Saturday, 31 July 2021

పరుసవేది స్పర్శ

పరుసవేది స్పర్శ

(ఏకాంకిక)

 

 

రచన

పి.సుబ్బరాయుడు.

42/490 భాగ్యనగర్ కాలనీ

కడప - 516002

సెల్-9966504951

పరుసవేది స్పర్శ

(ఏకాంకిక)

 

ఇందలి పాత్రలు

 

                       1.ప్రకాశం

                       2.గోపాలరావ్

                       3.రఘు.

                       4.శేఖర్

                       5.శాంత

 


 

పరుసవేది స్పర్శ

(ఏకాంకిక)

 

(ఇల్లుఇంటిముందు లాన్లాన్ లో టేబులు చుట్టూ కుర్చీలు - ప్రకాశం వచ్చి కాలింగ్‍బెల్ నొక్కుతాడు)

 

శాంత:- (బయటికి చచ్చి) మీరా మామయ్యా.. రండి.. రండి..

 

ప్రకాశం:- మీ నాన్నగారున్నారామ్మా యింట్లో?

 

శాంత:- ఆఁ వున్నారు మామయ్యా..

 

గోపాల్‍రావ్:- (లోపలినుంచే) లోపలికి రావోయ్.. గడపదగ్గరే గొప్ప ఎంక్వయిరీ మొదలుపెట్టావ్.

 

ప్రకశం:- నువ్వేరారా.. బయటికిసాయంసమయం చల్లగాహాయిగావుంది. లన్స్‍లో కూర్చొని  కాసేపు కబుర్లు చెప్పుకొందాం. తొందరగారా..  అమ్మాశాంతా! మాకు మాంచి కాఫీ పంపమ్మా. చాన్నాళ్ళయింది నీ చేతి కాఫీ తాగి.

 

శాంత:- అలాగే మామయ్యా. మీరువెళ్ళి కూర్చొండి. (లోనికి వెళుతుంది. ప్రకాశం వచ్చి కుర్చీలో కూర్చుంటాడు.)

 

గోపాల్‍రావ్:- ఆఁ యేమిటి విశేషంయీ మధ్య నీ దర్శనమే కరువైంది కదరా!  (వచ్చి కూర్చొండును)

 

ప్రకశం:- తప్పేఒప్పుకుంటా.. మరివీడసలే కనబడలేదే, నేనైనా ఒకసారి వెళ్ళోద్దామనుకొన్నావానీదసలే వన్‍సైడ్ వ్యవహారంరా.

 

గోపా:- ఎంతమటన్నావురా! ఒరే ప్రకాశం  నీకంటే నాక్కావలసిన వాళ్ళెవరున్నార్రా. రెండ్రోజుల్నుంచి నువ్వే మాటిమాటికి జ్ఞాపక మొస్తు న్నావనుకోయీ సాయంత్రమైన అలా బయలుదేరిమీయింటి కొద్దా మనుకున్నాయిదిగో నువ్వే వచ్చేశావ్.

 

ప్రకా:- పోన్లేరా.. యేదో మాటవరసకన్నా నంతేఅదిసరేగానీ మరి ఆ గుంటూరు సంబంధం యేంజేశావో చెప్పావుకావు.

 

గోపా:- అదే.. ఆ విషయం గురించే  ఆలోచిస్తున్నారా.

 

ప్రకా:- ఇంకా ఆలోచించేదేమిటి. అంతా బాగుంది,  అమ్మయికి యీడూజోడు కూడా బాగుంటుందినలుగురూ వారిని గురించి సభ్యతాసంస్కారం గలవారన్నారుయింకేం  ఆలోచించేదిలేదు,  పెళ్ళిఖాయంచేసుకున్నాం అన్నావుగదా! వాళ్ళేమైన వెనక్కుతగ్గారాయిచ్చిపుచ్చుకోవడాల్లో యేమైనా  తేడాలొచ్చాయాఅయినా వున్నదంతా అమ్మాయిదేగాఅన్నీ తెలిసేగదా వారొచ్చారు.

 

గోపా:- లేదురా ప్రకాశం.. వాళ్ళేం వెనక్కుపోలేదు,  నేనే వెనక్కుతగ్గా.

 

ప్రకా:-ఎంచేత.

 

గోపా:- అబ్బయి పర్లేదు. బాగానే వున్నాడు. యం.ఏ వరకు చదువు కున్నాడు. ఇల్లూవాకిలి పొలంపుట్రా ఓమాదిరిగానే వున్నాయ్కానీ..

 

ప్రకా:- ఇంకా కానీ యేమిట్రానీబొందపెళ్ళిఖాయంచేయక.

 

గోపా:- అదికాదురా.. కస్తా ఎంక్వయిరీ చేస్తేవాళ్ళకులం మకులం ఒకటేగానీ..

 

ప్రకా:- యింకా కానీ గీనీ యేమిటి?

 

గోపా:- కులంఒకటే గానీమాకులంలో మూడు వర్గాలున్నాయ్. వారు మావర్గంకారుఅందుకే..

 

ప్రకా:- అందుకని ఆ సంబంధం మానుకున్నావ0తేనాఇంకా ఎన్ని సంబంధాలు చూస్తావోచూడుఆఖరికి నీకే అర్థమౌతుందిఅన్నీ సక్రమంగా అమరినవాడు  యీ లోకంలో లేనే లేడని.

 

గోపా:- లేకేం లేవోయ్ నిన్ననే మరోసంబంధం వచ్చింది. చూస్తుంటే యిదిమనకన్నివిధాల సరిపోతుంది.

 

ప్రకా:- వాళ్ళ యిల్లూ వాకిలి చూసొచ్చావా?

 

గోపా:- లేదురా.. మాకొకరకంగా దూరపుబంధువౌతాడ్లేయీ సంబంధం తెచ్చాడు. అబ్బయి హైదరబాద్‍లో ఓపెద్ద ఫ్యాక్టరీలో  మేనేజరటఆస్తిపాస్తులు అంతగా లేకపోయినా..

 

ప్రకా:- పోనీలేరా.. నీకున్నదంతా బిడ్డదేగా.

 

గోపా:- అందుకే  యీ సంబంధం ఖాయం చెసుకుందా మనుకుంటున్నా.

 

శాంత:- (ట్రేలో కెటిల్ కుప్పులతో వస్తూ) కాఫీ రడీ..(కూర్చొని కాఫీ కప్పుల్లో పోస్తుంది)

 

ప్రకా:- యేమ్మా.. రాజయ్య లేడాకాఫీ నువ్వే తీసుకొచ్చావ్.

 

శాంత:- మార్కెట్‍కు పంపించానుఐనా మీకు కాఫీ నేనే స్వతహాగ యిస్తాను. రాజయ్యచేత యెప్పుడూ పంపనుఅప్పుడే నాకు సంతృప్తి.

 

ప్రకా:- మంచిదిఅలగే కానీ తల్లీ. (కాఫీ త్రాగుతూ) కాఫీయంటే యిలా వుండాలి. కమ్మగా వుందమ్మా. అమ్మాయి వరాలమూటరా! యేయింటి కోడలౌతుందోగానీఅంతా వాళ్ళ అదృష్టం.

