భువన విజయము
(నాటకము)
భువన విజయము
(నాటకము)
పాత్రలు
1) శ్రీకృష్ణదేవరాయలు 8) పింగళి సూరన
2) మహామంత్రి తిమ్మరుసు 9)
కందుకూరి రుద్రకవి/మాదయగారి మల్లన
3) అల్లసాని పెద్దన 10) అయ్యలరాజు రామభద్రుడు
4) నంది తిమ్మన 11) నరసరాజు
5) భట్టుమూర్తి 12) పేర్రాజు
6) తెనాలి రామకృష్ణుడు 13)
కావలి తిమ్మడు
7) ధూర్జటి 14) నర్తకీమణులు
(2)
భువన విజయము
(భువనవిజయమందిరము
శోభాయమానముగా అలంకరింపబడి,యెవరెవరి ఆసనములు వారికి
ప్రత్యేకముగా నియమింపబడి యుండును. కావలితిమ్మడు వచ్చి పరిశీలించుచుండును. అతడు ధగధగ మెరుస్తున్న శాలువా
కప్పుకొని యుండును. ఆ
శాలువా మాటిమాటికి చూచుకొనుచు మురిసి పోవుచుండును.)
కావలి తిమ్మ:- ఆఁ ... అన్నీ చక్కగా అమరివున్నాయి.
రామకృష్ణ:- (ప్రవేశించును) తిమ్మయ్యా....బాగున్నావా?
కావలి తిమ్మ:- రామకృష్ణకవీశ్వరులకు నమస్సులు! స్వామీ తమరు..... ఇంతముందుగా....
రామకృష్ణ:- నీతో ముచ్చటించాలంటే... కాస్తా ముందు రావలసిందే గదా!
కావలి తిమ్మ:- వాకిటికావలితిమ్మణ్ణి... నాతో మాటలేమిటి స్వాములూ?
రామకృష్ణ:-తిమ్మయ్యా... నీ పచ్చడము చాలా చాలా బాగుందయ్య.
కావలి
తిమ్మ:- ఇదా... ఎందుకు బాగుండదు స్వామి! ఇది
స్వతహాగా ప్రభువులే... ఏంటి వింటున్నారా... మన కృష్ణదేవరాయ ప్రభువులే బహూకరించారు.
రామకృష్ణ:- ప్రభువులు మెచ్చి శాలువా కప్పారంటే... నీవేదో గొప్పపనే చేసుండాలి.
కావలి తిమ్మ:- అవునవును మీ వంటి కవి పుంగవుల సమ్మేళనాలు చూచి చూచి, విని వినీ నేనూ ఒక పద్యం అలా అనేశా. అంతే! ప్రభువులు ఆనందపడి ఈ పచ్చడం నా భుజంపై కప్పేశారు.
రామకృష్ణ:- ఔరా!... పద్యమే... ఏదీ ఒకసారి నాకు వినిపించు.
కావలి తిమ్మ:- స్వామీ నేనేదో అల్పుణ్ణి... నా పద్యం మీకు వినిపించాలంటే...
రామకృష్ణ:- భయమెందుకు... నేను నీ పక్షం వాడినే సుమా...
కావలి తిమ్మ:- అయితే వినండి... ప్రభువుల వారు... ఒకనాటి భువన విజయం
ముగించుకొని
వస్తున్నారు. వాకిలి కడకు
రాగానే ఇక ఉండబట్టలేక ఇలా అందుకున్నాను...
"ప్రభూ!...
కం: శ్రీకృష్ణదేవరాయా
వాకిట
కావలిగ నుండి వైనం బలరన్
మీ కవివర ప్రాభవమును
నా కన్నుల చూడగలిగె నా భాగ్యమనన్||
రామకృష్ణ:- అహా... (చప్పట్లు కొట్టి)... బహుబాగున్నది నీ కందము.
కావలి తిమ్మ:- నిజముగ ఆనాటి ప్రాభవము చూచియే స్వామి నేను అట్లు
స్పందించితిని.
రామకృష్ణ:- బాగు బాగు... ఇంత చక్కటి పద్యము చెప్పిన నీపై కూడా కవులు పద్యమల్ల వలసినదే.
కావలి తిమ్మ:- నాపై పద్యమా?.... పొండి స్వామీ... హాస్యమాడుటకు మీకు నేనే దొరికితినా?... అయినా నాపై పద్యమల్లిన కవులకు నేనేమివ్వగలను.
రామకృష్ణ:- అదుగో పెద్దన్న, తిమ్మన, భట్టుమూర్తికవివర్యులు విచ్చేయు చున్నారు. వారినడిగి ఒక్కొక్క పాదము చెప్పించుకొనుము. నేను కలిసి పద్యము పూరింతును. ఒక్క పాదమునకేమిత్తువు అవసరము లేదు లెమ్ము.
(పెద్దన,
తిమ్మన, భట్టుమూర్తి విచ్చేయుదురు. కావలి తిమ్మన్న నమస్కరించి
వారికి ఆసనములు చూపించును. తిరిగి నమస్కరించి)
కావలి
తిమ్మ:- కవీశ్వరులారా... నాపై ఒక పద్యము చెప్పవలయునని మనవి...
రామకృష్ణ:- ప్రభువే నిను మెచ్చుకొనెను. తగిన వాడవే తిమ్మా... తప్పక చెప్పెదము. తొలుత పెద్దన ప్రారంభించిన బాగుండును.
పెద్దన:- సరిసరి ముచ్చటపడి అడిగితివి. అట్లే కానిమ్ము, వినుము...
వాకిట
కావలి తిమ్మా!
తిమ్మన:- (అందుకొని) ప్రాకటముగ సుకవివరుల పాలిటి సొమ్మా...
భట్టుమూర్తి:- నీకిదె పద్యము కొమ్మా...
రామకృష్ణ:- (వెంటనే) నాకీ పచ్చడము చాలు నయముగ నిమ్మా! (అని పూరించాడు. ఇంకేముంది తిమ్మడు చేసేది లేక తన శాలువా రామకృష్ణునికి కప్పేశాడు. అది గమనించి తిమ్మని సైగచేసి మిగిలిన ముగ్గురు కవులు పిలిచారు. ఏదో చెవిన వూది పంపారు)
కావలి తిమ్మ:- (రామకృష్ణుని వద్దకు వచ్చి) రామకృష్ణకవీంద్ర, రాయలవారు సభకు వచ్చుటకు ఇంకొద్ది సమయమున్నది.
రామకృష్ణ:- అయిన
కావలి తిమ్మ:-ఇదిగో ఈ సమస్యను ఇంతలో పూరించిన....
రామకృష్ణ:- అడుగుమడుగుము.... సందేహపడనవసరము లేదు.
కావలి తిమ్మ:- "కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్" ఇదీ స్వామీ నా సమస్య.
రామకృష్ణ:-
ఇది నీ సమస్యయా లేక... పోనిమ్ము ఎవరిదైన
నేమిలెమ్ము ... నా పూరణ వినుము...
కం: గంజాయి త్రాగి మలినపు
సంజాతుల గూడి కల్లు చవిగొన్నావా
లంజల
కొడకా యెక్కడి
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్.
(ముగ్గురు కవులు దాన్ని విననే వింటారు. వారిలో వారు చర్చించుకుంటూ
తిమ్మన రామకృష్ణుని పద్యాన్ని తాటియాకుపై వ్రాసుకొనుచుండును. ఇంతలో పింగళి సూరన వచ్చి
కూర్చొనును. సూరనను
జూచి పెద్దన)
పెద్దన:-
ఏమయ్యా సూరనకవీ ఇంతగా
చిక్కిపోతివి. తినడం మానేసి సంపాదించినదంతా మూటలు గడుతున్నావా ఏమి?
లాభం లేదయ్యా...
క: కలనాటి ధనములక్కర
గల
నాటికి దాచ కమల గర్భుని వశమా
నెలనడిమి నాటి వెన్నెల
యలవడునే గాదె బోయ నమవస నిశికిన్
రామకృష్ణ:-అహహ...
క: ఎమితిని సెపితివి కపితము
భ్రమపడి వెఱిపుచ్చకాయ వడిదిని సెపితో
యుమెతక్కయదినిసెపితో
యమవసనిశి యన్న మాట యలసనిపెదనా..
సూరన:- రామకృష్ణ కవీ... మీ కెందు కంత దుడుకుదనము, పెద్దన వారు నాతో గదా మాట్లాడుచున్నారు. అమవసనిశియన్న ఒక్క పదమును బట్టుకొని ఇంత తప్పుల తడక పద్యము చెప్పి వెక్కిరింతువా?
రామకృష్ణ:- (బాధపడి) పొరపాటైనది... పిల్లతనము. తొందరపడితిని పెద్దలు క్షమించవలయును.
పెద్దన:-
రామకృష్ణా నీ మాటలు పట్టించుకొందుమటయ్యా ... అయినా చక్కటి
పద్యము ద్రొల్లినది కడకాపదమున ముగించ వలసి వచ్చినది. గమనింపుము. ఆ దుష్ట సమాస పదమే పద్యమునకు
సొంపు గూర్చినది.
(రాజుగారు
వస్తున్నట్లు వంది మాగధుల కైవారములు వినబడతాయి. తిమ్మడు వాకిలి కడ ఈటెతో
నిలబడతాడు)
(నేపథ్యం నుండి)
శ్రీశ్రీశ్రీ
మహారాజాధిరాజ-రాజపరమేశ్వర
మూరు
రాయర గండ-అరిరాయ విభాడ
అష్టదిగ్రాయ
మనో భయంకర-భాషగె తప్పువ రాయరగండ
పూర్వ
దక్షిణ పశ్చిమ సకల సముద్రాధీశ్వర
యవన
రాజ్య స్థాపనా చార్య గజపతి విభాడ
శ్రీ
వీరప్రతాప-సాహితీ సమరాంగణ సార్వభౌమ
వీరావతార-శ్రీకృష్ణరాయక్షితీంద్రా
జయీభవ-విజయీభవ-దిగ్విజయీభవ......
(కృష్ణరాయలు, తిమ్మరుసు మిగిలిన కవులు ప్రవేశిస్తారు. ఎదురుగానున్న శారదా దేవి పటాన్ని తెరతొలగించి నమస్కరిస్తూ బృందగానం చేస్తారు.
శ్లో: యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా
యా వీణావరదండ మండితాకరా యాశ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి భిర్దేవై
స్సదా పూజితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా......
"జై శారదా మాతకు....జై" (పూలుజల్లి అందరూ ఆసీనులగుదురు)
రాయలు:- (లేచి) సభాయైనమః సభాసదులైన సాహితీ ప్రియులకు పండిత కవివరేణ్యులకు మా సాహితీ సుమాంజలులు. పితృ సమానులు గురుతుల్యులు మాహామాత్యులు అయిన మా అప్పాజీ ఆశీస్ప్రభావమునను ఆ తిరుమలేశుని కృపారసదృష్టి మాపై అపారముగా కురియుట వల్లను జ్ఞాతుల కుట్రలను శత్రురాజుల వ్యూహములను త్రిప్పికొట్టి, ప్రాణాంతక గండముల నెన్నింటినో ఇట్టే అధిగమించితిమి. శ్రీ తిరుమల వేంకటేశ్వరుడు మా కులదైవము. ఇలవేల్పు. శ్రీవారికి మణిమయకిరీటములు కనకాభరణములు, గ్రామాదులు, కాన్కలుగ యెన్ని సమర్పించుకొన్నను తనివి తీరుట లేదు. అవెల్ల వారి యనుగ్రహమున సంప్రాప్తమైనవే యగుట వల్ల వారికి సమర్పించితిననుటకు అర్థమే గోచరించదు. కావున ఆ ఆనందనిలయునకు మరొక్కసారి చేతులెత్తి నమస్కరించి కార్యక్రమమును ప్రారంభింతము.
(లేచి
చేతులు జోడించి)
ఉ: శ్రీ
కమనీయ హారమణి జెన్నుగ దానును గౌస్తుభంబునం
దా
కమలావధూటియు నుదారత దోప బరస్పరాత్మలం
దాకలితంబులైన తమయాకృతు లచ్ఛత బైకి దోచి య
స్తోకత నందు దోచెనన శోభిలు వెంకటభర్త గొల్చెదన్.
ప్రభూ...వెంకటేశ...నమోనమః
సీ: నీలమేఘముడాలు డీలు సేయగజాలు
మెఱుగు జామన చాయ మేనితోడ
నరవిందములకచ్చు లడగించు జిగి హెచ్చు
నాయతంబగు కన్నుదోయి తోడ
బులుగు రాయని చట్టు పలపన్నె నొరవెట్టు
హోంబట్టు జిలుగు రెంటెంబుతోడ
నుదయార్క బింబంబు నొఱపు విడంబంబు
దొరలంగనాడు కౌస్తుభము తోడ
తే: దమ్మికేలుండ
బెఱకేల దండయిచ్చు
లేములుడిపెడు లేజూపు లేమతోడ
దొలకుదయ దెల్పు చిరునవ్వు తోడవెలయు
శ్రీనివాసుడు మనలకు శ్రేయమిచ్చు.
(కూర్చొందురు)
తిమ్మరుసు:- (లేచి) నేడు మా కిది ఎంతో ఆనందదాయకమగు సుదినము. రాజ్య పరిపాలనా సంబంధిత వ్యగ్రతలతోను... శత్రు విజయంకర వ్యూహముతోను విసిగి వేసారిన మా మనంబులకుల్లాసము కూర్చుటకు కవిశేఖరులు పద్యోపహరములతో సిద్దముగనున్నారు. రసజ్ఞులైన మా సభాసదులు సైతము ఈ వేడుక వీక్షించుటకు కుతూహలము కన బర్చు చున్నారు. ప్రభూ-కవిప్రసంగములకు ముందు శ్రీ వెంకటేశ్వర సన్నిధి యైన తిరుమల నుండి ఒక నాట్యప్రదర్శనమిచ్చుటకు కళాకారులు విచ్చేసి యున్నారు. వారు తాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనమునకు నాట్యము సంధించి ప్రదర్శింపనున్నారు. ఆ నాట్యమిప్పుడు తిలకింతము.
రాయలు:- అప్పాజీ...మీయభీష్టమే మాయభీష్టము. మంచిది నాట్య మారింభింతురు గాక... (అన్నమయ్య కీర్తనపై నాట్యం జరుగును)
(నాట్యానంతరం కళాకారులందరను రాజు,
మంత్రి సన్మానించి పంపుదురు)
(రాయలు
తిరిగివెళ్ళి సింహాసనంపై కూర్చొనుచుండగా తిమ్మన కవి రహస్యముగా రామకృష్ణకవి తమ్మవమానించిన
పద్యము వ్రాసిన తాటియాకు యేదో చెప్పి యిచ్చును. రాయలు
ఊకొట్టి తాటియాకు తీసుకొనును)
తిమ్మరుసు:- ఇక భువన విజయ కవితా గోష్టిని ప్రారంభింతము - ప్రారంభము పెద్దన కవీంద్రులదే - మనోజ్ఞవాజ్ఞ్మయాభిరతి శిరీషకుసుమ పేశల సూధామ యోక్తులన్ మనుసంభవ ప్రబంధమున్ రచించి పెద్దన పెద్దనే యన కీర్తిగడించిన మహాకవివరా అందుకొనుడు.
పెద్దన:- (లేచి) స్వస్తి.....(చేయెత్తి రాయలవైపు చూపుసారించి)కృష్ణరాయ నృపా....
మ: శరసంధాన బలక్షమాది వివిదైశ్వర్యంబులన్ గల్గి దు-
ర్భరషండత్వ బిళప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్
మానినన్
నరసింహ క్షితి మండలేశ్వరుల నెన్నం వచ్చునీ
సాటిగా
నరసింహ క్షితి మండలేశ్వరుల కృష్ణా రాజకంఠీరవా......
(చప్పట్లు మారుమ్రోగును)
రామకృష్ణ:-పెద్దనామాత్యా
మేలు మేలు.... మీ స్తుతి ప్రశంశాపాత్రము. బాగున్నది. రాయలవారిని అర్జునునితోను, సింహముతోను, భూమితోను పోల్చరాదు. కారణం అర్జునుడు శాపవశమున పేడి. సింహము గుహలో దూరి కూర్చొండును. పృథ్వి చంచలమై గిరగిర
తిరుగుచున్నది. అర్జునుని
రణవిద్య, సింహము యొక్క బలము, భూమి
సహనము రాయలకున్నవి. అయితే
లోపములు మాత్రము లేవు. లోపములు పోగొట్టుకుంటే రాయలతో పోల్చవచ్చునంటున్నారు. బాగుబాగు కానీ....
పెద్దన:-కానీ - ఏమిటి రామకృష్ణ.....
రామకృష్ణ:- గుహలో దూరెడి సింహము రాయల వారికి సరిరాదంటూనే దాని తోక బట్టి బయటకు లాగి తుదకు రాజ కంఠీరవా! అనుట సమంజసమా? అని.
రాయలు:- రామకృష్ణా...అది యొక పెద్ద తప్పటయ్యా... రాజ కంఠీరవా అనుటకు బదులు రాజసంక్రందనా అనిన సరిపోవును కదా!
పెద్దన:-
ప్రభూ మీ సవరణ సర్వజనామోదము - పద్యము మరొక్కసారి చదివెద... (ఆఖరు పదం రాజసంక్రందనా
అని హృద్యముగా చదువును)
(మళ్ళీ
అందరూ చప్పట్లు కొడతారు)
రాయలు:- సరి సరి... కవిత్వ చర్చలోబడి మా స్తుతి పద్యమును మేమే దిద్దుకొంటిమి. ఎంత మైమరపు... అదే కవిత్వమునకున్న గొప్పదనము.
తిమ్మరుసు:-కవివరా నంది తిమ్మనార్యా... ముద్దుముద్దు పల్కుల కూర్పుతో పారిజాతాపహరణ ప్రబంధమును తీర్చిదిద్ది... రాయల సంసార కలహమును బాపి, విబుధజన నుతిగన్న సత్కవీ - తమరు రాయల విజయ గాధను వర్ణించిన బాగుండుననుకొందును.
తిమ్మన:- చక్కని సూచన - మహామంత్రి వర్యా.... వినుడు....
శా: శ్రీరంగేశ్వరునాభి పంకజ రజశ్రీ కంటె, చోళేంద్రక
న్యారాజత్కుచపాళి కుంకుమముకన్నన్, సహ్యభూభృత్తటీ
నీరంధ్రోజ్వలగైరిక ద్రవము కంటెన్, గెంపు గావించె కా
వేరీతోయము కృష్ణరాయడహితోర్వీనాధ రక్తప్రభన.
భట్టుమూర్తి:- బహు బాగున్నది తిమ్మన కవీ... రంగనాధుని బొడ్డుతామర పుప్పొడి కన్నా, చోళస్త్రీజనకుచ కుంకుమపూతకన్నా, సహ్యాద్రి మీది గైరికథాతు ద్రవము కన్నా రాయలఖడ్గధాటికి తెగిన శత్రురాజరక్తముచే కావేరీనదీజలము మిక్కిలి ఎఱ్ఱనైనది - బహు గొప్ప భావన - ఇక పాండురంగ మహాత్మ్య కర్త తెనాలి వారేమందురో విన కుతూహలమగుచున్నది.
రామకృష్ణ:- నాకును రాయలవారిపై ఒక పద్యము చెప్పవలెనని కుతూహలముగా నున్నది. అంతకు ముందొక్క మాట. తిమ్మన కవీంద్రులు కావేరీ జలాన్ని రుధిరాంచితము గావించి భీతి కల్పించినారు. కానీ తుంగభద్ర మాత్రము గుణభద్రయై ఆహ్లాదమును గలిగించుచున్నది. అది ఎట్లంటిరేని
శా: గంగా సంగమ మిచ్చగించునె మదిన్ గావేరి దేవేరిగా
నంగీకారమొనర్చునే యమునతో నానందమున్ బొందునే
రంగత్తుంగ తరంగ హస్తములనా రత్నాకరేంద్రుండునీ
యంగంబంటి సుఖించునేని గుణభద్రా తుంగభద్రానదీ
భట్టుమూర్తి:- భేష్ రామకృష్ణకవీ... గుణభద్రయైన తుంగభద్రను నేరుగా తనలో
కలుపుకోనందుకు
సముద్రుడు మీ పద్యం వింటే చింతించవలసిందే. ఇక రాయలవారిపై పద్యమందు కొనుడు. విన సదస్యులుత్సాహపడుచున్నారు.
రామకృష్ణ:- అట్లయిన ఆలస్యమెందులకు మహాకవీ.... వినుడు.
క: నరసింహ కృష్ణరాయని
కరమరుదగు కీర్తియొప్పె గరిభిత్
గిరిభిత్
కరి, కరిభిత్‍గిరి గిరిభిత్
కరిభిత్ గిరిభిత్‍తురంగ కమనీయంబై.
పెద్దన:-ఔరా రామకృష్ణ కవీ... కరిభిత్, గిరిభిత్‍కరి కరిభిత్‍గిరి గిరిభిత్, కరిభిత్ గిరిభిత్‍తురంగములంటూ పద విన్యాసములతో శబ్దగుంభన మొనర్చి, కృష్ణ రాయల కీర్తి శివునివలె, ఐరావతము వలె, వెండి కొండవలె, వజ్రాయుధము వలె, నందివలె, ఉచ్చైశ్స్రవమువలె తెల్లనై వెలుగుచున్నదని వర్ణించిన మీ పద్యము చిన్న కందమైనను బిగువుగనున్నది.
* రాయలు:- సాహిత్యసభ మా స్తుతితోనే నడచుట ఏమంత బాగుండును? ఇక కావ్యగానము వైపునకు మరలుట సముచితము. కందుకూరి రుద్రకవీ! తమరు జనార్దనాష్టకము వ్రాసి అద్భుతముగ గానము చేయుచున్నారని వింటిని. ఆ జనార్దకాష్టకము మాకునూ వినిపించిన సంతసించెదము.
రుద్రకవి:- అంతకంటెనూ భాగ్యమా ప్రభూ.... చిత్తగింపుడు.
జనార్దనాష్టకము
సిరులు
మించిన పసిమి బంగరు జిలుగు దుప్పటి జారగా
చరణపద్మము
మీద దేహము చంద్రకాంతులు దేరగా
మురుపు
చూపగ వచ్చినావో మోహనాకృతి మీరగా
గరుడవాహన!దనుజమర్దన!కందుకూరి జనార్దనా!
ఆన
పెట్టిన రాకపోతివి ఆయెబో అటుమొన్న నూ
పూని
పిలువగ వినకపోతివి పొంచిపోవుచు మొన్న నూ
నేను
చూడగ గడచిపోతివి నీటు చేసుక నిన్న నూ
కానిలేరా!దనుజమర్దన!కందుకూరి జనార్దనా!
నిన్న
రాతిరి చవికెలోపల నీవు చెలి కూడుంటిరా
ఉన్న
మార్గములన్నియును నే నొకతెచేతను వింటిరా
విన్న
మాత్రము గాదురా నిను వీధిలో కనుగొంటిరా
కన్నులారా
దనుజమర్దన!కందుకూరి జనార్దనా!
దబ్బులన్నియు
తెలిసికొంటిని తప్పుబాసలు సేయకూ
మబ్బుదేరెడి
కన్ను గవతో మాటిమాటికి డాయకూ
ఉబ్బుచేసుక
తత్తరంబున నొడలిపై చేయి వేయకూ
గబ్బితనమున
దనుజమర్దన!కందుకూరి జనార్దనా!
బిత్తరంబున
మొలకకెంపులు పెదవి నెవ్వతె ఉంచెరా
గుత్తమైన
మిటారిగుబ్బల గుమ్మ యెవ్వతె మెచ్చెరా
చిత్తగించక
జీరువారను చెక్కిలెవ్వతె నొక్కెరా
కత్తిగోరుల, దనుజమర్దన!కందుకూరి జనార్దనా!
జంటనేత్రము
లంటి చూచితె జాజిపూవులు పూసెరా
మింటిత్రోవను
జూచుచుండగ మేఘవర్ణము గప్పెరా
కంటిలో
నొక పండువెన్నెల కాయుచున్నది యేమిరా
కంటిలేరా!దనుజమర్దన!కందుకూరి జనార్దనా!
అండబాయక
కూడియుంటిని ఆయె బోయెను నాటికి
ఖండిమండిపడంగనేటికి
కదలు మెప్పటి చోటికి
ఉండరా
నీ మాటలకు నే నోర్వజాలను మాటికి
గండిదొంగవు!దనుజమర్దన!కందుకూరి జనార్దనా!
అలుక
లన్నియు దీర నువు నా అండ కెప్పుడు వస్తివి
పిలిచి
నవరత్నాల సొమ్ములు ప్రేమతో నెపుడిస్తివి!
వలచి
వలపించియును గూరిమి వదల కెప్పుడు మెస్తివి!
కలసి
వేడుక!దనుజమర్దన!కందుకూరి జనార్దనా!
ధూర్జటి:-
రుద్రకవీ బహు రమ్యముగానున్నది మీ జనార్దనాష్టకము. మధుర
భక్తికీ అష్టకము పరాకాష్టయనవచ్చును. మీ పేరున రుద్రుడున్నను
కృష్ణగానము చేసి మురిపించిన మీ జన్మ ధన్యమైనది.*
తిమ్మరుసు:- ధూర్జటి కవీశ్వరా తమరు మాత్రము సామాన్యులా శ్రీకాళ హస్తీశ్వర మహత్మ్యము, శతకము నిర్మించి జన్మధన్యమొనర్చుకొంటిరి. అందలి ఒకటి రెండు పద్యముల చదివి మమ్ములను సైతము ధన్యులను జేయుడు.
ధూర్జటి:- మహాప్రసాదము – మహామంత్రీ! యీ కారణముననైన ఆ మహాదేవుని
జింతించుట నా అదృష్టమనుకొందును – వినుడు
మ: తన యిల్లాలఖిలైక మాత తన సంతానంబు భూతవ్రజం
బనులాపంబులు వేదముల్ తన విహారాగారముల్ మౌని హృ
ద్వనజంబుల్ తన సేవకుల్ కమలజాత శ్రీధరుల్‍గా
జెలం
గిన దేవోత్తము నమ్మహాత్ముదరమే కీర్తింపగా
నేరికిన్
శా: దేవాఁనిన్ను నుతింపలేనధమబుద్ధిన్
వేదశాస్త్రంబులున్
రావేపాటియు వచ్చినన్ శ్రుతులు శాస్త్రంబుల్
మిమున్ చెప్పగా
లేవాద్యంతము లన్న దుద్విదులకున్
లెక్కింపగా శక్యమే
సేవాధర్మము మేలుగాకనుచు మీ పాదంబులన్
గొల్చితిన్.
తిమ్మరుసు:- బాగుబాగు... మహాకవీ ఏదీ మీ శ్రీకాళహస్తీశ్వర శతకము నుండి కూడా ఒక్క పద్యము వినిపించి మా వీనుల విందుగావింపుడు
ధూర్జటి:- అటులనే మహామంత్రి....
శా: రోసీరోయదు కామినీ జనుల
తారుణ్యోరుసౌఖ్యంబులన్
బాసీపాయదు పుత్రమిత్ర జనసంపద్భ్రాంతి వాంఛాలతల్
కోసీ
కోయదు నామనంబకట నీకు బ్రీతిగా సత్క్రియల్
చేసీ చేయదు దీని త్రుళ్ళణపవే
శ్రీకాళహస్తీశ్వరా....
రాయలు:-
అహా ఎంత సూటిగా స్వచ్ఛముగా తేనియద్రాగి నటుల సాగినవి మీ పద్యములు.
చం: స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల
కేలగల్గెనో యతులిత మాధురీ మహిమ...
(రామకృష్ణుడు
వెంటనే అందుకొని)
రామకృష్ణ:- హా తెలిసెన్ జగదేకమోహనో
ద్ధత సుకుమార వారవనితా జనతాఘనతాపహారిసం
తత మధురాధరోదిత సుధారస ధారలు గ్రోలుటంజుమీ....
రాయలు:- రామకృష్ణ! ఏమంటివి ఏమంటివి....
రామకృష్ణ: -ఇది ధూర్జటి కవీశ్వరులొప్పుకొన రనియా మీ సందేహము ప్రభూ...
ధూర్జటి:- అదంతయూ గడచిపోయిన ముచ్చట - అంతా శివునాజ్ఞ. మా వీరశైవాచారమున ఆ వారవనితలందు సైతము మా భక్తులుందురు. వారి సేవలు మేము గైకొనుటను చాలా మంది తప్పుగా అర్థము చేసుకొందురు. అందులకు మేము బాధ్యులము కాము. అదియటులుండనిండు. ఈ రామకృష్ణుని దుండగములు మాత్రము ఎవ్వరెరుగరని తలచు కాబోలు – “రవి గాననిచో కవిగాంచునే గదా!”
రాయలు:-ఏమంటిరి
"రవిగాననిచో కవి గాంచునే గదా" యనియా.
ధూర్జటి:-
అవును ప్రభూ! ఈ వాక్యమును సమస్యగా యివ్వుడు. భట్టుమూర్తి గారు పూరించెదరు.
రామకృష్ణుని చరిత్ర బయల్పడగలదు.
రాయలు:- అటులనా! భట్టుమూర్తి కవీంద్ర మీకంతయు నెఱుక పడినట్లున్నది. "రవిగాననిచో కవిగాంచునే గదా" ఇదీ సమస్య పూరింపుము.
భట్టుమూర్తి:-పూరించెదను ప్రభూ. ఇది నేను పూరించుటయే సబబు. ఆలకింపుడు
ఉ:
ఆ రవి వీరభద్రు చరణాహుతి డుల్లిన బోసి నోటికిన్
నేరడు
రామలింగకవి నేరిచెబో మన ముక్కు తిమ్మరాట్
క్రూర
పదాహతిం దెగిన కొక్కిరిపంటికి దుప్పి కొమ్ముపల్
గా
రచియించినాడు రవిగాననిచో కవిగాంచునే కదా!
ప్రభూ! దక్షయజ్ఞంలో వీరభద్రుని దెబ్బకు సూర్యుని పండ్లూడినవి. పాపమా సూర్యునికి కృత్రిమ పన్నమర్చుకోవడం తెలియదు. మన రామకృష్ణ కవికి మాత్రం అది బాగా తెలుసు. తిమ్మన యింటికేగి ఆయన ఊయల మంచమున కూర్చొనియుండుట గమనించి తాతా ఊతునాయనియె. ఆయన సరి కానిమ్మనె. మన రామకృష్ణుడు తుంటరియై ఆయనపై ఎంగిలి వుమిశెనట. వెంటనే తిమ్మనకవి తన కాలిపాదుక విసిరి వేసినాడు. రామకృష్ణుని ముందరి పన్ను విరిగినది. దీనిపై యే విచారణ అవసరం లేదు ప్రభూ! రామకృష్ణుని ముందరి పన్ను దుప్పికొమ్ముదై యుండుటే సాక్ష్యము.(అందరూ నవ్వుదురు).
రాయలు:-
రామకృష్ణుని తుంటరితనము రోజు రోజుకు మితిమీరి
పోవు చున్నది. సభారంభముననే
నాకు మరొక అభియోగమందినది (రాయలు తాటాకును దీసి) ఇదిగో రామకృష్ణా ఇది చూడుము. ఏమి మీ సమాధానము?
తెలుపుము.
రామకృష్ణ:-ప్రభూ ఇది కేవలం నాపై వేసిన నింద మాత్రమే. కావలితిమ్మయ్యా, నేను పరాచకములాడుకొంటిమి అంతే...
రాయలు:- అటులనా అట్లయిన ఈ సమస్య నేనే అడుగుతున్నాను. “కుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చెన్” - ఊ పూరింపుము.
రామకృష్ణ:-చిత్తము ప్రభూ....
కం: రంజనచెడి పాండవు లరి
భంజనులై
విరటు గొల్వ పాల్పడిరకటా
సంజయ
విధినే మందుము
కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్.
(కరతాళ ధ్వనులు మారు మ్రోగుతాయి)
ఓ
సంజయుడా అరివీరభయంకరులైన పాండవులు ఏనుగుల గుంపుతో సమానము. కానీ విధి వక్రించి దోమకుత్తుక
వంటి విరటుని కొల్వులో అణగి మణగి వుండవలసి వచ్చింది ఇంతియే ప్రభూ నా పూరణ.
రాయలు:-
రామకృష్ణ నీవు బహు చతురుడవు. ఏది ఏమైనా పెద్దలయెడ అమర్యాద కూడదు. జాగరూకుడవై మెలగుము.
రామకృష్ణ:- చిత్తము ప్రభూ
తిమ్మరుసు:- భట్టుమూర్తి కవీ మీ వసుచరిత్ర అటు పురాణ కథను ఇటు కల్పనలను సంతరించుకొని శ్లేషార్థ ప్రదీపితమై వెలయునని వింటిమి. అందుకొంత చదియు చూచితిమి. ఏది మీ వసుచరిత్రలోని ఒక వర్ణన వినిపింపుము.
భట్టుమూర్తి:- అట్లే అమాత్యవర్యా..... అవధరింపుడు.
సీ: లలనా జనాపాంగ వలనా వసదనంగ
తులనాభికా భంగ దోఃప్రసంగ
మలసానిల విలోలదళసాన వరసాల
ఫల సాదర శుకాల వన విశాల
మలినీ గరుదనీకమలినీకృత ధునీక
మలినీ సుఖిత కోకకుల
వధూక
మతికాంత సలతాంత లతికాంతర నితాంత
రతికాంత రణతాంత సుతను కాంత
తే:
మకృత కామోద కురవ కా వికల వకుల
ముకుల సకల వనాంత ప్రమోద చలిత
కలిత కలకంఠ కుల కంఠ కాకలీవి
భాసురము వొల్చు మధుమాసవాసరంబు.
మరొక
పద్యము ప్రభూ!
మ: అరిగా బంచమ మేవగించి నవలా లవ్వేళ
హిందోళవై
ఖరి
బూనం బికజాత మాత్మరవభంగ వ్యాకులంబై వనీ
ధర
నాలంబిత పల్లవ వ్రతవిధుల్ దాల్పం దదీయ ధ్వనిన్
సరిగా
గైకొనియెన్ వసంతము మహా సంపూర్ణ భావోన్నతిన్.
రాయలు:- అహా... భట్టుమూర్తికవీ ఈ వసంత వర్ణనము మీ సంగీత సాహిత్య కళా గరిష్టతను చాటుచున్నది. సంతోషము. పింగళి సూరనార్యా - కళా పూర్ణోదయ కృతికర్తా! ప్రభావతీ ప్రద్యుమ్న ప్రబంధ నిర్మాణ సుధీ - ఇప్పుడిన్ని రమ్య కవితాసుమపరీమళముల నాఘ్రాణించితిమి - మీ ఉద్దేశ్యమున కవిత్వ కల్పనమెటులుండవలెనో వివరింపుడు.
పింగళి సూరన:- అవశ్యము ప్రభూ....
సీ: శబ్దసంస్కారమెచ్చటను జారగనీక
పదమైత్రి యర్థ సంపదల బొదల
దలపెల్ల నక్లిష్టతను బ్రదీపితముగా
బునరుక్తి దోషంబు పొంతబోక
యాకాంక్షితస్ఫూర్తి యాచరించుచును శా
ఖాచంక్రమక్రియ గడవజనక
ప్రకృతార్థ భావంబు పాదుకోనదుకుచు
నుపపత్తి యెందు నత్యూర్జితముగ
తే: నొకట
బూర్వోత్తర విరోధ మొదవకుండ
దత్తదవయవ వాక్య తాత్పర్య భేద
ములు
మహావాక్యతాత్పర్యమునకు నొనర
బలుక
నేర్చుట బహుతపః ఫలము గాదె.
రాయలు:- బాగుబాగు... మీ కవిత్వ నిబంధనలు కవిజన శిరోధార్యములు.
మీ రచనలను నేనునూ పరిశీలించితిని.
అవన్నియు మీ నిబంధనల కనుకూలములై యుండుటయు గమనించితిని. అయ్యా! అయ్యలరాజు
రామ భద్రకవీ... దాశరథీద్ద కథా సుధా చమత్కృతీ! మీ రామాభ్యుదయ ప్రబంధము నుండి ఒక్క పద్యము నందించి మమ్మానందింపజేయుము.
రామభద్రుడు:-ప్రభూ... రావణుడు సీతయందనురక్తి మిక్కుటమై మన్మథాయుధపీడుతుడై రాత్రి కడజాము కడ సీతను జేర శింశుపావన మేగి సీతను గాంచి యిట్లనుచున్నాడు. వినుడు...
చం: వెడవిలుకాడు నెమ్మనము వేమరు
గేదగిరేకు వంకిణిన్
బొడవగ మేను పానుపున బొందక నిన్నభయ
ప్రధాన మే
నడిగెద నంచురా గఠినమై యిటు వెన్నెల
వేడి వెన్కొనన్
గొడుగుల నీడ వచ్చితి జకోర విలోచన
యేమి చెప్పుదున్
(కరతాళ ధ్వనులు)
రాయలు:-భళిభళి
రామభద్రకవీ - ప్రతి నాయకుడైన నేమి. రావణు
మన్మథ బాధను చక్కగా పోషించితిరి. అయినను రామభద్రా మన్మధునకు ఈ మొగలి రేకు బాకును ఎక్కడ నుండి
తెచ్చియిచ్చిరో గాని చాలా చక్కని రసపోషణ.
అయిననూ మేము రామాయణ కర్త నుండి శ్రీహరి వర్ణనమాశించితిమి
గానీ.....
రామభద్ర:-గానీ... యన నేల ప్రభూ శ్రీహరి స్తవమును తమరు తప్పక వినవచ్చును. ఆలకింపుడు.
సీ: తొవ తమ్మి విందు గన్దోయి మించిన
వాడు
జాళువా మిసిమి పచ్చడము వాడు
కన్ను వీనుల సెజ్జనున్న వన్నియవాడు
తపసిడెందపుటిండ్ల దనరు వాడు
కలిమి చేడియ బంట వలతి నేలినవాడు
పుడమి వేల్పులకు జేపడనివాడు
తొంటి జేజేమూక దూపింపగలవాడు
ముజ్జగంబుల
చూలు బొడ్డువాడు
తే: సొగసి నవ్వక నవ్వు నెమ్మొగము వాడు
కలుము లీసెడు తళుకు గ్రేగంటి వాడు
పేదసాదల బ్రతికించు పెంపువాడు
పాల మున్నిటిలోన జూపట్టెనపుడు
రాయులు:-అద్భుతము
మహాద్భుతము అచ్చతెనుగున మీ హరి వర్ణనము.
కావలి తిమ్మడు:- (ప్రవేశించి) ప్రభూ... ఎవరో పరదేశీ కవులు, కొండవీటి వారట. భువనవిజయ సభామండప ప్రవేశము కోరుచున్నారు. వారునూ సభలో పాల్గొన గోరుచున్నారు.
రాయులు:- (తిమ్మరుసు వైపు జూచును) అవశ్యము వారికి సభాప్రవేశము కల్పింతము.
కావలితిమ్మ:- చిత్తము. (బయటికి వెళ్ళి ఇద్దరు కవులను తోడుకొని వచ్చును). (కవులు సభలోనికి వచ్చి రాజును "స్వస్తి" యని ఆశీర్వదించి మిగిలిన కవులకు నమస్కరించి తిమ్మరుసు చూపిన ఆసనములపై కూర్చొందురు).
ఒకటవకవి:- (లేచి) నాపేరు నరసరాజు. ఉద్ధండ పండితుడను. నే చదవని తెనుగు కావ్యము లేదనుట అతిశయోక్తి కానేరదు. ఎంత జటిలమైన పద్యమున కైనను యిట్టే అర్థము చెప్పగలవాడను. అంతియె కాదు మహామహా పండితులు సైతం అర్థము చెప్పలేని పద్యములను సవాలుకు విసరగలను. ఇదుగో ఈతడు నా మిత్రుడు పేర్రాజు (౨వ కవి లేచి సభకు నమస్కరించును). ఈతడు గొప్ప వ్రాయసకాడు,చదువరి. ఎంత వేగముగా పద్యము చదివినను గంట మాప కుండగ వ్రాసి యివ్వగల చతురుడు. మా విద్యల పరీక్షించి మహా ప్రభువులు మమ్ము సముచిత రీతిని గౌరవింతురని మా విన్నపము.
తిమ్మరుసు:-
(లేచి) శ్రీ నరసరాజుకవిపుంగవా!
మీ విన్నపము
మేమంగీకరించితిమి, కానిండు. ముందుగ మీరు పద్యము వినిపింపుడు. మా కవిశేఖరులు అర్థము చెప్పుదురో లేదో చూతము.
నరసరాజు:-అయిన
వినుడు -
సీ: రాజనందన రాజ రాజాత్మజులు సాటి
తలప నల్లయ వేమన ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజులు సాటి
తలప నల్లయ వేమన ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజులు సాటి
తలప నల్లయ వేమన ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజులు సాటి
తలప నల్లయ వేమన ధరణి పతికి
తే: భావ భవ భోగ సత్కాళా భావములను
భావ
భవ భోగ సత్కళా భావములను
భావ భవ భోగ సత్కళా భావములను
భావ భవ
భోగ సత్కళా భావములను
రామకృష్ణ:- అయ్యా నరసరాజా... ఇది శ్రీనాధకవీంద్రుని పద్యము. మీది కాదు. పునరుక్తి దోషము లేని రీతి దీని కర్థము మా పండితరాజి చెప్పెదరు. మీరు సరి చూచుకొనవచ్చును. (సభలోని కవులు గ్రంధములు చూచుకొనుచుందురు) ఇంతలో నేను మీకొక పద్యము చెప్పెదను, అర్థము వివరింపుడు. జాగ్రత్తగా వినుడు.
సీ: మేకతోకకు తోక తోక మేకకు మేక
మేక తోకకు తోక తోక మేక
మేకతోకకు తోక తోక మేకకు మేక
మేక తోకకు తోక తోక మేక
మేకతోకకు తోక తోక మేకకు మేక
మేక తోకకు తోక తోక మేక
మేకతోకకు తోక తోక మేకకు మేక
మేక తోకకు తోక తోక మేక
తే: మేక
తొకతోక తొకతోక తోక మేక
మేక తొకతోక తొకతోక తోక మేక
మేక తొకతోక తొకతోక తోక మేక
మేక తొకతోక తొకతోక తోక మేక
రామకృష్ణ:- (నరసరాజు తికమక పడుట జూచి) నరసరాజులుం గారూ బాగా ఆలోచింపుడు. ఇక మీ మిత్రుని ప్రజ్ఞ గనుగొందుము. పేర్రాజుగారూ తాటియాకు గంటము గైకొనుడు.
పేర్రాజు:- నేను సిద్ధముగనున్నాను
రామకృష్ణ:-
అయిన వ్రాయుడు
కం: వక్కలు చేరెడు నేగొని
చొక్కాలో బోసికొంటి చొచ్చో చొచ్చో (వ్రాయ
వీలుకాని ఉచ్చారణ)
యెక్కడి దొంగలు వచ్చిరొ
అక్కరకును లేకపోయె హరిశ్రీ కృష్ణా.
పద్యమైనది, వ్రాసితిరా? (ఉచ్ఛారణ కడనే నిలిచిపోవుటచే తెల్లమొహము వేసెను). లేదుగదా పోనిండు. ఇంకొక పద్యము చెప్పెద అదియైనను
వ్రాసిన చాలును, మీరు గెలిచినట్టే. కానిండు.
కం: తృవ్వట(ఉచ్ఛారణమే కాని వ్రాయవీలుకాదు)
బాబా
తలపై
పువ్వట జాబిల్లి వల్వబూదట చేదే
బువ్వట చూడగను హుళ
క్కవ్వట తలపంగ నట్టి హరునకు జేజే..
వ్రాసితిరా పేర్రాజుగారూ (లేదని తల ఊపి తలదించుకొనెను) (వెంటనే తిమ్మన లేచి)
తిమ్మన:-మహారాజా
నరసరాజకవి గారు చెప్పిన శ్రీనాధ పద్యమున వారి ప్రభువులను స్తుతిస్తూ వారు
చంద్రుడని, ఇంద్రుడని, బుధుడని, శివుడని, బ్రహ్మయని, కుమారస్వామియని,
కుబేరుడని, అజమహారాజని, సనత్కుమారుడని, వశిష్టుడని,
కచుడని, మారుడని, అనిరుద్ధుడని,
నలకూబరుడని, విష్ణువని, రాజుగారి
గుణములను బట్టి పోల్చడమైనది. ప్రతి పదమునకు విరిచి అర్థము
చెప్పవచ్చును. సభాసదులు
విసుగు జెందెదరని భయము. నరసరాజు గారు సంతృప్తి జెందని యెడల ప్రతి పదార్థము జెప్పుటకు నాకభ్యంతరము
లేదు.
నరస:- వలదు మహారాజ మా ఓటమి నంగీకరించితిమి.
రామకృష్ణ:- ఓటమినంత సులువుగా అంగీకరింతురా? వలదు నరసరాజా! ఇదిగో ఈ పద్యమును వివరింపుము చాలును. మీరు గెలిచినట్లే అంగీకరింతుము.
ఉ:
తేజము సాధువృత్తమును దేకువ గల్గిన ధీరుడెప్పుడున్
ఆజకి నిట్లనున్ బరునియాలికినిట్లను
నర్థికిట్లనున్
తేజము సాధువృత్తమును దేకువ లేని బికారి
యెప్పుడున్
ఆజకి
నిట్లనున్ బరుని యాలికినిట్లను నర్థికిట్లనున్
నరసరాజు:- ఆజకినిట్లనున్ బరుని యాలికి నిట్లను నర్థికిట్లనున్ ఇట్లనున్, ఇట్లనున్, ఇట్లనున్ అంటే ఎట్లాగయ్యా? దీనికర్థమేమున్నది. ఇది భావ రహితమైన పద్యము.
రామకృష్ణ:-
చం: తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్
పలుకగరాకు మోరి పలుమారు పిశాచపు
పాడెగట్టనీ
పలికిన నోట దుమ్ముబడ భావ్యమెఱుంగక పెద్దలైన వీ
రలనిరసింతువా ప్రెగడ రాణ్ణరసా విరసా
తుసాబుసా.
నరసరాజా పద్యము నేను చదివెద వినుము. అర్థము దానికై అదే గోచరించును.
ఉ: తేజము సాధువృత్తమును దేకువ గల్గిన
ధీరుడెప్పుడున్
ఆజకి
నిట్లనున్ (మీసము మెలివేయును)
పరుని ఆలికి నిట్లను (చేతులు జోడించి నమస్కరించును)
అర్థికిట్లనున్ (చేయి చాచి దానము చేయునట్లు చూపును)
తేజము
సాధువృత్తమును దేకువ లేని బికారి యెప్పుడున్
ఆజకి నిట్లనున్
(నమస్కరించి వెన్నుజూపును)
పరుని ఆలికిట్లను (కన్నుగీటి రమ్మని సైగ చేయును)
అర్థికిట్లనున్
(లేదు పొమ్మన్నట్లు చేయి ఊపును)
(సభలో కరతాళ ధ్వనులు
మారు మ్రోగును)
నరసరాజు:-
రామకృష్ణకవీ నీవేమన్ననేమి నీ అభినయమును జూచి మేమును బహుదా సంతసించితిమి. మా ఓటమిని సంపూర్ణముగా
అంగీకరించితిమి - ఆ
మేకకు తోక పద్యమునకూ అర్థము వివరించినచో అదియును ఆస్వాదించి మేము
వెళ్ళివత్తుము.
రామకృష్ణ: - ఆ పద్యమునకర్థమా... ఏమున్నది, మేక, దానికి తోక. ఆ తోకనానుకొని మరియొక మేక దానికీ తోక ఇట్లు మేకలు వరుసగా వెళ్ళుచున్నవి. ఇంతే ప్రభూ (అందరూ నవ్వుదురు. ఓడిన వారిద్దరూ లేచి నిలుతురు.)
తిమ్మరుసు:-నరసరాజులుంగారు మీరు అవమానపడి సభ విడిచి వెళ్ళుటకు మాకు సమ్మతం కాదు. సభానంతరము మీరును గౌరవము పొంది అందరితో పాటే వెళ్ళవచ్చును. దయచేసి ఆసీనులుకండు. మా రామకృష్ణుని దుడుకు దనమును మా వలె మీరును మన్నింపుడు. మన ప్రభువులు శ్రీకృష్ణదేవ రాయులు కేవల కవిపోషకులే కాదు. వారు స్వతహాగా మహాకవులు. మదాలసచరిత్ర, జ్ఞానచింతామణి, సకల కథాసారసంగ్రములను వ్రాసిరి. సంస్కృత, కన్నడ, తమిళ, ఉర్దూ భాషలలో మంచి పట్టు సాధించిన కవులు. తెనుగున రుచిర ప్రబంధరాజమగు "ఆముక్త మాల్యద అను విష్ణుచిత్రీయమును శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణునాజ్ఞన్ రచించి వేంకటపతి కంకితమొనర్చిన బుద్ధి శాలురు. ప్రత్యేకించి వారికి తెలుగు భాషయన్న మిక్కిలి మక్కువ. అందుకే వారు
ఆ: తెలుగదేలయన్న దేశంబుదెలు
గేను
తెలుగు వల్లభుండ దెలుగొకండ
యెల్ల నృపులు గొలువ నెఱగనే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
యని
తెలుగు భాషాభిమానమును చాటుకొనిరి.
దక్షిణమున
కన్యాకుమారి మొదలు నుత్తరమున కటకము వరకు గల దేశముల నవలీలగా జయించి రాయచూరు ప్రాంత
దేశము నుండి తురుష్కులను కృష్ణానది యవతలకు తరిమి వైచిన మహా పరాక్రమశాలి. శిల్పులను పోషించి నూతన
దేవాలయముల నిర్మించి, తిరుపతి, సింహాద్రి
వంటి ఘన క్షేత్రములకు మాన్యముల, నాభరణముల నొసంగి, తటాకముల నిర్మించి విజయనగర సామ్రాజ్యమునకు ఒక మహా వైభవమును దెచ్చిరి. వారు, తమ “ఆముక్త
మాల్యద”లో భక్తి వైరాగ్యములను అద్వితీయముగా పోషించిరి. ఆయన కథలో పాండ్యరాజు భోగినీ
సంగతికేగుచు విప్ర సుభాషితము విని వైరాగ్య భావమున మునిగి పలికిన పద్యమొకసారి సభకు
వినిపింప గోరిక.
రాయలు:- అప్పాజీ - మీ కోరిక మా కాజ్ఞయే సుమా! అయిననూ పద్యము వినిపించుటకు ముందు మరొక్క మాట. యింతవరకు నన్ను మా అప్పాజీవారు పొగిడిన పొగడ్తలన్నింటికీ ఆయనే కారకుడు. బాలుడనైన నన్ను మా అన్నగారి దండన నుండి తప్పించి ప్రాణములగాచి తిరుపతి కొండలలో ఆశ్రమముల దాచి విద్యాబుద్ధులు నేర్పి విజయనగర రాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేసి అన్ని విజయములకు తానే కారకుడై, ఆలయ తటాకాది, నిర్మాణములు తానే జేయించి పేరు మాత్రము నాకిప్పించిన మా అప్పాజీకి నేను సర్వదా కృతజ్ఞుడను. మరొక్కమాట. అప్పాజీ రాజకీయ ధురంధరులే కాదు, మంచి పండితులు కూడా. వారు అగస్త్య బాల భారతమునకు మనోహరమను వ్యాఖ్యానము రచించినదిట్ట.
పేర్రాజు:-(లేచి) మహామంత్రీ.....
కం: అయ్యయనిపించు కొంటివి
నెయ్యంబున కృష్ణరాయ నృపుంగవుచే
నయ్యా
నీ సరి యేరీ
తియ్యని విలుకాడవయ్య తిమ్మరుసయ్యా.
(కరతాళ ధ్వనులు)
రాయలు:-
ఈ పద్యము అప్పాజీపై నాకు గల ప్రేమ, గౌరవములకు
సరియగు సూచకము - భళి భళి కవీ - ఇక
నన్నడిగిన పద్యము వినిపింతును. పాండ్యరాజు వైరాగ్య భావమున
ఉ: ఎక్కడి రాజ్యవైభవము లెక్కడి భోగము లేటి సంభ్రమం
బక్కట బుద్బుద ప్రతిమమైన శరీరమునమ్మి మోక్షపుం
జక్కి
గణింపకుంటి యుగసంధుల నిల్చియు గాలు చేతబల్
త్రొక్కులనమ్మను ప్రభృతులున్ దుద రూపరకుండ
నేర్చిరే-
అని వగచెను. ఈ పద్యము నా విష్ణుచిత్తీయమున వాడు కుంటెనే కానీ నిజమునకు అప్పుడప్పుడూ నామనసులో రేగిన వైరాగ్య భావమే యిది - అర్జునుని శ్రీకృష్ణభగవానుడు మేల్కొల్పినట్లు అప్పాజీ నన్ను ఇట్టి వైరాగ్య భావనల నుండి మేల్కొల్పి కార్యోన్ముఖులను చేయుచుండును. వారికి నాపై గల ప్రేమ యట్టిది.
సూరన:-
అహా ప్రభువుల మనస్సున యింతటి లోతు వైరాగ్య భక్తి భావములుండుట ఎంతయు శ్లాఘనీయము.
రాయలు:- రసాస్వాదనమునకు విచ్చేసిన సాహితీ ప్రియులను వైరాగ్యమునకు మరల్చితిని
కాబోలు. సరిసరి ఇక రసవత్తర సాహిత్యమునకు వత్తము. ఏదీ ధూర్జటి కవీంద్రా ఒక సమస్యనిమ్ము మన రామకృష్ణకవి పూరించును. తిరిగి సభలో నవ్వులు పూయించును.
ధూర్జటి:-అటులనే ప్రభూ... రామకృష్ణా వినుము.
"గంగకద్దరి మేలిద్దరి కీడునున్ గలవే ఉద్యద్రాజ బింబాననా!"
రామకృష్ణ:-ధూర్జటి కవీంద్రులు గంగాస్నాభిలాషులైనట్లున్నారు. కానీ నేను ఈ సమస్యతో రసరాజమగు శృంగారమును పలికింతును.
మ: వరబింబాదరమున్ పయోధరములన్
వక్రాలకంబుల్ మనో
హరలోలాక్షులు జూప కవ్వలిమొగంబైనంత నేమాయె నీ
గురు
భాస్వజ్జఘనంబు క్రొమ్ముడియు మాకున్ జాలవే గంగక
ద్దరిమే లిద్దరి కీడునున్ గలవె ఉద్యద్రాజ
బింబాననా -
(కరతాళ ధ్వనులు)
ధూర్జటి:- ప్రభూ ఇది కేవలము పూరణమే కాదు.
రామకృష్ణుని శృంగారానుభవం కూడాను. ప్రేయసి అద్దరిగాక ఇద్దరియే
చూపినట్లుంది, పాపం సర్దుకపోయినట్లున్నారు. (అందరూ నవ్వుదురు)
రాయలు:- బాగున్నది - ఇప్పుడు నేనొక సమస్య నిచ్చెద. దానిని పింగళి సూరన కవీంద్రులు పూరింతురు. "రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టె గుణాభిరాముడై"
సూరన:- రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టుటయా? ఘోరము ప్రభూ. కానిమ్ము. సాధువు చేసి చూపెదను. వినుడు.
ఉ: రావణ కుంభకర్ణులిల రౌద్రము జూపుచు
సాధు సంఘముల్
బావురుమంచు నేడ్వపలు బాధలు పెట్టుచు హింసరేపగన్
బ్రోవగనెంచి దీనులను భూవలయంబున మృత్యువౌచునా
రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టె గుణాభిరాముడై.
(కరతాళ ధ్వనులు)
రాయలు:- రావణ కుంభకర్ణులకు మృత్యువై రాముడు పుట్టెను. భళి భళి... రామభద్రకవీ ఇక మీ వంతు. పూరింపుడు "భార్యలిద్దరు శ్రీరామ భద్రునకును."
రామభద్ర:- రామాయణ కవిని, నన్నుజూచి ఏకపత్నీవ్రతుడైన నా రామునకు ఇద్దరు భార్యలందురా ప్రభూ!
సూరన:- రామభద్రకవీ... ఈ సమస్యను తమరు ద్వితీయ వివాహము చేసుకొని సులభముగా పరిష్కరించవచ్చును - ఆలోచించండి.
రామభద్ర:- ఇప్పటికిప్పుడు నాకు రెండవ పెండ్లియై ఈ రామభద్రునకు ఇద్దరు భార్యలేర్పడుట
సాధ్యమా సూరనకవీ? - అంత శ్రమ యెందుకులెమ్ము సమస్య సాధువొనరించెద - వినుడు.
తే: రామువిజయంబు విని వీడిరజతగిరిని
వడి గగనమున కైలాసవాసులలర
ఇచ్చమెచ్చి నీరాజనం బిడిరి హరుని
భార్యలిద్దరు శ్రీరామ భద్రునకును.
రాయలు:- మేలు మేలు రాముని సతులుగాక శివసతులుగా మార్చి పద్యము హృద్యముగా కూర్చితివి. రామభద్రా అభినందనీయుడవు.
సూరన:- ప్రభూ మీరు మాత్రము సామాన్యులా... మాదొక చిన్న కోరిక. ఒకసమస్య, తమరే పూరించవలె.
రాయలు:- ఏమిటి? నేను పూరణ జేయవలెనా? కానిండు, కవివరాజ్ఞ పాటించవలసిందే. కానిండు సూరనకవీ.
సూరన”- "రమణి రమణిన్ గలసి పుత్ర రత్నముగనె" - ఇదీ సమస్య ప్రభూ.
రాయలు:- స్త్రీ స్త్రీని గలసి బిడ్డలు గనుటయా?... ఇది నేటికి చిత్రమే గావచ్చును భవిష్యత్తున ఇదియూ సాధ్యమేమో, భగవంతున కెరుక. అయిన నేమి నా పూరణ వినుడు.
తే: కుంతి మంత్రము జపియించి కోరినంత
తరణి
కన్పడి యిచ్చెద తనయు నన్న
వలదు
వలదని యన్న వదలక అంబ -
రమణి రమణిన్ గలసి పుత్రరత్నముగనె.
(కరతాళ ధ్వనులు)
సూర్యుని
"అంబరమణి" యని కర్ణుని
జననము దెల్పితిని - లేకున్న నాకీ సమస్య తేటగీతియైనను కష్టమై
యుండెడిది. ఇక భువన
విజయ సభాకార్యక్రమము ముగించు వేళైనది.
మేమీనాడు ఒక మహాకవికి గండపెండేర సత్కారము గావింపనెంచితిమి. మా అష్టదిగ్గజకవులు ఎవరికి
ఎవరునూ దీసిపోరు.
పెద్దన:-(వెంటనే లేచి) అవును ప్రభూ... ప్రాపకము సంపాదించుటలో కూడా కొందరు ఎవరికీ దీసిపోరు. వారిని దృష్టిలో నుంచుకొని ఒకసారి నేనిట్లంటిని.
శా: రంతుల్ మానుము కుక్కుటాధమ దరిద్ర క్షుద్రశూద్రాంగణ
ప్రాంతోలూఖల మూలతండుల కణగ్రాసంబుచే
గ్రొవ్విదు
ర్దాంతాభీల విశేషభీషణ ఫణాంతర్మాంస సంతోషిత
స్వాంతుండైన ఖగేంద్రు కట్టెదుర నీజంజాటముల్
సాగునే.
తిమ్మన:-(వెంటనే లేచి) ప్రభూ అది ఎవరినుద్దేశించి యన్నదో అందరకూ అర్థమయ్యే వుంటుంది. కానిండు శూద్రాంగణ ప్రాంతపు నూకలతో క్రొవ్వెక్కె నందురా?
ఉ: స్థాన విశేష మాత్రమున తామర పాకున నీటిబొట్ట నిన్
బూనిక మౌక్తికంబనుచు బోల్చిన మాత్రన యింత
గర్వమా
మానవతీ శిరోమణుల మాలికలందున గూర్పవత్తువో
కానుక
లియ్యవత్తువొ వికాసము నిత్తువొ విల్వదెత్తువో.
రామభద్రుడు:- (ప్రక్కనున్న సూరనను జూచి చిన్నగా) తన్నంన్నందుకు తిమ్మన తామరపాకున నీటిబొట్టువలె స్థానము సంపాదించుకొనెనని పెద్దనను మంచి దెబ్బే తీశాడు.
రాయలు:- కవి పుంగవులారా! సభాంతరమున సూటిపోటి మాటలెందుకు - ఆశువుగా సంస్కృతాంధ్రముల ధాటిగా కవిత్వమల్లగల మహాకవి గండ పెండేరము గైకొనవచ్చును - (ఎవ్వరూ పలుకరు)
ఉ: ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు బహూకరింపగా
నొద్దికనా కొసంగుడని యొక్కరు గోరగలేరు, లేరొకో?
(అనగానే)
పెద్దన:- (లేచి) పెద్దనబోలు పండితులు పృథ్విని లేరని నీ వెఱుంగవే
పెద్దన కీదలంచినను బేరిమి నాకిడు
కృష్ణరాణ్ణృపా
(అని ముందుకు వచ్చి)
ఉ: పూతఁమెఱుంగులుం
బసరుపూఁపబెడంగులుఁజూపునట్టివా
కైతలు జగ్గునిగ్గు నెనగావలెఁగమ్మనఁ
గమ్మనన్వలెన్
రాతిరియున్ బవల్మఱపురానిహొయల్చెలి
యారజంపు ని
ద్దాతరితీపులంబలెను దారసిలన్వలె
లోఁదలంచినం
డాతొడ నున్నమిన్నలమిటారపు ముద్దులగుమ్మ
కమ్మనౌ
వాతెఱదొండపండువలె వాచవి గావలెఁబంట
నూఁదినన్
జేతులకొద్ది కౌఃగిటను జేర్చినకన్నియ
చిన్నిపాన్నిమే
ల్మూఁతల చన్నుదోయివలె ముచ్చటకావలెఁ
బట్టి చూచినం
బాఁతిగ బైకొన న్వలపుఁ
బైదలికుత్తుకలోనిపల్లటే
కూఁతలనన్వలెన్ సాగసుకోర్కులు గావలె
నాలకించినం
గాతలతమ్మిచూలిదొర కైవసపుంజవరాలి
సిబ్బెపు
న్మేతెలియుబ్బరంపు
జిగినిబ్బరపుబ్బగుగబ్బిగుబ్బపొం
బూఁతలనున్న కాయసరి పోఁడిమికిన్నెర
మెట్టుబంతిసం
గాతపుసన్న తంతి బయకారపు కన్నడ, గౌళ, పంతుకా
సాత తతాన తానలపసం దివుటాడెడు గోటమీటుబల్
మ్రోత లనన్వలెన్ హరువు మొల్లము గావలె
నచ్చ తెన్గు లీ
రీతిగ సంస్కృతంబు పచరించిన పట్టున
భారతీవధూ
టీతపనీయగర్భనికటీభవదానవపర్వ సాహితీ
భౌతిక నాటక ప్రకర భారతభారత సమ్మత ప్రభా
శీతనగాత్మజాగిరిశ శేఖర శీతమయూఖరేఖికా
పాత సుధాప్రపూర బహుభంగ
ఘుమంఘుమఘుంఘుమార్భటీ
జాతకతాళ యుగ్మలయ సంగతి చుంచు
విపంచికామృదం
గాతతతత్తతాధిహిత హాధిత దంధణుధాణుదింధిమి
వ్రాతరయానుగుణ్య పదవార కుహూద్వహ
హారికింకిణీ
నూతన ఘల్ఘలాచరణ నూపురఝాళఝరీకరాబ్జ సం
ఘాతవియద్దునీచకచకద్ద్వికచోత్పలసారసంగ్రహా
యాత కుమారగంధవహహారిసుగంధవిలాసకృత్యమై
చేతము
చల్లఁజేయవలెఁజిల్లునఁజల్లవలెన్మనోహర
ద్యోతక గోస్తనీఫలమధుద్రవ గోఘృత
పాయసప్రసా
రాతిరసప్రసారరుచిరప్రతి గావలె
సారెసారెకున్."
(కరతాళ ధ్వనులతో సభ మారుమ్రోగి పోవును)
పేర్రాజు:- (లేచి) మహా పండితులారా నేనీ బహుపద ఉత్పలమాలను తాళపత్రముల గంటము దింపక వ్రాసి వైచితిని. తిలకింపుడు ప్రభూ (అంటూ తాటియాకులు రాయలకిచ్చును. రాయలు చూచి)
రాయలు:- ఔరా పేర్రాజుగారూ నీవు నిజముగా గొప్ప వ్రాయసకాడవే... సన్మానార్హుడవే సుమా! నేడు గండపెండేరము నందుకొనగల పండితోత్తమ నిర్ణయమైనది. పెద్దన మహాకవిని వసంతోత్సవ ముగింపు సందర్భమున గజారోహణ సత్కారముతోసహా గండపెండేర బహూకరణ చేసిన బాగుండు నని నా మనంబున కనిపించుచున్నది. కనుక ఈ ముచ్చటను మనము మరింత ఘనముగా జరుపుకొందము గాక.
తిమ్మరుసు:- మీ అభీష్టము ప్రకారమే జరిపింతము ప్రభూ
(రాయలు, కవులను,
పేర్రాజు, నరసరాజుతో సహా సత్కరించును.)
"సాహితీ సమరాంగణ సార్వభౌమ కృష్ణరాయ
ప్రభువులకు జై" (యను ధ్వని మిన్ను
ముట్టగా సభనుండి రాయలు, రాయల వెంట మిగిలిన వారూ
నిష్క్రమింతురు. ఒక్క
రామకృష్ణకవి మాత్రము మిగులును)
రామకృష్ణ:- వాకిలివైపు తిరిగి - "వాకిట కావలితిమ్మా - ప్రాకటముగసుకవివరుల పాలిట సొమ్మా... రమ్ము
కావలి తిమ్మ:- (వచ్చి) రామకృష్ణకవీంద్రా తమరింకా బయలుదేరలేదా!
రామకృష్ణ:- బయలుదేరెదము ముందు నీవిటురమ్ము - (అని తిమ్మడు చేరువకాగానే తిమ్మనిపచ్చడము, తన శాలువా తిమ్మనికి కప్పి కౌగలించుకొనును).
(తెరపడును)
సూచన: చాలామందిమిత్రులు కందుకూరురుద్రకవికి బదులు మాదయగారి మల్లనకవిని అష్టదిగ్గజ కవులలో చేర్చియుండిన బాగుండునని సూచించిరి. వారిసూచన అనుసరణీయమే. కానీ నేను శ్రీప్రసాదరాయకులపతి (ప్రస్తుత కుర్తాళం పీఠాధిపతులు శ్రీశ్రీ)శ్రీసిద్దేశ్వరానందభారతి స్వామివారు) కృష్ణదేవరాయలుగా అనేకవేదికలపై వేషధారణచేసి నిర్వహించిన భువనవిజయములలో కందుకూరిరుద్రకవికి స్థానంకల్పించినందుననూ, అందునా కందుకూరివారి జనార్ధనాష్టకము వినసొంపుగా పాడుటకు వీలైయుండుటచేతనూ, నేను కందుకూరిరుద్రకవివైపు మొగ్గుజూపితిని. మాదయగారి మల్లననే చేర్చవలెననువారి సౌకర్యార్థం యీక్రింద తెలిపిన విధముగా నాచే కూర్చబడిన యీ భువనవిజయమున కతుకువేసుకొని (రుద్రకవికి బదులు మల్లనకవిని చేర్చినందున) ప్రదర్శించ వచ్చును.
మాదయగారిమల్లన:
కృష్ణరాయాధిపా! అది మీవంటి పాండిత్యప్రభావిలసితుల నుద్దేశ్యించి పలికిన పలుకులుగావు.
శా: గాఢార్థప్రతిపాదనకమ్రకళాకౌశల్యముల్లేక
వా
చాఢక్కార్భటితోడ, దామ తము "మఝ్ఝా" యంచు గైవారముల్
ప్రౌఢింజేయుచు, బ్రాజ్ఞులన్నగుచు గర్వగ్రంథులై యుండు న
మ్మూఢస్వాంతులు మెచ్చకుండుటయు సమ్మోదంబు
మాబోంట్లకున్.
రాజోత్తమా!
క: చెప్పవలె
కైత రసముల్
చిప్పిల అప్పప్పభళిభళీ యన లేదా
ఎప్పుడు చెప్పకయుండుట
ఒప్పుసుమీ సుకవియెంత ఉచితజ్ఞుడొకో!
రాయలు:
బాగుబాగు, లెస్సబలికితిరి.
తిమ్మరుసు:
మల్లనకవివరా! మీ రాజశేఖరచరిత్రమున కథానయకుడు కాన్కగా వడసిన రాచిలుక మీవలెనే
నిర్దుష్టప్రౌడవిలసిత పాండిత్యాగ్రగణ్యయట గదా!
మల్లన:
తిమ్మరుసయ్యా! ఆశారిక నావంటిదనుట మీవిజ్ఞతయే సుమా! నా రాజశేఖరచరిత్రమొక కల్పితకథ.
అందునే సృష్టించిన చిలుక తనప్రతిభ నెఱుకపరచుటకు సిగ్గుపడుచున్నది.
శా: వాదింతున్
బహువేదశాస్త్రకలనా వైయాత్యసంస్థి న
వ్వేదవ్యాసులతోడనైన మది సంవీక్షించి
యెచ్చోట నే
గాదన్నన్ మరి నిర్వహింప నశక్యంబేరి కస్మద్వచ
శ్శ్రీదాంపత్యము నాక నాకయనుకో
సిగ్గయ్యెడున్ భూవరా!
రామకృష్ణ:
ఆచిలుక పలుకులు మీవేననుటకీ భువనవిజయమునకెట్టి సందియమునూలేదు. అది నిర్వివాదాంశము.
మరొక్కమట. మాధూర్జటి కవీంద్రుడు మీయింట శివారాధనకైవచ్చి విందారగించెనట. అయన
జెప్పెగా వింటిమి, ఆశాకపాకములు, పిండివంటలు, పరమాన్నములు వినినంతనే
నోరూరెనన నమ్ముడు. మాకునూ....
మల్లన: అదెంతభాగ్యము. మీరునూ మాయింట ఆతిథ్యము
గైకొనవచ్చును. ప్రస్తుతమీపద్యమువిని సంతృప్తి నొందక తప్పినదిగాదు. కాళీమాత
ప్రసన్నయై నాకథానాయకుడైన రాజశేఖరునకిచ్చిన మణిప్రభావమున...
మ: కలమాన్నంబు
ఘృతంబు బాయసము శాకవ్రాతముల్ పిండివం
టలుపాల్దేనియ జున్ను వెన్నయిడి యానాలుక్కెరల్
చక్కరల్
ఫలముల్ పానకముల్
రసాయనములంబళ్ళూరుబిండ్లూరుగా.
యలు బజ్జుల్ దదిపిండఖండములు
నందావిర్భవించెన్ దగన్.
రామకృష్ణ: ఆ హహహ... రసవంతమై మనోజ్ఞమై రుచికరమై
కవిత్వమునకు రంగు రుచి వాసనలు సైతము గలవని నిరూపించితిరి. సంతోషము. ఏదీ మీ కావ్యమునందలి
విభావరీతారకల మాముందుంచి ఆనందింపజేయుము.
మల్లన: అవస్యము.. మునికుమారి నపహరించిన, రాక్షసుని దండించి, చెరవిడిపించనెంచి ససైన్యుడై
రాజశేఖరుడు అటవీప్రాంతమున విడిదిచేసియున్నాడు ఆసమయంబున..
తే:గీ: అమ్మహాదైత్యు
గెలుచుట కరుగుదెంచి
వీరుడెవ్వాడొ యని చూచువేడ్క బెక్కు
గన్ను లొక్కట దాల్చెనో గగనలక్ష్మి
యనగ నల్గడ దారకలతిశయిల్లె.
రామకృష్ణ: అద్భుతము.. నక్షత్రములు గగనలక్ష్మికనేక కన్నులై
వీరవరుని జూచుటకు కుతూహలపడుచున్నది . మీ ఊహకు మాజోహార్లు.
ధూర్జటి:
శివభక్తాగ్రణీ! మల్లనమహాకవీ! శంభుడు భక్తజనసులభుడని గదా మీవిశ్వాసము....
మల్లన:
ఔను. అత్యంతసులభుడనియే నాకావ్యమున హేమధన్వభూపతి పుత్రార్థియై ..
తే:గీ: నీళకంఠుని
శిరసుపై నీళ్ళుజల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పారవైచు
గామధేనువు వానింటి గాడిపసర
మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు.
అని తలంచి కృతర్థుడయ్యెను.
తిమ్మన:
బాగున్నది పాండితీప్రకర్షను ప్రక్కనబెట్టి మహదేవుడెంత సులభుడో అంతేసులువగు
తేటగీతనెన్నుకొని సూటిగా శంకరునినైజ మెరింగించితిరి.. భక్తునియింటి ధేనువే సురభియై, పెరటిమల్లెతీగయె కల్పవల్లియైపోవునా? మహాద్భుతము.
మల్లన:
కవివరా! కథాగమనమునకనుగుణముగా అట్లంటినేగాని, శివభక్తునకు కామధేనువు, కల్పవల్లులతో పనియేలేదు. కామదహనుని భక్తులకే కామనలు మనస్సున జనింపవు. అతడు నిత్యసంతృప్తుడు.
దూర్జటి:
మహోదాత్తగుణసంపన్నుడు గనుకనే, మల్లన భక్తహృదయము
నిట్లావిష్కరించినాడు. ఇది నిక్కముగా మల్లనహృదయావిష్కరణమే నని మావిశ్వాసము. *
No comments:
Post a Comment