ఉష
(పౌరాణిక పద్యనాటకం)
రచన
పి.సుబ్బరాయుడు.
42/490 భాగ్యనగర్ కాలనీ
కడప 516002
సెల్-9966504951
ఇందలి పాత్రలు
1. అనిరుద్దుడు 2. శ్రీకృష్ణుడు
3. బాణాసురుడు 4. నారదుడు
5. శివుడు 6 దుర్వాసుడు
7. హేతి 8. ప్రహేతి
9. ఉష/తిలోత్తమ 10. చిత్రరేఖ
11. పార్వతి (గెస్ట్)
ఉష
(పౌరాణిక పద్యనాటకం)
మొదటి రంగము
(తిలోత్తమ సాహసికుల ఆటాపాట)
సాహసికుడు:- ఆఁ...(ఆలాపన)
తిలోత్తమ:- ఆఁ....(ఆలాపన)
సాహసికుడు:- ఆమని రాకను మున్నేకనుగొని
ఈ వని స్వాగత గీతిక పాడెను.
తిలోత్తమ:- ఆ గీతికవిని ఆమని అడుగిడి
ఇల-కళకళలాడి మురిసినదీ
కదలిన కమలము పిలిచినదనుకొనిసాహసికుడు:-బ0గరు మీనపు గడుసుతాకిడికి
తిలోత్తమ:- భ్రమరము ఝుమ్మని దరిచేరినదీ
కొలనికెయందము కూర్చినదీ
సాహసికుడు:-ఆమని......
తిలోత్తమ:-ఆగీతిక....
ఔనో కాదో - నీసరినేగానోసాహ:- వనసౌందర్యము - నకు తలయూచితొ
కొలని కమలమూ - నీవౌదువులే..../ఆమని/ఝుమ్మను భ్రమరము- నేనే యౌదును
తిలో:- వనమహత్మ్యమో - ఆమనివరమో
వలపోకాదో - యే మయ్యినదోనీకలయికమది - గుబులురేపెను
తగిలెనుపో హృది - మదనుని బాణము.../ఆమని/
ఆఁ... ఆఁ... (ఇద్దరూ ఆలాపనచేస్తూ చేయీచేయి పట్టుకొని వలయకారంలో తిరుగుతుండగా తిలోత్తమ మేలిముసుగు గాలికి లేచిపోయి స్టేజి బయట పడిపోవును
దుర్వాసుడు:-(మేలిముసుగు చెతితో పట్టికొని కోపంతో వచ్చి) ఆపండి.
ఏమి మీకండకావరము. ఇది పవిత్ర గంధమాదన పర్వతమనీ.. అందునా మునివాటికయనీ తెలియదా?ఒడలెరుగని మదోన్మత్తులై తపోదీక్షలో నున్నమాపై మీ మలినపు వలువ విసురుదురా? మీరు శిక్షార్హులు. (తిలోత్తమ వైపు తిరిగి)ఇదే నా
శాపము.
కం: కనులకు మదమెక్కి మునుల
వనమున శృంగారమొలుకు వనితా వడిమై
ఘనరాక్షస వంశంబున
తనయగ జన్మంబునంది ధరపై బడుమా!
(సాహసికుని వైపు తిరిగి) ఓరీ సాహసికా .. హరిభక్తుడవని, ఉత్తముడవని దలచి నిన్నీప్రదేశమున నుండనిచ్చితిమి. ఇంత
క్రొవ్వెక్కి ప్రవర్తింతువా? నీవునూ శాపమనుభవింపుము.LLKJ
కం: మదమున కన్నులు గానక
సుదతీ మోహంబునబడి శుంఠగ దిరుగన్
ఇది మొదలు గార్ధభంబై
కదలాడుము పుడమిమీద కడు మలినుడవై.
సాహ:- మునీంద్రా! మమ్ముక్షమింపుడు.
తిలో:- కరుణించి శాపము
మరల్పుడు. (ఇద్దరూ కాళ్ళ పై బడుదురు)
దుర్వాసుడు:- లెండు. వైదొలగుడు.
మీరు యేమాత్రమూ క్షమార్హులు కారు. నా కింకనూ కోపము తెప్పింపకుడు. తక్షణమే యీ
ప్రదేశము విడిచి వెళ్ళుడు... ఊ పొండు.
నారదుడు:- (ప్రవేసిస్తూ) నారాయణ
నారాయణ. మహాత్మా.. అనసూయా నందనా! శాంతించండి శాంతించండి
దుర్వాసుడు:- మునీంద్రా!
నమస్సులు. (నమస్కరించి) వీరు కామాంధులై హద్దుమీరి చరించుటేగాక, యీమె పయ్యెద తపమాచరించుకొంటున్న నాపైకి విసరినది.
వీరు శిక్షార్హులు. క్షమార్హులేమాత్రమూకాదు.
సాహ:- మీ బిడ్డల వంటివారము.
చేసినతప్పుకు పశ్చాతాప పడుచున్నము.
తిలో:- మహర్షులార! మాపై
దయచూపండి పొరపాటున నావల్ల తప్పుజరిగినది
మమ్ముక్షమించండి, శాపవిముక్తిని ప్రసాదించండి.(ఇద్దరూ మళ్ళీ నమస్కరింతురు)
నారద:- మునీంద్రా!
తే:గీ. ఈమె లోకోపకారిణి యితడు హితుడు
వయసు మీదున్న వీరల వర్తనమ్ము
సైప దగునయ్య తగదయ్య శాపమియ్య
కరుణ కురిపించి వీరిని కావవయ్య.
దుర్వాస:- (కోపంగా)
నారదమహర్షీ! ...
నారద:- మునిగణశ్రేష్టా!..
మీకు తెలియని దేమున్నది. ఈ తిలోత్తమ పరమోత్తమురాలు. విశ్వవిపత్తును బాపుటకు
బ్రహ్మానుమతిని బడసి విశ్వకర్మచే నిర్మింప బడిన సుందరి. ఈమెవల్లనేకదా లోకకంటకులైన సుందోపసుందుల
పీడ విరగడైనది. దేవతల స్తుతులంది చంద్రలోకయాత్ర చేస్తూ యీ గంధమాదన కోనలో, మన సాహసికుని ప్రేమలోపడి మీ ఆగ్రహమునకు గురియైనది.
(సాహసికుని వైపు తిరిగి) మరి యీ సాహసికుడో హరిదాసుడు. మీదుమిక్కిలి మీపై
భక్తిప్రపత్తులు గలవాడు. సాత్వికుడు. వీరిని కనికరించండి. వీరు నిజంగా
క్షమార్హులు. (సైగచేయును ఇరువురూ దుర్వాసుని కాళ్ళపై బడుదురు.)
దుర్వా:- లేవండి. మీకు శాపము
అనుభవింపక తప్పినది కాదు.
సాహ/తిలో:- మహాత్మా!
దుర్వాస:- భయపడకండి.. ఈ
శాపములు మీయెడ వరములై భాసిల్లగలవు.. తిలోత్తమా! మహాతపస్సంపన్నుడూ పరమ శివ భక్తుడు,
శివతాండవము వేళ మృదంగము వాయించు కళాకారుడూ నైన
బాణాసురునకు పుత్రికవై పుట్టి "ఉష" యన్న పేరున ప్రఖ్యాతి గాంచెదవు.
పార్వతీదేవి శిష్యురాలవై లాస్యమును కైలాసము నుండి భువికి దించి వ్యాపింపజేయగలవు.
శ్రీకృష్ణుని పౌత్రుడగు అనిరుద్ధుని వివాహమాడి పుత్రపౌత్రాభివృద్ధినిపొంది
తరింపగలవు.. సాహసికా! నీవు బృందావనమున గార్ధభాసురుడవై చరించుచుండగా
శ్రీకృష్ణపరమాత్మ నిన్ను వధించి కైవల్యము ప్రసాదింపగలడు. శుభమస్తూ!
సాహ/తిలో:- మహాప్రసాదము.
(నమస్కరింతురు. స్టేజి స్టిల్ అయిపోతుంది)
నారద:- (ముందుకువచ్చి)
నిజమే దుర్వాసులవారి శాపము వీరియెడ వరమేయైనది. సాహసికునకు కైవల్యము
ప్రాప్తించనున్నది. మరి తిలోత్తమవిషయమో? ఆమె మరొక మహత్తర కథకు కథానాయిక కానున్నది.
సంతోషము చాలా సంతోషము. నారాయణ..నారాయణ. (మరొక మైకు
దగ్గరకు మారి) ప్రేక్షక మహాశయులారా! కళాభిమానులారా! ఈ అతిలోకసౌందర్యరాశి
"ఉష" కథను నాటక రూపమున తిలకింప మనసగు చున్నదికదా!.. ఆవశ్యము తిలకింతురు
గాక!
సూచన:- ఇక్కడ నాటకసంస్థ
వివరాలూ, సన్మాన కార్యక్రమమునకు సంబంధించిన వివరాలు కూడా నారదపాత్రద్వారా చెప్పించి
సభను కూడా జరుకొన వచ్చును. సభానంతరం నాటకం తిరిగీ ప్రారంభించవచ్చును.)
రెండవ రంగం
(ఆకాశవీధి సీన్ ముందు నారదుడు)
నారద:- పాట.
హరీ..... నారాయణా - హరినారాయణా
శ్రీమన్నారాయణా! - లక్ష్మినారాయణా
(ఆనంద పారవశ్యమున నృత్యం చేయును.)
నీగుణజాలమూ - లెన్నగలేక
హరబ్రహ్మాదులు - అనంతుడనరే
మాతరమా ప్రభూ - నిను కొనియాడ
నీరజనయనా - భవభయ హరణా.../హరీ/
కోరెడి విబుధుల - కాదని నిన్నే
కోరి నీయెదనే - కొలువయ్యె రమా
నీకై తపియించు - నీభక్తులకూ
కల్పవృక్షమై - వరముల నిత్తువు../హరీ/
వైభవమలరగ - మునిజనకోటి
నిన్నేదలచుచు - పరమ హంసలై
నీదయ కలుగగ - సాయుజ్యము గని
తరియించిరిగద - నీరదశ్యామా.../హరీ/
(పైనుంచి బాగా పరికించిచూచి) ఆహాఁ.. అప్పుడే కైలాసము
జేర వచ్చితిని హరినామస్మరణ ప్రభావము కాలమిట్టే గడచిపోగలదు. ఆహాఁ.. మహదేవ
నగరము ఉత్సవభరితమై యున్నది. ఓహోహో.. యేమివైభవము
యేమికలకలము.
సీ: తన నిజరూపమింతయు నున్కిదెలియక
వాదంబుచేసెడు వేదరవము
కరుణావలోకనా కాంక్షితులైయున్న
బ్రహ్మాది సనక సంప్రణుతిరవము
సారశివానంద
సల్లాపముల నొప్పు
ప్రమదగణాళి యార్భట రవంబు
డమరు
మృదంగాది ఢమఢమ ద్వనితోడి
పటు భృంగి నాట్య విస్ఫార రవము
తే:గీ. మానుగా జామరలు వీచు మాతృకాది
కామినీజనమహిత కంకణరవంబు
మెండు జలగగ గన్నుల పండువయ్యె
గొండరాచూలి పెనిమిటి నిండుకొల్వు
ఈసంబరములిప్పుడే ముగియునట్లు లేవు. అదిగో తర్వాతి
కార్యక్రమమునకు యేర్పాట్లు త్వరితగతిని సాగుచున్నవి. బాణాసురుడు కోబోలు తన తనయ ఉష
తోడ ప్రవేశిoచుచున్నాడు. అరెరే.. బాణాసురుడు మృదంగము మెడను
వైచుకొన్నాడు. ఇక బాణుని మృదంగ వాద్యమునకు శివతాండావము జతగలియనున్నది. అద్భుత
సన్నివేశము. ఇది నాకన్నులు జేసికొన్న పుణ్యము. అవశ్యము తిలకించెద గాక.
(లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)
(ఉష శివపదములకు గజ్జలు కట్టుచుండును పార్వతి ప్రక్కన
కూర్చొని యుండును)
శా: వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సుర్య శశాంక వహ్ని నయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయంచ వరదం వందేశివం శంకరం
ప్రభూ! నా కళ సార్థకమైనది. మీ నటనమునకు నా మృదంగమమరుట నాపురాకృత సుకృతము. ఇక ప్రారంభింతమా?
శివుడు:- అవశ్యము.
నారద:- (ప్రవేశిస్తూ)
నారయణ.. నారాయణ...
శివుడు:- నారద మునీద్రులకు
స్వాగతం. (ఆసనం చుపును. అందరూ నారదునకు నమస్కరింతురు. నారదుడు దీవించి
కూర్చొండును)
(శివతాండవము - బాణుని మృదంగము - ఉష పార్వతి చెంత
క్రింద కూర్చొని చేతులతో తాళమువేయును)
జటాటవీ గల జ్జల ప్రవాహ ప్రవితస్థలే
గలేవలంబ్యలంబితాం భుజంగ తుంగ మాలికామ్
డమడ్డమ డ్డమమడ్డమ న్నినాదవడ్డ మర్వయం
చకార చండతాండవం తనోతు న శ్శివశ్శివమ్
జటాకటాహ సంభ్రమ భ్రమ న్నిలింప నిర్ఝరీ
విలోలవీచి వల్లరీ విరాజమాన మూర్ధని.