 

గొపా:-ఔనూ పనిలోపని రఘుకు కూడా పెళ్ళిచేస్తే పోలానీకూ కోడలొస్తుందిమంచి కాఫీ కలిపిస్తూ నీతో రోజుకో సర్టిఫికెట్ తీసుకొంటూ వుంటుంది.

 

ప్రకా:- నీకంతా ఎగతాళేరా. నీకుతెలియదురా.. మన శాంతలాంటి పిల్ల దొరకడం  మాటలనుకొన్నావాఇకనేనెళ్ళొస్తారా..

 

గోపా:- ఒక్కమాటఒకట్రెండ్రోజుల్లో వాళ్ళ దగ్గరనుండి ఉత్తరమొస్తుందిఆ ఉత్తరం చూసుకొని నిశ్చితార్థం పెట్టుకుందాం. నీవూ రఘూ దగ్గరుండి యీ పనులన్నీ చూసుకోవలిమరి. నాకు మీకంటే ముఖ్యులెవరున్నారు చెప్పు.

 

ప్రకా:- అలాగేలేరా.. మరినేనెళ్ళొస్తా.. వస్తానమ్మా శాంతా. (వెళ్ళును)

 

శాంత:- ప్రకాశం మామయ్య చాలామంచివారు నాన్నా.

 

గోపా:- వాడి మంచితనం గురించి నీకేంతెలుసు తల్లీ. వాణ్ని మంచి వాడనడం కంటే  గొప్పవాడనటం మంచిది. వీడి తండ్రితాతల నుండి అంతా గాంధేయవాదులు. సేవా కార్యక్రమాల్లోనే వీరి ఆస్తులన్నీ కరిగి పోయాయ్. నాతోపాటి చదువుకొనే రోజుల్లో వీణ్ని మేము నిజంగానే ప్రకాశంపంతులంతటో డనుకొనేవాళ్ళం.

 

శాంత:- అలాగా! ఏమోనాన్నా.. యీరోజు మమయ్యను చూస్తూవుంటే నాకదోలా అనిపిస్తూంది. ఒక్కమాటలోచెప్పాలంటేఆయన నన్ను తన కోడలిగా ఆహ్వానిస్తున్నడాఅనిపిస్తూంది.

 

గోపా:- అంతకంటేనా తల్లీ.. రఘూ తండ్రిని మించిన కొడ్సుకు. మంచివ్యక్తిత్వం గలవాడు. యం.డి చేశాడు.. కానీ..

 

శాంత:- కానీ..

 

గోపా:- వాళ్ళు మనకులం కాదమ్మా.. కాకపోతే నాకీచిక్కేవుండేదికాదు. నిన్ను వాళ్ళచేతుల్లో పెట్టి సంతృప్తిగా వుండేవాణ్ని.

 

శాంత:- అసలీకులందానికోసం యింత పట్టింపులు యెలావచ్చాయి నాన్నా.

 

గోపా:- నాకేం తెలుసుతల్లీ .. ఒక్కొక్కరి నడిగితే ఒక్కొక్కరకంగా

 చెబుతారు. మన రామప్పంతులు నడిగామనుకో  ఆయనేమో మహా విష్ణువు ముఖమునుండి బ్రాహ్మణులుభుజాలనుండి రాజులూ తొడల నుండి వైశ్యులుపాదాలనుండి శూద్రులు ఉద్భవించారంటారు. అందుకే యెక్కడివారక్కాడే వుండాలి. దేవుని అవయవాలుగదా! తారుమారు కాకూడదంటారు. మనవీధిచివరి లెక్చరర్ భరత్‍రావ్ నడిగామనుకోఆయనేమో యిదంతా కొందరు స్వార్థపరుల కుట్ర. అందర్ని తమ చెప్పు చేతుల్లో వుంచుకోవడానికి వాళ్ళు చేసిన మాయదారి వ్యవస్థఅని ఓపాటి లెక్చెరిస్తాడు.

 

శాంత:- ఇవన్నీ వాళ్ళవాళ్ళ మనోభావాలకు తగ్గట్లు అల్లుకున్న కల్పితకథల్లా అనిపిస్తున్నాయి. ఇసారి ప్రకాశంమామయ్యరానిఆయనకేస్తామీప్రశ్న. ఏంచెబుతారోచూద్దాం.

 

గొపాల్:- అదిసరేగానీ.. హైదరాబద్ సంబంధం గురించి నీ అభిప్రాయమేమితల్లీ.

 

శాంత:- నేను చెప్పేదేముంది నాన్నా.. అంతా మీయిష్టం.

 

గోపా:- నాకు తెలుసుతల్లీనీవామాటంటావని. సరే.. నేనలా శాస్త్రి గారింటికెళ్ళి నిశ్చితార్థానికి మంచిరోజులు కనుక్కోనొస్తా.. ఎవరైనావస్తే ఓగంటలో వస్తాడని చెప్పమ్మా. గేటు సరిగ్గా వేసుకో. (వెళ్ళును)

 

 

 

లైట్స్ ఆఫ్ అండ్ ఆన్

 

(గోపాల్‍రావ్ప్రకాశంరఘు  కూర్చొని వుంటారు.)

 

గోపా:- యేమయ్యా రఘూమరి చదువు పూర్తయింది కదా! ప్రాక్టీసెక్కడ బెట్టాలనుకుంటున్నావ్. అవిషయమేమైనా  ఆలోచించావా?

 

రఘు:- ఆలోచించాను గోపాల్‍రావ్‍గారుమీరు కాస్తా ఆర్థికసాయం చేయాలి. ఓసంవత్సరం లో తిరిగిచ్చేస్తాను.

 

గోపా:- నాదగ్గర సందేహమెందుకయ్యా. నీకెంతగావాలో అంతా తీసుకెళ్ళు. నాకు వివరాలేవి చెప్పక్కరలేదు. నా ఆశీర్వాదం ఆర్థికసహాయం నీ కెప్పుడూ వుంటాయ్. అడుగెంతగావాలోఅయినా నిన్నడిగేదేముందిబ్లాంక్‍చెక్కిస్తాను. ఫిగర్‍నువ్వేసుకో.

 

ప్రకా:- ఉన్నయిల్లమ్మేద్దా మనుకున్నారా.. కానీ అది మానాన్నగారి జ్ఞాపకంగా మిగిలివున్న ఒకేఒక ఆస్తి. అమ్మబుద్ధిగాక నీ దగ్గరి కొచ్చామురా.. నీ అప్పుకు యిల్లుతాకట్టు బెడతానుకాదనకు.

 

గోపా:- అసలు నేను అప్పేయివ్వడంలేదు. తాకట్టు కాదుగదా ప్రాంసరీనోట్ అదే బాండుకూడా తీసుకోను. అట్లయితేనే చెక్కు తీసుకెళ్ళు. అంతే.

 

రఘు:- అదేంటి రావుగారూ.. డబ్బు విషయంగదా...

 

గోపా:- ఔనూ డబ్బువిషయమేనయ్యా.. అదంతానీకెందుకూఆవిషయం మేముచూసుకుంటాం. నీవు చెక్కుదీసుకెళ్ళు. అంతే. యింకేంమాట్లడకుఅమ్మా శాంతా.. ఆచెక్‍బుక్ యిలా దీసుకరామ్మా (గట్టిగా చెప్పును)

 

రఘు:- ఓయాబైవేలు కవాలి రావ్‍గారు. అదే రాసుకుంటాను. నాన్నా విషయం మీరు వివరంగా చెప్పిరండి.

