళ చేతిలో చిక్కి నానా భ్ర ష్టు పట్టిఅటు దుబాయ్ పోలేకా ఇటు సొంతూరికి రాలేకాబొంబాయ్‍లోనే వునిందట.
 
డాక్టర్:- అక్కడెన్నాళ్ళని వుంటుందిలే! ఇక ఉండలేక ఇప్పుడు తిరిగొచ్చి నీ కాళ్లకాడ జేరింది. నువ్వూ కాదనలేక ఉండమన్నావ్.. వుంచుకున్నావ్..    అంతేనా?
 
చలమ:- అంతే.. అంతే డాక్టర్‍గారూ.. పోనీలే ఏదో గతిలేని ఆడదిగదా.. అని వుండమన్నా.. అంతే .. అదే నా కొంపముంచింది.
 
డాక్టర్:- ఏమైంది..డబ్బూ.. నగలూ కాజేసి ఉడాయించిందా?
 
చలమ:- అట్లాజేసున్నా యింత బాధపడనయ్యా డాక్టరూ..అది నాకు ఎయిడ్స్ అంటించినట్లుందయ్యా. ఇంగనా గతేంది (ఏడుపు మొగం పెట్టును)
 
డాక్టర్:- ఊరుకో .. ఊరుకో..ఇంతకూ నీకు ఎయిడ్సని యెవరు చెప్పారు?
 
చలమ:- అదేచెప్పింది... ఈరోజు అది  నిజం చెప్పేసింది. "దుర్మార్గుడా..  నాకన్యాయం జేసి నన్ను పరుల పాల్జేసినావుగదరా! నాకు బొబాయ్‍లో ఎయిడ్స్ తగులుకొంది. అందుకే నాకు డాక్టర్‍సర్టిఫికే‍ట్ యీలా  దుబాయ్‍కి వీసా రాలా. ఎలాగూ నే చచ్చేది ఖాయం. నిన్ను ఊరికేపొనిస్తానా? ఇంగజూస్కో  అంటించేశా ఎయిడ్స్. ఇంగనేనేమైనా పర్వాలెదు. నాకసిదీరింది" అంటూ వెళ్లిపొయింది. డాక్టర్‍గారు..నాకు ఎయిడ్స్ తగులుకొనిందాచెప్పండి డాక్టర్ చెప్పండి (ఏడ్వడం మొదలు పెడతాడు)
 
                       (లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)
 
 
 
 
నాల్గవ రంగం
 
(యముడు. చిత్రగుప్తుడు ఆసీనులై వుంటారు)
 
చిత్ర:- ప్రభూ! యమధర్మరాజా! మీరు భూలోకమునకు పంపిన ఎయిడ్స్ వల్ల మనకు పనిభారము తగ్గినది. వ్యభిచార పాపఫలమునకు శిక్ష భూలోకములోనే అమలు జరుగుతున్నది.
 
యమ:- ఇక్కడో అక్కడో శిక్షైతే అమలౌతున్నది అదియే మనకు కావలసినది. ఆదిసరే మరి ఆ పాపి కార్పొరేటర్ చలమయ్య గతి యేదశలో ఉన్నదో కాస్తా చిట్టావిప్పి చూడు..
 
చిత్ర:- చిత్తము ప్రభూ! (తాటాకుల గ్రంథము తిరగేసి చూసి) రక్తపరీక్షలో హెచ్.ఐ.వి పాజిటివ్ అని వచ్చింది. అదే ఎయిడ్స్ ఉందని తేలింది. ఆవిషయం ఎంత దాచిపెట్టజూచినా దాగలేదు.
 
యమ:-అంతేనయ్యా.. ఏలాదాగుతుంది నిజం బయటపడేతీరుతుంది. అయితే గియితే కొంత ఆలస్యమౌతుందంతే. సరే తర్వాతేమైంది.
 
చిత్ర:- ఏముంది ప్రభూ.. ఇల్లాలు చక్కా పుట్టింటికి పోయి విడాకులు కోరింది.
 
యమ:- మంచిపని చేసింది.. లేకుంటే ఆమెకూడా ఎయిడ్స్‍కు బలై పోయేది.
 
చిత్ర:- ఏమో ప్రభూ.. ఆమె తప్పించుకొందో లేక యీ మధ్యన అంటించుకొందో ఆమె చిట్టా విప్పితేగాని తెలియదు.
 
యమ:- సరే అదలావుంచు. వీడి కథ ఆతర్వాత యేమైందో చూడు.
 
