వరూధిని
(పద్యనాటకం)
రచన
పి. సుబ్బరాయుడు
42/490, ఎన్.జి.ఓ కాలనీ
కడప - 516002
సెల్ - 9966504951
వరూధిని
(పద్యనాటకం)
1. వరూధిని - నాయిక (25)
2. ప్రవరుడు - నాయకుడు (౩౦)
3. గందర్వుడు/సిద్ధుడు- వరూధిని ప్రేమికుడు (౩౦)
4. ఇందీవరాక్షుడు - వరూధిని తమ్ముడు (24)
5. శంకర శర్మ - ప్రవరుని తండ్రి (60)
6. స్వరోచి - వరూధినికొడుకు (20)
7. మనోరమ - ఇందీవరాక్షుని కూతురు (18)
8. బ్రహ్మమిత్రుడు - ఇందీవరాక్షుని గురువు (60)
1వ, రంగము
(ఉద్యానవనం)
వరూధిని:--(పాట 1)
హృదయ వీణపై మృదుమధురముగా
మ్రోగినదీ నవ మోహన రాగం!!
చలికొండల చిరు తెమ్మెరలకు నా
భ్రమరకములు శుభ నాట్యము లాడెను
మానసకాసార సలిల డోలికల
ఊయలలూగెనా భావమరాళము - హృదయ !!
రతికాంతుడు కసి కసిగా విసిరిన
కలువ మార్దవము మంద హాసమై
చెక్కుటర్దముల అరుణిమ లలిమి
రమ్యకాంతి మయ నవత నింపెను - హృదయ!!
నాజీవనవని కిసలయముల దిని
ఊహల కోయిల "కూ" యని కూసెను
కోయిల రవయున పలికిన రాగము
ప్రకృతి నంతయు పులకల దెల్చెను - హృదయ!!
[వరూధిని పాట పాడుతూ ఉంటుంది. వెనుక వనంసీన్ ఉంటుంది. పాట సమాప్తం కాగానే గంధర్వుడు ప్రవేశిస్తాడు]
గంధర్వుడు:- వరూధినీ... నీ సోయగము అసమాన్యము. నీ గానము అత్యంత మధురము. ఏమని వర్ణించను - ఆహా...
ఉ !! ఆకస వీధివీడి దిగియాడెడు మేటి మెఱంగు దీగెయో
లోకము లాక్రమించి వడి లోగొన వచ్చిన మన్మధాస్త్రమో
జూకది లేక చైత్రనవ సూనము సుందరి రూపుదాల్చెనో
కాకదివిన్ భువిన్ వెదికి కన్గొన వచ్చునె నిట్టిసుందరిన్.
వరూధిని:- చాలునీ పొగడ్తలు ఆడువారు ఏకాంతముననున్న స్థలముల కేగుదెంచి చాటున దాగి యిలా దొంగచూపులు చూడడం మీకు తగనిపని - అట్టి వారన్న నాకసహ్యము - మీరిక వెళ్ళవచ్చును.
గంధర్వ:- వరూధినీ.... ఏలనీకు నాపై యీఅకారణ కోపము నేను నీప్రేమకై పడిగాపులు గాయుచు పరితపించుచున్న సాటి గంధర్వుడను. నన్నను గ్రహింపుము. నాప్రేమ నంగీకరింపుము.
వరూధిని:- చాలునీ అధిక ప్రసంగము. నీవన్ననాకు ఇష్టములేదని యిప్పటి కెన్నిమార్లుచెప్పితిని. ఇక నన్ను వేధించకు దయచేని వెళ్ళు ఇక యీ వైపుకురాకు.
గంధ:- ఇంత కఠినముగా మాట్లాడకు దేవి! నీవే నా సర్వస్వము నీవు లేనిదే నాకు బ్రతుకులేదు. నీ ప్రేమలో పిచ్చివాడనైగంధర్వరాజ్యము సంపదలు భోగ భాగ్యములు విడిచినీపంచనే పడియుండి నీ ప్రేమ భిక్షకై పరితపించుచున్న ప్రేమ పెపాసిని.
వరూ:- ఇష్టము లేదన్న వినిపించుకోవేమి? ఒక్కింతయోచించుము వలదన్నయింతిని పొంది నీవేమి సుఖింతువు - వెళ్ళు వెళ్ళి నీ తల్లిదుండ్రులు కుదిర్చిన వివాహమాడి వారిని సంతోష పెట్టుము నీవును సుఖింపుము. నన్నువిడిచి పెట్టి వెళ్ళిపొమ్ము.
గంధ :- నేను నిన్నుతప్ప మరొకకన్యను మనసున తలంప నైనాలేను. వరూధినీ నీ మనసు మార్చుకో - నా ప్రేమ ననుమతించు. సమస్త సంపదలు రాజ్యధికారాలు రంభాది అప్సరసల పొందు నీ ముందు దిగదుడుపు. నీ ప్రేమకై వేయేంద్లయినను వేచి యుండెదనే గానీ మరలిపోను పోలేను - నా మాటవిను.
వరూ:- వినను గాక వినను. నీ మూర్ఖత్వాన్ని విడిచి పెట్టు
తే!! ఏల నావెంట బడియిట్లు బేల వగుచు
విసుగు జనియింప వేధించి మసలెదీవు
వలపు హృదిలోన మొలకెత్త వలయుగాని
యిట్టిచేష్టలకు నెనరు పుట్టదెపుడు.
ఎట్టి పరిస్థితులలోనూ నిన్నువరించను నీ వెన్నేడ్లు పరితపించినను నేను నీదాన నగుట అసంభవము ఇదే నా తుది నిర్ణయము ఇకనీ యిష్టయు.
గంధర్వ:- ఔరా యేమి యీ సుందరి యందము - కోపమున యీవరూధిని యందము ద్విగుణీకృతమైనది. అయిన నేమి ఫలము నాకు మాత్రమందని ద్రాక్షేగదా? అయినా తియ్యనిదే. అందుకే నాకీ విరహ వేదనము. ఏమి చేయదును.
ఆ!!వె!! రాదు మరపు నాకు రాత్రియు పగలును
కనులముందు నిలుచు కాంత రూపు
మనసు మగువ వీడి మనగల్గ నోపదు
నెటల బ్రతుక నేర్తు నేమి సేతు!
కఠిన శిలా మయమీ వరూధిని హృదయము . ఎన్ని సార్లని యాచించను బ్రతిమలాడను. ఇక లాభములేదు. వంచనచే నైననూ యీ వరూధినిని సాధింతునుగాక - దీనికై యేదో ఒక ఉపాయము నాలోచించవలెను. ఆ....(ఆలోచించి) యీ వరూధిని నాకర్షించు మన్మథాకారుని నొకని వెతికి పట్టుకొనవలె. తర్వాత అతనిని యేదో ఒకరీతిని రప్పించి వరూధినిని నాతని ఆకర్షణలో బంధించి తర్వాత నాతనిని తప్పించవలె అవసరమైనచో వానిని చంపియైననూ సరే వానిరూపమున నేనామె దరిచేరవలె - ఇక నా కింతియే మార్గము. మరొక్క యోచన, నేనే మరొక సుందరాకారుని రూపమున యిప్పుడే యేల తారస పడరాదు? తారసపడవచ్చును. కానీ ఆ వరూధిని సామాన్యులారా? అనుమానించి నారంగు బయట పెట్టెనా ఇక నా ప్రయత్నము లన్నియు వృధాయేకదా! కనుక వేరొకనిని ప్రవేశపెట్టి తర్వాత అత్యంత సహజముగా నేనాతని స్థానము నాక్రమించవలె. ఇదియె సరియైన ఉపాయము. ఔరా! వలచిన కాంత చెంత చేరుట యింత కష్టమా? సరిసరి కష్టేఫలి యని కదా పెద్దలందురు. ఆలోచింతము యేదో ఒక దారి దొరక పోదు. [అరుగుపై కూర్చొండును].
ఇందీవరాక్షుడు:- [ప్రవేశిస్తూ] మిత్రమా మణిమకుటా, ఇక్కడేమి చేయు చున్నావు... అరే యేమిటలావునావు ముఖము వాడిపోయినది. చింతా క్రాంతుడవై యేదో పోగొట్టుకొన్న వాని వలె దిగులుగా నున్నావు.
తే!!గీ!! కూర్మి మిత్రమా నీకేమి కొదువ గలిగె
యింత దిగులొంది కుందగా నేల యిపుడు
పరుషము లెవరైననునిను పలికి నారె
వివరముగ దెల్పుము హితుడ! వినగదలతు.
నీ బాధలు చెలికాడనైన నాతో గాక మరెవరితోపంచుకొందువు నేనునీకు చేతనైన సహాయము చేయుదునుగదా! చెప్పుము.
గంధర్వుడు:- (తనలో) ఇతడునాకు సన్మిత్రుడు. తప్పక సహాయముచేయ నెంచును సందేహము లేదు. కానీ యీతని సోదరివరూధిని నను మన్నించి దరిజేరునా యన్నదే సందేహము. యైమైననేమి ఇతనికి నావలపుగాథ వివరించుటే సముచితము.
ఇందీవ:- మిత్రమా యేల యింకనూ యీ పరధ్యానము. అంత చెప్పగూడని విషయమైన వదలివేయుము. అయిననూ అయిన వారితో పంచుకొన్న బాధోపశమనము కలుగునని నీవెరుగవా?
గంధర్వ:- నీవద్ద నాకు దాపరికమా మిత్రమా? చెప్పెద వినుము. మనస్నేహమును నేను బంధుత్వముగా మార్చుకొని నాజీవితమును సఫలము జేసికొన నెంచితిని.
ఇందీ:- ఎంత సంతోషకరమైన వార్త! అదెట్లో వేగమె వివరింపుము మిత్రమా!