 

ప్రకా:- సరే అలాగేలే..(శాంత చెక్‍బుక్ తెచ్చియిచ్చును గోపాల్‍రావ్ సంతకంపెట్టి రఘుకిచ్చును)

 

రఘు:- (తీసుకొని) శాంతగారూ బాగున్నారా?

 

శాంత:- బాగున్నాం డాక్టర్‍గారూ..ప్రాక్టీస్ యెప్పుడు మొదలు పెడుతున్నారు.

 

రఘు:- ఆ పనిమీదేవున్నాను. ఐనా మా డాక్టర్లతో మీకు పనిబడకుండా వుండాలనే కోరుకుంటున్నాను. (అందరూ నవ్వుదురు) వస్తాను నాన్నగారువస్తాను రావుగారూ.(వెళ్ళును. ఆస్థానంలో శాంత కూర్చుండును)

ప్రకా:-  రఘు మా స్వగ్రామం రంగాపురం లోనే ఆస్పత్రి పెడదా మను కుంటున్నాడురా.. ఈ టవున్లో  వైద్యసదుపాయాలకేం కొదవలేదుపెద్దపెద్ద డాక్టర్లున్నారునర్సింగ్‍హోంలూవున్నాయ్. మవూర్లో పేదలకు అందుబాట్లో వుంటూవారికి వైద్యసేవ చేస్తానంటున్నాడునేనూ సరేనన్నా. అక్కడ మా దొక పాతయిల్లుంది. దాన్నే కాస్తా రిపేరుచేసి చిన్నఆస్పత్రిగా మార్చుకుంటే ప్రస్తుతానికి సరిపోతుంది. నేను రేపేవెళ్ళి ఆపని చూస్తాను.

 

గోపా:- ఇంతకష్టపడి చదివి ఆచిన్నవూర్లో ప్రాక్టీస్‍పెడతాడాఐనా ఆ పాతయింటిని బాగుచేయించి గ్రంధాలయం పెడతానన్నావుగదరా?

 

ప్రకా:- నిజమేకానీ యిపుడు మావాడు అది తన ఆసుపత్రికి కావా లంటున్నాడు. ముందు వానికేయిచ్చేస్తున్నా. తర్వత ఆలోచిద్దాం.

 

గోపా:- అయితే రఘు యిందుకా డబ్బడిగాడు.

 

ప్రకా:- అవున్‍రా..లేకుంటే యిప్పటికిప్పుడుడబ్బుతో పనేముంది చెప్పు.

 

శాంత:- పర్వాలేదు నాన్నా. రంగాపురం సుమారైనవూరేఅక్కడ ఓ అసుపత్రి అవసరమే. ఐనా అక్కడ గ్రంథాలయం కూడా కట్టొచ్చు

మామయ్యా మీరేం దిగులు పడకండి. ఒకటి తర్వాతొకటి కానివ్వండి. మంచిపనులకు యే ఆటంకం రాదులేండి. మీ గ్రంథాలయానికి నేను డొనేట్ చేస్తాను. నేను దాచిపెట్టుకున్న డబ్బుందిఅదిచ్చేస్తాను.

 

ప్రకా:- చాలసంతోషమమ్మా.. ఆమాటేచాలు. ముందు వాని క్లినిక్ మొదలుకానీ చూద్దాం. రేపేవెళ్ళి అక్కడి పెద్దలునా స్నేహితులు లక్ష్మారెడ్డిగోవిందస్వామి వున్నారు. వారితోకలిసి మాట్లాడతానువారి సాయం అవసరమేగదా! వస్తారా.. మళ్ళీ నాలుగురోజుల్లో కలుస్తా..

 

గోపా:- మంచిది మీరేంపనిజేసినా మంచిపనే జేస్తారు. మీకుచెప్పేటంతటివాణ్నిగానుమీ పని నిరాటంకంగా జరుగుతుంది. శుభం. అదిసరేగానీ అమ్మాయి నిశ్చితార్థం  మరచిపోలేదుకదాఅంతా నువ్వేచూసుకోవాలి. నాచేతనయ్యేపనికాదు. భారమంతానీదే.

 

ప్రకా:- నువ్వేం భయపడకూఅంతానాదేభారం. మారఘూ నేనూ యిక్కడే వుండి చూసుకుంటాం. మీయింట్లోకాదుఅదిమాయింట్లో శుభకార్యం సరేనా!

 

శాంత:- థ్యాంక్స్ మామయ్యా..

 

ప్రకా:- నాకు థ్యాంక్స్‍సేమిటమ్మా.. మీరు నిశ్చింతగా వుండండి చాలు. పనులెలా జరుగుతాయో  మీరేచూస్తారుగదా! వస్తానమ్మా.. (వెళ్ళును).

 

 

 

లైట్స్ ఆఫ్ అండ్ ఆన్

 (గోపాల్‍రావ్ప్రకాశం కూర్చొని వుంటారు)

 

గోపా:- థ్యాంక్స్‍రా ప్రకశం. మీరంతా నిలబడి నిశ్చితార్థం ఘనంగా జరిపించారు. ఆపెండ్లి కూడా  యిలాగే జరిపించి నాబిడ్డ తలపై నాలుగక్షింతలు వేశారంటే..

 

ప్రకా:- చాల్లేరా.. మహచెప్పినావ్ థ్యాంక్స్. నీబిడ్డైతే ఒకటి నాబిడ్డైతేవొకటా?

 

శాంత:- (కాఫీట్రే తో వచ్చి) మామయ్యా కాఫీ..

 

ప్రకా:- ఎలా కనిపెట్టేశావమ్మా నేనొచ్చేశానని.

 

శాంత:- ఏమిటి మామయ్యా.. ఆమాత్రం మీమాట గుర్తుపట్టలేనాముందుమీరు కాఫీ తీసుకోండి. మిమ్మల్నొక ప్రశ్న అడగాలి.

 

ప్రకా:- అడుగమ్మా నాకుతెలిస్తే  తప్పకుండా చెప్తాను.

 

గోపా:- తెలిస్తేనే జెప్పులేనిపోని ఫోజులుబెట్టితెలియకపోయినా గ్యాస్‍మాత్రం గొట్టకు.

 

ప్రకా:- లేదులేరా..ప్రశ్నేమిటో జెప్పకుండానేతండ్రీ కూతుర్లు అదరగొట్టేస్తున్నరే..  నువ్వు ప్రశ్నేమిటో ముందుజెప్పమ్మా.

 

శాంత:- అసలు యీ కులవ్యవస్థ యెలా యెందుకు యేర్పడిందిఇదీ ప్రశ్న. ఇకజెప్పండి జవాబు.

 

గోపా:- చెప్పరా.. చూద్దాం.

 

ప్రకా:- చాలా మంచి ప్రశ్నే వేసిందిరా అమ్మయి.

 

గోపా:- జవాబు జెప్పరా అంటేప్రశ్న బాగుందంటే సరిపోతుందాచెప్పరా జవాబు.