చిత్ర:-ఆతర్వాత కార్పొరేటర్ పదవీకాలం ముగిసింది. ఇంటికాడే వుంటూన్నాడు. ఎయిడ్స్ విషయం ఆనోటా ఈనోటా బడి అందరికీ తెలిసి పోయింది. ఇప్పుడు ఇంట్లోవాళ్ళు వీధిలో వాళ్ళు ఛీదరించుకొంటున్నారు. ప్రస్తుతం జలుబూజ్వరం తగులుకొని విడువకుండా వేదిస్తూంది.
 
యమ:- ఓహో.. వీడికి శిక్ష మొదలైందన్నమాట.
 
చిత్ర:- అయితే ఈ ఎయిడ్స్ జలుబూ పడిశం పట్టినంత  సులువుగా పట్టేస్తుందన్న మాట.
 
యమ:- తప్పు తప్పు.. ఎయిడ్స్ వుంటే శరీరం జలుబుకు కూడా లోకువే ఔతుంది. ఏజబ్బును నిలువరించే శక్తి శరీరాని కుండదు. మరి ఆఐ.ఎ.ఎస్ వాని కథేంటి? ఇదిగో ఇప్పుడే చూచిచెబుతాను. (తిప్పిచూచి) ఆఁ.. అతడు బహుజాగ్రత్తాగా జీవిస్తూ రోగములబారి పడకుండా జీవితాన్ని కాస్తా కాస్తా పొడిగించుకుంటూ  ఓ మంచిపని చేస్తున్నాడు ప్రభూ.
 
యమ:-ఓహో మంచిపనులు చేస్తున్నాడా.. ఏమిటా మంచిపనులు.
 
చిత్ర:- తానెలా అన్యాయమైపోయాడో చెప్పి,  అలా ఇతరులు కాకండని వైద్యశాఖ నిర్వహించే సభల్లో పాల్గొని జనులకు హితబోధ చేస్తున్నాడు.
 
యమ:-తనొక ఉదాహరణగా నిలబడి చెబుతున్నాడు. మంచిదే! పాపీజనం తగ్గడమేగదా! మనం కోరుకొనేది. మిగిలిన జీవితం హితబోధ ద్వారా సార్థకం చేసుకుంటున్నాడు. ధన్యుడు.
 
చిత్ర:-అంతాబాగుంది. కానీ ప్రభూ! నాకు యింకో రెండు సంశయాలున్నాయ్.
 
యమ:- నీకు సంశయమా! "సంశయాత్మా వినశ్యంతి " అన్నారు. అడిగి వెంటనే నివృత్తి చేసుకో. ఊ..అడుగు..
 
చిత్ర:- తమరు ప్రయోగించిన యీ ఎయిడ్స్ వికటించి వికృత రూపం దాల్చి  లేనిపోని చిక్కులు తేవడంలేదుకదా? అన్నది నామొదటి సంశయం. ఇక రెండవ అనుమానం యీ భూలోకవాసులు మహాతెలివిపరులు. యీ ఎయిడ్స్‍ని తప్పించుకోవడానికి యేదైనా ఉపాయం కనిపెట్టలేరా.. అని
 
యమ:- చిత్రగుప్తా! నీకీ అనుమానం ఎందుకొచ్చిందయ్యా?
 
చిత్ర:- ఏముంది ప్రభూ..  పూర్వం శివుడు భస్మాసురునికి వరమిచ్చి  పరిగెత్తలేక అవస్త పడ్డారట. వినలేదా ప్రభూ..
 
యమ:- నిజమేనయ్యా..ఏవైనా క్రొత్తచిక్కులు వచ్చినా రావచ్చు. చుద్దాం.  అదిగో భూలోకంలో ఎయిడ్స్‍పైన గొప్ప అవగాహనా సదస్సు జరుగు తూంది. అందులో నీవు చెప్పినట్లు ఏవైనా చిక్కులుత్పన్నమైయుంటే ఇట్టే బయటపడును గదాచూడుము. (చేయి క్రిందకు చూపిస్తాడు-చిత్రగుప్తుడు క్రిందకు చూస్తాడు.)--- [సీన్ స్టి‍ల్ ]
 
(తెరపడును)
 
 
 
ఐదవ రంగం
 
(సదస్సు - వేదికపై ప్రదీప్డాక్టర్కలెక్టర్ ఆసీనులై వుంటారు)
 