దగద్దగద్దగ జ్జ్వలల్లలత పట్ట పావకే
కిశోర చంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ.
జటా భుజంగ పింగళ స్ఫుర త్ఫణా మణిప్రభా
కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే.
మదాంధసింధుర స్ఫురత్త్వ గుత్తరీయ మేదురే
మనో వినోద మద్భుతం బిభర్తు భూతభర్తరీ.
కరాల ఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల
ద్ధనుంజయా ధరీకృత ప్రచండ పంచసాయకే
ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రక
ప్రకల్పనైక శిల్పని త్రిలోచనే మతిర్మమమ.
అగర్వ గర్వ మంగళా కళాకదంబ మంజరీ
రసప్రవాహ మాధూరీ విజృంభణా మధూవ్రతమ్
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం -
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే.
జయత్వదభ్రవిభ్రమ భ్రమద్భుజంగ మస్ఫుర
ధగద్ధగద్వినిగ మత్కరాళఫాల హవ్యవాట్
ధిమిద్ధమి ద్ధిమిధ్వనస్మృదంగ తుంగ మంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండ తాండవ శ్శివా.
శివుడు:- బాణాసురా!
అద్భుతము. నీ మృదంగ విద్యాకౌశలము అనితర సాద్యము. నే న త్యoత ప్రసన్నుడనైతిని కోరుకొనుము నీ యిచ్ఛవచ్చిన వరములు కోరుకొనుము ప్రసాదించెద.
బాణాసుర:- మహాదేవా!
కైలాసమునకు రాగలుగుటే భాగ్యము, అందున మీ దర్శనము మహద్భాగ్యము. అంతియెగాక మీ తాండవమునకు మృదంగము వాయించగల్గుట
అంతకంటెనూ మహత్భాగ్యము. నా కింతకన్ననూ వేరేమి కావలయును ప్రభూ.
శివుడు:- బాణాసురా! ఇది
సంతృప్తి తో నేను నిన్ను మెచ్చి యిచ్చుచుంటిని, నీయిచ్ఛవచ్చిన వరము కోరుకొనుము.
బాణాసుర:- ఉ: శంకర భక్తమానస వశంకర దుష్టమదాసురేంద్ర నా
శంకర పాండునీలరుచిశంకరవర్ణనిజాంగ భోగి రా
ట్కంకణ పార్వతీ హృదయకైరవ కైరవమిత్ర యోగిహృ
త్పంకజ పంకజాప్త నిజతాండవఖేలన భక్తపాలనా.
ఇదె వరము కోరుకొను చుంటిని, ప్రసాదింపుము.
ఉ: దేవ మదీయ వాంఛితము తేటపడన్నిటు విన్నవించెదన్
నీవును నద్రినందనయు నెమ్మిని నాపురి కోటవాకిటన్
గావలి యుండి నన్ను గృపగావుము భక్త ఫలప్రదాత యో
భావ భవారి నీ చరణపద్మము లెప్పుడు నాశ్రయించెదన్
శివుడు:- ప్రియభక్తా! నేను
లేనిదెక్కడ? సర్వాంతర్యామిని. కానిమ్ము, నీవు కోరినయట్లే నేటినుండి పార్వతీసమేతుడనై శృంగి, భృంగి. నంది, తారకాంతకాది భూతగణంబులతోడ శోణపుర కోట వాకిటికడ కొలువై యుండెద. సంతోషమేకదా!
బాణాసుర:- మహదానందము. ప్రభూ మరొక నిన్నపము.
శివుడు:- ఏమది భాక్తా!
బాణాసురుడు:- శివా! నా కుమార్తె
ఉషను ఆశీర్వదింపుడు. (ఉష తండి దగ్గరకు వచ్చును) దేవ! తగిన వరుని సూచింపుడు.
శివుడు:- గౌరీవరప్రసాదితయగు
ఉషకు లోటేమిటి? గౌరియే తగిన వరుని సూచింపగలదు. గౌరీ..
పార్వతి:-( ఉష గౌరికి మ్రొక్కును.
గౌరి దీవించి చిరునవ్వు నవ్వి) ఉషా! నీ కల్యాణము లోక ప్రసిద్దము కాగలదు. త్రిభువన
సుందరుడు, వీరుడు, సజ్జనుడు నీకు నచ్చినవాడు నిన్నుజేరి కల్యాణమాడగలడు. పుత్రపౌత్రాభివృద్ధిజెంది
వెలుగొందగలవు. అంతియెకాదు నాకు ప్రత్యక్ష శిష్యురాలవై లాస్యము నేర్చి భూలోకమున
వ్యాపింపజేయగలవు. మహాకళాకారుడు, భక్తుడు నైన బాణాసురుని పేరు నిలుపగలవు. పుట్టింటికి మెట్టినింటికి కీర్తి
తేగలవు. శుభం
బాణాసుర:- మాతా మహాప్రసాదము.
(మొక్కును)
తెర పడును
మూడవ రంగము
(అనిరుద్ధుడు క్రిందనున్న
దర్పణము జూచి పైనున్న పండు పడగొట్టును.)
కృష్ణ:- (కరతాళద్వనిజేసి )
చక్కనిగురి, అద్భుతవిద్య. పౌత్రా.. అనిరుద్ధా! నీ ప్రత్యేక విలువిద్యాభ్యాసము ముగియవచ్చిన
దనుకొందును.
అనిరుద్ధుడు:- ఔను పితామహా!
గురువర్యులు అర్జునులవారి శిష్యరికంలో విలువిద్యలోని మర్మములనెన్నో గ్రహించితిని.
కృష్ణ:- అర్జునుడు మేటి విలుకాడు. ఈ యుగమున అతనిని మించిన
ధనుర్విద్యాపారంగతుడు కనరాడు. అందుకే నిన్నతనికి శిష్యుని జేసితిని.
నారద:- (ప్రవేశిస్తూ)
నారాయణ.. నారాయణ..
కృష్ణ:- నారద మునీంద్రులకు
అభివాదములు. దయచేయండి వచ్చి ఆశీనులు కండి మహర్షి. (అనిరుద్ధుడు నమస్కరించును
నారదుడు దీవించును)
నారద:- కుమారా! అనిరుద్ధా!
క్షేమమేకదా.. అర్జునుల ప్రత్యేకశిక్షణాకార్యక్రమము సక్రమముగా సాగుచున్నదా?
అనిరుద్ధ:- అంతా తమవంటి
మహర్షుల ఆశీర్వాదము. విద్యాభ్యాసము పూర్తిగావచ్చినట్లే. ఇకవెళ్ళి గురుదక్షిణ
సమర్పించివచ్చుటే తరువాయి.
కృష్ణ:- దేవర్షీ.. నా
మనుమని ఆశీర్వదించండి. మీవంటి మహాత్ముల ఆశీర్వాదమే వానికి శ్రీరామరక్ష.
నారద:- అవశ్యము.
(అనిరుద్ధుడు కాళ్ళపై బడును)
తే:గీ. హరికి పౌత్రుడు మదనుని వరసుతుండు
సవ్యసాచికి శిష్యుండు సజ్జనుండు
యదుకులాన్వయచంద్రుడు మృదుహృదయుడు
హితుడు అనిరుద్ధుదు ప్రశస్తి కేక్కుగాత.
శుభం. శీఘ్రమేవ కల్యాణప్రాప్తి రస్తు.
కృష్ణ:- దేవమునుల దీవన
శీఘ్ర ఫలదాయకము. మహదానందము దేవర్షీ.. మహదానందము.
అనిరుద్ధ:- పితామహా! నాకు
సెలవిప్పింపుడు. గురువర్యులకొఱకు నేను కరినగరము వెళ్ళవలసి యున్నది.
కృష్ణ:- మంచిది. అక్కడ
పేరుపేరునా అందరనూ అడిగినట్లు తెలుపుము.
అనిరుద్ధ:- అవశ్యము. (ఇరువురకూ
నమస్కరించి వెళ్ళును)
శివుడు:- (తనలో) పరంధామా!
ఏమిటి ప్రభూ నీలీల. కావాలనే యీమాట నా నోట పలికించిరనుకొందును. ఈ యువకుని ప్రక్కన
నిలబడగల కన్య నమనోఫలకమున బాణుబాలిక ఉషగా గన్పించుచున్నది. యాదవ రాక్షసవియ్యమా? ఏదో చిత్రమేజరగనున్నది.
కృష్ణ:- నారద మునీంద్రులేదో దీర్ఘాలోచనలోనున్నారు.
నారద:- కృష్ణా! సర్వాంతర్యామివి.
నీకు తెలియనిదున్నదా.. కానీ ప్రభూ.. భగవద్లీలలు మా కవగత ము కావలెనన్న సామాన్యమా?
కృష్ణ:- దేవమునీ! మీకునూ
సందేహములా? చిత్రముగనున్నది. మీవంటి పరమభాగవతులను సహితము సందేహాస్పదులను చేసిన ఆ
విషయమేమిటో తెలుసుకోదగ్గదే.. తెలియజేయండి.
నారద:
తే:గీ. విడచి వైకుంఠమును మీరు పుడమి బుట్టి
దుష్టశిక్షణగావింప దొడగినారు
భవుడు కైలాసమును వీడి బాణు పురము
వచ్చి భక్తవశుడగుచు వరలె నేడు
ఆహాఁ.. శివకేశవు లిద్దరూ భూలోకవసులైనారు. ఇది వసుధ
జేసుకొన్న పుణ్యము. అయినా యిదేమి చిత్రము స్వామీ.. ఒక భక్తుడు కోరరాని కోరిక కోరుట
పరమశివుడు మందలింపక మన్నించి సరాసరి భక్తునివెంట పరుగిడివచ్చి, వాని గడపకడ కావలియుండుట యేమని చెప్పగలము. ఏమని అర్థము
చేసుకోగలము దేవా?
కృష్ణ:- నారదా! భగవత్తత్వమే
అంత.
తే:గీ. దాసుడైపోవ భక్తుడు దైవమపుడె
దాసుడగుచు భక్తునిసేవ తానెజేయు
అదియు గడచిన నిద్దరు నరయ నొకరె
నారదా భక్తులకు సాటి లేరు జగతి.
నారద:- పరంధామా.. ఆ బాణుడు
అహంకారి .. అతనికి..
కృష్ణ:- నారదా.. ఆ అహంకార
భావమే అతన్ని కళాకారున్ని గావించినది. ఆకళ అతన్ని కైలాసము చేర్చినది. శివునకు
సన్నిహితున్ని జేసినది. నేనన్న భావము లేకున్న యే పనియైననూ జరుగునా నారదా? ఇక ఆ అహం
కారపు పొరతో పనితీరిపోయినది. కనుక బాణాసురుని
అహంకారపు పొర తొలగింపవలసిన సమయమాసన్నమగుచున్నది. తప్పక తొలగింపబడును. ఆ తర్వాత
అతనికతడేసాటి.
నారద:- ఇది సాధ్యమా
ప్రభూ.. ఆ బాణుడు కరుడుగట్టిన అహంకారి. అతని అహంకారము అతి స్థౌల్యముగదా ప్రభూ..
కృష్ణ:- కానిమ్ము
దానికేమున్నది. ప్రభువుతలచిన మూర్ఖుడుసహితము జ్ఞానికాగలడు. బాణుడు తన గర్వమునకు తగిన ఫలితము ననుభవించనున్నాడు. తద్వారా శుద్ధుడై తప్తకాంచనమువలే వెలుగొందనున్నాడు.
నారద:- ఏమోస్వామీ..
యిప్పటికిమాత్రము ఆ బాణుడు ఆడినదిఆట పాడినదిపాటగా నున్నది. శివపార్వతులకు వాని
అగడములు బాల్యచేష్టలుగా గనిపించుచున్నవి. వాటికి వారికి కోపమురాదుగదా! వారు మరింత
ఆనందించుచున్నారు.
కృష్ణ:- నారదా యిదంతయూ
హరలీలావిశేషము. భగవంతునకు వైషమ్యమా? బంధనమా? కోపమా? వాత్సల్యమా? ఆయన ఒకస్థలమునకు పరిమితుడగునా? ఈశావాస్యమిదంసర్వం". సర్వం ఖల్విదంబ్రహ్మ" అను ఉపనిష్ద్వాక్యముల
నెరుగమా? సూర్యచంద్రాదులలోని తేజస్సూ, చతుర్దశ భువనములు, నదులు పర్వతములు, సముద్రములు దశదిశలు యివిఅవి యన్న వివక్షలేక సర్వం ఆయన మయమే. సృష్టి స్థితి
లయములు ఆయన యిష్టానుసారమే జరుగును.
