Sunday, 18 July 2021

రావణవిజయం

 రావణవిజయం

(పౌరాణిక పద్య నాటకము) 

రచన

పి.సుబ్బరాయుడు.


సెల్-9966504951.


ఇందలి పాత్రలు
 
1.దశకంఠుడు                2. నారదుడు
3.ఇంద్రుడు                     4.సుమాలి
5.ప్రహస్తుడు                   6.బ్రహ్మ
7.మయుడు                    8.విశ్రవుడు
9.కుబేరుడు                   10.నలకూబరుడు
11.రాయబారి               12.ఆకాశవాణి
13.మండోదరి              14.రంభ



రావణవిజయం

(పద్యనాటకం)

 

ఒకటవరంగము

 

(ఆకాశవీధి-నారదుడు అమరావతి వైపు పయనిస్తూ పాటపాడును)

 

పాట:- నారాయణా... నారాయణా... నారాయణా...

 

నీరదశ్యామానినగన తరమా!

భవునకైనా..సుమభవునకైనా...../నీర/

భక్త జనావన.. భవబంధ హరనా.

శ్రీలలనాధవా.. హరినారాయణా..../నీర/

 

పాటచరణము..1

 

మీనమూర్తివై...శ్రుతుల గాచితివి.

కూర్మరూపివై...గిరిని మోసితివి.

సూకరముగ మారి..ఇలను దాల్చితివి.

నరసింహుడవై...కలుషమణచితివి.  /నీర/

 

 

ఆహాసురలోకము పరపీడనారహితమై సుభిక్షముగ నున్నదిదేవ లోకమందు యెటువంటి అవాంఛనీయ సంఘటనలూలేవుసురలు పనిపాటలేమియూలేక సురపాన విశేష మత్తులై స్తబ్దత నొందియున్నారు.

 

తే.గీఅసురబలములు క్షీణించి అణగియుండె

           అవనినాధుల కయ్యము లంతరించె

          దేవనాధుడు సౌఖ్యన దేజరిల్లె

          కలహమనునది లేక నా కడుపు మండె.

 

కలహభోక్తనని పేరేగానీ నా కలహకల్పన మంతయు లోకకల్యాణార్ఠమే గదాకానిమ్ముపెక్కుదినములనుండి కలహభోజనమునకై తపించు నేనుకలహభుభుక్ష నుపశమింప జేసికొను మార్గము నన్వేషణ జేయు  సమయ మాసన్నమైనదివలయునుపాయము నా లోచించెద.. ఆఁస్ఫురించినదికైకసీనందనుడు విరించి వరములకై గోకర్ణమున ఘోరతపము చేయు చున్నాడుఅతని తపము ఫలింపవచ్చునుఆ సుమాలి పంటపండ నున్నదిమనుమడైన దశకంఠునిసహాయమున రాక్షసరాజ్య విస్తరణమునకుసురలోక సంక్షోభమునకు కారణము కాగలడుఅందులకై నా వంతు కర్తవ్యమునకు అంకురారోపణమొనర్చెదగాక.! దేవావైకుంఠవాసానిన్ను నమ్మిన వారికి యేకొరంతా రాదుగదా!

 

పాటచరణము.. 2

 

విశ్రవోసుతుడు..విశదవిక్రముడు

కఠిన తపంబున.. విథాత వరముల

బడయగోరుచూ.. మాతామహు కల

నిజముచేయగా.. తానెంచునుగద!........../నీర/

 

(పాట పాడుతూ నిష్క్రమించును)

 

 

రెండవరంగము

(సురసభరంభ నాట్యముచేస్తు వుంటుంది)

పాట-2

సంగీతసాహిత్య -  సారంబు గ్రహియించి

లయలు హొయలనుగూర్చి -అభినయంబున గూర్చు

నటనమే కడు రమణము- (యీరంభ నాట్యమె విఖ్యాతము

 

కాలిగజ్జల రవళిమేఘనినదము బోలు.

కనుకొనచూపులెమెఱపు తీవలసాటి.

చిరుమందహాసంబుతళుకు తారక తోడు.

మేనివంపుల సొంపుసితచంద్రికల సమము....../సంగీత/

 

భువి తపములుచేసిదివిజేరగా వచ్చి.

నా నాట్యవిభవంబుకనులారగాజూచి.

తమపుణ్యఫలములపొందితిమని పొంగి.

ఆనందడోలికలతామూగిపోరే................./సంగీత/

 

(ఆటా పాటా ముగుస్తుండగా నారదుని ప్రవేశంరంభ నిష్క్రమణము)

 

నారద:- నారాయణ... నారాయణ...నారాయణ...

 

ఇంద్ర:- నారదమునీంద్రులకు అభివాదములుదయచేయుడు మునీంద్రా..ఆసీనులుకండు.

 

నారద:- శుభమస్తు.(కూర్చొండును)

 

ఇంద్ర:- బ్రహ్మమానసపుత్రులూత్రిలోకసంచారులూఅయిన మీరాకలోని పరమార్థం తెలుసుకోవచ్చునా స్వామి?

 

నారద:- ఆఁ అర్థమూపరమార్థమూ ఏమున్నది సురపతీలోకసంచారినిఒకసారి మిమ్ము చుచిపోవుదమని వచ్చితిమిఅవాంతరములేమియు లేక మీ పరిపాలనము సుభిక్షముగ సాగుచున్నదిగదా!

 

ఇంద్ర:- మునీంద్రాతమవంటి తపోధనుల ఆశీర్వాదము లున్నంతవరకు  మా కెటువంటి లోటూ రాదకదాఐననూ సర్వజగద్రక్షకుడైన శ్రీహరి మాకు రక్షగానుండ మాక్షేమము వేరుగా నరయవలయునా?

 

(ఇంతలొ అరుణవర్ణం రంగస్థలాన్ని ఆక్రమిస్తుంది ఓం నమో బ్రహ్మదేవాయఅన్న అష్టాక్షరీ మంత్రం మెల్లగా ప్రాంరంభమై తీవ్రస్థాయికి చేరుతుందిఇంద్రలోకం కదిలినట్లు కనబడుతుందిగాలులు వీచిన శబ్దం పెరుగుతుందితర్వాత నెమ్మదిగా సామాన్య దశకుచేరుతుందిఇంద్రుడు భయకంపితుడై..)

 

మహాత్మాఏమి యీ హఠాత్సంఘటన.

 

నారద:-మహేంద్రా..అదియే నాకునూ అవగతము కాకున్నదిఉండుము. (కళ్ళుమూసుకొనిఆఁఇప్పుడర్థమైనదిఆ విరించి అష్ఠాక్షరీమంత్ర జపము,  విశ్రవోబ్రహ్మ తనయుడైన దశకంఠునిది.

 

ఇంద్ర:-ఐనఆ మంత్రధ్వని నాకమున ప్రతిధ్వనించుట,  మహోష్ణ తీక్ష్ణ ప్రభంజనము మనపై వీచుట....

 

నారద:- అది దశకంధరుని తపోగ్నిజ్వాల ప్రభావము మహేంద్రాఅతడు సామాన్యుడా?

 

.వెఘోరతపము జేసి ధీరత తానిల్చి

           తలలు తరిగినాడు విలయ లీల

           వహ్నికీల యనగ వనమందు వెలయుచు

           ధాత దించు నిజము ధరణికతడు.

 

అతని తపస్సు ఇప్పటికి పదివేల సంవత్సరములు పుర్తి కావచ్చినదివేయిసంవత్సరముల కొకటి చొప్పున తనశిరముల నొక్కొక్కటి యజ్ఞగుండమున వ్రేల్చుచూ తపమును కొనసాగించుచున్నాడుఇక మిగిలినది ఒక్క శిరస్సు మత్రమే.

 

ఇంద్ర:- (నవ్విమిగిలిన ఆ ఒక్క శిరస్సును సైతము త్రెంచుకొనును కాబోలుమూర్ఖుడు.

 

నారద:- (చిన్నగా నవ్విమహేంద్రాఏమినీ వెఱ్ఱిఅతని తపాగ్నిజ్వాలావీచిక నొకదానిని యిపుడేకదా మనము చవిచూచితిమిఅది బ్రహ్మలోకము మాత్రము చేరియుండదాపరమేష్థిని కదిలించియుండదాఆలోచించిన కొలది దశకంఠుని తపము ఫలించుననియే నా నమ్మకము.  ఇంద్ర:- మునీంద్రాఅట్లైన...

 

శారక్షోవీరులవల్ల బాధ సమసెన్ రాజీవనేత్రుండు మా

         పక్షం బెంతయు నిల్చి మమ్ము దయ గాపాడంగనేడీగతిన్

        కక్షన్ బూని దశాననుండు బహుదా కాకల్ రగుల్ గొల్పుచున్

        దీక్షన్ జేసితపంబు, మించదలచెన్ధిక్కార మెట్లోపుదున్.

 

నారద:- ఏదియేమైనప్పటికిని కానున్నది కాకమానదుఅంతయూ విధివిలాసమువిధికృతమును దప్పింప నెవరితరముఎందులకైనా మంచిదిఇప్పటియీ విపత్కర పరిస్థితులనుండి కాచుకొనుటకు కడు జాగరూకుడవై మెలగుము.. ఇక నే పోయివత్తునునారాయణ.. నారాయణ. (వెళ్ళును)

 

మూడవ రంగము

 (గోకర్ణాశ్రమప్రాంతమున దశకంఠుడు అగ్నికుండము వద్ద నిలబడి చేతులుసాచి)

 

దశకంఠుడు:- ఓం నమో బ్రహ్మదేవాయ.. ఓం నమో బ్రహ్మదేవాయ..ఓం నమో బ్రహ్మదేవాయ.. శ్రీసత్యలోకాధినేతాదేవిశారదనేలు దివ్యస్వరూపా!చతురాననాసకలలోకనిర్మాతాప్రాణప్రదాతాధాతావిధాతాఙ్ఞానవిఙ్ఞానమూర్తీఆద్యంతరహితాకరుణించి వరములీయ రావాపరమేష్ఠీకోరిన వారల కోర్కెలు దీర్చి మనుపుదువను సత్యమును వమ్ముసేతువానిష్టాగరిష్ఠుడనై విషయసుఖంబుల త్యజించి పదివేల సంవత్సరములుగా తపించుచున్నానే... చాలదాప్రభూనిజకంఠ కవోష్ణరుధిరధారల అర్ఘ్యమిడితినే.. అదియునూ నీకు తృప్తినీయదాదేవాఏలనాపై నీ కనుగ్రహము కలుగదుభక్తమందారాభవభయహరాఏల నాపై మీ కింత కఠినతపరమేష్టీని నిరాదరనకు గురై నేనిక జీవించుట వృధాకానిమ్ముమిగిలిన నా యీ దశమశిరఃఖండన మోనరించి నికు నైవేద్య మిడెద గాక!

 

తే.గీ.  కరుణ ననుగావ మీ కిచ్చ గలుగ దేని

          తపము నిష్ఫలంబగుటయే తప్పదేని

          వశమె నాకింక జీవింప వసుధ మీద

         దేవగైకొమ్ము శిరమెదే ద్రెంతు నిపుడు

.

  (ఒరనుండి ఖడ్గము దూసి తలనరికికొన యత్నిస్తూ)

 

నమో బ్రహ్మ దేవాయనమో బ్రహ్మ దేవాయ!నమో బ్రహ్మ దేవాయ!

బ్రహ్మ:- (ప్రత్యక్షమైదశకంధరాశాంతింపుమునీ తపస్సుకు త్యాగమునకూ మెచ్చితినివరములీయ వచ్చితినికోరికొమ్ము.

 

దశ:-  (సంతోషముతోసత్తపోనివహాభీష్ట వరప్రదాతా!

 వాగ్దేవీమనోనేతానమోనమఃదేవా నీవు మహాగణంబులకు ఆధారభూతుడవుసకల విద్యలూ నీయంద నిక్షిప్తములుసర్వార్థసాధనములకు సాధనీయుడవీవఆత్మనిష్ఠాగరిష్ఠులకు ధ్యేయంబీవసమస్త చరాచర భూతసృష్ఠి విఙ్ఞాతవుదేవానీ దర్శనభాగ్యమున నా జన్మ ధన్యతగాంచినది.

 

బ్రహ్మ:- కైకసీ నందనానీ తపమునకు మిగుల ప్రసన్నుడనైతినిఇక నీ ఇచ్ఛవచ్చిన వరముల కోరికొమ్ముప్రసాదించెదను.

 

దశ:- ఆహాఁ ధాతామహా ప్రసాదము

 

దేవశుభాశుభస్థితులు,  దేవనరాసురముఖ్యులొందగా

       నీవెయొనర్తు వాద్యుడవునీకొక విన్నప మాచరించెదన్

      జీవులు మృత్యువన్న వెర సెందుదురుగ్రవిరోధి మృత్యువే

      కావున తద్భయంబు వెలిగా బ్రతుకన్ వరమీయవే కృపన్.

 

దేవాగరుడాదిత్యనభశ్చరాసుర మరుద్గంధర్వ సిద్దర్షిభాస్వర విద్యాధర యక్ష కిన్నెర పిశాచప్రేత రక్షఃఫణాధర భూతగ్రహ విశ్వ సాద్య వసు రుద్రశ్రేణి చేత నాకు మరణము లేకుండా వరము ప్రసాదిపుము.

బ్రహ్మ:- తథాస్తు...

 

:  కోరిన నీ వరంబులను కూరిమి మీరగ మెచ్చి యిచ్చితిన్

       వీరుడవై ధరన్ మిగుల విఙ్ఞతతోడ మహోన్నతుండవై

      మేరలుమీరి నీ యశము మెప్పుగ లోకము లాక్రమింపగన్

      దార సహోదరుల్ సుతులు దక్షత గొల్వగ సౌఖ్యమందుమా!

 

దశ:- ధన్యోస్మి ధాతాధన్యోస్మి.

 

బ్రహ్మ:- దశకంధరాఅసాధ్యవరంబుల నర్థించితివి..మంచిదికానీ నరవానరుల తలుపవైతివే.. కారణం.

