Sunday, 27 December 2020

రాజేశ్వరి

 

రాజేశ్వరి

(సాంఘిక నాటకం)


రచన

పి.సుబ్బరాయుడు.

42/490.  భాగ్యనగర్ కాలనీ

కడప - 516002

సెల్-9966504951

***


రాజేశ్వరి

 (సాంఘిక నాటకం)



ఇందలి పాత్రలు

             1.రాజేశ్వరి-26               

             2.ప్రభాకర్-28

             3.వాసు-30

             4.గురవయ్య-28

             5.వేణు-3

 

  

 

రాజేశ్వరి

(సాంఘిక నాటకం)

(ఇంటిలో - రాజేశ్వరి తన మూడేళ్ళ కొడుక్కి తలదువ్వి పౌడరద్ది, డ్రస్సువేసి స్కూలుకు రెడీ చేస్తూ వుంటుంది-ఇంతలో ప్రభాకర్ ని ద్రలేచి ఆవులిస్తూ బెడ్ రూం నుండి బయటకు వస్తాడు)

 

రాజేశ్వరి:- ఇప్పుడు లేచారు నిద్ర. టైమెంతైందో తెలుసా? పావుతక్కువ తొమ్మిది కావస్తూంది. అర్ధరాత్రికి ఇంటికి రావడం యీ వేళదాకా నిద్ర పోవడం.

 

ప్రభాకర్:- సరేలేవే.. ఇప్పుడేమైందీ! కంపెనీ కి పోవడానికి యింకా గంట టైముంది.

 

రాజేశ్వరి:- గంటలో తయారై కంపెనీకెళతారు సరే! మరి స్కూలుకెళ్ళి వీడి ఫీజెప్పుడు కడతారు? రేపటితో  last date    ఐపోతుంది. రేపైనా పెందలాడే  వచ్చి తొందరగా పడుకొని  కొడుకుతోపాటే లేచి తయారై వెంటవెళ్ళి ఫీజు కట్టండి.

 

ప్రభాకర్:- రేపుగదా! అలానే ప్రొద్దున్నే లేస్తాలే..

(ఇంతలొ బయటి నుండి  school van  హారన్ వినబడుతుంది)

 

రాజేశ్వరి:- అప్పుడే స్కూల్‍వ్యాన్ వచ్చేసింది. పదరానాన్నా.. (లోపలికెళ్ళి వచ్చి) ఏమండీ గీజర్ ఆన్ చేశాను.. స్నానానికి తయారు కండి,(పిల్లవాడి Tiffin Box,

water Bottle  బ్యాగ్ లో పెట్టి గబగబా బూట్స్ వేసి పిల్లవావ్ని పిలుచుకొని బయటకు నడుస్తుంది. ప్రభాకర్ యింతలో టవల్ భుజంపై వేసుకొని బ్రష్ అందుకొని దానిపై పేస్ట్ వేసుకొని లోపలకు వెళ్ళబోతుండగా భార్య తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన భార్య వైపు వస్తూ)

 

ప్రభాకర్:- రాజీ! .. నువ్వు చాలా అందంగా వున్నావోయ్.

 

రాజేశ్వరి:- అది యిన్నాళ్ళకు తెలిసిందా తమరికి?

 

ప్రభాకర్:- అదికాదోయ్.. తల్లివైనా నీలో అందం తగ్గలేదోయ్. పెళ్లినాడెట్లున్నావో డిటో అట్లేవున్నావ్

 

రాజేశ్వరి:- చాల్లెండి పొగడ్తలు.. ఎవరన్నా వింటే నవ్విపోతారు.

ప్రభా:- వింటే విననీ!  నవ్వితే నవ్వనీ! మనకేంటి? (బ్రష్ పక్కనపెట్టి భార్యను తనవైపుకు లాక్కుంటాడు)

 

రాజే:- వదలండీ.. ఏమిటిది.. వేళకానివేళ (వదలడు. ఆమె సహకరిస్తుంది. కౌగిలించుకుంటాడు.)

ప్రభా:- రాత్రేమో పొద్దుపోయింది పడుకోమంటావ్. పగలేమో వేళకానివేలంటావ్. మరి  మన వేణూకు చెల్లెలెలావస్తుందోయ్.

 

రాజే:- (కౌగిలి విడిపించుకొని) ఓహో అదా సంగతి . అందు

కైతే సాయంత్రం తొందరగా యింటికి రండి అని రోజూ  చెబుతుంటే  అర్థమౌతున్నదా మీకు?

 

ప్రభా:- ఓహో.. అందుకా .. తొందరగా రమ్మంటున్నది.

 

రాజే:- ఛీ.. పొండి .. మీరుమరీను..

 

ప్రభా:- రాజీ.. నేనూ తొందరగానే రావాలనుకుంటాను కానీ యేంజేయను. మా జీ.యం తీరా యింటికి పోదామనుకొనేసరికి పని పురమాయించి యిది కాస్త పూర్తిచేసి వెళ్ళబ్బాయ్ అని కూర్చుంటాడు.

 

రాజీ:- పోన్లెండి కంపేనీలో మంచి పేరు తెచ్చుకుంటే ప్రమోషన్ తొందరగా రావొచ్చు.

 

ప్రభా:- అందుకేగదా! ఆ ముసలినక్క పీడిస్తున్నా కిక్కురు మనకుండా కుక్కిన పేనులా పడు0డేది.

 

రాజీ:- ఇది రోజూ వుండే కథేగదా! ఎలాగోలా సర్దుబాటు చేసుకొని యీరోజైనా కాస్తా ముందుగా రండి. సినిమాకెళదాం. చాలారోజులైంది సినిమాచూసి.

 

ప్రభా:- సరే అలాగేవెళదాం. వచ్చేటప్పుడు టికెట్స్ తీసుకొనే వస్తాలే.

 

రాజే:- ఈరోజుకు ముచ్చట్లు చాలుగాని.. నీళ్ళు వేడెక్కుంటాయ్ యిక స్నానానికి పదండి.(ప్రభాకర్ బ్రష్ నోట్లో పెట్టుకోబోతూ గబుక్కున ఆమెను లోపలికిలాక్కెళతాడు.- లోపలినుండి) ఇకచాలెండి. వదలండి .. మీరు రోజురోజుకు కుర్రాళైపోతున్నారు. ఊ.. వదలండీ.. (బయటికి వచ్చి అద్దం ముందు నిల్చొని చెదిరిన జుత్తు సరిజేసుకొంటూ వుంటుంది.)

 

(ఇంతలో ప్రభాకర్.. ప్రభాకర్..  అన్న మాటలు బయటినుండి వినబడతాయి. రాజేశ్వరి వెళ్ళి వాకిలి తెరచినట్లు నటిస్తుంది)

 

వాసు:- (లోపలికి వస్తూ)  నేను వాసూ నండీ..

 

రాజేశ్వరి:- ఆయన స్నానంచేస్తున్నారు. మీరు కూర్చోండి.(కూర్చొని పేపర్ తిరగేస్తూ వుంటాడు. ఇంతలో రాజేశ్వరి కాఫీ తెచ్చి యిస్తుంది. గ్లాస్ అందుకొంటూ ఆమెచేతి వేళ్ళను కావాలని సృజిస్తాడు. ఆమె విసుక్కొని గ్లాసు చేయి మార్చుకొని టేబుల్ పై పెడుతుంది.)

 

వాసు:- సారీ..

 

రాజేశ్వరి:- (కాఫీ వైపు చేయి చూపి) కాఫీ త్రాగండి (లోనికి వెళ్ళిపోతుంది - వాసు కాఫీ త్రాగి గ్లాసు క్రింద పెట్టేసరికి ప్రభాకర్ డ్రెస్ చేసుకొంటూ  బె ల్ట్ సరి జేసుకొంటూ బయటికి వస్తాడు)

 

ప్రభా:- ఏంరావాసూ! ప్రొద్దున్నే ఇలావూడిపడ్డావ్. కోర్టుకెళ్ళలేదా!

 

వాసు:- వెళ్ళాలనే యింతదూరంవచ్చా.. బండి ట్రబుల్ యిచ్చింది.. అదిగో ఆప్రక్కనే mechanic కిచ్చి lift కోసం నీ దగ్గరకొచ్చా. బండి సాయంత్రానికో రేప్రొద్దునికో రిపేరౌతుందిలే.. పదపొదాం.

 

ప్రభా:- సరే.. పద పోదాం.

 

రాజే:- (లోపలినుండి) ఏమండీ.. టిఫెన్ చేయరా? ఒక్క నిముషం .. తెస్తున్నా.

 

ప్రభా:- ఆలస్యమై పోతోంది, ఇదిగో వాసూ వున్నాడుగాఈరోజుకి దారిలో టిఫెన్ చేసి వెళతాంలే.. వస్తా..డోర్ జాగ్రత్తగావేసుకో ఇద్దరూ వెళ్ళుదురు)

 

రాజేశ్వరి:- (బయటికి వచ్చి) ఎక్కడ దాపురించాడో యేమో.. ఆయన్ను టిఫెన్ చేయనీకుండా లాక్కెళ్ళాడు. నిజానికి వీడూ తింటాననుంటే  నాకుహులుక్కే. సరే.. బయట తింటామన్నారుగా!..ఇక నేను డబల్ లాగించేస్తా. (వెళ్ళి డోర్ వేసి వెనక్కి తిరుగుతుంది.)

 

(లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)

 

 

(సాయంత్రం వేళ రాజేశ్వరి తలదువ్వుకొని కూనిరాగాలు తీస్తూ పూలు తలలో తురుముకుంటుంది.పిల్లవాడికి మంచి చొక్కా తొడిగి సినిమాకి హుషారుగా తయారౌతూ వుంటుంది)

 

రాజే:- (గడియారం వంక చూసి) టైమైపోతూంది, యీయనింకా రాలేదు.(వాకిలి వరకు వెళ్ళి చూసి వస్తుంది)ఈయన కిదేంకొత్తకాదు కదా? ఇలా యీయనకోసం యెదురుచూడం ఆఖరుకు చీర మార్చుకొని ఊసూరుమని కూలబట్టం నాకు మామూలై పోయింది. దేనికైనా రాసిపెట్టుండాలి. (గడియారం వైపు మరోసారి చూసి) టైం దాటిపోయింది యిక ఆయనవచ్చినా  సినిమాకెళ్ళలేం. సరి (వెళ్ళి చీర మార్చు కోవడానికిలోపలికెళ్లబోతుంది)

 

వేణు:- అమ్మా.. సినిమా కెళదామమ్మా..వెళదాంపదమ్మా...

 

రాజే:- మీనాన్న రాలేదుకద నాన్న..

 

వేణు:-( ఏడ్పు) ఊ.. మనం సినిమాకెళదాం..సినిమాకెళదాం పద.. ఊ...(సతాయిస్తాడు)

 

రాజీ:- సరే.. వెళదాం. మీనాన్న వస్తాడుకదా! మోదటి షో కాకుంటే రెండోషో కెళదాంలే..

 

వేణు:- వొద్దు , యిప్పుడే పోదాం. మళ్ళా నాకు నిద్రొస్తుంది..ఆఁ...(ఏడుస్తాడు)

 

రాజే:- ఏడ్వకురా.. మీనాన్న రాకుంటే నన్నేం జెయ్యమంటావ్. వెళ్ళిచూడు వస్తున్నాడేమో (వెళతాడు యింతలో సెల్‍ఫోన్‍తో ట్రై చేస్తుంది) స్విచ్‍ఆఫ్ చేశాడు. విసుగ్గా అటూ ఇటూ తిరుగు తుంది)

 

వేణు:- నాన్న రావటం లేదు...నాన్నా... ఊ... (మళ్ళీ యేడుస్తాడు)

 

రాజే:- (కోపంతో) ఏడవొద్దు.. ఇంకోరోజు నేనే నిన్ను సినిమాకు తీసుకెళతాను.. సరేనా..ఇప్పుడిదిగో యీ కార్టూన్ సినిమా చూడు చాలా బాగుంటుంది(టీవీలో కార్టూన్ సినిమా పెడుతుంది)

 

వేణు:- అదేం వద్దు మనం సినిమాకే పోవాలి.(టీవీని రిమోట్‍తో ఆఫ్ చేసేసి ఏడుపు యెక్కువ చేస్తాడు)

 

రాజే:- ఏడవద్దంటే వినవా? ఆయనట్లా వీడిట్లా.. నా ఖర్మకొద్ది దొరికారు (రెండు వాయిస్తుంది ఏడుపు ఎక్కువ చేస్తాడు.మళ్ళీ దగ్గరికి తీసుకుంటుంది పిల్లవాడు ఏడ్చి ఏడ్చి నిద్రపోతాడు ప్రక్కనున్న సోఫాలోనే పడుకోబెట్టి వానివైపేచూస్తూ) పాపం వీడేమి చేస్తాడు పిల్లోడు . నాకేయింత చీకాగ్గా వుంటే .. చిన్నపిల్లోడు వీడు మంకుపట్టు పట్టడంలో తప్పేముంది. అనవసరంగా చెయ్యిచేసుకున్నాను. ఈయనైనా ఒక ఫోన్ చేసి చెప్పొచ్చుగదా!  ఎందుకు చేస్తాడు..(పిల్లవాణ్ని యెత్తుకొని పోయి బేడ్ రూంలో పడుకో బెట్టి  రావడానికి లోపలికి వెళ్ళుతుంది. ఇంతలో బాగాతాగిన ప్రభాకర్‍ను భుజంమీద చేయి వేసుకొని నడిపించుకొస్తాడు వాసు. ప్రభాకర్ తాగిన మైకంలో యేదేదో గొణుగుతుంటాడు. వాసు సోఫాలో కూర్చోబెడతాడు. రాజేశ్వరి అప్పుడే వస్తుంది పరిస్థితి చూసి  లోపలికెళ్ళి మజ్జిగ తెచ్చి యిస్తుంది

 

ప్రభా:- (మజ్జిగ గ్లాసు క్రింద పడద్రోసి) ఇడియెట్..మజ్జిగ తాగితే మత్తు దిగిపోదూ.. తాగిందంతా వేస్ట్.. ఐ..పొదూ ! పో..(రాజేశ్వరినితోసేస్తాడు. ఆమె వెళ్ళి వాకిలి దగ్గరుండే  మ్యాట్ గుడ్డతో క్రింద పడిన మజ్జిగ తుడిచేసి ప్రభాకర్‍ను బెడ్‍రూం వైపు తీసుకెళుతుండగా ప్రభాకర్ తిట్టుకొంటూ ఆమె వెంట లోనికి వెళతాడు.)

 

వాసు:- (స్వగతం) భలే సింగారించుకొని వుంది. చూస్తే మతిపోతోంది.. ఎక్కడికైనా బయటికెళ్ళే ప్రోగ్రాం పెట్టుకుందేమో! (ఇంతలో రాజేశ్వరి వస్తుంది)

 

రాజే:-థ్యాంక్స్. మీరిక వెళ్ళ వచ్చు.

 

వాసు:- ప్రభాకర్ మీ మూడ్ పాడు చేసి నట్లున్నాడు. ఇంత ఓవర్‍గా వాడెప్పుడూ తాగడండి.. ఈరోజేదో..

 

రాజే:- సరేలెండి. మీరేంచెప్పనక్కరలేదు.. వెళ్ళిరండి.(లోపలికి వెళ్ళబోతుంది)

వాసు:- రాజేశ్వరీ! (రాజేశ్వరి ఆశ్చర్యంతో వెనుదిరుగుతుంది) రాజేశ్వరీ నీవు చాలా అందంగా వున్నావ్.(భుజంపై చేయివేస్తాడు. వెంటనే విదిలించుకొని, చాచి చెంపమీద కొడుతుంది)

 

రాజే:- పో..వెంటనేపో..మర్యాదగా వెళ్ళిపో..ఇక్కడేవుంటే  నేనేంచేస్తానో నాకే తెలియదు...పో..

 

వాసు:- (చెంప నిమురుకుంటూ) నీ మొగుని కథ నీకు తెలియదు. వాడు మరో అమ్మాయిని లైన్ లో పెట్టే పనిలో బిజీ గా వున్నాడు. వాడు నిన్ను తొందరలోనే వదిలించు కోంటాడు. నీగతి అధోగతే.. నువ్వింక వానితో సుఖపడలేవు. నాతో సెట్టైపో సుఖపడతావు.

 

రాజే:- నాభర్తను గురించి నీవు నాతో చెప్పాల్సిన పనిలేదు. అదేదో నేను చూసుకుంటాను. నీచపుబుధ్దితో నువ్వెన్నైనా మాట్లాడతావు, అవన్నీ నేను నమ్మను. అసలు నీ సహవాసంతోనే ఆయనిలా తయారయ్యాడు. వెళతావాలేదావెళ్ళకుంటే..(వెళ్ళి ప్రక్కనున్న పొరక తీసుకొని తిరగేసి మీదికి వెళ్ళుతుంది)

 

వాసు:- వెళతాంలే..ముందు ముందు నీకే అర్థమౌయుంది. నీభర్త నిర్వాహకం తెలిసొచ్చాక. అప్పుడు.. అప్పుడు నువ్వే నావెంటబడతావ్.

 

రాజే:- ఒరేయ్.. ఏంకూశావ్! (ఆ అరుపుకు వెనక్కితిరిగి చకచకా బయటికి వెళ్ళిపోతాడు)

 

 (లై ట్స్ ఆఫ్ అండ్ ఆన్)

 

(ప్రభాకర్ వచ్చి కొంత అసహనంగా సోఫాలో కూర్చుంటాడు-లోపలినుండి రాజేశ్వరి సూట్‍కేస్‍తో, పి ల్ల వాడితో వస్తుంది)

 

ప్రభా:- ఎక్కడికీ.. ప్రయాణం.. ఇప్పుడేంజరిగిందని.. ఏదో మాబాస్ కంపెనీకి లాభాలొచ్చాయని పార్టీ యిచ్చాడు.  అక్కడికి పెద్దపెద్ద వాళొచ్చారు.. అక్కడికీ నేను వద్దంటూనేవున్నా..ఫ్రెండ్స్ వింటేనా?

 

రాజే:- ఔను.. ఈరోజు ఫ్రెండ్స్ బలవంతం చేశారు. రేపు నువ్వు వాళ్ళను బలవన్తం చేస్తావు. ఆ మరునాడు ఒకళ్ళనొకరు బలవంతం చేసుకొని త్రాగుబోతులై పోతారు.

 

ప్రభా:- చెబితే వినవేం. నేను కొద్దిగానే తాగాను.. అలవాటు లేకపొవడం వల్ల అలా అయ్యింది.

 

రాజే:- పర్వాలేదులెండి. రానురాను అలవాటైపోతుంది. ఆ తర్వాత బ్యాలెన్స్ తప్పరు.

 

ప్రభా:- ఏమిటా వెటకారం. ఎప్పుడో ఒకసారి యిలాంటీ పార్టీల్లో తాగక తప్పదు మరి. అది స్టేటస్ సింబల్ తప్పెలాఔతుంది.

 

రాజేశ్వరి:- తప్పుకాదనే మొదలెడతారు . కొన్నాళ్ళకలవాటై పోతుంది. ముందా చెడుసావాసాలు మానండి. అందరికంటే ముందా వాసు సావాసం వదిలేయండి. అతడు మంచి వాడు కాదు.

 

ప్రభా:- వాడు చాలా మంచివాడు. నీకు తెలియదు నేను తాగి పడిపోతే  జాగ్రత్తగా యిల్లుచేర్చాడు.

 

రాజే:- ఓహో! మీరు తాగి రోడ్డుపై దొర్లుతుంటే  యింటికి చేర్చేవాడు కావాలి కదా! మంచివాడట..మంచివాడు.. ముందు వాని సావాసం మానేయండి. వాడింకొకసారి మీ వెంట యింటికొస్తే బాగుండదు.

 

ప్రభా:- సరేసరే..వదిలెయ్.. మనింటికి రాకుంటే  వాడికొరిగేదేముండదు.. ఇప్పుడెక్కడికి బయలుదేరావ్.

 

రాజే:- నేనేం అలిగి పోవడం లేదులెండి. మిమ్మల్నెట్లా కట్టడి చేయాలో  నాకుతెలుసు. అలిగిపోతే మీలాంటి మొగుళ్ళు మరింత రెచ్చిపోతారుగానీ మారతారా! కీలెరిగి వాతపెట్టడం నాకు తెలుసు.  ఐనా అయినదానికీ కానిదానికీ సంసారం రచ్చజేసుకోడానికి నేనేం తెలివితక్కువదాన్ని కాదు.ఆ విషయం యిక చాల్లెండి. మానాన్న గారికి ఆరోగ్యం బాగలేదని ఫోనొచ్చింది, వెళ్ళి రెండ్రోజుల్లో వచ్చేస్తాను. ఇల్లు జాగ్రత్తా! ఇంతకముందు మాదిరి  తాళం వెయ్యకుండా బయటకు వెళ్ళేరు.

 

ప్రభా:- ఏమిటీ మీనాన్నకు బాగాలేదా? మరి చెప్పలేదేం.

 

రాజే:- మీ సెల్‍కు పది సార్లు ఫోన్ చేశాను యెత్తితేగా.

 

ప్రభా:- ఏమిటీ నాకు ఫోన్ చేశావా? (ఫోన్ కోసం జేబు తడుముకొని) అరెరె! అది బెడ్‍రూం లోనే వుం డి పోయింది (వెళ్ళి తెచ్చుకుంటూ) పర్వాలేదు పదిరోజులుండి రాలే..నీవెళ్ళి ఫొన్ చెయ్యి అవసరమైతే నేనూ వస్తా.

 

రాజే:- పదిరోజులుంటే యింటికి తాళంవేసి బలాదూర్ తిరుగుదామనాఅదేం కుదరదులెండీ. మానాన్నకంత సీరియసేమీ కాదులెండి.ఆరోగ్యమట్టే  బాగుండడంలేదు, వున్న ఆస్తిపాస్తులమ్మే విషయమై ఒకమాట మాట్లాడాలని రమ్మన్నారు.   

 

ప్రభా:- అలాగా! ఐతే వెళ్ళు..ఏదో మీతమ్ముని ఉద్యోగం, మనపెళ్లికోసం చేసిన అప్పులున్నాయంటుండే వాడుమీనాన్న బహుశా ఆస్తి అమ్మి తీరుద్దామనుకుంటున్నాడేమో. ఏమైనా మిగిలితే మనవాటాక్కూడా యింతో అంతో రావచ్చనుకుంటా?.. రావచ్చుగదా!

 

రాజే:- అప్పులుపోనూ మిగిలేముండదండీ. ఆయన ఆరోగ్యమంతంత మాత్రం. కనీసం మందుల ఖర్చులకైనా ఇంతో అంతో  చేతిలో వుండదేమోనని బాధపడుతున్నా.

 

ప్రభా:- ఐతే మకేం రాదంటావ్.

 

రాజే:- ఇంకా యేమిస్తారండి. మీ అమ్మానాన్నలతో యేవివాదం రాకూడదనే  అప్పుచేసి మీకు యిస్తామన్న దంతా ఆ రోజే పెండ్లి పీటలమీదే యిచ్చేశారుగదా!

 

ప్రభా:- ఆఁ.. యిచ్చేశారనుకో.. పోతే యేదో పండూగలకూ పబ్బాలకూ అల్లుడన్నాక యేమీ యివ్వరా! మన వేణు పుట్టినప్పుడు కూడా ఖర్చులు మా కంపెనీనే యిచ్చింది. మీనాన్న పైసా పెట్టలేదు. మాఅమ్మ యీమాటే అప్పుడప్పుడూ అంటూవుంటుంది. అందుకనే...

 

రాజే:- నిజమేనండీ. ఇవ్వాల్సిందే.. కానీ వాళ్ళ దగ్గరేంలేదుకదామీరే పెద్దమనసు చేసుకొని అడకుండావుండాలి.

 

ప్రభా:- సరే.. సరేలే.. లేనప్పుడు అడిగితేమాత్రమేంలాభం. అడిగి లేదనిపించుకోవడం తప్ప. నువ్వుపద రైలుకు టైంఅవుతూంది. నేనూ స్టేషన్ దాకావస్తా.

 

రాజే:- ఆఁ..సరే పదండి(సూట్‍కేస్ ప్రభాకర్ చేతికిచ్చి పిల్లవాణ్ని పట్టుకొని బయటకు నడుస్తారు.)

 

 

(లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)

 

(టేబుల్ మీద విస్కీ బాటల్ ప్రక్కన విప్పిన మిక్చర్‍పొట్లం. ప్రభాకర్ వదురుతూ తాగుతూవుంటాడు)

 

ప్రభా:- అలిగి పోతుందేమో అనుకున్నా.. డామిడ్ ..పోలా.. పోకబోగా..అలా వెళ్ళి యిలా వచ్చి నన్ను.. నన్ను కంట్రోల్లో పెడుతుందంట.దాని మొగం. దానికి నా కథ తెలీదు. ముష్టి యాభైవేలు కట్నమిచ్చారో లేదో.. పెద్ద బోస్టిం అంతా పెండ్లిపీటలమేదే యిచ్చేశారంట...ఇంకేంలేదంట.. సరిపెట్టు కోవాలంట. దీనవ్వదీ దినీతో ఈదరిద్రంతో సరిపెట్టుకొంటూనేవున్నాం గదా! ఆ సరోజాతో సరదాలకు , మందుకు జీతం సరిపోవడంలా.. వాడు మా నాన్నగాడు క్యాష్ మొత్తం అమ్మకిచ్చేసి ఆస్తిమొత్తం పిల్లోడి పేరున రాసి చచ్చాడు. ఒక్కసెంటు కూడా అమ్మడానికిలేదు.(కాలింగ్‍బెల్ మ్రోగుతుంది) వామ్మో! ఇది తెలివి మీరి పొయింది. నన్ను చెక్ చేయడానికి  వూరికి వెళ్ళినట్లేవెళ్ళి అప్పుడేవచ్చిందన్న మాట. రైలు కదిలేవరకు వుండకుండా వచ్చేశాను.. నేనిట్లా రాగానే అది అట్లా వచ్చేసింది. పెద్దడ్రామా నే ఆడుతోంది... ఇప్పుడెలా? (అటూ ఇటూ చూస్తాడు-బాటల్ దాచేయడానికి ప్రయత్నిస్తాడు మత్తులో వీలుపడదు.) సరే రానీ యీ రోజుతో మొత్తం ఓపన్. ఐనా ఏంచేస్తుందది? తేల్చుకుంటా? (తూలుతూ వెళ్ళి డోర్ తెరుస్తాడు)

 

వాసు:- ఇంతసేపా వాకిలి తెరవడానికి?

 

ప్రభా:- ఒరె నువ్వా.. రా..రా.. మా రాక్షసేమో ననుకుని భయపడ్డా.

 

వాసు:- ఊరికి పోయిందన్నావుగా?

 

ప్రభా:- ఏమో.. వెనక్కొచ్చేసిందనుకొన్నా. ఇప్పుడు దాని మాటెందుకుగానీ..రా.. మంచి సమయానికొచ్చావ్ కంపెని లేక బోర్ కొడుతోంది.. రా.. (మరో గ్లాసు తెచ్చి వాసూకు కూడా మందు పోస్తాడు.)

 

వాసు:- ( తాగుతూ) ఒరే బ్రదర్.. ఎందుకురా నీకు భార్యంటే అంత భయం.

 

ప్రభా:- నీకు తెలీదురా! వాసు అది చాలా మొండిది. దానికి మన అసలు విషయం తెలిస్తే బ్రతక నివ్వదు.

వాసు:- మరి యెందుకురా ఆ సరోజ.. వదిలెయ్.

 

ప్రభా:- దాన్నోదిలేయడమాకుదర్దురా.. అది నేనంటే పడిచస్తుంది.

 మొ త్తం మా కంపెనీ దాని పేరునేవుంది. అదీగాక  టోటల్ టెన్‍క్రోర్స్.. పదికోట్లు దాని నాన్న దగ్గరున్నాయ్ ఎలాగైనా దాన్ని పెళ్ళిచేసుకొని.. వాసూ.. కోటీశ్వరున్నై పోవాలి. యూ ఫూల్ చూస్తూ చూస్తూ యెలారా గోల్డెన్ ఛాన్స్ వదులుకునేది.

 

వాసు:-ఒక భార్యుండగా యిదంతాయెలా కుదురుతుందిరా? భార్యకు ముందు విడాకులిచ్చెయ్. కేసు నాకప్పజెప్పు. నేజూసుకుంటానంతా...

 

ప్రభా:- కుదర్దురా! అది అసాధ్యురాలు .. రాక్షసి... అది సాధ్య మయ్యేట్లుంటే వివీడాకులు యెప్పుడో యిచ్చేసుండేవాణ్ని. దానికి తెలివి జాస్తి ..చట్టంకూడా బాగాతెలుసు .. దాన్ని బురిడీకొట్టించడం మనొల్లయ్యేపనిగాదు.

 

వాసు:- ఐతే లేపెయ్..

 

ప్రభా:- ఆఁ!.. (తలవిదిలించి)  ఏమనుకుంటున్నావ్.. అది గట్టిగా చేయి పట్టుకుంటే విడిపించుకోలేం, లేపేయడమే? ఎంత ఈజీగా చెప్పేశావు రా..

 

వాసు:-లేపేయడమంటె, నువ్వే లేపేసేయాలా?

 

ప్రభా:- లేకుంటే  నువ్వు లేపేస్తావా! నోరుముయ్యరా, నీధైర్యం నాకుతెలీదా! చీ కట్లో యూరిను కు పోలేవ్.. లేపేస్తాడంట లేపేస్తాడు.

 

వాసు:- నువ్వూకాదు నేనూకాదు.. దానికో ఉపాయముంది. ఏమాత్రం మన చేతులకు మట్టంటుకోకుండా పరలోకయాత్రకు ప్రయాణం కడుతుంది నీ భార్య. నీప్రేయసి పదికొట్లతో వచ్చి వరమాల నీ మెడలో వేసేస్తుంది.

 

ప్రభా:- విషంపెట్టి చంపేద్దామనా నీఆలోచన?

 

వాసు:- చాఛా అది రిస్క్.. వాటం తప్పిందా నీపని ఫినిష్. ఒకవేళ చాచ్చిందా అదీ రిస్కే ..శవం post-mortem కెళితే చాలాకష్టం. తీగ లాగితే డొంకంతా కదులుతుంది. అప్పుడు ఉద్యోగం,సరోజా, డబ్బూ మొత్తం ఫినిష్.

 

ప్రభా:- నిజమే.. యిప్పటికే నా మీద అనుమానమొచ్చింది దానికి.. అది వర్కౌట్ అయ్యే ప్లాన్ కాదు.

 

వాసు :-risk less plan  నా దగ్గరుంది.

 

 

ప్రభా:- అదేంటో చెప్పారాచూద్దాం.

 

వాసు:- చెబితే నాకేంటి లాభం.

 

ప్రభా:- నీకు ఐదులక్షలిస్తా.. సరేనా.

 

వాసు:- నీకు ప్రేయసి, ఓపెద్దకంపెనీ ఆపైన పదికోట్లు. మరి నాకు after all ఐదులక్షలా?

 

ప్రభా:- ఇంకో ఫైవ్ దీసుకో.. కానీ ఆ ప్లాన్ ముందు నాకు నచ్చాలి.

 

వాసు:- దానికేముంది ప్లాన్ వర్కౌ‍ట్ అయ్యాకే డబ్బులియ్యి.. కాని పది కాదు పదహైదివ్వాలి.

 

ప్రభా:- సరే చెప్పు (మత్తుకాస్త వదిలి, చెవులురిక్కించి వింటాడు.)

 

వాసు:- నాకు తెలిసిన male nurse  ఒకడున్నాడు. వాడు " రవి" cancer  హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. వానిద్వారా ఓ పది పన్నెండురోజుల్లో చనిపోయే cancer పేషంట్, అందునా దాదాపు నీవయసున్న వాని డీటైల్స్ తీసుకుంటాను. అందులో ఆర్థికయిబ్బందుల్లో వున్నవాణ్ని యెన్నుకుందాం.

 

ప్రభా:- వాడెందుకు పనికొస్తాడ్రా? ఐనా నావయసుండే  వాడే నంటున్నావ్ దొరకద్దూ. నీ ప్లాన్ టోటల్ వేస్ట్ వదిలెయ్.

 

వాసు:- నే చెప్పేది ముందు పూర్తిగా విను.. తొంద రెందుకు..ఇంతపెద్ద ప్లాన్ చులకనగా తీసెయ్యకు.

 

ప్రభా:- సరే చెప్పు.

 

వాసు:- అటువంటి పేషంట్ దొరకడానికి కాస్తా టైం పట్టొచ్చు. పరవాలేదు. అటువంటివానికి  ఒక మంచిఅమౌం‍ట్ ఆశ చూపుదాం నీవు చనిపోయినా నీ భార్యాపిల్లలు ఆకలి చావు చావకుండా కాపాడుకో అని  నచ్చజెప్పుదాం.

 

ప్రభా:- ఆ తర్వాత..

 

వాసు:- ఆ తర్వాత, ఇతడు నా స్నేహితుడు.. పాపం క్యాన్‍సర్ తో బాధపడుతున్నాడు, పదిరోజుల్లో చనిపోతాడని డాక్టర్లు చెప్పేశారు. నన్ను కడసారి చూడ్డానికొచ్చాడని నీ భార్యతో చెప్పు. కమలాపండ్ల రసమంటే  మా ఫ్రెండ్‍కిష్టం, యిమ్మని చెప్పి, యేదోసాకుతో అక్కడినుండి తప్పుకో.

 

వాసు:-సరే వాణ్ని యేదోరకంగా యింటికి రప్పించాలి.. కాస్తా అటో యిటో..అదినేను చూసుకుంటాలే.. ఆ తర్వాత.

 

వాసు:- అ తర్వాత వాడు నేనిచ్చిన నాటు తుపాకీతో రడీగా వుంటాడు. కమలాపండ్లరసం గ్లాసుతో యివ్వగానే  కాల్చేస్తాడు. చాలాదగ్గరినుండి కాబట్టి గురితో పనిలేదు. అంతేగాకుండా అంతదగ్గరనుండి కాలిస్తే బ్రతికే ఛాన్స్ ఖచ్చితంగా వుండదు.

 

ప్రభా:- ఇది  risk less ప్లానా! ఏడ్చినట్లేవుంది.

 

వాసు:- తొందరపడకు. బాగా ఆలోచించు. వాడెలాగూ పదిరోజుల్లో చస్తాడు. కనుక అరెస్టుచేసి ఆస్పత్రిలోనే వుంచుతారు. వాడికి వచ్చిన నష్టమేమీ లేదు. వాడుచావడంతో కేస్ క్లోస్. లేదంటే వానితో ఒక కట్టుకథ చెప్పించాలంతే. అది నేను చూసుకుంటా. పనిపూర్తైనతర్వాత అవసరమైతే  ఆ రోగి ఖూనీకేస్ నేను డీల్ చేస్తా. నీవైపు యెవర్నీ కన్నెత్తికూడా చూడనివ్వను. సరికదా నీపై సానుభూతి కూడా పెంచేట్లు చేస్తా.

 

ప్రభా:- అలాగైతే సరోజాకు వాళ్ళ నాన్నకు కూడా నామీద సానుభూతి కలుగుతుంది. అదికూడా మనకు కలిసివస్తుంది. పెండ్లైనవాడన్న మైనస్ పాయింట్ కూడా పలచబడి పోతుంది. కాని..

 

వాసు:- ఇంకా కానీ యేమిటిరా.. అనుమానం పీనుగా!

 

ప్రభా:- చచ్చే రోగి యింతపని చేస్తాడా .. అని..

 

వాసు:-చేస్తాడు.. వాడి భార్యాపిల్లలకు యింత ఆధారం దొరుకుతుందంటే  తప్పకచేస్తాడు. ఎలాగూ చచ్చేవాడు వానికి కేసు భయం అస్సలుండదు. వాణ్ని ఆస్పత్రి నుండి కదల్చనుకూడా కదల్చరు. వానికేమైనా అనుమానాలుంటే  నేను వానికి ధైర్యం చెబుతాను.

 

ప్రభా:- అదిసరే .. ఐనా నామీద నీకెందుకురా యింత ప్రేమ...

 

వాసు:- (తనలొ) నీకేంతెలుసురా.. అది నాకోరిక నిరాకరించడమేగాకుండా.. నన్ను.. నన్ను నీచంగా మాట్లాడు

తుందా! నా ప్లాన్ లో యిరుక్కొని అది యెలా గిజగిజ తన్నుకొని చస్తుందో చూడాలి.

 

ప్రభా:- ఏం.. మాట్లాడవేంరా..

 

వాసు:-ఆఁ.. అదీ..అదీ.. ఏముందిరా.. కమీషన్ భారీగానే తీసుకుంటున్నాను గదరా! అందునా స్నేహితుడివి.

 

ప్రభా:- రైట్ ..ప్లాన్ బాగానేవుంది.. ఇకమనకు రోగే దొరకాలి.

 

వాసు:- అది నాకొదిలెయ్. ముందు నీభార్య యింటికెప్పుడు తిరిగొస్తుందో చెప్పు.

 

ప్రభా:- ఈరోజేకదా వెళ్ళింది. రేపుండి ఎల్లుండి సాయంత్రాని కొచ్చేస్తుంది.

 

వాసు:- సరే రేపు నేను పేషంట్ కోసం ట్రై చేస్తా. దొరికాడా.. రాత్రికో రేపొద్దున్నో డీల్ మాట్లాడుకొందాం. ఎందుకైనా మంచిది ఓ five lacks సర్ది, రెడీగా పెట్టుకో.

 

ప్రభా:- సరే.. 

 

వాసు:- ఇకనే వెళ్ళొస్తా! గుడ్‍నైట్..

 

(లైట్స్ ఆఫ్ ఆండ్ ఆన్)

 

 

(ప్రభాకర్ సోఫాలో కూర్చొని టీ.వీ చూస్తూ వుంటాడు. ఇంతలో వాసు, గురవయ్యా వస్తారు)

 

వాసు:- ప్రభాకర్..  నేను ఫోన్లోలో చెప్పానే గురవయ్యని  ఆయనే యీయన.

 

ప్రభా:- (టీ.వీ ఆఫ్ చేసి) రండి.. కూర్చోడి (గురవయ్య నమస్కారంచేసి కూర్చొంటాడు. వాసూ కూడా కూర్చొంటాడు.)

 

వాసు:- విషయమంతా చెప్పాను . ఆయన రెడీ యిక నీదే ఆలస్యం.

 

ప్రభా:- ఆయనతో ఒక్కమాటమాట్లాడాలి.

 

వాసు:- దాందేముంది మాట్లాడు.. నేనెమైనా ప్రక్కకు పోవాలా? పర్వాలేదు వెళతా.. మీరు మాట్లాడు కోండి.(లేవబోతాడు)

 

ప్రభా:- అక్కరలేదు. నీకు తెలియకూడని విషయమేమీ లేదు. కుర్చో .. గురవయ్యగారు..సారీ మీకు నయంకాని జబొచ్చిందటగదా..

 

గురవయ్య:- ఔనండి .. అది నా దురదృష్టం. నేను రేపే చనిపోవడానికైనా బాధపడటం లేదండి. కానీ నా ముసలితండ్రి,భార్యా, మూగపిల్ల దిక్కు లేని వాళ్ళైపోతారండి. ఉన్న పది పాతిక యీ జబ్బుకే ఖర్చై పోయింది. డాక్టర్లు పీక్కుతినేశారు. యమున్ని మరిపించారు. "యముడు ప్రాణాలు మాత్రమే        

తీస్తాడు, మరి డాక్టరేమో డబ్బూ ప్రాణం రెండూ గుంజేస్తాడంటే యేమో అనుకున్నా.. అదేంటో నాకు బాగా అర్థమైంది.

 

ప్రభా:- గురవయ్యగారు మీరు చాలా కష్టాల్లో వున్నారు .నా కర్థమైంది. కానీ నాదొక చిన్న సందేహం.

గుర:- అడగండీ..

 

ప్రభా:- మీరు చాన్నాళ్ళు బ్రతకరని డాక్టర్లంటున్నారు...

 

గుర:- వాళ్ళనేదేముంది, నాపరిస్తితి నాకే తెలుస్తూంది blood vomiting నాలుగు రోజులనుండి మరింత యెక్కువౌతూ వుంది. ఏక్షణమైనా ప్రాణం పోవచ్చనిపిస్తూంది.  డాక్టర్ చెప్పిన పదిరోజులైనా వుంటానా అని అనుమానంగావుంది. ఈరోజే బ్లడ్ యెక్కించారు. అందుకే యీమాత్రమైనా మాట్లాడుతున్నా. రేపటినుండి బ్లడ్ గ్లిడ్ యేమీ యెక్కించమని చెప్పేశారు.

 

ప్రభా:-ఆ బ్లడ్ విషయం మేంచూసు కుంటాం. అది సరే మరి యీ పరిస్థితిలో మీరు హత్యచెయ్యడానికి..

 

గుర:- అయ్యో.. వాసూగారు నాకంతా చెప్పారు. ఆ గయ్యాళి భార్యతో  మీరనుభవిస్తున్న నరకం యింతా అంతా కాదటగా. ఏమన్నా అంటే  బావమరిది మామ వచ్చి మిమ్మల్ని చావబాదతారటగా. ఇప్పుడుకూడా వాళ్ళకు లేనిపోనివి చెప్పి మిమ్మల్ని కొట్టించడానికే తల్లిగారింటి కేళ్ళిందటగా?

 

ప్రభా:- (తనలొ) ఆహఁ! వాసుగాడు కథ బాగానే రక్తి కట్టించాడు. (వాసు వైపు చూశాడు-వాడు థంసప్ చేసి కన్ను కొట్టాడు)

 

గుర:- భార్య పెట్టే బాధలు జ్ఞాపకమొచ్చాయనుకుంటా.. ఏదో ఆలోచనలోకి జారుకున్నారు పాపం.

 

ప్రభా:- పరవాలేదు (కన్నీళ్ళు తుడుచుకొంటున్నట్లు నటించి) చెప్పండి.

 

గుర:- బాబూ అటువంటి ఆడదాన్ని చంపితే పుణ్యమేగాని  పాపంరాదు. పుణ్యం పాపం అటుంచండి. ఒక్క ప్రాణిని చంపి నేను ముగ్గురి ప్రాణాలను నిలపాలనుకుంటున్నాను. నా సంసారం యిప్పటికే సర్వనాశనమయ్యింది. మీరిచ్చే డబ్బు నాభార్య చేతికిచ్చి వారికో దారిచుపి, నేను నీపని పూర్తిచేసి ప్రశాంతంగా కన్నుమూస్తాను. లేకుంటే వాళ్లు పస్తులతో చచ్చిపోతారు. (కంటతడి పెడతాడు) మూడు ప్రాణాలను కాపాడిన పుణ్యం మీకొస్తుంది. పాపమేదైనా వుంటే నాకురానీయండి పర్వాలేదు.

 

ప్రభా:- నన్ను మీరు సరిగ్గా అర్థం చేసుకొన్నారు. ఇంక మిమ్ములనడిగేదేమీలేదు.

 

వాసు:- మరి ఆయన కిస్తానన్న డబ్బు..

 

ప్రభా:- ఈదిగో అడ్వాన్స్ తీసుకోండి. (లక్ష తీసి యిస్తాడు)

 

గుర:- ( తీసుకొంటూ) అయ్యా ఆయుస్సు లేని వాణ్ని పని తొందరగా కానివ్వండి (నసుగుతూ) డబ్బు నాకు మొత్తం ముందే యిస్తామన్నారూ... మరి ఆడ్వాన్‍సే చేతిలోపెట్టారూ..

 

వాసు:- రేపు సాయంత్రానికల్లా మిగిలిన నాల్గులక్షలు ఆస్పత్రికే  తెచ్చి నేనిస్తాను. రెండు మూడు రోజుల్లో మీరుచె య్యాల్సిన పని మీరుచేద్దురుగాని.. నేను చెప్పిందంతా మీకు జ్ఞాపకముంది గదా!

 

గుర:-అంతా మీరు చెప్పినట్లే జరుగుతుంది. నన్ను నమ్మండి.

 

ప్రభా:- మంచిది.. యిక మీరు మాయింటికెప్పుడురావాలో సమయం చూసుకొని, నేనే  వచ్చి ఆటో  యెక్కించి పంపుతా. ఫోన్‍ గీన్ చెయ్యొద్దు. నేనొచ్చి ఆసుపత్రి కిటికీ దగ్గర నిలబడతాను. మీవాళ్ళనందరిని బయటకు పంపండి. వాళ్ళకు నేను కనబడటం మంచిదికాదు.

 

గుర:- అర్థమైంది. అలానేచేస్తాను. అసలు నా దగ్గర ఫోన్ కూడా లేదులెండి. మీరేరండి. ఇకవస్తానండి. నమస్తే!

 

వాసు:- ప్రభాకర్ యిక నువ్వు నిశ్చింతగావుండు. నీకింక అన్నీ మంచిరోజులేలేరా.. వస్తా..

 

(లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)

 

(రాజేశ్వరి  పిల్లవానికి పుస్తకంతెరచి యేదో పాఠం చెబుతూ వుంటుంది. ప్రభాకర్  ట్రింగా డ్రెస్ చేసుకొని లోపలినుండి బయటికి వస్తాడు.)

రాజే:- ఈ రోజు హాలిడే కదా! ఇంట్లోనే వుంటారనుకున్నా.

 

ప్రభా:- లేదు హోటెల్ సునీతలో నాలుగున్నరకు ఓ చిన్న టీ పార్టీ వుంది ఐదున్నరకల్లా వచ్చేస్తాలే..

 

రాజే:- టీ పార్టీ నేనా.. లేక..

 

ప్రభా:- టీ పార్టీ నేలే.. నువ్వనుమానిస్తున్నట్లు మందుపార్టీ యేంకాదులే. అసలలాంటి పార్టీలెప్పుడో మానేశాను. మాకొల్లీగ్ ఒకనికి పెళ్ళయింది, పెళ్ళి ఊళ్ళో కానందువల్ల అందరం వెళ్ళలేకపోయాం. అందుకని వాడు సింపుల్‍గా టీ పార్టీ యిస్తున్నాడు.

 

రాజే:- సరే పార్టీ చూసుకొని  అభినయ థియేటర్ కి రండి. వీడు సినిమా సినిమా అని నన్ను సతాయిస్తున్నాడు. మీరు రాగానే నేను లేడీస్ కౌంటర్‍లో టికెట్స్ తీసుకుంటాలెండి.. లేకుంటే వచ్చేముందు ఓ ఫోన్ చెయ్యండీ నేను టికెట్స్ తీసుకుంటాను.

 

ప్రభా:- రాజీ.. పార్టీలో ఫ్రెండ్స్‍తో కలిసి మాట్లేడేటప్పుడు, నాభార్య రమ్మంది నేను వెంటనేవెళ్ళాలి అంటే యేంబాగుంటుంది చెప్పు.. ఈరోజుకు వద్దులే సినిమాకు రేప్‍ పోదాం.

 

వేణు:-ఊ.. (ఏడ్పు) ఈరోజే పోవాలి.. మనం సినిమాకిప్పుడే పోవాలి...(ఏడ్పు)

 

రాజే:- సరే.. సరే.. ఊరుకోరా!  మనం యీరోజేపోదాం.. ఏమండి మీ పార్టీ అయిపోగానే యింటికిరండి. నేనూ వీడూ సినిమా చూసుకొని వస్తాం. రాగానే భోంచేద్దాం.

 

ప్రభా:- సరే.. వీడు యేదిపడితే అదే... మొండి.

 

వేణు:-ఆఁ...(ఏడ్పు) నువ్వే మొండి...

 

ప్రభా:-సరేలేరా..వెళ్ళు మీయమ్మా నువ్వు సినిమా చూసిరండి మీరొచ్చేటప్పటికి కాస్తా ఆలస్యమౌతుంది. పార్టీ తర్వాత  భోజనానికి కాస్తా గ్యాప్ వుంటుంది. వెళ్ళిరండి.

 

రాజే:- సరే మీరిక బయలుదేరండి. కలిసి సినిమాకెళదామంటే కుదరడమేలేదు.. దానిక్కూడా అదృష్టముండాలేమో.

 

ప్రభా:- ఈమాత్రం దానిక్కూడా అదృష్టాలు ముక్కుచీదుళ్లు సాధింపులూనా? వచ్చేవారం మరొక సినిమాకెళదాంలే అదీ ఒకసమస్యేనా?

 

రాజే:- అదీచూద్దాం..

 

ప్రభా:- చూద్దాం గీద్దాం యేమీలేదులే .. కలిసే సినిమాకెళదాం.

 

రాజే:- సరేలెండి.. మీరిక పదండి.. వెళ్ళే ఆ పార్టీ కన్నా సమయానికెళ్ళండి.

 

ప్రభా:- సరేనేనెళ్ళొస్తా..(వెళతాడు - పిల్లవాడు, రాజేశ్వరి సినిమాకెళ్లడానికి తయారౌతారు)

 

రాజేశ్వరి:- (ముస్తాబు పూర్తి చేసుకొని) పదరా వేణూ.. పద అక్కడెంత క్యూ వుంటుందోయేమో..(ఇద్దరూ బయటికి నడుస్తారు)

 

(లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)

 

 

(వాసూ, ప్రభాకర్  ఇద్దరూ మందుబాటల్ మిక్చర్‍పొట్లం చేత పట్టుకొని ప్రవేశం)

 

వాసు:-(వస్తూ) బాగానే లైన్ క్లియర్ చేశావ్.. నీభార్య యెక్కడికెళ్ళిందేమిటి..

 

ప్రభా:- టైం అనుకోకుండా కలిసొచ్చింది. మనకు బార్ గీర్ అంటే ఖర్చు వాగి పోతుందని, పాపమదే మనకోసం యిల్లువదలి పెట్టి సినిమాకెళ్ళింది. తొమ్మిదిన్నర పైన్నేలే తిరిగొచ్చేది.

 

వాసు:-కొంత ఇంప్రూమెంట్ కనబడుతూంది కదరా.. ఇంకాస్త ఇంప్రూవైతే   మనకు ఆమ్లెట్ సర్‍వ్ చేస్తుంటే మనం తాగుతూ తింటూ 0జాయ్ చేయచ్చు.

 

రాజే:- చంపేస్తుంది . అది పిల్లోని ఏడుపు సముదాయించలేక సినిమాకు తీసుకెళ్ళింది. అంతేగాని మనకోసం గాదురా వెల్లింది. నేనేదో మాటవరసకంటే నిజమనుకొన్నావా? సరేగానీ ఇక అసలు విషయానికిరా..

 

వాసు:- అయితే ఇక మన ప్లాన్ తొందరగా అమలు చేయాల్సిందేనన్న మాట..

 

ప్రభా:- రేపు ఆదివారం.. అంటే రేపూ సెలవే..పని రేపు ముగించేద్దాం.(వాసు గ్లాసులో మందు పోయబోతే వారించి) ఇంకొద్దు. ఎక్కువైతే మారాక్షసికి దొరికి పోతాను.

 

వాసు:- ఇది ఫారిన్ సరుకురా.. వాసనరాదులే!

 

ప్రభా:- ముందు మన ప్లాన్ గురించి చెప్పేదేమైనా వుంటే చెప్పు.. ఆతర్వాత నీ ఇష్టమొచ్చినంత తాగితగలడు. నాకు చాలు.

 

వాసు:- ఏముందిరా ప్రభాకర్ .. రేపు ఆ బ్యాలెన్స్ యిచ్చెయ్. వాడు అప్పుడే రిమైండర్ వేశాడు. వాణ్ని పిలిపించి పని ఫినిష్ చేయించెయ్. నో ఫర్దర్ అమెండ్‍మెంట్ నో వాయిదా...ప్రోసీడ్..(గటగటా తాగేస్తాడు)

 

ప్రభా:- ఎంత తొందరగా పని పూర్తైతే అంత మంచిది. మాకంపెనీ ఓనర్ నన్ను పూర్తిగా నమ్మాడు. నాతో కూతురు నడుపుతున్న ప్రేమాయణం తెలిసి మొదట కొంత ఫైరైనా ఆతర్వాత తనే సర్దుకొని ఒప్పుకున్నాడు. దీని పీడవిరగడైతే ఆతర్వాత లైన్ క్లియర్ (సడన్ గా రాజేశ్వరి వస్తుంది) ఆ సరోజ నన్ను వదలి వుండలేదురా..అది పిచ్చిది. దానికి నాపిచ్చే పట్టింది. కనుక ఆవైపు నుండి యింబ్బందే లేదు.

 

వాసు:-(మత్తెక్కి) ఓకె.. ఓకే . ఆతర్వాత నా కమీషన్ మరచి పొయేవ్.

 

వేణు:- (తల్లిని విడిచి) నాన్నా..(ప్రభాకర్ దగ్గరకు పరుగెడుతాడు.)

 

ఫ్రభా:- రాజీ.. రాజీ.. (తడబడుతూ) అదీ.. అదీ..

 

రాజీ:- ఇదా మీ నిర్వాకం. సిగ్గు లేదూ.. భార్య సినిమాకెళితే యిల్లు బార్ చేసేస్తారా?

 

వాసు:- (మత్తులో) నా..దేం.. తప్పు లేదండీ.. ప్రభాకరే నన్ను పిలుచుకొని వచ్చాడు. నేను జెస్ట్ కంపెనీ యిమ్మంటే వచ్చా నంతే!.. అంతే!..

 

రాజే:- యూ.. ఫస్ట్ గెటవుట్. వీణ్నసలు యింటి గడప తొక్కనియ్యదన్నానా? (వాసు చిన్నగా జారు కుంటాడు)

 

ప్రభా:- (కొంచం మత్తులో) సారీ..సారీ..ఇంకెప్పుడూ రాడులే.. అయినా నువ్వు...

 

రాజే:- అప్పుడే యెలా వచ్చా ననా  నీడౌటు. మీ అసలురంగు బయటపడే సమయమొచ్చింది కాబట్టే వచ్చాను. ఆ రాజకీయ నాయకుని ధీక్ష భగ్నం చేసి పోలీసులరెస్ఠు చేయడం, వాని మనుషులు అంగళ్ళు మూయించి సినిమాలు నిలబెట్టడం అంతా మీ బండారం బయట పడటానికే జరిగింది.. చెప్పు.. ఎవరు.. ఎవరా..సరోజ.

 

ప్రభా:- సరోజా?..సరోజ యెవరూ.. మేమేదో అప్పుడప్పుడు కొద్దిగా తాగి ఎంజాయ్ చేస్తామంతేగానీ..

 

రాజే:- అంతేగాని.. సరోజ యెవరో తెలియదన్న మాట. ఈరోజు మీరు నానుండి తప్పించుకోలేరు. నిజంచెప్పండి.

 

ప్రభా:- (తేరుకొని) ఓ.. అదా!.. అది వాసు యేదో డ్రామా వేస్తున్నాడట.. అది వాని రోల్..వాడు డైలాగ్ చెప్పలేకుండావుంటే  నేనందిస్తున్నానంతే.

 

రాజే:- అలాగా..ఏదీ..ఏదీ ఆ స్క్రిప్ట్. ఐనా అతడు తాగి..

 

ప్రభా:- అందుకేగా.. సరిగ్గా చెప్పలేకుంటే నే నందిస్తున్నా...వాడు వద్దురా అంటే వింటేనా? నేను తాగితేనేరా డైలాగ్స్ పాటలు పద్యాలు వచ్చేది, లేకుంటే రావంటాడు. స్క్రిప్ట్.. స్క్రిఫ్ట్ కదా? అది వాడే తీసుకొని వెళ్ళిపోయాడు.

 

రాజే:- ఏడిచాడు వాడిమొఖం. ఈతాగుబోతులంతా యింతే. ఈమాటచెప్పే పెద్దపెద్ద Actors  తాగి తాగే చచ్చారు. ఈసారి వాడు కనబడనీ చెబుతా..

 

ప్రభా:- వదిలెయ్ రాజేశ్వరీ.. ఏదోపొరపాటు జరిగి పోయింది.ఇంకెప్పుడూ యిలా జరగదు.

 

రాజే:- ఇంతదూరమొచ్చింది కథ అంటే ..నేను యేదో ఒకటి చెయ్యాలి. ఇదే ఆఖరుకావడానికేంచేయాలో చూడాలి. చూస్తా..

 

ప్రభా:- ఏంచూడోద్దులే.. ఇదే ఆఖరంటున్నానుగా.. ఇక వదిలేయ్.

 

రాజే:- రారా వేణూ..అన్నం తిందువుగాని.(లోపలికివెళ్ళి అన్నంగిన్నెతో తిరిగి వస్తుంది - ఇంతలో ప్రభాకర్ సోఫాలో కూర్చొంటాడు.) వెళ్ళి లోపల పడుకోండి నేనిక్కడే సోఫాలో పడుకొంటాను.(చిరచిర లాడుతూ పిల్లవానికి అన్నం పెడుతూ వుంతూవుంటుంది)

 

ప్రభా:- వద్దులే.. నేనే సోఫాలో పడుకొంటాను నువెళ్ళి బేడ్ రూంలో పడుకొ..

 

రాజే:- సరే.. పదరా వేణూ.. నువ్వు లోపలికెళ్ళి తిందువుగాని (అన్నం గిన్నె తీసుకొని వేణూతో లోపలి కెళుతూ) సొమవారం కంపెనీకెళ్లేప్పుడు నేనూ మీవెంటవస్తాను.. మీవిషయమంతా మీ జీ.యం తో మాట్లాడాలి. అక్కడ తెలుస్తా మీకథంతా..(లోపలికి పోతుంది)

 

ప్రభా:- (తనలో) వామ్మో.. యిది కంపెనీ కొస్తే యింకేమైనావుందా! నో, దీని పని రేపే ముగించేయాలి. లేకుంటే మొదటికే మోస మొచ్చేట్లుంది.

(బిగ్గరగా) రాజేశ్వరీ.. అన్నం తిన్నావా?

 

రాజే:- (లోపలి నుండే) నాకాకలిగాలేదు..మీక్కావలసుంటే వంటింట్లొ అన్నీవున్నాయ్ పెట్టుకొని తినండి.

 

ప్రభా:- చాలా కోపంగావుంది యిప్పుడు దీని జోలికి పోకపోవడమే మంచిది. (సోఫాలో తల వాలుస్తాడు)

 

(లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)

 

(బనియన్ తో ప్రభాకర్ సోఫాలో కూర్చొని టీ.వీ చూస్తూ వుంటాడు)

 

రాజే:-  లోపలినుండి వస్తూ) ఇంట్లో సరుకులైపోయాయి వెళ్లి తీసుకరండి.. ఇదిగో లిస్ట్ (లిస్ట్, చేసంచి చేతికిస్తుంది)డబ్బులున్నాయా..

 

ప్రభా:- నాషర్ట్ జేబులో వున్నాయిలే.  షర్ట్ బెడ్ రూంలో వుంది తీసుకరా..

 

రాజే:-  ( లోపలికి వెళ్లబోతూ) వచ్చేటప్పుడు ఆ లాండ్రీ వానితో ఒకమాట చెప్పి ఐరన్ చేసుంటే గుడ్డలు తెమ్మనం డి. మరచిపోకండి. ఐరన్ చెయ్యకపొయినా వాణ్ని పంపండి ఇంకొన్ని గుడ్డలున్నయ్

 తీసుకెళతాడు.(లోపలికెళుతుంది)

 

ప్రభా:- (తనలో) పంపిస్తా పంపిస్తా.. వాణ్నిగాదు నీ యముణ్ని పంపిస్తా. ఈరోజుతో నీపని సరి.

 

వేణు:-నేనొస్తా నాన్నా..బజారుకు. నాకు బార్ చాక్లెట్ కొనివ్వాలి.

 

ప్రభా:- నువ్వెక్కడికిరా! నేను తొందరగా వచ్చేయాలి.

 

వేణు:-ఊ.. నేనొస్తానాన్నా.. (మారాంచేస్తాడు)

 

ప్రభా:- ( తనలో) చూస్తే నా ప్లానంతా వీడు చెడగొట్టేట్టున్నాడే!

 

రాజే:- (చొక్కాతో బయటికి వచ్చి) ఒరే వేణూ..మొన్న ఊరినుంచి వచ్చేప్పుడు మీతాతిచ్చిన స్వీట్‍సున్నాయిగా అవి మా ఫ్రెండ్స్ కి వ్వాలంటూనే వున్నావ్ యెప్పుడిస్తావ్. మీనాన్నను పోనీలే.. నేను స్వీట్‍సిస్తా నువ్వు తిoదువుగాని మీ ఫ్రెండ్స్ కూ యిద్దువుగానీ (ఇంతలో రాజేశ్వరి యిచ్చిన షర్ట్ ప్రభాకర్ వేసుకుంటాడు.)

 

వేణు:- నువ్వుపో నాన్నా..నేను రానులే. అమ్మా! స్వీట్‍సిచ్చేయ్. నేను రామూ యింటికిపొతా.. ఆడుకుంటానమ్మా.. (స్వీట్స్ కోసం అమ్మ వెంట లోపలికి పోతాడు)

 

ప్రభా:- (తనలో) అంతా కలిసొస్తోంది. దీని కథ యీ రోజుతో ఫినిషయినట్లే.   

 

 

(పిల్లవాడు స్వీట్‍పాకెట్‍తో బయటికి వచ్చి ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు)

 

రాజే:-(వచ్చి) వెళ్లి తొందరగారండి.

 

ప్రభా:- (వెళ్ళబోతూ) ఆఁ!.. మరచిపోయా రాజేశ్వరీ ఒక మాట చెప్పాలి..

 

రాజే:- ఏంమాట  ఏమిటీ!

 

ప్రభా:- ఏంలేదు .. గురవయ్యని నా క్లాస్‍మేటు, వాడు నాకు అప్పట్లో మంచి ఫ్రెండ్. వాడికీమధ్య క్యాన్‍సరని చెప్ప్యేరు.

 

రాజే:- క్యాన్సరా..

 

ప్రభా:- మనమేంచేస్తాం. పాపం వాడు వారానికి మించి బ్రతకడని డాక్టర్లు చె ప్పేశారు. కడసారిగా ఒక సారి మిమ్మల్ని చూసిపోతారా అని ఫోన్ చేశాడు. వాడొచ్చేలోగా  నేనొచ్చేస్తాలే! ఒక వేళ నాకంటే ముందే వాడొస్తే ..కూర్చోమని.. ప్రిజ్ లో కమలాపండ్లున్నాయ్ రసం తీసివ్వు. వానికిష్టమని తెచ్చిపెట్టా.

 

రాజే:- అలాగా.. దానికేంభాగ్యం అలానే యిస్తా మీరు తొందరగా వచ్చేయండి.

 

ప్రభా:- సరే..వచ్చేస్తాలే.. (వెళ్ళును. రాజేశ్వరి వచ్చి సోఫాలో కూర్చొండును.ఇంతలో లైట్స్ ఆఫై మల్లీ వెలుగుతాయి)

 

(కాలింగ్ బెల్ మ్రోగుతుంది రాజేశ్వరి వెళ్ళి వాకిలి తెరుస్తుంది)

 

  రాజే:- రండి..మీరూ..గురవయ్యగారు కదా! రండి.. రండి.. ఈసొఫాలో కూర్చోండి.(కూర్చుంటాడు) ఆయన బయటి కెళ్ళారు . వచ్చేస్తారులెండి.

 

గురవయ్య:- మీరూ..

 

రాజే:- నాపేరు  రాజేశ్వరి .. మీ ఫ్రెండ్ భార్యని.

 

గుర:- ఓహో రాజేశ్వరంటే  మీరేనన్నమాట (కన్‍ఫర్మ్ చేసుకుంటాడు.)

 

రాజే:- ఔను నేనే రాజేశ్వరిని. ఉండండి మీకోసం కమలాపండ్లు తెచ్చుంచారు, రసంతీసిస్తాను. (లోపలికి వెళుతుంది - గురవయ్య జుబ్బా జేబులోంచి పిస్టల్ తీసి సోఫాపై పెట్టి దానిపై టవల్ వేస్తాడు. రాజేశ్వరి పండ్లు కత్తి జూసర్‍తో వచ్చి. చాప నేలపై పరచుకొని కూర్చొని రసం తీస్తూ) అన్నగారూ..ఆయన మీగురిచి అంతాచెప్పారు.

 

గుర:- అంతాచెప్పారా.. ఏముందమ్మా.. నాది  నాలుగు రోజుల్లో ముగిసి పోయే కథ.

 

రాజే:- మీరు బాధలో వున్నారు.

 

గుర:- బాధగాక మిగిలిందేమున్నదమ్మా..

 

రాజే:- జబ్బువల్ల మీకు శారీరకబాధ లుండొచ్చు. కానీ మనస్సును ప్రశాంతంగా వుంచుకోవాలన్నగారు.

 

గుర:- ప్రశాంతత.. చాలా సులభంగా అనేశావమ్మా..

 

రాజే:- అన్నగారూ..మీరన్నది నిజమే. ఈప్రపంచంలో యెవరున్నారు

 చెప్పండి ప్రశాంతంగా? నామటుక్కు నాకు లేదు ప్రశాంతత. అటు మానాన్న అనారోగ్యం, డబ్బుకు కటకట. ఇటు యీయన చూస్తే చెడుసహవాసాలు, తాగుళ్లు. ఏనిముషంలో కుటుంబం తునాతునక లౌతుందోనని ఆందోళన. పిల్లవానికి చిన్నవయస్సు ఎలానెగ్గుకురావాలో ఆలోచన. ఐనా అధైర్య పడుతే తీరుతుందాధైర్యంగా నిలబడాలి. తప్పదు.  నిలబడాలి.తప్పదు. మనస్సును ప్రశాంతంగా వుంచుకొని ఆలోచించాలి. బాగా ఆలోచించి సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకొని  కష్టాలనెదుర్కోవాలి. అంతేగాని కృంగిపోతే ఎలా?

 

గుర:- ఏమికిటీ.. ప్రభాకర్ కుచెడుసహవాసాలూ..తాగుళ్ళా..

 

రాజే:- ఆయన మంచివాడే.. కానీ ఒక లాయర్ వాసూ అని వున్నాడులే.. వాడే ఆయన్ను చెడగొడుతున్నాడు.

 

గుర:- లాయర్ వాసు చెడగొడుతున్నాడా? (కొంత ఆ లోచనలో పడిపోతాడు)

 

రాజే:- ఔను .. మీరైనా ఆయన్ను కాస్తా మందలించండి.

 

గుర:- అలాగే.. ఇవన్నీ నాకు తెలీవమ్మా.. తప్పక మందలిస్తాను.

 

రాజే:- ఏమనుకోకండన్నయ్యా. నా బాధలు చెప్పి మిమ్మల్ని విసిగించాను.

గుర:- అదేం లేదమ్మా..చెప్పు పరవాలేదు.

 

రాజే:- వద్దులేండన్నయ్యా.. మీరెలావున్నారో చెప్పండి. ఆ డాక్టర్లు చెప్పింది విని హైరానాపడిపోయారావాళ్ళలానేతెబుతారు. ఐనా అన్నగారూ.. ప్రతియొక్కరూ వాళ్ల వాళ్ళ పనై పోగానే వెళ్లిపోయేవారే. ఇక్క శాశ్వతంగా యెవ్వరం వుండంగదా!

 

గుర:- పనై పోయిందా! ఎక్కతల్లీ .. నిజంగా చేయవలసిన పని చాలా వుంది నాకు. ముసలితండ్రి మూగబిడ్డ అంతంత మాత్రం ఆరోగ్యంతో నెట్టుకుస్తున్న భార్య.. వీళ్ళకేదారి చూపించకుండానే వెళ్ళిపోతున్నానమ్మా. అదేనాబాధ.

 

రాజేశ్వరి:- అన్నగారూ.. మీకు చెప్పేటంత దాన్ని కాదనుకోండి..ఐనా..

 

గుర:- దాందేముంది, చెప్పామ్మా..

 

రాజే:- ఎవర్నెవరు రక్షిస్తారు.. నేనే వీళ్ళనంతా కాపాడుతున్నా ననుకోవడం సరికాదన్నయ్యా.. ఇందిరాగాంధీ పోయిననాడు యీదేశం యేమై పోతుదో అనుకున్నారంతా.. ఏమైంది .. ఆతర్వాత దేశమెంత అభివృద్ధి చెందింది. మనమే ఉద్ధరిస్తున్నామనుకోవడం ఒట్టి భ్రమ. మీరు నరసిహ శతకం నిన్నారా!  "అడవి పక్షులకెవ్వడహార మిచ్చెను" అన్న పద్యం జ్ఞాపకముందా?

గుర:- (కొంత మెత్తబడి) ఎప్పుడో చదువుకున్నట్లు జ్ఞాపకమమ్మా.. ఏదీ ఆ పద్యం నీకొస్తే చెప్పు విన్నాం. నాకెందుకో నీ మాటలు వింటుంటే  మరీ మరీ వినాలనిపిస్తూంది.నిజం చెబుతున్నానమ్మా.. నేనూహించిందొకటి చూస్తున్న దొకటిగా వుందమ్మా.

 

రాజే:- వింటామంటే.. వినిపిస్తానుండండి. మావూరినుండి వచ్చేటప్పుడు మానాన్నదగ్గరుంటే  చదువుకున్నామని తెచ్చుకున్నా.. ఇప్పుడేతెస్తా(వెళ్ళి పుస్తకం తెచ్చి రెండు మూడు పేజీలు త్రిప్పి) ఆఁ.. చదువుతా వినండన్నగారు.

 

సీ:     అడవి పక్షుల కెవ్వ డాహారమిచ్చెను

                 మృగజాతి కెవ్వడు మేతబెట్టె?

         జలచరాదులకు భోజన మెవ్వ డిప్పించె?

                 చెట్లకెవ్వడు నీరు చేదిపోసె

         స్త్రీలగర్భంబులన్ శిశువుల నెవ్వడు బెంచె?

                 ఫణులకెవ్వడు పోసె బరగ విషము

         మధుపాళి కెవ్వండు మకరంద మొనరించె?

                 పశుల కెవ్వడొసగె బచ్చిపూరి.

 

తే:గీ;           జీవకోట్లను బోషింప నీవెకాని

                 వేరె యొక దాత లేడయ్య వెదకి చూడ.

                 భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస

                 దుష్టసంహార! నరసింహ! దురిత దూర.

 

గుర:-ఆహాఁ.. ఎంత అర్థవంతమైన పద్యం. నిజంగా నేనూ నాదీ నావల్లానేయిదంతా అనుకుంటూన్న నావంటి వారికి కనువిప్పమ్మా.. ఇంకో పద్యం వినిపించమ్మా.. నీనోట  మరోపద్యం వినాలనిపిస్తూంది.

 

రాజే:- అలాగే.. ఇదిగో.. ఈపద్యం వినండి..

 

సీ:      ధరణిలో వేయేండ్లు తనువు నిల్వగ బోదు

                 ధన మెన్నటికి శాశ్వతంబు గాదు

         దారసుతాదులా తన వెంట రాలేరు

                 భృత్యులు మృతిని తప్పింపలేరు

         బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు

                 బలపరాక్రమమేమి పనికిరాదు

         ఘనమైన సకల భాగ్యము లెంతగల్గియు

                 గోచి మాత్రంబైన గొనుచుబోడు

 

తే;గీ  వెర్రికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను

         భజన చేసెడి వారికి బరమసుఖము 

         భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస

         దుష్టసంహార! నరసింహ!దురితదూర.

 

అంతేగాదన్నగారు గౌతమబుద్ధుడు బోధచేస్తూ..ఈప్రపంచం లోని సమస్తదుఃఖాలకూ కారణం తగని కోరికలే నన్నాడు. ఈ ప్రపంచంలో రోగం ముసలితనం మరణం అతి సహజమన్నాడు. సంఘంలో ఒకరిపైఒకరు ఆధారపడి సహకరించుకొని శరణు జొచ్చి దుఃఖాన్నధిగమిచాలన్నారు. అదే "సంఘం శరణం గఛ్చామి"అన్నమాట. అంతెందుకు యాక్సిడెంట్ జరిగినచోటే ఆస్పత్రికి చేర్చేవాడొకడుంటాడు. అది యెలా అనే విషయం మనకర్థం కాదు..మనం ఒకరికి మేలుచేస్తే మనకు మేలుచేసే వాడూ ఒకడుంటాడు. అదంతే. మనం చేయవలసిందల్లా పైవాణ్ని నమ్ముకొని నిశ్చింతగా మన కర్తవ్యం మనం నిర్వర్తించడమే.

 

గుర:- ఏమోనమ్మా.. నీవు చెబుతుంటే నమ్మాలనిపిస్తూంది.

 

రాజే:- నమ్మాలన్నగారు.. నమ్మాలి.. నమ్మినవాడికి ఫలముంది నమ్మాని వానికి యేముంది? నమ్మీనమ్మాని మూఢజనానికి దైవం దూరంగా వుందీ అన్నారు. విన్నారా!

 

గుర:- ఎక్కడో విన్నాట్లే వుందమ్మా..

 

రాజే:- అది మన జీవితానికి సరిగ్గా సరిపోతుందన్నాగారు.

 

గుర:- నిజమేనమ్మా.. దానర్థం యిప్పటిదాకా తట్టలేదమ్మా.. ఇప్పుడిప్పుడే అర్థమౌతున్నదమ్మా.. ఇంకచాలమ్మ.. ఇది జీర్ణించుకోడానికి నాలాంటి వాడికి పదిజన్మలైనా చాలవమ్మా..

 

రాజే:- సరి.. ఇక విసిగించనులే అన్నయ్యా. ఆయనొచ్చే వేళయింది ఇదిగోండి పళ్ళరసం తీసుకోండి (గ్లాసు అందిస్తుంది)

 

గుర:- (నమస్కరించి) ఇంత ఉత్తమురాలివి. ఇంత

గొప్పదానివి.. నిన్ను భార్యగా పొందడానికి ఆ ప్రభాకర్ ఎన్ని జన్మలు తపస్సు చేసుండాలి. అటు వంటి నిన్న.. నిన్ను...( కంకటతడి పెట్టి ఏ డుపు మొగం పెడతాడు)

 

రాజే:-ఏమిటి..  ఏమిటిమీరంటున్నది... అన్నగారూ! ఎందుకలా ఎగ్జెయిటై పోతున్నారు... ఏమిటి విషయం.

 

గుర:- ఆదుర్మార్గుడు.. ప్రభాకర్.. ఆనీచుడూ, వాసూ ప్లాన్ చేసి నిన్ను చంపేయమన్నారమ్మా.. నన్నే చంపేయమన్నారు.

 

రాజే:-ఏమిటి గురయయ్యగారూ..  ఏమిటి మీరంటున్నది నాభార్త.. నా..భార్త..నన్ను...

 

గుర:-వునమ్మా.. చంపేయమన్నారు. నేను డబ్బుకమ్ముడుబోయి వాళ్లుచెప్పిన మాయమాటలు నమ్మి . మహాపాతకానికి పూనుకున్నానమ్మా.. ఇదిగో తుపాకి (తుపాకి రాజేశ్వరి తీసుకుంటుంది) తీసుకో. దీన్తో చంపేయమన్నారా రాక్షసులు. నీవు గయ్యాళివని, చంపితే ఐదులక్షలిస్తామన్నారు. ఒప్పుకున్నానుతల్లీ.. ఐదులక్షలూ తీసుకొని నిన్ను చంపడానికొప్పుకున్నా.  ఒకర్నిచంపి ముగ్గుర్ని బ్రతికించాలనుకున్నాను. కాని నీమాటలు విన్నాక అర్థమైంది తల్లీ.. నీలాంటి ఉత్తమురాలిని రక్షించడం కోసం వెయ్యిమందిని వదులుకోవచ్చని.. అర్థమైంది తల్లీ..అర్థమైంది.

 

రాజే:- (సీరియసుగ) నన్నెందుకు చంపావని పోలీసులడిగితే యేంచెప్పేవారు గురవయ్యగారు.

 

గుర:- నీకూనాకు ఐదేళ్లుగా అక్రమసంబంధం నడుస్తున్నదని. నాకు క్యాన్‍సరని తెలిసి నన్ను కాదని ప్రభాకర్‍ను పెళ్ళిచేసుకున్నావని, అందుకే కక్ష తీర్చుకున్నానని ఒక కట్టుకథనల్లి నన్ను చెప్పమన్నారమ్మా.

 

రాజే:- అందువల్ల వారికొచ్చే లాభం.

 

గుర:- ఏదో కుట్ర దాగివుందని నానమ్మకం. నాకుమాత్రం నీవు గయ్యాళివని. ప్రతిరోజూ నరకం చుపిస్తున్నావనీ.. మీనాన్నను అన్నను పిలిపించి చావ

గొ ట్టిస్తుంటావనీ.. చంపెస్తే డబ్బిస్తామనీ చెప్పారు. అమ్మా! ఈనీచుణ్ని, దురాశాపరుణ్నీ క్షమించకండమ్మా.. క్షమించకండి.. నన్ను కాల్చేయండి. వద్దువద్దు తల్లీ.. ఆ తుపాకి యిట్టివ్వండి నన్నునేనే కాల్చుకుంటాను. ఒక్క క్షణం కూడా బ్రతికుండకూడదమ్మా యీ పాపి.(ఆమె చేతిలోని తుపాకి లాక్కోజూస్తాడు - కానిరాజేశ్వరి వెనక్కు జరిగి లాక్కోనివ్వదు)

 

రాజే:- తొందర పడకండి గురవయ్యగారూ.. మీ రింతవరకూ యేతప్పూ చేయలేదు... అంతేగాదు, దుర్మార్గుల కుట్ర బయటపెట్టారు. ఇప్పుడునాకంతా  వివరంగా అర్థమై పోయింది. (తనలో) ఆరోజు వాళ్ళు చెప్పిన సరోజ డ్రామా కథ నాకథలో భాగమేనన్న మాట (ఆలోచించి) గురవయ్యగారూ.. మీరు బాధ పడకండి నిశ్చింతగా వుండండి. జరిగేదంతా చూస్తూవుండండి.

 

(పనైపోయుంటుందన్న సంతోషంతో ప్రభాకర్ ప్రవేశిస్తాడు. ఎదురుగా రాజేశ్వరి తుపాకి యెక్కుపెట్టి కనబడుతుంది)

 

ప్రభాకర్:- (ఆశ్చర్యంతో) రాజేశ్వరీ..(ధన్.. ధన్.. మని రాజేశ్వరి ప్రభాకర్‍ని కాల్చేస్తుంది) వద్దు..కాల్చొద్దు.. నన్ను చం..పో..ద్దు..   ఆఁ...   (నేలకొరిగిపోతాడు)

 

వేణు:- (పరిగెత్తుకుంటూ వచ్చి) అమ్మా.. నాన్నా..(భయంతో వణికిపోతూ వెళ్ళి అమ్మ కాళ్లను గట్టిగా కౌగిలించు కొంటాడు. రాజేశ్వరి తుపాకి క్రిందకు పడేసి సెల్‍ఫోన్‍లో నంబరు నొక్కి)

 

రాజే:- హలో..హలో.. పోలీస్‍స్టేషన్ (అంటూవుండగా సీన్ స్టిల్ అయిపోతుంది)

 

(లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)

 

(రాజేశ్వరి సోఫాలో కూర్చొని వుంటుంది . వాసూ ప్రవేశిస్తాడు)

 

రాజే:- (గబుక్కున లేచి) చెప్పండి. ఆగురవయ్యను అనవసరంగా కేసులో ఇరికించి నాకు బెయిల్ ఇప్పించారు. ఎందుకని?

 

వాసు:-రాజేశ్వరిగారూ.. నన్ను నమ్మండి. గురవయ్యే యీ హత్య చేశానని ఒప్పుకున్నాడు."నన్ను తప్పించడానికి నేను ప్రభాకర్ను కాల్చిచంపినతర్వాత రాజేశ్వరీదేవి తనచేతి తుపాకీ లాక్కొని పోలీసులకు ఫోన్ చేసింది" అని కోర్టులో గట్టిగా సాక్ష్యం చెప్పాడు.

 

రాజే:- అది మీకుట్ర అవన్నీ అతనిచేత మీరు పలికించిన అబద్దపు మాటలు.

 

వాసు:- ఇందులో నేను కుట్రచేయవలసిన పనేముంది, రాజేశ్వరిగారూ.. అసలు ఆ అవసరం నాకేముంది చెప్పండి.

 

రాజే:- నమ్మమంటారా? అసలు నేనేగాదు మీమాటలు యేవరైనా నమ్ముతారా?

వాసు:- నిజమే నా గతచరిత్ర మిమ్మల్ని యే విషయంలోనూ నమ్మనీయదు. ఇందులో స్వప్రయోజనం యేదో వుంటుందనే మీరనిమానిస్తారు. అది సహజం. కానీ రాజేశ్వరిగారూ నేను మారిపోయాను.

 

రాజే:- మారిపోవడమా? నువ్వా.. మంచిగా  నాకు సహాయంచేస్తున్నట్లు నటించి నన్ను లొంగదీసుకోవాలనే ప్రయత్నంగదా ఇదంతానీది కేవలం భ్రమ, తెలివితక్కువతనం. నేను నీ మాయలో యేనాటికీ పడను.

 

వాసు:- రాజేశ్వరిగారూ. ఇంతజరిగిన తర్వాత. ఈకథలో ఒక పాత్రనైన నేను.. ప్రత్యక్షంగా విషయమంతా తెలిసిన నేను.. ఇంకా నిన్నాదృక్పదంతో చూడటమా! లేదు రాజేశ్వరిగారు, మీరు పొరబడుతున్నారు.

 

రాజే:- తప్పుచేసిన భర్తను సైతం క్షమించలేదు నేను.  ఆ విషయం జ్ఞాపక ముంచుకుంటే నీకే మంచిది.

 

వాసు:- దయచేసి మీరు నన్ననుమానించకండి. నేనుచెప్పేది వినండి ఆ తర్వాత మీరు మీయిష్టమొచ్చిన కన్‍క్లూజన్‍కు రండి. విషయం మీకు వివరించి వెళ్ళిపోతాను. నాముఖం మీకింకెప్పుడూ చూపించను. రాజేశ్వరీదేవిగారు కఱకు బోయవాడు వాల్మీకయ్యాడు. అంగుళీమాలుడు బౌద్ధుడయ్యాడు. అటువంటిది నేను మనిషిని.. మామూలు మనిషిని కాలేనాఆనాడు గురవయ్య నన్నుచూసి ముఖంమీద ఉమ్మేశాడు. మీరు  ఆయనతో చెప్పిందంతా నాకు చెప్పి కన్నీరు మున్నీరయ్యాడు. చావు బ్రతుకులమధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమనిషి ధర్మాధర్మాలను బేరీజు వేసుకు ని  పశ్చాత్తాపంతో పరితపించిపోయాడు. అతన్నిచూసి అతని ఆవేదన చూసి నామీదనాకే అసహ్యమేసింది. ఆ నాడే నేను నిశ్చయిం చుకున్నాను. నేను నిజంగా మనిషినైతే .. నాలో యేకోశాన్నైనా మానవత్వం అవగింజంతైనా మిగిలి వుంటే  భర్తనియైనా చూడకుండా ఒక దూర్త రాక్ష సుని అంతం చూసిన దేవతను రక్షించుకోవాలనుకున్నాను. రక్షించి తీరు తాను. చట్టాలు యెన్నయి నా చెప్పవచ్చు. చట్టాన్ని మనచేతుల్లోకి తీసు కోవడం తప్పనవచ్చు. కానీ డబ్బూ, పలుకుబడి, రాజకీయాలను అడ్డుపెట్టు కొని విచ్చలవిడిగా దండనరహితులై కీచకులు తిరుగుతున్న యీ రోజుల్లో ఒక స్త్రీ తెగించి తీసుకున్న యీ నిర్ణయం యెవరొప్పుకొన్నా ఒప్పుకోక పోయినా  నేను మాత్రం ఒప్పుకుంటున్నాను. హర్షిస్తున్నాను. రాజేశ్వరీ దేవి గారూ.. ఆఖరుగా ఒక్కమాట, గురవయ్యగారు యీదినం ఉదయమే కన్ను మూశారు. ఇందులో బాధపడవలసిందేమీ లేదు. కానీ ఒక్కటిమాత్రం నేను కళ్ళారా చూశాను. అతడు మీకు మేలు జరగాలని ప్రార్ధించి ప్రశాంతంగా సంతృప్తిగా  కన్నుమూశాడు. అతనిలోని ఆందోళనను ఆరాటాన్ని మటు మాయం చేసి ప్రశాంతతను నింపింది మీరూ మీమాటలేనని నాకు బాగా తెలుసు. కన్నుమూసేరోజు నేనూ అలా ప్రశాంతంగా ఉండగలనా? అని ఆలోచనలో పడి పోయినవాణ్ని. ఎందుకంటే చేజేతులా ఒక నిండు సంసారాన్ని సర్వనాశనం చేసిన మహా పాపిని (బోరున యేడ్చును) క్షమించండి. ఇప్పటికే నే నెక్కువ మాట్లాడాను.

 

రాజే:- అది కేవలం శ్మశానవైరాగ్యం కాకుండాచూసుకోండి చాలు.

 

వాసు:- థ్యాం క్స్.. మంచిసలహా యిచ్చారు ఆ భవంతుడున్నాడు. అంతా వాడిదయ.. థ్యాంక్స్ అంటే గుర్తొచ్చింది. ఆఁ.. ప్రభాకర్ కంపెనీ ఓనర్  రాజారాంగారు మరీమరీ మీకు థ్యాక్స్ చెప్పమన్నారు. ఆయనకుమార్తె అమాయకత్వంతో ప్రభాకర్ వలలోపడి జీవితం నాశనంకాకుండా రక్షించినందుకు  మీకు ఋణపడి వుంటానన్నాడు. మరొక్కమాట, ఇంతవరకూ మీకేసుకు పూర్తిగా ఆర్థికసహాయం చేసింది ఆయనే, కాని నేను కాదని తెలియజేస్తున్నాను. మీకు వారి కంపెనీలో  మంచి ఉద్యోగం కూడా యిస్తామన్నారు. ఒకటి రెండు రోజుల్లో అపాయింట్‍మెంట్ ఆర్డర్‍తో ఆయనే స్వతహాగా మిమ్మల్ని కలుస్తామన్నారు. కొడుకును తాతగారింటినుండి పిలిపించండి.  స్కూల్‍కు పంపించండి. నేను చెప్పవలసింది చెప్పాను. మీకుతెలియందేమీలేదు. తుదినిర్ణయం మీదే.

 

రాజే:- నేను గురవయ్యగారిని  ఆఖరుసారిగా చూడాలను కుంటున్నాను.

 

వాసు:- నిరభ్యంతరంగా చూడొచ్చు. అన్ని యేర్పాట్లు  మాయింటివద్దే జరుగు తున్నాయ్. మీరు వచ్చిన తర్వాతే  అంతిమయాత్ర మొద లెడతా(ఒక్క అడుగు ముందుకేసి - మళ్లీ వెనక్కు తిరిగి) రేపే గురవయ్య గారిమూగబిడ్డను నేను దత్తత తీసుకుంటున్నాను. రాజేశ్వరీదేవిగారు! దత్తతడాకుమెంట్స్ మీద మీ శుభహస్తాలతో సాక్షిసంతకం చేస్తే సంతోషిస్తాం. మీరు రాగలిగినా.. రాలేకపోయినా మీ ఆశీర్వాదం ఆ  బి డ్డ కెప్పుడూ ఉంటాయనే  నమ్మకంతో వున్నాం... నమస్తే!  (సీన్ స్టిల్)      

(సమాప్తం)


No comments:

Post a Comment

నాకు చదువురాదు, Naaku Chaduvu Raadu

  నాకు   చదువు   రాదు ( ఏకపాత్రభినయము )     (పాత్ర: ఓ 50 సంవత్సరాల  పేద పెద్దమనిషి ) అమ్మా!  శారదా ... ( బోరున   యేడ్చును ).  తల్లీ   యీ   గ...