సర్వజీవాశ్రయుడు, సర్వధర్మములకూ ఆధారభూతుడు, సర్వప్రాణి మోక్షప్రదాతా పరమేశ్వరుడే. ఆయనకు పరిమితులా?
నారద:- దేవా! నేనునూ
మాయలోపడి గ్రహించనైతిని. నీవే హరివి నీవే హరుడవు. నీవేసర్వేశ్వరుడవు. హరిహర భేదము అవివేకుల
కల్పన.
కం: పురుషుండాడ్యుడు ప్రకృతికి
బరు డవ్యయుడఖిలభూత బహిరంతర్భా
సురుడవు లోకనియంతయు
బరమేశ్వరుడైన నీకు ప్రణతులివె హరీ.
ప్రభూ.. దేవదేవా..
నాకిక సెలవు. వెళ్ళివత్తును. నారాయణ. నారాయణ... తెరపడును
నాల్గవ రంగము
(మందిరము)
(బాణాసురుడు ప్రక్కల హేతి, ప్రహేతులు - చిత్రరేఖ క్రిందకూర్చొని తాళంవేయుచుండును
ఉష నృత్యం ప్రారంభమగును)
పాట: సంగీతసాహిత్య
- సారంబు గ్రహియించి
లయలు
హొయలను గూర్చి - అభిన యంబున జూపు
నటన మే కడు రమణము -
ఈ ఉష నాట్యమె ప్రఖ్యాతము.
కైలాసగిరినుండి - భువిపైకి దిగివచ్చి
ఉషయోగ్యతను మెచ్చి - మాతపార్వతిదేవి
శుభలాస్యముల నేర్ప - మహిపులకలన్‍దేలె
శ్రీకరంబగురీతి - దిశలెల్ల ద్యుతి నిండె.........../ సంగీతసాహిత్య/
కాళిగజ్జల రవళి - మేఘ నినదము బోలు
కనులకొనచూపులే - మెరపు తీవెలసాటి
చిరుమందహాసంబు - తళుకు తారకతోడు
మేనివొంపులసోంపు - సితచంద్రికల సమము..../
సంగీతసాహిత్య/
బాణుడు:- (చప్పట్లుచరచి) భళా
పుత్రీ భళా.. నీ నాట్యమమోఘము. విశేషకళా విణ్ణాణ వైభవాధికుడగు యీ బాణుని పుత్రిక
వనిపించు కున్నావు. ఓహోఁ.. సాక్షాత్తూ గౌరీమాత శిష్యురాలివి కదా! నీకేమికొదువ.
నారద:- ప్రవేశిస్తూ)
నారాయణ.. నారాయణ.
బాణుడు:- నారదమునీంద్రులకు
నమస్కృతులు. (లేచి) దేవర్షీ.. నాబిడ్డను ఆశీర్వదించండి (ఉష నమస్కరించును)
నారద:- శీఘ్రమేవ కల్యాణ
ప్రాప్తిరస్తు! (చిత్రరేఖ నమస్కరించును)
బాణుడు:- దేవర్షీ.. యీ
కన్నియపేరు చిత్రరేఖ, మా ఉషకు ప్రియమైన చెలికత్తె. పేరుకు తగ్గట్టేచిత్రలేఖనమున అసమాన్య
ప్రతిభాశాలి. మీదుమిక్కిలి మా మహామంత్రి విభాండకుని ప్రియపుత్రిక.
నారద:- బాగు బాగు..
ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు!
హేతి/ప్రహేతి:- దేవమునీ! దండములు
దండములు.
నారద:- వీరు...
బాణుడు:- వీరు దేవాసుర
యుద్ధమున శివైక్యముజెందిన సహేతి కుమారులు. కానీ తండ్రి లక్షణములబ్బినవుకావు.
రవ్వంత బుద్ధిమాంధ్యులు
హేతి:- మహారాజా.. మేమూ
వీరులమే..
ప్రహేతి:- జయించుకొస్తాం.
బాణుడు:- సరి సరి అవసరము రావలెగదా!
నేనే యుద్ధకార్య రిక్తుడనై ఊరకున్నాను. ఈ చేతులకు పనిలేక కండూతి గలుగుచున్నది.
హేతి:- సరే మహారాజా! అవసర
సమయమున మేమూ మీవెంట వచ్చెదము.
ప్రహేతి:- సరేనా ప్రభూ..
బాణుడు:- సరిసరి.. (నారదుని
వైపు తిరిగి ) గొప్ప నమ్మకస్తులు. వీరిని నా కుమారి ఉషకు రక్షకులుగా నియమించుకున్నాను. అంతఃపుర
రక్షణభాద్యత వీరి ప్రస్తుత కర్తవ్యము.
హేతి:- అవునౌను.
మగపురుగును గూడా ఉషాదేవి అంతఃపురము లోనికి ప్రవేశింపనీయం.
ప్రహేతి:- ఇదిగో మా యంత్రంతో యిట్టే పట్టేస్తాం.
నారద:- యంత్రమా?
బాణుడు:- వారి ఉపయోగర్థం నేనే యీ యేర్పాటు చేసితిని వారు
ద్వారమున కడ్డము వేసిన తంతువు పురుషుడు దాటగనే వారివద్దనున్న దారుశారిక పలుకుతుంది.
కనుక వెంటనే జాగ్రత్త పడతారు.
నారద:- బాగు బాగు.. యిక
నేను వెళ్ళివచ్చెద. నారాయణ.. నారాయణ. (నారదుడు వెళ్ళబోతూ హేతి వేసిన తంతువు(దారము)
డాటును. వెంటనే చిలుక పలుకును)
హేతి/ప్రహేతి:- (నవ్వుదురు) బాగు
బాగు యంత్రము పనిచేయుచున్నది. పనిచేయిచున్నది.
నారద:- అయ్యలూ..
యేమిటిది..
హేతి:- పరీక్ష..
యంత్రపరీక్ష.. మీరు మగవారేనని యంత్రం చెబుతున్నది స్వామీ..
నారద:- ఏమిటీ.. నా
పురుషత్వానికే పరీక్షా? నారాయణ.. నారాయణ.
బాణుడు:- మూర్ఖులారా!
యేమిటిది, నారదమునీంద్రులతోనా పరాచకాలు. ఇటురండి ఒకమాట గుర్తుంచుకోండి. స్వామివారు
ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చును, పోవచ్చును. వారికి మాత్రము అడ్డుచెప్పకండి. పెద్దలయెడ భయభక్తులతో మెలగండి.
వెళ్ళండి. నా బిడ్డవెంట అంతఃపురనికి వెళ్ళండి.
హేతి:- తప్పు క్షమించండి
స్వామీ..
ప్రహేతి:- నమోనమః (హేతి, ప్రహేతి, ఉష, చితరేఖ వెళ్ళుదురు)
నారద:- బాణాసురా!..
బహుగొప్పయేర్పాటు, బహుగొప్పరాజభక్తులు బాగుబాగు ఇక వెళ్ళి వచ్చెద. నారాయణ.. నారాయణ (వెళ్ళును)
బాణుడు:- స్వజన ధ్యాస లోపడి
నేడు పరమేశ్వరుని దర్శించుటకు వెళ్ళనైతిని. మతిమరచితిని శివా!
విశ్వేశ్వరాయ నరకార్ణవ తారకాయ
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ
గంగాధరాయ గజరాజ విమర్ధనాయ
చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
ఆనందభూరి వరదాయ తమోమయాయ
నేత్రత్రయాయ సుభలక్షణ లక్షితాయ
ఓం నమః శివాయ. శంభో శంకరా! మహేశ్వరా! నమోనః.
(శివుడు ప్రత్యక్షమౌతాడు బాణుడు కాళ్ళపై బడతాడు)
శివుడు:- బాణాసురా! యేల
యీచింత.. నేను నీకు సర్వదా ప్రసన్నుడను. నీవు నన్నుమరచి నేను నిన్నుమరచి వుండగలమా!
నేను నీ హృదయవాసిని. శుభప్రదాతను.. లే..(లేచును)
బాణుడు:- ధన్యోస్మిదేవా
ధన్యోస్మి. భవా! నాకన్న భాగ్యవంతుడెవడు? సంపూర్ణ శివానుగ్రహమున్ననాకు యెదురేది? పొరబాటున నైనా నావైపు కన్నెత్తి చూడగల ధీరులీ ముల్లోకములలో లేరుకదా దేవా..
శివుడు:- మరి, యిది నీ కభిలషనీయమేకదా.. భక్తా..
బాణుడు:- నిజమే ప్రభూ!
కానీ...
శివుడు:- ఏల సందేహము, శంకరుడను, నాభక్తునకా సందేహము.
బాణుడు:- రణమనునదే లేక నా
బాహువులకు కండూతి కలుగుచున్నది. మరి నాతో పోరు వీరుడా లేడాయె. కనుక..
శివుడు:- కనుక.
బాణుడు:- కనుక నాతో మీరే
పోరునకు దిగవలె. నాకు రణమున సరియైన వుజ్జీ మేరే ప్రభూ!
ఉ: ఆహవభూమి మామక సహస్రభుజాబల తీవ్రధాటికిన్
సాహసలీల నెదిరి శౌర్యము జూపగ జాలినట్టి య
వ్యాహత విక్రమాడ్యుడొకడైనను లేడు నీవుదక్క హా
లాహల లాంచనాంచిత గళా పరిరంభిత సర్వమంగళా!
ఉ: ఆతత వైరి వీర సముదగ్ర కరోద్ధృత హేతిభూత సం
ఘాత విముక్తరక్తజల కాంతులు కంకణ పద్మరాగ సం
జాత మరీచులం గలయ సంగరకేళి ఘటింపజేసి నా
చేతులతీట కౌషదము సేయగదే రజతాద్రి మందిరా!
శివుడు:- (మనసులో) ఏమి వీని
వెర్రీ.. నోతో పోరా! నా మితిమీరిన అనుగ్రహము వీనిలో మదము పెంచినది. సరిసరి యిక
ఉపేక్షింపదగదు. వీని అహంకారము త్వరలోనే అణచివేయబడవలసి యున్నది. (ప్రకాశముగా)..
కం: నాయంత వానితో నని
సేయంగలిగెడును నీదు చేతుల బరువున్
బాయు భదీయ కేతన
మేయెడ ధరగూలు నపుడహీన వివేకా!
నిర్విచారుడవై యుండుము.
బాణుడు:- మహప్రసాదము దేవా!
నీ యంతటి వానితో యుద్ధమా! అతడెవరో తెలుసుకొనవలసినదే! ఏవరు
ప్రభూ ఆతడు.
శివుడు:- నాయంతటి వాడంటినిగదా! అదిగుర్తుంచుకొనుము, నీ కోటపై గల పతాకను గమనించుచూ వేచియుండుము.
బాణుడు:- ఇకనా కోటపై గల
పతాకమెప్పుడు క్రిందపడునో గమనించుచుండెద. శివా నమోనమః
తెర పడును
ఐదవ రంగము
(అంతఃపుర ప్రవేశద్వారము - హేతి, ప్రహేతి కావలి వుంటారు - చిత్రరేఖ వస్తుంది)
హేతి:- (చిత్రరేఖను ఆపి)
ఆగు.. (తంతువు వేస్తాడు చిత్రరేఖ దాటుకొని లోనికి వెళ్ళబోతుంది.)
ప్రహేతి:- అరే.. చిలుక పలకదే!
చిత్రరేఖ:-(వెనక్కు వచ్చి) ఒరేహేతీ ప్రహేతీ అది మగవారు దాటినప్పుడే పనిజేస్తుంది.
హేతి:- ఔనుకదూ.. ఔనౌను .. నీవిక
వెళ్ళవచ్చును.
ప్రహేతి:- చిత్రరేఖా!(చిత్రరేఖ
వెనక్కి వచ్చును) ఏమంటివి? ఒరే హేతి ప్రహేతీ అనిగదా? అంటివి ... తప్పుతప్పు.
హేతి:- మేము మహావీర సహేతి
కొడుకులం. మాపై ఏకవచన ప్రయోగమా? తప్పుతప్పు.
ప్రహేతి:- అన్నా ఈ చిత్రరేఖకు
వ్యాకరణం రాదు.
హేతి:- మనము మనుషుల మెదడు
తిని చదువు నేర్చుకొంటిమి
ప్రహేతి:- అందుకే మనకు తెలివి
యెక్కువ. (వెలికినవ్వు నవ్వును)
చిత్ర:- (తనలో) వీరు
నిజంగానే బుద్ధిహీనులు. (ప్రకాశముగా) ఔనౌను మీకు యెక్కువ నాకు తక్కువ.
ఒప్పుకుంటున్నాను. నేను శాకాహారిని గదా! అందుకే నాకు తెలివి తక్కువ.
హేతి:- ఒరే మళ్ళీ
తప్పుపలుకుతున్నది. నిజంగా యీ చిత్రరేఖకు వ్యాకరణంరాదు. (నవ్వును)
ప్రహేతి:- ఏమిటది.
హేతి:- శాకాహరి యట.. తప్పుకదూ. శాఖాహారి యనవలె.
ప్రహేతి:- ఔనౌను శాకాహారి
కాదు శాఖా హారి. శాఖాహారి ఒత్తు ఖా పలుకవలె.
( ఇక్కడ యింకా "విద్య" "విధ్య"అన్న పదాలను పట్టుకొని కొంత హాస్యం నడుప వచ్చును)
చిత్ర:- (తనలో) సందేహములేదు, వీరు ముమ్మటికీ మూర్ఖులే. వీరియెడ కోపము పనికిరాదు.
వీరితో కాసేపు వినోదించవలె. అదియె మనకు ఆనందమూ, హాయి (ప్రకాశముగా) శ్రీశ్రీ హేతి ప్రహేతి మహాశయులారా!
ప్రహేతి:- మళ్ళీతప్పు.
అన్నగారికేమో శ్రీశ్రీహేతిఅని రెండుశ్రీలు నాకేమో ఒక్క శ్రీ కూడ లేకుండ
ఉత్తప్రహేతి ఊ. ఊ. (అలుగును)
చిత:- సరి సరి సవరించుకొంటున్నాను.
శ్రీహేతి మహశయా, శ్రీప్రహేతి మహాశయా!
ప్రహేతి:- ఇప్పుడుసరిపోయినది...
ఇకజెప్పుము.
చిత్ర:- మీరు
అతితెలివిమంతులుగదా!
హేతి/ప్రహేతి:- అవును..అవును.
చిత్ర:- మీకు..
తప్పుతప్పు... తమరికి
హేతి:- అద్గదీ..
అలా..అలా..అనవలె. ఆ తమరికి..
చిత్ర:- తమరింకా యేయే
విద్యలు నేర్చుకొంటిరి.
హేతి/ప్రహేతి:- నేర్చుకొంటిమి
నేర్చుకొంతిమి.
చిత్ర:- అవియేవో చెప్పగలరా?
హేతి:- తమ్ముడూ.. అవును
మనకు వచ్చిన విద్యలు..(ఆలోచించును)
ప్రహేతి:- రణవిద్యలు..(కర్కషంగా)
యుద్ధవిద్యలు (శూలము గిరగిరా త్రిప్పును)
చిత్ర:- ఆగుము ఆగుము అవిసరే
.. యేవైనా.. కళలు అవే సంగీతమూ సాహిత్యమూ నాట్యమూ..
హేతి:- అవిరాకేం వచ్చును..
ఆట..
ప్రహేతి:- పాట .. నాట్యం...
అన్నీ వచ్చును.
చిత్ర:- ఎక్కడ నేర్చితిరి?
హేతి:- రాకుమారి
ఉషాదేవిగారు ఆడుచుండగా పాడుచుండగా.. చూచి నేర్చుకొంటిమి.
ప్రహేతి:- కొంత తీసివేసితిమి.. కొంత చేర్చుకొంటిమి.
చిత్ర:- ఔరా.. గొప్ప
విశేషమే.. ఏ గురువునాశ్రయింపక, చూచి నేర్చుకొంటిరి. (తనలో) భవిష్యత్తులో యిటువంటివారే మిక్కుటమౌదురు కాబోలు.
(ప్రకాశముగా) మరినేను తాళమువేయుచుంటినిగదా! అదినేర్చుకొనలేదా?
హేతి:- లేదు.. ఎందుకూ..
దండగ.
ప్రహేతి:- నీవున్నావుగా!
మాకునూ నీవే తాళము వేయుము.
చిత్ర:- సరిసరి..
హేతి:- మేముసరే, నీకు మరే విద్యలు తెలియును.
చిత్ర:- నాకేమితెలియును, నేను ఉషాదేవి చెలికత్తెనుగదా! ఆమెతో
సరసోక్తులాడెదను.. చిత్రలేఖనము చేయుదును.
ప్రహేతి:- సరసోక్తులాడెదవా! నీ బొంద నీకు వ్యాకరణమేరాదు.
హేతి:- బొమ్మలుగీయుదువా? ఏమిబొమ్మలు పిచ్చిబొమ్మలు గీయుదువు కాబోలు.
చిత్ర:- సరిసరి..
నేనొప్పుకొనుచున్నానుగదా.. నాకు మీయంత తెలివి లేదు. నావిద్యకేంగానీ మీరు మాత్రం
మంచి విద్యావంతులుగదా.. ఏదీ ఒకపాట, ఒకఆట నాకుచూపించవచ్చుగదా.. చూచి ఆనందించెద.
హేతి:- దానికేం భాగ్యం..
ఆడెదము..
ప్రహేతి:- పాడెదము.. కానీ
నీవునూ మాతో ఆడవలె. సరియేనా?
చిత్ర:- మీ యంత విద్య నా
వద్దగలదా? ఎలా ఆడగలనూ, ఎలా పాడగలనూ..
హేతి:- చూచినేర్చుకో.
కలిసి ఆడూ పాడూ. అదేవస్తుంది. సరేనా?
చిత్ర:- సరే.. (ఆటా పాటా
మొదలు పెట్టుదురు.)
పాట
హేతి:- భూమీ నాదీ - భూమికందమైన ఆ అడవీనాది
ప్రహేతి:- గాలీ నాదీ - గాలిలోనవున్న ఆ గంధము నాదీ
హేతి:- నీరూ నాదీ - నీటకలసియున్న ఆ తీపీనాది
ప్రహేతి:- గగనము నాదీ -
గగనంలో మెఱిసే ఆ చుక్కలునావి
హేతి/ప్రహేతి:- ఆఁ.. (చిత్రరేఖకు సైగచేయుదురు)
చిత్ర:- భూమీగాలీ - నీరూ గగనం
భూమిపై(ని)అడవీ - గాలిలోనిగంధం
నీటికున్న మధురం - గగనంలో కౌముదీ
నావే నావే - అన్నియునావె
హేతి/ప్రహేతి:- మరిమావో....
చిత్ర: మీరూ నేనూ
ఇద్దరూ:- నీవూ మేమూ
చిత్ర:- ఒక్కటైతే
ఇద్దరు:- నింగీనేలా
చిత్ర:- ఈ ప్రకృతీ
ఇద్దరు:- ఈ దిక్కులూ
ముగ్గురు:- మనవే మనవే - మనయందరివే.
చిత్ర:- (తనలో)
మూర్ఖులనుకున్నాను. కానీ వీరికీ కాస్తా తెలివుంది.
ఎంతమంచి పాట పడారు. ఇది గాంధర్వ విద్యలైన సంగీత
సాహిత్య నాట్య మహిమకాబోలు, చక్కగా కుదిరినవి. (ప్రకాశముగా) ఆలశ్యమైనది, ఇక
నేను వెళ్ళివత్తును. మళ్ళీ కలుసుకొందము. (చేయి వూపుతూ
హేతి ప్రహేతిని ఉత్సాహపరుస్తూ లోనికి వెళ్ళును.
బాణాసురుడు ప్రవేశించును)
హేతి/ప్రహేతి:- మహారాజులవారికి
దండములు.
(బాణుడు వారిని చేతితో పలుకరించి లోనికి వెళ్ళబోవును.
వెంటనే చిలుక పలుకును)
హేతి:- మహారాజా! ఆగండి
వెనక్కు రండి.
బాణుడు:- మూర్ఖులారా!..
ఏమిటీ ధి క్కారము.
ప్రహేతి:- ధి క్కారము
కాదు ప్రభూ! .. చిలుక పలికింది
హేతి:- చిలుక పలికింది
కనుక, మీరు మగవారు.
ప్రహేతి:- మగవారికి లోనికి
ప్రవేశము
హేతి:- లేదు.
బాణుడు:- ఓరి అవివేకులారా! నేను రాకుమారి తండ్రిని. నాకు ఆంక్ష లేమిటిరా? నేను వెళ్ళవచ్చును. తెలిసిందా?
హేతి:- ఆమాట
ముందుచెప్పితిరి కాదు. ఊరికేమమ్ముల్ని అవివేకులంటున్నారు.
బాణుడు:- నోరు మూయండి.
కాస్తా బుర్ర ఉపయోగించండి.
హేతి:- చిత్తం చిత్తం.
(బాణుడు లోపలికి వెళ్ళబోయి వెనక్కు తిరిగి)
బాణుడు:- ఒరే హేతీ, ప్రహేతి
ఇద్దరు:- ప్రభూ!
బాణుడు:- ఒరే మగా, ఆడ తెలియడానికి యీ యంత్ర మవసరమా?
హేతి:- ఔను ప్రభూ..
ఎందుకూ..
ప్రహేతి:- చూస్తేనే
తెలిస్తుంది కదా! మరి యెందుకబ్బా..
బాణుడు:- ఓతి
బుద్దిహీనులారా.. మీరు ఆదమరచి ఉన్నప్పుడు, యెవరైనా మీ కన్నుగప్పి వెళ్ళవచ్చుగదా! అప్పుడు మిమ్మల్ని మేల్కొల్పడానికి, అర్థమైందా?
హేతి:- అర్థమైంది ప్రభూ..
బాణుడు:- ఇంకొక్క సమయంలో
కూడా యిది ఉపయోగపడుతుంది, అదేదో చెప్పుకోండి చూద్దాం..
హేతి/ప్రహేతి;- ఏమిటదీ? (ఒకరి మొగాలొకరు చూసుకుంటారు)
బాణుడు:- ఒరే మీరుచెప్పలేరుగానీ.
నేనే చెబుతా వినండి.
హేతి:- చెప్పండి మహరాజా..
(ఇద్దరూ దగ్గరికి వస్తారు)
బాణుడు:- ఎవరైనా మగవారు, ఆడవేషంలోరావచ్చు. అప్పుడు కూడా యీ యంత్రం పనిచేసి దోషిని
పట్టిస్తుంది. తెలిసిందా..
ఇద్దరు:- తెలిసింది తెలిసింది.
బాణుడు:- అలా జరిగితే యేంజేస్తార్రా..
హేతి:- ఆడదుస్తులు ఊడదీసి
ప్రహేతి:- వాతలు వేసి మీ
దర్బారుకు పంపుతాం.
బాణుడు:- ఆఁ.. అలచేయండి.
జాగ్రత్త. (లోనికి లెళ్ళును)
హేతి:- హమ్మయ్య...
గండంగడిచింది.
తెర పడును
ఆరవ రంగము
(ఉషానిరుద్ధుల యుగళగీతం)
అనిరుద్ధుడు:- ఏలనే
ఓసఖీ నీపై నాకింత వలపు
ఉష:- ఏలనో ఓసఖా నీపై నాకింత నెనఱు
అనిరు:-
ప్రేమమహిమ యిదియనంగ - ప్రకృతియెల్ల పులకరించె
గున్నమావి చిగురుమేసి - గండుకోయిలలెల్ల కూసె
గండుకోయిలలు కూయ - గున్నమావి చిగురువేసె
యేదిమున్నొ యెదివెనుకొ - తెలియరాని మోహమాయె / ఏలనే/
ఉష:- ఆకసమున నున్నరవికి - కొలనునున్న కమలానికి
దూరభారమడ్డుపడక - ప్రేమపొంగి పొరలె గనుమా
ఇనుమయస్కాంతమునకు - హత్తుకొన్న విధము తెలియ
ప్రేమకెదిరి యీజగతిన - నిలువగలుగు నేది చెపుమ..../ఏలనో/
అనిరుద్ధుడు:- నీసొగసుల
పాశములకు - కట్టువడితి బంధినైతి
ఈ బంధమె హయిగొలిపి - ఆనందపుటంచు జూపె
ఉష:- నీకౌగిలి
పంజరమున - చిక్కువడిన చిలుకనైతి
చిక్కిన చిలుకగుచు నిపుడు - నన్నునేనె మరచిపోతి .../ఏలనే/
(పాట ముగిసే సమయానికి ఇద్దరూ చేతులు చాచిపట్టుకొని
యున్న భంగిమ నుండి అనిరుద్ధుడు ఉషను విడిచి స్టేజి బయటికొచ్చేస్తాడు. ఉషమాత్రం అదే
మూడ్ లో చేతులు చాచే, నడుము కదులుస్తు ఊగిపోతూనే వుంటుంది.)
చిత్ర:- (వచ్చి) రాకుమారీ.. ఉషాదేవీ.. (గట్టిగా) రాకుమారీ... (ఉష ఉలిక్కిపడి మెలకువలోనికి వచ్చును) ఏమిటమ్మా.. యీ వేళగానివేళ అర్థరాత్రిలో (ఉష సిగ్గుతో తలవంచుకొని ప్రక్కకు వెళ్ళును.)
ఉష:- (తనలో) ఔరా యిది
యంతయూ నా భ్రమ .. కలకాబోలును.
చిత్ర:- మూడుదినములనుండి
చూస్తున్నాను, మీవాలకమే అదోవిధంగా ఉంది. నిన్నటిరాత్రి పడకలో కలవరింతలు. యికయికలూ పకపకలూ.