 

దశ:- (నిర్లక్ష్యంగానరులూ వానరులూ.. (నవ్వి)  ఆఁ అల్పజీవులు వారిచే అపాయంబును శంకించునంతటి భీరువు కాడీ దశకంఠుడుఅరివీర భయంకర దోర్దండ పరాక్రమోపేతుల నుక్కడగించు వరంబులు మీచే బొందియుండ వారేంత వారి బలమెంతవారు మావైపు కన్నెత్తి చూడ సాహసింతురే.

 

బ్రహ్మ:- (తలయూపుచూమంచిది..దశకంధరా.. మంచిది.

 

(తెరవాలును)

నాల్గవరంగము.

 

(తెర ముందే నారదుని పాట)

 

చరణము-3

 

దశకంధరునీ తపము ఫలించి

అసురన్వయమును గావనెంచగా

మాతామహుడౌ సుమాలి చెంతకు

రసాతలమునకు బయలుదేరెగా.........../నీరద/

 

(తెర తొలగును)

(సుమాలిప్రహస్తుడు ఆసీనులై వుంటారు)

 

నారద:-(ప్రవేశిస్తూనారాయణ... నా..(తన్ను తాను అదుపు చేసు కొనును)

 

సుమాలి:- నారదమునీంద్రులకు అభివాదములు.

 

నారద:- విజయోస్తు.

 

ప్రహస్తుడు:- (నమస్కరించిదయచేయండి మహర్షీయీ ఆసనము నలంకరించండి.

 

నారద:- (కూర్చొనిసుమాలినాయకానీ శ్రమ ఫలించిందయ్యానీ దౌహిత్రుడు దశకంఠుడు తపమున బ్రహ్మను మెప్పించి అమోఘ మృత్యుంజయ వర సంపన్నుండైనాడుయీ శుభవార్త ముదుగా మీ కెరిగింప వచ్చితిని.

 

సుమా:- (సంతొషముతోఆఁ నామనుమడు తపమున సఫలీకృతుడై బ్రహ్మచే అమోఘ వరములు బడసెనాఎంతటి శుభవార్తమహర్షీనా ఆనందమునకు మేరలేకున్నది.

 

నారద:- ఒక దశకంఠుడే కాదు విభీషణ కుంభకర్ణులు కూడా అజుని మేప్పించి వరముల బొంది సంతసమున రసాతలము జేరనున్నారు.

 

సుమా:- మహర్షీనేతికి నాకన్నకలలు ఫలించు సమయ మాసన్నమైనది.

 

:  పెంచితి పెద్దజేసితి నభేద్య మహారణ విద్యలన్నిటన్

        మించగ జేసితిన్మిగుల మేలగు దీక్షల బ్రహ్మదేవు మె

       ప్పించివరంబులన్ బడయ బ్రేరణనిచ్చితి పంక్తికంధరు

       న్నంచిత సత్వు జేసితసురాన్వయ మెంతయు మెచ్చ నిచ్చలున్.

 

ప్రహస్త:- మునీంద్రాఇది మా రక్షోవంశమునకంతటికిని సంతోషకరమైన వార్త .. నీ ముద్దులమనవడు అంతటి మొనగాడేనని నేనెప్పుడో తలచితినిఅసురనాయకామీ సుమాలి నామధేయము సార్థకమైనదిక్షీణదశ వహించిన అసురాన్వయారామమును పెంచి ప్రబలముచేసిన మీ జన్మ ధన్యమైనది.

 

చం:  నిలచితిరయ్య మీరు కడు నిమ్న దశన్ స్వజనంబుగావగన్

          తలచిరయ్య దైత్యుల ముదంబె మనంబున వీడ కెన్నడున్

         వలచితిరయ్య కష్టముల వంశముగావగ నెల్లవేళలన్

         తలపగ మాలివైతివి సదామముగాచి సుమాలి నాయకా.

 

నారద:- ఔను ప్రహస్తానీవు నిక్కము బల్కితివిసుమాలినాయకారుద్రదేవుని త్రినేత్రములనందగు మీసోదర త్రయము లోకప్రసిద్దముపక్షపాతియైన విష్ణువు వేధించి వెంటాడి మీసోదరులైన  మాలిని నిష్కారణముగా వధించిననాటినుండి సర్వమునూ నే నెఱుంగుదును.

 

సుమా:- ఔను ఆ విష్ణువు మా స్వదేశమైన లంకలో మమ్ముల నిలువనీక వెంట కష్టముల పాల్జేసెనుకాలము కలిసిరాక మేము కుటుంబసమేతముగా లంకను వీడి రసాతలమునకు తరలి రావలసి వచ్చినదినా లంకను నే నెన్నటికినీ మరువలేను.

 

శా:  శ్రీలంకానగరంబు రాక్షసులకున్ శ్రేయబు గూర్పంగ శ్రీ

         కైలాసంబునకున్ సమంబగు విధిన్ గట్టించి దట్టించి శ్రీ

        శైలాధీశు కృపన్ మహామహిమలన్ సాధింప సంప్రీతిమై

        కాలం బెంతయు సానుకూలమయి మా కయ్యెన్ జయం బీధరన్.

 

నారద:- ఔనౌను.అట్టి మీ లంకాసామ్రాజ్యమును మీకు కాకుండా చేసి విష్ణువు చాలా అన్యాయము చేసె ననక తప్పదు.

 

ప్రహ:- ఆ గరుడగమనునకు మనపై అకారణ ఆగ్రహమెందుకోగదా!

 

సుమా:-అతనికి మనము చేసిన యెగ్గేమికలదుసురలకూ మనకూ సరిపడదుగనుకసురపక్షపాతము వహించి మనపై శత్రుత్వము వహించె.

 

                   ఆ:వె:   ఓర్వలేని సురలు ఒక్కటై హరి జేరి

                               కానిపోని కల్ల కథలుజెప్పి

                               మనసు విరిచి హరిని మాపైకి దోలిరి

                               నీతి గలదెచేపుమ! నిర్జరులకు.

 

ఆ దేవతలమాట విని విష్ణువు మనపై పగబూని దండెత్తివచ్చె.

 

:వె;  గరుడవాహనుండు కడువేగ పైవచ్చి

            అసురయోధవరుల హత మొనర్చి

            నిలువనిడ లేని నిర్భాగ్యులను జేసి

           లంక విడువజేసె లావు జెఱచె.

 

ప్రహ:- ఇక వారి ఆట కట్టుఆ విష్ణువును సైతమూ యెదిరిన్చగల ధీరుణ్ణి ఇన్నాళ్ళకు మనము పొందగల్గితిమి.

 

సుమా:- ఔనుమన దశకంఠుడంతటి సమర్థుడేవాడిపైనే మన  ఆశలన్నీ నిలుపుకొన్నానుఎంతో కష్టనిష్టురములకోర్చివ్యయప్రయాసల భరించి విశ్వకర్మ చేత అత్యంత సుందరముగా నిర్మించుకొన్న లంకాపురిని తిరిగి ఆక్రమించి ఆనందము చేకూర్చగలడని నా విశ్వాసము.

 

నారద:- అసురనాయకా!

 

తే:గీ;  నిజము నీవాంఛ నెరవేర్చు నీ మనుమడు.

             లంక తాగెల్చు పోగొట్టు సంకటముల

             కల్ల గావయ్య,  మీకన్న కలలు పండు

           పూర్వవైభవ స్థితులింక పొందగలవు...

 

మీ దౌహిత్రుడు యీ పాటి మీ కోరిక తీర్చకపోడుశుభం.. ఆఁ ఏక్షణమున నైనను మీ మనవడు మీవద్దకు రావచ్చునునేనిక వేళ్ళివచ్చెద.. నారా...(నాలుక కరచు కొని నిష్క్రమించును.సుమాలీప్రహస్తులు నవ్వుకొందురు)

 

ప్రహ:-ఈ నారదుడు మన వద్ద హరిని నిందించుట కేవలమూ నటన.అతడు మహా హరిభక్తుడు.

 

సుమా:- నిజమే... కానీ మన దశకంఠుడు...

 

ప్రహ:-  ఆఁ... వార్త చేరవేయుటలో యే అబద్దమూ ఉండదుదశకంధరుని తపోవిజయమును యే మాత్రమూ సందేహించ పనిలేదువార్త చేరవేయుటలో నారదుని మాట నిత్య సత్యము.

 

(బయటినుండి--రాక్షసనాయకామీ దౌహిత్రుడు దశకంధరుడు తపోవనము నుండి   విచ్చేసి మీ దర్శనమునకై వేచియున్నారు)

 

సుమా:- (సంతోషముతోవెంటనే ప్రవేశముకల్పిచండి.

 

దశకంఠుడు:- (వచ్చిఅసురాన్వయసంరక్షణాదీక్షాదక్షులూ అవక్రవిక్రమోపేతులుమన్మామాతామహులూ నైన సుమాలీనాయకులకు ఇవే దశకంధరుని శతకోటి ప్రణామములు.

 

సుమా:- శుభమస్తురా నాయనా రానీ రాకకోసమే మేము వేయి కనులతోవేచియున్నాముసౌఖ్యమేకదా!

 

దశ:- మీ అమోఘ ఆశీర్వాద బలమువలన మా కన్నీ శుభములే మాతామహా! (ప్రహస్తుని నైపు తిరిగిమామా! (అంటూ కౌగిలించుకొనును)

 

ప్రహ:- పంక్తిహంధరాఇప్పటివరకు మీ తపోవిజయములను నారదమహర్షి వల్ల తెలిసికొని ఆనందపరవశులమైతిమి.

 

సుమా:- ఔనువిరించిని మెప్పించి అమోఘ వరములను బొందినందులకు మాకానందముగనున్నది.

 

దశ:-తాతాబ్రహ్మ వరప్రసాదితుడనగు నేను జరామరణముల కతీతుడనుఅజేయుడనునాకిక చతిర్దశభువనములలో యెదురు లేదు తాతా యెదురు లేదు.

 

ప్రహ:- మహదానందము దశకంధరా మహదానందము.

 

సుమా:- ఇన్నాళ్లకు మా కన్న కలలు నీ ద్వారా సఫలీకృతము చేసుకోగలననే ధైర్యము కలిగినది నాయనాఈ శుభఘడియ కోసమే నేనిన్నేళ్ళు నిరీక్షించితిని.

 

దశ:- సెలవీయండి మాతామహానానుండి మీ రేమహత్కార్యము నిర్వహింప నెంచితిరో వెంటనే సెలవిండుతప్పక నెరవేర్చెదను.

 

సుమాలి:- విశ్వకర్మ నిర్మితము సాక్షత్తు కైలాససమమూనైన లంకారాజ్యము మన అధీనమునకు రావలెతోయధి పరిఘయై దుర్భేధ్యమూఆయతస్థితి త్రికూట మధ్యమున నొప్పారునదియైన లంక నాకు కావలెపసిడికోటల,  ప్రభాసిత రత్నవిశదచిత్రములైన వివిద సౌధముల నలరారు లంక నాకు కావలెభర్మనిర్మిత సాలభంజికాకలిత నిర్మల కలధూత నిబిడ హర్మ్యముల లంక నాకు కావలెమహనీయ హాటక మణిగోపురముల నలరారు లంక నాకు గావలె...

 

దశ:- ఏమిటి మాతామహామీరంటున్నదిలంకనేమిటీ నేను జయించడమేమిటీమనమాక్రమించుటకూజయించుటకూ అదేమైనా శత్రురాజ్యమా?

 

సుమాలి:- అది శత్రురాజ్యమామిత్రరాజ్యమా అన్నదికాదు ప్రశ్న,  నాకు లంక కావలెఅది నా చిరకాలవాంఛ.

 

దశ:- లంక చాలా అందమైనది.బహుశా మీరు అందు నివాసమేర్పరచుకొన నెంచితిరి కాబోలుమంచిదిమా అన్నగారితో ఒకమాటచెప్పి,  అందుకు వలసిన యేర్పాట్లను వెంటనే గావించెద.

 

సుమాలి:- అక్కరలేదు.ఒకరి దయాదాక్షిణ్యములతో నే నక్కడ జీవించ నక్కరలేదుమొదట ఆ కుబేరుని పారద్రోలి లంక నాక్రమించుఅదియే నాకు కావలసినది.

 

దశ:- తాతామి కోరికలోని ఆంతర్యము నా కర్థము కావడములేదునిష్కారణముగా నా సోదరునిపై దండెత్తి బాధించమందురాపెద్దవారైన మీరనవలసిన మాటలేనా యివి?

 

సుమాలి:- ఇందులో అక్రమమిసుమంతైననూ లేదులంక మాదిఅది మా స్వయంనిర్మితముదానిని తిరిగీ మన అధీనములోనికి తెచ్చుకొనుట యే పరిస్థితులలోనూ అధర్మమనిపించుకొనదు.

 

దశ:- తాతానాకేమీ ఆర్థము కావడములేదుమీనిర్ణయములోని పుర్వాపరాలేమిటో నాకు తెలియడములేదు.

 

సుమాలి:- ఆ వివరాలు మీమామ ప్రహస్తుడు నీకు తెలియజేస్తాడువిను. , విని మా కలలు కల్లలే జేస్తావో లేక నిజమేజేస్తావో నిర్ణయించి చెప్పు.(సుమాలి నిష్క్రమిస్తాడు)

 

దశ:- (ప్రహస్తునితోమామాఅరమరికలు లేకుండా విషయ మేమిటో నాకు వివరించి చెప్పుఅటు తమ్ముడాయని ప్రేమతో పలుకరించు అన్నఇటు నన్న పెంచి పెద్దజేసి నా  పైననే ఆశలునింపుకొన్న తాతనా మనసు డోలయమానమై యెటూ తేల్చుకో లేక పోతున్నది.

