Saturday, 24 October 2020

ఇంద్రసింహాసనము

ఇంద్రసింహాసనము

        

 రచన

           పి.సుబ్బరాయుడు.

                    42/490 భాగ్యనగర్ కాలనీ

కడప 516002

సెల్-9966504951

 

ఇంద్రసింహాసనము

(పౌరాణిక పద్యనాటకం)

 

వ్యాఖ్యానం

 భారతావని ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఆధ్యాత్మిక నేపథ్యంతోనే మన పురాణేతిహాసాలు ప్రభవించాయి. అందులోనూ భారత భాగవతాలు ఉన్నతోన్నత జీవన విధానాలను ఆధ్యాత్మిక విలువలతో అనుసంధించాయి. ధర్మాలు కేవలం వల్లించటానికే కాదు ఆచరించటానికని ఉదోదించాయి.

భారత భాగవతాల్లోని ఒకానొక చంద్రవంశపు చక్రవర్తి కథే మా ఈ "ఇంద్ర సింహాసనం". వేద వేదాంగ పఠనము శాస్త్ర పరిజ్ఞానము మేథాసంపత్తి మాత్రమే ఒక వ్యక్తిని మహోన్నతుని చేయలేవు. ఒకవేళ మహోన్నతిని చేరినా అట్టివాడు ఆస్థానంలో మనలేడు. తానార్జించిన శాస్త్ర జ్ఞానం నిజజీవితంలో ఆచరణలో వుంచినపుడే అతని మహత్తత్వం నిలుస్తుంది. అది అతనికి లోకానికి కూడా మేలు చేస్తుంది. ఈ పరమ సత్యాన్ని నహుష చక్రవర్తి జీవితం నిరూపిస్తుంది. విద్యాబల తపోబలగరిష్ఠుడు నీతిశాస్త్ర పారంగతుడు వేదవేదాంగములనధ్యయనం చేసినవాడు. శతాధికయాగ నిర్వహకుడు ఐనప్పటికిని ధర్మాచరణ విదూరుడై తత్ఫలితంగా ఇంద్ర పదవీ బ్రష్ఠుడై కొండ చిలువగా మారి శాపగ్రస్థజీవితం గడుపుతాడు. ఇదే మా 'ఇంద్రసింహాసనం" పౌరాణిక పద్య నాటక ఇతివృత్తం. ఇక తిలకించండి.

 నేవధ్యగానం 

  పల్లవి: ఇంద్రసింహాసన వృత్తాంతము

              ఇది సురరాజ పదవీ సంక్షోభము

 

చరణం-1 వృత్రాసుర హంతకుడై- బ్రహ్మహత్య పాతకమున

                   ఇంద్ర పదవి కోల్పోయిన- సురపతి కన్నీటి గాధ!

 

చరణం-2 ఇంద్రపదవి నదిష్టించి- వినువీధుల కీర్తినింపి 

                   అమరుల పతియైన- నహుష రాజన్యుని చరితము   

 

  చరణం-3 శుచియన పేరొందినట్టి- శచీదేవి చరిత్రము               

                      పతివ్రతలకు మరోమారు- కలిగిన ఫన విజయము

  

ఇంద్రుని సభ

(అష్టదిక్పాలకులు - ఋషులు, దేవతలు ఆశీనులై ఉంటారు. సభాసదులు ఇంద్రుని జయజయ ధ్వానాలతో ప్రస్తుతిస్తారు)

ఇంద్రుడు : సభాసదులకు అభినందనలు (నవ్వు) నేటికి ఇంద్ర లోకము నిష్కంటక మైనది. యజ్ఞ శిఖలందురవించి, అతిలోక భయంకరుడై  సురలోక సింహాసనము నాక్రమించి, దివిజుల నడవుల కంపిన వృత్రాసుర వృత్తాంతము మదీయ వజ్రాయుధ ప్రహరణమున నేటికి పరిసమాప్తమైనది

   చం   శతమఖలాభుడన్ వినుత సత్వగుణాఢ్యుడపూర్ప దిక్పతిన్
               అతుల మహత్త్వుడన్ సురల కాధ్యుడ నవ్యయ దివ్యతేజుడన్
            వితతమహాయశుండ అరివీరభయంకర వజ్రధారుడన్
             సతతము భోగభాగ్యముల సౌఖ్యములందెడు వేల్పురాయడన్.

                 అట్టినా ఏలుబడికి తిరుగులేదు ఈ చతుర్దశ భువనాలలో ఇక స్వర్గము వైపు చూపు సారించగల ధీరుడెవ్వడు.. ధీరుడెవ్వడు (వికట్టాహాసము)

 రంభ, ఊర్వశులు......వారి నాట్యంతో మనకు కనువిందు చేస్తారు.

(ప్రక్కనయున్న గంట మోగుతుంది - రంభ, ఊర్వశుల ప్రవేశము)

 

పాట:

 నీ సరిలేరెవ్వరూ!

ఏడేడు లోకాల వెతికి చూచినగాని

 నీ సరి లేరవ్వరు!

 పారిజాత సుమ పరిమళములతో

నిండిన నందన వన విహరివి

ఐరావణ గజ మధిరోహించి

వైభవమలరగ నూరేగెదవూ                   // నీసరి//

 

కనుసైగలగని అప్పరాంగనలు 

నవ్య భంగిమల నాట్యమాడెదరు

 మధుర సుధల మనసార గ్రోలుచు 

దేవరాజువై తేజరిల్లెదవు                              //  నీసరి//

 

నీ వజ్రాయుధ ధార మెరుపులకు

అరి వీరులు భయభ్రాంతులగుదురు 

యమ వరుణాది దిక్పాలు లెల్లరు

 నీకొలువున కడు వెఱచి నిలుతురు            //నీసరి//

 

 (చివాలుగు లేచి ఊగిపోతాడు - రెండుసార్లు కిందపడబోయి - వెనక్కు పడబోతూ నిలద్రొక్కుకొని)

ఆపు..... (రంభ, ఊర్వశి నాట్యం చాలించి వెనక్కి వెళ్లిపోతారు). ఏమిటిది... అనూహ్యమైన ఆవేదన సన్నావే నించుచుగ్నది. మానసము వికలమై కలత నొందుచున్నది. నా దిద్య శారీరము భారమై తోచుచున్నది. (భారంగా కదులుతూ వెళ్ళి ఆసనం మీద కూర్చొంటాడు.... అనసం మీద నుండి క్రిందకు తోయబడినట్లు క్రింద బడతారు. బిత్తరపోయి అటు ఇటు భయంతో చూస్తాడు... ఆసనం వెనుక ఒక భూతాకారం కనబడుతుంది అది చూది) ఎవరు....... ఎవరు నువ్వు, (భయంకర భూతం కనబడుతుంది) నీ పాప ఫలాన్ని బ్రహ్మహత్యా దోషాన్ని....... సన్నెరుగవా .... (నవ్వు) నమ్మక ద్రోహంతో వృత్రాసురున్నిధించాదాపు. ఇక నిన్ను విడువను...... అనుక్షణం వెంటాడి వేధిస్తాను. పీడిస్తాను...... నేను నీ పాపఫలాని....... అనుభవించు .... ( నవ్వు) మీద పడబోతుంది .

 

ఇంద్రుడు :  పద్దు.....వద్దు......నన్ను వదలు.  నన్ను వదలు... నన్ను బాధించకు.... నన్ను బాధించకు. 

ఆకారం : అనుభవించు ...... అనుభవించు....... నిన్ను వదలను...

 

ఇంద్ర:  నన్ను వేధించకు......నన్ను వేధించకు ......... నారాయణా.. దేవా .....రక్షమాం రక్షమాం ... రక్షమాం - (లేది తేరుకొని) ఏమిటి వైపరీత్యము...... (గుండెపై చేయి వేసుకొని) గురుదేవా !(బృహస్పతి ప్రత్యక్ష మౌతాడు.  దేవేంద్రుడు నీరసముగా లేచి) గురుదేవులకు ప్రణామములు. (ఆసనం చూపును) 

 

బృహస్పతి:  (కూర్చింటూ) మహేంద్రా! మమ్ముతలచుటకు కారణమేమి ? 

ఇంద్ర: మహాత్మా!  ఏమని చెప్పను. నాకు పట్టిన ఈ దుర్దశ ఎలా వివరించను. పుణ్యమున కేగిన పాప మెదురైనట్లున్నది. భగవాన్! నా వ్యధలు మీతోగాక యింకెవరితో చెప్పుకొందును, నాదీనావస్థను మీకు విన్నవించుటకే మీ దర్శన మభిలషించితిని.

 

బృహస్పతి:  మహేంద్రా  నీకు వ్యధలా? ఆశ్చర్యముగా నున్నది. రక్కసుల నెల్ల బయించి, తిరిగి సర్గాధిపత్యము వహించియున్న నీకు దీనావస్థయా?

 

; ఎక్కడి కష్టమయ్య నిను నెవ్వరు బాధల పెట్టిరయ్య నీ

        కెక్కసమయ్యి రెవ్వరిక యేర్పడ జెప్పుము దేవరాజ ఆ

       రక్కసు లెల్లరం గెలిచి, రక్షణదేవగణంబుకిచ్చి పెం

       పెక్కిన వృత్రు జంపి, ఘనతేర్పడ నాకము నేలు చుండగన్.

 

ఇంద్రుడు :- మహాత్మా !

 

సీ॥ శ్రీహరి సురలకు క్షేమంబు జేకూర్చె

                సురపక్షపాతము జూపి చాల 

       మేటి దాత దధీచి మేని వెన్ను సురల 

                మేలు దలచి దాన మిచ్చిగాచె

      దేవగురువు లౌచు తేజరిల్లి తమరు

                 శత్రు భంజనమున సాయపడిరి

       శక్తి సామర్ధ్యంబు సమకూర్చుకొని నేను

                అరిభంజనము జేసి తయ్యయనఘ

 

తే:గీ:  గాన భయము రిపుల వల్ల గలుగదయ్య

            వృత్రు జంపిన నెపమున విడువ ననుచు

            పాప భూతము నావెంట బడిన దయ్య 

             దీని బాధ దీరు విధము తెలియనయ్య.

 

 దివ్య కాంతుల నీను నామేను క్షణక్షణమునకు కళావిహీనమగుచు కృశించు

చున్నది. బుద్ధి మాంధ్యత నొందుచున్నది. దివిజాధిపత్యము భారమై తోచుచున్నది. 

 

బృహస్పతి:- అటులనా (కళ్ళుమూసుకొని దివ్యజ్ఞానంతో గ్రహించాలి). ఇంద్రా ఆనాడు సురాసుర రణరంగమున  సురవిజయ కాంక్షియై మేలోనర్చిన త్రిశిరున్ని దయమాలి, కేవలం క్రతుభాగాన్ని అసురులకు పంచినాడన్న నెపంతో సంహరించావు. నరుకబడిన ఆత్రిశిరుని మూడు శిరస్సులు పక్షులై భీకర ఆర్తనాదాలు చేస్తూ నిన్ను చుట్టుముట్టి కల్లోలపరచినవి. సజ్జనుడైన ఆ విశ్వరూపునివధ అప్పుడు కూడా నిన్ను బ్రహ్మహత్యాదోష పరిపీడుతున్ని చేసింది. ఔనా?

 

 

ఇంద్రుడు :- శత్రు క్షేమం కోరేవాడు శత్రువే ఔతాడు. అందుకే ఆనాడతన్ని వధించక తప్పినది కాదు.

బృహస్పతి :- కానీ పర్యవసానం! అప్పుడే మరిచావా ? ఆనాడు నీకు సంక్రమించిన బ్రహ్మహత్యా దోషాన్ని మాకృప వల్ల భూమికి, వృక్షములకు, స్త్రీలకు, సముద్రానికి పంచి ఎట్లో ఆ పాప భారం నుండి విముక్తుడవైనావు.

కానీ ఈ నాటి ఈ దోషాన్ని తొలగించడం మావల్ల కాదు.

 

 

శా ॥  ఆనాడాత్రిశిరుం వధింప విడకన్ హైన్యంబు నింజెందగన్

         పోనాడందెరు వెయ్యదంచు వెతుకం పోదంచు నిర్ధారణం 

         బైనం పాపము పంచుకొన్న విగ స్త్రీ యంబోధి భూ భూజముల్

         ఈ నాడీ యఘమున్ వహింపగవలెన్ యెట్లైన నీ వంతుగన్

 

 ఇంద్ర:- (నిరాశతో) అంతేనంటారా ? దేవలోకహితం గోరి చేసిన ఈ కార్యమునకు నేను శిక్షితుడను కావసిందేనా ? మార్గాంతరమే లేదా ?