నేడేమో నిద్రలోనేలేచి యీ పిచ్చిపిచ్చి కులుకులు. నీలోనీవే నవ్వుకొనుటలు, యింతకూ మీకేమైనది రాకుమారీ..
తే:గీ. నేను నీచెలికత్తెనే కాను మిత్రు
రాలను విడచి యుండని ప్రాణసమను
మర్మమేలమ్మ చెప్పమ్మ మనసువిప్పి
చేయ గలిగిన సాయంబు సేతునమ్మ
ఉషాదేవీ! అరమరికలులేక నీ మనసులోని మాట నెఱిగింపుము.
ఉష:- చిత్రరేఖా! నీకంటే
నాకాప్తులెవరు గలరు. ఐనా యేమని చెప్పను. చెప్పిననూ యిది తీరు వ్యధ కాదు చెలీ..
(ఒడిలో చేరి కంటతడి బెట్టును)
చిత్ర:- కలిగిన వ్యధ ఒకరితో
చెప్పుకొన్న ఉపశమించును. సంతోషము ఒకరితో పంచుకొన్న పెరుగును. ఈ నానుడి నీవెరుగవా!
కనుక నాకు చెప్పుటయే నీకు శుభకరము. నా సహాయము నీకవసరమైతే, నన్నాజ్ఞాపించవచ్చును. ఇన్నిమాటలేల నేనే సంతోషముగా నీపని నెరవేర్చుకవత్తును.
ఐననూ ఉషాదేవీ..
ఉ: ఎన్నడులేని విన్నదనమేల మొగంబున దోచెనమ్మ నీ
కెన్నడులేని చింత మది నెక్కడినుండి ఘటించెనమ్మ ముం
దెన్నడులేని యీ కృశత నేటికి దేహము చిక్కెనమ్మ నీ
యున్నవిధంబుజూచి వగనొందెడు నా హృదయబు కోమలీ
శా: బాల నిన్ను మదీయ జీవముగ నే భావింతు నెల్లప్పుడున్
జాలా నే గలుగంగ నెంతపనికిన్ సంతాపమున్ బొందగా
నేలా సిగ్గున గుట్టుచేసి హృదయం బింకిట్లు చింతించుటల్
మేలా దాపకదెల్పు నీతలపు నెమ్మింబూని గావించెదన్.
ఉష:- చెలీ చిత్రరేఖా..
నీతోగాక నింకెవరితో జెప్పుకోగలను.
చ: చెలి కలలోననొక్క సరసీరుహనేత్రుడు హారరత్న కుం
డల కటకాంగుళీయకరణ్మనినూపుర భూషణుండు ని
ర్మల కనకాంబరుండు సుకుమారతనుండు వినీల దేహు డు
జ్జ్వలరుచి నూతన ప్రసవ సాయకు డున్నత వక్షు డెంతయున్
చ: నను బిగియార కౌగిట మనంబలరారగ జేర్చి మోదముం
దనుకగ నంచితాధర సుధారస మిచ్చి మనోజకేళికిన్
బనుపడజేసి మంజు మృదుభాషల దేలిచి యంతలోననే
చనియెను దుఃఖవార్ధి బెలుచన్ నను ద్రోచి సరోరుహాననా!
అతన్ని మరచి ఒక్కక్షణమైనా మనజాలకున్నాను. అతన్ని
కలువకున్న నాజీవములు నిలువవే.. చిత్రా!
చిత్ర:- రాకుమారీ! యేల యీ
బేలతనము. ఎవరో కలలో కనబడినంత మాత్రమున యింత మరులా? తగదుచెలీ.. మరచిపోవ యత్నించుటే యుక్తము.
ఉష:- లేదుచెలీ.. అతడే
నాపతియని మనస్సు ఘోషించుచున్నది. అతడులేని యీ జీవితము వృధా...
తే:గీ. ప్రాణసఖివైన నీకు దాపంగనేల
విన్నవించితి నా మది నున్నవిధము
వాని కన్నులజూపి జీవంబు నిలిపి
గావవే చెలీ చిత్రరేఖావధూటి.
చిత్ర:- ఉషాదేవీ.. తమరు
చాలాదూరమే వెళ్ళారు. అయిననూ చింతింపవలదు
.
చ: సరసిజనేత్ర యేటికి
విచారము నా కుశలత్వ మేర్పడ
నరసుర యక్ష కింపురుష నాగ నభశ్చర సిద్ధ సాధ్య కి
న్నర వరముఖ్యులన్ బటమునన్ లిఖియించిన జూచి నీ మనో
హరుగని వీడె పొమ్మనిన నప్పుడె వానిని నీకు దెచ్చెదన్
చిత్ర:- ఈ చిత్రరేఖ యెఱుగని
లోకము లేదు. ఎఱుగని రాకుమారులూ లేరు.(లొపలికి వెళ్ళి ఒక భూర్జపత్రముల చుట్ట తెచ్చి, నెమలీకను మంత్రించి ఆ కట్టపై త్రిప్పి చిత్రములు
సృష్టించి ఉషకు చూపుచూ) రాకుమరీ.. చూడుము బాగుగాచూడుము. వీరిలో నీ ప్రియుని
గుర్తించి చెప్పుము.
ఉ: మాళవ కొంకణ ద్రవిడ మత్స్య పులింద కళింగ భోజ నే
పాళ విదేహ పాండ్య కురు బర్బర సింధు యుగంధరాంధ్ర బం
గాళ కరూష టేంకణ త్రిగర్త సుదేష్ణ మరాట లాట పాం
చాల నిషాద ఘూర్జరక సాళ్వ మహీశులు వీరె కోమలీ.
వీరు కమనీయ సంగీతకోవిదులు, కింపురుష గంధర్వ కిన్నెరలు. సతత యౌవ్వన
యదృచ్ఛావిహారులు సిద్ధసాధ్యచారణ నభశ్చరులు. ప్రవిమలసౌఖ్య సంపద్వైభవులు సుధాశన మరుద్యక్ష
రాక్షసులు. నిరుపమరుచి కళాన్విత కామరూపులు పన్నగులు. ఇదిగో వీరు యదువీరులు..
వీరిలో చిరువయస్సుననున్న యీ అందగాడిని చూడుము..
సీ: లలిత రేఖాత్రయీ కలిత కంఠమువాడు
ధవళ విస్తార నేత్రములవాడు
ఆజానులంబి బాహావిలాసమువాడు
కమనీయ నీలాలకములవాడు
హారశోభిత విశాలోరస్స్థలమువాడు
తరుణారుణాంఘ్రి పద్మములవాడు
మహనీయ
నీల కోమల శరీరమువాడు
నవదరస్మిత సుధాననము వాడు
తే:గీ. వరుస కల్యాణ గుణవిశేషములవాడు.
మదనశతకోటి సౌందర్య మహిమవాడు
వరగుణుడనిరుధాఖ్యతన్ బరగువాడు
వనిత కనుగొమ్ము నేత్రోత్సవంబుగాగ.
ఉష:- చిత్రరేఖా.. నాకు
జీవితముపై ఆశలు చిగురింపజేసిన దేవతవు నీవు. ఇతడే.. ఇతడే నా ప్రియుడు. చిత్రా..
చిత్రా.. యితడేనే నా మనోహరుడు. (రెండుచేతులూ పట్టి గిరగిరా త్రిప్పును) చిత్రా యీ
మోహనాంగునికి ననుగూర్ప నీవే సమర్ధురాలవు (చేతులు బట్టుకొనును)
చిత్ర:- ఉషాదేవీ..
చింతించకు.. నా విద్యలమోఘములు. నీ ప్రియుని నినుజేర్చు భారమునాది. కానీ...
ఉష:- కానీ..
చిత్ర:- రాకుమారీ..
అనిరుద్ధుడు సాక్షాత్తు జగన్నాధుడైన శ్రీకృష్ణభగవానుని మనుమడు. అతని నపహరించిన శ్రీకృష్ణులవారూరకుందురా!
కానిమ్ము నేనాతని భక్తురాలను. వారు భక్తమందారులు. మనుమడైననేమి? వారు నాకే సహకరింతురుగాక. అసలిదంతయూ వారి యిచ్ఛయే యని నా
మనస్సు దెలుపుచున్నది. ఉషాదేవీ .. మా స్వామి పౌత్రునకు నీవేతగిన కన్యవు. అది ఆయనకు
మాత్రమూ తెలియదా! ఆయన నన్నాటంక పరచడు. ఉషానిరుద్ధుల సమాగమము అనివార్యము.
అనిరుద్ధుడు నీ శయ్యాగృహము నేడే చేరగలడు. జై పరంధామా! శ్రీకృష్ణపరమాత్మా!
అంతానీదేభారము. ఇక యోచించిన మరొక్క ఆటంకమున్నది. అది హేతి ప్రహేతుల
రక్షణవలయము. దానిని అధిగమించుట సులభముకాదు. కానిమ్ము అన్నిటికీ ఆ పరంధాముడేవున్నాడు.
ఇది నా ప్రజ్ఞకే పరిక్షాసమయము... చూచెదగాక!
ఉష:- చిత్రా ..
యోచించినకొలది నాకు భయమగుచున్నది. నిన్ను బహుప్రమాదమునకు లోనుచేయుచున్నానేమో
ననిపిస్తున్నది. జగ్రత్త సుమా!
చిత్ర:- (నవ్వి) భయమెందుకు
రాకుమారీ ... నీవు నిశ్చింతగానుండుము. ధీరులెప్పుడునూ అధైర్యపడరు. శుభమే
జరుగుతుంది.
తెర పడును
ఏడవ రంగము
(హేతిప్రహేతులు ద్వారముకడ శూలధారులై అటూ యిటూ తిరుగుచుందురు)
హేతి:- తమ్ముడూ.. మనం
మహమేధావులం కదా!
ప్రహేతి:- ఔనూ సందేహమెందుకూ..
హేతి:- మరి మహరాజుగారు..
ప్రహేతి:- ఎవరూ.. మన బణాసుర మహారాజులవారా..
హేతి:- ఆయనే.. మనల్ని
మూర్ఖులన్నారు.
ప్రహేతి:- బుద్ధిహీనులనికూడా
అన్నారు.
హేతి:- అదే నేనడుగుతున్నది. దీని అర్థమేమిటీ.. మనం మేధావులం
కాదనియెగదా!
ప్రహేతి:- నిజమేనన్నా.. మరి
మనం మేధావులం కామా?
హేతి:- మనం మేధావులమే..
మనరాజే.. (చిన్నగా) బుద్ధిహీనుడు.
ప్రహేతి:-( చిన్నగా) మూర్ఖుడై
వుంటాడు. అందుకే మనల్నీ మనఘనతనూ గ్రహించలేక పోతున్నాడు.
హేతి:- కానీ.. ఒకవేళ మనకు
నిజంగానే కాస్తా బుద్ధి తక్కువేమో?
ప్రహేతి:- ఐతే ఒకపనిచేద్దాం.
హేతి:- ఏంచేద్దాం..
ప్రహేతి:- ఓరెండు మహామేధావుల
మెదళ్ళు తినేద్దాం. అప్పుడు కాస్తా తక్కువున్న తెలివి సర్దుకుంటుంది.
హేతి:- అప్పుడు మన మహారాజు
మనల్నెప్పుడూ బుద్ధిహీనులనడు.
ప్రహేతి:- ఔనౌను మంచియోచన. మరి
మహామేధావులంటే?
హేతి:-ఆ... మహామేధావులంటే... మహమేధావులంటే...
ప్రహేతి:- ఆ... జ్ఞాపకమొచ్చింది.
నారదమునీ.. బృహస్పతి.. యింకా శుక్రాచార్యులు...
హేతి:- శుక్రాచార్యులు
రాక్షసగురువులు. ఆంటే మనగురువులు... ఒద్దులే..
ప్రహేతి:- మిగిలిన యిద్దరి మెదళ్ళు తిందాం. సరిపోతుంది.
హేతి:- వీళ్ళెళా దొరుకుతారబ్బా.. యిదేం అయ్యేపనిగాలేదే?
ప్రహేతి:- అన్నా.. అదిగో
చిత్రరేఖ వస్తూంది.
హేతి:- సరిసరి.. మెదళ్ళు
మేసే పని తర్వాత చూద్దాం. ముందు చిత్రరేఖతో ఒకాట ఆడుకొందాం.
ప్రహేతి:- భళి..భళి..
చిత్ర:- (వస్తూ తనలో) అనిరుద్ధుని అపహరించి మత్తులోనికి పంపి సూక్ష్మరూపంలోనికి మార్చి యీ భరిణలో నుంచి తెచ్చితిని. కానీ వీరిని దాటుకొని పోవుటకొక ఉపాయమాలోచించవలె .
హేతి:- చిత్రరేఖా..
ఆగిపోయావేం.. రా..
ప్రహేతి:- తొందరేం లేదుకదా? ఒకాటాడుకుందామా?
హేతి:- ఒకపాట పాడుకొందామా?
చిత్ర:- లేదు లేదు నాకు
రాకుమారి వద్ద చాలాపనుంది. వెంటనేరమ్మని ఆజ్ఞ. నేనువెళ్ళాలి. (ద్వారం దాటబోవును
వెంటనే చిలుక పలుకును)
హేతి:- ఆగు..
ప్రహేతి:- చిలుక పలికింది.
నీవు చిత్రరేఖవు కావు.
హేతి:- చిత్రరేఖరూపంలోవున్న
మగమాయావివి
చిత్ర:- (తనలో)
దొరికిపోతిని. నా చేతిలో అనిరుద్ధుడున్నాడు. అందుకే చిలుక పలికింది. (వెంటనే ప్రక్కనున్న
పూలకుండీలో బరిణ నుంచుతుంది)
హేతి:- యేమిటి
గొణిగికొనుచున్నావు పలుకు యెవరునువ్వు.
చిత్ర:- (భయముతో) నేను నేనూ
చిత్రరేఖను (తేరుకొని) మీచిత్రరేఖను.
ప్రహేతి:- కాదు నీవు
మగచిత్రరేఖవు. మాయావివి. మేమునీకంటే మాయవులం.
హేతి:- మగచిత్రరేఖేమిటి
తమ్ముడూ. చిత్రరేఖే.
చిత్ర:- ఔనౌను నేను
చితరేఖనే..
ప్రహేతి:-అన్నా రాజుగారు తెప్పనేచెప్పారు. మగవారుకూడా ఆడవేషంలోవచ్చి ..
హేతి:- మనల్ని
మోసంచేస్తారని కదా?
ప్రహేతి:- ఔను యిపుడేంచేద్దాం
హేతి:- ఏముంది రాజుగారు
చెప్పినట్లు వస్త్రములు విప్పి, ఇదిగో యీ కొరడాతో వాతలు పదేట్లు వాయించి
ప్రహేతి:- రాజుగారికి
అప్పజెప్పడమే .. అంతేగదా..
హేతి:- ఔను మేధావులంకదా.. రాజుగారు
చెప్పింది చెప్పినట్లు చక్కగా జ్ఞాపకముంచుకున్నాం.
హేతి:- ఇకనేం విప్పుతా
కోక.
ప్రహేతి:- ఆలస్యమెందుకూ..
విప్పూ..(కొరడా చేతికి తీసుకొనును)
(చిత్రరేఖ భయపడి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది, ప్రహేతి వెంటబడి పట్టుకొని చీరపట్టి లగుతాడు.
విడిపించుకొని చిత్రరేఖ అటూ ఇటూ పరుగిడుతూ కేకలు
వేస్తుంది.)
బాణుడు:- (వచ్చి) ఆగండి.. ఏమిటిది..
హేతి:- ఈమె.. కాదుకాదు ..
వీడు మాయావి.
చిత్ర:- మహారాజా!
రక్షించండి..రక్షించండి.. (కాళ్ళపై బడును)
ఉష:- (వస్తూ) ఏమిటి ..
ఇక్కడేంజరుగుచున్నది.. స్త్రీ ఆర్తనాదం వినిపించింది.
చిత్ర:- రాకుమారీ నేను
చిత్రరేఖను. ఈహేతి ప్రహేతులు నన్ను పీడిస్తున్నారు.
ఉష:- నాన్నా...
బాణుడు:- ఓరి వెధవల్లారా! .. ఎందుకురా ఇలాచేస్తారు. మీపై నాకు
అభిమానముపోదు, మీరునన్ను వేధించడమూ మానరు. అమ్మా చిత్రరేఖా వీరు అమాయకులు. వీరిని క్షమించు.
ఈవిషయాన్ని ఇంతటితో మరచిపో.
చిత్ర:- చిత్తం..అలాగే
మహారాజా..
బాణుడు:- (ఇద్దరినీ పిలిచి) ఇటురండి చూడండి బాగా చూడండి (చిత్రరేఖ తలనిమురుతూ) మన
మహామంత్రి విభాండక మహాశయుని ముద్దుబిడ్డ చిత్రరేఖరా! ఈమెపైనా మీ దౌర్జన్యం..ఛీ..
(వారి చేతిలోనున్న
తంతువునూ చిలుకబొమ్మనూ విసరిపారేస్తాడు) ఇంకొక్కసారి ఇలా అల్లరి చేశారో మీపై
ఇక జాలిచూపే ప్రసక్తేలేదు. తలలు తీయించడమే తరువాయి. జాగ్రత్త. చిత్రరేఖ తంతువు
దాటితే చిలుకపలికిందా? అమ్మా చిత్రరేఖా ఆచిలుకా తంతువు అక్కడబెట్టి దాటు చూద్దాం (చిత్రరేఖ ప్రక్కన
పడియున్న చిలుక తంతువు సరిగ్గా అమర్చి దాటును. చిలుకపలుకదు) చూచితిరా? ఇదీ మీ నిర్వాహకం.(ప్రక్కకు తిరిగి) అమ్మాఉషా నేడుమనం
వేటకు వెళుతున్నాం. వనవిహారమంటే నీకు చాలా యిష్టం గదా! అందుకే నిన్ను పిలుచుకవెళదామని
వస్తున్నా. ఇదో యిక్కడ తెల్లవారక ముందే యీ రభస. పదతల్లీ నీవు సిద్ధమై
బయలుదేరుదువుగాని..
ఉష:- తండ్రీ యీదినం నాకు
మనసుబాగులేదు. నేను వనమునకు రాను. మన్నించండి.
బాణుడు:- సరిసరి..
దానికేమున్నది, మరియొకసారి కలిసి వెళ్ళుదము. మీరికలోనికి వెళ్ళుడు. నేనికవెళ్ళివచ్చెద.
ఉష:- అలాగే తండ్రీ (రాజు
వెనుకకు తిరుగగనే చిత్ర పూలకుండీనుండి భరిణను లాఘవంగా తీసుకొనును. హేతిప్రహేతులు రాజువైపునుండి
చిత్ర వైపు దృష్టి మరల్చేలోపల ఉషతోపాటు చిత్ర లోనికి వెళ్ళిపోతుంది)
హేతి:- (ఏదోజ్ఞాపకంచేసుకొని
రాజు స్టేజిదాటే లోగా రాజుదగ్గరకులెళ్ళి) మహారాజా.. మహారాజా. వేటకు మేమూవస్తాం.
పులులూ సింహలూ శరభాలను యిట్టే వధించేస్తాం.
బాణుడు:- నోరు మూయండి.
మిమ్మల్ని వెంటబెట్టుకొని వేటకా? పిల్లుల్ని చంకన బెట్టుకొని వెళ్ళినట్లే.. చేసేపని బుద్ధిగా చేసుకోండి చాలు.
(బాణుడు వెళ్ళి పోవును)
హేతి:- తమ్ముడూ..
ప్రహేతి:- అన్నా..
హేతి:- మనమేమైనా
తప్పుచేశామా?
ప్రహేతి:- చేశాం.. ఒకేఒక్క తప్పు చేశాం.
హేతి:- తప్పుచేశామా? ఏంతప్పుచేశాం?
ప్రహేతి:- ఏముందీ .. ఈ రాజుల
సేవించడమన్నదే పెద్దతప్పు. రాజుల సేవకంటే, మడిదున్నుక బ్రతకడం ఉత్తమం.
హేతి:- అంతేనంటావా?
ప్రహేతి:- అంతేమరి.. లేచి
ఎవరిమొగం చూశామో యేమో? హరహరా..
హేతి:- శివశివా....
తెర పడును
ఎనిమిదవ రంగం
(అంతఃపురం)
చిత్ర:-రాకుమారీ ఉషాదేవీ!... భగవదనుగ్రహంవల్ల మనం విజయం సాధించగలిగాం. ఇదిగో
భరిణ. ఇందు సూక్ష్మ రూపంలోనున్నవారే మీ ప్రియులు అనిరుద్ధులు. ఈ నెమలి ఈక
తగిలిస్తే మామూలురూపం లోకి మారిపోతారు. ఇదుగోండి ఈక. ఇక ఎలా వలచి వలపింప జేసుకుంటారో.....
ఉష:- పోవే..
చిత్ర:- వెళతానమ్మా.. నోతో యింకేంపని. (నవ్వి వెళుతుంది)
(ఉష వ్రేలాడదీసిన ఒకతెర దగ్గరకు వెళ్ళి భరిణదీసి
నెమలీక తగిలిస్తుంది. తెరచాటునున్న అనిరుద్ధుడు, ఠక్కున తెర బయటకు వచ్చి మత్తులోనున్నట్లు ఉషపై వాలిపోతాడు. ఉష అతనిని పట్టుకొని
మెల్లిగా తీసుకెళ్ళి ఆసనం పై కూర్చోబెడుతుంది. నెమలీకను తలనుండి కాళ్ళవరకూ తగిలిస్తుంది.
అనిరుద్ధుడు మెలకువలోనికివచ్చి అటూ ఇటూ చూసి ప్రదేశం గుర్తుపట్టలేక
తటాలున లేచినిలబడి ప్రక్కనేవున్న ఉషను చూస్తాడు)
అనిరుద్ధుడు:- ( తనలో) నేనెక్కడున్నాను.
ఇది మా అంతఃపురంవలె లేదే. ఎవరీ సుందరి.. నావైపే చుస్తున్నది. ఈమెయేనన్నిక్కడకు
తీసుకవచ్చియుండును కాబోలు. (ప్రకాశముగా) సుందరీ...
ఉ: ఎవ్వరి దానవే కువలయేక్షణ యెయ్యది నీదుపేరు నే
నెవ్వరివాడ నంచు నిపుడేమికతంబున నన్నుదెచ్చి తీ
వివ్వరసౌధదేశమున కెంతయు అచ్చెరువయ్యె నాకు నీ
వెవ్విధి నింతజేసితివొ యేర్పడదెల్పుము దాచకుండగన్
ఉష:- ఓపురుష పుంగవా!
మ: ఇది బాణాసురు వీడు శోణపుర మా ఇంద్రారి మాతండ్రి పెం
పొదవెన్నాకు ఉషాభిధాన మొగి యొయ్యారంపు రూపంబు స్వ
ప్నదశం గాంచిన దాననై విరహసంతాపంబునుం జెంద స
మ్మదలీలన్నినుదెచ్చె బ్రాణసఖి శుంబద్యోగవిద్యోన్నతిన్
స్వామీ..
ఉ: కన్నియగాని యన్యసతి గాను శరీరము నీదుసొమ్ము
మన్ననజేసి యేలుకొనుమా వినుమా యనుమానబుద్ధి వై
నన్నలయించెదేని రమణా యిక నేమనుదాన నిన్ను నా
కన్నుల జూడగల్గె గద కాగలయట్లగు దైవయోగముల్
నేజేసిన యీ సహస కృత్యము మన్నింపందగు. వలచి
నినుదెచ్చుకొన్న కన్యను. కలయందు నిన్ను గాంచినది మొదలు మనసు సంపూర్ణముగ
మీకర్పించినదానను. అన్యమెరుగని అబలను. వలచి మనసిచ్చుకొన్న కన్యను కాదనుట
ధర్మసమ్మతమూ, శాస్త్రసమ్మతమూ కానేరదు. ఉన్నతెరగెరిగించితి. ఇక మీ యిష్టము మా యదృష్టము.
అనిరుద్ధుడు:- కోమలీ.. పరపురుషుని
కోరుట ధర్మసమ్మతమూ,
శాస్త్రసమ్మతమూనా? అదియెట్లు.
ఉష:- మీరు నాకు
పరపురుషులెట్లగుదురు. త్రికరణశుద్ధిగా నేను మిమ్మే వరించితిని. ఈజన్మకిక మీరే నా
పతి. నా మనసుకు మాత్రముషాపతి అనిరుద్ధులే.. దీనికి తిరుగులేదు.
అనిరుడ్ఢుడు:- దీనికి పెద్దల
అంగీకరము వలదా?
ఉష:- నా మనస్సంగీకరించినది..
అదిచాలును. పెద్దల అనంగికారము మన శరీరముల విడదీయును. అంతియెకాని మనసులనుకాదు.
తే:గీ. తనకు తనుతాన చుట్టంబు తానతనకు
గతియు దన్నిచ్చుచో దాన కర్తయగును
వనజ నయన గాంధర్వ వివాహమతి ర
హస్యమును నమంత్రకమును నగుచు నొప్పు.
సత్ క్షత్రియవంశ్యులకు గాంధర్వరాక్షసములు సమ్మతములు.
గాన స్నన్ను యీ పంచభూతముల సాక్షిగా నుద్వాహమగుము. ఇదియె నా విన్నపము.
అనిరుద్ధుడు:- ఉషా! నీసాహసమూ, శాస్త్రపరిజ్ఞానమూ, విజ్ఞానమూ. మీదుమిక్కిలి నీ అందచందములూ నాకు విస్మయము కలిగించుచున్నవి. నీ
యంతటి ధీర నాకు దారగాలభించుట నా పూర్వజన్మ సుకృతము. ఇదే నిన్ను నేను పంచభూతములసాక్షిగా
గాంధర్వవివాహమాడి, పాణిగ్రహణము చేయుచున్నాను. ఇక బ్రహ్మరుద్రాదులైనా నిన్ను నానుండివేరుచేయ లేరు.
నా సాహస పరాక్రమములే శుల్కముజేసి నిన్ను ద్వారకకు తీసుకెళ్ళగలను. మావారిని
ఒప్పించగలను నిన్ను స్వీకరింపజేయగలను. (ఉష కుంకుమ భరిణ చేతికీయగా కుంకుమదీసి ఉష
పాపటలో దిద్దును.)
ఉష:- నేడు నాజన్మ
ధన్యమైనది.. స్వామీ..(కాళ్ళపైబడును )
అనిరుద్ధుడు:- (లేపి) నీ స్థానము అక్కడకాదు
దేవీ! ఇక్కడ. (గుండెలకు హత్తుకొనును ఉష విడిపించుకొని దూరము జరుగును అనిరుద్ధుడు
వెళ్ళి చేయిపట్టుకొని తనవైపునకు లాగుకొనును) ఉషా! ఎంతచక్కనిపేరు. పేరేకాదు, యీ ఉష జగదేకసుందరి.
సీ: పొలతి మోమునకు సంపూర్ణేందుబింబంబు
వెలయ నివాళి గావింపవచ్చు
శంపాంగి మేనికి జాంపేయ పుష్పముల్
వరుసతో బసిడి వైవంగవచ్చు
జలజాక్షి కురులకు జాతినీలంబుల
నొగి దృష్టి పేరుగా నునుపవచ్చు
గలకంఠకంఠి వీనులకు శ్రీకారముల్
రక్షయంత్రములుగా వ్రాయవచ్చు
తే:గీ. నౌర యీ రూపవతికి రంభాదివేల్పు
చెలులనుడిగంపు బుడుతల జేయవచ్చు
ననిన దోషంబు గలుగదీ యర్థమందు
జూడ మెన్నడు నిటువంటి సుందరంబు.
పాట:
అనిరు:- ప్రియభామిని నీ
భావన - విడిచి మనగ నావశమా
ఉష:- ప్రియవల్లభ
నీ తలంపు - లేక బ్రతుకె లేదుగదా!
అనిరు:-
విరులు పరిమలములు గలసి - వనశోభను పెంచివటుల
శశియు చంద్రికలును గూడి - నభము వెలుగ జేసినటుల
హిమము శీతలమ్ము జేరి - ఇలచలువలు గ్రమ్మినటుల
నీవునేను కలిసిపోయి - మదనరాజ్య మేలుద(దా)మా ../ప్రియ భామిని/
ఉష:-
ఆకాశము నీ వయితే - ఇంద్రచాపమౌదు నేను
నoదనమై నీ వుండగ - వసంతమ్ము నౌదు నేను
పసిడినగగ నీవు మార - అందు రతనమౌదు నేను
పురుషుడవై నీవు వెలుగ - ప్రకృతి రూపు దల్తునేను.... /ప్రియవల్లభ/
అనిరు:- మాటలేల నీవు ఉషవు -
అనిరుద్ధుడనేనుగదా
ఉష:- పలుకులేల నీవు
పతివి - నేనుసతిని అంతెకదా
అనిరు:- కాదుకాదు నీవు
పతివి - నేను సతిగ మరిపోతి
ఉష:- సతియులేదు
పతియులేదు - మనమిరువురమొకటెకదా! /ప్రియ/. (పాట ముగియగానె ఇద్దరూ పాన్పుపై
ఒరిగి పోదురు. లేదా చేయీ చేయీ పట్టుకొని
స్టేజి దాటి వెళ్ళెదరు)
తెర పడును
తొమ్మిదవ రంగము
(ఆకాశ వీధిలో నారదుని పాట)
గోకుల కృష్ణా - గోవిoదాహరి
నారదముని ప్రియ - నారాయణా
నారాయణా - శ్రీమన్నారాయణా....(నృత్యంచేయును)
నిష్ఠుర భండన - రాక్షస ఖండన
తేజప్ర చండా - శార్జ్గకో దండా
ఆదిపురుషా - వ్యక్తావ్యక్తా
అవ్యయ, అభవా - హరినారయణ..../గోకుల/
కమనీయ మాణిక్య - ఘనమకుటధారి
ఉరుభోగితల్పా - వైకుంఠవాసా
మండితకోటీర - కుండలభూషా
యోగీంద్ర మండల- హృదయవిహారా... /గోకుల/
శిష్టులగాచి - దుష్టులద్రుంచి
భూభారంబును - బాపగనెంచి
జననమె యెరుగని - జగదాధారా
జనియించితివిగ - యదుకుల మందున../.గోకుల /
కలహభోజనుడనని పేరేగానీ, ఏదీ నా అవసరము లేకుండానే భూలోకమున కలహమునకు గావలసిన
ఏర్పాట్లన్నియు వాటికై అవే త్వరితగతిని సాగిపోవు చున్నవి. మరీ నా ప్రమేయమే
లేకుండిన బాగుండదు గదా? నాపని కేవలం అగ్నికి ఆజ్యము పోయుటే మిగిలి యున్నది. అదిగో ద్వారక అప్పుడే
చేరవచ్చితిని. పురము కాంతి
లైట్ ఆఫ్ & ఆన్
( ఆకాశము సీన్ తొలగి అంతఃపురం సీన్ కనబడుతుంది - కృష్ణుడు ఆలోచనలో కూర్చొని
వుంటాడు)
నారద:- (ప్రవేసిస్తూ)
నారాయణ.. నారాయణ.. జగద్గురు శ్రీకృష్ణులవారికి ప్రణామములు.
కృష్ణ:- తమరా
నారదమునీంద్రా! నమస్సులు. రండి..ఆసీనులు కండి.
నారద:- (కూర్చొని) దేవా!
నాకంతయూ తెలియును. మరి మీకు తెలియదనిన నమ్మవచ్చునా! ఇంకా నటనమేల ప్రభూ..
అనిరుద్ధుడెక్కడున్నడో మీకు తెలియదా! అదీ మానోటనే చెప్పించవలయునా?
కృష్ణుడు:- నారదా.. దేనికైననూ
సమయము రావలయునుగదా! సరియైన సమయమునకేవచ్చితిరి. కాలము పరిపక్వమైనది. ఇప్పుడు
తెలుపుడు మా అనిరుద్ధుడెక్కడున్నాడో. శంఖమునుండి వచ్చిననేగదా తీర్థమగును.
నారద:- అర్థమైనది ప్రభూ!
నారదుడు వచ్చెను అనిరుద్ధుడు బాణాసురపుత్రి ఉషమందిరమున బద్ధుడై.. అదే..అదే..
ప్రేమనుబద్ధుడై యున్నాడని తెలిపెను. ఇక దండయాత్రకు వెడలుడని మీ వారితోచెప్పి..
నన్నీ రసమయ కథలో పాత్రను జేయుదురు. అంతేకదా స్వామీ..
కృష్ణ:-చక్కగా ఊహించితివి నారదా..
నారద:- స్వామీ.. ఈ పనికి ఇంత ఆలస్యమెందుకు జేసితిరి. ఈపని నాచేత యెప్పుడో చేయించి యుండవచ్చునే?
కృష్ణ:- నారదా..
మావంశాంకురమును ఉష తన గర్భాలయమున దాల్చుటకు యీ మాత్రము వ్యవధి అవసరమేగదా..
నారద:- నారాయణ..
నారాయణ..నావద్ద ఇంతసమాచారము లేదు స్వామి. సంతోషము. మహదానందమైనది. ఇక ఆ బాణునకు
వేరుమార్గమేలేదు. ఉషను యాదవకులమున మెట్టించవలసినదే.
కృష్ణ:- తథాస్తు!
నారదమునీంద్రుల వాక్కులమోఘములు.
నారద:- దేవా! ఇక నేను వెళ్ళివత్తును.
శోణపురమున కాస్తా పనియున్నది.
కృష్ణ:- అర్థమైనది నారదా.. మీకార్యము మీరు
నిర్వర్తించుడు. శుభం.
నారద:- నారాయణ..
నారాయణ.(వెళ్ళును)
తెర పడును
పదవ రంగము
(బాణునికోట కొకప్రక్క ప్రదేశము)
బాణుడు:- (కోటపైకి ఒకసారి
చూచి - అటూ ఇటూ తిరుగుతూ) నా వైభవమునకు సంకేతమై నీలపటాంచిత ఘన కేతనము నిర్భీతి
నింగి రెపరెప లాడుతున్నది. ఇది యెటుల యెపుడు పతనమగును, శివునంతటి వానితో రణమెట్లు సంఘటితమగును, నాచేతులతీట యెట్లు
నారదుడు:-నారాయణ.. నారాయణ.
బాణుడు:- నారదమునీంద్రులకు
నస్కృతులు. మాంచిసమయమునకే వచ్చితిరి. యుద్ధానురక్తుడనై సరిజోడుకై యెదురుచూస్తున్న
నాకు,
నారద:- మహావీరా బాణాసురా!
ఏమి నీవెర్రి కోరికోరి యుద్ధము చేతుమందురా.. అది యటులుండనిమ్ము. నీపై మరొక ఆపద
క్రమ్ముకొనుచున్నది. జాగరూకుడవై వినుము.
బాణుడు:- ఏమిటేమిటీ.. నాకు
ఆపదా? (నవ్వి) హస్యము లాడుచుంటిరా?
నారద:- కాదు, కాదు బాణాసురా.. నా మాటవినుము.
బాణుడు:- (నిర్లక్ష్యముగ)
చెప్పండి మహర్షీ చెప్పండి. మీ మాట వినకుండ
నుండరాదుగదా! చెప్పండి.
నారద:- అసురనాయకా.. శ్రీకృష్ణుని మనుమడు అనిరుద్ధుడు ద్వారకలో కనబడుటలేదు.
బాణుడు:- ఐన మాకేమి?
నారద:- అతడు మీకుమార్తె
ఉషమందిరమున నున్నాడు. ఇది తెలిసి యాదవులు మీపైకి దండెత్తి వచ్చుచున్నారు.
మిమ్ములను యీ విషయమై హెచ్చరించుటకే పరుగు పరుగున మీ మేలుగోరి వచ్చితిని.
బాణుడు:- ఏమంటిరి.. మాఉష
మందిరమున పరపురుషుడా? (పగలబడి నవ్వి) అసంభవము. (గర్జించును)
నారద:- ఏదో నాకు
తెలిసినవిషయము మీ చెవిన వేసితిని. ఇక మీయిష్టము. వెళ్ళివత్తును.నారాయణ.. నారాయణ.
(వెళ్ళును)
(ఇంతలో హేతి, ప్రహేతి ప్రవేశిస్తారు.)
హేతి/ప్రహేతి:- (గసపెడుతూ)
మహారాజా.. మహారాజా.. ద్రోహం ద్రోహం అంతఃపురద్రోహం.
బాణుడు:- ఏమిటి. ఏమిటి మీరంటున్నది.
హేతి:- అవును మహారాజా ఒక
యువకుడు అంతఃపురఉద్యానవనంలో రాకుమారి ఉషతో సరసోక్తులాడుతూ పాచికలాడుతూ
కనిపించాడు.
ప్రహేతి:- అతడు
నాల్గునెలలక్రిమే అంతఃపురం ప్రవేశించాడని నా అనుమానం ప్రభూ! మాకు అనుమానమొచ్చి ఒకకన్నువేసుంచాం.
ఈ నాటికి దొంగ దొరికాడు.
బాణుడు:- నాల్గునెలలక్రితమే
అనుమానమొస్తే నాకెందుకు తెలియజేయలేదు. (కసురు కొనును)
హేతి:- (జడుసుకొని) ప్రభూ
మీరు మమ్ముల్ని నమ్మితేగదా? ఆ నాడు మేము చిత్రరేఖను నిలవేసినప్పుడే ఈ ద్రోహంజరిగిందని మా నమ్మకం. ఆనాడు మీరు
మమ్ముల్ని ఛీవాట్లు పెట్టిపోయారు.
ప్రహేతి:- ఇక లాభము లేదనుకొని సరియైన సా క్ష్యంకోసం
యెదురు చూశాం.
బాణుడు:- ఇంతకూ వాడేమయ్యడు.
పట్టి బంధించారా లేదా. (గర్జించును)
హేతి:- మహారాజా సైనికులను
పిలిపించాం. వానిపై దాడిచేయించాం.
ప్రహేతి:- కానీ ప్రభూ వాడసాద్యుడు.
మనసైనికులలో చాలామందిని చంపేశాడు.
బాణుడు:-ఆఁ... ఇక లాభములేదు నేనే వెళ్ళి బంధించెద.. ఓరీ దూర్తా అనిరుద్ధా.. అంతఃపుర
ద్రోహి.. నిన్నిప్పుడే బంధించి, నాపై దండె త్తనున్న నీ తండ్రి తాతలతో కలిపి ఒకేసారి యమపురి కంపెద.(అప్పుడే
అనిరుద్ధుడు ఉషతో పారిపోతూ బాణాసురునికి యెదురు పడతాడు.)
(వెంటనే అనురుద్ధుదు బాణాసురున్ని చూసి ఆశ్చర్యపడి
తేరుకొని కత్తిదూస్తాడు. హేతిఒరలోనున్న కత్తిదూసి బాణుడు దాడీకి దిగుతాడు.
అనిరుద్ధుడు బాణుని కత్తిని యెగరగొడతాడు)
బాణుడు:- (దిక్కుతోచనిస్థితినుండి
తేరుకొని) ఓం క్లీం హ్రీం వాసుకీ సర్పరాజాయ బంధయ బంధయ. (అని చేయిచాచి మంత్రిస్తాడు
అనిరుద్ధుదు కట్టుబడిపోతాడు కదలలేకనిలిచిపోతాడు) హేతీ! ప్రహేతీ! వీడిప్పుడు
సర్పపాశబద్ధుడు. ఊ.. ఉషనూ వీడ్నీ కారాగారంలో పడేయండి. వీరికిదే మరణదండన
విధిస్తున్నాను. రేపటిప్రొద్దుపొడవక
ఉష:- తండ్రీ..
బాణుడు:- తండ్రీ.. ఎవరేనీకు తండ్రి.. నీచురాలా.. నీమొగము నేను చూడ దలచుకోలేదు. వెంటనే నాసమ్ముఖమునుండి వీరిని తీసుకెళ్ళండి. ఊ..
ఉష:- దయావిహీనా..
బాణాసురా! నిన్ను మా ప్రాణములకై బ్రతిమలాడు కొందు మనుకొంటివా? అది యేనాటికీ జరుగదు. బ్రతుకైనా చావైనా కలిసే
అనుభవిస్తాం. సంతోషంగా అనుభవిస్తాం. పదండి కారాగారానికి (ఉష వెనక్కి దిరుగుతుంది ప్రహేతి
ఒరనుండికత్తిదూసి చేతబట్టుకొని ఆమెవెనకే నడుస్తూబయటికి వెళతారు)
(బయటినుండి అల్లరి శబ్దాలు. యుద్ధం జరుగుతున్నట్లు
కత్తులకటకటా రావాలు వినబడతాయి. వేంటనే అప్రమత్తమై బాణుడు క్రింద పడియున్న
ఖడ్గాన్ని అందుకొని )
బాణుడు:- మహామంత్రీ..
సైన్యాధ్యక్షా.. (కేకవేయును)
(ఇంతలో శ్రీకృష్ణుడు ఖడ్గంతో యెదురు వచ్చును.)
బాణుడు:- (నవ్వి)
యాదవవృద్ధులా హహహాహ (వికటాట్టహాసంచేయును.)
కృష్ణ:- ఆపు నీ నవ్వు. మదంధా
బాణాసురా.. చేజేతులా చావు కొనితెచ్చు
బాణుడు:- కృష్ణా.. బెదిరిస్తున్నావా? ఈ బాణుడు ఇంకా రణాని కుపక్రమించలేదు. ఈ వేయిభుజముల బలంముందు నీవు నీ వీరులూ సైన్యం తుత్తునియలై పోగలరు. జాగ్రత్తా!
కృష్ణ:- అవివేకీ.. నీ
వేయిభుజముల బలమేకాదు, కోటి యేనుగుల బలమైననూ యీ యదుసింహుని పరాక్రమము ముందు నిష్ప్రయోజనము. ఊ.. కాచుకో..
(కత్తి యుద్ధం చేస్తారు)
(ఇంతలో హేతి ప్రహేతులు కత్తులూ గదలతో ప్ర వేశింతురు.)
హేతి:- మహారాజా మేము
మీకోసం ఆయుధములు తెచ్చాం.
ప్రహేతి:- ప్రభూ! మేం తప్పిచుకొని
రహస్య మర్గంగుండా మీ కోసం గదలుతెచ్చాం.
( యుద్ధము చేస్తున్న కృష్ణ బాణాసురుల కత్తులు చేతిపట్టు తప్పి యెగిరి పోతాయి.
ఇద్దరూ వేరు మార్గంకోసం ఒకరినొకరు తీవ్రంగా చూసుకుంటూ, లాఘవంగా హేతి ప్రహేతుల గదలు లాక్కుంటారు. గదాయుద్ధం జరుగుతుంది. కృష్ణుని దెబ్బకు బాణుడు క్రింద
పడిపోతాడూ. కృష్ణుడు బాణుని భుజాలపై మోది విరిచేస్తాడు ఇదంతా కలర్‍వీల్‍త్రిప్పి ఆ
మసక వెలుగులో చూపి రక్తి కట్టించవలెను )
బాణుడు:- (బాధతో) హరహర
మహాదేవ.. శంభోశంకరా.. రక్షమాం.. రక్షమాం..
శివుడు:- (ప్రవేశించి
కృష్ణునికి అడ్డువచ్చి) కృష్ణా (కోపముతో) బాణుడు నా పరమ భక్తుడు. నా రక్షణ
లోనివాడు. నేను శోణపురవాసినైయుండగా దండయాత్రా.. ఎట్లు సహింతుననుకోంటిరి.
యుద్ధముమాని వెనుదిరగండి.
కృష్ణ:- మహదేవా!
క్షమించండి. మాకై మేము యుద్ధాభిలాషులముగాము. ఈ శోణపురవాసులే మా పౌత్రుని అపహరించి
బంధించినారు. వీరు శిక్షార్హులు. ఈ శోణపురాధీశుడైన బాణుడు దండనార్హుడే.
శివుడు:- మరి నేనునూ శోణపుర
వాసుడనే. నన్నుకూడా దండింతువా?
కృష్ణ:- శివా! దూర్తులకు
సహకరిస్తున్నారు. అడ్డుతొలగండి.
శివుడు:- భక్తజన రక్షణము నా
ప్రథమ కర్తవ్యము. అడ్డుతొలగుట అసంభవము.
కృష్ణ:- అట్లైన కాచికొనుము.
(కృష్ణుడు గదనెత్తును. శివుడు వెంటనే శూలము విసరును. కృష్ణుడు తలప్రక్కకు వంచి
శూలముదెబ్బ తప్పించుకొని గదతో శివుని పై విసరును. శివుడు గదతగిలి పడిపోబోవును.
బాణుడు ఆయసపడుతూ వెళ్ళి శివుని పట్టికొనును, హేతి ప్రహేతులు బాణునికి సహాయ పడుదురు. శివుడు అంతలోనే తేరుకొనును)
శివుడు:- కృష్ణా! నా సహనమునే
పరీక్షిస్తున్నావు. ఇక లభములేదు యదువీరా!
కం: ఇదె పాశుపతాస్త్రం బీ
య్యది
లోకభయంకరంబు అరివీరహరం
బు
దిశల్ దవమై వ్యాపిం
చి
దహించున్ కాచికొనుము చేవగలిగినన్.
(అని విల్లెక్కుపెట్టును)
కృష్ణ:- అటులనా..
మ: చటులంబౌ చలితక్షమావలయమౌ చంద్రార్కకోటి ప్రభా
ఘటితాశాంతరమౌ చరాచర సమాక్రాంతాగ్ని కీలాసము
త్కటమౌ చండతరాంశువౌ చకిత రక్షశ్చక్రమౌ చక్ర మా
ర్భటిమై వచ్చె మహేశ్వరా నిలువుమభ్యామర్ద మధ్యంబునన్.
నారద:- (ప్రవేశించి)నారాయణ..
నారాయణ. శాంతించండి. శాంతించండి. హరిహరులయుద్ధము మహప్రళయ స దృశము. రవంత సవధాన
చిత్తులై ఆలోచించండి. యుద్ధమే సమస్య కు పరిష్కారమా? కాదు కానేకాదు.
కృష్ణ:- నారదా మేము సర్వదా శాంతికాముకులం. మా అనిరుద్ధుని మా
కప్పజెప్పుమనుడు. చాలు మేము వెనుదిరుగుదుము.
నారద:- పరమశివా! నాదొక
విన్నపము. ఉష మీకు బిడ్డవంటిది ఆమె అనిరుద్ధుని వరించినది. ప్రేమతిశయముననే
అనిరుద్ధుని అపహరింపజేసినది. గాంధర్వమున వివాహము కూడా చేసుకొన్నది. ఇది శాస్త్ర
సమ్మతమేగదా? వారిని క్షమించి విడుదలచేయుటే సరియైన నిర్ణయము.
బాణుడు:- (కోపముతో) నారద మునీంద్రా..
నారద:- బాణాసురా! నీ వంటి
శివభక్తుడు ముల్లోకములలో మరొకడు కానరాడు. కానీ నీవు పమేశ్వరునే
రణమునకహ్వానించితివి. భక్తులకిట్టి అతిశయము అనర్థహేతువు. అందుకే నీకు
శివునంతటివాడైన కృష్ణునితో కలహము కలిగినది. భక్తాగ్రేసరా.. నీ అహం నశించి పరిశుద్ధుడవైనావు.
శాంతచిత్తుడవై ఇక కల్యాణ కార్యక్రమాని కుపక్రమించు.
శివుడు:- కృష్ణా..నా
భక్తుడైన బాణుని మన్నించు. ఈ కయ్యము వియ్యముగ మారుటే మాకిష్టము. మరియు ఆనందదాయకము.
కృష్ణ:- బాణునిపై
మాకేలకోపము. అతనిని మనస్ఫూర్తిగా క్షమించితిని. బిడ్డవిషయమై యీ మాత్రము కోపముండుట యే తండ్రి కైనను
సహజమే. నేనర్థము చేసుకోగలను. ఇందులో మాతప్పేమాత్రమూ లేదని అతడర్థము చేసుకొన్న
చాలును. నా మనుమని నేను కాపాడుకొనుటకు దండెత్తవలసివచ్చినది. అంతకుమించి బాణునితో
నాకు శత్రుత్వములేదు. వియ్యమునకు నేనునూ సిద్ధమే. అయిననూ నా గదాఘాతమున అతని
సహస్రభుజముల శక్తి హరించుకపోయినది. ఇపుడు నేనాతనికి చతుర్భుజబలశక్తిని వరముగా
ప్రసాదిస్తున్నాను. మా బంధువర్గములో ఒకనిగా గుర్తిస్తున్నాను. శివా!
ఉ: నీదయ వీనిపై గలదు నిక్కువ మింతియెకాదు వీడు ప్ర
హ్లాదునకున్ బ్రపౌత్త్రుడు తదన్వయజాతుల నే వధింపగా
లేదటుగాన జీవమెడలింపక కాచితి బాహు విక్రమో
న్మాదమడంపగావలసి మట్టున నుంచితి చంద్రశేఖరా!
అంతియెగాదు..
కం: ప్రమదగణంబులలో ను
త్తముడై భవదీయ సన్నిధానంబున మో
దముతోడ నుండగలడీ
యమరాహితు డింకనో పురాసుర మధనా!
బాణుడు:-కృష్ణా! ధన్యుడను నీ కృపాకటాక్షములకు
పాత్రుడనైన
శా: మాయా మనుష మూర్తివై తనరు బ్రహ్మంబున్ శివాబ్జాసన
ధ్యేయున్ నిన్ను నెఱుంగలేక యవినీతిన్ మారుకొన్నందుకుం
బ్రాయశ్చిత్తముగాగ జేసితివి. నా పాపంబు లోపంబుగా
నా యజ్ఞానము వాసె నీకరుణ. కృష్ణా! గోపికావల్లభా!
నమోనమః
శివుడు:- కృష్ణా నీవు
దయాసముద్రుడవు.
సీ: అఖిలాత్మ! నీ నాభియందు నాకాశంబు
మునివంధ్య నీ పాదములను ధరణి
సర్వేశ నీ మానసమున జంద్రుండును
జలజాక్ష నీ నేత్రముల నినుండు
గాంభీర్యనిధి నీ ముఖంబున నింద్రుండు
మురహర నీ కర్ణములను దిశలు
నురగేంద్రశయన నీ యూర్పుల ననిలంబు
ఘనమూర్తి నీ మస్తకమున దివము
తే:గీ. ప్రబలమగుచుండు నుపనిషత్పంచకమయ
దివ్యమంగళ
విగ్రహస్థితి వెలుంగు
నిన్ను
భావించి సేవించి సన్నుతించి
కాంతురనఘులు
మోక్షంబు గమలనాభ.
మీకిదే ప్రణామములు.
(ఇంతలో చిత్రరేఖ పూలమాలాలంకృతులైన ఉషానిరుద్ధులను పిలుచుకొని ప్రవేశించి
హరిహరులకు తాను మ్రొక్కి దంపతులచే మ్రొక్కించును. అందరూ హరిహరులకు చేతులు
జోడింతురు. హరిహరులు దీవింతురు. పూలవర్షము కురియును)
కృష్ణాయ వాసుదేవాయ
దేవకీ నందనాయచ
నందగోపకుమారాయ
గోవిందయ నమోనమః
ఓం తత్ సత్
No comments:
Post a Comment