గంధ:-
ఆ!!వె!! మనసు పడినవాడ మరువలేకున్నాడ
కాని మగువ మనసు కరుగదయ్యె
కఠిన శిలగ మారి కాదుపొమ్మనెనన్ను
యేమి సేతు మిత్ర యెటుల మనుదు!!
ఇందీ:- ఎవరా మగువ? నీకేమి తక్కువని నిన్ను నిరాదరించుచున్నది. నీవు గంధర్వరాకుమారుడవు. సుసంపన్నుడవు. నిన్నునిరాకరించుట ఆ యింతి మూర్ఖత్వము. ఇంతకూ ఎవరా సుదతి..
గంధర్వ:- ఆయింతి ఆ పూబంతి, నీ సోదరి వరూధిని...
ఇందీ:- ఏమంటివి మా అక్క వరూధినియా? మహదానందము వీనుల విందైన మాట వింటిని మిత్రమా. శాంతించుము-
చం!! సమయము జూచి నీ సుగుణ సాదువిచారములెల్లజెప్పి అ
క్కమనసు మార్చి నీయెడల గల్గు నసహ్యము మాన్పెదన్ హృదిన్
విమలము గాఢమౌనెనరు వేగమె పుట్టగ జేసెదన్ వివా
హమగును మీకు తప్పదిది హాయిగ నుండుము చింతవీడుమా!!.
ఇకపద మనమా సెలయేటి తెమ్మెరల నాసాదించుచు విహరింతము పద!
గంధ:- మంచిది అట్లేచేయుదము పద. (ఇందీవరాక్షుడు ముందుబయటికి కదులును). ఈతడు చేయు ప్రయత్నము యీతడుచేయు గాక! నాపనిలోనేను నిమగ్న మయ్యెదను... (ఇందీవరాక్షుడు వెళ్ళినవైపే విళ్ళి సిష్క్రమించును. రంగస్థలంపైకి వరూధుని ప్రవేశించి అలోచిస్తూ ఆరుగుపైకూర్చొనును) [తెరపడును].
2వ, రంగము
(ప్రవరుని ఇల్లు - ప్రార్థనామందిరం.)
శంకరశర్మ:-
శ్లో!! వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాంపతిం
వందేసూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరమ్.
శ్లో!! గంగా తరంగ కమనీయ జటాకలాపం
గౌరీనిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధం.
(గంట వాయుస్తూ హారతులిచ్చి-పూజ ముగించును)
(సిధ్దుని రూపంలో గంధర్వుడు ప్రవరునికి బయట కన్పించును)
సిధ్దు:- (బయటనుండి) ఓం నమ: శివాయ... ఓంనమ:శివాయ.
ప్రవరుడు:- (ద్వారంవైపువెళ్ళి) ఎవరో సిద్ధుని వలెనున్నారు. మద్గృహంబు నకు అతిథిగా విచ్చేసినట్లున్నారు... మహాభాగా సిద్ధవరేణ్యా స్వాగతం. దయచేయండి. ఈ ప్రవరుని వందనము స్వీకరించండి (వమస్కరించి) ఈ ఆసనాన్నలంకరించండి. (వచ్చి కూర్చొండును).. వీరు మత్ పిత్రుదేవులు. చతుర్వేద పండితులు. మహాభారత భాగతాది అష్టాదశ పురాణముల క్షుణ్ణ్ణముగా నెరిగినవారు.
శంకరశర్మ:- సిద్ధేశ్వరా.. శంకరశర్మ నమస్సులు గైకొనుడు. [నమస్కరించును]
సిధ్దు:- స్వస్తి.
తే!! స్వస్తిబ్రహ్మాన్వయ గభీర జలధి చంద్ర
స్వస్తి విహిత కర్మాచార సాదుచరిత
స్వస్తి గృహమేది రత్నమా సద్గునాడ్య
స్వస్తి సేవితమహదేవ స్వస్తిస్వస్తి!!.
ప్రవరుడు : [నమస్కరించును]
శంకరశర్మ:- నాయనా ప్రవరా నేను వెళ్ళి కోడలికి అతిధి సత్కారముల కేర్పాట్లు చేయమందును. సెలవు - స్వామీ...
సిధ్దు:- శర్మగారు అట్టిప్రత్యేక యేర్పాట్లేమియు మా కవసము లేదు వీరితో నాలుగు మాటలు ముచ్చటించి వెళ్ళివత్తును. తమరు వెళ్ళిరండి వందనములు. (శంకరశర్మ వెళ్లును). ప్రవరా మిమ్ములను గూర్చి చాలా గొప్పగా విన్నాము. ఇప్పటికి దర్మించటం కుదిరినది. మహదానందమైనది.
ప్రవర:- స్వామీ
కం!! ఎందుండి ఎందుబోవుచు
నిందుల కేతెంచినార లిప్పుడు విద్వ-
ద్వందిత నేడు గదా మ-
న్మందిరము పవిత్రమయ్యె మాన్యుడనైతిన్
కం!! మీమాటలు మంత్రంబులు
మీ మెట్టిన యెడప్రయాగ మీపాదపవి-
త్రామల తోయము లలఘు
ద్యోమార్గ ఝరాంబు పౌనరుక్త్యములురివిన్.
సిద్దేశ్వరా! మీరెంతో ధన్యాత్ములు. మా వలె యీ సంసార ఝంజాటము లేమియూ లేక నిశ్చల మనస్కులై పవిత్ర తీర్థములు సేవించి పుణ్యస్థలముల దర్శించి పవిత్రులై ప్రకాశిస్తున్నారు.
సిద్ధ:- ఎంతమట మీ వంటి సంసారులు మాకేమాత్రము తీసిపోరు. సాంసారిక జీవనము మాత్రము సామాన్యమా?
సీ!! కెలకుల నున్న తంగెటిజున్ను గృహమేధి
యజమాను డంకస్థితార్థ పేటి
పండిత పెరటి కల్పకము వాస్తవ్యుండు
దొడ్డిబెట్టిన వేల్పు గిడ్డికాపు
కడలేని యమృతంపు నడబావి సంసారి
సవిధ మేరునగంబు భవన భర్త
మరు దేశపథ మధ్యమ ప్రప కులపతి
యాకటి కొదవు సస్యము కుటుంబి.
గీ!! బధిర పంగ్వంధ బిక్షుక బ్రహ్మచారి
జటి పరివ్రాజ కాతిధి క్షపణ కావ
ధూత కాపాలికాద్య నాధులకు గాన
భూసురోత్తమ గార్హ స్థ్వమునకు సరియె.
ప్రవ:- మాపైగల అభిమానమున అల్లుంటిరే కనీ... మేమెంత? మహాత్మా మిమ్ముచూచిన ఆనందమున అడుగుచుంతిని.
శా!! ఏయే దేశములన్ జరించితిరి మీరేయేగిరుల్ చూచినా
రేయే తీర్థములందు గ్రుంకిడితి రేయే ద్వీపముల్ మెట్టినా
రేయే పుణ్యవనాళి ద్రిమ్మరితిరేయే తోయధుల్ డాసినా
రాయాచోటుల గల్గు వింతలు మహాత్మా నాకెఱింగింపరే.
సిద్ధ:-
ఉ!! ఓచతురాస్యవంశ కలశోదధి పూర్ణశశాంక! తీర్థయా
త్రాచణ శీలినై జనపదంబులు బుణ్యనదీ నదంబులున్
జూచితి నందునందు గల చోద్యములన్ గనుగొంటి నాపటీ
రాచల పశ్చిమాచల హిమాచల పూర్వదిశాచలంబులన్.
శా!! కేదారేశుభజించితిన్ శిరమునన్ గీలించితిన్ హింగుళా
పాదాంభోరుహముల్ ప్రయాగనిలయుం బద్శాక్షు సేవించితిన్
యాదోనాథ సుతా కళత్రు బదరీ నారాయణుం గంటి నీ
యాదేశంబననేల చూచితి నమస్తాశావకాశంబులన్.
అదియట్లుండె వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరధ తురుగ శృంగారచారు చామరచ్ఛటా ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబగు నుదయంబునంగల విశేషంబులు శేషఫణికినైన లెక్కింప శక్యంబె. అంధకరిపు కంధరావాస వాసుకి వియోగభవ దుర్ వ్యథాభోగ భోగినీ భోగభాగ పరివేష్టిత పటీర విటపి వాటికావేల్ల దేలాలతా వలయంబగు మలయంబునంగల చలువకు విలువ యెయ్యెది. యకటకట! వికటకూటకోటి విటంక శృంగాటకా డౌకమాన జరదిందుబింబ గళదమృత నస్తంబునంగల మణి ప్రస్తరంబుల విశ్రాంతి జింతించిన మేనబులక లిప్పుడుంబొడమెడు. స్వస్వప్రవర్థిత వర్దిష్ణుధరణీరుహ సందోహ దోహద ప్రధానాసమాన ఖేల దైలబిల విలాసినీ విలాస వాచాల తులాకోటి కలకలా హూయమాన మానస మదాలస మరాళంబగు రజత శైలంబు నోలంబులన్ కాళగళు విహార ప్రదేశంబులన్ గన్న సంసృతిగ్లేశంబులు వాయవే? సతత మదజలస్రవణ పరాయణైరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్కురువింద కందళ వ్రాత జాతాలాత శంకాప సర్పదభ్రముభ్రమీ విభ్రమ దురంధరంబగు మేరు ధరాదరంబు శిఖరంబుల సోయగంబులు కలయం కనుంగొనుట బహుజన్మ సుకృత పరిపాకంబునంగాక యేల జేకురనేర్చు? నెనిట్టి మహాద్భుతంబులీశ్వరను గ్రహంబున స్వల్పకాలంబునం ననుంగొంటి.