 

ప్రహస్త:-దశకంధరాతేల్చుకోవడమంత కష్టమైన పనేమీకాదుఆ లంకానగరము అక్షరాలా మీ మాతామహులదివారు సోదరసహితులై తపమాచరించి బ్రహ్మను మెప్పించి అజేయులై విలసిల్లిరివిశ్వకర్మను రావించి తమకు నచ్చిన రీతిని శింశుపాశోకవృక్ష సంయుతమైన ఆరామములతో వెలుగొందు లంకను స్వతహాగా నిర్మింపజేసిరి.

 

దశ:- మరేలవారు లంకను పరాధీనమొనర్చిరిఇంతకూ మా సోదరుడెట్లు లంకాధీశుడయ్యెను.

 

ప్రహ:- వివరిస్తానుమీ మాతామహుల వైభవము సురలకు కంటక ప్రాయమైనదివారి ఆధిఖ్యమును మనవారు అణచివైచిరిఅందులకు వారు వ్యధనొంది వారు విష్ణువునాశ్రయించిరి.

 

దశ;- ఆవిష్ణువు వారి అండ నిలిచెనా?

 

ప్రహ:- చక్కగానూహించితివిగరుడవాహనుడై లంకపై దండెత్తి మాయాయుద్దమున మా తండ్రులను కలవరపరచి వారిలో మద్యముడైన మాలిని హతమార్చెనుమిగిలిన ఇద్దరూ విష్ణువు నెదిరించి చాలాకాలము పోరిరికానీ రానురాను స్వపక్షము క్షీణదశనొందుటచే కొంత యోచించి మా తండ్రి అగ్రజుడైన మాల్యవంతుని వెంటనిడుకొని యీ రసాతలమునకు తరలివచ్చి తలదాచుకొనిరి.

 

దశ:- ఆహాసరే.. మరి మాఅన్నగారికి యీ లంక యెట్లు లభించెను.

 

ప్రహ:- ఏమున్నది.. జనసంచారము లేని లంకను మీ అన్న కుబేరుడు ప్రవేశించి తన రాజ్యమును స్థాపించు కొనెను.

 

దశ:- అట్లయిన అతని తప్పేమున్నది?

 

ప్రహ:- తప్పులేకపోవచ్చునుకానీ బలపరాక్రమవంతులైన తమ మనుమలూకొడుకులూ రాజ్యరహితులై యుండుటమీదుమిక్కిలి మీ సవతితల్లి బిడ్డడు సంపన్నడైయుండుటఆ సంపదలకు మూలము తమ చేజేతులా నిర్మించిన లంక యగుటసుమాలీనాయకులకు సహింప వీలుగాకున్నది.

 

దశ;- అర్థమైనది మామాఅర్థమైనదిఇటు నా యోగక్షేమములరసి పెంచి పెద్దజేసిన తాతప్రియమైన కోరికఅటు ప్రేమాదరములకు నెలవైన అన్న.. ఔరాఎంతవిషమ పరిస్థితిమామా దయచేసినన్నుకొంత ఆలోచించు కొననిమ్ము.

 

ప్రహ:- దశకంధరాఆలోచించు ఆలోచించేముందు నేనికొక్క విషయముకూడా వివరిచవలసియున్నది.

 

దశ:- ఏమిటది?

 

ప్రహ:- అదినీ జన్మకుగల మూలముముఖ్యముగా నీవు తెలిసికోవలసిన విషయము.

 

దశ:- !.. చెప్పండి.

 

ప్రహ:- నాయకులు సుమాలి వారికి పుష్పోత్కటకైకసికుభీనసి యను మువ్వురు తనయలుఅందు పరమోత్తమురాలు నిను గన్నతల్లి కైకసిఆమె ద్వారా మీ తాత తన పగ తీర్చుకోదలచెనురాక్షసలోక సంరక్షణార్థము ఆమెను వేడుకొన్నాడు.

 

దశ:- ఏమని?

 

ప్రహ:- మహాతపశ్శాలితేజోవిరాజితుడునగు విశ్రవోబ్రహ్మ నెటులైనా వరించి అతని వలన బ్రహ్మతేజోవిరాజితుడై రాక్షసులకు ఉచ్ఛస్థితి కలిగించు కొడుకును కని యిమ్మని.

 

:వె:  దనుజకులము గాచు దక్షుడొకడు కలుగ

            విశ్రవు సతివౌచు వెలయు మనిన

           తండ్రి యాఙ్ఞ దాల్చి తనయుని నిను గని

           నీదు తల్లి యిచ్చె నిన్ను మాకు.

 

దశ:- (స్వగతంనాజన్మకు ముందే నాపై యిన్ని ఆశలు పెంచుకొన్నారే...

 

ప్రహ:- దశకంధరాచెప్పవలసిన విషయము లన్నియు చెప్పితినిఇక నీ నిర్ణయముపై మా అదృష్టము ఆధారపడియున్నది.  బాగుగా ఆలోచించి నీ నిర్ణయము తెలుపు.(అని ప్రహస్తుడు నిష్క్రమిస్తాడు)

 

దశ:- (ఆలోచనలో మునిగి పొయి చింతాక్రాంతుడైఏమిటి నా కర్తవ్యమువిరించివరములకై తపించునాడైనా యింత మనఃక్లేశము పొందనైతినే.. మాతృపక్షమాపిత్రుపక్షమా?  ఎటు... ఎటు.. అన్న నిర్జనప్రదేశమైన లంకను బాగుచేయించుకొని అనుభవించుకొనొచున్నాడుఅతనిని ఉన్నపాటున నిర్దాక్షిన్యముగా లంకను విడిచి వెళ్ళమనుటెట్లు...

 

:  ఆదరమొప్ప బిల్చు నను నంకము జేర్చుక కౌగిలించు నా

       సోదరుడీతడంచు కడు సూనృతవృత్తిని గారవించు నా

      వేదన సంతసంబు తనవేనని యెంతయు కుందు బొంగు నా

      వేదన కల్గెనాకు దయవీడి చరించగ నేమి చేయుదున్.

 

మాతాతల నా  హరి హింసించెనని వినియూ నా కాతనిపై నిసుమంతైనా క్రోధము కలుగకున్నదిపైగా శ్రీహరిపై నాకు భక్తి ప్రేమలే కలుగుచున్నవిఈ విడ్డూరభావము నా మనమున కల్గుటకు హేతువేమిటో తెలియకున్నదిఇప్పుడు నా కర్తవ్యమేమిఔరాఎంతటి విషమ పరిస్ఠితి.

 

కం:  దండింపవలయు భ్రాతను

         పండింపగ తాతకలలు పాపంబకన్

         నిండున్ మనమున ఖేదము

         పొండంచు గదిమి సుమతుల పోడిమి చెరుపన్.

 

(ఆకాశవాణి వినిపిస్తుంది)

 

ఆకా:- పంక్తికంధరా!

 

దశ:- ఎవరూ?..(ఆకాశం వైపు చూచును)

 

ఆకా:- నేను అభ్రభారతినిఅశరీరవాణిని..

 

దశ:- !.. ఆకాశవాణిఏమిటినీ సందేశము?..

 

ఆకా:- దశవదనానీవు సమన్యుడవు కావు "జయుండనుశ్రీమన్నారయణుని ద్వారపాలకుండవునీ తమ్ముడు కుంభకర్ణుడు నీ తోటి దవ్వారికుడు "విజయుడుసనకసనందనాది మునివరుల శాపమున రాక్షసులై జన్మించితిరి.

 

దశ:- నిజము కావచ్చునుఅందుకే నాకు నారయణుడన్న అవ్యక్తభక్తిభావము కలుగుచున్నది.

 

ఆకా:- సందేహించ పనిలేదు దశకంఠానీవు నిక్కువముగా జయుడవే.. గత జన్మమున హిరణ్యకశిపుడవై మునుల శాపమును ఒకవంతు అనుభవించి నరహరి నఖఘాతముల జన్మ పరిసమాప్తము గావించితివి.

 

దశ:- ఆఁ!...

 

ఆకా:- దశకంఠాఇంకెన్నాళ్ళు కాలము వృధా చేయుదువుహరినాహ్వానించుజన్మఫలమును త్వరగా అనుభవించుతొల్లింటి నీ విష్ణుసాన్నిద్యమునకు దారి సుగమము చేసుకో...

 

దశ:- నా కర్థమగుట లేదు నేనేమిచేయుదును.

 

ఆకా:- పిచ్చివాడావైరానుబంధమునకన్నా సులభమార్గము లేదని నీకు తెలియదాకానిమ్ముహరికయిష్టము కలిగించు కృత్యములకు పాల్పడుసాధువుల బాధించు నిరపరాధుల పీడించువారి ఆర్తనాదములే హరిని క్రిందకు దించగలవు నీ కార్యము సఫలీకృతము గావింప గలవు.

 

ఆకా:- కైకసీనందనాదేవగంధర్వయక్షరాక్షస కిన్నెరకింపురుష నాగులనుండి భయములేకుండు నట్లు వరముల బడసితివికానీ నరవానరుల విస్మరించితివి.

 

దశ:- కాదు.. అల్పులని వారిని గణింపనైతిని.

 

ఆకా:- హరియవతరించుటకు ఇక అదే మార్గముఇక ఆ దారిని త్వరగా యేర్పరచుకోతద్వారా తరించు.. తరించు.. తరించు....

 

దశ:- ఇప్పుడు నా  కర్థమైనదినా జన్మకు పూర్వాపరములెల్ల  తెలియ వచ్చినవిఇక నేను తరించుటకుగల దగ్గరి మార్గము సుజన భంజనముఅది మత్సహోదరుడు కుబేరునితో మొదలుఅది పిత్రుపక్షమునకయిష్టముమాతృపక్షమునకిష్టము గావచ్చునుఅయిననేమి  నా లక్ష్యమే నాకత్యంత ముఖ్యముశ్రీహరిని నా వైపు ఆకర్షించుటకు ఇదే సరియైన మార్గమునేటి నుండి నా స్వామి నారాయణుని హృదయమున నిలిపి కర్కశత్వమును మాత్రమూ బహిర్గతమొనర్చెద నారాయణా నాపాలి దైవమాఇకనీవే నా కథానాయకుడవునా యీ జన్మకిక భరతవాక్యమును పలికి నన్ను నీ సన్నిధికి చేర్చుకో దేవానా మనోభీష్టము నేరవేరునట్లు నన్ననుగ్రహించు... ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ.(ధ్యానంలో కూర్చొనునుకాసేపటికి ప్రహస్తుని ప్రవేశం)

 

ప్రహ:- (వచ్చిదశకంధరులు యే నిర్నయమునకు వచ్చిరో మరి?.

 

దశ:- మామాప్రహస్తామీ సలహాయే మేము పాటించ నెంచితిమిఅసురనాయకుల ఆఙ్ఞ శిరసవహించ నెంచితిమిఇక నేడే  మీరు తరలి వెళ్ళుడుకుబేరునకు మామాటగా నెరిగింపుడు.

 

ప్రహ:- రాయభారమా!

 

దశ:- ఔను.. వెంటానే లంకను మాకప్పగించి బయటకు నడువమని కుబేరునితో మామాటగా చెప్పుము.

 

ప్రహ:- కాదన్నచో!

 

దశ:- బలవంతమున బయటకు పంపవలసి వచ్చునని హెచ్చరించి మరీ రమ్ము.

 

ప్రహ:- సంతోషము.. చాలా సంతోషముయీ విషయమిప్పుడే సుమాలీనాయకుల కెఱిగించివారికి కర్ణపేయము గావించి రాయబారము నెఱపెదసెలవు.

 

(తెరపడును)

 

 

ఆరవ రంగము

(ఆశ్రమ ప్రాంతము-నారదుడు గానచేస్తు ప్రవేశము)

 

పాట-చరణము 4

నారాయణనీ నామస్మరణము

మహదానందము పాప హరణము

ఆశ్రితపోషా అరవిందాక్షా

మునిజన హృదయ విహారీ హరీ

 

ఆహాఁ ఈ వనప్రాంతమెంత ఆహ్లాదకరమై యున్నదిఇక్కడ వెలసిన యీ ఆశ్రమము రమణీయముగానున్నదిమెన్నడునూ యీ ప్రాంతమున ఆశ్రమ మున్నట్లెరుగనుఏదో నూతన నిర్మానము కాబోలుబహు చక్కని రూప కల్పనవాస్తువిద్యానిపుణుని హస్తమిందున్నదని చెప్పకనే చెప్పుచున్నదివెళ్ళి పరికించెదగాక.(రంగస్థలము దాటి వెళ్ళును-మండోదరి పూలుకోయుచూ పాటపాడుతూ ప్రవేశించును)

 

మడోదరి:-పాట

శివపూజలుసేయ తలచితినోలేదో

తలయూపి సమ్మతి తెతిపినదీ వని

చిన్నిపూవులని మముమరువకుమని

సత్వగుణమునకు సామ్యము మేమని

మా సితవర్ణము స్వామికి ప్రియమని

కోరిపిలిచెనా తుమ్మి పూవులూ........../శివ /

 

మాదళములు ఆ -  మహదేవునకూ

మరిమరి ఇష్టముతీసుకపొమ్మని

అర్చన చేయగ తగుదుము మేమని

కొమ్మలు వంచెనా -  బిళ్వ భూజములు../శివ/

 

శివుసిగ నెక్కెడు ఉత్సాహంబున

కొలనిదరి వరకు తామేజరుగుచు

మముగొని పొమ్మని తొందరచేయుచు

ననురారమ్మనె తెల్లతామరలు..../శివ/

 

నారద:- (ప్రవేశిస్తూనారాయణ..నారాయణ..రారాయణ...

 

మయుడు:- (గ్రంధ పరిశీలనము ఆపి అరుగుమీదనుండి లేచినారద మునీద్రులకు ప్రణామములు.మీరాక మాకు మహదానందకరముమీపాదస్పర్శచేమా ఆశ్రమము పునీతమైనది. (అరుగు చూపించగా కూర్చొండును)

 

నారద:- (ఆశ్చర్యంగామయశిల్పీతమరు.. ఈ ఆశ్రమమున...