 

ప్రకా:- నేజెప్పే జవాబు తప్పోఒప్పో నాకు తెలీదుగానీనాకు సబబనిపించింది గనుక నమ్ముతున్నా. పూర్వం జనకుడనేరాజు రాజ్యమేలుతుండేవాడు.

 

శాంత:- జనకుడంటే సీత తండ్రే గదా!

 

ప్రకా:- ఆ వంశంలోని పాలకులందర్నీ జనకులనే పిలిచేవారు. చార్‍లెస్ 1

చార్‍లెస్2 లాగ.

 

శాంత:- సరే.. ఒకరాజు. కానివ్వండి.

 

ప్రకా:- ఆయన రాజ్యమేలేనాటికి యీ కులవ్యవస్థ లేదు. ఎవరికి యేపని నచ్చితే ఆపని చేసుకొనేవారు. పలానా కులం పలాన పని అనేంలేదు. ఇలా జరగడంతో కొన్నేళ్ళకు ఓ పెద్ద సాంఘిక సమస్యేర్పడింది.

 

శాంత:- ఏమిటది.

 

ప్రకా:- ఏంముంది అందరూ సులభమైన పనిమాత్రమే ఎన్నుకొని మిగతా పనులకు వెళ్ళేవాళ్ళు కారట. దంతో కొన్నిపనులు యెవరూ చేయకపోవటంతో చాలాయిబ్బంది కలిగింది. కనుక ఆ జనకమహారాజు యీ చిక్కును విడదీయటానికి  ఒక పథకం వేశాడట. అదేమంటేజనులందర్నీ కొన్ని గ్రూపులుగా విభజించి ఒక్కోగ్రూపుకు ఒక్కోపని అప్పగించివాళ్ళు ఆపనితప్ప వేరే పని చేయరాదని కట్టడి చేశారట.

 

గోపా:- ఇంకేముంది చచ్చినట్లు యెవరి పని వాళ్ళు చేసుకపోవడంతో అన్నిపనులూ సరిగ్గాసాగి యిబ్బంది తీరిపోయుంటుంది.

 

ప్రకా:- కరెక్ట్. ఇలాగే చాలాకాలం సాగింది. ఒకేపనిని ధ్యాసతో సంవత్సరాలతరబడి  చేయడంతో వాళ్ళకు పనిలో నైపుణ్యం పెరిగింది. దాంతో మాకు మేమేసాటి అని ఓపాటి గర్వం పెరిగింది పనివాళ్ళలో. అది కాస్తాముదిరిమాతెగంటే మాతెగ గొప్పదనుకోసాగారు మనుషులు. రానురానూ తెగలుగా వేరుపడిపోయితెగలమధ్య వివాహాలుకూడా ఆగిపోయాయి.

 

శాంత:- పెండ్లిండ్లు జేసుకుంటే వచ్చిన నష్టమేమిటీ?

 

ప్రకా:- ఏముందిఉదాహరణకు వ్యవసాయంవృత్తిగా గలవారి అమ్మాయిని నేతపనివారింటికిచ్చారనుకో యేమౌతుంది. ఆ అమ్మాయి అత్తవారింటి పనికి బొత్తిగా ఉపయోగపడదు. దారమతకలేదురాట్నంత్రిప్పలేదు. నేత అసలేరాదు. అంచేత ఉపయోగం లేని  వివాహలు క్రమేణా నిలిచిపోయాయి. రానురాను యిదే కులవ్యవస్థగా గట్టిగా నాటుకపోయింది. ఆఖరుకు వెనక్కు రాలేని పరిస్థితి యేర్పడింది.

 

శాంత:- ఇండస్ట్రియల్ డెవలప్‍మెంట్‍తో చాలా కులవృత్తులు పోయాయికదా! ఇప్పుడందరూ లాయర్లుడక్టర్లుఇంజనీర్లువ్యాపరస్తులైపోతున్నారు .. మరిప్పుడు యేఅమ్మయి యేయింట్లోనైనా యిట్టే ఇమిడిపోతుంది. మరి పెండ్లిండ్లలో ఇంకాయింత పట్టింపులెందుకూ?

 

ప్రకా:- అయినా కులంపట్టుమాత్రం వదల్లేదమ్మా. మొదట్లో సదుద్దేశంతో ప్రవేశపెట్టిన యీ వ్యవస్థే ఆఖరికి జాతికి పట్టిన పీడలామారిపోయింది. ఇందులో ఓటు రాజకీయాలుకూడా  జొరబడి మరీ జఠిలమైంది. ఇప్పుడు కులం అనకూడదమ్మాఅదితప్పుసామాజికవర్గం అనాలి. మనుషుల్ని విడదీసి అధికార దాహంతో రాజకీయపబ్బం గడుపుకోవడానికి పెట్టిన అందమైన పేరమ్మాయిది.

 

శాంత:- బాగుంది మామయ్యా మీసమాధానం. ఇది చాలా రీజనబుల్‍గా వుంది. ఈ మెష్ నుండి బయటపడాలంటేజనులు మేల్కొనాలి. మరోవిప్లవం రావాలి కాబోలు.

 

ప్రకా:- జనులు కులంమతం మత్తులో కూరుకపోయారు... విప్లవం... చూద్దాం కాలమే అన్నిటికీ పరిష్కారం చూపుతుంది.

 

గోపా:- నేజెప్పలేదామ్మా.. వీడసాధ్యుడని. వీడుజెప్పే కథకు మనల్ని తలాడించేలాజేస్తాడు.

 

ప్రకా:- ఎవరు తలాడించమన్నారురానమ్ముతేనమ్మూలేకపోతేపోనీఅంతేగదా!

 

శాంత:- లేదు మామయ్యా.. మీరు చెప్పినట్లే యీ వ్యవస్థ యేర్పడుండాలి. యూఆర్‍రైట్ అండ్ ఆల్వేజ్‍రైట్.

 

ప్రకా:- ఇకనేనొస్తారా.. మాటల్లోబడి చాలాపొద్దుబోయింది.

 

గోపా:- నీవుజేసే పెద్దపనేముందిరా అక్కడ. ఆదివారమేగా?  వెళుదువుగానీలే కూర్చో. అడగడం మరచిపోయా.. మన రఘు ప్రాక్టీస్ పెట్టాడుగదా!

 

ప్రకా:- అవున్రానేనుకూడా మొన్ననేవెళ్ళి మంచీచెడ్డా సూసొచ్చా.

 

గోపా:- ఎందుకురా.. ఆపల్లెకెళ్ళడం. భవిష్యత్తేముంటుంది అంటే విన్నారుకాదు. ఇక్కడ పోటీ నెదుర్కోవడం కష్టంపెద్దయీక్యూప్‍మెంట్మంచినర్సింగ్‍హోం లేకుండా ప్రాక్టీస్ సాగదనేగారఘును దిగులు పడొద్దని చెప్పు. మీగ్గాకుంటే సాయం యింకెవరికి జేయాల్రా నేను. రఘు టవున్‍కు రావాలనుకుంటే నాతో ఒకసారి కలవమను.