ప్రవర:- మహాత్మా...నాదొక చిన్నసందేహము వేరుగా తలప వలదని ప్రార్థన.
సిద్ధ:- సందేహమా...సంకోచమెందులకు...అడుగుము.
ప్రవర:- సిద్ధేశ్వరా మీరేమో యువకుల వెలె కన్పించుచున్నారు. మరి మీరు దర్శించిన ప్రదేశములేమో అత్యంత దూరస్థములు. యోచించిన అవి ఒక మనుష్యుని జీవితకాల మంతయు విరామము లేక దిరిగిననూ దర్శించిట సాధ్యమా అని...
సిద్ధ:- రావలసిన అనుమానమే...నాకీ ప్రయాణమంతము అత్యంత సులువైనపని. ప్రవరా ఇదిగో చూడుము ఇది ఒక మహిమమాన్విత దివ్యపసరు. దీనినొక బిందు ప్రమాణము పాదములకు రాసుకొన్నచాలును. తలచిన చోటికి తృటిలోచేరవచ్చును. నీసందేహము నివృత్తమైనది కదా!
చం!! అలసటలేక యీపుడమి యందలి తీర్థములెన్ని యేనియున్
తలచినయంతనే తిరిగి ధన్యులమై మరలంగ వచ్చునీ
దళముల చొక్కపుంపనరు దాలిచి పాదములందు ఓ యశో
విలసిత సద్గుణా! యిదియె విన్ము రహస్యము విప్పిచెప్పితిన్.
సీ!! కాశీగయాదుల కనుకొన నిచ్ఛయే
వెళ్ళిరమ్మెక మారు వేడుకలర
తక్షశిలాదులదర్శింప నెంతువే
పోయిరమ్మొక మారు ప్రొద్దుగలుగ
బృందావనాదుల విహరింప దలచితే
కదలి పొమ్మెక పరి కాంక్షదీర
నదనదీ తటముల నడయాడ మనసౌనె
పయన మౌమొకసారి వాంఛదీర.
తే!! ఏదొ ఒక్కటి జూచెద నిన్నియేల
యనిన జాడుము హిమగిరి యందములను
ఎన్న దానికి మించిన దేదిలేదు
పసరు పట్టింతు చాపుము పాదములను.
ప్రవర:- ఆహా.... ఏమి విచిత్రము. స్వామీ మీరు అమితదయా మయులుగా గాన్పించుచున్నాదు. మమ్ములను మన్నించి మాకు సహాయము చేయవలసినదిగా మనవి. సంసారులము ఇల్లువిడిచి బహుకాలము గడుపుటకు వీలులేనివారము. మహిమాన్వితమైన హిమాద్రి దర్శించుటకు మనస్సువ్వీళూరు చున్నది...ఆపసరు...ఆ పాదలేపము...
సిద్ధు:- మీకు కావలెనంతియేకదా! అవస్యము యీ పాదలేపము మీ పాదముల కంటించి హెమాద్రి కంపుటకు మాకేమాత్రము అభ్యంతరములేదు. మీరు నిరభ్యంతరముగా హిమాద్రి వెళ్ళిరావచ్చును. శుభస్యశీఘ్రం.
ప్రవరుడు:- సిద్ధేశ్వరా ఆ పసరు యీ తమలపాకుననుంచుడు. ప్రయాణమునకు ముందు పాదముల ధరింతును. [సిద్ధుడు తమలపాకునకు పట్టించి యిచ్చును] ధన్యుడనుస్వామి. తమరు మా ఆతిధ్యము స్వీకరించిన అనంతరం మీ ఆసీస్సులందుకొని హిమాద్రి విళ్ళి వత్తును.
[తెరపడును]
3వ, రంగము
[హిమాలయ పర్వత ప్రాంతము]
ప్రవర:- ఆహా! యేమి యీ నగ సౌందర్యము.
చం!! అటుకనుగొందు నాహహహ అంబరచుంచి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరేత్కరేణు కర కంపిత సాలముశీత శైలమున్.
కన్నులు కలిగియున్నందుకు నేడుగదా సార్థకత లభించినది ఓహొహొ....
సీ!! తొండముల్ సాచి యందుగు జిగుళ్ళకు నిక్కు
కరుల దంతచ్ఛాయ గడలు కొనగ
సెలవుల వనదంశములు మూగి నెఱివెట్ట
గోల్పులుల్ పొదరిండ్ల గుఱక లిడగ
సెలయేటి యిసుక లంకల వరాహంబులు
మొత్తంబులై త్రవ్విముసైలెత్త
నడ్డంబు నిడువు నా పడ్డలగతి మను
బిళ్ళుడొంకల నుండి క్రేళ్ళు దాట.
గీ!! ప్రబల భల్లుక నఖభళ్ళ భయద మథన
శిథిల మధుకోశ విసర విశీర్ణ మక్షి
కాంతరాంతర దంతురి తాతపమున
బుడమి తిలతండుల న్యాయమున వెలింగె!!.
ఔరా!
మ!! తలమేబ్రహ్మకునైన నీ నగ మహత్త్వంబెన్న నేనియ్యడం
గలచోద్యంబులు ఱేపుగొన్గొని యెదం గాకేమి నే డేగెదెన్
నళినీ బాంధవ భాను తప్తరవికాంత స్వంది నీహార కం
దళచూత్కార పరంపరల్ పయి పయిన్ మధ్యాహ్నముందెల్పెడిన్.
[కళ్ళుమూసుకొని ఇంటికి పోదలచును]
[పసరు పనిచేయకుండుట గమనించును]
అరెరే...గమనింపనైతిని. ఈ మంచు ఫలకములపై నడచితిని నాపాదలేపము తుడుచుక పోయినది...ఇక నే నెట్లు ఇల్లు చేరగలను. యింతలో ఎంత పొరబాటైనది.. మరలి వెళ్ళు మార్గము తెలియదే యేమిసేతును.
కం!! ఎక్కడి యరుణాస్పదపుర
మెక్కడి తుహినాద్రి క్రొవ్వియే రాదగునే
యక్కట మును సనుదెంచిన
దిక్కిదియని యెఱగ వెడలు తెరు వెయ్యదియో!!.
మ!! అకలంకౌషధ సత్వముం దెలియ ! మాయాద్వారకావంతికా
శికురుక్షేత్రగయా ప్రయాగములు నే సేవింప కుద్దండ గం
డక వేదండ వరాహ వాహరివు ఖడ్గ వ్యాఘ్ర మిమ్మంచు గొం
డకురాజల్లునె బుద్ధిజాడ్య జనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్.
సీ!! ననునియుసంబు గానక యున్న నూరెల్ల
నరయు మజ్జనకు డెంతడలు నొక్కొ
యెపుడు సంధ్యలయందు నిలువెళ్ళనీక న
న్నోమెడుతల్లి యెం తొఱలు నొక్కొ
యనుకూల వతి నాదు మనసులో వర్తించు
కులకాంత మదినెంత కుందు నొక్కొ
కెడదోడునీడలై క్రీడించు సచ్ఛాత్రు
లింతకునెంత చింతింతు రొక్కొ
గీ!!. యతిథి సంతర్పణంబు లేమయ్యె నొక్కొ
యగ్నులేమయ్యనొక్కొ నిత్యంబు లైన
కృత్యముల బాపిదైవంబ కినుక నిట్లు
పాఱవైచితే మిన్నులు పడ్డచోట.
[అని తల పట్టుకొనికూర్చొండును. దూరమునుండి ఆలాపన వినిపించును లేచిపరికిందును.]
అల్లంతదూరమున అదిగో ఆశ్రమము కాబోలు కనిపించుచున్నది. అక్కడికి విళ్ళివిచారించెద. దారిచూపు వారుండకపోరు
[అంటూ అటు బయలుదేరును]
[తెరపడును]
4వ, రంగము
[ఉద్యానవనము]
వరూధిని :- (పాట – 2)
సంగీతసాహిత్య సారంబు గ్రహియించి
లయలు హొయలను గూర్చి - అభిన యంబున జూపు
నటన మే కడు రమణము
(ఈ) వరూధిని నాట్యమె - ప్రఖ్యాతము - సంగీత!!
నాపాద మంజీర రవళుల పులకించి
పూల జల్లులు రాల్చె సురపొన్న శాఖలు
నామంద హాసాల రుచులను తిలకించి
పల్లవించిన విట్టె సహకారములు మెచ్చి - సంగీత!!
నాహావ భావాల నటనము నకు పొంగి
కొండ చరియల ఝరులు త్రుల్లింత లిడి జారె
నామేని జిగిబిగి వయ్యారము గనీ
విద్యుల్లత చాల విప్పారి మెఱిసె - సంగీత
నాఆలాపన లహరులవిని పికము
తనగొంతు సవరించి నా తోడ పాడెను
నా లాస్యముగని నెమలులు నా దరి
పురివిప్పి ఆడంగ ఉత్సాహమున జేరె. - సంగీత!!
[పాట ముగియగానే ఇందీవరాక్షుని ప్రవేశం]
ఇందీ:- [ప్రవేశిస్తూ] అక్కా...అక్కా - నీ విక్కడున్నావా? అంత: పురమంతా గాలించి వస్తున్నాను.
వరూ:_ ఎందుకూ? ఏమిటి తమ్ముడూ నాకోసం అదేపనిగా వెతక వలసినంత కార్యమేమున్నది.
ఇందీ:- అక్కా! నీకెలా చెప్పాలో అర్థంకావటంలేదు.
వరూ:- ఏ విషయం తమ్ముడూ నాదగ్గరెందుకు సందేహం. సూటిగా చెప్పేయి.
ఇందీ:- అక్కా నా చెలికాడు మణిమకుట గంధర్వుడు చాలా మంచివాడు ఉదాత్తుడు. సకల కళాపారంగతుడు. రణ విద్యానిపుణుడు, మీదు మిక్కిలి నా శ్రేయేభిలాషి.