 

మయుడు:- నిజమే.. ఈ మయుడు ఇక్కడ ఆశ్రమవాసము చేయుటేమిటని తమకు ఆశ్చర్యము కలుగుట సమంజసమేమహాత్మా తమకు తెలియనిదేమున్నదివిధివిలాసముఎవని  జీవితమున ఎప్పుడు యే మార్పులు సంభవించునో యెవరి కెరుక.

 

నారద:- మహాశిల్పీఏమిటి మీ నిర్వేదముఇంతకూ మీకేమైనది?

 

మయ:- ఏమున్నది మహర్షీ నా భువననిర్మాణ కళాచాతుర్యమునకు మెచ్చి దేవతలు నాకు "హేమయను అప్సర కాంతను కానుకగానిచ్చి సత్కరించిరినేనునూ మహదానంద భరితుడనై హేమను నా బహిఃప్రాణముగా చూచు కొంటినిమా ప్రేమకు పంటగా మండోదరి యను కుమార్తెనుమాయావిదంధుభి యను పుత్రులను బడసితిమిచీమకైనను హాని చేయని నాపై సురల కెందుకు కోపముగల్గెనో యెరుగనునా హేమను వారు తీసుకొనివెళ్ళిరిదేవర్షీనామనసు గాయపడినదినాకు అన్నాహరములు సహించుటలేదుఇక నేను అచ్చట నుండాజాలక ఇటు జేరియీ ఆశ్రమమును నిర్మించుకొని నా కుమార్తెతో ఇక్కడ జీవించుచున్నాను.

 

తే:గీ;  పెనుజడత్వము తొలగించి ప్రేమ నేర్పి

             మధురభావ మదేదొ నా మదిని నింపి

వలచి వలపించి నా హేమ వదలి పోయె

బ్రతుకు భారంబుగామారె భవిత మాసె.

 

ఇప్పుడు నాకింక యే ఆశయూ లేదునా ముద్దుల బిడ్డకు తగిన వరుని గూర్చి నిశ్చింతగా తపమాచరించుకొంటూ శేషజీవితమును ప్రశాంతముగా గడిపెద.

 

నారద:- చక్కని నిర్ణయముమయమహాశయా!

 

తే;గీఅరయ సుఖదుఃఖ మిశ్రమం బౌను బ్రతుకు

           కాదు ఒకరీతి గడవంగ కాలమెల్ల

           మనసు దిటవొనర్చుక నిక మనగ వలయు

          ధాత వ్రాతను చెరుపంగ తరమె చెపుమ.

 

మయ:-(పూల సజ్జతో వస్తున్న మండోదరిని చూపిస్తూమహర్షీ నాచిన్నారి తల్లి మండోదరిని ఆశీర్వదించండి.

 

మండోదరి:- మునీంద్రులకు వందనములు.

 

నారద:- శుభమస్తుశీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు.

 

మయ:- అమ్మా మండోదరీమునీంద్రుల సేవ సామాన్యులకు దుర్లభమునీవీ  దేవర్షిని సేవించు తల్లీనేనిప్పుడే ఫలహారముల సమకూర్చెద. (వెళ్ళును మండోదరి కలశముతో నీరు తెచ్చి నారదుని పాదములు కడిగి తలపై చల్లుకొనును తన చెరుగుతో పాదములద్ది నమస్కరించును)

 

నారద:- కల్యణీనీ భక్తికి కడుంగడు సన్తసించితిని.(కాసేపు యోగముద్రలో వుండి సర్వము గ్రహించినీవు పరమ పవిత్రామతల్లులలో అగ్రగణ్యవు కాగలవుఈ పుడమి నిల్చునంతకాలము నీ పేరు నిలచివుండగలదులోకప్రఖ్యాతుడుమహిమాన్వితుడుమహాపరాక్రమవంతుడు నీకు భర్త కాగలడువీరపత్నిగా,  వీరమాతగా నీవు జగద్విఖ్యాయిని గాంచగలవు...లే తల్లీ..(ఇంతలో మయుడు ఫలములను దెచ్చి నారదునకు అందించును.) మయమహాశయానీ యీప్సితము సఫలముకానున్నది నీ కుమార్తె వీరపత్నిగా లోకప్రసిద్దము గానున్నదిమీకు శుభం కలుగుగాకఇకనే పోయివత్తును నారయణ...

 

మయ:- మహర్షీమీ ఆశేస్సులే మాకు రక్ష.

 

నారదుని పాట:

అనిల తరళ కువలయ నయనేనా!

తపతిన సా కిసలయ శయనేనా!

యారమితా వనమాలినా!

 

యారమితావనమాలినాహరీ

యారమితావనమాలినా!

 

వికసిత సరసిజ లలిత ముఖేనా

స్ఫుటుతినసా మనసిజ విసిఖేనా

అమృత మధుర మృదుతర వచనేనా

జ్యలతినసా మలయజ పవనేనా!....../యార/

 

(తెర వ్రాలును)

 

 

 

ఆరవ రంగము

 

(విశ్రవోబ్రహ్మ ఆశ్రమమువిశ్రవుడు ఆశీనుడై వుండునుకుబేరుడు ప్రవేసించును)

 

కుబేరుడు:- పితృదేవులకు వందనములు.

 

విశ్రవసుడు:- శుభమస్తులంకనుండి యెప్పుడు కుమారారావడం?

 

కుబే:- ఇప్పుడే తండ్రీ!

 

విశ్ర:- ఏమిటినాయనా అట్లున్నావుఎప్పుడు కళకళ లాడుతూ వుండే నీ ముఖారవిందమీ నా డెందుచేతనో విషాదచ్చాయావృతమై యున్నది.

 

కుబే:- ఏమని చేప్పమందువు తండ్రీ..

 

విశ్ర:- ఏమిటి కుమారానీకొచ్చిన కష్టమువిరించి వరప్రసదితుడవువిశదోరు యశో మహావీరుడవు హృతాగ్నిశిఖ తేజుడవువాసవసమవర్తివరుణులతోడ వాసికెక్కినవాడవుపుష్పకవిమాన గమనుడవులోకపాలనా ధక్షుడవునీకు కల్గిన కష్టమేమి నాయనా?

 

మిక్కిలి సంపదల్ గలిగి మేలగు లంకకు రాజువయ్యుయున్

     యెక్కడి కష్టమయ్య నిను నెవ్వరు బాధలు పెట్టిరయ్య నీ

     కెక్కసమయ్యి రెవ్వరిక యేర్పడ జెప్పుము లోకమాన్య నీ

    బిక్కమొగంబు జూడ పరపీడల నోచ్చితి వంచు దోచెడిన్

 

కుబే:- తండ్రీనా వ్యధలు మీకు గాక యెవరికి విన్నవిచు కొందును?

 

సఖుడ సమస్తజీవులకుసంపదలకే నధినాదుడన్ మహా

      మఖముల నిర్వహించి శుభమంత్రప్రభావళి శుద్ద గాత్రుడన్

      మఖపతి భక్తుడన్ సుజన మైత్రిని గోరు సధర్ముడన్ పితా

      సుఖమది లేనివాడ వివశుండ విశేషము లెన్ని గల్గినన్.

 

తండ్రీ.. లంకాపట్టణము పరాధినమౌ కాల మాసన్నమైనది.

 

విశ్ర:- ఎవరా దురాక్రమణాపరులు?  నిన్నెదిరిచ సాహసించిన ఆ దుండగులెవరు?

 

కుబే:-

 

:వె:  తమ్ముడతడునాకు తనయుడయ్య తమకు

            బ్రహ్మ వరములండి బలము నంది

           పంక్తికంధరుండు పరిపరి విధముల

           భ్రాత యనక నన్ను బాధ వెట్టు.

 

విశ్ర:- ఏమంటివిదశకఠుడావాడింతపనికి పూనుకొనెనా?

 

కుబే:- ఔను తండ్రీ.. కమలాసనునివల్ల కడు భీకర వరముల వడసి బలగర్వితుడై నన్ను బెదిరించుచున్నాడు.

 

విశ్ర:- ఏమని వాడి బెదిరింపు?

 

కుబే:- నిన్ననే రాక్షసామాత్యుడు ప్రహస్తుడు లంకకు వచ్చి వెంటనే లంకను విడిచి వెళ్ళిపోవలసినదిగా నాకు దశకంఠునిమాటగా హెచ్చరించి పోయెను.

 

కం:  లంకారాజ్యము నేలగ

         నింకేమాత్రము తగదను నిప్పుడె నన్నున్

        లంకన్ విడుమను విడువక

        బింకంబున నిలుమను రణభీరువు గాకన్.

 

విశ్ర:- లంకవాడి కెందుకట?

 

 

కుబే:- అది వారి తాతలదట.కనుక వారి కప్పగించి వెళ్ళవలెనట.

 

విశ్ర:- ఔరాఈ దనుజులు వాని మనసును విరిచిరి కాబోలుఏమి వీరి కుతంత్రముమనవ్రేలితో మనకన్నే పొడవనెంచిరి గదా!

 

కుబే:- (దశకంఠుని రాకను గమనించితండ్రీ.. అడుగో తమ్ముడు దశకంఠుడిదే వచ్చుచున్నాడు.

 

విశ్ర:- కుమారా.. మంచి సమయమునకే వాడిచ్చటకు వచ్చుచున్నాడునీవా కుటీరమున వేచియుండుమువానికొకింత బుద్ది చేప్పిచూచెదను.

 

కుబే:- అటులనేకానిమ్ము తండ్రీ! (నిష్క్రమించును)

 

దశ:-(ప్రవేశించిపిత్రుదేవులకు వందనములు.

 

విశ్ర:- ఊఁ..నీ రాకకు కారణ మేమిటో?

 

దశ:- తండ్రీ.. ఏమా నిష్ఠుర వాక్కులు?  తనయులు తండ్రి దర్శనమునకై వచ్చుటకు కూడా కారణముండవలయునా?

 

విశ్ర:- మంచిది నీ కింకను చిన్నాపెద్దాయన్న వివక్ష యున్నందులకు చాలా సంతోషము.దశ:- మీరేలనో యీనాడు విడ్డూరముగా మాట్లాడుచున్నారు.

 

విశ్ర:- విడ్డూరముగాక నీవు చేస్తున్న దేమిటి?

 

దశ:- ఏ విషయమున తండ్రీమీకు మాపై యాగ్రహము.

విశ్ర:- ఇంకే విషయమునీవు మీ అన్న కుబేరుని బెదిరించుచున్న విషయము.

 

దశ:- ఓహోఅది మీ వరకూ వచ్చిచేరిందన్నమాటఇందులో దాపరికమేమున్నది తండ్రీనేనతనిని కేవలమూ బెదిరించుచున్నాని మీరనుకొన్న అది పొరబాటు కాగలదు.

 

విశ్ర:- అయితే కుబేరుడు చెప్పినది అబద్దమందువా?

 

దశ:- నేనంటున్నది అదికాదుకెవలమూ బెదిరించుటకాదునిజముగనే లంకను వీడి మరీ వెళ్ళమనుచున్నాను.

 

విశ్ర:- ఇది నీకు తగని పని.

 

దశ:- ఏది తగని పనిలంక మా తాతలది అది వారి స్వయంకృషి వల్ల నిర్మించుకొన్నది.  వారి లంకను వారికి మర్యాదగా అప్పజెప్పకపోవడంతగని పనే ఔతుంది.

 

విశ్ర:- మరి వారు ఇంతకాలం కర్తవ్యతామూఢులై యెందుకున్నట్లు?

 

దశ:- కాలము కలసిరాక.. ఐననూ అవన్నీనాకనవసరంనేను వారి లంకను వారికిప్పించెదనని మాటయిచ్చితినికనుక నేను వెంటనే లంకను వశపరచుకోవలసియున్నదిమర్యాదగా మాటవినక పోయినట్లయిన సైనికచర్య అనివార్యమౌతుంది.

 

విశ్ర:- దశకంఠాబాగా ఆలోచించుదుష్టసాంగత్యము నిన్నీ దశకు తెచ్చినదిసోదరుని హింసించదగదు.

 

:వె;  బ్రహ్మవంశమందు ప్రభవించి ప్రభలొంది

           మేటివైన నీ కిదేటి బుద్ది

           వంశగౌరవంబు వాసిని బోనాడు

           క్రూర కృత్యమేల కొడుక నీకు.

 

దశ:- క్షమించండి తండ్రీ..నేను మాతామహుల కిచ్చిన మాటను వ్యర్థపరచలేను

 

విశ్ర:- అంతేనంటావానామాట వినవా కుమారా?

 

దశ:- నా నిర్ణయమునకు తిరుగలేదు తండ్రీ..

 

 

మత్త:  క్రూరుడన్నను భాతృ ద్రోహియు క్రోధియన్నను పాపి ధి

           క్కారి నీచుడు బ్రాహ్మణాన్వయ ఘాతకుండని దూరినన్

          వైరమెంచి మరేమి దిట్టిన వాంఛితార్థఫలంబు జే

          కూరగా నిదె లంకగెల్చెద కూల్చివేసెద శత్రువున్.

 

(అంటూ విసురుగా వెళ్ళిపోవునుకుబేరుడు ప్రవేసించును)

 

విశ్ర:- (కుబేరునితోవింటివిగదా వాని మాటలు .వాడు నీ కెట్లయినను అపకారము చేయకమానడుబ్రహ్మ ప్రసాదించిన వరములు వీని మదగర్వములను హెచ్చించినవి

 

కుబేరుడు:- ఈ విపత్కర పరిస్థితులలో నా కర్తవ్య మేమి తండ్రీ..

 

విశ్ర:-

 కలదు పవిత్ర శంకరునగంబున మేల్ కమనీయ రమ్య సు

       స్థలము మహత్వతత్వ మునిసంఘ సమాశ్రయ వీధి జాహ్నవీ

       జలకణసంయుతానిల ప్రసారప్రశస్థ మనోఙ్~ఝ సీమ నీ

       వలమట బాసి శాంతిగ శివానుమతిన్ నివసిచు మయ్యడన్.

 

శివుని నివాసమైన వెండికొండకు వెళ్ళుము.  అది నాగ గంధర్వ కిన్నెరుల విహారభూమివెళ్ళి ఆప్రాంతమును జేరికొనుము ఆ పరమేశ్వరుడు కృపాసింధువు నిన్ను తప్పక ఆదరించగలడుఅక్కడ పట్టణమును నిర్మించి అలక యని పేరిడి అందుండి నీ దిక్పాలకత్వమును నెఱపుము.

 

కుబే:- మీ ఆశీర్వాదబలమే మాకిక రక్షవెళ్ళివత్తును.(ఇద్దరూ నిష్కమిస్తారు సుమాలీ ప్రవేసిస్తూ)

 

సుమా:- రావయ్యా..అమాత్యశేఖరా.. ప్రహస్తాఇక ఆ పక్షి రూపము చాలు రా!

 

ప్రహస్తుడు:-(ప్రహస్తుడు వస్తూ)  తండ్రీ..మనమిక్కడ పక్షుల రూపమున వృక్షశాఖలపై నుండి సర్వమునూ  వింటిమి గ్రహించితిమిఈ తండ్రికా కొడుకేమిటోయేమో.. బాగా అర్థమైనదిమన దశకంఠు నెదిరించి నిలువలేమని యెఱిగిన విశ్రవుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించి కుబేరుని శంకరగిరికి పంపుచున్నాడు.

 

సుమా:- ఏమైననూ మనవాని నిజాయితీమాటపై నిలకడ కనులార గాంచితిమిఇక నాకు సంతృప్తి కలిగినది.దశకంఠుడు నా కలలను పండించనున్నాడు.

 

ప్రహ:- ఇకవచ్చిన పని పూర్తియైనదితండ్రీ ఇక్కడ మన ఉనికి క్షేమకరంకాదుపోవుదమా?

 

సుమా:- పద.. లంకలో రేపే మన తిష్టఈ విషయం సోదరుడు మాల్యవంతున కెరిగింపవలయునుఈ వార్త రాక్షసకులమంతటికీ పండువ తెచ్చినది.

(తెర వ్రాలును)

 

 

 

ఏడవ రంగము

 

(మయుని ఆశ్రమము చెంత వన ప్రాంతము)

 

దశ:-(ప్రవేసించిఆహాఈ ప్రకృతిసౌందర్యమెంత మనోహరముగా నున్నది.

సాలచందన చూత మధూకబిల్వ జంబూ వృక్షములతోడనూనాగ పున్నాగచంపక శతపత్ర మల్లికామతల్లికా సుమ భూరుహముల తోడనుకేకి కీర కింకిర కికి కిరీటి కపింజల కౌశికాది ద్విజ కలకలారావములతోను కళకళలాడుతున్నదిఒకింత యీ తరుచ్ఛాయల విశ్రమించెదగాక! (ఒకవైపునుండి బయటికి వెళ్ళును ఇంతలో మండోదరి వచ్చి అక్కడి చెట్ల పూలు గోయుచుండునుదశకండుఠుడు తిరిగీ ప్రవేశించిఆహా ఎవ్వతీ పూబోడి.(చెట్టుచాటుకు పోవును)

 

మండోదరి:- పాట..

 

మధుర మధురముగ మనసున నేవో

ప్రియభావనలూ పొంగి పొరలెనూ

 

నాచిరునవ్వుల కాంతుల కనుగొని/రుచిరములనుగని

కొండమల్లియలు విరబూసినవీ

నా పైటగాలికి పరవశమందిన

పూచిన తంగేడు పూలురల్చినవి......../మధుర/

 

ఆమని నేనని నా రాకనుగని

గండుకోయిలలు కూయని కూసెను

అందెల రవళిని మేఘనినదమని

కేకి ఫించమును -విప్పుచు కులికెను.......,/మధుర/

 

దశ:- (రెండడుగులు ముందుకు వేసి రంగస్థలం మీద కనబడుతూ తనలో తానేఆహాఁ సుందరీయేమి నీ యందము సర్వాంగసుందరమై  నా మనసున గుబులు రేపుచున్నది.(ప్రకాశముగా పద్యం పాడనారంభించును)

 

 

సీనిబిడంపు జిగితోడ నిండుపూగుత్తులే

        తనుమధ్య చనుదోయి తరచిచూడ

     నునుగెంపుగ్రక్కు నూతన పల్లవంబులే

        కనగ బాలామణి కరతలములు

     నెలమి బర్వెడునట్టి యలతీగియలవియె

        సుందరి బాహువుల్ చూడనిజము

     గడుబేరములవాఱు గండుతుమ్మెదచాళ్ళు

        కనువిచ్చి చూడంగ కాంతకురులు

 

:వెవిరియ బూసినట్టి సిరిమల్లె కాంతులు

           లేమమోముపైని లేత నవ్వు

          నవవసంత శోభ నళినాక్షి ప్రాయంబు

          కనుల పండువయ్యె కాంత సొగసు.

 

మండోదరి:- (దశకంఠుని చూచి భయపడిఎవరుఎవరు మీరు?  (దశకంఠుడు ఆమె చేయి పట్టుకొనును ఆమె విదిలించి విడిపించు కొనును అప్పుడు ఆమె పూల సజ్జ లోని పూలు యెగసి దశకంఠునిపై బడును)

 

దశ:- (చిరునవ్వు నవ్విలంకాదీశుడను దశకంధర నామధేయుడను సుందరీనీ సౌందర్యము వర్ణణాతీతము.నీ కంఠమాదుర్యము కిన్నెర కింపురుష గంధర్వాంగనలకు సైతము అబ్బినదికాదురానాదానివికానన్నానందింపజేయి(అంటూ ముందుకు నడచును మండోదరి భయపడుతూ వేనుకకు నడచును)

 

మండోదరి:- తండ్రీ.. రక్షించు... రక్షించు .

 

మయ:- (వచ్చి కత్తి దూసిదుర్మార్గుడానిలులేదేని నీ శిరస్సు నేలకొరగగలదుజాగ్రత్త!

 

మండోదరి:- తండ్రీ...(వచ్చి తండ్రి అక్కున జేరును)

 

దశ:- ఓఁ!.. సుందరీ...ఈతడు నీ పితరుడన్నమాట..

 

మయ:- నాసుతను బలాత్కరింప నెంచిన నిన్ను ప్రాణములతో విడువను. (కుమార్తెనుప్రక్కకు నెట్టి ఖడ్గముతో  ముందుకురుకునుదశకంఠుడు కూడా ఖడ్గముతో తలపడును)

 

నారద:- (వచ్చినారాయణ..నారాయణ..(అని ఇద్దరిని విడిపించిఆగవయ్యా మహాశిల్పీఆగుఅతడెవరనుకొంటివి విశవోబ్రహ్మ సుతుడూ,  సుమాలి మనుమడు.(దశకంఠుని వైపు జుచిదశకంధరాయీయన మీకు తెలియదామీతాత కోరికపై లంకను రమ్యముగా నిర్మించి యిచ్చిన మయశిల్పిమీ మధ్య వివాదమాతగదు తగదు.. ఎంతమాత్రమూతగదు.

 

దశ:- మహర్షీనేను వారితో వియ్యమంద నెంచితినే గాని కయ్యము నా అభిమతము కాదు.

 

నార:- అమ్మామండోదరీనీవు ధన్యురాలవుఈతడే నీకు తగిన వరుడు.(మయునితోమహాశిల్పీఈ మహానీరుడు నీకు అల్లుడు కావడం నిజంగా నీ అదృష్ఠము.

 

మయ:- మహర్షీ!

 

మండో:- తండ్రీ..

 

తే:గీతెలిసి యైనను మరి నాకు తెలియకైన

           ఘటన మాయెను నాపాణి గ్రహణ మిట్లు

           మదిని మనువిది నీకంచు మారుమ్రోగె

           ఆగ్రహింపక నాతండ్రి యనుమతిమ్ము.

 

నా కీ జన్మకు యీయనే పతి.

 

నార:- శుభమస్తు!

 

మయ:- మహావీరాదశకంధరానన్ను క్షమించు నా పుత్రికను పరిగ్రహించుఇదిగో యీఖడ్గమును గైకొనుము.

 

తే:గీఅమిత మహిమాన్వితంబిది ఆజియందు

         శూలినైనను నిది నిక్కము తూలజేయు.

         ఇట్టి ఘోర సాధనశక్తి నిచ్చు చుంటి

         ఘనత నాబిడ్డ కల్యాణ కానుకనగ.

 

(శక్తిబాణాన్ని ప్రసాదిస్తాడు-మండోదరిని అప్పగిస్తాడు)

 

అతిఘోరసాధన మైనందున దీనిని అలులపై ప్రయోగింపకుముఅత్యవసర ప్రమాద పరిస్థితులలోనే ప్రయోగింపుమునీకు విజయము జేకూరును.

 

దశ:- చిత్తముఅవశ్యము దీనినట్లే ఉపయోగించుకొందును.

 

నార:- నమో బ్రహ్మదేవాయ తండ్రీ..ఇది నీ మునిమనుమని వివాహము పూమాల లియ్యవా దేవా..(ప్రార్దించును-పైనుండి రెండు పూమాలలు చేతి కందును-అవి వధూవరుల కిచ్చునువేదమంత్రములు వినబడును దండలు మార్చుకోవడముతో మగళవాద్యములు మ్రోగును)

 

(తెర పడును)

ఎనిమిదవ రంగము

 

(ఉధ్యానవనమునూతన వధూవరుల విహారము)

 

దశ:- మండోదరీఈమలయసమీర మేమనుచున్నది?

 

మండో:- మన ప్రణయ సమాగమానికి స్వాగతం పలుకుతున్నది.

 

దశ:- ఊఁ! (చిరునవ్వుతోచతురమతివే.. అందాలు రాసిబోసిన అలివేణి

 

 వనమయూరి యెందుకటు సందడి చేయుచున్నది.

 

మండో:- సరసుని దరిజేరి సరాగములాడుమని తొందర పెదుతున్నది స్వామీ!

 

దశ:- ఓహ్ఁమరి మత్తెక్కిన ఆ గండుకోయిల ఆలపిస్తున్న ఆ పంచమస్వరంలోని అంతరార్థమెమిటో?

 

మండో:- ప్రియపరిష్వంగములో కలకాలం తలదాచుకొమ్మని వసంతగాన మాలపిస్తున్నది.

దశ:- దేవీనేను అఖిలైకవీరుడనునీవు నాహృదయ రాణివిమన ప్రణయ సామ్రాజ్యానికి రాణిగా నిన్నిదే అభిషేకిస్తున్నాను. (పూలు పైన జల్లును)

 

మండో:- ధన్యురాలను స్వామీనా కన్నకలలు నేటికి ఫలించినవిఈ జేవితకాలము మీ పదపీఠి నాశ్రయించి నాజన్మ చరితార్థం జేసుకొంటాను

 

దశ:- ఊహూఁ! .. నీ స్థానం అక్కడకాదుదేవిఇక్కడ యీ హృదయస్థానంలోదేవీనీ యందమూ.. అద్వితీయము..

 

సీ:- పుండరీకములను బోలు నీ కనుదోయి

        నీలభములసాటి నీదు కురులు

       తిలపుష్ప మనదగు నెలత నీనాశిక

        కంబువనగ నీదు కంఠ ముండు

        బింబఫలారుణ విధము నీ యధరంబు

        దానిమ్మ బీజముల్ దంతచయము

       నిమ్మపండనొప్పు నీ మేని జిగిగన

        పల్లవములు నీదు పాదయుగము.

 

:వెబ్రహ్మ తీరుబడిగ భామినీ నిను జేసె

          అందచంద మందు నణకువందు

 

           మేటివైన నీకు సాటి లేరెవ్వరు

           చెలియ నాదు చెంత జేరరమ్ము.

 

ప్రియా నాబాహు వల్లరులతో నిను బంధించి నీ స్థానం సుస్థిరంచేస్తాను.(దగ్గరికి రా బో తుండగా మండోదరి ప్రక్కకు తప్పుకొంటుంది)

 

(ఇద్దరూ యుగళ గీతం పాడతారు)

 

మండో:- ఎన్ని జన్మల తపము చేసి బడసినానో నిన్న పతిగ.

 

దశ:- కోరనివర మనగ ధాత ఇచ్చెనాకు నిన్ను సతిగ

 

మండో:- ఈజగమున మన కలయిక చూచిన శశి చంద్రికలకు

        హెచ్చెనేమొ ఆనందము వెలుగు లలిమె గగనతలము.../ఎన్ని/

 

దశ:- నినుచూచినదాది నిజము మనసులోనె మనసు లేదు

        నాపై నెనరూని నీవు యేలుకోవె ప్రియభామిని...../లోరని/

 

మండో:- అనుబంధము ఆత్మీయత ముడిబడిన జంటమనము

 

దశా:- ఏదియేమొ పోనిపొమ్ము నాకునీవు నీకు నేను

 

మండో:-దైవమిడిన వరము సుమ్ము

 

దశ:- విడిచి మనగ లేము మనము.

 

(తెరవ్రాలును)

 

 

తొమ్మిదవ రంగము

 

(లంకాపురిదశకంఠుడు సింహసనం పై కూర్చొని యుండునుప్రక్కన ప్రహస్తుడు ఉచితాసనాన్ని అలకరించి ఉంటాడు-సుమాలి ప్రవేశిస్తాడు)

 

దశ:- (సాదరంగా లేచిమాతామహులకు ప్రణామములు.

 

సుమాలి:- శుభమస్తు.

 

దశ:- (ఉచితాసనాన్ని చూపిస్తూరసాతలమున మనవారందరూ క్షేమమేకదా తాతా!

 

సుమాలి:- (కూర్చొంటూఅందరూ క్షేమమే దశకంధరారసాతలమును పూర్తిగా విడిచి మనవారందరూ పయనమై వచ్చుచున్నారు.