 

ప్రకా:- నీవుండగా మాకెండుకురా దిగులు. కానీవాడు రూరల్ లోనే ప్రాక్టీస్ చేస్తానంటున్నాడు. చూద్దాం. వాణ్నికాదనడమెందుకూఅవసరమైతే నీసాయం తప్పక తీసుకుంటాం. సరేనా?

 

గోపా:- మీ యిష్టంనాదగ్గరెలాంటి మొహమాటం పడొద్దు. అయినా రఘూనొకసారి చూడాలనుందిరా. ఈసారి నువ్వు ఊరికెళ్ళేటప్పుడు నేనూ నీవెంటొస్తా. మరిచిపోవద్దు.

 

ప్రకా:- అలాగే వెళదాంలేరా.. మావూరు నువ్వూ ఒకసారి చూసినట్లుంటుందివెళదాంలే.

 

శాంత:- మీరుగూడా పల్లెకే వెళ్ళిపోతారా మామయ్యా?

 

ప్రకా:- లేదమ్మా నాకుండే వ్యాసంగంయీ చిన్నవ్యాపారం అంతా సడన్‍గా క్లోజ్‍చెయ్యలేంగదా! ఒకటిరెండేళ్ళలో అన్నీ సెటిల్ జేసి తర్వత వెళతానమ్మా.(ఓహో అన్నట్లుశాంత తలవూపి యింట్లోకి వెళ్ళును)

 

గోపా:- అమ్మాయి అత్తవారింటికినువ్వు మీపల్లెకూ వెళ్ళిపోతే నేనెలారా యిక్కడుండేది. వంటరివాణ్నయిపోతానేమో.. భయమేస్తుంది.

 

ప్రకా:- నీకేంరా వెళ్ళూ నువ్వూ నీకూతురింటికే.

 

గొపా:- అంతేనంటావా?

 

ప్రకా:- లేకపోతే నావెంటరా మాపల్లె కెళదాం. అక్కడ చేలూచెఱువూచింతలతోపుల్లా కపటంలేని మనుషులూ హాయిగా కాలక్షేపంచేయొచ్చు.

 

గోపా:- భలేవాడివేయింకాసేపు నీతో మాట్లాడితే యేదో మంత్రం వేసి  నన్నిప్పుడే పట్టుకెళ్ళేట్లున్నావ్.

 

రఘు:- (వస్తూ) నాన్నా మీరూ ఇక్కడే వున్నారాఇంటికెళితే తాళంవేసివుంది. అయినా ఒకసారి రావుగారితో మాట్లాడి వద్దాంఅంతలో మీరూ వచ్చేస్తారులే అని యిలవచ్చా.

 

గోపా:- రండి డాక్టర్‍గారూ..రండి. కూర్చోండి. మిమ్మల్ని చూడాలనిపిస్తుందని అన్నా నిప్పుడే. అంతే మీరేవచ్చేశారు. మీకు నూరేళ్ళు.

 

రఘు:- అంతా మీ ఆశీర్వదం. బావున్నారా రావుగారు.

 

గోపా:- అంతా దేవునిదయ. బాగున్నామయ్యా.

 

రఘు:- ఇదిగోనండి డబ్బుతీసుకోండి. యేమనుకోకండి. కావలసినడబ్బు సర్దుబాటయింది,  మీడబ్బు మీకిద్దామనే వచ్చాను.

 

గోపా:- ఇంతతొందరగా?

 

రఘు:- ఏంలేదునేను వూరికెళ్ళేసరికి మనాన్న స్నేహితులుఅదే గోవిందస్వామిగారు లక్ష్మారెడ్డిగారు మరో ఇద్దరు వూరిపెద్దలు నాదగ్గరికొచ్చారు. వాళ్ళు నేను అక్కడే ఆసుపత్రి పెడుతున్నందుకు సంతోషించారు. అప్పటికప్పుడు తలాపాతికవేలిచ్చిమీనాన్న మా కంతాచెప్పాడుమీపరిస్థితీ మాకు బాగా తెలుసుమీరుచేసే ప్రతిపనికీ మాసాయం వుంటుంది. తీసుకోమన్నారు. డబ్బు సర్దుబాటైందిమీరిచ్చారనికూడా చెప్పా. అయితే యీడబ్బుతీసుకొని,  మీడబ్బు మీకియ్యమన్నారు. మావూరికి సాయం జేయడానికి ముందుకొచ్చి నందుకు  మీకు ధన్యవాదాలు చెప్పమన్నారు. ఈ డబ్బు తీసుకోండి. నాకెప్పుడు అవసరమైనా మిమ్మల్నొచ్చి కలుస్తాను.

 

ప్రకా:- సరే.. ఇప్పుడేమయిందిసర్దుబాటయిందిగా? తీసుకో.

 

గోపా:- అయితే నాడబ్బు యిలాకూడా మీ కుపయోగపడలేదన్నమాట.. సరే.. అవసరమైతే మాత్రం యేమాత్రం మొగమాట పడకండి.(డబ్బు తీసుకొని యింట్లోకి వెళ్ళును)

 

ప్రకా:- శాంత పెళ్ళి యింకా మూడురోజులుందికదా.. మళ్ళీవస్తావారఘు.

 

రఘు:- లేదు నాన్నగారూయిప్పుడైనా కొన్నిమందులు అత్యవసరమై వచ్చాను. దగ్గరుండి చూసుకోవలసిన కేసులున్నాయ్.

 

ప్రకా:- అంత అవసరమైతే యెవర్నైనా పంపక పోయావా?

 

రఘు:- అలాగే పంపాను. కానీ అవచ్చినవారు ఎక్స్‍పైర్డ్ మందులు తెచ్చాడు. ఆమందులషాపువాణ్ని మందలించికొత్తమందులు ప్యాక్‍చేయమనివచ్చా.

 

ప్రకా:-ఏం మనుషులోయేమో మనుషుల ప్రాణాలతోనే చెలగాటమాడతారు. అదిసరే.. మరి పెళ్ళికి రాలేనంటావ్.

 

రఘు:- వీలైతే వస్తాన్ నాన్నా. బహుశా నాకు వీలుపడకపోవచ్చు. గోపాల్‍రావుగార్ని యే మనుకోవద్దని చెప్పండి. మీరున్నరుగదా! యిక సరిపోతుందిలెండి . అంత అవసరమైతే చెప్పండి. వస్తాను.

 

ప్రకా:- అలగేలే. కానీ రఘూ ఆపెళ్ళికొడుకువాళ్ళుయేం మనుషులోయేమోగానీ. అదంటూ ఇదంటూ మన వానిదగ్గర బాగా గుంజారు. ఇప్పటికే ఓ రెండు లకారాలు దాటించేశారు.

 

రఘు:- అంతా డబ్బుప్రపంచం నాన్నా డబ్బుప్రపంచం. మరి మీరైనా కాస్తా బ్రేక్ వెయ్యాల్సింది. 

 

ప్రకా:- నాదాకా వస్తేగదా వ్యవహారంఇతగాడు అడిగీ అడక్కముందే డబ్బులిచ్చేస్తుంటేనేనేం జేయను. సరేగానీ యింటికెళ్ళి రెస్ట్ తీసుకోకాసేపట్లో నేనూ వచ్చేస్తాతర్వాత కలిసి భోంచేద్దాం.

 

 

 

లైట్స్ ఆఫ్ అండ్ ఆన్

 

(గోపాల్‍రావ్ దిగులుగా కూర్చొని వుంటాడు - ప్రకాశండా.రఘు వస్తారు)

 

ప్రకా:- ఏమిరా.. రాత్రి నిద్రపోలేదాకళ్ళు చింతనిప్పుల్లా యెర్ర బడ్డాయ్. మొగం వాచిపోయింది. యేమయింది. పెళ్ళి సలక్షణంగా జరిపించావ్. సాంప్రదాయం ప్రకారం అమ్మయిని అత్తవారింటికి పంపావ్. ఒక్కనివే వుంటావ్పలకరించి పోదామని వచ్చా.

 

రఘు:- యేమైంది రావ్‍గారు. ఆరోగ్యం బాగానే వుందిగదాఎందుకలావున్నారు?

 

గోపా:- ఒరే ప్రకాశం.. నాకొంప మునిగిందిరా.. నా బిడ్డ బ్రతుకు అన్యాయమై పోయిందిరా.

 

ప్రకా:- ఏమైంది శేఖర్‍కి?

 

గోపా:- వాడీకేమయింది. దిట్టంగావున్నాడుదుర్మార్గుడు.

 

ప్రకా:- అసలుసంగతేంటి చెప్పరా?

 

గోపా:- ఇదిగో అమ్మయి ఉత్తరం. చూడు. బంధువులుగదా మోసం చేస్తారా అనుకున్నా. అన్నీ అబద్దాలు చెప్పి  నా బిడ్డ గొంతు కోశారు. వాడొక త్రాగుడు బోతు. ఉద్యోగంలేదు పాడూలేదు. దానికితోడూ నాబిడ్డను గొడ్డును బాదినట్లు బాదుతున్నాడు.(ఏడ్చును)

 

ప్రకా:ఊరుకోరా.. గోపాలం ఊరుకో. ఇటువంటప్పుడే నిబ్బరంగా వుండాలి. నువ్వేం దిగులుపడకు. రాత్రికేనేను హైదరాబాద్ బయలుదేరుతాను. అన్నివిషయాలూ గమనించి తర్వాత యేంజేయాలో ఆలోచిద్దాం.

 

రఘు:- శాంతను ముందు పిలుచుకొని వచ్చేయండిఅతని విషయం తర్వత విచారిద్దాం.

 

ప్రకా:- చూద్దాం దేనికీ మనం తొందర పడకూడదు.

 

గోపా:- ఇదిగో యీ పదివేలూ తీసుకెళ్ళి ముందు అమ్మయికివ్వు. తిండితిప్పలకుకూడా నాబిడ్డ అలమటిస్తూందక్కడ.

 

ప్రకా:- (తీసుకొని) నువ్వు ధైర్యంగా వుండు నేజూసుకుంటానంతా..

 

లైట్స్ ఆఫ్ అండ్ ఆన్

 (ప్రకాశం చేతిలో జిప్‍బ్యాగ్ పట్టుకొనిశాంతను వెంటబెట్టికొని వస్తాడు. అప్పటికే గోపాల్‍రావ్ వాళ్ళకోసం యెదురుచూస్తూ వుంటాడు. అమ్మయిని చూడగానే శాంతా అంటూ బోరున యేడుస్తాడు.)

 

ప్రకా:- గోపాలం శాంతించు. నీవేయిలా బేలవై యేడిస్తేఅమ్మాయి పరిస్థితేంటి. కాస్తా నిబ్బరంగావుండు.(అని కూర్చోబెట్టి వీపుతట్టికన్నీరుకారుస్తూ సైలెంట్ గా నిలబడివున్న శాంత దగ్గరకువచ్చి బ్యాగ్‍జిబ్ తెరచి టిఫెన్‍పొట్లం తీసి యిచ్చి) వెళ్ళి స్నానంచేసి టిఫెన్‍చేసి విశ్రాంతి తీసుకోమ్మా. నేనున్నానుగాఅంతానాకొదిలేయ్. నేనుచూసుకుంటాను. నువెళ్ళమ్మా. (శాంత యింట్లోకెళ్ళుతుంది-ప్రకాశం గోపాల్‍రావ్ దగ్గరి కొచ్చి) అక్కడకెళ్ళి అంతా గమనించారా.. అమ్మయి నీకు ఉత్తరంలో రాసింది నిజమే. అయితే యేంచేద్దాం యెంతైనా అతడు నీ అల్లుడు.

 

గోపా:- అల్లుడా.. మాకుపట్టిన శనానాబిడ్డను నానా హింసలూ పెడుతున్నాడు. అమ్మయి యిక్కడే వుంటుందివాణ్ని నాగడప త్రొక్కనీను.

 

ప్రకా:- కాస్తా నిదానించుఅతనికి చెప్పల్సిన బుద్ధి చెప్పేవచ్చినా. దారికివచ్చాడా సరి లేకపోతే అప్పుడాలోచిద్దాం. నువ్వు అవేశానికి గురికావద్దు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు పెద్దలు. నువ్వే అన్నిటికీ దేవుడున్నాడు దేవుడున్నాడు అంటుంటావుగదా! ఆదేవునిపై భారం వేసి పరిస్థితులను ప్రశాంతంగా సరిదిద్దుకోవాలి మరి.

 

గోపా:- ఏమోరా.. నాకైతే యేమీ అర్థంకావడంలేదు. ఒక్కగా నొక్కబిడ్డ. భార్యపోయినా మళ్ళీపెళ్ళి ప్రసక్తే రాకుండా అల్లారుముద్దుగా పెంచుకున్నా. అదే సర్వస్వమనుకున్నా. దాని బ్రతుకిల తగలిడింది.(యేడ్చును).

 

ప్రకా:- నీవున్న పరిస్థితులలో యెవరైనా యిలాగే ఐపోతారు. నేనున్నానుగదాశాంత నాకూ బిడ్డలాంటిదే. ఆలోచిద్దాం. శాంతబ్రతుకు కుదుటబడే మార్గాలన్నీ చూద్దాం. చక్కదిద్దుదాం . ఆవేశంలో నువ్వు యేదేదో మాట్లాడి అమ్మయిని మరింత బాధపెట్టకు. అవైపువారితోనూ యేమీ మాటజారకు.

 

గోపా:- వానికెవరున్నారు. ఎవ్వరూ లేరని అమ్మయి రాసింది. వాడొక

 జు లాయి వెధవ. చేజేతులా నా బిడ్డను వానిచేతిలోబెట్టి యిప్పుడేడుస్తున్నాను.

 

ప్రకా:- సరే.. యేదియేమైనా అతన్ని యిఫ్ఫుడు వదులుకోలేంగదా?  యేదోవిధంగా దారికి తెచ్చుకోవాలి. వెళ్ళు. అమ్మయినోదార్చు. అమ్మయిముందు యెడ్వకు. వెళ్ళు.(గోపాల్‍రావ్ యింట్లోకి వెళ్ళూను-ఇంతలో మాసినగుడ్డలతో కాస్తా తూలుతూ శేఖర్ ప్రవేశించును)

 

శేఖర్:- (వచ్చి కూర్చొని) సారీ బాబాయ్సారీ.. యికమీదట నేను తాగను. మీరు చెప్పినట్లే వింటాను. నాభార్యను నావెంట పంపేట్లు వాళ్ళకు నచ్చజెప్పండి. నేను నా భార్యను తీసుకొని పోవాలి. మీరే యేదోఒకటి చెయ్యండి.

 

ప్రకా:- నువ్వేమిటిమేమిటురాగానే వెనకబస్సులో వచ్చేశావాఅందులోనూ మళ్ళీ తాగావ్. యిలానిన్ను చూస్తే శాంత జన్మలోదగ్గరికి రానివ్వదు. నాలుగు రోజులు ఆగమన్నానా?

 

శేఖర్:- లేదు బాబాయ్మా మామగారి కళ్ళపైబడి క్షమాపణ అడుగుతాను. శాంతను బ్రతిమలాడుకుంటాను. మీరు నావైపు మాట్లాడాలి. సర్దిచెప్పి నా భార్యను నావెంట పంపేట్లు చేయాలి. ఆంతే.

 

ప్రకా:- నీకు ఉద్యోగం సద్యోగం లేదు. నీదగ్గర డబ్బులూ లేవు. ఇంటిబాడుగ కట్టక నాలుగునెలలయింది. భార్యను పిలుచుకొనిపొయి యెలా పోషిస్తావ్. తిసుకెళ్ళి శాంతను కొడతావ్. వెళ్ళి మళ్ళీ మళ్ళీ వాళ్ళనాన్న దగ్గరనుండి డబ్బులు తెప్పించమంటావ్. ఇంతేగదా జరిగేది. వద్దు. ఇప్పుడు శాంత నీవెంటరాదు. పద మాయింటికి వెళదాం. రేపు మాట్లడుకొందాం.

 

శేఖర్:- లేదు బాబాయ్నేనిక్కడనుండి కదలను. నాభార్యను వెంటతీసుకొనే పోతాను. లేకుంటే వెళ్ళను.

 

ప్రకా:- శేఖర్ నామాటవిను. ఈ పరిస్థితుల్లో నిన్నుచూస్తేశాంత నీవెంట యిప్పుడుకాదుగదా. యింకెప్పుడూ రాదు. నాలుగునెలలు బుద్దిగా తాగుడు మాని మట్టంగావుండు. నీ తిండీ తిప్పలకు డబ్బు నేనిస్తాను. ఆతర్వత నీవెక్కడికీ పోనవసరం లేదు. మీ మామగారి బిజినెస్ చక్కగా చూసుకోచాలు అవిషయం ఆయనతో నేను మాట్లాడతాను. నువ్వు బాగుపడుసంతోషంగావుండు. మేమూ సంతోషిస్తాం. ముందు నువ్విక్కడనుండి పద.

 

శేఖర్:- సరేబాబాయ్.. మీరు డబ్బిస్తారుగదా! నేనువెళ్ళిపోతానుయికతాగనుమంచివాడినని నిరూపించుకుంటాను. అప్పుడు తిరిగొస్తాను. బుద్దిగా బిజినెస్ చూసుకొంటాను. నా శాంతానేనూ హయిగా యిక్కడే వుంటాం.

 

ప్రకా:- అంతకంటేనాసరే పద. మాయింటికి పోదాం. నీవువెళ్ళి గేటవతల వుండు. నేను గోపాల్‍రావ్‍గారితో ఒకమాట జెప్పి వస్తాను. ఇంటికి పోయి మిగిలిన విషయాలు మాట్లాడుకొందాం. పద. (శేఖర్ బయటికిప్రకాశం యింట్లోకి వెళతారు)

 

 

లైట్స్ ఆఫ్ అండ్ ఆన్

 

(గోపాల్‍రావ్ కూర్చొని వుంటాడు. ప్రక్కన త్రాగేసిన టీకప్ సాసర్ వుంటాయి)

 

శేఖర్:- (తాగివచ్చి) మామగారూ.. నమస్కారమండి. తప్పయిపోయిం దండి. యిదే ఆఖరు రోజండి  మీమీదొట్టుయిక తాగనండి. మీరు యీసారికి శాంతను  దయచేసి నావెంట పంపండి. పువ్వుల్లో బెట్టి చూసుకుంటానండి. నామాట నమ్మండి.

 

గోపా:- శేఖర్..నాకంతా తెలుసు..ప్రకాశం నాకు ఫోన్ చేసి చెప్పాడు.

 

శేఖర్:- ఆ ముసలాయన అంతాచెప్పెశాడూ.. యికనేనేంచెప్పేది. చెప్పేదేం లేదన్న మాట.

 

గోపా:- ప్రకాశం చెప్పినట్లు ఊరికెందుకెళ్ళలేదుసరే.. ఇప్పుడైనా వెళ్ళు. విషయాలేమైనా వుంటే తర్వాత మాట్ళాడుకుందాం. ముందు నువ్విక్కడి నుండి వెళ్ళిపో.

 

శేకర్:- (చిరాగ్గా) ఎలాగండీ వెళ్ళేది. ఆయన చార్జీ కిచ్చి నువ్వెళ్ళూ.. నేను ఒకటిరెండు రోజుల్లో వచ్చి నీ భోజనని కేర్పటు చేస్తానుయింటి బాడుగ కడతానూ బుద్ధిగా వుండూ అన్నాడండి. ఆయనొచ్చి నాకు మెస్‍లో డబ్బుకట్టి భోజనానికీ టిఫెన్‍కీ టికెట్లిప్పిస్తాడండి. సరిపోతుందా?

 

గోపా:- సరే టీకాఫీఆటోబస్‍చర్జీలకుకూడా పాకెట్ మనీ యిస్తాడులేనువ్వెళ్ళు.

 

శేఖర్:- వెళ్ళూ వెళ్ళూ.. అంటే యెలాగండి వెళ్ళేది. అయనిచ్చిన బస్చార్జీ యిదిగో దీనికైపోయిందండి (అని మందు సగానికున్న బాటల్ జుబ్బా జోబులోంచి దీసి టేబుల్ మీద పెడతాడు) యింకెలాగండి వెళ్ళేది. శాంతా..శాంతా.. ఏయ్ శాంతా..(గట్టిగా పిలుస్తాడు శాంత వస్తుంది) వచ్చావావెళ్ళి సోడా పట్రా.

 

శాంత:- (టెబుల్‍పైనున్న కప్‍సాసర్ తీసుకొంటూ) మీరెప్పుడొచ్చారూఅసలెందుకొచ్చరూ (అసహ్యించుకుంటుంది)

 

శేఖర్ :- నేను నీ మొగుణ్నేమీనాయనకు అల్లుణ్ని. అల్లుడు మమగారింటికొస్తే యెందుకొచ్చానంటావ్ యూ ఫూల్ (లేచి ఒకదెబ్బ వేయబోతాడు-శాంతా తప్పించుకొంటుంది)

 

గోపా:-(శేఖర్ని వెనక్కు లగి) శేఖర్.. (గట్టిగా అరచి మళ్ళీ తన్నుతానుసమాలించుకొంటాడు)

 

శేఖర్:- శాంతా.. వెళ్ళి సోడా తీసుకరా.. చెప్పియెంతసేపయిందీ..

 

శాంత:- సోడాలింట్లో లేవు. నేనునీకు మంచినీళ్ళుకూడా యివ్వను. ముందిక్కడనుంచి వెళ్ళిపో.

 

శేఖర్:- సరే అయితే రా గొట్టాల్సిందేనన్నమాట. (అంటూ గబుక్కున గోపాల్‍రావ్ జేబులోనుంచి మనీపాకెట్ లాగేసుకొని అందులోని రెండువేలు తీసుకొనిపాకెట్ టేబుల్ మీద పడేసి) నువ్వేం షావుకా రయ్యాఅఫ్ట్రాల్ రెండువేలాజేబులోపెట్టుకొనేది. సరే చాల్లేరాలిన కాడికి గొవిందా.

 

గోపా:- శేఖర్ నేను సహించేకొద్దీ మితిమీరి పోతున్నావ్. ఇకలాభంలేదుపోలిసులకు ఫోన్ చెస్తాను. వాళ్ళొచ్చి నాలుగు తగిలిస్తేనేగానీ సరిపోదు. (టెబుల్‍పైనుండే సెల్ఫోన్  అందుకుంటాడు)

 

శేఖర్:- వద్దులేండి మామాగారూ వద్దులెండి వెళ్ళిపోతనూయీ రెండువేలూ ఖర్చులకు సరిపోతాయి  యింకోవెయ్యి చార్జీకివ్వండి. ఇప్పుడే వెళ్ళిపోతాను. పొలీసులదాక యెందుకులెండి.

 

గోపా:- నీ చేతికి యింగొక్క పైసాకూడా యివ్వను. వెళ్ళు. దివ్యాట్రావెల్స్‍కు ఫోన్ చెస్తానుబస్‍లో వెళ్ళిపో.

 

శేఖర్:- సరే.. నీపేరు చెబితే బస్సెక్కచ్చుగదా! ఇకవెళతాను.. యికమిరేం వర్రీ కాకండి.. టాటా బైబై యింకసెలనూ..(అంటూ టేబుల్ పైనుండే బాటాల్ తీసుకొనితాగుతూ తూలుతూ వెళ్ళిపోతాడు)

 

గోపా:- (సెల్ఫోన్‍లో) హలో దివ్యాట్రావెల్స్అరెరె నువ్వా చిదంబరం. ఏంలేదునేనిఫ్ఫుడే డబ్బు పంపుతున్నాశేఖర్ పేరుతో హైదరాబద్‍కు ఒక సీట్ పెట్టు..(మాట్లడుతూ వుంటాడు)

 

 

లైట్స్ ఆఫ్ అండ్ ఆన్

 

(గోపాల్‍రావ్ కూర్చొని వుంటాడు. ప్రకాశంరఘు వస్తారు)

 

 గోపా:-రారా ప్రకాశం.. ఆలోచించి ఆలోచించి తల బొప్పిగట్టింది. బుర్ర పనిచేయడంలేదు.  మీరే నాకేదైనా దారిచూపించాలి. రఘు కూడా వచ్చాడు. మంచిదయింది. కూర్చోండి.

 

ప్రకా:- నేనూ నా శయశక్తులా ప్రయత్నించానుఅనేకవిధాలా నచ్చజెప్పాను. లాభంలేదు. అతను ఒకమాటమీద నిలబడటం లేదు. త్రాగుడు మాన్పించటం  మనవల్లకాలేదు.

 

రఘు- తాగుడు మాన్పించవచ్చు నాన్నగారు. కానీ అందుకతడు సహకరించాలి. ముందు మానాలాలనే వుద్దేశ్యం  అతనికుండాలి. అప్పుడు వైద్యరీత్యా ప్రయత్నించవచ్చు. మర్గాలైతే వున్నాయ్.

 

గోపా:- వాడు మనకు యేవిధంగానూ సహకరించడు. వాడిమీద నాకేఆశా లేదురా ప్రకాశం.

 

ప్రకాశం:- మనకిష్టంలేకపోయినాయిక ఆఖరి మార్గం ఒకటేవుంది.

 

గోపా:- ఏంటదివీడాకులేనా?

 

రఘు:- అదికూడా అంత సులువేంకాదు రావుగారు.. కోర్ట్స్ వాయిదాలమీద వాయిదాలు వేయడమేగాకుండాజవాబుచెప్పుకోలేని అనేక ప్రశ్నలు వేస్తారు.

 

గోపా:- కానీ యేంచేద్దాం. తప్పదుమరి. ఇక వేరే మార్గం నాకైతే కనిపించడంలేదు.

 

ప్రకా:- నీ మాటప్రకారం వీడాకులే తీసుకుందాం. కానీ యింతచిన్న వయసులో అమ్మాయికి వీడాకులాఎందుకో నాకు మనసంగీకరించడంలేదురా.. ముఖ్యంగా యిది నా ఫైల్యూర్ అనిపిస్తూవుందిరా..

 

గోపా:- ఇందులో నీవు ఫైలైందేమీలేదు. నాతెలివి తక్కువదనం ప్రదర్శించ కుండా అబ్బాయిని నిన్నే చూడమని నేనూరకుండివుంటే నాకీ కష్టాలే వచ్చుండేటివికాదు.

 

ప్రకా:- సరే.. అయిందేదో అయింది.. మరి వీడాకుల తర్వాత మాటేమిటీ?

 

గోపా:- మళ్ళీ పెళ్ళి చెయుచ్చురా .. డబ్బుకాశపడి ముందుకొచ్చేవాడూ వుంటాడు. కానీ అలాంటిసంబంధాలు యింతకంటే యికా ఘోరంగా వుంటాయిరా.

 

ప్రకా:- అమ్మాయి అదృష్టం. కాస్తా అభ్యుదయమార్గంలో ఆలోచించే వారూ లోకంలో లేకపోలేదు. అయినా అది యిప్పుడాలోచించాల్సిన విషయంకాదు. తర్వాతచూద్దాం. అసలు వీడాకుల విషయం అమ్మయి నీతో యేమైనా అనిందా.

 

గోపా:- అనకేం అసలు యీ విషయం అమ్మయే ముందు ప్రస్తావించింది. ముందు వాని చెరనుండి విడిపించమని గోడుగోడున యేడ్చింది. (ఇంతలో సెల్‍ఫోన్ మ్రోగుతుంది- ఆన్‍చేసి) హాలో.. ఆఁ  (క్రిందపడిపోబోవును రఘు పట్టుకొనును-ప్రకాశం ఫోన్ అందుకొని)

 

ప్రకా:- హలో నేనాయన ఫ్రేండ్‍నిప్రకాశాన్ని. ఆఁ.. ఆఁ.. యెలాజరిగింది. ఆఁ.. ఆఁ.. గోపాల్‍రావ్ గారికేం పరవాలేదుడాక్టర్ యిక్కడే వున్నారు. ఆఁ..  లేదు లేదు వారు రావడం కంటే నేనే రావడంమంచిది. ఆఁ..  ఎందుకూ ప్రొద్దునికొచ్చేస్తాను.(ఫోన్ ‍ఆఫ్ చేసి) ఎలావుంది రