ద్రువ చరిత్రము
(గేయనాటిక)
ద్రువుడు
రచన
పి. సుబ్బరాయుడు
42/490, ఎన్.జి.ఓ కాలనీ
కడప - 516002
సెల్ - 9966504951
ఇందలి పాత్రలు
ఉత్తానపాదుడు
నారదుడు
శ్రీహరి
ఉత్తముడు (గెస్ట్)
సునీతి
సురుచి
కథకులు
ద్రువ చరిత్రము
(గేయ నాటిక)
కథకులు:-
ప్రార్థన: శ్లో. వందే వందారు మందార
మిందుభూషణనందనం
అమందానంద సందోహ
బంధురం సింధురాననం
శ్లో వందే నిరంతర సమస్త కళా కలాపం
సంపత్కరం భవహరం గిరిజాకుమారం
లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం
లక్ష్మీగణేశ మఖిలాశ్రిత కల్పభూజం.
ప్రార్థనాగీతం:
వందనమునీకిదే - వందనముదేవా
శ్రీరమణి సేవింప - శేషశయనుండవై
పాలసంద్రమునందు - పవళించుదేవా /వందనము/
భక్తులను రక్షింప - దుష్టులను శిక్షింప
దేవకీసుతుడవై - యవతరించిన దేవ
/ వందనము/
పూతనను పరిమార్చి - కాళీయు మర్ధించి
మద్దిమానుల గూల్చి - మహిమజూపిన కృష్ణ / వందనము/
దేవేంద్ర మదమణచ - గోవర్ధనంబెత్తి
గోపకుల గోవులన్ - రక్షచేసిన దేవ / వందనము/
రూపహీనత కుందు - లలన కుబ్జను మెచ్చి
అందగత్తెగమార్చి - ఆదరించినదేవ / వందనము/
చిననాటి స్నేహంబు - విడక కుచేలునికిని
సంపదల సమకూర్చి - సంతశించిన హరీ / వందనము/
కంసరాక్షసుజంపి - శిశుపాలు తలద్రుంచి
ధర్మాత్ములౌ కుంతి - సుతుల గాచిన కృష్ణ
/ వందనము/
రణరంగ మధ్యమున - పార్థసారధి వగుచు
నరువిషాదము బాప - గీతజెప్పిన గురుడ / వందనము/
కథకులు:- (వచనం) అభ్యుదయ పరంపరాభివృద్ధిగా మా చెప్పంబోవు ద్రువ చరిత్ర మహాత్మ్యం బెట్టిదనిన
సత్పురుష సమ్మతము - సర్వమంగళకరము
పాపముల హరియించు - పరమపవిత్రమ్ము
సంధ్యవేళల మరియు - అమవాస్య పున్నమల
భక్తితో కన విన - సర్వ శుభకరము
ఇక కథా గమనం బవధరింపుడు. (కథకులు తప్పుకొందురు)
సునీతి:- (ద్రువునితో ప్రవేశించి)
వరముల పంటవురా - ద్రువా!
నీవునా వరముల - పంటవురా!
ముద్దు మోముపై - ముంగురు లాడ
అరుణ తిలకమది - నుదుటన మెఱయ /వరముల/
మోమునచిరునవ్వు - చెరగక నిలువ
కాటుకకన్నులె - కళ కళ లాడగ
తనివి తీరదుర - తనయా నినుజూడ
మనగ జాలదుర - మనసే నినువీడ /వరముల/
ఉత్తానపాదుడు:- (అంతలో ప్రవేశించి)
వరముల పంటవురా - ద్రువా
నీవునా వరముల - పంటవురా!
మనుస్వాయంభువ - మనుమని వైతివి
స్వాధ్వి సునీతికి - సుతుడవైతివి
ఉత్తానపాదుడ - నగునా వంశో
ద్ధారకుడవుగా - పేరొందితివి
మనసాయెను పుత్ర - నినుకౌగిలింపా
/వరముల/
(కౌగిలించుకొని ఆసనముపై కూర్చొని, కొడుకును తొడపై కూర్చొండబెట్టు కొనును.)
సునీతి:- (కొడుకుదగ్గరికి వెళ్ళి)
ఆ:వె. పాలు పంచదార పళ్ళరసాలతో
పాయసంబు జేతు పాటవమున
తనివితీర యాట తండ్రి తోడన యాడి
రమ్ము నాదు మందిరమ్ము జేర.