 

దశ:- చాలా సంతోషముఈసంపదా,  యీరాజ్యమూ మీదిమీ యాన చొప్పున లంకాధిపత్యము వహించుచున్న నాకుయీ చతుర్దశభువనములలో యెదురు లేదుమీ చల్లని హస్తాలతో మమ్ములను దగ్గరికి చేర్చి యింతవానిని చేసినందులకు సర్వదా కృతఙ్ఞుడనుసుత సోదర బంధు మిత్రులతో లంక నేలుచున్న నాకు యింకేమి కొదువ.

 

సుమా:- నీ వింతటితో తృప్తి చెందడం నాకు రుచించదు దౌహిత్రానీవు జగదేకవీరుడవువిజృంబించులోకాలన్నీ జయించు రాక్షసరాజ్యవిస్తరన గావించుఆచంద్రతారార్కం ని కీర్తి నిలచిపోవలె.

 

దశ:- అదే మీ అభిమతమైతే మీఆశీర్వాదంతో నేనేమైనాచేయగలనుమాతామహా యీ కైకసీపుత్రుడు అరివీరభయంకరుడుఇక లోకాలన్ని మన  అధీనం కావలసిందేయమ వాయు అగ్ని ఇంద్రాదులందరు నాపేరు విన్నంత మత్రముననే గడగడలాడిపోవలె యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుష నాగ నభశ్చరులెల్లరు చేరి నాకు ఊడిగము చేయవలెసూర్యచంద్రులు సైతం నా ఆఙ్ఞకులోబడి ప్రకాసించవలె.

 

కం:  చొచ్చెద దేవేంద్ర పురము

          తుచ్చ దివిజుల మదమణచి దునిమెద ననిలోన్

          తెచ్చెద యమవరుణాదుల

          నుచ్చుల బిగియించి తమరు ఉత్సవమందన్.

 

ప్రహ:- (సగర్వంగాలంకాధిపుల జైత్రయాత్ర సంపూర్ణమయ్యేవరకు విశ్రమించేది లేదు.

 

దశ;- భళిరేమామాప్రహస్తామీ సేనానాయకత్వము మాకత్యంత ఆవశ్యకముఅభేద్యమైన రణవ్యూహములు పన్నుటలోనూదుర్భేద్య శత్రువ్యూలముల చ్చేదించుటలోను మీకు మీరేసాటి.

 

భటుడు:- (బయటి నుండిలకాధీశులు జయము జయముఅలకాపురి నుండి రాఅయబారి వచ్చి మీ దర్శనార్థం వేచియున్నాడు ప్రభూ..

 

దశ:- ఏమిటీఅలకాపురాధీశుని రాయబారమాచిత్రముగానున్నదేఇన్నేళ్ళు గడచిన పిదప యిప్పుడు రాయబారమా?

 

సుమా:- రానిమ్ము లంకాధిపాఅతడేమి వచించునో విందము.

 

దశ:- రాయబారికి ప్రవేశము కల్పించండి

 

భటుడు:- (బయటి నుండిచిత్తం..

 

రాయబారి:- (విప్రవేషధారణతో ప్రవేశించి)

 

తే:గీస్వస్తి పౌలస్య వంశోద్భవ మణికి హర

           పాదపంకజధ్యాయికి వేదశాస్త్ర

           వివిధ విఙ్ఞాన విదునకున్ వీర ధీర

           శూరునకు ధనదుని ప్రియ సోదరునకు.

 

పవిత్ర బ్రహ్మవంశసంజాతులూలంకాధిపులు నైన దశగ్రీవ ప్రభువులకూ ఇవే మా ఆశీస్సులురాజామీ అగ్రజులూవిశ్రవోబ్రహ్మ తనయులూధనాధ్యక్షులు నైయిన కుబేర ప్రభువులు మీ ప్రాభవమునూమేలునూకీర్తి నాకాంక్షించి ఒక సందేశమును నా ద్వారా పంపి యున్నారు.

 

దశ:- అదేమిటో వివరించ వచ్చును.

 

రాయబారి:- ముందుగా మీయొక్కయుమీ సోదరులు కుంభకర్ణ విభీషణాదుల యొక్కయుకుమారులైన అక్ష మేఘనాదుల యొక్కయు క్షేమములరసికొని రమ్మనిరిపినతల్లి కైకసీదేవికి ప్రణామము లందజేయమనిరి

ప్రహ:- మంచిదిప్రభువులు బంధు మిత్ర కళత్ర పుత్ర సహోదర సహితముగా క్షేమమని తెలుపుము.

 

సుమా:- రాజమాత కైకసీదేవికి అలకాధిపుని వందనములందజేతుమని చెప్పుము.

 

దశ:- ఇక నీ సందేశమేదో సవిస్తరంగా వినిపింపుము.

 

రాయ:- మంచిదిఅలాగే.. (పత్రము విప్పునుసోదరా దశకంధరానీకుశుభమగుగాకనీవు గొప్పపరాక్రమశాలివితపోబలగరిష్టుడవుఇటువంటి నీకు శాంతముదయపెద్దలయెడ గౌరవమూ యెంతైనా అవసరముఅవి నిన్ను మరింత గొప్పవాడిని చేయగలవుమీదుమిక్కిలి మహాపవిత్రమైన బ్రహ్మవంశసంజాతుడవుఇటువంటి నీవు సద్గుణంబులను అవలంభించుట యెంతైనా అవసరముఇన్నిమాటలేలమన వంశ గౌరవము కాపాడుట నీ విధి కాదాఇనన్నియూ నీ కెందుకు చెప్పుచున్నానో నీకిప్పటికె అర్థమై యుండుననుకొందునునిన్నుగురించి చాలా చెడ్డగా వినుచున్నానుపరస్త్రీల నవమానపరచడము.మునులను,  బాధించడముఇంద్రాది దిక్పాలురను చులకనజేసి మాట్లాడడమూవంటివి యెన్నియో వింటున్నానుఇదే నిజమైతె నీకంటే పెద్దవాడనైనందులకు నీ హితముగోరి నావంతు బాధ్యతగా నీకుచెప్పునదేమన నాపై గౌరవముంచి నా మాటవినిమంచిగా మసలుకొని  మన వంశమర్యాదను కాపాడవలసినదిగా కోరుతూ....

 

దశ:- ఆపుఁ.. నీ అధికప్రసంగమిక చాలు.

 

రాయ:- లంకాధిపాఏదియేమైనను రాయబారి తెచ్చిన సందేశమును పూర్తిగా వినుట ధర్మమునన్ను పూర్తిగా వినిపింపనిండు.

 

దశ:- అవసరములేదు.

 

రాయ:- ఇందులో అనవసరమూఅప్రస్తుతమూ యేమున్నదిఇది కేవలమూ హితోపదేశము మాత్రమే.

 

దశ:- చాలునీ యనవసర ప్రసంగముకుబేరుడా నాకు హితోక్తులు చెప్పునదిఆ పిరికిపంద నాకన్నయైనందులకు సిగ్గు పడుచున్నాను.

 

;వె:  పారిపోయినాడు పరువును బోనాడి

            ఎదిరి నిలచి పోర బెదిరినాడు

            చాలుచాలతండు సరిరాడు మాతోడ

            బుద్దిచెప్ప మాకు పెద్ద కాడు.

 

రాయ:- దశగ్రీవా౧ నీకీ దుర్మార్గము తగదు తమ్ముడన్న ఆప్యాతతో నీవుచేసిన యేగ్గులన్నీ సైచి లంకను నీకు వదలి వెళ్ళుట పిరికితనమైనదానీవుచేయు అకృత్యములకు మది రోసి నీ మంచికోరి మందలించిన అన్నను తూలనాడుదువా!

 

దశ:- రాయబారీహద్దుమీరి ప్రవర్తించు చున్నావు.

 

రాయ:- ఇది హద్దమీరుటకాదుయధార్థము.

 

దశ:- ఔరా.. ఎంతధిక్కారముఆఁ...హ్.. లంకాధినేత నెదిరించిన ఫలిత మనుభవింపుము.(ఖడ్గముతో పోడిచి వేయును)

 

రాయ:- (బాధతో తూలుతూఅబ్బా.. దుర్మార్గుడా!  రాయబారి పైనే అకృత్యము సల్పెదవానీచుడానన్ను హతమర్చిన పాపము ఊరికేపోదుకాలాంతరమున సందేశవాహకులే నీ బంధు మిత్ర సుతుల నాశనమునకు కారణమౌదురుగాకఇదే నా శాపము తప్పదు... హరహర మహాదేవ!..హర..హర....హా..దేవ..(ప్రాణము విడచును)

 

దశ:-(రాయబారిని కాలితో తన్నివికటాట్టహాసము చేసిప్రహస్తామనజైత్ర యాత్రా మహాయఙ్ఞానికి మొదటిసమిధ అలకాపురిప్రకటించు కుబేరునిపై యుద్దముఆభీరువు ఇపుడైనా యెదిరించి నిలుచునేమో చూతముఊఁరణభేరిమ్రోగించు.

 

హరోంహరహర..హరోంహరాయని

అరిమస్తక విద్వస్తకారులై

పదండి ముందుకు ప్రభంజనంలా

పదండి ముందుకు ప్రళయవహ్నిలా...హరోంహరా...

 

సుమాలి:- (పెద్దగా నవ్వివానివద్ద పుష్పకమను సుందర విమానము కలదుమొదట దానినపహరించండిమున్ముందు అది మనకెంతో ఉపయోగపడగలదు.

 

ప్రహ:- అదెంతపనిరేపటికి పుష్పకము మన అధీనమై పోగలదు.

 

సుమా:- దౌహిత్రాపంక్తికంధరాఇక నీ చేతులమీదుగా రాక్షససామ్రాజ్య విస్తరణకాగలదునశించిన  ప్రాభవము పునర్నిర్మితము కాగలదుమా సాలకటంకట వంశము నీకెంతో ఋణపడియున్నదిమా అభీష్టము నెరవేర్చి రాక్షసవనమహావిటపమై  వర్ధిల్లుమీ పౌలస్యవంశ మణిహారమున మేటి రత్నమై వెలుగొందు.

 

ప్రహ:- తండ్రీ..నేటికి మీ ధ్యేయము నెరవేరినదికుంభకర్ణాది చేవగల చందనములను పెంచి సుమాలులైరిమీ సుమాలి నామధేయము సార్ఠకమైనదిసుమాలి నాయకులకూ.. జై.. సుమాలి నాయకులకూ.. జై..(జయజయ ధ్వనులు వినిపించును)

 

(తెర వ్రాలును)

 

 

 

పదవవ రంగము

 

(ఉధ్యానవన ప్రాంతము రంభ నలకూబరుని రాకకై నిరీక్షిస్తూ వుంటుందిప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పాట నందుకుంటుంది)

 

పాట..

హృదయ వీణపై మృదుమధురముగా

మ్రోగినదీ నవ మోహన రాగం!!

 

చలికొండల చిరు తెమ్మెరలకు నా

భ్రమరకములు శుభనాట్యము లాడెను

మానస కాసార సలిల డోలికల

ఊయల లూగెనా భావ మరాళము - /హృదయ /

 

రతికాంతుడు కసి కసిగా విసిరిన

కలువ మార్దవము మంద హాసమై

చెక్కుటర్దముల అరుణిమ లలిమి

రమ్యకాంతి మయ నవత నింపెను - /హృదయ/

 

నాజీవన వని కిసలయముల దిని

ఊహల కోయిల "కూయని కూసెను

కోయిల రవమున పలికిన రాగము

ప్రకృతి నంతయు పులకల దెల్చెను - /హృదయ/

 

ఈ విభావరి నా మనసున విరహతాపమును రేకెత్తించు చున్నదినభోమండల కౌముది నాయెద మన్మధరాగోధీపన గావించి బాధించుచున్నదిఔరా ఇంత సుకుమారములైన యీ వనసహకార పల్లవములు అగ్నిశిఖలై నాహృదయము మండిన్చుచున్నవిఈసిత ప్రఫుల్లమొల్లలు నన్నుజూచి నవ్వుచున్నవిఎంత ఎల్లిదమైతినిసరి..సరి.. కంతుని విరితూపులకు లోకువగాని యింతులుందురా!  ఇంతకూ నాయీ స్థితికి కారణము ఆ నలకూబరుడుఇంకనూ రాడే.. రాడు.. ఏలవచ్చును వలచి వచ్చిన పూబోడుల చులకన జేయుట యీ మగరాయులలొక క్రీడ కాబోలు.. ఆఁ!.. అడుగో నా ప్రియనలకూబరుడదే వచ్చుచున్నాడు.

 

నలకూబరుడు:- ప్రియాఏంతసేపైనది నీవు వచ్చి.

 

రంభ:- ఎంతసేపైన నేమి?  ! ... చాలాసేపే  యైనదినీకిది క్రొత్తకాదుగదా?  తడవుసేయకవచ్చు అలవాటు నీకూ లేదు నీకై పరుగిడివచ్చు నలవాటు నాకూ పోదు.

 

నల:- క్షంతవ్యుడనుఇక మీదట జాగరూకుడనై మెలిగెద సరియా?

 

రంభ:- సరిసరి..

 

నల:- ఆహాఁరంభా కోపమున నీయందము ద్విగుణీకృతమైనది సుమా!

 

రంభ:- అఁ!..

 

నల:- అవును రంభానీ వాలుచూపుల తూపులకు నేను తాళజాలనుమన్మధోద్ధీపనము లైన నీ హొయలూలయలునీ విలాసముని నవమోహనాకృతికి నేను ముగ్దుడను.(దగ్గరికి తీసుకోబోవును)

 

రంభ:- (తప్పించుకొంటూ చిరుకోపముతోఔనౌనుమాయమాటలు చెప్పి వశపరచుకోవడం మీ మగవారికివెన్నతో పెట్టిన విద్య కదా!

 

నల:- అంతమాటెందుకు ప్రియానేను నీకై పరితపించు ప్రియుడను కానాఇట్టి నిష్ఠురోక్తులు నా యెడ తగునాఇకనైనా నీ ప్రణయకోపము విడువవానన్నాదరించి అక్కున జేర్చుకోవా? (దగ్గరకు తీసుకుంటాడు)

 

రంభ:- (నలకూబరుని పరిష్వంగంలో ఓదిగిపోతూఇంకెన్నడూ నన్నీ విరహ తాపానికి గురి చేయనని మాట ఇవ్వగలరా?

 

నల:- నేను మాత్రము నిన్ను విడిచి వుండగలనా ప్రియాఅలాగే వృధా మాటలేలమనది విడదీయరాని బంధం(తన్మయత్వం చెందును)

 

తే:గీ:  కనులు మూసిన తెరచిన కాంత రూపె

            అలికి డేమైన నయ్యది కలికి పలుకె

            ఇటునటు లెటునే కదలిన యింతి తలపె

           భళిరెయీలోకమే రంభ భావమయము.

 

ప్రియా మనమొక అరుదైన జంట.

 

 

:వె:- పూవు వీడి తావి పోలేని చందంబు

             చందనమును విడని చలువ రీతి

             మధువు విడచి చనని మధురిమ విధమున

             కలసిపోయి నాము కంతునాన.

 

(యుగళ గీతం ఆలపిస్తారు)

 

రంభ:- ప్రేమ యనగ నేమొ తెలుప వెలసినాము జగతి మనము

 

నల:- వలపనంగ ఇది యటంచు లోకమెరుగ మసలినాము

 

రంభ:- నా అందచందములకు తగిన జోడు నీవెయనుచు

నామనసును నాకె నేను నీవశమును జేసినాను......./ప్రేమ/

 

నల:- ఇంతటి ప్రియమైన జంట త్రిభువనముల లేదటంచు

      మెచ్చి విరుల జల్లులనూ కురిపించినవీ తరువులు....../వలపనంగ/

 

రంభ:- నెనరూ ప్రేమలను గలిపి రంభా నలకుబరులన

 

నల:- సరి సరి ఇది తగునటంచు విశ్వమెల్ల తలయూపెను...

 

రంభ:- ప్రేమయనగ.....

 

నల:- వలపనంగ...

(ఆడుతూ పాడుతూ యిద్దరూ నిష్క్రమిస్తారు)

 

(తెర వ్రాలును)

 

 

పడునొకండవ రంగం

 

(ఇంద్రలోకం-ఇంద్రుడు కుబేరుడు ఆలోచిస్తూ కూర్చొని వుంటారు)

 

ఇంద్ర:- ధనాధ్యక్షాఎంత పొరబడితివిలోకకంటకుడైన కైకసీసుతుడు నీ మాటావిని బుద్దిమంతుడౌ ననుకొంటివా?

 

కం:  చెప్పగ వలయున్ నీతులు

          తప్పక వినువాడొకండు తారస పడినన్

          ముప్పగు మూర్ఖుని యెడ నిది

          తప్పదు వాడెంత నీకు తమ్ముండైనన్.

 

కుబే:- నిజమే మహేంద్రాఆ దూర్తుని జెనకి ముప్పు దెచ్చుకొంటినిసోదరుడన్న అభిమాన మిసుమంతైనా లేక నా రాయబారిని హతమార్చి అలకపై దండెత్తి మణిభద్ర సంయోధకంటకు లను నా మంత్రులను సంహరించి నన్నవమాన పరచి పుష్పకవిమానమును సైతమూ అపహరించి లంకకుజనె.

 

ఇంద్ర:- ఆఁ!...నీ దురవస్థకు నేను చాలా....(ఇంతలో భయానక రావం వినబడుతుంది)

 

కుబే:- ఎక్కడిదీ భీకర భయానక రావము.

 

ఆకాశవాణి;-(కనబడకుండా వినబడుతుందిదశకంఠునిది...

 

కుబే:- ఏమిటీ?... దశకంఠునిదా!

 

ఆకాశవాణి:- అవునులంకేశుడు పుష్పకమున తిరుగుచూ కైలాసగిరి ప్రాంతము ప్రవేసించెశివ మహిమవల్ల పుష్పకము కదలక అంబరమున నిలిచెఅందుకాతడు కినిసి కైలాసగిరినే పెగలించివేయ యత్నించెఅది గమనించిన దేవదేవుడు తన పదఘట్టమున త్రొక్కిపట్టె లంకాధిపుని అరచేతులు పర్వతపాదమున బడి నలిగినవిఆ బాధతో అతడు చేసిన రావమేఅది.

 

ఇంద్ర:- అయిన ఇప్పుడాతని స్థితి..

ఆకా:- దయామయులైన ఆ పర్వతీపరమేశ్వరులు దశకంఠుని దయదలచి వదలివేసిరిఇపుడాతడు పుష్పకమున లంకకేగుచున్నాడుభీకరరావము చేసిన వాడు కనుక నేటినుండి దశకంఠుడు "రావణనామధేయుడై వినుతికెక్కగలడు.

 

కుబే:- వీని విజృంభణ్మునకు అదుపేలేదా?

 

ఇంద్ర:- వీనికిది ఉచ్చదశ కాబోలులేకున్న శివపార్వతులు సహితమూ వీని ఆగడములను మన్నించుచున్నారుగదా?

 

కుబే:-_స్వర్గాధిపాశివపార్వతులకు మొదటినుండి వీనిపై మక్కువే.

 

ఇంద్ర:- ఎందుచేత?

 

కుబే:- పూర్వము విదుత్కేశుడు తన భార్య సాలకటంకను గూడి ఒక మగ శిశువును గనియె సలకటంక రతియదు రక్తి మిక్కుటముగా గలదియై బిడ్డను పెంచనొల్లక మంధరనగమున శిశువును పారవైచి మగని గూడి వెళ్ళిపోయినదిఆ బిడ్డ హృదయవిదారక రోదనము విని జాలిపడి పార్వతీదేవి ఆ బిడ్డను తెచ్చుకొని పెంచి పెద్దచేసినదిఆ బాలుడే సుకేశుడు.ఆ సుకేశుని ప్రియసుతుడే సుమాలి,ఈ సుమాలియన్నను అతని బలగమన్నను శివపార్వతులకు యెనలేని ప్రేమవీరి అకృత్యములు సహితము ఆ ఆదిదంపతులకు బాల్యచేష్ఠలుగా కనబడును కాబోలువారు కోపగింపరుసరిగదా సంతోషించి వరములిత్తురు.

 

ఇంద్ర:- నిజమేఈసుమాలి సామాన్యుడుకాడుపూర్వము వీడు సోదరులతో గూడివచ్చి మమ్ముల వెతలబెట్టిరిఆ శ్రీమన్నారాయణుని కృపనల్ల నాడు బాధ తీరినది.  తిరిగీ వీరి విజృంభణము మొదలైనదినేడు గాకున్ననూ రేపైనా ఆ సుమాలి నీ తమ్ముని స్వర్గముపైకి పురికొల్పును.

 

కుబే:- మీ అండనైనా తలదాచుకొన నెంచితినిఇక్కడ కూడా వెతలు తప్పవాయేమి?

 

ఇంద్ర:- మనకందరకూ ఆ శ్రీమన్నారాయణుడే శరణ్యముసమయముజూచి మనమెల్లరమూ వైకుంఠము జేరి ఆ నారాయణుని ప్రార్ఢించి యీ పీడను వదిలిచుకోవలె.

 

కుబే:- కానీ..వీడు బడసిన వరములు అమోఘములు శ్రీహరి గద చక్రములకు సహితమూ వీడు అజేయుడు.

 

ఇంద్ర:-హిరణ్యాక్ష హిరణ్యకసిపుల కడతేర్చిన శ్రీహరికి నీనిని నిర్జించు మార్గము తెలియకపోదువైష్ణవమాయ తెలియ నెవరి తరముఏమైనను ఆ వైకుంఠవాసుడే మనకు దిక్కు.

 

కుబే:- ఔను.. మనకు ఆ శ్రీహరియే శరణ్యము.

 

సీఎవ్వాని యురమున కెగబ్రాకి శ్రీదేవి

        స్వస్థలంబుగ జేసి వాసముండు

     ఎవ్వాని నాభిలో పద్మమందున బ్రహ్మ

        జననమై సృష్ఠించె జగము లెల్ల

     ఎవ్వాని పదపీఠి ఇంతి జహ్నవి బుట్టి

        పావన జలముల పారె జగతి

     ఎవ్వాని పుత్రుండు యెద కోర్కె రగిలించి

        మన్మదుండను పేర మరులు గొలుపు

 

తే:గీదుష్ఠరాక్షస గణముల దునిమెనెవడు

      కరుణదీపింప దీనుల గాచు నెవడు

      విశ్వమంతయు వ్యాపించి వెలయు నెవడు

      అట్టి శ్రీహరి యోక్కడే దిక్కు మనకు.

 

(తెర వ్రాలును)

పన్డ్రెండవ రంగము

 

(ఉద్యానవనము నలకూబరుని రాకకై నిరీక్షీస్తూ విరహంతో వేగిపోతూ రంభ పాట పాడుయుంది)

 

పాట-

 

తడవదేల నలకూబరా వేగమెననుజేరరావ

 

మదనుడేల పగను బూని మొగలిరేకురంపమునను

హృదయంబును గాయపరచి వెతలుబెట్టి నవ్వుచుండె.../తడవ/

 

అగ్నిలోన నేయి వోసి భగ్గునమండించి నటుల

ఈ వెన్నెల విరియగాసి విరహము తనరింపజేసె.../తడవ/

 

(పాటచివరలొ రంభ అటుగా తిరిగియుండును-రావణుడు చిరునవ్వుతో ప్రవేసించును-రంభ నలకూబరుడే వచ్చెననుకొనును)

 

రంభ:- ఇంతతడవానీతో మాటాడనుపో ...(రావణుడు మాటాడదుఏలనన్నుడికించెదవు? (తిరిగిచూచునురావణుడు కనిపించి వికటాట్టహాసం చేయును రంభ భయపడునుమిమ్ములనుద్దేశించి కాదు నే నన్నది..మీ.. రి....వెళ్ళ..వచ్చును.

 

రావణ:- మదనబాణసమవు.. ఎదను గాయపరచితివి.. ఇక నేనెక్కడికి పోవుదును.

 

ఎవ్వరి దానవే జలరుహేక్షణఎయ్యది పేరు దెల్పవే

       జవ్వని యెవ్వనిందలచి చయ్యన బోయెదవే మిఠారి నీ

       యవ్వనమున్ విలాసము జక్కదనంబును నీటు జూచినన్

       పువ్విలుకానికైన భ్రమపుట్టగదే భువనైక మోహినీ!

 

రంభ:- నాపేరు రంభదేవలోక వాసినిసురసభానర్తకినినలకూబరుని ప్రేయసినినే నతనికై వేచియుంటిని.

 

రావ:- ఆహాఁరంభయన్న నీ వన్న మాటసురసభయందు నీ నాట్యమమోఘమని వినుటయేగానీ చూచి యెరుగనురంభానిజంగా నీ రూపమపురూపమే!

 

రంభా:- ధన్యవాదములు.(నిష్క్రమించ ప్రయత్నించును)

 

రావ:- ఎక్కడికిసుందరీ!(పట్టుకొనును)

 

రంభ:- నన్ను వెళ్ళనివండి (విడిపిన్చుకొనును)

 

రావ:- ఎక్కడికి వెళ్ళెదవుఈలకాధీశుని కన్నులబడిన లలను ఊరకే వదలడమే? (మరలా పట్టుకొనును)

 

రంభ:- విడవండి.. ఇది మీకు ధర్మముగాదు.

 

రావ:- ఇక్కడ ధర్మాధర్మముల ప్రసక్తి యేలనే చిగురుబోడి.. నా కోరిక తీర్చి వెళ్ళవే కోమలంగీ..

 

రంభ:- (విడిపించు కొన జూచునువిడిపించుకొన లేదుమీకీ దురాగతము తగదువదలండి.

 

రావ:- (వికటట్టహాసము చేసిఈ రావణబ్రహ్మనే తృణీకరింతువా?  మా పేరు విన్నంతనే దేవాసుర యక్ష గంధర్వులు గడగడ వణుకుదురే... అట్టినన్ను తిరస్కరింతువా?  మా కోరికను తృణీకరించునంతటి సాహసమే నీకూ?... ఊఁ..రా..(పట్టిలాగును)

 

రంభ:- (ప్రాధేయపడుచూమీరు పెద్దలుమీకిది ఉచితంకాదు.

 

తే:గీవనిత మనసును నొప్పించి వగవ జేసి

          మానభంగము గావింప మగతనంబె

          బలము గలదని భామల భంగపరుప

          పాపమంటదె పరువది పాడుగాదె?

 

నేను నలకూబరునిపై మనసున్నదాననుఅతడు మీకు పుత్రసముడునన్ను కోడలిగానెంచి విడుచుట ధర్మము.దయచేసి నన్ను విడచిపెట్టుడు. (ఏడ్చును)

 

రావ:- (నవ్విగడుసు దానవేవావివరసలు నీకు కూడా వర్తించునాసురసభయందు నాట్యము చేయుచూ స్వర్గము చేరిన వారందరికీ శయనసౌఖ్యమునిచ్చిస్వేచ్ఛగా విహరిచు నీవు నాకు కోడలివానేను నీకు మామా నాఅహోఎంతవిడ్డూరముఎంత హాస్యాస్పదముజవ్వనీ..

 

సీజనకుండు సుతుడును జన్నంబుచేసిన

        వవిత వారేమి కావలయు నీకు

      నన్నదమ్ములు సోమయాజులై వెలసిన

        వవిత వారేమి కావలయు నీకు

      బావయు మరదియు బవరాన కూకిన

        వవిత వారేమి కావలయు నీకు

      నల్లుండు మామయు నని త్రెల్లి వచ్చిన

        వవిత వారేమి కావలయు నీకు

తే:గీవావివరసలు గణియింప వచ్చితేని

      లలన మాతోడ మాటాడ వశమెనీకు

      చాలు నికయేల రారమ్ము చాలు బిగువు

      జాగుచేయంగ వదింక జాణ లెమ్ము.

 

(రమ్మని బలత్కరిమ్పబోవును)

 

రంభ:- నీచుడానన్ను వదలుము.. వదలుము..(రావణుడు వికటాట్టహాసము చేయునురక్షించండి...రక్షించండి.. (నిస్సహాయంగానలకూబరారక్షించు..రక్షించు..

 

రావ:- పిల్లకాకివాడేమి రక్షించగలడేనన్నెదిరింప వాడబ్బ తరం కాలేదుఇక వీడెంత? (రంభను బలవంతంగా యీడ్చుకొని బయటికి పోవునుబయటినుండి రంభ కేకలు యేడ్పులు వినబడును)

(తెర వ్రాలును)

 

పదమూడవ రంగము

 

(రావణుని మందిరముమండోదరి పార్వతీదేవి విగ్రహము వద్ద కూర్చొని పాటపాడును)

పాట-

 

పాహిపాహి మాం పరమేస్వరీ కృపజూడు మాదేవి కాత్యాయినీ

 

పతినొక క్షణమైనా విడువని సతినై

పతిలోసగమై భాసిల్లెడు దేవి

నాపతి దుడుకుల నదుపుచేయుటకు

వలయు శక్తి నా కీయవె మహదేవి...../పాహి/

 

పతియే దైవం -  బనిమది నెంచి

 బ్రతికెడులభామల -  బాధల దీర్చెడు

దేవతవమ్మా -  మాతా పర్వతి

 దిక్కెవరమ్మా నీవు వినా మరి......../పాహి/

 

నారద:- (ప్రవేసిస్తూనారాయణ..నారాయణ..

 

మండో:- దయచేయుడు మునీంద్రా..ఆసీనులుకండు.

 

నార:- (కూర్చుంటూశుభమస్తూ!

 

మండో:- నేనువిన్నది నిజమేనా మునీంద్రా?

 

నార:- ఏవిషయము తల్లీ..రంభాపరాభవము గురించేనానిజమేతల్లీ.. నీవువిన్నది అక్షరాలా నిజం..మొన్నటి రంభాపరాభవంతో నీ పతిదేవుని దుండగములు తారాస్థాయికి చేరుకొన్నవి తల్లీ..ఆఁ ఆఁ వీటి మధ్యలో ఒక శుభ సంఘటనా చోటు చేసుకోక పోలేదు తల్లీ!

 

మడో:-(ఆతృతగాఏమిటది మునీంద్రా!

 

నార:- అది నిజానికి శాపమే.. అయినా నిపాలిట వరమేతల్లీ..రావణుడు ఇక ఏవనితనూ బలాత్కరింప జాలడుఅట్లు తననొల్లని స్త్రీని తాకిన వెంటనే తలలు వ్రక్కలై ధర కూలునని నలకూబరుని శాపము.

 

మడో:- మహర్షీ!

 

నార:- కంగారు పడకు తల్లీ..ఈపాటికి నీ పతిదేవులకు ఈ శాప వృత్తాంతం తెలిసే వుంటుందికనుక అతడు కొంతకొంతేమిటి యెంతో జాగరూకుడై మెలగునుఇక నాకు సెలవు తల్లీ.. నారాయణ.. నారాయణ...

 

(నారదుడు నిష్క్రమించునుమండోదరి దుఃఖాశ్రువులతో చింతాక్రాంతయైయుండగా రానణుని ప్రవేశం మండోదరి లేచి భర్త పాదములకు నమస్కరించగా రావణుడు ఆమెను లేవనెత్తుతూ)

రావ:- దేవీనీవు నేడెలనో చింతాక్రాంతవై కన్పట్టు చున్నావు.

 

మండో:- స్వామీఏలమీకీ యనవసరపు దండయాత్రలుఅందునా సాధువులపై మీకెందు కింత కినుకపరస్త్రీవ్యామోహము పతనహేతువుమీకిది తగునా నాధాతగదు.

 

రావ:- ఓహోఇది నారదులవారి హితోపదేశమన్నమాట.. ఊఁ!...

 

మండో:- ఒక రననేల  మీరుచెప్పండి ఇది కల్లయని నమ్మెదనుచెప్పగలరా?

 

రావ:- దేవీనేనిపుడేమిచెప్పిననూ మీ కర్థముకాదునాచర్యలలోని అంతరార్థం తెలుసుకోవడం ఇతరులెవ్వరికీ శక్యం కాదునీకెలా వివరించాలో నా కర్థంకావడంలేదుఒక్కటిమాత్రం యదార్థందేవీనేను నీకెన్నడూ ద్రోహంచెయ్యను చెయ్యలేను.. నన్ను నమ్ము. .

 

మండో:- మీరేమీ వివరించ నక్కర లేదుఅంతానాకర్థమగుచునే యున్నది.

 

కం:  తగనే నీసతి నేనన

         నగరే ననుగని పతి పరనాతిని గోరన్

        తగునే ధీనిధికీపని

        తగదిది యని నీకు దెల్ప తరమేనాకున్.

ఆ పరమేశ్వరుడు నన్ను పరీక్షీస్తున్నాడు కాబోలు ఇదంతా నాప్రారబ్దం..

 

(ఏడుస్తూ నిష్కమిస్తుంది ప్రహస్తుడు సుమాలి శవాన్ని చేతులతో యెత్తుకొని ప్రవేసిస్తాడు)

 

ప్రహ:- (బిగ్గరగాలంకాధిపా

 

రావణ:- (ఆశ్చర్యచెకితుడైమామా ప్రహస్తాఏమైనది తాతగారికి.

 

ప్రహ:- మా తండ్రీ.. మీతాతసుమాలీనాయకులిక లేరు ప్రభూ..వారు వీరమరణమున మనలను వదలి శివైక్యము నొందిరి.

 

రావణ:- (బాధతోఆఁతాతాసుమాలినాయకా!

 

:వెప్రేమతోడ నన్ను పెద్దజేసిన తాత

          దనుజ ఋణము దీర్చి తనువు విడచె

          ప్రాణ మతడు నాకు పకుకులు వేయేల

          ప్రాణమిడిచి పోవ బ్రతుకు గలదె.

 

ఎంతపని జరిగి పోయినది మా మాతామహులు నాకు సర్వస్వమునా సంపదానాబలము తుదకు నా ప్రాణమతడేఅతడులేని నా జీవితం వృధాతాతా!  (శవంపై బడి యేడ్చును)

 

ప్రహ:- లంకాధిపామీరే ఇట్లయిన ఇక మా పరిస్థితేమిటివీరులమైన మనకీ దైన్యత పనికిరాదువీరుడు రణమున హతమొందుటో లేక శత్రువుల హతమార్చుటో గాక వేరొక మార్గము గలదావీరస్వర్గ మలంకరించిన మహనీయులకై వగవ దగదు.

 

రావణ:- ఇంతకూ నాదే పొరపాటునేను వెంటనుండక స్వర్గము పైకి దాడి వెడలుటకు తాతగారిని పంపుట తప్పైనది.

 

ప్రహ:- దశాననాఅతడు అసహాయశూరుడువయోవృద్దుడైనప్పటికిని దేవతలను ముప్పతిప్పలు బెట్టినాడుమహాయోధులుసైతం అతని నెదిరించి నిలువలేకపోయిరిఒకదశలో నాకము రాక్షసుల వశమైనట్లే తోచెనుమీ కుమారుడు మేఘనాధుడొకవైపూ సుమాలీనాయకులొకవైపూ నిలచి దేవతలను తరుమ జొచ్చిరి.

 

రావణ:- మరి యీ దుర్ఘటనమెట్లు జరిగినది.

 

ప్రహ:- అదే చెతున్నాను లంకాధిపామేఘవర్ణము గలిగి స్వర్ణాంబరధారియైన ఒక వీరుడు మెరుపులా రణమున తళ్ళుక్కున మెరిసెను అతనిని జూసి సురసైన్యము అమితోత్సాహముతో "సావిత్రవసువునకూ జై "సావిత్రవసువునకూ జై అంటూ జయజయ ధ్వానాలు సలుపుతూ యెదురుతిరిగి నిలచినదా సురసైన్యంఆ వీరుని సుమాలి నాయకులు యెదుర్కొనిరిఅప్పుడు పోరు అత్యంత భీకరమై సాగిందిదైవము వారివైపుండెను కాబోలు.ఆ సావిత్రుడు మించి సుమాలినాయకుల ప్రాణము హరించెనుదానితో ఆ సురసైన్యము పట్టు పెరిగినదిఅసురులు దైన్యము నొంది పారజొచ్చిరి.

 

రావణ:- మరి కుంభకర్ణాది యోధులెమైరి?

 

ప్రహ:- వారూమేఘనాధులు చెదరిన సైన్యములనోదార్చి వారి మనోధైర్యముల పెంచితిరిగీ విజృంభించుటకు ప్రయత్నిస్తున్నారుఈ మధ్యకాలమున విగత జీవులై రణరంగమున పడియున్న సుమాలినాయకులను యెత్తుకొని విషయము మీ కెరిగించుటకు వచ్చితిని.

 

రావణ:- అవక్ర విక్రమోపేతుడుఅజేయుడునైన మేఘనాధునికే ఇంత శ్రమనిచ్చిన ఆ దేవసైన్యము చాలా పటిష్టమైనదై యుండవలెను.(ఒక నిర్ణయమునకు వచ్చిన వాడిలా తలయూపిఇక లాభములేదునేనే స్వయముగా రణరంగప్రవేశముచేసి మదీయశస్త్రాస్త్రాలతో దేవతల మదమణచెదమదీయ మాతామహుల మరణమునకు ప్రతీకారము తీర్చుకునియెదయక్ష గంధర్వులు మా ధాటికి తోక ముడిచిరియమవరుణాదులు పలాయన మంత్రము ఫఠించిరిఅనరణ్యాది నరేశులు ఓటమి నంగీకరించిరి అట్టిది ఈ రణము నాకెంతచూచెదగాక!

 

ప్రహ:- ఆ దేవేందునకు యింతటి ధైర్యమెట్లు గలిగెనో అవగతము కాకున్నదిఆనాడు ఉసీనరదేశముపై దండెత్తునాడు యీ ఇంద్రుడక్కడుండి యేమిచేసెనునెమలి రూపమున మన కన్నుగప్పి తప్పించుకొనిపోయెను.

 

రావణ:- వీడూ వీని దిక్పాలకులూ నాడు శిఖి,కాక,హంస,వృకాలస రూపమిలు ధరించి తప్పించుకొని పారిపోగా (నవ్విపాపమా ఉసీనరరాజు మరుత్తుడు చేయునదిలేక యఙ్ఞవాటికలో దీక్షయందున్నాడననియుద్ధము చేయనొల్లనని సాకులుచెప్పి ప్రాణముల నిలుపుకొని ఓటమినంగీకరించెనుఆ ఇంద్రుడు భీరాగ్రగణ్యుడని చులకనచెసి శత్రుపక్షమును లఘువని తలచిన నేరమునకు పెద్దమూల్యమే చెలించితిమిఇకచాలు ప్రహస్తాపద..ఆ స్వర్గమును సర్వనాశనము చేసేదాకా యీ రావణుడు శాంతించడుప్రహస్తావెళ్ళువెళ్ళిసుమాలినాయకుల పార్థివశరీరము క్షయము గాకుండా భద్రపరచు యేర్పాట్లు గావించునేనిదే మూలసైన్య సమేతుడనై రణరంగప్రవేశంచేస్తానునాకము సర్వనాశనముచేసి తాతగారి ఆత్మకు శాంతిజేకూర్చి నా చేతులమీదుగా వారికి అగ్నిసంస్కారము గావిస్తాను.

 

ప్రహ:- మంచిది(నిష్క్రమిమ్చును)

 

రావణ:-(గంభీరముగా పైకి దృక్కులు సారించికించిత్ యోచించిఏమినా వెర్రిసర్వమెరింగియు నేనెట్టి అవివేకమునబడి కొట్టుకొనుచున్నాను.హుఁ యెవరిచావుకు యెవరు బాధ్యులు? (ఒకనిర్యానికి వచ్చినవాడిలా)  కాదు ..నాకిదేసరియైన మార్గముసర్వలోకపీడనమే నా కర్తవ్యముసర్వలోకైకనాధుడైన శ్రీహరిని నా వైపునకు ఆకర్షించుటకిదే సరియైన మార్గముఇదియే తక్షణ కర్తవ్యము.

 

నాకమె కాదు సర్వభువనమ్ములు ముంచెద  శోకవార్థిలోన్

      లోకపతుల్ భయంబున పొలోమన దిక్కుల పారద్రోలెదన్

     పాకలు యఙ్ఙవాటికలు పావక కీలల కాల్చివేసెదన్

     శ్రీకరుడౌ హరిని భువికి శీఘ్రమె దించెద ప్రాణమిచ్చెదన్.

 

దేవాసర్వలోకనాయకాచిరకాలముగ నే నెయ్యది నా మనంబున తలచితినో అయ్యది నాకు ప్రసాదింపుముమహాత్మా..ప్రసాదింపుము.

 

(రంగస్థలము స్తంభించినిలచును శ్లోకము మొదలౌను)

 

శ్లోశాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్

విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యమ్

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాధమ్.

 

తెర వ్రాలును

 

(తెరలోనుండి శాంతిమంత్రం వినబడును)

 

అసతోమాసద్గమయ

తమసోమాజ్యోతుర్గమయ

మృత్యోర్మా అమృతంగమయ

ఓం శాన్తి శాన్తి శాన్తిః.

 

సంపూర్ణము 

 

 

No comments:

Post a Comment

నాకు చదువురాదు, Naaku Chaduvu Raadu

  నాకు   చదువు   రాదు ( ఏకపాత్రభినయము )     (పాత్ర: ఓ 50 సంవత్సరాల  పేద పెద్దమనిషి ) అమ్మా!  శారదా ... ( బోరున   యేడ్చును ).  తల్లీ   యీ   గ...