Saturday, 26 December 2020

కవయిత్రి మొల్ల

 

కవయిత్రి మొల్ల
(నాటకం)


 

కవయిత్రి మొల్ల    


    రసజ్ఞమనోజ్ఞరీతుల రామాయణము రచించి ఆంధ్ర సాహిత్య చరిత్రలో అనర్ఘరత్నముగా వెలుగొందినది ఆతుకూరి మొల్లమాంబ. కేవలం 871 గద్యపద్యములతో సంగ్రహరూపమున మహాప్రబంధ లక్షణములగు నగరార్ణవశైల సూర్యోదయ, సూర్యాస్తమ ఋతువర్ణనాదులతో, కందువ మాటలతో సామెత లందముగా గూర్చి రచన జేసి పండిత పామర జనస్తుతి పాత్రమైనది మొల్లమాంబ. ఈ మహారచయిత్రి కాలము జన్మస్టలము వివాదాస్పదములై యుండుట విచారకరము. కొందరు 13వ శతాబ్దమునకు మరికొందరు 16వ శతాబ్దమునకు ఈమెను చేర్చిరి. ఏమైనను రాయల కాలమైన 16 వ శతాబ్దముగా పెక్కురు చారిత్రకులు నమ్ముచున్నారు. జన్మస్థలము గోప వరమే యైనా అది కడప జిల్లా బద్వేలు గోపవరమా గాక నెల్లూరు జిల్లా ఆత్మకూరి గోపవరమా తేల్చుట కష్టతరమే. ఏమైన నేమి ఇంతటి ప్రతిభావంతురాలైన కవయిత్రిది మా ప్రాంతమేయని చెప్పుకొనుటకుత్సాహ పడుట, ఆధారములకై అన్వేషణ జరుపుట శిలా కాంస్యవిగ్రహముల నెలకొల్పుట, ఆమె రామాయణ ప్రశస్తిని కొనియాడుట యెంతేని  అభినందనీయము. 

పాత్రలు :

1. మొల్లమాంబ                       కథానాయిక…..20

2. కేసనశెట్టి                          తండ్రి………..45

3. శ్రీధర                               బ్రాహ్మణుడు…..45

4. చిన్నాదేవి                           రాణి……… ..40

5. శ్రీకృష్ణదేవరాయలు                 మహారాజు……45

6. రామకృష్ణ                          కవి…………35

 


కవయిత్రి మొల్ల


మొదటి రంగం

[కేసనశెట్టి ఇల్లు - కూర్చొనివుంటాడు]

 

కేసనశెట్టి:- శ్లో!! ప్రణమ్యశిరసాదేవం స్వయంభువంపరమేశ్వరం

                               ఏకం సర్వగతందేవం సర్వదేవమయంవిభుమ్!!

 

                            మొల్లమ్మా...రాతల్లీ...రా యిలావచ్చికూర్చో.

మొల్ల:- (వచ్చి) నాన్నగారు..పిలిచారా?

 

కేసన:- రా తల్లీ...ఇలాకూర్చో

 

మొల్ల:- నాన్నగారు.. మీరెందుకోచింతాక్రాంతులైయున్నారు. చాలాబాధ పడుతున్నారు.

 

కేసన:- మొల్లమ్మా... నీకు తెలియనిదేముందమ్మా. కేసన్నంటే యీపరగణాలోనే గొప్ప ధార్మికుడని పేరు, మన కుమ్మరి కులమంతానన్ను కులశ్రేష్ఠునిగా జేసుకొని గౌరవిస్తూవుంది. అంతేగాదు తల్లీ -మనకులంలో యే కలతలుగలిగినా కుటుంబ కలహాలేర్పడిన నావద్దకు తీర్పుకైవచ్చి, నే నిచ్చిన తీర్పును శిరసావహించి శాంతి యుతంగా జీవిస్తున్నారు. అట్టిది నేను  ..నాఒక్కగానొక్క బిడ్డకు నరియైన జీవితాన్నివ్వలేక పోతున్నా నన్నదే నమ్మానాబాధ.

మొల్ల:- చింతిచకండి నాన్నగారు ఇందులో మీ తప్పేమున్నది. అంతా దైవేచ్చ. బావను యుద్ధవీరునిగా తీర్చిదిద్దినారు. యోగ్యుడని నన్నిచ్చి పెండ్లిచేయదలిచారు. నేనును అందు కంగీకరించితిని. కానీ దైవేచ్చ వేరుగానున్నది. అయినా నాన్నగారు, యుద్ధవీరుడు రణరంగమున పోరాడి వీరస్వర్గమలంకరించుట మెచ్చవలసినదే గానీ చింతించ వలసిన విషయము కాదు బావ యుక్తవయస్సుననే తనకర్తవ్యనిర్వహణ మొనర్చి వీరమరణము పొందినాడు. మీరు కాస్తామోచించండి నాన్నగారు.

 

కేసన:- జరగవలసిన దేదో జరిగి పోయినది-ఇక జరగ వలసిన దాన్నిగురించే తల్లీ నాచింత. చాలామంది కులస్తులు వచ్చి కేసనశెట్టీ-నీముద్దుల పట్టిని మాయింటి లక్ష్మీనిచేయరాదా? యని అడుగుతున్నారు-మొల్లమ్మా వారికేమీ చెప్పక ఎన్నాళ్ళిలా ఊరకుండగలను - ఒప్పుకోతల్లీ.. నీవు వివాహమడతానని ఒక్కమాటచెబితే వరుణ్ణి నిర్ణయిస్తాను.

 

మొల్ల:- వద్దునాన్నగారు - నాకీసాంసారిక బంధనములో చిక్కుకపోవడం యిష్టం లేదు.

 

కేసన:- అదేంమాటతల్లీ..అప్పుడు బావను చేసుకుంటానన్నావుకదా!

 

మొల్ల:- నిజమేనాన్నగారు..అదప్పటిమాట...బావ మరణానంతరము నామనసు మారిపోయింది. నేనిక దైవకైంకర్యమునకే నాజీవితమర్పించి, తరించ దలచినాను. నన్నాశీర్వదించండి-

 

శ్రీధరశాస్త్రి:-(వచ్చి)కేసనశెట్టిగారు..కేసనశెట్టిగారు...

 

కేసన:- ఓ...హోహో...శ్రీధరశాస్త్రిగారా..రండి రండి...ఇలాకూర్చొండి. అమ్మా మొల్లా...శాస్త్రిగారికి చల్ల తీసుక రామ్మా...ఎండనబడి వచ్చారు.

 

మొల్ల:- శాస్త్రిగారు..నమస్కారం.

 

శ్రీధర:- శుభమస్తు...బాగున్నావా మొల్లమ్మా..

 

మొల్ల:- అంతా మీ వంటి పెద్దల ఆశీర్వాదం - బాగునాం శాస్త్రిగారు. ఇదిగోయిప్పుడే వస్తా (వెళ్ళును)

 

కేసన:- అ..చెప్పండి శాస్త్రిగారు-అమ్మాయి జాతకం పరిశీలించారా? నేచెప్పిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని గమనించారా?

శ్రీధర:- కేసన గారు..ఇప్పుడు నేను క్రొత్తగా పరిశీలించేదేముంది చెప్పండి. అమ్మాయి పుట్టినరోజున నాచేత జాతకం వ్రాయించి పేరు నిర్ణయించిన రోజునే-నాకంతాతెలుసు శెట్టిగారు.

 

కేసన:- మరినాతో..

 

శ్రీధర:- ఆరోజు పేరు నిర్ణయించు వరకే మనము మాట్లాడు కొంటిమి మిగిలిన విషయములు మీ రడుగలేదు నేచెప్పలేదు.

 

కేసన:- బిడ్డ జన్మనక్షత్రము "పుబ్బ" యని  మొ,ట,టి,టు అక్షరములందేదో ఒక అక్షరంతో పేరు మొదలు కావలెనని యనగానే మొల్లయని నాకు స్ఫురించడము మీరు చాలబాగున్నది, మొల్లయన బొడ్డుమల్లెని, బహుమంచి అర్థమున పేరు కుదిరినదనడము సంతోషమున నేను తిరిగి రావడము జరిగినది.

 

మొల్ల:- (వచ్చి) శాస్త్రిగారు మజ్జిగ తీసుకోండి-ఏదో సుధీర్ఘచర్చలో నున్నట్లున్నారు-నేను వంట పని మొదలెట్టాలి వస్తాను (వెళ్ళెను).

కేసన:- అలాగే తల్లీ.. శాస్త్రిగారు .. ఇకచెప్పండి. అమ్మాయి జాతక మెట్లున్నది. అమ్మాయేమో వివాహమునకు విముఖముగ నున్నది.

శ్రీధర:- అవును..జాతకమూ అదే చెప్పుచున్నది. ఈ జాతకురాలికి వివాహ ప్రయత్నములు విఫలములై - వివాహమే జరుగక పోవుటయు సంభవించ వచ్చును..

 

కేసన:- శాస్త్రిగారు,,

 

శ్రీధర:- కేసనగారూ..తమరు విజ్ఞులు.. అమ్మాయి భవిషత్తును తెలుసుకొని తదనుగుణముగా ముందుకు ధైర్యముగా సాగవలసిన సమయమాసన్న మైనది. కనుక శాస్త్రవిషయము మీకు స్ఫష్టముగా తెలియజేయదలచాను.

 

కేసన:-అట్లయిన నామేనల్లునకు మొల్లనిచ్చి పెళ్ళిప్రయత్నము చేయుట వాని మృత్యుహేతువు కాదుకదా! ఎంత పొరపాటైనది.

 

శ్రీధర:- శెట్టిగారూ..ఎవరి కర్మఫలము వారిది... అతని ఆయు:ప్రమాణమునకు మీ ఆలోచనకు సంబంధములేదు. అట్లాలోచించ దగదు. ఐనా ఇది జ్యోతిష శాస్త్రము. ఇదికొన్నియెడల జరుగకనూ పోవచ్చును. ఈ శాస్త్రమునకు పార్వతీదేవి శాపమున్నదని మీకునూ తెలియునుగదా! ఐననూ మనము కొన్ని నిర్ణయములు, ముందు జాగ్రత్తలు తీసుకొనుట వరకే ఈ శాస్త్రమునుపయోగించుకొనవలెను.

 

కేసన:- సరి అవతలివిషయము సెలవిండు-

 

శ్రీధర:- అయ్యా ఈ జాతకురాలికి మాత్రువియోగము కలదు.అయిన అది జరిగిపోయిన విషయము. మొల్ల తల్లిని కోల్పోయి చాలా యేండ్లే గడచి పోయినది.

 

కేసన:- అవును తల్లి లేని బిడ్డకు తల్లీ తండ్రీ నేనే యై అల్లారు ముద్దుగా పెంచు కొన్నాను. ప్రాణానికి ప్రాణంగా చూసు కొన్నాను. కులస్తులంతా మళ్ళీ పెళ్ళి చేసుకొమ్మని బలవంతం పెట్టినా నాచిన్నారితల్లి కోసం నేనాఆలోచనే మదిలో మెదలనీయలేదు,

 

శ్రీధర:- నేనెరుగనా కేసనగారు-నాకేగాదు ఈ గోపవరం గ్రామానికంతా తెలుసు మీ సఛ్చీలత.  అందుకే మీరంటే మాకింత గౌరవం.

 

కేసన:- ఇక అవతలి విషయానికి రండి.

 

శ్రీధర:- అయ్యా.. ఇక అవతలి విషయాలన్నీ మహాద్భుతాలే - ఈమె ధీర్ఘాయుస్కురాలు. ఈమె కీర్తి ఆచంద్రతారార్కమై నిన్నూ నీ వంశమును ఉజ్వలముగావించును. దైవాంకిత జీవితయై పాండిత్యప్రాభవమున తరతరాలను ప్రభావితము చేయును. ఇట్టి కుమార్తెను గన్న నీ జీవితము ధన్యమై పోగలదు - ఇది శాస్త్రవాక్కు.

 

కేసన:- శాస్త్రిగారు. మీ శాస్త్రవచనములు నామనస్సునకు నిక్కములనియే తోచుచున్నవి-ఇకనేను అమ్మాయి వివాహ విషయమై పట్టుబట్టను బిడ్డ మనసెరిగి ప్రవర్తించెదను.

 

శ్రీధర:- మీరు విజ్ఞులు - మీకు వేరుగా చెప్పదలచినదేమీలేదు. ఇక నాకు సెలవు వెళ్ళివచ్చెద.

 

కేసన:- మంచిది. ఈ తాంబూల దక్షిణలు మాతృప్తికోసం స్వీకరించండి.

 

శ్రీధర:- శుభమస్తు.. ( వెళ్ళును)

 

మొల్ల:- (వచ్చి) నాన్నగారు.. ఇప్పటికైనా అర్థమయినదిగదా!

 

కేసన:- ఏమిటి తల్లీ... ఏ విషయము..నాకర్థంకావడమేమిటి?

 

మొల్ల:- నేనంతావిన్నాను నాన్నాగారు ఇదిగో ఈ తెరచాటున కూర్చొని కూరగాయలు తరుక్కుంటూ అంతా విన్నాను.

 

కేసన:- అమ్మా మొల్లా...

 

మొల్ల:- ఇక ఆలస్యము చేయకండి నాన్నగారు - తమరు గురుజంగ మార్చనా వినోదులు - మనశైవమతమునకు బసివిసాంప్ర దాయము క్రొత్తగాదు.  నన్ను ఆ పరమేశ్వరున కప్పగించండి. నేను దైవకైంకర్యమున మహాపవిత్ర జీవితమును గడుపుచూ మన వంశమునకు మచ్చరాని రీతి మెలిగెద. నన్నా శీర్వదించి  దేవదాసిని చేయ ముహూర్తము నిర్ణయించండి.

 

కేసన:- అమ్మా మొల్లమ్మా.

 

మొల్ల:- ఇది దైవేచ్చ - నాయిచ్ఛ కూడాయిదే.. తండ్రీ ఇక దైవేచ్ఛను నాయిచ్ఛను మీ యిచ్ఛగా మలచుకొని కార్యోన్ముఖులు కండి.

 

కేసన:- ఇకనాకు వేరుగత్యంతర మేమున్నది – అంతాదైవేచ్ఛ.


*****
రెండవ రంగం

(శ్రీధరశాస్త్రి ఇల్లు)


కేసన:- శాస్త్రిగారికి వందనాలు...

 

శ్రీధర:- కేసనసెట్టిగారూ ... మీరా! రండి... అంతాక్షేమమేగదా! ఇలాదయచేశారు.....

 

కేసన:- అమ్మాయి బసివిదీక్ష గైకొన్న దాదిగ మన గోపవర శ్రీకంఠమల్లేశ్వరాలయముననే దైవకైంకర్యమున నిమగ్నమైయున్నది. ఆమెకడ కొంత సేపుండి గృహోమ్మఖుడనై వెళుతూ మీరు జ్ఞాపకము రాగా యిటు వచ్చితిని.

 

శ్రీధర:- సంతోషము. మీరు మీ అమ్మాయిని సంపూర్ణముగా దైవకైంకర్యమున నియోగించి చాలమంచిపని చేసినారు.

 

కేసన:- ఇందు నాప్రమేయమేమున్నది శాస్త్రిగారూ అది మా మొల్లమాంబ నిర్ణయము,  దైవేచ్ఛ.

 

శ్రీధర:- మంచిది అట్లేఅనుకొందము.  కేసనశెట్టిగారూ మీకొక పద్యము వినిపించెద.  దానిపై మీ అభిప్రాయము సెలవిండు.

 

కేసన:- దానికేం భాగ్యం - మహదానందం వినిపించండి. ఐనా మీరు పద్యం చెప్పడం. నేను విశ్లేషించండమా? బాగానే వుంటుంది చెప్పండి.

 

శ్రీధర:- కేసన గారు ఈ పద్యం నేను వ్రాసిన దన లేదు. రచయిత విషయం అటుంచి. అభిప్రాయం మాత్రం చెప్పండి చాలు.

 

కేసన:- అలాగా.. సరే.. కానివ్వండి.

 

శ్రీధర:-

ఉ!!  శ్రీమహిమాభి రాముడు వశిష్ట మహాముని పూజితుండు సు

         త్రామ వధూ కళాభరణ రక్షకు దాశ్రిత పోషకుండు దూ

         ర్వామల సన్నిభాంగుడు మహాగుణశాలి దయాపరుండు

        శ్రీ రాముడు ప్రోచు భక్తతతి రంజిలు నట్లుగ నెల్లకాలమున్.

 

ఇదీ పద్యం. ఇక మీఅభిప్రాయము సెలవియ్యండి.

 

కేసన:- పద్యము హృద్యముగ నున్నది-రచయిత రామాయణ కావ్యా రంభము చేసినట్లున్నది. శ్రీమహిమాభిరాముడు వశిష్టమహాముని పూజితుండని తెలుపడంతో పట్టాభిషిక్తుడై ప్రజల పరిపాలించు రామ ప్రభువును జ్ఞప్తికి దెచ్చినారు. సుత్రామ వధూకళాభరణ రక్షకుడన రావణవధచే దేవేంద్రుని దేవేరి శచీదేవి మంగళసూత్రం నిలిపినాడని తెలిపినట్లయినది. ఆశ్రిత పోషకుండన సుగ్రీవరక్షణమును, దయా పరుండన విభీషణుని బ్రోచిన రీతిని, భక్తతతి రంజిలజేయుటన నాటి హనుమను మొదలు నేటి మనందరిని బ్రోచుచున్నాడని చెప్పుట సమంజసముగనున్నది.

 

శ్రీధర:-  అంతే గాదు కేసనా... ఆదౌ శ్రీ శబ్ద ప్రయోగాత్ వర్ణగణాది శుద్ధేరభ్యుచ్చయః అన్నగీర్వాణవాణీవిశారదుల మాట చొప్పున శ్రీకారంతో పద్యము మొదలు కావడము ఒక విశేషమేకదా!

 

కేసన:- ఔను. ఇదికావ్యారంభమే యైన,  మీమాట మహౌచిత్యము. అది సరే.. మరి వ్రాసినదెవరో యిప్పుడైనా చెప్పవచ్చుగదా శ్రాస్త్రిగారూ...

శ్రీధర:- ఎవరో కాదయ్యా.. ఈపద్యము వ్రాసింది. మన మొల్లమాంబే!

 

కేసన:- ...నాబిడ్డ..నాబిడ్డ మొల్లమ్మా!

 

శ్రీధర:- ఆవును.. నీబిడ్డ మొల్లమ్మే... నిన్ననే నీబిడ్డ నను జూడ వచ్చి తను రామాయణము వ్రాయ సంకల్పించుటయు. సంకల్పంచిన తక్షణమే ఆమె ముఖతః పద్యము వెలుబడుటయు తటస్థించినది.

 

కేసన:-  ఆహా.. దేవా శ్రీకంఠమల్లేశ్వరా.. కృపాసాగరా నీ కారాధ్యం బగు రామము నా బిడ్డ నోట బలికించితివా!  మొల్లమ్మను రామాయణ కావ్యరచయిత్రిని జేయ నెంచితివా? అదృష్ట మన్న నాదిగదా! దేవా నీకు శతకోటి నమస్సులు.

 

శ్రీధర:-  కేసనశెట్టీ.. ఉద్వేగ భరితుడ వైనట్లున్నావు.. శాంతింపుము. నిజమే యేతండ్రి యైనను యిట్లానంద పులకితాంగుడు గాక మానడుగదా! కేసనశెట్టీ  అమ్మాయి దైవాంశసంభూతురాలు మొల్లరామాయణం ప్రఖ్యాతమై తీరుతుంది తప్పదు.  ఇదిచాలా మంచికాలము. సాహితీ సమరాంగ సార్వభౌముడగు శ్రీకృష్ణదేవరాయల సువర్ణయుగము. నాబంధువొకడు రాయలవారి సతీమణి చిన్నాదేవి సదనమున పురోహితుడుగానున్నాడు.   సహృదయుడు నిన్న నా గృహమునకు చుట్టము చూపుగా వచ్చి యుండెను. అతడీ పద్యము విని సంతోషపడి ఎత్తివ్రాసుకొని వెళ్ళినాడు.   చిన్నాదేవికి వినిపిస్తానన్నాడు.  అమె సంగీత నాట్యవిదుషీమణి మీదు మిక్కిలి స్త్రీపక్షపాతి.  అంతేకాదు ఆమెయు శూద్రాంగనేసుమా!  అయినా గతజీవితమును విస్మరించని హితైషి.. ఆమెకు మొల్లమ్మ పద్యము నచ్చితీరుతుందని నా ప్రగాఢ విశ్వాసము.

 

కేసన:- అంతయూ - దైవానుగ్రహము - మీ వంటి పెద్దల ఆశీర్వాదము.  ఇక సెలవు.. వెళ్ళి వత్తును.

 

శ్రీధర:- మంచిది.. సెలవు.

 

3వ రంగం

( కేసన ఇల్లు )

 

కేసన:-  అమ్మా మొల్లా.  రామాయణాన్ని యింత త్వరగా పూర్తిచేయడ మేగాక శ్రీకంఠమల్లేశుని ఆలయమున బహుపర్యాయములు పఠించి జనుల హృదయాంతరంగముల రాముని ప్రతిష్ఠింప జేసినావు.  ప్రజలు ప్రతులు వ్రాయించుకొని కంఠస్థము చేయు చున్నారు.  నీవలన రామకథాగానము జరుగుట,  అది బహుళ వ్యాప్తమగుట.   నాకానంద ముగ నున్నది కానీ..

 

మొల్ల:-  కానీ యేమి నాన్నగారు.  మీ భ్యంతర మేమో తెలియ జేయండి సవరించుకొందును.

 

కేసన:-  అభ్యంతరము గాదుతల్లీ...  కానీ రామాయణము చాల సంక్షిప్తముగ నున్నదిగదా యని.

 

మొల్ల:- నిజమే నాన్నగారు. సంక్షిప్తముగ నుండవలయు ననియే అలా వ్రాసితిని. రామాయణము సామాన్యమా? అనుకుంటున్నజన సామాన్యము, రామాయణము యింత సులభమా! యింత రమ్యమా! అనునట్లుండ వలెనని నా ఆకాంక్ష.

 

          కం!! కందువ మాటలు సామెత

                  లందముగా గూర్చి చెప్పనది తెనుగున కుం

                  బొందై రుచియై వీనుల

                 విందై మఱి కానుపించు విబుధుల మదికిన్.

విబుధులు, పాండితీప్రకాండులు విప్రాగ్రేసరుల కంటే నా రామాయణము సామాన్య కులవృత్తులవారు సేవాకావృత్తిన కాలము గడుపు వారికి వీనుల విందైయుండవలయునని నా తలంపు.  నా రాముడు భక్తపరాధీనుడు. విశేష ప్రజ్ఞాదురంధరులకే లభ్యడనుకొన వీలులేదు.

 

          కం!! నేరిచి పొగిడిన వారిని

                నేరక కొనియాడు వారి నిజకృప మనుపం

                 గారణ మగుటకు భక్తియె

                కారణమగు గాని చదువుకారణ మగునే.

 

కనుక రోజంతా శ్రమకోర్చి రాత్రి విశ్రాంతిగా పురాణ కాలక్షేపము చేయు మనలాంటి కులవృత్తుల వారికి నా రామాయణము సులభగ్రాహ్యమేకాదు ఒకటి రెండు విడితలలోనే సంపూర్ణముగా రామాయణ కావ్యపఠనము పూర్తయి గొప్పసంతృప్తిని మిగుల్చును అందుకే క్లుప్తత సరళత.  అందుకే మహాకవీశ్వరులకు నేనొక విన్నపము జేయుచున్నాను.

 

 

          కం!! చెప్పుమని రామచంద్రుడు

                 సెప్పించిన పలుకు మీద జెప్పెద నే నె

                 ల్లప్పుడు నిహపర సాధన

                 మిప్పుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్.

 

కేసన:-  అమ్మా మనకీ వినయ ముండుట యెంతేని శ్రేయస్కరము.  అయినా నాకొక విషయము స్ఫురించుచున్నది.

 

మొల్ల:- యేమది తండ్రీ.

 

కేసన:-  కావ్యమున నీవు రామావతారకథను వాల్మీకిభగవానునికి నారదమునీంద్రులు తెలిపినట్లుగదా వ్రాసితివి.

 

మొల్ల:- అవును.

 

కేసన:- నారదమునీంద్రులు సంక్షిప్తముగా సులువుగా వాల్మీకుల వారికి కథ చెప్పగా దానిని వాల్మీకి మహర్షి విని విపులీకరించి విశాల రాఘవేంద్ర చరితమును నిర్మించెను.  నీది నారదోక్తి అందుకే యింత సులువు యింత సంక్షేపము.

 

మొల్ల:- చక్కటి సమన్వయము నాన్నగారూ నేనైతే యింతగా, అలోచించనైతిని.  పాఠకులు కవులను మించిన భావుకులనుట అక్షరసత్యము.  అయినను నాన్నగారు, శ్లేషాలంకారప్రియులగు పండితోత్తముల కొరకు ఒకటి రెండు పద్యములు వ్రాసియేయున్నాను - ఇదిగో మచ్చునకొకటి చూడుడు.

 

         సీ!! శారద గాయత్రి శాండిల్య గాలవ

               కపిల కౌశిక కులఖ్యాతి గలిగి

            మదన విష్వక్సేన మాధవ నారద

               శుక వైజయంతికార్జునులు గలిగి.

            చంద్రార్క గుహ గిరిసంభవ జయ వృష

               కుంభ బాణాదుల గొమరు మిగిలి

            సుమన ఐరావత సురభి శక్రామృత

               పారిజాతముల సొంపార గలిగి

 

         తే!! బ్రహ్మనిలయము వైకుంఠ పట్టణమ్ము

             నాగకంకణు శైలమ్ము నాక పురము

             లలితగతి బోలి యేవేళ దులను దూగి

             ఘనతనొప్పారు నప్పురి వనము లెల్ల.

 

ఇది అయోధ్యాపురప్రాంత వనవర్ణనము.  సీసపద్యము లోని ఒక్కో పాదము వరుసగా బ్రహ్మ, విష్ణు, శివ, స్వర్గ లోకములను సూచించును.  కానీ ఆసూచిత పదములు అయోధ్యవనమందలి అవనీజాతములు, మొదటి పాదమున శారద గాయత్రి శాండిల్య గాలవ కపిల కౌశికములున్నవి. ఇవి బ్రహ్మలోక వాసుల పేర్లు. కాని అవి అడవిలోని బ్రాహ్మీ చండ్ర మారేడు లోధ్ర ఇరుగుడు గుగ్గిలపు భూజములు. అట్లేయితర పాదములును కనుక నా రామాయణము అశక్తనై అలతి అలతి పదముల కూర్చుటకాదు.  సర్వజనాభి రామమైయుండుట కొరకే నని విజ్ఞులు గమనించగలరు.

          క!! మును సంస్కృతముల దేటగ

             దెనిగించెడి చోట నేమి తెలియక యుండన్

             దనవిద్య మెఱయ గ్రమ్మఱ

             ఘనమగు సంస్కృతము జెప్పగా రుచియగునే .

 

          ఆ!! తేనెసోక నోరు తియ్యన యగురీతి

             తోడ సర్థమెల్ల దోచకుండ

             గూడ శబ్దములను గూర్చిన కావ్యమ్ము

             మూగ చెవిటి వారి ముచ్చటగును .

               కాదంటారా నాన్నగారూ...

 

కేసన:- నాకున్న సంశయములన్ని నివృత్తము లైనవి తల్లీ .. మహదానందముగ నున్నది.

 

శ్రీధర:- (వస్తూ) ఏదో తండ్రీ కూతుళ్ళు సుదీర్ఘచర్చలో నున్నట్లున్నారు. మేము ప్రవేశింప వచ్చునా..

 

కేసన:- ఆరెరె..శ్రీధర శాస్త్రిగారా..నమస్కారములు.. రండి..రండి ఆసీనులుకండి.

 

మొల్ల:- శాస్త్రిగారా...వందనములు.

 

శ్రీధర:-  యశస్వీభవ.. ఒక శుభవార్తయ్యా కేసనశెట్టిగారు.  మన మొల్లమాంబకు రాణిచిన్నాదేవి నుండి ఆహ్వాన మొచ్చిందయ్యా.  నేనప్పుడు చెబుతూవుంటిని గదా మాబంధువొకడు రాణిగారికి పౌరోహిత్యమునెరపు చున్నాడని, అతడీ వార్త దీసుకొని వచ్చినాడు నన్నువెళ్ళి, ముందీ వార్త మీకు తెలియ జేయమన్నాడు.   రేపు అతడే స్వయంగా మీకీ  విషయ మెరుక పరచి ప్రయాణము యేర్పాట్లు, విడిది, వసతి అంతా తనేచూచికొని, రాణిగారితో అమ్మాయి సాహిత్యచర్చజరిపి, గౌరవ సత్కారాలు పొందిన తర్వాత మళ్ళీ మన గోపవరం చేర్చేవరకు అతడిదే బాధ్యత. మరి మీరు పొద్దుని కల్లా సంసిద్ధంగా వుండండి.

 

మొల్ల:- శాస్త్రిగారూ..  నాన్నగారూ నాకిటువంటి గౌరవాలు చర్చలు అవసరమా.. అందులకు నేను తగుదునా?

 

శ్రీధర:- కాదనకు తల్లీ.. రాణిగారు బహుసౌమ్యులు, వారు నీ రామాయణ కావ్యాన్ని ఆమూలాగ్రం చదివారు, మెచ్చారు. వారికైవారే మీతోముచ్చటించాలని వాంఛిస్తున్నారు. ఇది నీవు కోరుకున్నది కాదు దైవము నీకిచ్చిన మహదవకాశం.   నీ రామాయణ  వ్యాప్తికేర్పడిన సువర్ణ సౌలభ్యం.

 

కేసన:-  వెళదాం తల్లీ.. నీ రామాయణ కథాగానమునకే గదా వెళ్ళుతున్నది.  అభ్యంతర మేమున్నది.

మొల్ల:- సరి... అంతాతమరిష్టం.. వెళదాం..

 

శ్రీధర:- సంతోషం శుభం.

*****
4వ రంగం

( రాణిగారి అంతఃపురం )

 

మొల్ల:-  శాలివాహన కులసంజాత ఆతుకూరివంశోద్భవ గోపవర శ్రీకంఠమల్లేశ్వర కటాక్ష వర కవితా విశారద.  దేవదేవ కింకర, దీక్షాదక్ష కేసనశెట్టి సుత మెల్లాఖ్యనగు నేను సంగీత సాహిత్య కళావైదుష్య, కృష్ణరాయలకళత్ర, రాణిచిన్నాదేవికి-హృదయ పూర్వక శుభాశీస్సుల నందిస్తున్నాను.

 

చిన్నాదేవి:- మొల్లమాంబా శుభాభినందనలు-సుఖాసీనులు కండు... ఇన్నాళ్ళకు మిమ్ముచూడ గల్గితిని.  సంతోషముగ నున్నది.  మీ రామకథను ఒకే రోజున యేక బిగిన చదివితిని.  మారాజ్య జనపదములలో అందునా వనితలలో యింత ప్రతిభ గలిగి యుండుట మాకు గర్వకారణము. విద్య యేఒక్కరి సొత్తూకాదు.  శ్రద్ధాసక్తులు గలిగిన ధీమంతుల నడ్డుకొన నేశక్తియు సమర్ధముగాదు.  అది నీవు మరొక్క సారి నిరూపించితివి.

మొల్ల:- ధన్యురాలను.

 

చిన్నాదేవి:- మొల్లమాంబా...నీవీసాహిత్య విద్యనెట్లభ్యసించితివి.

 

మొల్ల:- దేవీ...మాపూర్వజులందరూ కులవృత్తియే జీవనాధారముగా కుండలు చేసుకొని బ్రతికెడువారు. అయిననూ రామాయణ భారతాది పురాణ పఠనము చేయుచుండెడివారు.  ఇప్పటికినీ మా తాత తండ్రులందు నిష్ణాతులే. వారి వార సత్వమున ప్రాప్తమైన విద్యయేగానీ...

 

       

        సీ!! దేశీయ పదములు దెనుగులు సాంస్కృతుల్

                 సంధులు ప్రాజ్ఞుల శబ్దవితతి

           శయ్యలు రీతులు చాటు ప్రబంధంబు

                 లాయా సమాసంబు లర్థములును

           భావార్థములు కావ్యపరిపాకములు రస

                 భావ చమత్కృతుల్ పలుకు సరళి

           బహువర్ణములును విభక్తులు ధాతు ల

                 లంకృతి ఛందోవిలక్షణములు.

 

         తే!! గావ్యసంపద క్రియలు నిఘంటువులును

             గ్రమము లేవియు నెఱుగ విఖ్యాత గోప

             వరపు శ్రీకంఠమల్లేశు వరము చేత

             నెఱికవిత్వంబు జెప్పగా నేర్చుకొంటి.

 

చిన్నా:- అద్భుతము వాల్మీకి కాళిదాస పోతనా మాత్యుల వలె నీవునూ సహజ వరకవితామతల్లివి.   సంతోషము-మొల్లమాంబా మీ రామాయణ పఠనావసరమున నేగమనించిన కొన్ని విశేషములను మీతో చర్చించ నెంచితిని...

 

మొల్ల:- అవశ్యము-దేవీ...

 

చిన్నా:-

              కం!! జలజాక్ష! భక్తవత్సల!

             జలజాసన వినుత పాద జలజాత! సుధా

             జలరాశి భవ్యమందిర

             జలజాకర చారుహంస! జానకి నాథా.

 

 అంటూ కాండాంత పద్యమును జల జల పారు సెలయేటి తీరున రాముని స్తుతియించి కడకు జానకి నాథాయని జానకిలో కి ని హ్రస్వము చేసినారు..

 

మొల్ల:-  అంతేగాదుదేవీ.... తర్వాతి అయోధ్యాకాండారంభమున కుడా

 

          కం!! కందర్పరూప! ఖండిత

             కందర్పవిరోధి చాప! కరుణాద్వీపా!

             వందితశుభనామా! ముని

             సందోహ స్తుత్యభూమా! జానకిరామా!

 

         యనిపద్యము సంధిస్తూ చివర “జానకిరామా” యని యే యంటిని ఇట్లే కావ్యమంతటనూ ప్రయోగించితిని.  జానకీరామా సంస్కృత సమాసము దానిని నేను తత్సమ సమాసము చేసి జానకి, రామ శబ్దములను తెనుగుగా గ్రహించి జానికిరామా యంటిని.

 

చిన్నా:- చక్కని వివరణ--సరిసరి. మరి మంథరను రామాయణము నుండి తొలగించి వైచితివి గదా!

 

మొల్ల:-  నిజమే..నాకైక దాసి మాటలు విని నిర్ణయము గైకొను నంతటి హీనమతి కాదు - దశరథుని ముద్దులసతి దక్షత గలదనియే నా అభిప్రాయము. ఐనా.. రాముని కారడవికి పంపిన గొప్ప తప్పిదమును, ఒక దాసిదానిపై త్రోసి వేయుట సమంజసము కాదు.

 

చిన్నా:- బాగు బాగు... మరి రావణుడు సీత నపహరించి రథము పై గొంపోవు వేళ.

 

          ఆ.వె!!  అసుర గొంచు బోవ నవనీ తనూభవ

               వెఱచి పలికె దిశలు వినగ నంత

               సీత నాదుపేరు శ్రీరామ భార్యను

               నన్నుగావ రయ్య మిన్న కిపుడు

 

         ఆ.వె!! దేవగణము లార దిక్పాల వరులార

               వృక్షజాతులార పక్షులార

               కుటిల దానవుండు గొంపోవుచున్నాడు

               కరుణ తోడ నన్ను గావరయ్య.

         అని బేలవలె విలపించినట్లు వ్రాసి - అశోకవనమున రావణు నెదిరించి...

మొల్ల:-

               కం!!  పతిదైవముగా నెప్పుడు

             మతి దలచుచు నుండు నట్టి మగువల జెరుపన్

             బ్రతిన గలయట్టి నీతో

             బ్రతి వచనము లాడు కంటె బాపము గలదే

          యని తృణము చేగొని పలుచన జేయుటే గాదు-

 

      శా!! విరాలాపము లాడనేల వినుమీ విశ్వప్రకాశంబుగా

         బారావారము గట్టి రాఘవుడు కోపస్ఫూర్తిదీపింపగా

         ఘోరాజిన్ నిను డాసి లావుకలిమిన్ గోటీరయు క్తమ్ముగా

         గ్రూరాస్త్రంబుల మస్తముల్ దునిమి భుక్తుల్ పెట్టుభూతాళికిన్.

 

      శా!! ఆరూఢ ప్రతి మాన విక్రమ కళాహంకార తేజో నిధి

         శ్రీరామున్ సుగుణాభిరాము బెగడన్ జేకొన్న నిన్నాజిలో

         దారన్ దొంగిలి తంచు నిష్ఠురగతిన్ దండించి ఖండింపము

         న్నీరెట్లైనను దాటి వచ్చు నలుకన్ నేడెల్లి శాంతింపుమా

 

 అని గద్ధించి రావణునంతటి వానిని భీతి గొల్పజేసినది. అదెట్లనిగదా!  మీ సందేహము - అవును తన్నువంచించి బలవంతముగా చెరపట్టి తెచ్చు చున్న నాటి రావణుని చెంత సీత అబలయే.  అందుకే విలపించినది, సహాయ మర్థించినది.  కానీ

 

         తే!! జడలు ధరియించి తపసుల చందమునను

             దమ్ముడును దానుఘోర దుర్గమ్ములందు

             కూరగాయలు గూడుగా గుడుచు నట్టి

             రాముడేరీతి లంకకు రాగలండు

 

         కం!!  దానవు లెప్పుడు చూచిన

             మానవులను గెలువ గలరు మదినూహింపన్

             మానవ భక్షకులైమను

             దానవులను గెలువ నరుల తరమే జగతిన్

 

         కం!! జగతీశుడు మానవు డట

             నగరే భుజశక్తి చేత నాకెదు రన్నన్

             నగధరుడో నగధన్వుడొ

             నగభేదియొ కొంత కొంత నాతో బోరన్

 

 అని రాముని చులకన జేసి మాటాడిన,  సీత సహించి యుండునా? సీతే గాదు పతివ్రత యైన యే భారతనారీ తన పతిని దూలనాడిన సహింప నేరదు. ఇట్లే తిరుగబడగ గలదు.

 

చిన్నా:-  శహబాష్ ... చక్కని పాత్ర పోషణ - అందునా స్త్రీస్వభావ చిత్రీకరణ అత్యద్భుతము - ఇంకొక్కమాట - హనుమ సీతను నమ్మించ నెంచి.  రామలక్ష్మణులను వర్ణిస్తూ..

 

మొల్ల:- ఆ సన్నివేశమాదేవీ వినుము

 

          సీ!! నీలమేఘచ్ఛాయ బోలు దేహము వాడు

                   ధవళాబ్జ పత్ర నేత్రముల వాడు

             కంబు సన్నిభమైన కంఠ౦బు గలవాడు

                   బాగైన యట్టి గుల్భములవాడు

             తిన్ననైకన్పట్టు దీర్ఘబాహుల వాడు

                   ఘనమైన దుంధుభి స్వనము వాడు

             పద్మరేఖలు గల్గు పదయుగంబు గలాడు

                   చక్కని పీన వక్షంబు వాడు

 

         తే!! కపట మెరుగని సత్యవాక్యముల వాడు

             రమణి రాముండు శుభలక్షణముల వాడు

             ఇన్ని గుణముల రూపింప నెసగు వాడు

             వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు

 

చిన్నా:- రఘురాము వర్ణన హృద్యముగ నున్నది. కాని హనుమంతుడేలనో రామానుజుని,  వరుససౌమిత్రి బంగారు వన్నెవాడని  ఒక్కముక్కలో చెప్పివూరకున్నాడు.

 

మొల్ల:- అంతేగదమ్మా...ఎంతబిడ్డతో సమానుడైనా లక్ష్మణుడు పరపురుషుడే గదా!  పరపురుష ప్రశస్తి బుద్డిమంతుడైన హనుమంతుడు సీత ఎదుట యింతకుమించి దెచ్చునాదేవీ. అయినా రాముడంతటి వాడు లక్ష్మణుడనుటతో లక్ష్మణుని ఘనత ఏమాత్రము తగ్గలేదుకదా!  అదీ హనుమ ధీశక్తి.

 

చిన్నా:- కాదుకాదు. మొల్లమాంబ ధీశక్తి.  (టంగ్ టంగ్ మని గంట మ్రోగు తుంది)  ప్రభువుల వారు దండనాయకులతో జరుపుతున్న సమావేశం పూర్తయింది.  ఇక వారు మన కక్ష్యకు అనగా యిక్కడకే రానున్నారు.

 

మొల్ల:- రాయల వారు అంత:పురమునేనున్నారా రాణిగారు?

 

చిన్నా:- అదిగో మాటలోనే వస్తున్నారు.  దయచేయండి ప్రభూ.

 

మొల్ల:- సాహితీ సమరాంగణ సార్వబౌములకు.  రామాయణ రచయిత్రి మొల్ల నమోవాకములు.

 

రాయలు:- నమస్సులు - ఆసీసులు కండు - మెల్లమాంబా, పనుల    వత్తిడి వల్ల మీ చర్చలో మొదటి నుండి పాల్గొనలేకపోతిని.

 

మొల్ల:-  దానికేమున్నది ప్రభూ... ఇప్పటి కైనను మీ దర్శన భాగ్యము గల్గినది అదిచాలును.

 

రాయలు:- మంచిది మొల్లమాంబా... మీ రామాయణము స్వాభావోక్తుల సంరంభమని కీర్తించుచుండ వింటిని.  యేదీ మహేంద్రగిరి నుండి హనుమ సముద్రలంఘనము నొకసారి మాకు వినిపింప గలరా?

 

మొల్ల:- అవశ్యము ప్రభూ!...

 

చ0!! మొగము బిగించి పాదములు మొత్తముగా నట నూది త్రొక్కినీ

      టుగ మొగమెత్తి భీకర కఠోర రవంబున నార్చి బాహుల

      త్యగణిత లీల నూచి వలయంబుగ వాలముద్రిప్పివ్రేగునన్

      నగము సగమ్ముగ్రుంగ కపినాధుడు నింగికి దాటె ఱివ్వునన్.

 

రాయలు:- కఠోర రవమ్మున నార్చి బాహులత్యగణిత లీలనూచి వలయంబుగ వాలముద్రిప్పివ్రేగునన్-ఓహో...అద్భుతం హనుమంతుని మా మనోఫలకముపై బహుచక్కగ చిత్రించి వైచినారు-మొల్లమాంబా మీ రామాయణము కావ్యశైలిని గాక ప్రబంధ శైలిలో వర్ణనాత్మకమని వింటిమి. యేది ఒక వర్ణన ..అదీ..వర్షఋతు వర్ణనమైన...

 

మొల్ల:- బాగుండునా ప్రభూ..అట్లేకానిండు వాలికూలంసుగ్రీవుడేలికయై శ్రీరాముని మాల్యవంతంబుపైనుండ నియమించె అయ్యవసరంబున--

        

సీ!!     బ్రహ్మాండ మగలంగఁ బటపట ధ్వనులతో

                   నుఱుము లంతంతకు నుఱుము చుండఁ,

             గడు భయంకరముగా వడ మ్రోగు మ్రోఁతలఁ

                   బిడుగు లాడాడ గుభిల్లు మనఁగఁ,

             గ్రముకంబు లంతేసి కణములతోఁ గూడఁ

                   గరుడు గట్టిన వడగండ్లు రాలఁ,

             గొఱివి దయ్యంబుల మఱిపించు తెఱఁగున

                   విద్యుత్ప్రకాశమ్ము విస్తరిల్ల,

 

         తే!! ముసుగు వేసిన చందాన మొగులు గప్పి

             మీఱి నలుపెక్కి చీకట్లు కాఱుకొనగ

             మించి కడవల నుదకంబు ముంచి తెచ్చి

             కుమ్మరించిన గతి వాన గురిసెనపుడు.

 

రాయలు:- బహుచక్కని వర్ణన - మీ పద్యపఠనమున లీనమై మానసికముగతడిసి ముద్దయితిమి - మంచిది. మొల్లమాంబా - మేమిప్పుడే ఒక జఠిల విషయమై అప్పాజీ వారితో సమాలోచన జేయవలసి యున్నది సమయము లేదు.  రేపు భువన విజయ సమావేశమున్నది. అచ్చట మీ పాండీతీ ప్రకర్షను జూపు అవకాశము మీకు కల్పింపనున్నాము.  తిరిగి రేపు భువన విజయమున కలుసుకొందము.  దేవీ!  వెళ్ళివచ్చెదము.

చిన్నా:- అట్లేకానిండు ప్రభూసెలవు.....

 

 

5వ రంగం

భువన విజయం

 

శ్రీశ్రీశ్రీ మహా రాజాధిరాజ - రాజపరమేశ్వర

మూరురాయర గండ - అరిరాయ విభాడ

అష్టదిగ్రాయ మనోభయంకర - భాషగెతప్పువ రాయరగండ

పూర్వదక్షిణపశ్చిమ - సకల సముద్రా ధీశ్వర

యవన రాజ్యస్థాపనాచార్య - గజపతి విభాడ శ్రీవీరప్రతాప సాహితీసమరాంగణ సార్వభౌమ వీరావతార - శ్రీకృష్ణరాయ క్షితీంద్రా

జయీభవ--విజయీభవ ---దిగ్విజయీభవ---.

 

(కృష్ణదేవరాయలు, పెద్దన, భట్టుమూర్తి, అయ్యలరాజురామభద్రుడు ప్రవేశిస్తారు. రాయలువెంట అందరూ సరస్వతీచిత్రపటము, వేంకటేశ్వర స్వామి చిత్రపటము దగ్గర నిలబడతారు)

 

రాయలు:- (సరస్వతీదేవికి పూలుజల్లి)

    శ్లో: యాకుందేందు తుషార హారధవళా ! యా శుభ్రవస్త్రాన్వితా!

            యా వీణా వరదండ మండితకరా! యా స్వేత పద్మాసనా!

            యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై స్సదాపూజితా!

            సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా!  

 

(నమస్కరించును) సాహితీప్రియులారా!..  కడపమండల మహాకవులారా! మీకు మా సాహితీసుమాంజలులు. విజయనగరమునకు మీరందరూ కలసి వచ్చినారని తెలిసి యీ సాహిత్యగోష్టి నేర్పాటు చేసితిమి. చాలా సంతోషము. ఆ తిరుమలేశుని కృపారసదృష్టి మాపై అపారముగా కురియుటవల్ల, జ్ఞాతుల కుట్రలు విఫలమై, ప్రాణాంతక గండముల నిట్లే అధిగమించితిమి. శ్రీవేంకటేశ్వరుడు మా కులదైవము. ఇలవేల్పు. శ్రీవారికి మణిమకుట కిరీటములు,  కనకాభరణములు, భూములు యెన్ని సమర్పించుకొన్ననూ తనివితీరుటలేదు. అవెల్ల వారియనుగ్రహమున సంప్రాప్తమైనవే యగుటవల్ల, వారికి సమర్పించితి మనుటలో అర్థమే గోచరింపదు. ఆ ఆనందనిలయునకు మరొకసారి చేతులెత్తి నమస్కరించి కార్యక్రమము ప్రారంభింతము. (చేతులు జోడించి)

 

: శ్రీకమనీయ హారమణి జెన్నుగ దానును గౌస్తుభంబునన్

      దా కమలా వధూటియు నుదారత దోప బరస్పరాత్మలం

      దాకలితంబులైన తమ యాకృతు లచ్ఛత బైకి దోచి య

      స్తోకత నందు దోచెనన శోభిలు వేంకటభర్త గొల్చెదన్.

 

ప్రభూ! వేంకటేశా! నమోనమః (పూలు జల్లును)

 

సీ:  నీలమేఘము డాలు డీలుసేయగజాలు

             మెఱగు జామనఛాయ మేనితోడ

      నరవిందముల కచ్చులడగించు జిగిహెచ్చు

            నాయతంబగు కన్నుదోయితోడ

      బులుగురాయని చట్టు వలవన్నె నొరవెట్టు

            హోంబట్టు జిలుగు రెంటెంబు తోడ

     నుదయార్కబింబంబు నొఱపు విడంబంబు

             దొరలంగనాడు కౌస్తుభము తోడ

 

తే:గీ:  దమ్మికేలండ బెరకేల దండయిచ్చు

           లేములుడిపెడు లేజూపు లేమతోడ

           దొలకు దయదెల్పు చిరునవ్వుతోడ వెలయు

           శ్రినివాసుడు మనలకు శ్రేయమిచ్చు.

 

(నమస్కరించి కూర్చుండును. మిగిలినవారందరూ వారివారి స్థానములలో కూర్చుందురు. ఇంతలో తెనాలిరామకృష్ణకవి ప్రవేసించును)

 

రామకృష్ణ:- ప్రభువులకు శుభాభి నందనలు. పండితప్రకాండులకు ప్రణామములు.

 

రాయలు:- రామకృష్ణకవీంద్రా! శుభాభినందనలు. మీరాక మాకు ఆశ్చర్యమునూ, ఆనందమునూ కలిగించుచున్నది.

 

రామకృష్ణ:- నిజమే ప్రభూ! నేను వర్తమానము లేకయే మీదర్శనమునకు వచ్చితిని. నాకు నేటి తెల్లవారుఝామున ఒక కలవచ్చినది. కలలో మీరు సభాసీనులైవుండగా, ఒక భక్తమహాకవయిత్రి  మీ యెదుట శ్రీరామచంద్రుని సాక్షాత్కరింపజేసినట్లు కనులారా జూచితిని. ఏమి యిట్టి కలగంటినని ఆలోచిస్తూ మీ దర్శనము చేయుట మంచిదని యిటు వచ్చితిని.

 

రాయలు:- చిత్రముగానున్నదే! ఈనాడు  సభకు గోపవర నివాసియగు కవయిత్రి మొల్లమాంబ రానున్నది. ఆమె రాణివాసమున మా దేవేరులతో సాహిత్యచర్చ జరుపుచుండుటచే, నిదానముగా యీ సభకు రావచ్చునని అనుమతినిడి, నేను మాత్రము సమయమునకు విచ్చేసితిని. మొల్లమాంబ కాసేపటిలో సభకు రాగలదు. కానీ యీ విషయము రామకృష్ణకవికి కలద్వారా తెలియుట మాత్రము చిత్రమే!

 

పెద్దన:- రామకృష్ణకవీ! నీవు సామాన్యుడవు కాదయ్యా.. రా.. వచ్చి కూర్చో.

 

భట్టుమూర్తి:- రామకృష్ణా! నీవు రావడంతో సభకు క్రొత్తకళ వచ్చిందయ్యా!

 

రామభద్ర:- వేకువఝాము కలలు నిజమౌతయని విన్నాను గానీ.. అది నిజమేనని నీవలన ఋజువయిందయ్యా.. రా.. నా ప్రక్కన కూర్చో!

 

రాయలు:- మొల్లమాంబ వచ్చువరకు మనము వేచియుండ నవసరము లేదు. మన కవితా వ్యాసంగము ప్రారంభింతము.

 

భట్టుమూర్తి:- పెద్దలు. పెద్దనామాత్యులే తొలుత స్పందించిన బాగుండును.

 

పెద్దన:- అట్లే కానిద్దము. దానికేమున్నది! ప్రభూ! కృష్ణరాయా! మీకు మీరేసాటి. 

 

: శరసంధాన బలక్షమాది వివిదైశ్వర్యంబులన్ గల్గి దు

        ర్భర షండత్వ, బిలప్రవేశ, చలన బ్రహ్మఘ్నతల్ మానినన్

        నరసింహక్షితి మండలేశ్వరుల నెన్నంవచ్చు నీసాటిగా

        నరసింహ క్షితిమండలేశ్వరుల కృష్ణా! రాజకంఠీరవా!

 

రామకృష్ణ:- మేలుమేలు. నిజమే! రాయలవారిని అర్జునితోనూ, సింహం తోనూ, భూమితోనూ పోల్చరాదు. అర్జునుడు మేటిధనుర్ధారి. కానీ ఒకప్పుడు నపుంసకుడు. సింహం పరాక్రమము కలదే కానీ, ఒదిగి బిలంలో దూరి కూర్చుంటుంది. భూమి క్షమాగుణసంపన్నయే కానీ నిలకడలేనిది. అందువల్ల అవి వాటి లోపాలతో రాయలవారికి సరిగాకుండా పోయాయి. బాగున్నది.. కానీ...

 

పెద్దన:- కానీ.. యేమిటి రామకృష్ణా!

 

రామకృశ్ణ:- ఒకవైపు సింహం రాయలవారికి సాటిరాదంటూనే, తుదకు మళ్ళీ రాజకంఠీరవా! అని సింహంతోనే పోల్చారు రాయలవారిని.

 

రాయలు:- రామకృష్ణా! అదీ ఒక పెద్ద తప్పేనటయ్యా! రాజకంఠీరవా! అనుటకు బదులు రాజసంక్రందనా! అంటే సరిపోతుందికదా!

 

పెద్దన:- ప్రభూ! మీ సవరణ బహుసమంజసముగా నున్నది. పద్యము మరొక్కసారి చదివెద.  శరసంధాన.... రాజసంక్రందనా!(అని పద్యం మళ్ళీ చదువును—(కరతాళద్వనులు వినబడును)

 

రాయలు:- సరిసరి..కవిత్వచర్చలోబడి నాపైజెప్పిన పద్యమును నేనే సరిదిద్దుకొంటిని. ఎంత మైమరపు. అదే కవిత్వమునకున్న గొప్పదనము.

 

రామభద్ర:- రామకృష్ణా! పెద్దనపద్యమునే తప్పుబట్టితివి. ఏదీ నీవొక మంచిపద్యము జెప్పుము చూతము.

 

రాయలు:- నన్ను పొగడుట అటుంచుము. ఏదీ రామకృష్ణా! మొన్న తుంగభద్రాతీరమున విహారము చేయునప్పుడు, ఒకపద్యము తుంగభద్రపై జెప్పితివి. అది మరొకసారి వినిపింపుము. అందరూవిందురు.

 

రామకృష్ణ:- దానికేమున్నది ప్రభూ! అట్లే వినిపింతును.

 

శా: గంగాసంగమ మిచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా

        నంగీకారమొనర్చునే యమునతో నానందమున్ బొందునే

        రంగత్తుంగ తరంగ హస్తముల నా రత్నాకరేంద్రుండు నీ

        యంగంబంటి సుఖించునేని గుణభద్రా! తుంగభద్రానదీ....

 

భట్టుమూర్తి:- భేష్.. బాగున్నది. తుంగభద్ర నేరుగా సముద్రమున కలియుటలేదు. ఒకవేళ కలిసియుంటే , సముద్రుడు గంగ, యమున, కావేరీలను భార్యలుగా ఒప్పుకొనియుండదేమో! అంతగొప్ప గుణభద్ర మన తుంగభద్ర. బహుబాగున్నది.

 

రామభద్ర:- మంచిది. రాయలవారిపై గూడా, పద్యమొకటిజెప్పి, మా ముచ్చట తీర్చవచ్చును గదా!

 

రామకృష్ణ:- అయితే వినుడు కవీంద్రా!

 

: నరసింహ కృష్ణరాయని

      కరమరుదగు కీర్తియొప్పె కరిభిత్ గిరిభిత్

      కరి, కరిభిత్‍గిరి గిరిభిత్

      కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయంబై.

 

మంచిశబ్దములతో కరిభిత్, గిరిభిత్, గిరిభిత్‍కరి, కరిభిత్‍గిరి, గిరిభిత్, కరిభిత్  అంటూ రాయలవారిని శివునితో, ఐరావతంతో, వెండికొండతో, వజ్రాయుధంతో, నందితో, ఉచ్చైశ్రవంతో పోల్చి తెల్లగా వెలుగుతున్నదని తెలుపుట బహురమ్యముగా నున్నది. 

 

రాయలు:- సభ మాస్తుతితోనే నడచిన యేమిబాగుండును? ఇక సాహిత్యసుధలను గ్రోలుదము. ఏదీ రామభద్రా! భట్టుముర్తి కవీంద్రులకు ఒకసమస్యనిమ్ము పూరించెదరు. అటులనే ప్రభు! భట్టుమూర్తి కవీంద్రా! సమస్య వినుము. "రవిగాననిచో  కవిగాంచునేగదా!"  ఇది సమస్య పూరించండి.

 

భట్టుమూర్తి:- పూరించెదను ప్రభూ! ఇది నేను పూరించుటయే సబబు. ఆలకింపుడు.

 

: ఆరవి వీరభద్రు చరణాహతి డుల్లిన బోసినోటికిన్

      నేరడు. రామలింగకవి నేరిచెబో మన ముక్కుతిమ్మరాట్

      క్రూరపదాహతిం దెగిన కొక్కిరిపంటికి దుప్పికొమ్ము పల్

      గా రచియించినాడు రవిగాననిచో కవిగాంచునే గదా!

 

ప్రభూ! దక్షయజ్ఞం భగ్నంచేసిన వీరభద్రుడు తన్నగా, సూర్యుని దంతములూడిపోయినవి. కానీ దాన్నెలా సరిజేసుకోవాలో సూర్యునకు తెలియలేదు. కానీ మన రామకృష్ణునికి మాత్రం తెలుసు. ఎందుకంటే రామకృష్ణుడు మన తిమ్మకవి యింటికి బోయి ఆయన ఊయమంచంపై కూర్చొనియుండగా ఊతునా కవీ? అన్నాడట. తిమ్మకవి సరే! అన్నాడో లేదో వెంటనే రామకిష్ణుడు ఆయనపై ఉమ్మివేశాడు. తిమ్మనకవి వెంటనే తన పాదుకను విసిరివేసినాడు. తెనాలివారి పన్నువిరిగింది. రామకృష్ణుడు ఉపాయంగా దుప్పిపన్ను అరగదీసి పన్నుగా అమర్చుకున్నాడు. రవికి దెలియనిది కవికి దెలిసినది మహారాజా! ఈ విషయమై యే విచారణ అవసరంలేదు ప్రభూ! రామకృష్ణుని దుప్పిపల్లే సాక్ష్యం.

 

రామకృష్ణ:- బుద్ధివచ్చింది మహారాజా! యిక యిటువంటి దూకుడు దుందుడుకు పనుల జోలికిపోను.

 

రాయలు:- సరిసరి.. రామభద్రకవీ! దాశరథీద్ధకథాసుధా చమత్కృతీ  మీ రామాభ్యుదయము నుండి ఒకపద్యము వినిపింతురా!

 

రామభద్రుడు:- అవస్యము ప్రభూ? రావణుడు, సీతయందనురక్తి మిక్కుటమై, మన్మథబాణ పీడితుడై రాత్రి కడఝామున సీతనుజేర శింశుపావనమేగి సీతనుగాంచి యిట్లనుచున్నాడు.

 

: వెడవిలుకాడు నెమ్మనము వేమరు గేదగిరేకు వంకిణిన్

       బొడవగ మేను పానుపున బొందక నిన్నభయప్రదాన మే

       నడిగెద నంచురా కఠినమై యిటు వెన్నెల వేడి వెన్కొనన్

       గొడుగుల నీడవచ్చితి జకోరవిలోచన యేమిచెప్పుదున్.

 

రాయలు:- బహుబాగున్నది. ప్రతినాయకుడైననేమి? రావణుని విరహవేదన హృద్యముగ నున్నది. అయిననూ రామభద్రా! ఈ మొగలిరేకుబాకును కంతునికెక్కడి నుండి తెచ్చియిచ్చితివయ్యా? భేష్.. అయిననూ రామాయణకవివి.. నీనుండి హరివర్ణనముగదా!  కోరుకొందుము?

 

రామభద్ర:- దానికేమున్నది ప్రభూ! అదియునూ ఆలకింపుడు.

 

సీ: తొవతమ్మివిందు గన్దోయిమించినవాడు

               జళువా మిసిమి పచ్చడమువాడు

     కన్నువీనులసెజ్జ నున్న వన్నియవాడు

              తపసిడెందపుటిండ్ల దనరువాడు

     కలిమిచేడియబంట వలతినేలిన వాడు

              తొంటి జేజేమూక దూలింపగలవాడు

     ముజ్జగంబుల చూలు బొడ్డువాడు

 

తే:గీ: సొగసి నవ్వక నవ్వు నెమ్మొగమువాడు

          కలుములీనెడు తళుకు గ్రేగంటివాడు

          పేదసాదల బ్రతికించు పెంపువాడు

          పాలమున్నీటిలోన జూపట్టె నపుడు.  

 

రాయలు:- అద్భుతము, అచ్చతెనుగు శ్రీహరివర్ణనము, అత్యద్భుతము. భట్టుమూర్తి కవివరా! మీ వసుచరిత్రము అటు పురాణకథనూ, యిటు కల్పనను సంతరించుకొని శ్లేషార్థప్రదీపితమై వెలయునని వింటిమి. కొంతచదివియూ చూచితిమి. మీ వసుచరిత్రలోని ఒకవర్ణన వినిపింపుము.

 

భట్టుమూర్తి:- అయిన వినుడు ప్రభూ!

 

సీ: లలనా జనాపాంగ వలనావసదనంగ

              తులనాభికాభంగ దోఃప్రసంగ

     మలసానిల విలోలదళ సాసవ రసాల

              ఫల సాదర శుకాలపన విశాల

     మలినీ గరుదనీక మలినీకృత ధునీక

              మలినీ సుఖిత కోకకులవధూక

     మతికాంత సలతాంత లలికాంతర నితాంత

              రతికాంత రణతాంత సుతనుకాంత

 

తే:గీ: మకృత కామోద కురవ కావికల వకుల

          ముకుల సకల వనాంతప్రమోద చలిత

          కలిత కలకంఠకుల కంఠ కాకలీ వి

          భాసురము వొల్చు మథుమాస వాసరంబు.

 

మరియొక పద్యము ప్రభూ!

 

: అరిగా పంచమమేవగించి నవలాలవ్వేళ హిందోళ వై

        ఖరి బూనన్ బికజాత మాత్మరవభంగ వ్యాకులంబై వనీ

        ధర నాలంబిత పల్లవ వ్రతవిధుల్ దాల్పన్ దదీయధ్యనిన్

        సరిగా గైకొనెయెన్ వసంతము మహా సంపూర్ణభావోన్నతిన్.

 

రామభద్ర:- ఆహా! భట్టుమూర్తీ! ఈ వసంతవర్ణనము, మీ సంగీతసాహిత్యకళా గరిష్ఠత్వమును చాటుచున్నది. సంతోషము.

 

రాయలు:- రామభద్రకవీ మీకొక సమస్యనిచ్చుచున్నాము. పూరింపవలయును.

 

రామభద్ర:- అవస్యము. సెలవిండు ప్రభూ!

 

రాయలు:- "భార్యలిద్దరు శ్రీరామభద్రునకును" ఇదీ సమస్య.

 

రామభద్ర:- రామాయణకవిని, నన్నుజూచి ఏకపత్నీవ్రతుడైన నా రామునకు ఇద్దరు భార్యలందురా?  ప్రభూ!

 

పెద్దన:- శ్రీరామచంద్రునకని యనుకొననేల. నీవు రామభద్రుడవుకదా! మరొక వివాహమాడుము, సమస్య దానికైయదే పూరణమగును.

 

రామభద్ర:- ఇప్పటికిప్పుదు నాకు రెండవపెండ్లియై యీ రామభద్రునకు ఇద్దరు భార్యలేర్పడుట సాధ్యమా? అంతశ్రమ యెందుకు లెండు. ఇక నాపూరణ వినుడు.

 

తే:గీ: రామువిజయంబువిని వీడి రజతగిరిని

          వడి గగనమున కైలాసవాసు లలర

          ఇచ్చమెచ్చి నీరాజనంబిడిరి హరుని

          భార్యలిద్దరు శ్రీరామభద్రునకును.

 

రాయలు:- మేలుమేలు. రామునిభార్యలు శివసతులుగామారి పద్యము సుందరముగా కుదిరినది. పెద్దనార్యా! ఏదీ మీరు మనుచరిత్రమున హిమవత్‍పర్వతశోభను రమ్యముగా కూర్చితిరిగదా! అది మీ ముఖతః విన కుతూహలముగా నున్నది.

 

పెద్దన:- అట్లైన ఆలస్యమెందులకు ప్రభూ! వినుడు..

 

: అటజనిగాంచె భూమిసురు డంబరచుంబి శిరస్సరఝ్ఝరీ

       పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన

       స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్

       కటకచరేత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్.

 

రాయలు:- అద్భుతవర్ణన. పెద్దన కవిత్వంలోనూ పెద్దనయే సుమా!

 

భట్టుమూర్తి:- ప్రభూ! మీనుండి కూడా మేమొక సమస్యాపూరణ వినవలె నని కుతూహలపడుచున్నాము. మీకు తెలుగుపై మక్కువమెండు. "ఆముక్త మాల్యద"ను  రమ్యముగా రచించిన పండితోత్తములు. అందునా..

 

: తెలుగదేలయన్న దేశంబు తెలుగేను

     తెలుగు వల్లభుండ తెలుగొకండ

     ఎల్లనృపులు గొలువ నెఱుగవే బాసాడి

     దేశభాషలందు తెలుగు లెస్స.

 

యని శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణుదేవునిని పరంగా పలికిన తెనుంగభిమానులు మీరు.

 

రాయలు:- అంతగా పొగడవలసిన పనిలేదు. భట్టుమూర్తికవీంద్రా! కవికోరిక మేము తీర్చకపోవుటయా! ఇవ్వండి సమస్య పూరింతుము.

 

భట్టుమూర్తి:- "రమణి రమణిన్ గలసి పుత్రరత్నము గనె" ఇదీ ప్రభూ! సమస్య పూరించండి.

 

రాయలు:- స్త్రీ స్త్రీని గలసి పుత్రరత్నమును గనునా! నేటికిది చిత్రమేగావచ్చును. భవిష్యత్తున యిదియూ సాధ్యమేమో? భగవంతున కెరుక. అది యట్లుండనిమ్ము. ఇప్పుడు మా పూరణవినుడు.

 

తే:గీ: కుంతి మంత్రము జపియించి కోరినంత

          తరణి కన్పడి యిచ్చెద తనయునన్న

          వలదు వలదనియన్న వదలక, అంబ

          రమణి రమణిన్ గలసి పుత్రరత్నము గనె.

 

భట్టుమూర్తి:- చాలచక్కని పూరణ. ఇంతవరకూ చక్కని కవితా కాలక్షేపము జరిగినది. (అటుచూసి) ప్రభూ! మొల్లమాంబ సభకు వేంచేయుచున్నది.

 

రాయలు:- సంతోషము. (ఇంతలో మొల్ల ప్రవేశించి అందరికీ నమస్కరించును. అందరూ ఆమెను దీవించుచున్నట్లు చేతులెత్తుదురు) మొల్లమాంబా! మీకిదే మాఆహ్వానము. వచ్చి ఆసీనులుకండు.

 

మొల్లమాంబ:- మహాప్రసాదము. (వెళ్ళి కూర్చొండును)

 

రాయలు:- సాహితీప్రియులైన మహాపండితులారా! ప్రబంధశైలిలో రామాయణ రచనగావించి జనాదరణ పొందిన మొల్లమాంబ నేడు మన సాహితీసభలో నుండుట మనకెంతయూ ఆనందదాయకము. రామకృష్ణకవీ! నేడు తమరు ప్రశ్నికులుగా వ్యవహరించి మొల్లమాంబ కవితా వైదుష్యమును మా వీనులకు విందగునట్లు సభానిర్వహణ గావింపుము.

 

రామకృష్ణ:- చిత్తం ప్రభూ! అమ్మా! మొల్లమాంబా! నినుగన్న తెలుగుగడ్డ ధన్యమైనది. జీవితమును సంపూర్ణముగా శ్రీకంఠమల్లేశ్వరున కర్పించి. భక్తివైరాగ్యములకు నీఒక నిర్వచనమై హృద్యముగ రామకథనల్లి పండిత పామరజనుల స్తుతిపాత్రమైతివి. కులమత జాతి ప్రాంతముల కతీతముగా మన ప్రభువులు కవిపండిత ప్రీతిపాత్రులు. స్వయముగా మాలదాసరి మంగళకైశికీ రాగమాధుర్యమున మనల నోలలాడించిన విశేషశేముషీ దురంధరులు. నేడు సాహితీసభకు మిమ్మాహ్వానించి తన సాహితీ పిపాసను మరియొకసారి వెల్లడించుకొనిరి. ఇక విషయమునకు వత్తము. మొల్లమాంబా రామకీర్తనమున ప్రారంభింతము. ఏదీ.. మీరాముడేట్టి వాడో వివరింపుము.

 

మొల్ల:- సభాయైనమ:  అశోక వనిలో సీత రావణుని వేదింపులకు విసిగి వేసారి. దశకంధరుని ధిక్కరించి తనరాముని ఘనతను శ్లాఘి౦చు చున్నది,  వినుడు.

         

సీ!!     కూకటి ముడికినై కురులు గూడని నాడె

                  బెదరక తాటక బీచ మణచె

         గాధేయు డొనరించు క్రతువును రక్షింప

                  బెక్కండ్రుదైత్యుల నుక్కణంచె

         నవనిపై విలసిల్లు నఖిల రాజన్యులు

                  వ్రేలజూపగలేని విల్లు విఱిచె

         ఘోరాటవుల లోన గ్రుమ్మరు నప్పుడు

                  ఖరదూషణాది రాక్షసుల జంపె

 

         తే!! బాదరజమున నొకరాఱాయి బడతి జేసె

             లీల మాయామృగంబును గూల నేసె

             రాజ మాత్రుండె మేదినీరక్షకుండు

             రామభూపాలు డాదినారాయణుండు.

 

(కర తాళ ధ్వనులు మారు మ్రోగును)

 

రామకృష్ణ:- అమ్మా మీ పద్యమెంత ఘనమైనదో కరతాళధ్వనులే తెలియ జేసినవి.  సరి మొల్లమాంబా పూర్వము తిక్కన, ఎర్రన, రంగనాథ, మల్లికార్జును లెందరో రామాయణమును తెనుగున జెప్పిరి.

 

ఉ: రాజిత కీర్తియైన రఘరామ చరిత్రము మున్గవీశ్వరుల్

       తేజమెలర్ప చెప్పిరని తెల్సియు క్రమ్మఱ జెప్పనేల?

 

మొల్ల:-   జెప్పనేలనన్....

 

   భూజన కల్పకంబగుచు  భుక్తికి ముక్తికి మూలమైనయా

   రాజును దైవమైన రఘురాము నుతించిన దప్పుగల్గునే.

 

          కం!!  అది రఘురాము చరితము

             నాదరముగ విన్నగ్రొత్తయై లక్షణ సం

             పాదమ్మై పుణ్యస్థితి

             వేదమ్మై తోచక్కున్న వెఱ్ఱినె చెప్పన్.

 

రాయలు:- మొల్లమాంబేకాదు ఇంకనూ ఎన్నోరామాయణాలు లోకంలో కవులు వెలువరించ వచ్చును.  మన అయ్యలరాజు రామభద్రుడు గూడా రామాభ్యుదయము పేర రామాయణము వ్రాసియున్నాడు కదా!  ధర్మ వీరుడైన   రామప్రభువునకు మించిన కథానాయకుడు మరొకడున్నాడా..  ఇదిగో మీరామాయణ ప్రతి మాదగ్గరొకటున్నది.  ఆహా సామాన్యుడగు సరంగు గుహుడు.  అతడు రాముపదంబులు కడుగుటకు ఎంత తెలివిగా కారణము  జూపెను

 

        చ:   సుడిగొని రాముపాదములు సోకిన ధూళి వహించి రాయి                                యేర్పడ నొక కాంత యయ్యెనట పన్నుగ నీతని పాదధూళి ని

        య్యెడ వడి నోడసోక నిదియేమగు నోయని సంశయాత్ముడై 

              కడిగె గుహుండు రామ పదకంజయుగంబు భయంబు పెంపునన్.

 

రామకృష్ణ:- మొల్లమాంబా భావము, వ్యాసుల వారిది కదా!

 

మొల్ల:- అవును.. అది ఆధ్యాత్మిక రామాయణమున వ్యాసుల వారు వెలుబుచ్చినదే .. భావమును నా పెద్దల ఆస్తిని హక్కుతో గ్రహించినంత ధీమాతో గ్రహించితిని.  కానీ ఒకటి గమనింపుడు. శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్ర యాగరక్షణానంతరము మిథిలకు వచ్చుతరి, నది సుత్తరించ వలసి వచ్చెను అచట సరంగు తెల్పిన భావమిది.  అప్పటికింకను అహల్యా శాపవిమోచన విషయము క్రొత్త,  లోక ప్రసిద్ధముకాలేదు.  కనుక నే నద్దానిని అయ్యోధ్య కాండకు మార్చి రామభక్తుడగు గుహుని కతికితిని.

 

రాయలు:- మేలు మేలు... చక్కని చంపకమున రసరమ్యముగ జెప్పుటే గాక..దానికి తగిన సన్నివేశమునూ ఎన్నుకొంటివి..

 

మొల్ల:- ధన్యురాలను ప్రభూ!

 

రామకృష్ణ:- మొల్లమాంబా... హనుమ అశోకవనమున సీతను  గాంచి

 

          కం!! ఉన్నాడు లెస్స రాఘవు

             డున్నాడిదె కపుల గూడి యురుగతిరానై

             యున్నాడు నిన్ను గొనిపో

             నున్నాడిది నిజము నమ్ము ముర్వీతనయా.

 

అంటాడు ఇక్కడ మీరు రాఘవుడున్నాడు లెస్సయని పద్యము వ్రాసియుండవచ్చును - అటుగాక" ఉన్నాడని మొదలు పెట్టులో మీ ఉద్దేశ్యమేమి?

 

మొల్ల:- అంతే కాదు రామకృష్ణ కవీంద్రా!  హనుమ సీతను చూచితినని రామునకు విన్నవించు నప్పుడు కూడా నేను కంటిన్ జానకి అనియే మొదలు పెట్టితిని.  కారణం - జానకీ రాము లిరువురూ కూడా చింతలో మునిగి,  ఉద్వేగభరితులై నిరాశానిస్పృహలకు గురియై మానవ మాత్రుల వలె విలపించుచున్నారు.  అందునా రావణుడు సీతతో యింకెక్కడి రాముడు.  యిప్పటికి కాయకసరులు దినజాలక చచ్చియుండు నని నిరాశాజనకమైన మాటలతో వేదించి యున్నాడు అట్టి సందర్భమున బుద్ధిమంతుడైన హనుమ తొలుత ఉన్నాడని శుభం పలికి తర్వాతే విషయం వివరించాడు-అదీ హనుమ ప్రతిభ.

 

రామకృష్ణ:- అహా...ఎంత చక్కని వివరణ ... మొల్లమాంబా మీకు మా హృదయ పూర్వకమగు అభినందనలు మీ రామాయణ రచనాకౌశలమును మేమొప్పుకొంటిమి.  ఇక మీ ఆశు కవిత్వపటిమను కొంత గనుగొని నందింతుమా?

 

మొల్ల:- అవశ్యము... శ్రీకంఠమల్లీశుని దయ.  పరీక్షాసమయమున నన్నెట్లుగాచి రక్షించునో,  ఆయనకే ఎఱుక,  కానిండు కవీశ్వరా...

 

రామకృష్ణ:- మొల్లమాంబా వినుము గజేంద్రమోక్షణార్థము సంభ్రమాయత్త చిత్తుడై వైకుంఠనగరము నుండి చనుదెంచు శ్రీమహావిష్ణువు ప్రయాణ విశేషమును సీసమున నభివర్ణింప వలెను. సీసపాదముల వరుసగా "గుమ్ము”, బుస్సు", "ఱింగు", "బొణుగు" అను పదములుండవలెను.  ప్రాణముల మీది యాసను వదలుకొని మొఱపెట్టుచున్న యగ్గజరాజునకు కడుదూరము నుండియే శ్రీహరి అభయప్రదానవాక్కులు వినబడుటయు తదీయ సందర్శణా చిహ్నము కనబడుటయు నొక్కమారే జరిగినట్లుండ వలెను.  కానిమ్ము అందుకొనుడు పద్యం..

 

మొల్ల:-

 సీ!! అనిలాభిహత దక్షిణావర్త శంఖంబు

               గుంఫితంబైకేల "గుమ్ము" రనగ

        గొడుగయి తఱచుగా బడగ లొక్కెడదట్టి

               భుజగాధిపతి మీద "బుస్సు" రనగ

        చఱచి నిబ్బరముగా బఱతెంచు ఖగరాజు

               ఱెక్కగాడ్పులు మింట  “ఱి౦గు” రనగ

        దొంతిబ్రహ్మాండ పంక్తులు బొజ్జలో నిండి

               బెణకి యొక్కకమారు "బొణుగు" రనగ

          గీ!!   కూక కనుచూపు మేరకు గోక విసరి

                వెఱకు వెఱవకు వెఱవకు వెఱవ కనుచు

                 నుద్ద వడి వచ్చి గజరాజు నొద్ద వ్రాలె

                 నార్తరక్షణచణుడు నారాయణుండు

 

{కరతాళధ్వనులు మిన్నంటుతాయి}

 

రాయలు:- భేష్...మొల్లమాంబ మీ ఆశుకవితా చతురత బహుదా ప్రశంశనీయము..

 

రామకృష్ణ:- ప్రభుప్రశంశలకు పాత్రమైన మీ ఆశుకవిత్వమునకు జోహారులు.  ఇక ఆఖరుగా ఒక సమస్య- పూరింతురుగాక.  "కులట చనెదమె పొదచెంతకు చలాచలిగన్."

 

రాయలు:- [ కోపముగా ] రామకృష్ణా!

 

రామకృష్ణ:- ఇది సమస్యయే కదా ప్రభూ.... మొల్లమాంబ సులువుగా సాధువోనర్ప గలదని నా విశ్వాసము.

 

మొల్ల:- మహారాజా...పండితోత్తములారా! తెనాలి రామకృష్ణ కవీంద్రుల దుడుకు సమస్యకు పూరణ వినుడు..

           కం!! నలుదిసల జూచి కన్గొని

               ఇలజాతకుజూపి రాము డిట్లని పల్కెన్

              నెలతా! కలవు మొగలిరే

              కులట చనెదమె పొదచెంతకు చలాచలిగన్.

 

అల్లంతదూరములో గల మొగలి రేకులను సీతకు జాపి పొద చెంతకు త్వరగా వెళ్ళికోసికొందమా!  యని రాము డనుచున్నాడు ప్రభూ...

(కరతాళధ్వనులు మారుమ్రోగును)

 

రామకృష్ణ:- ప్రభూ... మొల్లమాంబ కవితా చతురతకు సమయస్ఫుర్తికి పూరణము నిదర్శనము.   కవయిత్రి మన భువన విజయ మంటపమున సగౌరవ సత్కారము గైకొనుటకు సర్వవిధములా తగియున్నదని న్యాయనిర్ణేతగా ప్రకటించుచున్నాను..

 

రాయలు:- సంతోషము.. మొల్లమాంబకు స్వతహాగా మాదేవేరులు మా సమక్షమున రాణివాసమున సాదరసత్కారము గావింప నెంచినారు.   యిప్పటికి మన కరతాళ ధ్వనులతో మొల్లమాంబ నభినందింతము.  చివరగా నొక్కమాట.  అమ్మామొల్లమాంబా మీ ప్రకృతి వర్ణనలు వల్లెసీమల కద్దము పట్టినట్టుండునని ప్రతీతి, ఏదీ ఒక సాయం సంధ్యయోలేక తదనంతర యామినియో మామనోఫలకమున ముద్రింపజేయుము.

 

మొల్ల:- ఆంధ్రబోజా!  మేము జన్మతః జానపదులము మావర్ణనలలో పల్లెప్రకృతి ప్రతిఫలించుట సహజము.  వినుడు దశరథుడు రామపట్టాభి షేకమునకు ముహూర్తము నిర్ణయించి సభనుచాలించెను,  అంతట సూర్యుడపరాంబుధిదరి చేరినాడు..

 

            తే!!  పగలు ప్రాగ్భాగమున నుండి గగన వీధి

              జరమదిక్కున కేగగా శ్రమము దోచి

              చెమట పట్టిన స్నానంబు జేయ నరుగు

              కరణి సపరాబ్ధిలో దివాకరుడు గ్రుంకె.

 

రాయలు:- అద్భుతము పల్లెరైతులు దినమంతా శ్రమించి సాయంత్రము నదీస్నానము జేయుట స్ఫురణకు వచ్చినది.  వర్ణన సహజాతిసహజము. సంతోషము. మొల్లమాంబకు స్వతహాగా మా దేవేరులు మా సమక్షమున సాదరసత్కారము గావింపనెంచినారు. ఇప్పటికి మన కరతాళధ్వ్వనులతో మొల్లమాంబ నభినందింతము

{కరతాళధ్వనులతో సభ మారుమ్రోగిపోతుంది}

(తెరదిగును)

(22 జూన్ 2012 నాడు సా: 3గం|| లకు కడప ఆకాశవాణి ద్వారా కడప విజయవాడ విశాఖపట్నం, హైదరబాద్ కేంద్రాల నుండి నాటకం ప్రసారమైనదిది).                

*****


No comments:

Post a Comment

నాకు చదువురాదు, Naaku Chaduvu Raadu

  నాకు   చదువు   రాదు ( ఏకపాత్రభినయము )     (పాత్ర: ఓ 50 సంవత్సరాల  పేద పెద్దమనిషి ) అమ్మా!  శారదా ... ( బోరున   యేడ్చును ).  తల్లీ   యీ   గ...