(సునీతి వెళ్ళును)
సురుచి:- (ఉత్తముని చేతబట్టుకొని ప్రవేశం)
ముచ్చట లాయనుగా - మీకిట - బహుముచ్చట లాయనుగా
ముచ్చటించగా - వేడె దొరికెన - వీడొకడే కొడుకా?
నాప్రియ సుతుడు - ఉత్తమునిం - అటు వీధుల విడచిరిగా?
ఔరా వీనికి సరిరాడే - నాసుతుడు - అంతతగనివాడే
ఇంత కానితనమా - నా కొడుకుపై - యెంతకుటిలమౌరా! /ముచ్చట/
ఉత్తానపాదుడు:-
కం: చెలియా యేలా వగవగ
కలదే భేదంబు నాకు కన్నసుతులెడన్
వలదనుమానము నీకున్
కలదనురాగము సుతులెడ కాంతా సమమై.
(రాజు మాటలకు మరింత రెచ్చిపోయి చరచరావెళ్ళి ద్రువుని క్రిందకు లాగి, యీడ్చి ఆవలకు త్రోసివేయును. ఉత్తముని రాజుపై కూర్చొండ బెట్టును. ద్రువుడు నాన్నాయని యేడ్చుచూ దగ్గరికి వెళ్ళబోవును. కానీ సురుచి మళ్ళీ లాగివైచి)
కం:
చాలున్ చాలును యేడ్పులు
యేలా తిరుగాడుచుందువిచ్చట నింకన్
బాలుం డుత్తము డీతడు
జాలుం గౌరములంది జగములవెలుగన్.
(గర్వంగా) నాసుతుడే తగును - తనజనకుని ఒడి
చేరి ముద్దాడగ - నాసుతుడే తగునూ
తగడు తగడునా - సవతి కుమారుడు
తగనే తగడా - ద్రువుడేనాటికి /నాసుతుడే /
(అని నిక్కి నీల్గుచూ వెళ్ళును - తర్వాత రాజు దిగులుగా బాలుని దించి మెల్లిగా బయటికి నడచుచుండగా)
నేపథ్యం నుండి- ఆ:వె. చిన్నభార్య పైని చెలిమిచే నీ రాజు
కాదుకూడదనడు కదలకుండు
భార్యలిద్దరైన బాధ లిట్టివిగదా!
పెద్దరాజుకైన పేదకైన.
(రాజు నిష్క్రమించును రాజువెంట ఉత్తముడూవెళ్ళిపోవును)
రెండవ రంగం
(అంతఃపురము - ద్రువుడు యేడుస్తూ వచ్చును)
సునీతి:- (ద్రువునికి యెదురొచ్చి)
ఎవరే మన్నారురా - నాచిట్టితండ్రీ /ఎవరేమన్నారురా!
తోటిబాలురు నిన్ను - తిట్టిర కొట్టిర
చెలికత్తెలేమైన - తూలనాడిర నిన్ను
కన్నులూ వాచె నీ - చెక్కిలి యెఱుపెక్కె
చిన్నబోయినది నీ - ముద్దులమోము /ఎవరేమన్నారురా!
ద్రువ:- పరులేమనలేదులే - ఓ యమ్మా నను /పరులే/
తోటిబాలురు నను - తిట్టలే దోయమ్మా
చెలికత్తె లెపుడునన్ - దండింపలేదమ్మా
పల్లెత్తు మాటనన్ - పరులెవ్వరనరమ్మ
సునీతి:- మరి- ఎవరేమన్నారురా!....
ద్రువుడు:- తండ్రి యంకము జేరి - నేనాడు కొనజూచి
భగ్గుమని మండె మా - పినతల్లి సురుచి
పట్టియీడ్చినదమ్మనన్ _ నేలపై బడవైచి
పొమ్ము - పొమ్మటనుండి - వెళ్ళి పొమ్మనె నమ్మ
తండ్రి యకంమ్మునన్ - నేనుండ తగనే
తమ్ముడుత్తము డొకడె - తగిన వాడే తల్లి
తగని వాడనె జనని - తనయుడను నేగానె
సునీతి:-
ఔరౌర సురుచి - అంతమాటనెనా?
పతిని కొంగునగట్టి - కులుకుటయెగాక
నిరపరాధుని ద్రువుని - నిందించినదిగా
అనుభవించకపోదు - అంతకంతకు నదియు /ఔరౌర/
నాయనా ద్రువా!
నాదుగర్భము నందు - నుదయించి నీవు
పడరానిమాటలూ - పడినావు గదరా
కానిమ్ము కష్టాలు - కలకాలముండవు
మాటపడినావనుచు - మనసులో కుందకూ
తండ్రియంకము నెక్క - తగకపోదువె నీవు
అయిననూ!
ఇహపరములకు తండ్రి - నారాయణుండే
హరిని గూర్చిన తపమె - ఆచరణ యోగ్యము
వెళ్ళు మడవికి వెళ్ళి - ఘనతపముజేయ
ప్రత్యక్షమై హరి -తన ఒడిన నుంచుకొని
నీవు కోరిన వరము - లన్నియున్ నీకిచ్చు. /వరములపంటవురా!/
ద్రువుడు:- శిరమునన్ దల్చితిని - తల్లి నీ ఆజ్ఞా
కదిలెదన్ వనములకు - తపము జేయంగా
హరిని మెప్పించి నే - వరములన్ బొంది
ఘనపదము సాధించి - గౌరవముదెత్తు
దీవించి పంపుమా - తల్లినీ విపుడే (నమస్కరించును)
సునీతి:-
తె:గీ. ధర్మమార్గము విడువని దాననేని
పరమసాధ్వుల విధమున
బ్రతికితేని
దేవదేవుని మరువని దాననేని
శుభమునీకగు జేకూరు సౌఖ్యపదము. (ఆశీర్వదించును.)
మూడవ రంగం
కథకులు:- పట్టుమని లేవుగద - పమ్చవర్షములు
పట్టుబట్టెనునౌర - హరిని మెప్పింప
మంత్రతంత్రము లేమి - ఎరుగడేయితడు
ఏ విధిని హరిగూర్చి - తపముతాజేయునో ..
(ఆకాశము వైపు జూచి)
కరుణామయుండైన - శ్రీహరికి దెలిసి
నారదుని వేగమే - పంపించినాడు
ద్రువుని కనుగొనుటకై - నారదుండడుగో
కదలి వచ్చెనుగనుడు - ఆకాశ వీధీ....
నారదుడు ( ఆకాశవీధిలో)
నారాయణా.. నారాయణా.. శ్రీమన్నారయణా
లీలదెలియ తరమా - ప్రభూ!
నీ - లీలదెలియ తరమా
ఇందునందనక - అన్నిటియందున
వుందువునీవని - యందురదెట్టులో
/లీలదెలియ/
నీ యుదరంబున - భువనభాండములు
కుదురుగ నుండుట - ఎటుల సాధ్యమో /లీలదెలియ/
పాలమున్నీటను - శేషపాన్పునను
పవళించియె నీవు - మమ్మెటు గాతువో /లీలదెలియ/
ఏనిముషంబున - ఎవరికోసమై
కదలివత్తువో - కనికరింతువో
/లీలదెలియ/ (నారదుదు వెళ్ళును)
(నారదుడు ద్రువుడు యెదురెదురుగావత్తురు.)
ద్రువుడు:- దేవమునీంద్రులకు నమోవాకములు.
నారదుడు:- బాలకా నీవిషయ - మంతయూ దెలుసూ
సుకుమరుడవు ఏల - ఆకలికి మాడెదవు
అమ్మనాన్నలవిడచి - అసలుండలేవు
రాజభోగములలో - మునిగితేలిన నీవు
ఐదేండ్ల బాలుడవు - తపము చేయగ లేవు
తపమన్న బొమ్మలతొ - ఆటలాడుటకాదు
భీకరారణ్యమున - భయమేయదా నీకు
మరలి పొమ్ముర బిడ్డ - మంచిదౌ నీకూ
ద్రువుడు:-
మరలిపోవుటకేను - మౌనీంద్రచంద్రమా
వనములకు రాలేదు - వలదన్న కాదన్న
వనమాలి మెప్పించి - వరములన్ బడయక
తిరిగి పోవను నేను - పోనిమ్ము ప్రాణముల్.
నారదుడు:- (తనలో) ఔరా.. యేమి యీ బాలుని దృఢదీక్ష..
మెచ్చితిని బాలకా - నీపట్టుదలకేను
హరిని మెప్పించగా - మంత్ర ముపదేశింతు
భక్తి శ్రద్దలతోడ - తపమాచరింపుము
విష్ణుదేవుడునిన్ను - మెచ్చి వరములనిచ్చు.
(చెవిలో మంత్రము చెప్పి) నారాయణ.. నారాయణ.. (వెళ్ళును)
నాల్గవ రంగం
(ద్రువుడు తపస్సులో కూర్చొని యుండును - కథకులు ప్రవేశింతురు)
కథకులు:- అడుగో ద్రువుడు..