కలెక్టర్:- సభకునమస్కారం.. ప్రజలారా! మీకందరికీతెలుసు నేడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న పెద్దసమస్య ఎయిడ్స్ ముఖ్యంగా యువతమధ్య వయస్కులు దీని బారినపడి జీవితాన్ని సర్వనాశనం చేసుకొంటున్నారు. దేశభవిష్యత్తు నేటి యువతపై ఆధారపడి వుంది. వెన్నెముకవంటి యువతే యీ ఎయిడ్స్ బారినపడి రోగగ్రస్తమైతే ఇకమన దేశమెలా బాగుపడు తుంది కనుక జాగరూకులై మెలగండి. మన పూర్వీకులు మనకు పదేపదే చెప్పినట్లు రంకుతనం ఒక మహా వ్యసనం. ఇది రట్టై ఎన్నో కుటుంబాలు కూలిపోయినై. పరస్త్రీ వ్యామోహంతో రాజ్యాలే నశించాయి. రహస్యంగా గ్రంథం నడుస్తుందిలేఏంకాదులే అనుకుంటారేమో. పొరబాటు. క్రితం గనేరియాసిఫిలిస్వడిశగడ్డలు వంటి గుప్తరోగాలు వచ్చేవి.  వాటికి రోగ గ్రస్తులు బయటికి చెప్పిగాని చెప్పకుండాగాని మందులువాడి బాగు చేయిం చు కొనేవారు. కాని యీ ఎయిడ్స్ అలాకాదుఇది మనిషిని నిర్వీర్యం చేస్తుంది. మనిషిలో ఉండే రోగనిరోధకశక్తిని హరిస్తుంది.  అప్పుడు దేహం లోనికి యేరోగమైనా అడ్డూ అదుపూ లేకుండా చొరబడ గలుగు తుంది. అలా దేహం రోగాలకు నెలవైపోతుంది. ఎయిడ్స్‍కు మందులు లేవు. ఎయిడ్స్‍సోకకుండా జాగ్రత్తపడడమొక్కటేమార్గమని గుర్తుంచు కోండి. యిప్పుడు యీ ఎయిడ్స్‍కు సంబంధించిన శాస్త్రీయ సమాచారం మన డాక్టర్ అమరంగారు మీకు చక్కగా వివరిస్తారు.వినండి. జాగ్రత్తగా మసలుకోండి.
 
డాక్టర్:- అందరికీ నమస్కారం..ఇప్పటివరకూ ఎయిడ్స్ యొక్క తీవ్రతనుదేశభవిష్యత్తుపై దాని ప్రభావాన్నీజనులు దాని యెడల అప్రమత్తంగా వుండవలసిన అవసరాన్నీమన ప్రియతమ కలెక్టర్‍గారు నొక్కి వక్కాణిం చారు. వారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను యావత్ జనానికీ చెప్పేదేమంటే..భార్యాభర్తల సంబంధం బహుముద్దు. అక్రమ సంబంధాలసలే వద్దు.(కరతాళధ్వనులు) నేను అవసరమైనమటుకు యీ ఎయిడ్స్‍కు సంబంధించిన సైంటిఫిక్ విషయాలు తెలియజేస్తాను. జాగ్రత్తగావినండి. ఎ. ఐ. డి. ఏస్. (ఎయిడ్స్) అంటే  అక్యర్డ్ ఇమ్యునో డిఫీషియన్‍సి సిండ్రోమ్. అంటే అంటించుకొని తెచ్చుకొన్న ఒక స్థితి. అది మనశరీరంలోని రోగనిరోధకశక్తిని న శిం జేస్తుంది. ఈస్థితి యొక్క లక్షణ సముదాయాన్నే మనం ఎయిడ్స్ అంటున్నాం. ఇది సోకడంతో రోగాల నెదుర్కొనే అంతర్గత జీవశక్తి బలహీనపడి రోగాలనడ్డుకోవడం మానేస్తుంది. అంటే అన్ని రోగాలకు ద్వారాలు తెరిచి పెట్టేయడమే ఔతుంది. శరీరం మందులకు స్పందించదు. కనుక మందులవల్ల ప్రయోజనం ఉండదు. అదీగాక శాస్త్రరీత్యా వైరల్ జబ్బులకు మందులులేవు. శరీరములోని జీవశక్తే తన్నుతాను బాగుచేసుకొంటుంది. అంతవరకూ మనం జాగత్తగా వుండాలి. హెచ్.ఐ.వి అనే ఎయిడ్స్ క్రిమి కూడా వైరస్సే. కనుక మందుల వల్ల లాభంలేదు. దానికితోడు మనలోని జీవశక్తిబలహీనపడిపోతుంది. ఇక మిగిలింది నివారణా మార్గమే. కనుక రాకుండా చూసుకోవడమే మనం చేయవసింది. ఇంతకు మించిన మార్గమే లేదు. అసలీజబ్బు ఎట్లా వస్తుందో తెలుసు కొందాం. ఇది సుఖవ్యాధి. వ్యభిచారం దీని వ్యాప్తికి మూలకారణం. ఈ ఎయిడ్స్ కారక వైరస్‍క్రిములు యోనిద్రవాలలోనువీర్యంలోను కలసి ఉంటాయి ఆడామగా సంభోగక్రియజరుపుతుండగా ఒకరినుండి మరొకరికి అంటుకుంటాయి. అంటుకున్నావారు మరొకరికి అంటిస్తారు. ఇలా వ్యాపిస్తూ పోతుంది ఎయిడ్స్. ఇదే అతిముఖ్య కారణమైనా మరికొన్ని మార్గాలద్వారా కూడా యీ ఎయిడ్స్ వ్యాపించే ప్రమాదముంది. వాటిని గురించి కూడా మనం జాగ్రత్తగా తెలుసుకొని  నివారణామార్గాలననుసరించాలి. అందులో మొదటిది సూదిమందుచీటికీ మాటికీ చిన్నచిన్నజబ్బులకు కూడా సూదిమందు జోలికి పోకూడదు. మాత్రలతో సరిజేసులోవాలి. ఒకరికి వాడిన నీడిల్ సిరంజీ మరొకరికి వాడకూడదు. వాటివల్లకూడా ఎయిడ్స్ రావచ్చు. సూదిమందు తప్పనిసరైతే ప్రతిసారీ సిరంజీ నీడిల్ క్రొత్తవి వాడాలి. ఎయిడ్స్ రావడానికి మరోముఖ్యమార్గం రక్తమెక్కించడం. ప్రమాదాలు జరిగినప్పుడూ ప్రసవసమయాల్లో ఇతరులరక్తం ఎక్కించ వలసి వస్తుంది. అప్పుడు పరీక్షలద్వారా ఏయిడ్స్‍లేని రక్తమని తెలుసుకొనే ఎక్కించాలి. లేకపోతే ఎయిడ్స్‍రోగి రక్తం గ్రహించిన వారికి ఎయిడ్స్ వచ్చే స్తుంది. అలానే గుండూగడ్డం కొత్తబ్లేడ్ తోనే గీయించుకోవాలి. పాతబ్లేడ్ ఎయిడ్స్ సోకిన వారికి వాడి వుండవచ్చు. అలాకూడా ఎయిడ్స్ రావచ్చు. పచ్చబొట్లు తిరునాళ్లలో సంతల్లో పొడిపించుకుంటూ వుంటారు. ఆసూదులద్వారా కూడా ఏయిడ్స్ ప్రాకవచ్చు. కనుక మనలో వివాహితులందరూ సంపూర్ణ విశ్వాసంతో సంసారం కొనసాగించండి. కన్యలూబ్రహ్మచారులు వివాహ మయ్యే వరకు స్వచ్ఛమైన జీవితం గడపండి. పెండ్లికి ముందు ఎయిడ్స్ పరీక్షలు చేయించుకోండి. అది అవమానంగానో అగౌరవంగానో భావించకండి. ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి మీరందరూ సకరించండి." సర్వేజనా సుఖినోభంతు". నమస్తే.
 