 

బృహస్పతి :- దేవేంద్రా నీ పదవీ వ్యామోహామే నిన్నీదశకు దెచ్చినది. యుక్తా యుక్త విచక్షణ గోల్పోయి చేయరాని పనులు జేసి చేటుకొని దెచ్చుకొంటివి. మంచి చేయడానికి మంచి మార్గాన్నే అవలంభించాలి. అంతేగాని తప్పుడు మార్గం ద్వారా మంచి చేయాలను కోవడం  నీ అవివేకం. తెలిసి చేసినా తెలియక చేసినా కర్మఫలం ఎంతటి వారికైనా అనుభవించక తప్పదు. 

 

ఆ॥  కార్యసాధనమున కడు జాగరూకతన్ 
       ధర్మహానిగాని దారియందు
       చేయుటొప్పుగాని చేయంగ రాదయా
         ప్రజల కొరకునైన పనుల నిట్లు

         (ఇంద్రుడు బాధ పడుచుండటం గమనించి ...దేవాంద్రా నీవు అనుభవిస్తున్న

నరకయాతన నాకవగతమైనది..... దీనికి తరుణోపాయం .......

 

 ఇంద్ర:- (ఆత్రుతతో) సెలవివ్వండి గురుదేవా ! 

 

బృహస్పతి :- నీవీ పదవీ వ్యామోహం వదలుకొని ప్రశాంతతకై తపస్సుకు బయలుదేరు. ఇంతకంటే వేరు గత్యంతరము లేదు.

 

ఇంద్ర:- తపస్సుకా తప్పదా మహాత్మా !

 

 బృహస్పతి :- తప్పదు దేవేంద్రా!

 

దేవేంద్ర:- మీ ఉపదేశం మాకు శిరోధార్యము. (నమస్కరించును)

(తెరపడును)

 

 



2, రంగము

(అంతఃపురం - ఇంద్రుడు దిగులుగా పచార్లు చేయును)

 శచీదేవి :- (ప్రవేశం) నాధా ! స్వర్గాదిపు లేలనో చింతాక్రాంతులైయున్నారు. వృత్రాసురాది అజేయ రాక్షసులను జయించి సురలోకమునకు సౌఖ్యము జేకూర్చి శుభములు పంచిన మీకు చింతేల ప్రభూ !

 

ఇంద్ర:- ఆవృత్రాసురుని వధమే నాకింత కీడు దెచ్చినది వృత్రాసురవధా సంప్రాపిత బ్రహ్మహత్యా దోషము నాకు సంక్రమించినది. గడవనలవి కాని యీ పాపఫలితము భరింప శక్యముగాకున్నది. శచీశక్యముగాకున్నది.

 

శచి:- ఆ....అటులనా... దేవ గురువతో ఈ విషయమై సంప్రదించలేదా స్వామి!

ఇంద్ర:- సంప్రదించితిని.

శచి:- వారేమనిరి.

ఇంద్ర:- ఈ పాపం తప్పింప సాధ్యం కాదన్నారు. అనుభవింపక తీరదన్నారు.

 శచి:- అయ్యో...... దీనికి వారు పరిష్కారమే సూచించలేదా?  

ఇంద్ర :- అరణ్యముల కేగి తపమాచరించుటే దీనికి పరిష్కారమన్నారు.

శచి:- స్వర్గ సుఖముల వీడి అడవుల కేగుటయా ? స్వామీ!     

ఇంద్ర:- గత్యంతరము లేదు దేవీ.. గత్యంతరము లేదు. నేనీ పరితాపమును భరిస్తూ ఇట ఇంకొక్క క్షణమైనా నిలువలేను.

 

ఆ: అనుభవింప వలయు నతిఘోర పాపమున్

      అలవి గాదు నాకు ననుభవింప

      అనుభవించు శక్తి నందించుతపమని

      గురుడు చెప్పే నతివ గురుతుగాను.

 

నారాయ......... నారాయణ.........( లోపలినుండి)

నారదమునీంద్రులు విచ్చేయుచున్నారు.........సమయమునకే వచ్చుచున్నట్లున్నారు. వారైనా మనకు దారిచూపకపోరు.

 

ఇంద్ర,శచి:- నారద మహర్పులకు ప్రణామములు.

 నారద:-  నారాయణానుగ్రహ ప్రాప్తిరస్తు........ఎల్లవేళల ఆనందంగా కనిపించే మీదంపతులు నేడేలనో దీర్ఘాలోచనలో నున్నట్లున్నారు. దివ్య తేజోమయమైన దేవేంద్రమందిరం నేడేలనో వెలవెలబోవుచున్నది.

 

తే:గీ॥  దివ్యకాంతుల వెలుగొందు దేవ నగరు

           చిన్నవోయిన దేలనో చెన్నుదరిగి 

            దేవరాజ వదనమున దిగులు నిండె 

            కనగ బాధాయె తెలుపలే కారణంబు.

 

ఇంద్ర:- సర్వజ్ఞులు తమకు తెలియని దేమున్నది దేవర్షి..... వృత్రాసురవధ చే బ్రహ్మ హత్యా దోషము చుట్టుకొని నన్ను వేధించుచున్నది

 

సీ:  పాపంబు జండాల రూపంబు గల దాని

               ముదిమిచే నొడలెల్ల గదలు దాని

క్షయ కుష్ఠురోగ సంచయ కృతంబగుదాని

            నురురక్త పూరంబు దొరగు దాని

నరసిన వెంట్రుకల నెరసినతలదాని

            సటబోకు బోకుండు మనెడు దాని

నదురు కంపున బ్రేవులదర జేసెడు దాని

            దానెందు బారిన దరుము దాని

 

ఆ॥   నాగుణంబు లెల్ల భోగింప కేరీతి

       నరుగ నెంత వాడ వనెడు దాని

       నెటుల నోర్చువాడ నేరీతి జనువాడ

       తెలియదయ్య దారి దేవ మౌని

 

శచి:- అయ్యో నాధా! ...ఏమిటీ వైపరత్యము. మునీంద్రా ఈ ఘోర విపత్తు నుండి నాభర్తను విముక్తుణ్ణి చేయండి. మాకు మార్గము చూపి కాపాడండి. (ఏడ్చును.)

ఆ: దేవలోక మందు దేదీప్యమానమై

       వెలిగి పోతిమయ్య వేల్పులందు

       ఎరుగమయ్య మేము యిట్టి కష్టమెపుడు

       కరుణ జూపి మమ్ము గావరయ్య.

 

 నారద:- ఊరడిల్లు తల్లీ! ఊరడిల్లు.....కష్టము వచ్చినప్పుడే మనం నిబ్బరంగా ఎదుర్కోవాలి. మహేంద్రా ఈ పాప విముక్తికై నీవన్వేషిస్తున్న మార్గం  ? 

                        

ఇంద్ర:- ఏమున్నది మునీంద్ర గురుదేవులు బృహస్పతి వారు సెలవిచ్చినట్లు అరణ్యమున కరిగి తపమాచరించుటయే!

 

నారద:- చక్కటియోచన. ఆ పరంధాముడు నిన్ను తప్పక అనుగ్రహిస్తాడు. నీ తపస్సుకు అనువైన ప్రదేశము మానస సరోవరము.

 

తే:గీ;  మానససరోవరము గొప్ప మహిమ నొప్పు

           నెట్టి యఘమునైనను నది నెట్టివైచు  

          గాన తపము నయ్యెడ జేసి గడచి యఘము

          మనసు నిర్మలమై యొప్పమరలి రమ్ము  

 

శచి:- అట్లయిన నేనుకూడా నాభర్త ననుసరించి వెళ్ళి వారి తపస్సునకు సహకరించెదను స్వామి.

ఇంద్ర: -  దేవీ ! నవకోమల సుకుమారివి నీవు నావెంట వచ్చియిడుమల బడుటయా! వలదు దేవీ... వలదు.

శచి:- పతి సాన్నిధ్యమే పతివ్రతలకు అనువగు స్థలము మిమ్ములను వీడి నేను మనగలనా? మీరులేని యీ స్వర్గము నాకెందుకు ప్రభూఁ నన్ననుగ్రహించి మీవెంట గొని పొండు.

 

తే:గీ॥  నిలువజాలను మిమువీడి నిముషమైన

           కాని కాలము కాబోలు కలిగెనిపుడు

          మనగ వశమౌనె మిముబాసి మాన్య చరిత

          వలదు త్రిదివము, మీ వెంట వచ్చుదాన

 

 నారద:- అమ్మా శచీదేవీ.......ఇంత గట్టి పట్టుదల నీకు తగదు తల్లీ! నీభర్త అచిర కాలములోనే పూర్వవైభవాన్ని తిరిగి పొందగలడు. కానీ నీవు మాత్రము యిచటనేయుండి నేజెప్పెడి కార్యము నిర్వర్తించు తల్లీ శభం చేకూరుతుంది.

 శచి:- సెలవివ్వండి మహాత్మా!

  నారద:- సురగంగా తీరమున వెలసియున్న ఆ దేవదేవి గౌరిని నీ వెరుగుదువు గదా! ఆ దేవిని నిత్యము పూజించి అనుగ్రహము సంపాదింపుము. మీ వ్యధలు త్వరిత గతిని నివృత్తి కాగలవు.

తే:గీ: మాత పార్వతిన్ నిరతము మరువ కుండ 

          పూజలొనరించి మందార పూలతోడ 

           సంశయంబుల విడనాడి స్వర్గమందు 

       నిలువు మమ్మ శుభంబులు నీకుగలుగు

 

ఇంద్ర:- నారద మునీంద్రుల ఆజ్ఞ మనకు శిరోధార్యము నేను తిరిగి వచ్చు వరకు దేవదేవి పూజలందు కాలము గడుపు దేవి.

నారద:- కామితార్థఫల సిద్ధిరస్తు !

   శచి:-   నాధా... మీ ఎడబాటును నేనెటుల భరించగలను....... నాధా!

  ఇంద్ర:-  ఊరడిల్లుము దేవి ఊరడిల్లుము. గురుదేవుల కృపయున్నంత కాలం నీకిక్కడ ఏ అపకారం జరగదు... ఇక నేను వెళ్ళి వచ్చెద.

(తెరపడును)

 


(ఆకాశం తెర ముందుపాట)

నారద:

జగదాధార - జగన్నాయక 

శ్రీ రమణా హరి....నమో నమో!

కలవంబోనిధి- కలవనిలమునన్

కలవగ్నిన్ మరి - ఆకాశమునన్

కుంభిని దిక్కుల రేలు పవళ్ళన్

కలవయ్యా ప్రభు! కలవను వారికి        //జగదా ధార//

 

ఒకపరిజగముల సృజియించెదవు

ఒకపరిజగముల హరియించెదవు

దుష్టుల దనుమగ తరలివచ్చెదవు 

భక్తుల బ్రోవగ నవతరించెదవు            //జగదా ధార//   

 

నారాయణ...నారాయ.. ఆ హా అప్పుడే స్వర్గము చేవచ్చితి....అదియే నందన వనము పారిజాత సుమసుగంధము  ఆహా! ఇంతదూరము వ్యాపించినది. దిగి ఒకసారి స్వర్గము దర్శింతము గాక - దేవేంద్రుడు లేని దేవలోకమునకు వెళ్ళ మనసు రావటం లేదు. శచీంద్రులకు ఇడుములు మొదలై అప్పుడే నెలరోజులు గడిచినవి. పరిస్థితులు తెలుసుకొనుటకైనా ఒకసారి వెళ్ళిరావలసియున్నది.

నారాయ...... నారాయణ.......(ఒక ప్రక్కకు వెళ్ళును )

 3,వ రంగము

(దేవసభ)

 బృహస్పతి :- దేవసభ నలంకరించిన సమస్త దేవతలారా ! మహర్షులారా   నేటి మన సమావేశమునకు కారణము మీ కందరకూ విదితమే. దేవలోక నాయకుడైన ఇంద్రుడు వృత్రాసురుని వధించినందున, బ్రహ్మహత్యా పాపము నకు లోనై పాప పరిహారార్థము మానససరోవరమున తప మాచరించుటకై త్రిదివము వీడి వెళ్ళి, నేటికి మాసము గడినది.ఈ నెల దినముల లోనే పాలకుడు లేనిలోటు మనకు ప్రస్ఫుటముగా కనిపించుచున్నది. అసురుల యుద్ధభయమొక వైపు మనలను కలవరపెట్టడమే గాకఅమరులలో కూడా అన్యోన్న పీడన మధికమై దేవలోక సంక్షేమమే దెబ్బతిన్నది. ఈ పరిస్థితులు ఈ విధంగానే కొనసాగితే దేవలోకము చిన్నాభిన్నమై శుత్రువులకు లోకువై పోగలదు. కనుక ప్రస్తుతం సమర్ధుడైన పాలకుడు అమర లోకమునకు అవసరమై యున్నది. ఈ ఇంద్రపదవిని చేపట్టి దేవలోక వైభవాన్ని పునరుద్ధ రించగల ధీరుడు మీలో ఎవరైనా ముందుకు రావలసిందిగా కోరుచున్నాను.  (సభలో కలకలము - ఎవరూ ముందుకురారు) అట్టివారు దేవలోకంలోనే ఎవరూ లేరా ....... సురలోకమును పాలించగల సమర్థుడు ఒక్కడూ లేడా!

  ఎంత గడ్డు పరిస్థితి...                                                            

 

 నారద:- (బయటి నుండి) నారాయణ........ నారాయణ......

 

 బృహస్పతి :- నారద మహర్షులు సమయానికే వస్తున్నట్లున్నారు. నారద మహర్షులకు అభివాదములు. దయచేయండి. మహర్షి దయచేయండి

 

నారద:- (వస్తూ) ఏమిటి మహర్షి దేవసభ నేడత్యంత కీలక సమస్యపై సమావేశమైనట్లున్నది.

 బృహస్పతి:- ఔను దేవముని... ఇంద్రుని ప్రస్తానంతో దేవలోకం రాజులేని రాజ్యమై పోయింది. తగిన నాయకుడు లేక దేవలోకం సంక్షోభంలో పడి పోయింది. సమర్థుడైన నాయకుడు దొరకక మేము వంత జెంది యున్నాము. మీరైనా ఇంద్రపదవికి తగిన వానిని సూచించి హితం చేకూర్చండి.

 

నారద:- సమస్త దేవతలారా! మునులారా! నన్నడిగితిరి గనుక జెబుతున్నాను.                       ఈ చతుర్ధశ భువనములలో నేను చూడని ప్రదేశము లేదు, నేనుగని చక్రవర్తీ లేడు. ఇంద్ర పదవి వంటి అత్యున్నత పదవి నలంకరించి దేవతలను పాలించి రక్షణ కల్పించగల శక్తి సామర్థ్యములు ఒక్కనికే గలవు.

 

చం:  దివిజుల రాజ్యభారమును ధీరత దాల్చి భరించు దర్పమున్

         జవము గలట్టి యోధుడు  నసాధ్యుడమోఘ తపఃప్రభావుడున్

         రవిసమ తేజుడా నహుష రాజవరేణ్యు సురేంద్రుజేసినన్

          దివిజులకున్ యశంబును సుదీర్ఘ శుభంబును గల్గు ధీమతీ..

 

 బృహస్పతి :- నహుషులా... అతనిని గూర్చి మేమును వినియుంటిమి.  చక్కని సూచన. దేవర్షీ!... ఆరాజన్యుని ఒప్పించి, పిలిపించి ఇంద్రసింహాసనము నధిష్ఠింపజేయు కార్యభారము కూడా తమరే వహించాలి.  

నారద:-  బృహస్పతులవారు నాపై మరీ భారమైన కార్యము మోపుతున్నారు. సరే నాకు తప్పదు గదా! దేవలోక సంక్షేమమునకై ఈ కార్యభారాన్ని నేనే

వహిస్తాను. సెలవు........ నారాయణ ...... నారాయణ.....

(తెరపడును)

 

4,రంగము

(దేవసభ)

(బృహస్పతి, నారదుడు, నహుషుడు ప్రవేశం)

 బృహస్పతి :- భూలోక చక్రవర్తులు. విద్యాబల తపోబల గరిష్ఠులు శతాధిక మఖ నిర్వాహకులు, భుజబల సంపన్నులు, భూరి పరాక్రమోపేతులు సౌశీల్యులు ఐన నహుష చక్రవర్తులకు మక్కోటి దేవగణంబు తరపున ఇదే మా స్వాగతము. ఈ సంకట సమయాన సౌర్గలోక సంక్షేమార్థమై మా విన్నపమును మన్నించి ఈ మహోన్నత పదవిని నధిరోహించి సురలోక పాలనము చేయ విచ్చేసిన నహుష వరేణ్యులు తమ సందేశాన్ని వినిపిస్తారు

 

  నహుషుడు :-  పరమ పూజ్యులైన దేవ గురువులకు త్రిలోక సంచారులు సర్వ లోక హితులు ఐన నారదమునీంద్రులకు మహనీయులైన మహర్షులకు దిక్పాలకులకు సభాసదులైన సమస్త దేవతలకు ఇవే నాభక్తి పూర్వక నమస్కృతులు. దివిజులారా! మీ ఆజ్ఞను శిరసావహించి వినమ్రుడనై మీ ఎదుటకు వచ్చి యున్నాను. మీరు నాపట్ల చూపిన ప్రేమ విశ్వాసములకు ముగ్ధుడనైనాను. మానవుడనైన నన్ను మీ అధిపతిగా ఎన్నుకోదలచిన విషయము తెలిసి నన్ను నేనే నమ్మలేకపోయాను. దేవతలారా నాదోక చిన్న విన్నపము. నేను కేవలము మర్ధ్వలోకవాసిని మానవుడను ఇంతటి ఉన్నత పీఠాన్నధిరోహించి స్వర్గాన్ని పాలించగల శక్తి సామర్థ్యములు   నాకు లేవని, సవినయముగా విన్న వించుకొంటున్నాను. 

 

నారద:- నహుష రాజేంద్రా నీ శక్తి సామర్థ్యములు ఎరిగియే మేము 

 మిమ్మీపదవికి సూచించితిమి. ఆఁ అవసరమైతే దేవతలు తమ శక్తిని కొంత ధారపోసైనా మీ నాయకత్వాన్ని నిలుపుకోగలరు.. ఏ మందురు మహర్షి.

 

బృహస్పతి:- ఔను దేవమునీ.... చక్కగా వచించితి...నహుషరాజా! మీ వినయ విధేయతలు మా మానస్సు నాకట్టుకొన్నవి. మా తపోశక్తిలో సగభాగాన్ని ధారపోసిమిమ్ము ఇంద్రపదవికి అర్హునిగా జేస్తున్నాను. ఇదే గ్రహింతువుగాక.

(నహుష చక్రవర్తికీ జై - నహుష చక్రవర్తికీజై)

అగ్ని:- అగ్ని దేవుడనైన నేను నాతే జోశక్తిలో సగభాగాన్ని నహష చక్రవర్తికిదే

ధారపోస్తున్నాను.

యముడు:-:- యమ ధర్మరాజు నైన నేను నాతేజోశక్తిలో సగభాగాన్ని నహుష చక్రవర్తి కిదే ధారపోస్తున్నాను.

వరుణుడు:- వరుణ దేవుడనైన నేను నాతేజోశక్తిలో సగభాగాన్ని నహుష చక్రవర్తికిదే ధారపోస్తున్నాను.

దేవతలు:- (బయట నుండి) మా తేజోశక్తి లో సగభాగాన్ని నహుష చక్రవర్తి కిదే ధారపోస్తున్నాము.

 నహుషుడు:- ధన్యుడను...మీ అభిష్టానుసారమే నేను ఇంద్రపదవిని చేపట్టి సురలోక పాలకుడనై అసురుల దండయాత్రలను అణచి వేస్తాను శాశ్వత సుఖశాంతులను దేవలోకము నకు సమకూర్చే వరకు విశ్రమించను..... మీ అందరి సమక్షమున ఇదే నా ప్రతిజ్ఞ.

  

కం:  ఏలెద దివిజుల రాజ్యము

         ప్రేలిన యలజడుల నణచి పెంచెద బలమున్

         తూలించెద నసురవరుల

         మేలున్ పంచెద సురలకు మీరలు మెచ్చన్. 

 

బృహస్పతి:- శుభమస్తు !

 

యమ అగ్ని వరుణ:- నహుష చక్రవర్తులకు జై. 

 

నారద :-  ఆఁ మహర్షి!  నహుష రాజ వరేణ్యుని పట్టాభిషిక్తుని గావించుటకు ఇదే మంచి ముహూర్తము. శుభస్య శీఘ్రం.

బృహస్పతి:-  అటులనే మునీంద్ర ...(యమవరుణులకు సైగ చేస్తాడు.) (బృహస్పతి నహషుని సింహాసనం దగ్గరకు తీసుకొని వెళ్ళి కూర్చొండబెట్టి మంత్రాలు చదువుతాడు. బయటి నుండి వేదమంత్రాలు బృహస్పతికి వంత కలుస్తాయి - వరుణడు కిరీటం అందించగా తలపై అలంకరిస్తాడు.)

(జయ జయ ధ్వానాలు మారుమ్రోగుతాయి.) (అందరూ ఆసీనులౌతారు) (రంభ నృత్యం మొదలౌతుంది)

పాట:

జయహో జయహో

జయహో- దివిజాధి నేత

జయ జయ జయహో - శ్రీ నహుష రాజా!

 

నాల్గువేదములు వేదాంతములు

 కూలంకుషముగ ఎరిగిన ధీనిధీ

నూరు యాగముల నిర్వహణమున

నిరుపమాన ప్రభ  నందిన భూప                    //జయహో//

  

నెలరాజాన్వయ మేటిరత్నమై

 నవఖండ భూ మండల మంతయు

 ఏకక్షత్రముగ పాలన జేసిన

 భూరిప్రతాప మహా ప్రదీప          

                

 అమరావతి అల జడుల నణచగ 

దేవతలందరి విజ్ఞాపనమును  

గౌరవించి సుర సింహాసనమున 

 కొలువు దీరి మా ఏలిక వైతివి                //జయహో//     

      

(తెరపడును)

 

5, రంగము

(ఇంద్ర భవనం) (యమ, వరుణ, అగ్ని కూర్చొని వుంటారు)

(నహుషుడు అతని నర్మసచివుడు ప్రవేశిస్తారు)

  యమ, ఇంద్ర, వరుణ:- (లేచి) స్వర్గాధిపులకు అభివాదములు.

 

 నహుషుడు:- ఊ... ఇంత అత్యవసరముగా మా వద్దకు వచ్చుటకు గల కారణము తెలుసుకొనవచ్చునా ?

 వరుణ :-  మేము మా శాఖ నిర్వహణ విషయమై తమతో చర్చించదలచి వచ్చితిమి.

 నహుషుడు:-  అంత అత్యవసర విషయమా ?

 వరుణ:-  అత్యవసరమా అంటే..

 నహుషుడు:- మీ కార్యనిర్వహణా దక్షత మాకు తెలుసు. అనవసరముగా మీరు మా కాలము వృధా చేయడం మంచిది కాదు. తెలిసినదా! (యముని వైపు జూచును)

యమ:-  నరకాధి పతులం. మా పనిలోని  క్లిష్టత తమ రెరుగనిది కాదు. అప్పుడప్పుడు స్వర్గమునకు వచ్చి సేదదీరటం మాకు పరిపాటి అంతేగాని...

 

 నహషుడు:- అంతేగాని వేరు పనిలేదు. ఇక మీదట యిట్టి అనవసరపు స్వర్గప్రయానాలు మానుకొని మీ పని మీరు చూచుకోవడం మంచిది. (అగ్ని వైపు చూచును)

అగ్ని:- నేను ఊరికే ఒకసారి మీ దర్శనం చేసుకొంద మని....  

           

నహుషడు:-  చేసుకొని తదనందరం రంభా ఊర్మశి మేనకాదులతో సరసాలాడదామని వచ్చారు. ఇక మీదట అవేమీ సాగవు. ఇక మీరు వెళ్లవచ్చు.

(యమ, వరుణ, అగ్ని వెళ్ళుదురు) 

రాజమిత్ర:-  రాజేంద్ర.. మన దర్శనార్థం వచ్చిన దిక్పాలకులను ఇలా చులకనగా మాట్టాడటం, వారికి కొంత మనస్తాపం కలిగిస్తూందేమోనని నా అనుమానం. రాజ్య నిర్వహణా విషయమున వారితో తరచు సంప్రదించడం మీకు మంచిదే కదా! "

 నహుషడు:-  సర్వజ్ఞుడనైన నాకు ఈ దిక్పాలకులా సలహాల నిచ్చి సహయపడునది. 

రాజమిత్ర:-  ఏది ఏమైనా...

 నహుషుడు:- నీకు తెలియదు రాజమిత్ర ఎవరిని ఏ స్థానంలో ఉంచవలెనో మాకు బాగా తెలుసు.. మా ఆజ్ఞలను శిరసావహించి వారివారి కర్తవ్యమును వారు నిర్వహించుకొనక సంప్రదింపుల నెపముతో మా సరసన కూర్చొని సలహాల నిచ్చుట మేము సహించముగాక సహించము.

 

రాజమిత్ర:- ప్రభువులకు రాజకీయ చర్చల కంటే.. సరస భరితమైన సుందరి నాట్యము నేడవసర మైనట్లు తోచుచున్నది. మీ కోసం ప్రత్యేకముగా నాగలోకం నుండి నాట్యగత్తెను పిలిపించితిని.

 

నహుషుడు:- దేవలోకంలో నాట్యగత్తెలు కరువయ్యారా !

 రాజమిత్ర:- రంభ ఊర్వసుల నాట్యాలు చూచిచూచి విసుగెత్తినది. అందుకే ఈ మార్పు. 

నహుషుడు:- సరిసరి త్వరగా కానిమ్ము, 

రాజమిత్ర :- అన్నీ సిద్ధముగానే ఉన్నవి. మీదే ఆలస్యం.

(సురాపానమునకు ఏర్పాట్లు చేస్తాడు) (మసక చీకటిలో మ్యూజిక్ మీద నాగిన్ నృత్యం) (నృత్యం ముగుస్తుండగా.)

 నారద:- (లోపల నుండి) నారాయణ........నారాయణ

 రాజమిత్ర:- నారదమునీంద్రులు... ఈ దేవర్షి దయవల్లే మనకీ మహర్ధశ కలిగింది.( అంటూ తొందరగా సరాపాన సామాగ్రిని తీసుకొని లోనికి వెళ్ళిపోవును) 

 నహుషుడు:- (నారదుడు లోనికి రావడం చూచి) నారద మహర్షులకు నమస్కృతులు,

నారద:- (చేతులతో దీవించి) నహుష రాజన్యులు ఉల్లాసముగ నున్నట్లున్నారు. సులోక పాలనము సులువుగా సాగుచున్నట్లేనా ?

నహుషుడు:- అంతాతమ ఆశీర్వాములు దేవర్షి.

 నారద:- ముల్లోకములలో నీర్తి వేయింతలైనది రాజేంద్రా! ఒక మానవ చక్రవర్తి ఇంద్ర సింహాసన మధిరోహించి అష్టదిక్పాలకులను అదుపులోనుంచు కొని అమర లోకమును ఏకక్షత్రాది పత్యముగా ఏలేచున్న ఘనత నీకే దక్కినది. 

నహుషుడు: -సంతోషము మునీంద్రా... 

నారద:-  కానీ, ఒక్క విషయము రాజేంద్రా..

 నహుష:- ఏమిటి దేవర్షి . .. సంకోచమేల సెలవివ్వండి.

నారద:- దేవలోక సంక్షేమాకాంక్షులైన దిక్పాలకులు నీ కఠిన శాసనములయెడ కొంత వ్యధజెందుచున్నట్లున్నది. వారి ఎడల కొంత సౌహార్థముతో మెలగి, వారి సహాయ సహకారములను కూడా పొంది నిష్కంటకముగా పాలన సాగింపుమని నా సలహా! (లేచి) వెళ్ళివత్తును సెలవు...... నారాయణ.....నారాయణ  (నారదుడు వెళ్లును)

 నహుషుడు: -విన్నావుగా రాజమిత్ర....ఈ దిక్పాలురను ఒక కంట కనిపెట్టు చుండుము. వారి ప్రవర్తనలను ఎప్పటికప్పుడు నాకెరిగించుచుండుము

(తెరపడును)

 

 

6,రంగము

(సురగంగా తీరము)

నారద:-

జగదాధార జగన్నాయక

శ్రీరమణాహరి నమోనమో!  

 

ఏవిధి నెవరిని ఉద్దరింతువో

 ఏవిధి నెవరిని తొలగ జేతువో

ఎవరి నెచట నిలుపంగ దలతువో

పరు లెరుగుదురే పరమ పవిత్రా             // జగదాధారా//

     

 

నీ కేళీ విలాస మెరుగగ

బ్రహ్మాదులకే తరముగాదుగా

మా తరమా నీ మాయ లెరుగగా    

 పరమ పవిత్రా పరమేశా హరీ            // జగదాధారా//                   

 

ఆ ఆవచ్చుచున్నది నహుషుడు అతని నర్మసచివుడు రాజమిత్రుడు కాబోలు. ఈ సురనదీ తీరానికి వ్యాహ్యాళికై వచ్చుచున్నట్లున్నారు. (రానిమ్ము)  ... ఈ పొదల చాటున దాగి వారి ప్రవర్తన నించక గమనించెదగాక-నారాయణ (పొదలచాటుకు వెళ్ళును)

నహుషుడు :-  (ప్రవేశించి)  రాజమిత్రా ... ఈ సురనదీ తీరమెంత  ఆహ్లాద కరముగానున్నది.

 

చ॥  కనులకు విందుసేయు కనకాంబురుహమ్ముల నవ్యతేజమున్

       తనువు గగొర్పులొంద వడితాకు ప్రపాత తుషార తెమ్మెరల్

        మనసున శాంతిగూర్చు మహిమాన్వితమై యలరారు హంసలున్

       కనుగొన సాటిలేదు సురగంగ తటంబున కెయ్యదేనియున్

 

 రాజమిత్ర :- అవును దేవరాజా, సురరాజ్య నిర్వహణా భార సంజనిత శ్రమను ఈ గంగానది తన కెరటములతో చల్లబరచిన మారుతము మీపై ప్రసరింపజేసి 

మీకు సేదదీర్చుచున్నది. 

 

 నహషుడు:-  రాజమిత్ర ... మేము సురలోకాధిపతులమై సుమారు వేయేండ్లు కావచ్చుచున్నది గదా! మరి మా పాలనపై మా ప్రజలైన సురల అభిప్రాయ మేమో తెలుసు కొంటివా?

 

రాజమిత్ర:-  చిత్తం ప్రభూ... తమ పాలనాకాలము దివిజ లోకానికి స్వర్ణయుగమనుట నిర్వివాదాంశము. పాత ఇంద్రుని విధానాలను ప్రక్కకు నెట్టి నూతన పద్ధతులలో పరిపాలన సాగించి దేవ లోకాన్ని, దావుల కభేద్యంగా తీర్చి దిద్దితిరన్నది  పరమసత్యం. అయినప్పటికీ దేవతలలో పాత దేవేంద్రునిపై మక్కువ గల వారును లేకపోలేదు. వారికి మీ విజయములు కొంత కంటకంగానే ఉన్నాయని నాకు వార్తలందు తున్నాయి. వీరికి కొంత మంది మునులుతోడై ఇంద్రుని త్వరిత గతిని పాప విముక్తున్ని జేసి తిరిగి ఇంద్ర పదవిని కట్టబెట్టాలని ప్రయత్నాలు సాగుతున్నట్లు కూడా తెలిసింది ప్రభూ..

 

నహూష:-  అటులనా. శత్రువుల బలపరాక్రమాల కన్నా స్వప్రజల అసహనం ఎక్కువ హానికరం. ఆఁ... అయినా సురులదేమున్నది వట్టి అమాయకులు. వారిని మనవైపు మరల్చుకోవటం అంత కష్టతర మేమీ కాదు. మన వాక్చాతుర్యముతోను వాగ్దానాలతోను ఒప్పించి మెప్పించగలము. కానీ ఈ మునులతోటే పెద్ద సమస్య. ఈ మేధావి వర్గము ఎడ కొంత అప్రమత్తతతో మెలగాలి తెలిసిందా?

 

రాజమిత్రా :- తెలిసినది ప్రభూ... నహూష: రాజమిత్ర.. అటుచూడు.

 

రాజమిత్ర :-  ఎవరో దేవతా స్త్రీ కాబోలు సురగంగలో స్నానాదికములు గావించుకొని గృహోన్ముఖయై కాబోలు యిటే వచ్చుచున్నది.

నహూష:-  ఆహా... రంభా, ఊర్వశి, మేరక, తిలోత్తమాది అప్సరసల నాట్యం సహితం ఈ సుందరి నడక యందు దిగదుడుపు. ఇంతటి అందత్తె ఈ లోకంలో ఉన్నదని లోకాధిపులమైన మాకే తెలియదే! బహుశ: నరుడనన్న చిన్నచూపు కాబోలు, కొన్ని అమూల్యములైన వస్తువులను జాత్యహంకారులైన ఈ దివిజులు నా కంటబడకుండా జాగ్రత్త వహించిరి గాబోలు... ఆ... రాజమిత్ర ఆ ఇంతి సమీపించుచున్నది. ఎవరిదో ఎక్కడిదో ఆ సుందరి వృత్తాంతమేమిటో తెలుసుకో.

రాజమిత్ర:-  చిత్తం . (శచి ప్రవేశం)  మహిళామణీ మేము ఆహా... నేను అమరాధిపులైన శ్రీశ్రీశ్రీ నహూష చక్రవర్తుల సచివుడను. రాజమిత్ర నామదేయుడను. ఇటనున్నారే వీరు.. వీరే మా ప్రభువులు... కాదుకాదు. మన ప్రభువులు  నహూష రాజ వరేణ్యులు.

 

 శచి:-  అమరాధిపులకు వందనములు. 

 

రాజమిత్ర:-  మీరెవరో ఎక్కడివారో ఈ సురనదీ ప్రాంతమున సంచరించుటకు గల కారణ మేమిటో ప్రభువులు తెలిసికొనగోరుచున్నారు.

 

శచి:-  నా పేరు శచీదేవి... దేవేంద్రుని దేవేరిని స్వర్గలోకవాసిని. సురగంగా స్నాన మాచరించి పరమేశ్వరీ దేవిని సేవించి గృహోన్ముఖమైనదానను (పోబోవును)

రాజమిత్ర :- (అడ్డునిలిచి) గృహమునకే గదా! అంత తొందరేల?

 

శచి:-  పరపురుషులతో ఇంతకుమించిన సంభాషణ మాకు తగినది కాదు. దయచేసి అడ్డు తొలగండి.

రాజమిత్ర:- అమరాధిపులైన మా ప్రభువులను అరకంటనైనా చూడకుండా వెళ్ళుచున్నది? ఎంత నిర్లక్ష్యము.

నహూష:-  ఔరా... ఏమి ఈ సుందరి లావణ్యము. 

 

సీ:  కాంచన వర్ణమై కాంతులీనెడు మేను

              నిడివిచాలగలట్టి నీలికనులు 

  రత్నవర్ణంబై మెరయునట్టి యధరంబు

              ధవళకాంతుల జిమ్ము దంత చయము

  నమపీన వైభవ సాధిత స్థనములు

             సన్మోహనంబైన సన్ననడుము

  నాణ్యమైయెప్పారు నవకంపు కరములు

              ఘననితంబములపై గదులుకురులు

 

తే:గీ:  అన్ని విధముల నీ యింతి అందమందు

            సాటి లేనట్టి దనుచును చాటనొప్పు

           నెలత వయ్యార మిదియందు నిర్వచింప

           నెంచి నిర్మించెనజుడు నియ్యింతి రూపు

 

ఆహా... సౌందర్యమన్న యిదికదా! ఈమెను ఇల్లాలిగా బడసిన ఆ పూర్వ

స్వర్గాధిపతియైన ఇంద్రుడు నిజంగా ధన్యుడు.

 

 రాజమిత్ర:-  అతని ఉత్తరాధికారియైన మీరు మాత్రమెందుకు ధన్యులు కారాదు ప్రభూ! ఆమె మీ పాలనలోని యింతియేకదా! ఆ ఇంద్రుని సమస్తము మీకు సంక్రమించినపుడు ఇంద్రాని కూడా మీకు సంక్రమించక ఏమౌతుంది.

 

నహూష:-  భళా రాజమిత్ర... భళ .... లెస్సబలికితివి. ... కానీ ఆ మోహనాంగి నన్ను వరించుట కు అంగీకరించునంటావా?

 

రాజమిత్ర :-  అంగీకరించక ఏంజేస్తుంది ప్రభూ... ఇంద్రలోకాధిపతులైన మిమ్ము వ్యతికేరించు సాహసము చేయగలదా ఆ అబల.

 

నహూష:-  అవును ఇంద్రాణి నా హృదయరాణి అయితీరాలి. రాజమిత్ర!  మా అభిమతాన్ని ఆ సుందరి కెరిగించి ఒప్పించి రప్పించి మా కప్పగించు బాధ్యత నీ కప్పగిస్తున్నాను

రాజమిత్ర :- చిత్తం .. తమరి ఆజ్ఞ.. రేపటి కల్లా ఆ సుందరి మీ ముందుండి తీరుతుంది. మంచిది. ఇప్పటికే ఆలస్యమైనది . మనమిక అంతఃపురమునకు వెళ్ళవలె పద. (ఇద్దరు వెళ్ళుదురు)

 

నారద:-  (చాటు నుండి వస్తూ) నారాయణ.. నారాయణ.. ఎంత విడ్డూరమెంత విడ్డూరము. వినరాని మాటలు ఈ నహూషుని నోట వింటిని. ఏమి వీని దురాగతము ఇంద్ర పదవితనికి మదగర్వములను పెంచినది. ఇంద్ర పదవికీతని నామము సూచించి నేనునూ తప్పు చేసిన వాడనైతిని వెంటనే వెళ్ళి వీని దుష్టత్వమును శచీదేవి కెరిగించి, బృహస్పతుల వారి రక్షణలో ఆమె ఉండునట్లు చేసెద గాక!

(తెరపడును)

7,రంగం

(అంతఃపురం-నహుషుడు ఆసీనుడై యుండును - రంభ నాట్యము చేయుచుండును)

పాట :

రంభను నేనేలే

 రంగారు బంగారు - రసరమ్యమూర్తిని 

రంభను నేనేలే.

 

నాపాద మంజీర రవళుల పులికించి

పూలజల్లులు రాల్చె. సురపొన్నశాఖలు 

నామందహాసాల రుచులను తిలకించి 

పల్లవించిన విట్టె సహకారములు మెచ్చి             // రంభను//    

 

నాహావ భావాల నటనమునకు బొంగి

కొండచరియల ఝరులు త్రుళ్ళింతలిడిజారె

నామేని బిగిబిగి వయ్యారముగని

 విద్యుల్లత చాల విప్పారి మెఱసె                           // రంభను//

మాటలు వేయేల మగరాయులెందరో  

రణరంగమున తెళ్ళి - నాపొందు కోరేరు

గొప్పతాపసులైన నాకొంగు దగలంగ

లేచివత్తురు గాదె శృంగార మొలకింప                   //రంభను//

 

(ఇంతలో రాజమిత్రుడు రావడముతో నాట్యం ఆగిపోయి రంభ నిష్క్రమిస్తుంది)

 నహుషుడు :- రాజమిత్ర.... ఏమైనది వె ళ్ళినపని ..... ఆ కోమలాంగి మా కోరికను మన్నించెనా? మమ్ము వరించుటకు అంగీకరించెనా? అలసింపక ఆ ఇంతి సమాధానమేమో వెంటనే మా కెరిగింపుము..

రాజమిత్ర :-  అదే విన్నవిస్తున్నాను ప్రభూ... శచీదేవి .... శచీదేవి..... 

 

నహూషుడు :-  శచీదేవి..... 

 రాజమిత్ర :-  శచీదేవి మీ ఆజ్ఞను తిరస్కరించింది ప్రభూ! 

 

నహూషుడు :-  ఆ....

 రాజమిత్ర :-  అంతే కాదు... ఇప్పుడామె బృహస్పతుల వారి రక్షణలో ఉన్నది. 

నహుషుడు :- అయిననేమి ..... బృహస్పతికి మా అభిమతం ఎరిగింపలేకపోయావా!

రాజమిత్ర:- ఎందుకు తెలుపలేదు... తెలిపితిని ప్రభూ.... ఆయన మీ అభిమతాన్ని మన్నించలేదు, సరికదా మందలించి మరీ పంపారు.

 

నహుషుడు :-  మందలింప... ఎవరిని... ఏమని 

 రాజమిత్ర:- మీ వంటి గొప్పవారికి ఈ విధమైన అల్పబుద్దులుండటం తగదట. ఆమె ఇతరుని ఇల్లాలట, పరనారియట, పరనారిని కోరుట పాపమట, పతన హేతువూ నట.

నహుషుడు :- ఔరా.... సర్వశాస్త్ర పారంగతుడైన ఈ నహూష రాజన్యునికే నీతులు చెబుతున్నాడా ఈ దేవగురుడు. ఇంద్రాణి.. ఇంద్రాణి ఈ ఇంద్రుని పట్టమహిషి కావటం చట్టసమ్మతమేమని చెప్పలేక పోయావా!

రాజమిత్ర :-  చెప్పి చూచితిని ప్రభూ... లాభము లేదు..... ఆమె మహా పతివ్రతయట. మీదు మిక్కిలి ఆయన శరణు గోరినదట. శరణార్థికి రక్షణ కల్పించుట తన విధియట.

 నహుషుడు :-  ఔరా ఈ దేవతలకు వారి గురువులకు ఎంత కపటము ఎంత అవిధేయత. 

ఆ॥  దిక్కులేని నాడు దిక్కునీ వంచును

      ఘనత జేసి మమ్ము గౌరవించి

      పనియు దీరినంత పలుచన జేయుచు

      తీసి వేయదగునె దేవగురుడు 

 

 అయినా ఎవరి అండ జూచుకొని ఈతని కింత గర్వము.

రాజమిత్ర:-  ఇంకెవరి అండ జూచుకొని ప్రభూ... వారి పూర్వపాలకుడు పాప విముకుడైనాట అదే పనిగా యజ్ఞములను జేసి వీరే పాప విముక్తుని జేసినారట. అతని అండజూచుకొనియే ఈ బృహస్పతి కింత గర్వము.

నహూషుడు :- అటులనా అట్లయిన వాడి బలమెంతో మేమూ చూడవలసిందే.

.. రాజమిత్ర! ముందు వాని ఉనికెక్కడో తెలుసుకో. తొలుత వాని మద మణచి తదుపరి బృహస్పతికి తగిన గుణపాఠము నేర్వేదము.

 ఇంద్రుడు:- (ప్రవేశీంచి)  నీకంత శ్రమ అవసరం లేదు నహుషా!

 

ఉ॥ ఉంచినచోట నుండక మహోన్నతులైన నిలింపకాంతలన్

       చంచల మానసుండవయి జారతనంబున జూచు నీకికన్

       మించెను కాలమున్ నహుష! మీరిదురూక్తులు బల్కుకాముకా

       త్రేంచెదనీదు శీర్షమును దేవగణంబులు సంతసింపగన్.

 

నీచుడా.... నా పత్నినిగాంచి పొగరుబోతు మాటలాడినందుకు ఇప్పుడే ఫలితమున భవింపుము. (వజ్రాయుధంతో వేయును వెంటనే మణికట్టు బడిసిపట్టి త్రిప్పి ఇంద్రుని క్రింద వడవేసి వజ్రాయుధం చేతికి తీసుకొని)

నహూష:-  అర్థమైనదా ఈ నహుషుని బలపరాక్రమ మెట్టిదో నీవేకాదు దేవాసుర యక్షకిన్నెర

కింపురుష గరుడ నాగపతులందరూ ఒక్కపెట్టున ఎత్తి వచ్చినను ఈ నహుషుని కొనగోటినైనను కదిలింపలేరు (నవ్వి) వజ్రాయుధమట వజ్రాయుధము (విసిరి పారవేయును).. అహల్యా జార బరుదాంకింతుడవు నీవు నాకు నీతులు చెప్పవచ్చితివా! లే! నీకు దిక్కున్నచోటికి వెళ్ళి మొరపెట్టుకో.. వెళ్ళు, (ఇంద్రుడు వెళ్ళెను)

రాజమిత్ర :-  ప్రభూ.... ప్రభూ... ఎంతపని జేసితిరి. చేత చిక్కిన శత్రువును విడిచిపెట్టితిరే..

 నహుషుడు :-  (నవ్వి) వీనితో నా కిసుమంతైననూ  భయము లేదు. వెళ్ళనిమ్ము వెళ్ళివాని ఏడుపేదో ఆ బృహస్పతి వద్ద ఏడ్వనిమ్ము... అప్పటికైనా మన మెవరో మనశక్తి సామర్ధ్యములేమో ఆ బృహస్పతి గ్రహించగలడు.

రాజమిత్ర:- చక్కటి యోచన ప్రభూ.... 

నహుషుడు :-  రాజమిత్ర!  రేపు నీవు సరాసరి బృహస్పతి వద్దకు వెళ్ళి మా ఆజ్ఞగా చెప్పు.

 రాజమిత్ర:- ఏమని ప్రభూ!

 నహుషుడు :-  శచిని మర్యాదగా మామందిరాని కంపమని. 

రాజమిత్ర :-  పంపనంటే! 

నహుషుడు :-  ఇంతవరకు మా అనుగ్రహాన్నే చూశారు... ఇక మా ఆగ్రహాన్ని కూడా చవిచూస్తారని హెచ్చరించిరా! 

రాజమిత్ర :- చిత్తం ..... శెలవు

 

(తెరపడును)

 

8, రంగము

(యమ, వరుణ, ఇంద్ర, అగ్ని, బృహస్పతి, నారదమునులు ఆశ్రమంలో ఉంటారు)

 ఇంద్ర :-  గురుదేవా ఇక మీరేమాకు దిక్కు, ఆ నహుషుడు అమోఘబల సంపన్నుడై ఉచ్ఛస్థితియందున్నాడు. వాడి వైపు తేరిపార జూడటం కూడా నాకు అసాధ్య మనిపిస్తున్నది.

 

బృహస్పతి :-  ఎరుగుదుము... మేము సర్వమెరుగుదుము. 

 

ఇంద్ర :-  గురువర్యా నాకు స్వర్గాధిపత్యము అవసరం లేదు. కేవలము సామాన్య పౌరునిగా ఈ స్వర్గమున భార్యాబిడ్డలతో శాంతిగా నుండనిచ్చిన చాలును.

నారద:-  ఇంద్రా నీవు మరీ యింత దీనత జెందనవసరంలేదు. కొంత ధైర్యం వహించి యుండుట ఎంతైనా అవసరము.

అగ్ని: వరుణ : యమ:-  మహేంద్రా.... అంతగా చింతించనవసరం లేదు. మనమంతా ఒక్కటై దండెత్తిన వాడేమి చేయగలడు. నిజమే... వీని అరాచకములకు ఇక భరతవాక్యం పలకవలసిందే.... వీనిచేత ఎన్నిసార్లని అవమానమనుభవించెదము. వీనిచెంత మన ఆత్మగౌరవం ఎప్పుడో నశించిపోయింది. ఇక సహించేది లేదు.

బృహస్పతి:- ఆగండి... అతని నెదిరించుటకిది సమయం కాదు. 

 యమ:- మనమెల్ల ఒక్క తాటిపై నిలిచి మెఱుపుదాడి జరిపిన వానిమదమణచలేమా?

అగ్ని:- అవును. ఎదురుతిరిగి దాడి చేయవలసిందే.

 వరుణ:- నేను సంసిద్ధంగా ఉన్నాను. ఇక ఆలస్యం దేనికి ఆయుధాలు చేపట్టండి.. కదలండి.

 నారద:-ఆవేశం అన్నివేళల అనుకూలత నివ్వదు. బృహస్పతి బుద్ధి బలంతో ముందు

వ్యూహరచన చేయవలసియున్నది. 

అగ్ని:-  గురుదేవా... మీ ఆజ్ఞనుబద్దులం. సెలవివ్వండి..

బృహస్పతి :-  నహుషుడిప్పుడు అజేయుడు. మన శక్తులలో సగభాగాలను ధారపోసి వాణ్ణి మనమే దుర్భేద్యున్ని గావించినాము - ఇప్పుడు వాణ్ణి ఎదిరించుటకు మనశక్తి చాలదు.

ఇంద్ర: -గురుదేవా.... ఇక నాకు మార్గమేది... వాడు నన్ను, నా ఇల్లాలిని వదలడు.

బృహస్పతి :-  ఇంద్రా! నా రక్షణలో నుండగా శచికి నీకు వచ్చిన ఆపదలేదు. దిక్పాలకులారా! మీరు మీమీ స్థానములలో నా ఆజ్ఞకై ఎదురు చూస్తూ సిద్ధంగా ఉండండి. ప్రస్తుతానికి మీరు మీమీ స్థానములకు వెళ్ళండి. జాగ్రత్తగా మెలగండి. మన సమావేశముల విషయం రహస్యంగా ఉంచండి.

 

యమ, వరుణ, అగ్ని:-  అట్లే గురుదేవా (నమస్కరించి వెళ్ళారు)

 బృహస్పతి :-  ఇంద్రా నీవునూ వెళ్ళి విశ్రమింపుము.

ఇంద్ర:-  మంచిది గురుదేవా

 

గురుదేవా (ఏడుస్తూ) నాకు చాలా భయంగా ఉంది మీరు మాట్లాడుతున్నదంతా వింటున్నాను. ఇక నన్ను కాపాడే వారెవరు గురుదేవా? ఎవరు? (ఏడుస్తుంది)

నారద:- ఊరడిల్లు తల్లీ! ఊరడిల్లు, బృహస్పతుల వారుండగా నీకేలతల్లీ భయము.

శచి:-  మిమ్ములను నమ్ముకొనే యిన్నాళ్ళూ జీవించి యున్నాను. లేకున్న.....

బృహస్పతి:- అంతమాటనకు తల్లీ.... నామాటనమ్ము. నీకు రక్షణ కల్పించటం నా విధి. నా బొందిలో ప్రాణముండగా నిన్ను ఎవరూ ఏమి చేయలేరు

.

నారద:- బృహస్పతుల వారిపై నీకు అపనమ్మకము తగదు తల్లీ.               

శచి:-  భయముచే అట్లుంటినే గాని మీపై నాకు యిసుమంతైనా అపనమ్మకము లేదు. క్షమించండి మహాత్మా నన్ను క్షమించండి.

బృహస్పతి:-  నేను బాగా యోచించితిని తల్లి!.......ఇక మీదటి కార్యము నీద్వారానే నెరవేరవలసియున్నది.

సెలవివ్వండి మహాత్మా

బృహస్పతి :-  నీవు నహుషునకు లొంగిపోయినట్లు నటించవలె.

 

శచి:-  గురుదేవా !

 బృహస్పతి :- భయపడకు తల్లీ.....నీవు కేంలం నటించవలె. మిఇలిన కార్యము మేము నడిపినట్లు నడువగలదు.

 

నారద:-  అదెట్లు మహాత్మా!

 

బృహస్పతి :- దేవర్షి! ముందు శచి నహుషునికి లొంగిపోతుంది. అంటే నహుషుడు శచికి లొంగిపోతాడు. శచి ఒక మాసము రోజులు వ్రతము పేరున గడువు కోరుతుంది. గడువు ముగియగానే సప్తర్షులు మోయు పల్లకీలో ఎక్కి నహుషున్ని తనను తోడుకొనిపోవుటకు రమ్మంటుంది. వాడు కాదనడు.

 

నారద:-  అందువల్ల మనకు కలుగు లాభం.

 

బృహస్పతి :-  సప్తర్షులచే పల్లకీ మోయించుకొని తిరిగిన వాని గతి ఏమౌతుంది దేవర్షి... వాని తేజస్సు హరించుకపోతుంది.

నారద:-  చక్కటి యోచన...ఇంకేముంది. వాడు విగత తేజుడైతే వాన్ని సాధించడం సులభమౌతుంది.

బృహస్పతి :- ఈ మధ్య మునులకు ఆగ్రహమే కలిగితే ఇక వాని పని వారే సమాప్తము చేస్తారు. 

నారద:-  ఎందుకైనా మంచిది. ఇంద్రుడు దిక్పాలకులతో కలిసి దండెత్తుటకు సిద్ధంగా ఉండటం అవసరం.

బృహస్పతి:-  విగత తేజుడైన నహుషుణ్ణి అప్పుడు అణచి వేయడం చాలా సులభం 

శచి:- మహాత్మా ఈ నటన నాతరమౌతుందా ? నాకే ఆపద వాటిల్లదు గదా !

 

నారద:-  నీ కోసమే కాదు... సమస్త దేవతల క్షేమం కోసం నీవీ పని చేయక తప్పదు తల్లీ..నీ కొచ్చిన భయమేమీ లేదు. మా ఆశీర్వాదం నీ వెన్నంటి ఉంటుంది.

 శచి:-   తమరి ఆజ్ఞ...నన్ను దీవించండి మహాత్మా !

 నారద:- బృహస్పతి విజయోస్తు!

(తెరపడును)

 

9,రంగము

(అంతఃపురం)

రాజమిత్ర:-  ప్రభూ..ప్రభూ..

నహుషుడు :-  వెళ్ళిన పని ఏమైనది రాజమిత్రా..

 రాజమిత్ర :- ఏమౌతుంది...

 

 నహుషుడు :-  ఇక లాభం లేదు.. ఆ బృహస్పతి కింత గర్వమా !

 

మ॥  తగునే దేవగురుండు నిక్కిపలుకన్, తానిట్లు వాంఛించునే

        తగవున, మేలన వచ్చునే, ఎరుగడే దార్ద్యాది కుండంచునన్ 

        పగమాతో కొని తెచ్చుకోదలచెనే పతంబుమాతోడనే

        అగునే నన్నెదిరించి గీష్పతి సచిన్ నాకంబులో దాచగన్.

 

హుఁ.. మేమే స్వయముగా వెళ్ళి, ఆశచిని బృహస్పతి ఆశ్రమం నుండి చెరపట్టి.. 

రాజమిత్ర:-  ఆ...అంత శ్రమ మీ కవసరం లేదు వెళ్ళిన పని సానుకూలమైనది ప్రభూ.. శచీదేవి మీకోసం వచ్చి వాకిట వేచియున్నది.

నీవంటున్నది నిజమేనా ? 

రాజమిత్ర:-  ఈ రాజమిత్ర డెపుడైనా మీతో అబద్ధం చెప్పేనా ?    

నహుష:-  భళా రాజమిత్ర భళా! నీ మేలు నే నెన్నటికీ  మరువలేను...... (రాజమిత్ర వెళ్ళును)

(శచీదేవి ప్రవేశిస్తుంది) స్వాగతం ...సుస్వాగతం..... అతిలోక సౌందర్యరాశి అత్యంత కోమలకుసుమిత లతాంగి, అలివేణి....... స్వాగతం సుస్వాగతం. 

శచి:-అమరాధిపులకు మా హృదయపూర్వక ప్రేమాభివందనములు. 

 నహుష:-రాదేవి... ఈ రత్నఖచిత పీఠమలంకరించు... నిన్నానాడు సురనదీ తీరమున చూచినది మొదలు  నామనస్సు మనస్సులో లేదు కనులు మూసినా తెరచినా నీ ముగ్ధమోహన రూపమే నా ఎదుట కదలాడు తున్నది.

   నహుష:-  మిమ్ముల నర్థం చేసుకోలేక మీకు కొంత యిబ్బంది కలిగించితిని. 

ఇప్పటికైనా మా మనసర్థం చేసుకొన్నందుకు సంతోషం. శుదీ.. నీవే నా జీవిత సర్వస్వానివి. అత్యంతోన్నతమైన ఈ అమర రాజ్యాధిపత్యం కన్నా నీ పొందే నాకు మిన్న. రాదేవీ!.. రా..నా కౌగిలిలోనికి రా! ఆ...ఆగండి..     

నహుష:-  ఎందుకు దేవీ భయపడెదను... నా ఎదుట నీకెందుకు భయం రా.. వచ్చి నీ కౌగిలి నాకందించు. నీ అరుణారుణ అధరముల ముద్దాడని ము......... వచ్చి నాలో కలసి పో..రా..

 

 

శచి:- మీ ఉత్సాహమునకడ్డు తగులుతున్నందుకు మించాలి.     

నహుష:- ఎందుకు దేవి సందేహిస్తున్నావు.. ఆలసింపక, నీమనసులోని మాటేమిటో మా కెరిగింపుము దేవి.

శచి:-  అదే విన్నవించుకొంటున్నాను ప్రభూ.... నేను ...నేను ఈ మధ్యన ఒక వ్రతము చేయనారంభించితిని.  (నవ్వి)  వ్రతమా.. ఒక్క వ్రతమేమిటి వందచేయి అందుకు తగిన ఏర్పాట్లు మేము గావించెదము.

శచి:-  అవసరము లేదు ప్రభూ... ఈ ఒక్క వ్రతము నిర్విఘ్నముగా పూర్తిగా వించిన చాలును.. అందుకు... అందుకు... అందుకు మీ సహకారము అవసరం. 

నహుష:- అదేమో చెప్పుదేవీ!... మేము తప్పక సహకరింతుము.

 శచి:-  ఈ వ్రతాంతము వరకు పురుషస్పర్శ వర్జ వనీయము. కనుక ఇంకొక్క మాసము దినములు మాత్రము మీరు వేచియుండక తప్పదు.

నహుష:- మాసము దినములా.. వద్దు శచీ వద్దు మన కలయికకు ఆటంకమైన

ఈ వత్రం వలదు. మానెయ్ శచీ మానెయ్. 

శచి:-  లేదు ప్రభూ..తమరలా అనకూడదు. వ్రతం మధ్యలో ఆగడం అనర్ధదాయకం. అదియునుగాక మిమ్ములను వ్రత వినాశకులుగా జేసి పాపము కట్టుకోలేను.

నహుష:- మాపై మీ కెంత అనురాగము...అయితే మాసము దినములు ఆగక తప్పదన్నమాట.

శచి:-  మాసమనగా నెంత ప్రభూ... యిట్టే డగిచిపోగలదు. 

 నహుష :-  సరే ఒప్పుకోక తప్పుతుందా మరి. కాదు కూడదని మీకు వ్రత భంగము కలిగించినా.. ఆ తర్వాత కలిగే  ప్రతి చిన్న ప్రతిబంధకానికి యిదే కారణమంటారు. ఇది అతివల నైజం కదా.

శచి:-  మీరెట్లైననూ భావించుడు.. మా నమ్మకం మాది... ఆఁ ప్రభువులకొక్క మనవి.

 నహుష :-  ఏమది.

శచి:-  రాబోవు అమావాస్యకు నావ్రతం పూర్తవుతుంది, మరునాడే నా రాజాంతఃపుర ప్రవేశం. ఆదినం మామూలు దిరం కారాదు. నేను,నన్ను వలచినవారు దివ్యకాంతులతో వెలిగిపోవాలి. సురరాజ్యవీధుల గుండా ఊరేగాలి. మహదానంద భరితులమవ్వాలి.

నహుష:- మంచి ఆలోచన, రత్నవజ్ర వైడూర్య ఖచితము, దివ్యపారిజాత కుసుమాలంకృతము అయిన ప్రత్యేక పల్లకీ నెక్కి వచ్చి స్వయముగా నిన్ను తోడుకొని రాగలను. సరియేనా! సంతోషము..... చాలా సంతోషము.

కానీ అందులోనూ ప్రత్యేకతకై ఆ పల్లకిని పరమయోగులు మునిపుంగవుల చేత మోయించిన యెట్లుండును.

 నహుష:-  (నవ్వి) బాగున్నది.. చాలా బాగున్నది. నీ సలహా అమోఘం. అద్భుతం అనన్య సామాన్యం . నిజమే ఈ నహుష చక్రవర్తికి ఇతరులకు తేడా తెలియాలి. అప్పుడే మన గొప్పదనం బయటపడుతుంది. నాటివరకు ఎందుకు నేటి నుండే నా పల్లకీ మోయుబోయీలు సప్తర్షులు. నేటి నుండి ముని వాహనుడనై చరించి నాకీర్తి దిగంతాలకు వ్యాపింపజేస్తాను.

శచి:- నహుషారాజా! ఇప్పటికే ప్రొద్దుపోయినది. నా వ్రతకార్యక్రమములకు వేళ కానున్నది..

నహుష:-  సరిసరి నీ వ్రతమునకు భంగము కలుగరాదు. మంచిది. ఇక నీవు వెళ్ళవచ్చును. ఎవరక్కడ  (లోపల నుండి ప్రభూ!) రాజమిత్రుని పంపించుము.

రాజమిత్ర:-  ప్రభూ!

 నహుష:- రాజమిత్రా శచీదేవిని బృహస్పతి ఆశ్రమమునకు సగౌరవంగా పంపు. ఆ.. వెంట పదిమంది పరిచారికలను కూడా పంపు.

రాజమిత్ర :-  చిత్తం. (శచి, రాజమిత్ర వెళ్ళును.)

 నహుష:- ధరణీ నేతనై ఏకచ్ఛత్రాధిపత్యముగా పాలన సాగించితి. శతాధిక యాగముల నిర్వహించి విద్యాబల తపోబలములచేయలరారితి. కడకు సురలోకాధిపతినై ఎదురులేక నిల్చితి. ఇక అసమాన్యులు అనన్య తేజోవంతులు నైన సప్తర్షులను మదీయ పల్లకీ మోయుబోయీలుగా నియమించెద. ముల్లో కముల యందును కనివిని ఎరుగని రీతిని చరించి మదీయ మహనీయ చరిత్రలో ఈ ఘట్టమును సువర్ణాక్షరములతో తిఖింప జేసెదగాక. ఇక నాకీ చతుర్దశ భువనములలో సాటి వచ్చువారు లేరు.. లేరు... (వికట్టాహాసం) రాజమిత్రా !

రాజమిత్రుడు :- (వచ్చి)  ప్రభూ!

 నహుష :-  వెళ్ళు వెళ్ళి సప్తరుషలకు మా ఆజ్ఞగా ఎరిగించు.

  రాజమిత్ర :- ఏమని ప్రభూ!

  నహుష :- ఈ నహుషుడు అసాధ్యుడు అనన్య సామాన్యుడు. రాజమిత్రా! మమ్ము సేవించుటకు వారిని వెంటనే తరలిరమ్మను. నేటి నుండి వారు మా పల్లకీ మోయుబోయీలు కావలె.

 రాజమిత్ర:- ఏమిటి ప్రభూ మీరంటున్నది. సప్తర్పులను బోయీలుగా నియమంచుటా! తగదు

 ప్రభూ! తగదు. నిరంతర భగవన్నామ సంస్మరణా తత్పరులై వెలుగొందు వారిని ఈ నీచ కార్యములకు నియమించుట వినాశ హేతువు ప్రభూ.... నామాట విని ఈ తలంపు మానుకోండి.

నహుష:- రాజమిత్ర వెళ్ళు! వెళ్ళి మా అజ్ఞ అమలుజరుపు. ఇది నా ప్రియసఖి శచి కోరిన కోరిక అమలు జరిగి తీరాలి.. ఊ వెళ్ళు,

 

రాజమిత్ర :- ప్రభూ!

ఆ:  అమలు పరిచినాడ నాజల నన్నిటిన్

       ఎదురు పలికి యెరుగ నెన్నడేని

       మేలు దలచి మరల మిమ్ము వేడుకొనెద 

       మునుల జెనకవలదు ముప్పు గలుగు

 

నహుష:- రాజమిత్ర మనకు వచ్చిన భయమేమి లేదు. వెంటనే నా ఆజ్ఞను అమలు జరుపు. (నహుషుడు వెళ్ళును)  

 

రాజమిత్ర:- ఔరా కాలమెట్టి విపరీత రూపము దాల్చినది. ఇనేళ్ళూ హాయిగా దేవలోక వైభవాలను అనుభవించితిమి. ఇక కాలము వికటించినట్లున్నది. లేకున్న ప్రభువు కాంతాదాసుడై హితము పెడచెవిన బెట్టుచున్నాడు. కానిమ్ము కానున్నది కాక మానదు. 

 

తే:  సుఖము లందితి మిన్నాళ్ళు సురలగలసి

      కాలమొకరీతి నెప్పుడున్ గడచిపోదు 

     చేటుకాలము కాబోలు చేరువయ్యె

    గాక హితమేల రాజట్లు కనడు వినడు.     

 

(తెరపడును)

  

10,రంగము

 (ఆశ్రమము, శచీదేవి పార్వతీదేవి ఎదుట పాట పాడుతుంది. నారద బృహస్పతులు ప్రవేశిస్తారు)

పాట:

కాపాడు మాదేవి కాత్యాయినీ

నిరతము నిన్నే మది నమ్మితిని          //  కాపాడు//

 

నాకము విడచి నాపతి ఈతరి

అడవులలో కడు నిడుముల బడుచు

తాపన వృత్తిని తాను చరించెను

మాపై దయరాద మమ్మేలరాద             //  కాపాడు//

         

పతినెడబాసి వెతలను బడుచు

గత వైభవమొక కలగానగుచు

 గతి చెడినిట నతి దీనత బడి

అలమటించుటయె నీకభిమతమా        //  కాపాడు//        

 

 నీచుడు కూరుడు నహుషుడు ననుగని

మతి చెడి పలికెడి పరుషములను గని

భయమును విడినే బ్రతుకుదు నేవిధి 

కనికరమే లేద! నావిధి గన లేవ!                //  కాపాడు//  

          

నారద:- ( వచ్చి)  నారాయణ.... నారాయణ

 

 శచి:-  నారద మునీంద్రులకు వందనములు.

 

 నారద:-  శుభమస్త....... ఇష్టకామ్యార్ధఫల సిద్ధిరస్తు. (పల్లకీ వెళ్లుతున్న శబ్దం..ఒహోం.. ఒ హోంహోం....).

 

శచి:-  మహర్షి... ఏమిటా శబ్దం..న హుషుని పల్లకీ కాదు గదా! అప్పుడే నేను పెట్టిన గడువైపోయినదా! నాకేదో భయంగా వుంది.

 

బృహస్పతి:- భయపడకు తల్లీ... మేము వెళ్ళి తెలుసుకొనెదము.

 

నారద:-  గడువు ఇంకా పక్షము దినములున్నది..న హుషడు వచ్చుటకు వీలులేదు... నీవనవసరంగా కంగారు పడుచున్నావు తల్లీ.

బృహస్పతి:- (వచ్చి) నహుషుడే! 

 

శచి:- ఆ.. నహుషుడు వస్తున్నాడా !

 

 బృహస్పతి:- నహుషుడు మన ఆశ్రమము మీదుగా సురనదీ తీరానికి వ్యాహాళి కెళుతున్నాడు. అప్పుడే వాడు మునులచేత తన పల్లకీ మోయించుకొని తిరుగుచున్నాడు..

 

శచి:- అమ్మయ్యా..అప్పుడే గడువు ముగిసెనేమోనని భయపడితిని.

నారద:-  అమ్మా శచీదేవి బృహస్పతుల వారి పాచిక బాగానే పారింది. వాడు నీ కపట ప్రేమ నిజమని నమ్మి అప్పుడే మునులపై నెక్కి తిరుగుచున్నాడు. ఇక వాని పతనము రమారమి సమీపించినట్లే.

 

కం॥   రావించె మునుల రయమున

           కావించెను సేవకులుగ కడు నిర్దయతన్ 

           నీ వలపు నిక్కమనుకొని

           నీ వెటు లాడించెదటుల నిరతము నాడున్ 

 

వాడు మధాంధుడై మహనీయ తపోవిభవులైన సప్తర్షులచేత అందలము

మోయించుకొని నానాటికి విగత తేజుడై తున్నాడు.

నారద:- సేవించవలసినవారిని సేవకులుగా నియమించి అవమానించిన వాడు పతనంగాక యింకేమౌతాడు మహర్షి.

 

బృహస్పతి :- తేజోహానిగల్గిన ననహుషుడిప్పుడు సులభసాద్యుడు. ఇంద్రున కీవార్త తెలిపి యుద్ధసన్నద్దుణ్ణిగావిస్తాను.

 

నారద:-  సంతోషము బృహస్పతి  సంతోషము. అమ్మా శచీదేవి పరిస్థితి యిప్పుడు అర్థమౌతున్నది గదా! నీవిక ధైర్యంగా ఉండుతల్లీ. 

 

శచి:-  ఈ శచి శుచియని మీరు సంభావించుచుంటిరిగదా మహాత్మా... అదే మాట మాపాలిట ఆశీర్వాదమై, నేటికి వరముగా పరిణమించినది అంతా మీ దయ మహాత్మా ..మీదయ..

 

బృహస్పతి:-  ఒక్క తృటిలో సముద్రపానము చేసిన కుంభ సంభవుడు సైతము ఓపికగా నహుషుని పల్లకీ మోస్తున్నాడంటే...

 

నారద:-  నాకూ ఆశ్చర్యంగానే ఉంది. ఆమహర్షి మరీ పొట్టివాడు. పల్లకీ కొమ్ముపట్టడం పాపం అతనికి మరింత కష్టం.

బృస్పతి :-  ఔనౌను బరువంతా ఆయన పైబడి పాపం చెమటలు గ్రక్కుచున్నాడు. దానికి తోడు ఆ నహుషుడు ఆయన్ను  సర్పా.. సర్పా అంటూ, తరుముచున్నాడు.

 

నారద:-  వినాశకాలే విపరీత బుద్ధి అంటే యిదే నన్నమాట. 

  బృహస్పతి :-  ఇక మనము జాగ్రత్తగా పరిస్థితులను గమనిస్తూ తగిన 

సమయానికై ఎదురు చూస్తూ ఉండవలెను.

 

నారద: - ఇక నాకు సెలవు....... నారాయణ.......నారాయణ......

 

  

11, రంగము

(అంతఃపురము-నహుషుడు, మధుపాన మత్తుడై భ్రమకు లోనౌతాడు. ఎదురుగా శచి వయ్యారంగా నిలబడి రాగాలాపన చేస్తుంది. దాని కనువుగా నహుషుడు పాట మొదలు పెడతాడు)

 

నహుషుడు:-  ప్రియభామిని నీ తలపే-- మరి మరి మదిలోన మెదలి 

                  మధుర భావములను రేపి-- మనసు పరవసింపజేసే

 

శచి:-   ప్రియ సఖుడా నీ తలపే-- మమరి మదిలోన కలిగి

           మధుర భావములను రేపి—మనసు పరవసింపజేసే

                                                                                

నహుష:- నీ యధర ఫలరసముగ్రోల-- వన శారీక నౌదు నేను                                                                                                                        నీ పద కమలముల వ్రాల-- ఉదయారుణ కిరణ మౌదు        // ప్రియభామిని//                                                                                                                                                                                    

శచి:-   నీతను బిళ్వమును ప్రాక-- మాధవిలత నౌదు నేను

              నీ హృదయాకాశ వీధి-- తారకనై వెలిగి పోదు       //ప్రియసకుడ//               

                                                                

 (మత్తు నుండి తేరుకొని కలయని తెలుసుకొని కండ్లు నులుముకొని నిరుత్సాహపడతాడు)

 రాజమిత్ర :- (వస్తూ) నహుష రాజన్యులకు నమస్కృతులు. నహుష రాజమిత్రా ఈ నాడు తిధి రాజమిత్ర : త్రయోదశి ప్రభూ! నహుష: 'ఇక చతుర్ధశి అమావాస్య గడునలసి వుంది.

 రాజమిత్ర :-  ఎందులకు ప్రభూ!  

నహుష:-  ఎందులకేమిటి నాగడువు తీరుటకు. 

రాజమిత్ర:-   ఆ.....

 

నహుషుడు:-  దినమొక యుగముగా గడుపుచున్న నన్ను నా ప్రేయసి శచి వరించుటకుఇంకనూ రెండు రోజులున్నది. ఆ సుందరి పొందుగోరి పరితపిస్తున్న నామనసుకు ఊరట గల్గుటకు ఇంకనూ రెండు రోజులున్నది. రాజమిత్ర నాకీ రెండు రోజులు రెండు యుగాలుగా తోచుచున్నది. ఆ సుందరిని మరచి యుండుట నాతరము గాకున్నది. కనులు మూసినా తెరచినా ఆ లావణ్యవతి రూపమే నాకు కన్పించుచున్నది. ఏ పని మీదను మనసు లగ్నము గాకున్నది.

ఆ॥   రాదు మరపురాకు రవ్వంత సేపైన

        కనుల ముందు నిలచు కాంతరూపు 

        మనసు మగువ వీడి మనగల్గనోపదు

        యేమి సేతు మిత్ర హితము సెపుమ.

 

 రాజమిత్ర: -  మీ వాలకము విచిత్రముగానున్నది.  ప్రభూ! మదనబాణ పీడితులైన మీ మనస్సు  వికలమైపోయినది. మనసు నితర విషయములపై మరల్చి ఊరట పొందుట మంచిదని నా సలహా. 

 

 నహుష :-  మంచిది రాజమిత్రా మంచిది. నీ సలహా ఆచరనీయమే అట్లయిన వెళ్ళి అగస్త్యుని పిలుచుకొనిరమ్ము. కొద్దిసేపాతనితో ఇష్టాగోష్ఠి చేసెదము. 

రాజమిత్ర :-  కుంభ సంభవులా! పాపమాముని మీ పల్లకీ మోసిమోసి అలసిపోయి విశ్రమించినట్లున్నారు.

 

నహుష :-  అగస్త్యునితో తప్ప ఇతరులతో గోష్ఠి అంతగా రాణించదు..... వెళ్ళిపిలుచుకొని రమ్ము, 

 

రాజమిత్ర :-  అగస్త్యునితో గాక మరింకెవరితోనైనా..

 

నహుష :-  వద్దు.. అగస్తునే పిలుచుకొని రా... చెప్పిన పనిచెయ్యి....వెళ్ళు. 

 

రాజమిత్ర :-  చిత్తం.

 

నహుషుడు:-  (లటూ ఇటూ పచార్లు చేస్తూ-- వస్తున్న అగస్త్యుని జూచి)  రా కుంభసంభవా.. రా - ఇటు కూర్చో, 

 

అగస్త్యుడు :-  (కూర్చోని)  స్వర్గాధిపా ... ఈ వేళకాని వేళ మమ్ము పిలిపించుటకు గల కారణము. 

 

 నహుషుడు:-  మీతో కాసేపు వేద గోష్ఠిగావించెము. 

 

అగస్తుడు:-  యిప్పుడా ! నహుషుడు : మా మనసు వికలముగా నున్నది. మనశ్శాంతి కై మీతో గోష్ఠినభిలషించితి.

 

అగస్త్యుడు :- అటులనా మాతో గోపి మీకూరట కలిగిస్తుందంటే మంచిదే. కానీ మన మిరువురము చాలా విషయములలో ఏకాభిప్రాయములము కాము. మున్నెన్నో సభలందు విభేదించితిమి కూడా..

 

నహుష:-  అయినా.. మిమ్మే ఎందుకు పిలిపించామని కదా మీ సందేహం. మహర్షీ! విద్యుక్త ధర్మాన్ని వినయంతో నిర్వర్తించేవాడివి. నాయకునికి దాపోహమనే తత్త్వంగాక నీవు నమ్మిన నిజాన్ని నిరొగమాటంగా నిర్భయంగా ఎదిరించి వాదించగల ధైర్యశాలివి. అందుకే నీతో చర్చ నాకిష్టం.

 

అగస్త్యుడు :-  మంచిది, అట్లయిన గోష్ఠి ప్రారంభించవచ్చును. 

 

నహుష:-  సరే నేనే ప్రారంభింతును......మీ అభిప్రాయమున జీవుడు స్వతంత్రుడా పరతంత్రుడా. 

 

అగస్త్యుడు :-  జీవి కర్మానుగత వర్తనుడు. 

 

నహుషుడు :-  అట్లయిన జీవికి కర్మలు జేయుటకు నైనా అధికారము కలదందురా లేద !

 అగస్త్యుడు:-  కలదు. . కర్మజేయుట యందే జీవి కధికారము గాని, దాని ఫలితము పై లేదు. 

నహుషుడు:-  మరి ఫలితము...

 

 అగస్త్యుడు :-  దైవాదీనము.

 

 నహుషుడు:-  దైవమనిన..

 

 అగస్త్యుడు :-  కర్మానుగత ఫలితములనిచ్చు ఒక శక్తిగాని శక్తి.

 

 నహుషుడు:-  ఫలితము కర్మపై ఆధారపడదా !

 

 అగస్త్యుడు:-  ఎందుకాధారపడదు - తప్పక ఆధారపడును. 

 

నహుషుడు:-  అట్లయిన ఇక దైవము యొక్క ప్రసక్తి నామమాత్రమే గదా!

 

అగస్త్యుడు :-  జీవి కార్మనుగత ఫలితమును తనకనుకూలముగా కోరుకొనును. 

 

నహుషుడు:-  మరి..

 

 అగస్త్యుడు :-  దైవము వైషమ్యరహితమై ఫలితముల నిర్ధారించును. 

నహుషుడు:-  ఫలితము దానికై అది సిద్ధించునని నానమ్మకము. 

 

అగస్త్యుడు :-  అదే మీరన్న “దానికై అది" అన్నమాటయే దైవమునకు ఒక విధమగు నిర్వచనము. 

 

నహుషుడు: - బాగున్నది. చాలా బాగున్నది. మునీంద్రచంద్రమా మీ సమాధానము చాలా సమంజసముగానున్నది.

 

అగస్త్యుడు :-  మంచిది ఇక ఏ విషయము ప్రస్తావించుకొందుము. నహుషుడు: మీ ఇష్టం.

 

అగస్త్యుడు :-  సరే ..  గోసంప్రాక్షణము నందు చెప్పబడియుండు బ్రాహ్మణంబులైన మంత్రములు మనకు ప్రమాణ భూతములు కదా! వాటిని గూర్చి చర్చింతము.

 

నహుషుడు:-  ఆ మంత్రములు ప్రమాణ భూతములని నేనంగీకరించను. 

 

అగస్త్యుడు :-  తప్పు.  మీరన్నట్లు ఒక్క వ్రేటున త్రోసిపుచ్చుట సముచితము గాదు. 

 

నహుష:- అవి భూటకపు మంత్రములు. ముమ్మాటికి ప్రమాణభూతములు కానేరవు.

 అగస్తుడు:-  పూర్వాచార్యుల చేత నభినందితములగు మంత్రములను నిందించుట అజ్ఞానము.

 

 నహుష:-  కుంభ సంభవా! ఎంతమాటంటివి... నేను.... నేను అజ్ఞానినా ! 

 

అగస్త్యుడు:-   అవును వేదమంత్రములను నిందించినవాడు ఎవడైనను అజ్ఞానియే.

 నహుష:-  ఎంత కండకావరము. అమరాధీశుడనైన నన్ను పట్టుకొని అజ్ఞాని నందువా....నీకిదే శాస్తి (ఎగిసితన్నును) 

 

అగస్త్యుడు:-  నీ చూడా... నేటితో నీ పాపము పండినది.. ఫలిత మనుభవింపుము. ఇదేనా శాపము

 కం:  జడియక మధాంధతన్  మము  

          కడు నిర్ధయ కాలదన్ని కారించెదవే

         పడియుండు మింక పుడమిన్ 

         కడుభీకర రూప మొప్పకాకోదరమై

(అని కమండలువులోని నీళ్ళు చెల్లును)

నహుష:- (గడగడ వణుకుచు కాళ్ళపైబడి) ఇంతటి ఘోర శాపమా ! మహాత్మా! (ఇంతలో ఇంద్రున్ని ముందిడుకొని యమ వరుణ అగ్ని మరియు బృహస్పతి ప్రవేశిస్తారు - ఇంద్రుడు వజ్రాయుధాన్ని, యముడు గదను, వరుణుడు, అగ్ని, ఖడ్గాలను ఝుళిపిస్తూ మందుకు పస్తారు.) 

 

ఇంద్ర:-  ఓరీ నహుషా ఈ నాటితో నీపని సరి. చేవుంటే ఆయుధాన్నందుకో.

ఊ... యుద్ధానికి సిద్ధంకా.... గర్జిస్తాడు - నహుషుడు ఒక అడుగు వెనక్కు వేస్తాడు) అగ్ని: నీ ఆగడములకు అంతం పలకడానికే వచ్చాం. గర్వాంధా ! కాచుకో ! (అంటూ వజ్రాయుధం పై కెత్తుతాడు - నహుషుడు ఇంకో అడుగు వెనక్కు వేస్తాడు)

 

వరుణుడు:-  నీ చూడా ! దిక్పాలకులన్న.. అంత చులకనరా నీకు. నీ ఎదుట కూర్చొనుటకు కూడా తగమురా మేము. ఇప్పుడే నీ నాలుక పెరికి ఖడించి కాకులకు గ్రద్దలకు ఆహారముగా వేతును. (నహుషుడు ఇంకో అడుగు వెనుకకు వేయును)

 

యమ:-  నేడు నా గదా ఘాతములకు నీ తల ప్రక్కలు కాగలదు. దుష్టుడా! ధర్మరాజను, సమవర్తిని, కాలుడను నన్ను నిందింతువా! (ఇంకో అడుగు నహుషుడు వెనక్కు వేయును)

  బృహస్పతి:-  ఓరీ కాముకా! దేవ గురువునన్న గౌరవము కూడా లేక నన్నే బెదరింతువా ! ఈ క్షణమే నీ చరిత్రకు భరత వాక్యము పల్కెదము.

కం॥    తరిగెన్ నహుషుని తేజము 

            పరిపరి విధముల మునులను బాధించుటచేన్

           సురలోక పీడ వదలగ

           తరుగుము శీర్షంబు నేడు తడయకు మింద్రా !

 

 అగస్త్యుడు:-  మహర్షి శాంతిండి. ఇంద్రా! దిక్పాలకులారా! ఆగండి. ఇప్పుడీ నహుషుడు విగత తేజుడే కాదు నిర్వీర్యుడు కూడా. చచ్చిన పామును దండించవలసిన పనితేదు. ఇతడు నా శాపమునకు గురియైన అదృష్టహీనుడు. నేటి నుండి కొండచిలువయై భూలోకపుటడవులలో తిరుగాడగలడు. ఇంద్రా నీవు తిరిగి స్వర్గాధిపత్యాన్ని వహింపుము. బుద్ధిమంతుడవై పరిపాలన సాగింపుము. (అందరూ ఆయుధాలను దించుతారు)

 

ఇంద్రుడు :-  (ఆశ్చర్యంతో) మహాత్మా !

(అంటూ చేతులు జోడించి అగస్త్యుని వైపు వెళతాడు)

 బృహస్పతి :-  అగస్త్యమునీంద్రా ! (అంటూ ఆయనవైపు ఆశ్చర్యంగా చూస్తాడు) (అగస్త్యుడు బృహస్పతి వైపు చూచి చిరునవ్వుతో పలకరిస్తాడు. ఇంద్రుని తన రెండు చేతులతో దీవిస్తాడు).

నహుషుడు: - (దీనవదనంతో) (అగస్త్యుని వైపు నడుస్తూ) మహాత్మా !

 

సీ:  మనుజుడనగు నన్ను మన్నించి దేవతల్

                      నాకాధిపత్యమే నాకొసంగి

     శక్తిసామర్ధ్యంబు సమకూరవరమిచ్చి

                       అమరలోక సుఖము లందజేసి

     సత్కరించియు నన్ను సంతోషపరచిరి

                   అట్టి వారిని నేను అణచివై

      సురపతీవ్రతలపై చూపుసారించితి

                 పరమ యోగులకునే బాధలిడితి

 

తే:గీ:   మీదు మిక్కిలి మితిమీరి మిమ్ముదిట్టి 

             కన్నుగానని మదమున కాలదన్ని

             పరమ పాపినౌచు కడకు పతనమైతి 

             తాపసోత్తమ కాపాడు తప్పుసైచి. 

 

మహాత్మా మీరు కరుణా సముద్రులు...ఏనాడో దండించవలసిన న్ను యిన్నాళ్లూ భరించారు. నాపై దయ చూపి నాకు శాపవిముక్తుని ప్రసాదించండి. మీ బిడ్డలాంటి వాన్ని.  తనయుడు చేసిన తప్పు మన్నించి నన్ను శాపవిముక్తుని గావించండి......నన్ను క్షమించండి. (కాళ్ళపై బడును)

అగస్త్యుడు :-  (శాంతించి) నహుషాలే.. పశ్చాత్తాపమునకు మించిన ప్రాయ శ్చిత్తము లేదు. కోపమున శపించితినే గాని నీపై మాకు ప్రేమాభిమానములు లేక కాదు. నీయంతటి విద్యావంతుడు ధర్మాధర్మ విచక్షణాపరుడు వేదాంతి మరొకడు కానరాదు. అందుచేతనే నీ తప్పులన్నీ ఇంత వరకు మన్నించితిమి. ఎంత విద్యావంతుడైనా ధర్మాధర్మముల సూక్ష్మము లెరింగిన వాడైనా, వాటిని నిజ జీవితంలో ఆచరించక దారి తప్పిన వానికి పతనము తప్పదు. ఈ సత్యము మరొక మారు నీ జీవితం నిరూపించింది. నహుషా భూలోకమున నీ వంశ మందే యుధిష్టరుడను ధర్మాత్ముడు జన్మించ గలడు. అతడజాత శత్రువని, ధర్మరాజని పేరుగాంచి వెలుగొంద గలడు. అతని దర్శన భాగ్యము చేత నీ

కొండచిలువ రూపము బాసి తిరిగి పుణ్యలోకముల కరుగగలవు.

 నహుష:-  మహాప్రసాదము. (వెనక్కి నడుస్తూ తెరదాటును).

 

 నారద:-  (శచీదేవితో ప్రవేశిస్తూ) నారాయణ...నారాయణ.

 అందరూ :-  నారదమునీంద్రలకు నమో వాకములు. (నమస్కరిస్తారు). 

 నారద:- బృహస్పతీ, అగస్త్యమునీంద్ర... జరిగినదంతయు అవగత మైనది..(సైగచేసి శచీదేవిని ఇంద్రుని వైపు వెళ్ళమనును), ఆమె వెళ్ళి ఇంద్రుని ప్రక్క చేరును. (మునులు, ఇంద్రుని శచీదేవిని ఆసనంపై కూర్చొండ నియోగించి ఆశీర్వ దింతురు. దిక్పాలకులు ఆసనమునకు ఇరువైపుల చేరుదురు)

ఓం శాంతిః శాంతిః శాంతిః

 

తుదిపలుకు

ఇది ఒక పురాణగాధ మాత్రమే కాదు. ఐతిహాసిక మేలుకొలుపు, జాగృతి,

పదవి, విద్య, సంపద, శక్తి పామర్థ్యాలన్నీ ధర్మాచరణకే కాని స్వార్ధమునకు కాదు. ఇది అక్షర సత్యం . ఈ సత్యం గ్రహించిన వాని జన్మ ధన్యం. అన్యుని జీవితం వ్యర్థం.

ఓం తత్ సత్


 


No comments:

Post a Comment

నాకు చదువురాదు, Naaku Chaduvu Raadu

  నాకు   చదువు   రాదు ( ఏకపాత్రభినయము )     (పాత్ర: ఓ 50 సంవత్సరాల  పేద పెద్దమనిషి ) అమ్మా!  శారదా ... ( బోరున   యేడ్చును ).  తల్లీ   యీ   గ...