క్రుంకులిడి యమునలో - మధువనముజేరి
ఘోరతపమును జేయ -సమకట్టినాడు
(కథకులు బయటకు వెళ్ళుదురు ద్రువుడు మాత్రము కనిపించుచుండును)
ద్రువుడు:- ( తపస్సులోకూర్చొని) ఓంనమో భగవతే వాసుదేవాయ. ఓంనమో... (మంత్రము జపించుచుండును కథకులు మళ్ళీ వచ్చి)
కథకులు:- అడవిఫలముల - ద్రువుడు ఆ హారముగగొనె
అవియునూ తామాని - ఆకులలుముల దినెను
ఆకులను మానేసి - జలమొకటె సేవించె
జలములన్ విడిచితా - ననిల భక్షకుడయ్యె
అనిలసేవన నిల్పి - నిశ్చలుండై నిలిచె
పెనుగాలివీచెనూ - మెఱుపులే మెఱిసెను
వడగండ్ల వానలే - వేగమై కురిసెను
భుజగముల్ బుసగొట్టె - పులులేమొ గాండ్రించె
ద్రువుడేమొ బెదరడు - తపముతా మానడూ
(ఉరుములూ, మెఱుపులు , బుసలు, గాండ్రింపులు చూపి వినిపి0చేటట్లు చేస్తే బాగుంటుంది)
తపమది భీకర - రూపము దల్చెను
అగ్నికీలలూ - పైపై కెగసెను
లోకములన్నియు - కంపములందెను
వసుమతీతలము - వంగజొచ్చెనూ
( కథకులు నిలదొక్కుకోలేక పడిపోతున్నట్లు నటించాలి)
భయభ్రాంతులై - లోకపాలురూ
శ్రీనారాయణు - కడ.. కేగిరీ...
ఆలస్యంబిక- తగదని విష్ణువు
మధువనంబునకు - తరలివచ్చెనూ..
(శ్రీహరి ప్రత్యక్షంబై శంఖము ద్రువుని చెంపకు తగిలించి దీవించి)
శ్రీహరి:- కం: సంతస మయ్యెను బాలక
శాంతింబొందుము తపమిక చాలుంచాలున్
ఖ్యాతింబొందుము జగముల
కాంతులు గగనంబునింపి కలకాలంబున్
ద్రువుడు:- (తపము చాలించి) దేవాదిదేవా! సర్వజగద్రక్షకా! నమోనమః
(శ్రీహరి చేతులుచాచి దగ్గరకు తీసుకొని తన ఒడిలో కూర్చొండ బెట్టుకొని తలనిమిరి దించి)
శ్రీహరి:- (వచనం) ద్రువా! నీ తపమునకు చాలమెచ్చితిని. నీయెడ ప్రసన్నుడనైతిని. యజ్ఞాధిపతియైన నన్ను సం పూర్ణ వ్రతములతోనూ, మఖములందునూ, అర్చించి, పూజించి, ఇహసౌఖ్యంబు లనుభవించి అంత్యకాలమున నన్నాత్మ దలచుచూ సర్వలోకనమస్కృతంబునూ, మహి పునరావృత్తి రహితంబునూ, సప్తర్షిమందలోన్నతంబునూ, మామకీయ పదంబు బొందగలవు. శుభం.
ద్రువుడు:- ధన్యుడను దేవా! ధన్యుడను. (నమస్కరించును)
(లైట్స్ ఆఫ్ - శ్రీహరి ద్రువుడు నిష్క్రమింతురు)
కథకులు:- (వచ్చి మంగళ గీతం పాడుదురు)
కర్పూర హారతుల మంగళం
జయా జయమంగళం
బృందవనమ్మున - గోపికాజనముతో
రాసక్రీడలు సల్పు - రమణీయ కృష్ణునకు /కర్పూర/
మనసిచ్చి మనుమాడ - రమణి రుక్మిణి కోర
రథమునన్ గొనివచ్చి - పెండ్లియాడిన హరికి /కర్పూర/
వీర శృంగారములలో - మేటిభామిని సత్య
ప్రేమబంధంబున - చిక్కి చిక్కని హరికి /కర్పూర/
భక్తపాలనకళా - సంరంభకుండగుచు
సజ్జనుల హృదయముల - సతత ముండెడి హరికి /కర్పూర/
అసతోమా సద్గమయా
తమసోమా జోతిర్గమయా
మృత్యోర్మా అమృతంగమయా
ఓం శాంతి శాంతి శాంతిః
*
No comments:
Post a Comment