కలెక్టర్:- థ్యాం క్స్ డాక్టర్ అమరంగారూ.. శాస్త్రీయదృక్పదంతో అనుసంధించి మనకు అవసరమైన అనేక విషయాలు తెలియజేశారు. ఇప్పుడు మిస్టర్ ప్రదీప్ తన అనుభవాలను జోడించి మీతో మాట్లాడతారు.
 
ప్రదిప్:- అధ్యక్ష స్థానంలో వున్న మన ప్రియతమ కలెక్టర్ గారికి ఇప్పటి వరకూ అనేక ముఖ్య విషయాలను సులభతరంగా మనకు తెలియజేసిన డాక్టర్‍అమరం గారికీ నా ధన్యవాదములు. "సభాయనమః" ఇప్పుడు మీ యెదురుగావున్న ప్రదీప్ అనే నేను ఐ.ఏ.ఎస్ పరీక్షలు పాసైనవాణ్ని. మంచి బాధ్యతాయుత హోదాగల్గిన ఆఫీసర్‍గా వుండి వుడవలసినవాణ్ని. కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించితప్పుచేసినీతీ నియమాలకు కట్టుబడక ఏయిడ్స్ బారినపడిపోయినవాణ్ని. దోషిగా మీయెదుట నిలబడినవాణ్ని నన్ను చూసైనా జనం బుద్ధిగా నడచుకుంటారనీ ఎయిడ్స్ విషయమై జాగ్రత్తపడి కష్టాలపాల్గాకుండా నావలె  భవిష్యత్తులేని దురదృష్టజీవితం కొనితెచ్చుకోరనీ మీకొక ఉదాహరణగా మీ యెదుట నిలబడ్డాను.  పాపపుణ్యాలుంటాయనివాటికి తగిన శిక్ష లుంటాయనివాటిని అనుభవించక తప్పదనిఇక్కడ యీ భూమిపైన తప్పించుకున్నా పరలోకంలో తప్పించుకోలేమని నమ్ముతున్నాను. సరే నేను నా పాపానికి శిక్ష యీలోకంలోనే అనుభవిస్తున్నాను. ఇదేంటీ.. ఐ.ఏ.ఎస్ చదివినవాడు కర్మసిద్ఢాంతాన్ని మాట్లాడతాడేంటి? అనుకుంటున్నారేమో. మీరేమనుకున్నా నానమ్మకం నాది. అదలావుంచండి. హేతువాద దృక్పదాన్ని నేను త్రోసి పుచ్చడంలేదు. సైన్టిఫిక్‍గా యిప్పుడే డాక్టర్‍గారు చెప్పారు. ఎయిడ్స్ యెలా వస్తుందిదాని బారినుండి మనల్ని  మనం ఎలా రక్షించు కోవాలి అన్న విషయం తేటతెల్లం జేశారు. వాటినైనా నమ్మండి. కర్మ సిద్దాంతదృష్ట్యా ఆలోచించినా  హేతువాద రీత్యా గమనించినా మీ కొకటే అర్థమౌతుంది. చెడుతిరుగుళ్ళవల్ల  వళ్లుగుల్లౌతుంది. భవితపాడౌతుంది. అది యీ సంఘానికీదేశానికి. ప్రత్యక్షంగా మీకూ  మహాప్రమాదకరం. తన్ను తాను బాగుపరచుకోలేనివానికి భగవంతుడుకూడా సహాయ పడడని పెద్దలు చెబుతారు. గ్రహించండి. పాపభూయిష్టులు కాకండి. అది కర్మానుగత ఫలితమనుకోండి లేదా వైరల్‍ఇన్‍ఫెక్షన్ అనుకోండి. మీరెట్లనుకున్నా పరవాలేదు. ఎయిడ్స్ బారిన మాత్రం పడకండి. పెద్దలుచెప్పిన నీతిమార్గంలో నడవండి. మేలుపొందండి. నామాదిరిమాత్రం కాకండి.. నమస్తే.. (కన్నీళ్ళు తుడుచుకుంటూండగా - స్టిల్)
(తెరపడును)
 
 
ఆరవ రంగం
 
(యముడుచిత్రగుప్తుడు ఆసీనులై వుంటారు)
 
చిత్ర:- ప్రభూ.. నరులు మహా తెలివైన వాళ్ళని నేనెప్పుడో చెప్పానుగదా..
 
యమ:- ఐతే యిప్పుడేమైంది చిత్రగుప్తా!
 
చిత్ర:- ఏముంది ప్రభూ.. ఎయిడ్స్‍కు విరుగుడు కనిపెట్టేశారు.
 
యమ:- ఏం కనిపెట్టారయ్యా.. క్రొత్తగా మందులు కనిపెట్టారాలేక టీకా యేమైనా కనిపెట్టారా?
 
చిత్ర:- అవికూడా కనిపెట్టాలనే  ప్రయత్నంలోఉన్నారు.
 
యమ:- ఇప్పటికి కనిపెట్టలేదు కదా!
 
చిత్ర:- లేదుగానీ.. ప్రస్తుతానికి కండోమ్‍లు అవే నిరోద్‍లట వాటిని వాడి ఎయిడ్స్ తప్పించు కోవచ్చంటున్నారు ప్రభూ..
 
యమ:- లేదులేవయ్యా..ఆ కండోములు నూటికి నూరుపాళ్ళు సురక్షితము కావని తేలిపోయింది. వాటిని ముందు కుటుంబనియంత్రణకనిఅందునా తాత్కాలిక అవసరాలకు వాడేవారు. ఆ కండోములు తయారీలోగాని వాడటంలోగాని  పొరబాటైతే  అపాయమే. ఏదో ప్రత్యేక సందర్భాలలో తప్పఎప్పుడూ వాటినే నమ్ముకుంటే మునిగిపోతారని డాక్టర్‍అమరమే హెచ్చరిస్తున్నారు లేవయ్యా. ఐనా అలా ఒకరోఇద్దరో భూలోకశిక్ష తప్పించుకొని ఇక్కడికి వస్తేనేగదా! మనచేతులకూ పనిదగిలేది.
 
చిత్ర:- అలాగా ప్రభూ!  సరే ..(చిట్టా తిరగేసి) అరరే.. చాలాఘోరం జరిగిపోయింది ప్రభూ.. ఇదిగో చిట్టాలో యీ పుట జూడండి.
 
యమ:- మళ్లీ యేమొచ్చిందయ్యా.. అదేదో నువ్వే జాగ్రత్తగాచూచిచెప్పు.
 
చిత్ర:-ప్రభూ! చాలాచాలా అన్యాయమే జరిగిపోయింది. తమరు భూలోకానికి పంపిన ఎయిడ్స్ వల్ల అమాయకులు చిక్కుల్లో పడిపోయారు. అయ్యో వారి బాధ  వ ర్ణ నా  తీతం ప్రభూ..
 
యమ:- అరే అలా జరగడానికి వీల్లేదే! ఏమైందో కాస్తా వివరంగా చెప్పు.
 
చిత్ర:- ప్రభూ! ఇదిగో వీరన్న కుటుంబం (క్రిందికి చేయి చూపిస్తాడు) వీధినపడింది ప్రభూ.. ఈ వీరన్న లారీ డ్రయివర్. వీడు లారీ తోలుతూ ఊరవతలుండే డాబాల్లో తిని త్రాగి వళ్లుకొ  వ్వెక్కి అక్కడ తచ్చాడే అంగడి బొమ్మలకు మరిగి ఎయిడ్స్ తెచ్చుకున్నాడు.
 
యమ:- అది సహజమేకదా! ఇందులో వింతేముంది?
 
చిత్ర:-వాడికొస్తేవచ్చింది ప్రభూ.. వాడు అమాయకురాలైన వాడిభార్య శాంతమ్మకు అం టిం చాడు.
 
యమ:- అరరే.. చాలప్రమాదమేజరిగిందే..
 
యమ:-అంతటితో యేమైంది ప్రభూ.. ఇద్దరికీ  ఆతర్వాత క్షయ తగులుకుంది. రాబడి నిలిచిపోయింది. పస్తులుండవలసి వచ్చింది. బిడ్డ బడి మానేసింది
 
 యమ:- నిజమే.. క్షయరోగులెలా సంపాదిస్తారు. బిడ్డనెలాపోషిస్తారు.
 
చిత్ర:- ఇప్పుడు మరోకష్టమొచ్చిపడిందిప్రభూ..
 
యమ:- ఏమిటదీ..
 
చిత్ర:-ఊరివారందరూ పంచాయతీ జేసి  వారిని ఊరు విడిచి పొమ్మన్నారు.
 
యమ:- అరెరే.. ఎక్కడికి పోగలరుపాపం. అదీ యీ పరిస్థితుల్లో.
 
చిత్ర:-అందుకే వాళ్ళుకదల్లేదు.  ఊరివాళ్ళే కలగజేసుకొని యెద్దులబండి కట్టి వాళ్ళనెక్కించుకొని వూరిబయట సత్రంలో దించి వాళ్ళదారినవాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడా మూడు ప్రాణాలూ అన్నంనీళ్ళు లేక అలమటిస్తున్నాయి. మరణంకోసం యెదురుచూస్తున్నారు ప్రభూ.. కానీ వాళ్ళకింకా ఆయువుంది. ఈఘోరం చూడలేకపోతున్నాను ప్రభూ..
 
యమ:- అయ్యో.. ఎంతపొరపాటై పోయింది. ఆ వీరన్న బాధపడటంలో అర్థముంది. కానీ ఆ తల్లీబిడ్డల కింత వ్యధ  సంప్రాప్తమైందే! ఇలా జరగకూడదుకదా? ఇది ఆ తల్లీబిడ్డల కర్మయని సరిపెట్టుకొన్నామంటే మనస్సంగీకరించడంలేదయ్యా.. ఏది యేమైనా ఆ వూరి పెద్దలు అంతకఠినంగా వ్యవహరించి ఉండవలసింది కాదయ్యా.
 
చిత్ర:- వారి భయం వారిది ప్రభూ.. ఎయిడ్సు దానిపై క్షయ. రోగాలు అంటుకపోతాయని వారు భయపడి వుంటారు ప్రభూ..
 
యమ:- కావచ్చు. కానీ మనుషులు యింత దయమాలి ప్రవర్తించ కూడదయ్యా. అదికూడా వాళ్ళకు కర్మమేయై చుట్టుకుంటుందయ్యా ఆ కర్మననుభవించడానికి వాళ్ళు మళ్ళీ నరకానికి  రాకతప్పదు గదా?
 
చిత్ర:- ప్రభూ! ఇన్ని అరిష్టాలకూ కారణం మనమేనేమో ఆలోచించండి.
 
యమ:- నిజమేనయ్యా.. తప్పుచేశాం. దీనికి పరిష్కారం కూడా మనమే యోచించాలి.
 
చిత్ర:- ప్రభూ..ఇప్పుడే  మరో ఘోరం జరిగిపోయింది. ఇదిగో యీ పుటలోని యువతి చనిపోయింది. అదీ పొరపాటున హెచ్.ఐ.వి పాజిటివ్ రక్తం ఎక్కించడంవల్ల యీ యువతి  కృశించి కోలుకోలేక ప్రసవించిన పసిబిడ్దను దిక్కులేనిదాన్ని చేసి చచ్చిపోయింది. పాపం అమాయకురాలు ప్రభూ..అన్యాయంగా ఎయిడ్సుకు బలైపోయింది. తమభటులు ఆమెను తీసుకొని యమపురికి బయలుదేరారు.
 
యమ:-ఇకచాలు. పదా..భూలోకానికి. మనంచేసిన తప్పును మనమే సరిదిద్దాలి. పద చిత్రగుప్తా పదా..వెళదాం..
 
(తెర పడును)
 
ఏడవ రంగం
 
(ఆసుపత్రి - డాక్టర్‍ఆమరంప్తదీప్ఓఅమ్మాయి)
 
ప్రదీప్:-డాక్టర్‍గారూ.. యీ రోజు నాకు చాలా సంతోషంగాసంతృప్తిగా వుంది. దిక్కులేని పక్షుల్లాగా ఆ సత్రంలోపడున్న వీరయ్యనుశాంతమ్మను తీసుకొనివచ్చి అస్పత్రిలో చేర్పించివారిని కాస్తా ఊరడించాము. దీనావస్తలోవున్న యీ బిడ్డ ఆకలి తీర్చాము.
 
డాక్టర్:- నాదేముందయ్యా.. నాడ్యూటీ నేనుచేశానంతే. కానీ యెక్కడ నుంచి వచ్చారో యేమో కానీ ఆ ధర్మరాజుగారుగుప్తాగారు వచ్చి వారి చేతినుండి డబ్బు ఖర్చుపెట్టి మనసహాయం తీసుకొని వాళ్ళకు మేలు చేశారు. మిస్టర్‍ప్రదీప్ నిజానికి క్రెడిటంతా ఆ పెద్దమనుషులకే పోతుందయ్యా. ఐనా ప్రదీప్  మనుషుల్లో మనం  యీ ఎయిడ్స్‍మీద యింకా పూర్తి అవగాహన తేలేక పోయామయ్యా.
 
ప్రదీప్:- తెస్తూనేవున్నాంగద సార్. అనేక సభలూ సమావేశాలు పెట్టాం క్యాంప్స్ నిర్వహించాం. ప్రభుత్వంతరఫున కలెక్టర్స్ లాంటి పెద్ద పెద్ద అధికారులను కలుపుకొని ప్రచారం చేస్తున్నాం. పునరావాస కేంద్రాలనూ నెలకొల్పి వాటి నిర్వహణకు నిధులూ సమకూరుస్తున్నాం. మీరు బహుశా సంతృప్తి జెందినట్లు లేరు. మీ మనసులో యింకేదైనా కార్యక్రమముంటే చెప్పండితప్పకచేద్దాం.
డాక్టర్:- చేద్దాం... కానీ యిక జరగబోయే సభల్లోకొంత మానవత్వం గురించి తప్పక మాట్లాడాలి. అలాగే ఎయిడ్స్‍రోగి విషయంలో ప్రజలు యింతగా భయపడకుండా ధైర్యం చెప్పాలి. చూచాముకదా ఆ వీరయ్యకుటుంబాన్ని గ్రామస్తులు యెంత దారుణంగా ట్రీట్ చేశారో..
 
ప్రదీప్:- నిజమేసార్.. ప్రజలకేమి చెప్పాలో నాకోసారిచెప్పండి. నేనూ తెలుసుకుంటాను. మీకు సభల్లోనూ సాయపడతాను.
 
డాక్టర్:- ఏముందయ్యా.. నీకుతెలియందేమీలేదు. లేదంటే మనం ప్రజలకు అర్థమయ్యేట్లు నచ్చజెప్పాలి. ఈపనికి ఆ ధర్మరాజుగుప్తగారు కూడా మనకన్నివిధాలా సహాయపడతామన్నారు.
 
ప్రదీప్:- వెరీగుడ్. మంచిదేకదా! ఇంతకూ మనం చెప్పాల్సిందేమిటో ముందు నాకు చెప్పండి సార్.
 
డాక్టర్:- ఎయిడ్స్ రోగితో  మాట్లాడినాకరచాలనంచేసినాకలిసిభోంచేసినాఆటలాడినా  యీ రోగం అంటుకొని రాదు.
 
ప్రదీప్:- ఇప్పుడు మీరు నాతో కలిసి యివన్నీ చేస్తున్నారుకదా! నేను H.I.V  పాజిటివే కదా.. వ్యాధి ప్రక్కవారికి యీచర్యలవల్ల రాదనేగదా దీనర్థం.
 
డాక్టర్:- ఔను.. ఈవిషయమే  ప్రజలకు మనం వివరంగా అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఏయిడ్స్ సోకినవారి యెడల దయతో మెలిగి  మానవత్వంతో వారి నాదుకోవాలని హితబోధ చేయాలి. అంతేకాదు ప్రదీప్  శాస్త్రఙ్ఞులు తేల్చిందేమంటేయీ ఎయిడ్స్ దోమకాటు వల్ల కూడా వ్యాపించదు. కనుక వారు యితరులతోపాటు ఒకే యింట్లో వున్నా ప్రమాదం లేదు.
 
ప్రదీప్:- మరి ఏయిడ్స్‍తో పాటు మనిషికి యితర వ్యాధులుంటే?
 
డాక్టర్:- అదీ చెప్పాలటయ్యా.. ఆ యితర రోగానికి సంబందించిన జాగ్రత్త లేవో అవి తీసుకుంటేచాలు. అంతేగదా! సరి  మరి ఆ ధర్మరాజుగారూగుప్తాగారు యీ రోజే యిక్కడికొచ్చి మనతో మాట్లాడతామన్నారయ్యా.. టైమ్ పద కొండౌతూవుంది.. వెళ్ళి చూడు వస్తున్నారేమో.
 
ప్రదిప్:-అదిగో మాటల్లోనే వచ్చేశారు.
 
డాక్టర్:- నమస్తే! ధర్మరాజుగారూ.. నమస్తే గుప్తాగారు. రండి రండి .. ఇప్పుడే మిమ్ముల్ని గురించి మాట్లాడుకుంటున్నాము. అంతలోనే వచేశారు.
 
ప్రదీప్:- నమస్కారమండి.
 
ధర్మరాజు:- మీవిషయం డాక్టర్‍గారు మొన్ననే చెప్పారయ్య.. సారీ మై బాయ్.(అందరూ కూర్చుంటారు)
 
గుప్తా:- డాక్టర్‍గారూ.. మా మిత్రుడు మిస్టర్ యం. ధర్మరాజుగారు పదికోట్లు ఖర్చు పెట్టి ఏయిడ్స్ బాధితులకొరకు ఒక పునరావాస సదనం నిర్మించి యివ్వాలనుకొంటున్నారు.
 
ధర్మరాజు:- అంతేకాదు ఈ ఎయిడ్స్ పై వుండే అపోహలు తొలగిపోయేట్లు ఊరూరా సభలూసమావేశాలూ జరిపించి ప్రజల్లో సదవగాహన  ఏయిడ్స్ రోగుల యెడల సానుభూతిమానవత్వం పెంపొందేటట్లు చేయాలి అందుకయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను.
 
గుప్త:- డాక్టర్‍గారూ.. ఈవ్యాధిపట్ల జాగ్రత్తలేకాదు అపోహలూ తొలగించి ఒక ఆరోగ్యకరమైన ఆనందకరమైన సంఘం నిర్మితం కావాలని మా ఆకాంక్ష. దానికి సంబంధించి సూత్రాలుస్లోగన్‍లు  కార్టూన్‍లుగావాల్‍పోస్టర్లుగా ఫ్లెక్సీబోర్డ్‍లుగా తయారుచేయించి వూరూరా ప్రదర్శించాలి రేడియోల్లో టీ.వీల్లో  సినిమాల్లో విశేషంగా ప్రచారం చేయించాలి.అదంతా నేను చూచుకుంటాను. మీరు మాకు అండగావుండండి చాలు.
 
డాక్టర్:-చాలా సంతోషం తప్పకమీకు సహకరిస్తాము. ప్రభుత్వంకూడా యిటువంటి పనులన్నీ చేస్తూవుందియింకా చేయడానికికూడా సిధంగా వుంది. ఇందుకు మీరూమేమూఇంకామరింతమంది దాతలూ సహృదయులూ  ముందుకొస్తే  అశించిన ప్రయోజనం త్వరలోనే
 సి ద్ధి స్తుంది.
 
గుప్త:- ఆఖరుగా ఇంకొక్కమాట. ఇదిగో యీ పాపను నేను దత్తత తీసుకుం టు న్నాను. ఈఅమ్మాయి చదువు సంధ్య ఉద్యోగం వివాహం అంతా నాదే బాధ్యత.
 
డాక్టర్:- సంతోషం..
 
ప్రదీప్:- చాలా సంతోషం.
 
డాక్టర్:- ఇలా మరింతమంది దాతలు ముందుకు రావాలి.. వస్తారు.. తప్పకవస్తారు. మానవత్వం మారాకు వేస్తుంది - శుభం

 

సమాప్తం

 

 

v      

 

No comments:

Post a Comment

నాకు చదువురాదు, Naaku Chaduvu Raadu

  నాకు   చదువు   రాదు ( ఏకపాత్రభినయము )     (పాత్ర: ఓ 50 సంవత్సరాల  పేద పెద్దమనిషి ) అమ్మా!  శారదా ... ( బోరున   యేడ్చును ).  తల్లీ   యీ   గ...