వరూ:- అయిన
ఇందీ:- అతడు.... అతడూ....
వరూ:- అతడు నన్ను ప్రేమించుచున్నాడు. నేనాతనిని వివాహ మాడవలెను ఇదియేగదానీవు నాకు చెప్పదలచితిని.
ఇందీ:- అవునక్కా - నామనసులోనిమాట చక్కగా గ్రహించితివి. నీకాతనితో నుద్వాహమైన మా స్నేహము బంధుత్వమై ఆనందదాయక మగునక్కా...
వరూ:- తమ్ముడూ అతనిప్రసక్తి వదిలేయ్, నాకాతడు తగిన వాడుకాడు నేనాతనిని వరించుట కలలో కూడా జరుగదు.
ఇందీ:- అక్కా....
వరూ:- ఏమి? నాకాతనితో బలవంతపు పెళ్ళి చేయుదువా?
ఇందీ:- అక్కానేను నీయనుంగు తమ్ముడను. నీ కయిష్టము కలిగింతునా? అదెన్నటికిని జరుగదు....కానీ...
వరూ:- ఇక కానీ... గానీలతో పనిలేదు..
చం!! వలదని పించె డెందమున వానికి నాకును ప్రేమగీమ నే
వలచిన వాడు నాకు సరివాడగు వానిని జూచినంతనే
పిలిచెద నిన్ను రమ్మపుడు పెండిలి సేయుము నాకు వానికిన్
వలదిక రాయబారము రవంతయు మెచ్చను నీదు మిత్రునిన్!!
ఇందీ:- నీవింత తెగేసి చెప్పినప్పుడు. నేనేమి చెప్పగలను. నీ వివాహము-నీయిష్టం
వరూ:- వెళ్ళు..వెళ్ళి తన్నిష్టపడిన కన్య నన్వేషిచుకొని వివాహితుడై సుఖసంతోషములతో తానుండి తల్లీదండ్రులను సుఖపెట్టుమని నీ మిత్రునకు హితవుబలుకుము.
ఇందీ:- ఇక గత్యంతరమేమున్నది - అట్లే చేయుదును లెమ్ము (వెళ్ళిపోవును)
(వరూధుని అరుగుపై కూర్చొని తన ఊహాసుందరుని భావించుకొని కూనిరాగము తీయు చిండును)
[ ఇంతలో ప్రవరుడు ప్రవేశించును ]
ప్రవరుడు:- ఎవరూ...ఎవరైనా ఉన్నారా? (అంటూ వరూధినిని దాటుకొని కలవరపాటు చే చూడకుండా ముందుకు వెళ్ళును. స్టేజి దాటను)
వరూధిని:- ఆహాయీతడేనా ఊహాప్రియుడు
ఉ!! ఎక్కడివాడొ యక్షతనయేందు జయంత వసంత కంతులన్
జక్కదనంబునన్ గెలువ జాలెడు వాడు మహీవురాన్వయం
బెక్కడ యీతనూ విభవమెక్కడ యేలని బంటుగామరున్
డక్కగొనంగరాదె యకటా నను వీడుపరిగ్రహించినన్.
సీ!! వదన ప్రభూత లావణ్యంబు సంభూత
కమలంబు లన వీని కన్నులమరు
నిక్కివీనుల తోడ నెక్కె సక్కెములాడు
కరణి నున్నవి వీని ఘన భుజములు
సంకల్ప సంభవాస్థాన పీఠిక వోలె
వెడదయై కనుపట్టు వీని యురము
ప్రతిఘటించు చిగుళ్ళ పై నెఱ్ఱవాఱిన
రీతి నున్నవి వీని మృదు పదములు.
గీ!! నేరె టేటియసల్ తెచ్చినీరజాప్తు
సాన బట్టిన రాపొడి చల్లి మెదిపి
పదను సుధనిడి చేసెనో పద్మభవుడు
వీనిగాకున్న గలదె యీ మేనికాంతి.
క!! సురగరుడోరగ నర ఖే
చరకిన్నర సిద్ధసాద్యచారణ విద్యా
ధర గంధర్వ కుమారుల
నిరతము గనుగొనమె పోలనేర్తురె వీనిన్.
[ ప్రవరుడు తిరిగి స్టేజి మీదకు వస్తూ వరూధినికి ఎదురొచ్చి ]
ప్రవర:- అమ్మాయీ (పలుకరిస్తాడు వరూధిని ఉలిక్కిపడి తేరుకొని కొంతబెట్టు నటిస్తుంది)
ఉ!! ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ యొంటి జరించె దోటలే
కివ్వన భూమి భూసురుడనే బ్రవరాఖ్యుడ ద్రోవతప్పితిన్
గ్రొవ్వున నిన్నగాగ్రమునకున్ జనుదెంచి పురంబు జేర నిం
కెవ్విధి గాంతు దెల్పగదవే తెరువెద్ది శుభంబునీకగున్.
వరూధిని:- (చురచుర చూస్తూ)
ఉ!! ఇంతలు కన్నులుండ దెరు వెవ్వరి వేడెదు భూసురేంద్రయే
కాంతము నందునున్న జవరాండ్ర నెపెంబిడి పల్కరించులా
వింత యెగాక నీవె ఱుగవేమును వచ్చిన త్రోవచొప్పునీ
కింత భయంబులేకడుగ నెల్లిద మైతిమి మాటలేటికిన్.
ఆగుగాక మా విషయ మెరిగింతము వినుము.
సీ!! చిన్నివెన్నెలకందు వెన్నుదన్ని సుదాబ్ది
బొడమిన చెలువ తోబుట్టు మాకు
రహిబుట్ట జంత్రగాత్రముల ఱాల్ గరగించు
విమల గాంధర్వంబు విద్యమాకు
ననవిల్తు శాస్త్రంపు మినుకు లావర్తించు
పనివెన్నతోడ బెట్టినది మాకు
హయమేధ రాజసూయము లన బేర్వడ్డ
సవన తంత్రంబు లుంకువలు మాకు
గీ!! కనక నగ సీమ గల్ప వృక్షముల నీడ
బచ్చరా చట్టుగమి రచ్చపట్టు మాకు
బద్మసంభవ వైకుంఠ భర్గ సభలు
సాముగరడీలు మాకు గోత్రామరేంద్ర.
నాపేరు వరూధుని అప్సరకన్యను.
క!! పేరు వరూధిని విప్రకు
మార ఘృతాచీ తిలోత్తమా హరిణీ హే
మా రంభాశశిరేఖలు-
దారగుణాడ్యలు మదీయలగు ప్రాణసఖుల్.
ప్రవర:- మహిళామణీ నీకు నా ఆశీర్వాదములు. భగవంతుడు నీకు శుభముల గూర్చుగాత. మేము సాత్వికులము మా విషయమున అన్యధాభావింపకుము.
వరూ:- (కొంత తగ్గి) క్షమింపుడు - రండు ఆసీనులు కండు. [ఆసనము చూపును] మా ఆతిథ్యమును స్వీకరింపుడు (నేలపై బొటనవ్రేళితో రాస్తూ) మా కానందము గూర్పుడు.
ప్రవ:-
ఉ!! అండజ యాన నీ వొసంగు నట్టి సవర్యలు మాకు నచ్చె నిం
దుండగ రాదు పోవలయు నూరికి నింటికి నిప్పుడేను రా
కుండ నొకండు వచ్చిమఱియెండునె భక్తియచాలు సత్క్రియా
కాండము దీర్ప వేగచనగా వలయున్ గరుణింపు నాపయిన్.
వనితామణీ! మీకు ఎన్నో మహాత్మ్యములుండును - మీకసాధ్యము లుండవు నాకుసహాయము చేసి మాయిల్లు మా వాళ్ళను చేరుకొనే యేర్పాట్లు చేసి పుణ్యం కట్టుకొనుడు.
వరూ:-
ఉ!! ఎక్కడి యూరు కాల్నిలువకింటికి బోయెదనంచు బల్కెదీ
వక్కట మీకుటీర నిలయంబులకున్ సరిరాక పోయెనే
యిక్కడి రత్నకందరము లిక్కడి నందన చంద నోత్కరం
బిక్కడి గాంగసైకతము లిక్కడి యీ లవలీ నికుంజముల్.
ధాత్రీ సురా! (పెదవి పంటనొక్కి..) నీ యందు నాకు వలపురేకెత్తె, మనసు మాటవిన నంటున్నది.
ఉ!! నిక్కము గాపనేల ధరణీసుర నందన యింకనీ పయిన్
జిక్కెమనంబు నాకు ననుజిత్తజుబారి నప్పగించెదో
చొక్కి మరందమద్యముల చూఱల బాటలువాడు తేంత్ల సొం
పెక్కిన యట్టి పూవుబొదరిండ్లను గౌంగిట గారమించెదో?
ప్రవ:- అన్నులమిన్నా నీవు నన్ను....అపార్థము చేసుకొన్నావు
ఉ!! వేలిమియున్ సురార్చనయు విప్ర సపర్యయు జిక్కెభుక్తికిన్
వేళయత్రికమింబె జననీజనకుల్ కడువృద్దు లాకటన్
సోలుచు జింతతో నెదురు చూచుచు నుండుదు రాహితాగ్నినే
దూలు సమస్తధర్మములు దొయ్యలి నేడిలు సేరకుండినన్.
కనుక నాపై కరుణ జూపి యింటికి వెళ్ళు మార్గము జూపుము.
వరూ:- ఏమిటీ వెర్రితనము యీ చిరువయస్సులో వైదిక కర్మా నిష్ఠలా? హా..ఇక నీ వెన్నడు సుఖింతువు. ఐనా నీ నిష్ఠలు నియమాలు యజ్ఞాలు క్రతువులు ఎందుకు? స్వర్గమున మమ్ము కూడుటకే కదా. ఆ స్వర్గసుఖములు నే నయాచితముగా యిప్పుడే అందించు చుండ ఆ నిష్ఠలలో పని యేల రా..రారా మన్మదాకారా... ప్రవరా [అంటూ కౌగిలించును ప్రపరుడు విడిపించుకొనును]
ప్రవ:-
మ!! తరుణీ రేపును మాపు హవ్యములచేతం దృప్తుడౌ వహ్నిస
త్కరుణాదృష్టినొసంగు సౌఖ్యము లెఱుంగన్ శక్యమే నీకు నా
కరణుల్ దర్భలు నగ్నులుంబ్రియములైనట్ల న్యములుగా వొడల్
తిరమే చెప్పకు మిట్టి తుచ్ఛసుఖముల్ మీసాలపై తేనియల్.
వరూ:- నీ వెన్నియైననూ చెప్పుము - నిన్ను గాంచినది మొదలునాలో మన్మదతాపము ప్రకోపించినది. నేనిక తాళలేకున్నాను వనిత తనంత తావలచి వచ్చెనని చులకన సేయకు, బెట్టు సడలింపుము - నన్నేలు కొనుము [అంటూ కౌగిలించుకొని విడువక పట్టుకొనును] [ప్రవరుడు కంపరమొంది గట్టిగా త్రోసివేయును వరూధని విసురకపోయి నేలపై బడును].
వరూ:- [లేచి] ప్రవరా...ఇంత మొరటుదనమా... సుమసుకుమారిని నన్ను నేల బడ త్రోయుదువా - చూడుము (ఏడ్చి) ఇచ్చోట...ఇచ్చోట నీ నఖాంకురములు తాకి యెట్లు నామృదుశరీరమున గాట్లు బడినవో చూడము.
(అంటూ పైట తీసి చూపించును)
ప్రవరుడు:- హా...శ్రీహరి...(అని కళ్ళుమూసికొనును)
వరూ:- చాలుచాలునీ భజన..భక్తి
ఉ!! చేసితిజన్నముల్ దపము చేసితి నంటి దయా విహీనతన్
జేసిన పుణ్యముల్ ఫలము సెందునె పుణ్యము లెన్నియేనియున్
జేసినవాని సద్గతియె చేకుఱు భూతదయార్ద్ర బుద్ధి కో
భూసురవర్య యింత దలపోయవు నీచదువేల చెప్పుమా
సీ!! వెలివెట్టిరే బాడబులు పరాశరు పట్టి
దాశకన్యాకేళి దప్పుజేసి
కులములో వన్నెతక్కువ యయ్యెనే గాధి
పట్టికి మేనక చుట్టఱికము
ననుపుకాడై వేల్పునాగవాసము గూడి
మహిమ గోల్పడియెనే మాందకర్ణి
స్వారాజ్య మేలంగ నేరైరె సురలహ
ల్యాజారుడైన జంభాసురారి.
గీ!! వారికంటెను నీ మహత్త్వంబు ఘనమె
పవన పర్ణాంబు భక్షులై నవసి యినుప
కచ్చడాల్ గట్టుకొను ముని మ్రుచ్చు లెల్ల
దామరస నేత్ర లిండ్ల బంధాలు గారె.
ప్రవ:- (తన వళ్ళు తుడుచుకుంటూ) వరూధినీ... నానియమములు నావి. అయినా నీ ప్రశ్నలకు నేను జవాబియ్య నవసరము లేదు. నిజంగా నా వ్రతములు శక్తివంతములే ఐతే నన్ను రక్షించి తీరుతాయి. [కళ్ళుమూసుకొని చేతులు జోడించును, వరూధిని వెళ్ళిపోవును)
మ!! దివిషద్వర్గము నీ ము ఖంబునను తృప్తింగాంచు నిన్నీశుగా
సవముల్ సేయు శ్రుతుల్ సమస్తజగ దంతర్యామివిన్ నీవ యా
హవనీయంబును ధక్షిణాగ్నియును నీయందుద్భవించున్ గ్రతూ
త్సవసంధాయక నన్ను గావగదవే స్వాహావధూ వల్లభా.
ఉ!! దాన జపాగ్ని హోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ
ధ్యానరతుండ నేని పరదార ధనాదుల గోరనేని స
న్మానముతోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాం
భోనిధిలోన గ్రుంకకయమున్న రయంబున హవ్యవాహనా.
[లైట్ అఫ్ ఆన్]
[సిద్దుడు స్టేజ్ మీదకు వస్తాడు]
సిద్ద:- నాపాచిక బాగానే పారింది వరూధిని ప్రవరుని రూపమును జూచి బ్రమసినది. మన్మధ తూపులకు యెరయైంది. నా అదృష్టము - ప్రవరుడు వరూధినిని తిరస్కరించినాడు. అతడి వ్రత క్రతువులతన్ని కాపాడాయి. అగ్నిహోత్రుడతన్ని యిల్లు చేర్చినాడు. ఏమైననేమి శ్రమలేకుండా నా అడ్డు తొలగిపోయింది ఇక నేను శాంబరీ విద్యతో ప్రవరుని రూపాన్ని ధరించి వరూధినిని సునాయాసంగా వశపరచుకొనియెద.
[తెరపడును]
5వ, రంగము
[వరూధిని తోట]
వరూధిని:- [దు:ఖించుచు]
ఉ!! అక్కట వాడు నాతగుల మాఱడిచేసి దయా విహీనుడై
చిక్కక త్రోచిపోయె దరి జేరగరాని వియోగసాగరం
బెక్కడ నీదుదాన నిక నీ కొఱనోములు నోచినట్టి నే
నెక్కడ వాని కౌగి లది యెక్కడ హా విధి యేమి సేయుదున్.
ఔరా
ఉ!! చొక్కపు బ్రాణమున్ మిగుల సోయగముంగల ప్రాణనాయకుం
డెక్కుడు వశ్యతన్ రతుల నేకట దీర్చి సమేళ మొప్పగా
నక్కున గారవించి ప్రియమందగ నోచని యింతిదైన యా
చక్కదనం బదేమిటికి జవ్వన మేటికి బ్రాణ మేటికిన్
ఏ మైనను మనుజ భామినులే అదృష్టవంతులు.
ఉ!! ఎంత తపంబు సేసి జనియించిన వారొకొ మర్త్యభామినుల్
కాంతుడవజ్ఞచేసినను గాయము వాయుదు రే నమర్త్య నై
చింతల వంతలం జివికి సిగ్గరతిన్ మృతిలేని నాదు చె
ల్వింతయు శూన్య గేహమున కెత్తిన దీపిక యయ్యెనక్కటా.
మాయా ప్రవరుడు :- (ప్రవేశిస్తూ) వరూధినీ...
వరూ:- (తిరిగి చూస్తుంది) (నిర్ణిప్తంగా మొగం ప్రక్కకు త్రిప్పుకుంటుంది)
ప్రవ:- వరూధినీ నేను మనసు మార్చుకొన్నాను. నీకోసం తిరిగి వచ్చాను. ఎటూ యింటికి వెళ్ళలేను - పొగొట్టుకొన్న యింటిపై చింత అనవ సరమని గ్రహించాను. నన్నభిమానించి ప్రేమించి వలచిన నిన్నూ దూరంచేసుకొని నేను సాధించునదేమి? శూన్యము. ఇక నీవే నా లోకము.
ఉ!! ఓ సరసీరుహాక్షి వినవో రతి గౌగిట నీవు చేర్చునిం
పా సురభర్త కునైన గలదా వలదంచు బెనంగ నేను స
న్యాసినె యొక్కటే తహతహన్ మనసొగ్గదు కేళిపై "ననా
శ్వాసిత దు:ఖితే మనసి సర్వమనహ్యా" మన్నెఱుంగవే.
వరూ:- ప్రియా...నా ప్రేమ జయించినది. నే నదృష్టవంతురాలను నే నదృష్టవంతురాలను. (వెళ్ళికౌగిలించు కొనును)
ప్రవ:- దేవి
వరూ:- ప్రియా
ప్రవ:- ఏమనుకోవు కదా!
వరూ:- ఏమది?
ప్రవ:-
కం!! తివురక యింకొక్కటి నిను
గవయునెడన్ వలయు గన్ను గవయును మూయన్
భువినిది యన్మద్దేశ
వ్యవహారము కన్ను దెఱవ నఘమగు దెఱవో!
శా!! ఈ మర్యాదకు నీ వొండంబడిన మే లీభంగి గాదేనిమా
భూమిం జేరగ నెట్లు నీ యొడలితో బోవంగ లేనే కదా
యీ మందాకినిపొంతనీ మునులతోనీ వృక్ష వాటంబులో
భామా యే దపమాచరింతు విధి క బ్రహ్మణ్యమున్ బెట్టుచున్.
వరూ:- ఆ..ఆ.. అంతమా టెందులకు: రతిక్రియా వేళ కనులు మూసికొన వెలె. అంతియేకదా..
ప్రవ:- అంతయే.. అంతియే దేవి. (అంటూ కాస్తా జరిగి తనలో) దీనికొడంబడని యొడల, రతివేళ నానిజ రూపము కనబడును, గుట్టు రట్టవును గదా!
వరూ:- ఏదోమీలో మీరే మాట్లాడు కొనుచున్నారు. ఎందు కింకను దూరదూరమున నుందువు. నీయాన నంగీకరించితి. రమ్ము దరిచేరుము.
ప్రవ:- ఏమున్నది వరూధిని.
ఉ!! నీచనుదోయి సంకుమద నిర్భర వాసన మేననూన న
య్యోచిరసౌఖ్యముల్ గనుట యెండె దపం బొనరించి పాపముల్
రాచుట యెండెగా కిహపరంబుల కూరక దూరమై వయ:
శ్రీచన రెంటికిన్ జెడిన రేవడ సౌదునె నీరజేక్షణా!
వరూ:- ప్రియా యేమినాభాగ్యము.
శా!! హానీ నిష్ఠురవృత్తిమాని కరుణైకాయత్త చిత్తంబునన్
మానంజాల నటంచు నేడు శ్రవణా నందంబుగా బల్కుటన్
సూ నాస్త్రున్ వెలవెట్ట కేలితి సుఖార్ణోరాశిలో గ్రుంకితిన్
నా నోముల్ ఫలియించె నా వయసు ధన్యంబయ్యె విప్రోత్తమా.
నీ వెట్లూ చెప్పి తట్లు చేయంగలదాన.... సరియా
ప్రవ:- (నవ్వి) సరి సరి.
పాట - 3 (డ్యూయేట్)
ప్రవరుడు:-
ప్రియ భామిని నీ తలపే
మరిమరి మదిలోన మెదలి
మధుర భావములను రేపి
మనసు వరవ శింప జేసె.
వరూధిని:-
ప్రియ సఖుడా నీ తలపే
మరిమరి మదిలోన కలిగి
మధుర భావములను రేపి
మనసు పరవ సింప జేసె
ప్రవరుడు:-
నీ అధర ఫలరసము గ్రోల
వనశారిక నౌదు నేను
నీపద కమలముల వ్రాల
ఉదయారుణ కిరణ మౌదు. ప్రియభాముని;
వరూధిని:-
నీ తను బిళ్వమును ప్రాక
మాధవిలత నౌదు నేను
నీహృదయా కాశవీధి
తారక నై వెలిగిపోదు ప్రియసఖుదా!!
6 వ, రంగము
[ఉద్యానవనము]
[ఇందీవరాక్షుడు స్వరోచి ప్రవేశింతురు ఇందీవరాక్షుతు ముందు అరుగుపై కూర్చొనును]
ఇందీ:- కుమారా సరోచీ ఆసీసుడవుకా...(స్వరోచి కూర్చొనును) మానహోదరి వరూధినియన్న నాకమిత గౌరవము. ఆమె మాట నే నెప్పుడును జవదాటి యెరుగను. నీవు ఆమె ప్రియ పుత్రుడవు నా మేనల్లుడవు అందుకే నాకు నీవు అత్యంత ప్రీతిపాత్రుడవు. నాకు తెలిసిన అస్త్రశస్త్రము లన్నియు ప్రయోగోపసంహారాలతో నీకు నేర్పి ప్రయోజకుడను జేసుతిని. ఇపుడు నీవు నన్నుమించిన శక్తిమంతుడవు స్వరోచీ! నాదొక చిన్న విన్నపము, ఒక కోరిక...
స్వరోచి:- మేనుకు మేనైనవాడు మేనమామ యని కదా నానుడి-మామా!
తే!! అమ్మ కన్నను మిన్నగనాదరించి
వివిధ విద్యలు నేర్పిన వేల్పువీవు
యిమ్మటంచడుగంగ మీ కియ్యరాని
దేదియును లేదు అడుగుము నిత్తునిపుడె.
ఇందీ:- నీ సుఖసంతోషముల కన్న నాకు కావలసిన దేమున్నది స్వరోచి నాబిడ్డ మనోరమ నీయందు అనురక్తయై యున్నది. నీకు సరిజోడగుటకే వివిధ శస్త్రాస్త్రముల నభ్యసించుచు యీ ఆశ్రమముననే యున్నది. ఇది సూర్యాన్వయ రాజతపసి వీరవర్మ వసించు దివ్యాశ్రమము. ఆయన శిష్యురాలై మనోరమ విద్యల నభ్యసిచినది. దివ్యనదీ స్నానము చేసి శివునర్చించి వత్తునని అదిగో ఆ నదీ తీరమునకు వెళ్ళినది, యిప్పటికే తిరిగి రావలసినది వచ్చుచుండును.
స్వరోవి:- మామా నాకును మనోరమ యన్న ప్రేమాభిమానములు మెండు. మీరు నాకు మరొక వరమిచ్చుచున్నారు. మనోరమ నా అర్థాంగి యగుట నా అదృష్టము. మనోరమను చూడవలెనని నామనస్సు వ్విళ్ళూలుచున్నది ఆహా... యేమినా భాగ్యము.
ఇందీ:- సంతోషము నాయనా... సంతోషము. మీ తల్లిగారికి కూడా యీ శుభవార్త నెరింగించి వివాహమున కేర్పాట్లుగానించెద.
[ఇంతలో ఒక ముని అటుగా వచ్చును]
ఇందీ:- గంధర్వాన్వయ శేఖర నలనాభాహ్వయ వుత్రుడ ఇందీవరాక్షుడ శ్రీశ్రీశ్రీ బ్రహ్మమిత్ర ఋషి వరేణ్యులకు వినయాంచిత నమస్సులు (నమస్కరించును)
బ్రహ్మమిత్ర:- శుభమస్తు....యేమంటివి. ఇందీవరాక్ష నామక గంధర్వుడవా? మా నామము మీ కెట్లుతెలియును.
ఇందీ:- తెలియును స్వామీ మీది అదిగో అల్లంతదూరమున కనిపించు దివ్వాశ్రమము బహుశా వీరవర్మ రాజర్షిని దర్శించుటకు వచ్చియుందురు. (సైగచేని స్వరోచిచి అక్కడే ఆగమని తెలిపి స్వామితో నడచును)
బ్రహ్మ:- అవును...నేను మీకెట్లు తెలియునో చెప్పవైతివి.
ఇందీ:- స్వామీ నేను మిమ్ము నిన్నటి రాత్రి మీ ఆశ్రములోనే దర్శించితిని. మీరు రాత్రంతయు కన్నుల వత్తులిడుకొని శిష్యులకు ఆయుర్వేదము బోధించుచింటిరి. అపుడు మీధ్యాస నాపై మరలించుట కిష్టము లేక దర్మన మాత్రమున సంతృప్తిజెంది మరలి వచ్చితిని.
బ్రహ్మ:- బోధ కడ్డుపడక మంచిపని చేసితివి.
ఇందీ:- స్వామీ నాదొక విన్నపము.
బ్రహ్మ:- ఏమది?
ఇందీ:- స్వామీనాకును ఆయుర్వేదము నేర్వవలెనని యున్నది దయతో నన్నుమీ శిష్యునిగా అంగీకరించి విద్యనభ్యసింపనిమ్ము.
బ్రహ్మ:- ఈ వయసున విద్యనభ్యసింతువా? అందునా ఆయుర్వేద మభ్యసింతువా?
ఇందీ:- మహాత్మా విద్యాధనంబులు గడించుటకు వయసుతోనిమిత్తము లేదని గదా ఆర్యోక్తి కాదనక నన్ననుగ్రహింపుము.
బ్రహ్మ:- ఇందీవరాక్షా నీవు గంధర్వరాజువు రజోగుణ ప్రవక్తకుడవు.
కం!! నటవిట గాయక గణికా
కుటిల వచ శ్శీధురసము గ్రోలెడు చెవికిం
గటువీ శాస్త్రము విను నీ
విటు నా వెంట బడదగదు యిక నిలువుమిటన్.
[అంటూ బయటికి వెళ్ళి పోవును]
ఇందీ:- స్వరోచీ నే నిప్పుడే వచ్చెదను. నీ విచటనే నిలువుము. మనోరమ వచ్చుచుండును. వచ్చిన పలకరింపుము. ఇంతలో నే తిరిగి వచ్చెను...స్వామీ-స్వామీ (అంటూ బ్రహ్మ మిత్రుడు వెళ్ళినవైపునకే వెళ్ళిపోవును)
స్వరోచి:- మామగారికేలయీపట్టుదల ఆస్వామి నింత బ్రతిమలాడ వలెనా? కానిమ్ము అంతయు మనముంచికే . మరోరమను యేకాంతముగ కలిసికొను అవకాశము కల్గినది అదిగో మనోరమ వచ్చినది. ఆ వనమమూరముతో అచ్చట ఆటలాడుచ్చున్నది. ఆహా మనోరమ సౌందర్యము వర్ణనాతీతము - పేరుకు తగిన ఆందము నిజముగా మనస్సును రంజింపజేయుచున్నది.
సీ!! రంభను సృష్టించి రసికత నింపంగ
రవ్వంత కొదువ యై రాణతగ్గె
మేనకన్ నృజియించి మెరుగులు దిద్దంగ
చేజారి యొక్కింత చెన్నుదరిగె
చేసి తిలోత్తమన్ జిగిబిగి సంధింప
కొంత సమతదప్పి క్రుంగె కళలు
తప్పొక్కటియు లేని తన్వంగి గావింప
నదిమనోరమ రూపమగుచు నిలిచె.
తే!! అజుడు చేసిన భామలందగ్రగణ్య
వనుచు మెచ్చంగ యిసుమంత యౌనెకల్ల
లలిత లావణ్య సౌందర్య కలికిదనము
లలన కమరినట్టి సహజ లక్షణములు!!
అదిగో మనోరమ యిచ్చటికే వచ్చుచున్నది. నేనీ చెట్టు చాటునదాగి ఒక ఆటపట్టించెద (దాగికొనును)
మనోరమ:- (పూలసజ్జ వయ్యరంగా వూపుకొంటు వస్తు పాటపాడును).
మనోరమ:-( పాట-4)
ఏదొ..ఏదొ...ఐనది-నాలొయేదొ ఐనదీ
మదిని యేవొ గిలిగింతలు-మరిమరి కలిగినవి నేడు---ఏదొ!!
ప్రియుని తలుపు యెదలోపల-కలిగి మరపురాదదేల
నన్నుజూచి నవ్వెనేల-ఈ మల్లిల విరులు నేడు - ఏదొ!!
మరుని బాణమేదొ యెడద. గాయ పరచి మరులు గొలిపె
బాలనేనురా మదనా - జాలి సుంత చూపవేల - ఏదొ!!
[స్వరోచి వెనుక నుండి వచ్చి మనోరమ కనులు మూయును]
మనోరమ:- ఎవరూ ... ఎవరు మీరు ... వదలండి - వదలండి లేకపోతే...
స్వరోచి:- (వదలి) లేకపోతే..యేంజేస్తాదేమిటి?
మనోరమ:- స్వరోచీ...నీవా...వచ్చిఎంత సేపైనది. మా అత్తగారుక్షేమమే గదా!
స్వరోచి:- అత్తా అత్తాకొడుకూ అంతా క్షేమమే దేవి (సమీపించ బోవును)
మనోరమ:- దూరం, దూరం .. నాన్నగారిక్కడే వున్నారు.
స్వరోచి:- ఉంటే..
మనోరమ:- మనప్రేమ వ్యవహారం ఆయనకు తెలిసి పోతుంది.
సర్వచి:- అది మామగారికి తెలియ దనుకుంటున్నావా? ఎప్పుదో తెలుసు
మనోరమ:- ఎలా...ఎవరుచెప్పియుందురు.
స్వరోచి:- ఎవరో ఎందుకు ఆయనే మన మన సెరిగి, వివాహము నిశ్చయింతునని నాతో చెప్పి ఆనంద పరవశులయ్యారు.
మనోరమ:- ఆహా! అలానా?
స్వరోచి:- అవునుదేవి--
స్వరోచి:- (పాట-4(1) )
మావిచిగురు మేసిపికము - మనకు శుభము పలికె వినుము
(కూకూశబ్దంవినబడును)
గగన మందు పాలపుంత - తల్పమగుచు మనల పెలిచె -
మనోరమ : -
ఏదొ!... ఏదొ!!
స్వరోచి:-
నిన్నుతలచి తలచినేను - లోకమెల్లమరచిపోతి
ఇందు నందు నెందుజూడ - నీదు రూపె గానిపెంచె -
మనోరమ:- ఏదొ!...ఏదొ!!.....
7వ, రంగం
( ఆశ్రమ వాతావరణం)
[బ్రహ్మమిత్రుడు కూర్చొని యుండును]
ఇందీ:- (ప్రవేశించి) గురువులకు ప్రణామములు.
బ్రహ్మ:- శుభం..అరె..ఇందీవరాక్షా! ఇక్కడ నా! ఆశ్రమమున..నీవేమిచేయుచున్నావు.
ఇందీ:- వెర్రిస్వామీ - మీరు నన్ను కసరి వెళ్ళిపొమ్మనిన మరుపటి నాటి నుండి ఇక్కడే యీ ఆశ్రమము లోనే వున్నాను. శాంబరీ విద్యచే ఒక్కొక్కసారి ఒక్కో విద్యార్థి రూపుదార్చి కాయ బాల గ్రహోర్థ్వాంగములను. శల్యదంష్ట్ర జరా వృషసంజ్ఞలను క్షుణ్ణముగా నేర్చుకొంటిని. రుచుల దోషములు చిసిత్సలోని మర్మములను గ్రహించితిని. ఇక మీకు గురుదక్షిణ యిచ్చుటే తరువాయి కోరికొనుడు దక్షిణ సమర్పించుకొనెదను.
బ్రహ్మ:-
కం!! ధనరాజ్య రమా మదమున
గనుగానని నిన్ను శిష్యుగానెటు జూతున్
చనుమిచ్చోటు విడచి నను
గనలించిన చెడెదవీవు కనవడ కింకన్.
గంధర్వాధమా వెళ్ళు నాకునీ దక్షిణలతో పనిలేదు. యీ నాటితో నాశిష్యుల చదువు ముగిసినది. వారుప్రేమతో సమర్పించు ఫలపుష్పాదులే మాగు గొప్ప గురుదక్షిణలు సత్వరమే వెళ్ళిపొమ్ము ఇంకెప్పుడూ నాకంట బడకుము.
ఇందీ:- ఇందులో నేనుచేసిన తప్పేమిస్వామీ? విద్యనర్థించుటతప్పా. విద్యనేర్పననుట మీరుచేసినతప్పు - కాదందురా?
శా!! తండ్రీ! నాకు ననుగ్రహహింప గదే వైద్యంబంచు బ్రార్థించినన్
గండ్రల్ గా నటులాడి ధిక్కృతుల బోకాల్మంటి వోహోమదిం
దీండ్రల్ గల్గిన వారికేసరణి నేనిన్ విద్యరాకుండునే
గుండ్రా డాచిన బెండ్లి యేమిటికి జిక్కునే గష్టముష్టింపచా!!
బ్రహ్మ:- ఔరా! యేమిరా నీ కండక్రొవ్వు. కుటిలాత్మా యటమటమ్మున విద్య కొనుట యేగాక గుటగుటలు గురువుతోనా ఆసురి యగు మాయ మా యెడం ప్రయోగించి వంచించి విద్య సపహరించితివిగావున అసురవై నరపశు మాంస భక్షణేచ్ఛవై వసుధ దిరుగుము. యిదే నాశాపము (కమండలవు లోని నీరు చల్లును)
ఇందీ:- స్వామీ నా అజ్ఞానమును మన్నింపుడు (కళ్ళపైబడును).. అయ్యో రాక్షసుడనై నరమాంస భక్షణ సేసి యెట్లు జీవింతును. మీరు దయార్ద్రహృదయులు నన్నుక్షమింపుడు శాపము నుపసంహరింపుడు. స్వామీ కృపాసింధో పాహిమాం పాహిమాం (ఏడ్చును)
బ్రహ్మ:- (శాంతించి) వత్సాలే...నాశాపమునకు తిరుగులేదు. కొన్నాళ్ళయినా అనుభవించక తప్పదు పగలు గంధర్వుడవై సాయంసమయమునకు రాక్షసుడవయ్యెదవు. తుదకొకనాడు నీ కునార్తెనే మింగ బోయెదవు. అపుడొక ధన్యుని శరాఘాతమున కూలి తిరిగి నీ స్వస్వరూపము దాల్తుతు. నాశావమంతటితో తీరిపోవును. ఇక శీఘ్రమే ఆశ్రమము విడిచి వెళ్ళిపొమ్ము (అని ముని అటునుండి వెళ్ళిపోవును).
ఇందీ:- ఆహో అప్పుడే సాయంసమయము గావచ్చుచున్నది. శాపము ఫలించుచున్నట్లున్నది. నాశరీరము బరువగుచున్నది. ఆకలి దహించుచున్నది. జిహ్వమందమై నరమాంస మాశించుచున్నది. ఆ...ఆ...(అని భయంకరముగా అరుస్తూ స్టేజి దాటి వెళ్ళి మళ్ళీ రక్షసరూపముతో స్టేజి పైకి వచ్చి ఆప్రాంతమంతా చెల్లాచెదరు చేయును మరొకవ్యక్తి రాక్షసరూపముతో రావలసి వుండును).
8వ, రంగం
[ఉద్యానవనం - మనోరమ కూర్చొనియుండును]
మనోరమ:- అంతమూ నాదురదృష్టము. కష్టములపై కష్టములు దాపురించినవి. అనవసరముగా మాతండ్రి ఆ బహ్మమిత్రమునితో వైరము దెచ్చుకొని శాపగ్రస్తుడయ్యె. రాక్షసుడై పౌరులనే తినివేయబూనినాడు. చిన్నతప్పులకు సైతం మరణదండన విధించి ఆదేరాత్రి వారిని తినివేయ నారంభించినాడు. జనులెంతకాలం భరించగలరు. తిరగబడి రాజ్యమునుండి తరిమి వేసినారు - అతని కుమార్తెనైన నాకును యీ వనవాసము తప్పలేదు. దైవమా మాపై దయరాద....
స్వరోచి:- (వస్తూ) మనోరమా...
మనోరమ:- స్వరోచీ...మాతండ్రి జాడ యేమైనా తెలిసినదా?
స్వరోచి:- లేదు..ఈ అటవీ ప్రాంత మంతయు గాలించితిని జాడలేదు. సాయంసమయమైనది. ఇకలే....వెళ్ళుదము. రేపు తిరిగి ప్రయత్నింతుము.
(పెద్ద పెద్ద అరుపులతో రాక్షసుడు స్టేజి పైకి దూసుక వచ్చి మనోరమను పట్టుకొనును)
రాక్షసుడు:- ఆకలి..... ఆకలి ఈ మగువను భక్షించెద....ఆకలి..ఆకలి ఆ...
స్వరోచి:- ఆగూ....(బాణమెక్కుపెట్టి) ఆమె నా ప్రేయసి వదలిపెట్టు..లేనిచో - ఈ బాణము నీ ప్రాణములు తీయక మానదు - వదలి పెట్టి వెళ్ళు - చావుతప్పించుకో.
రాక్ష:- (వికటాట్టహాసంచేసి) పిల్ల కుంకా నీవానన్ను చంపునది... ఈపడతినే కాదు నిన్నూ చంపి, నేడేకాదు రేపూ విందు చేసికొందును (మనోరమను యీడ్చుకొనిపోజాచును)
స్వరోచి:- మాటలతో ప్రయోజనములేదు...రాక్షసా కాచుకో ఇది పావకాస్త్రం నిన్ను దహించిగానీ వదలను. [రాక్షసుడు పెద్దగా నవ్విఖాతరుచేయక మనోరమను గుంజికొనిపోజాచును) స్వరోచి బాణము వదలును. అంతలో రాక్షసుడు స్టేజి దాటును గానీ బాణంతగిలిన శబ్దమై రాక్షసుడు పెద్దగావుకెకపెట్టును. మనోరమ విడిపించుకొని వచ్చినట్లు తిరిగి స్టేజి పైకి వచ్చును. గిరగిర విరుగుతూ ఇందీవరాక్షుడు స్టేజి పైకివచ్చి పడిపోవును.]
మనోరమ:- (ఇందీవరాక్షుని జూచి) తండ్రీమీరా అని దరిజేరును (ఇందీవరాక్షుడులేచును)
స్వరోచి:- మామా...మామా...మీకేమి కాలేదుకదా?
ఇందీ:- లేదు నాకేమీ కాలేదు. నాయనా నాకు, శాపవిముక్తి కలిగినది. నే నిపుడు మీమామ ఇందీవరాక్షుడను నీవల్లనే నాకు శాపవిముక్తి గలిగినది. నీవు దివ్యాత్మవు - ఇదినామాటకాదు. శాపమిచ్చునపుడు బ్రహ్మమిత్రఋషి చెప్పినమాట. నేనుధన్యుడనైతిని.
[ఇంతలో వరూధుని ప్రవేశించును]
వరూధిని:- తమ్ముడూ..ఎంత కష్టమొచ్చినదిరా నీకు (అంటూ దరి చేరును)
ఇందీ:- మహాపదనుండి గట్టెక్కితినక్కా, నీకుమారుడు నామేనల్లుడునైన స్వరోచి యే నా జీవనదాత. మన స్వరోచి సామాన్యుడు కాడు మహాతోజోసంపన్నుడు దైవాత్మస్వరూపుడు కనుకనే బ్రహ్మమిత్ర మహర్షి చెప్పినట్లు యీతని శరాఘాతమున నాకు శాపవిమోచన మైనది. అక్కా .. నా బిడ్దను నీ కోడలిగా చేసుకొని నన్నూ నా బిడ్దను ఆదరింపుము. కాదనకు. నాకీ వరము, ప్రసాదింపుము.
వరూ:- ఎంత మాట పిల్ల కుందనపు బొమ్మ. అంతా మావానిఅదృష్టము కుమారా స్వరోచి నీకు సమ్మతమేగదా!
స్వరోచి:- అమ్మానీ ఇష్టమే నా ఇష్టము.
వరూ:- ఏమే మనోరమా..నీ మాటేమిటి? [మనోరమ సిగ్గుతోతలవంచుకొని వెళ్ళి అత్తపాదములకు నమస్కరించును. ఇంతలో బ్రహ్మమిత్రమహర్షి మణిమకుటుని శంకరశర్మ (ప్రవరునితండ్రి) ను వెంట బెట్టుకొని రెండు పూలదండలు శంకర శర్మచేత నుండగా ప్రవేశింతురు. వారుని జూడగనే ముందే స్టేజి పై నున్నవారు చేతులెత్తి నమస్కరిచెదరు].
బ్రహ్మమిత్ర:- శుభం.. ఇందీవరాక్షా నిజమునకు నాకు నీపై కోపములేదు నాయనా! నీ మాటలకు నేను క్షణికావేశమునకు లోనై శపించితిని, దివ్యదృష్ఠిచే నీ యోగక్షేమములు వీక్షించుచునేయుంటిని. అందుకే నీ శావియోచనము తెలిసికొని నినుదీవించ వచ్చితిని. [ఇందీవరాక్షుడు కాళ్ళపై బడును] లే నాయనా లే నీకు శుభమగు గాక నేడు నిన్నునాశిష్యునిగా మనసార అంగీకరించితిని .. లే. అమ్మా వరూధునీదేవీ నీకొక పరమ రహస్యము విప్పిచెప్పవలసియున్నది. నీవు నామాట నంగీకరింపక తప్పదు.
వరూ:- మహర్షుల మాట శిరోధార్యము. అజ్ఞాపించడి స్వామీ.
బ్రహ్మ:- వరూధునీదేవీ మణిమకుటుని నీవు క్షమించ వలెను.
వరూ:- ఎంత మాట - నాకాతనిపై యేద్వేషమూలేదు. అతని కోరిక నా తిరస్కారము అవన్నీపాత సంఘటనలు. కాలమే వాటన్నిటిని మరచి పోవు నట్లుచేసినది.
బ్రహ్మ:- కాదు తల్లీ.. ఈతడు నీ యెడల మహాపరాధమే చేసినాడు అయిననూ నేడు క్షమార్హుడు - ఏలయన
ఆ!! నిన్నువీడి వచ్చి నియమాను వర్తియై
కపట వృత్తిమాని తపము జేసె
యేది యేమియైన యీ తడె నీ భర్త
దరికి జేర నిమ్ము ధ్దర్మబుద్ధి!!.
వరూ:- కాదు... నాభర్త ప్రవరుడు.
తే!! కాదు వలదనియు మరల నా కడకు జేరి
నన్ను పెండ్లాడి యేడాది నయము మీర
కలసి సంసారసౌఖ్యంబు కలుగ మెలగి
వెళ్ళె ననువీడి తనయూరు వెదకి కొనుచు!!
ఇదినాదీన గాథ నేను కొడుకునుగని పోషించి వానియందే ప్రాణములు నిలుపుకొని బ్రతుకుచున్నదాన.
బ్రహ్మ:- వరూధినీ ఇదిగో యీతడు శంకరశర్మ ప్రవరుని తండ్రి నా ఆశ్రమము ననే వానప్రస్థము నెరవుచున్నాడు. ఈతని నడుగుము. విషయము తేలగలదు.
శంకరశర్మ:- అవునమ్మా యీ మహర్షి చెప్పినది అక్షరాల నిజము. ఈ మణిమకుటుడే నీపతి. నిన్ను పెండ్లాడినది నీతో సంసార సౌఖ్యమనుభవించినదీ యీతడే. అయితే యితడు నాకుమారుని రూపమున నీవద్దమెలగి నాడు. కనుక యీతడే నీ పతి, యిక -
కం!! ప్రవరుండేతెంచె గృహము
సవనము గావించె నాటి సంధ్యావేళన్
ధవళగిరీంద్రము గనుగొన
వినుమాతడు బక్కతిథినె వెళ్ళెన్ వచ్చెన్.
కనుక నీతో యేడాది ప్రవరుం డుండె ననుట వాస్తవముగాదు. నాకుమారుడు నీ నిర్భంధమును గూర్చీ తను అగ్నిదేవుని వరమున యిలు చేరిన విధమును గూర్చీ పూసగ్రుచ్చినట్లు వివరించి చెప్పినాడు కనుక నాకొడుకు నీ దరికి మరలి వచ్చిన మాట అబద్ధము. అసలు వచ్చినదీ గంధర్వుడే.
ఇందీ:- అక్కా..కొంత వరకు యీ విషయములు నాకును తెలియును. నీవీ మణిమకుటుని మీద చూపిస్తూ వచ్చిన కోపము వలన నీకు జడిసి నేనేమియు మాట్లాడ లేక ఊరకుంటిని.
వరూ:- సరి....మీరు చెప్పినదే నిజము కావచ్చును. అయిన దేదోఅయినది. నేను గంధర్వస్త్రీని స్వర్గవాసిని యీ హిమవన్నగ సౌందర్యము జూచి మనసుపడి యిచట కొన్నాళ్ళుండి పోవ వచ్చితిని. ఈ భూలోక రీతులు మాయలు వహిమల చూచితిని. వుత్రవతి నైతిని. అమృత పాన విశేషమున జరా మరణములు నాకులేవు. ఇంద్రుని వద్దనుండి నాకు పిలుపు వచ్చినది నాకము వెళ్ళితీరవలెను. నిజమునకు నా కదియే సరియగు స్థలము.
తే!! వెళ్ళవలయును నాకము వేగమేను
తనయు నుద్వాహమున్ జూచి తనివి దీర
దీవనల నొసగి మరలి దివికి వోదు
నవనిబాంధవ్య బంధము లన్నివిడచి.
స్వరోచి:- అమ్మా!
వరూధిని:- కుమారా చింతించకు నీవు అదృష్టవంతుడవు. రాబోవు మనువు నీకు జన్మించనున్నాడు. నీ మహత్భాగ్యము వలన నన్ను జూచుటకు స్వర్గమునకు నీవు రావచ్చును పోవచ్చును. నే నచ్చట మునులు పుణ్యాత్ములు మహాత్ములను గంధర్వగాన విశేషమున సంతోష పరచుచు హాయిగ నుందును.
గంధర్వుడు:- నేనునూ కుమారుని వివాహ మహోత్సము కనులార జూచి తిరిగి తలోవనమున కేగి శాంతిగ తపము జేసికొనుచు జన్మతరింప జేసికొందును.
బ్రహ్మమిత్ర:- శుభం-నూతన వధూవరులారా! మీరు ధన్యులు - ఇవిగో పూమాలలు గైకొని ఒకరి నొకరు అలంకరించికొనుడు. మాదీవెనలు పుణ్యప్రదుడైన యీ శంకరశర్మ దీవెనలు బొంది మహదానందముగ వివాహమునకు సిద్ధము కండు. (మాలలు మార్చుకొని దీవెనల బడయుదురు)
శంకరశర్మ:- రేపే దివ్యమైన ముహూర్తమున్నది. పెండ్లిమన ఆశ్రమముననే జరిపింతుము. నేనే పురోహితుడను - శుభం.
బ్రహ్మమిత్ర:- మంచిది - శుభం భూయాత్
(ప్రేక్షకులవైపు తిరిగి) సర్వేజనా సుఖినోభవంతు.
[తెరపడును]
* సమాప్తం *
No comments:
Post a Comment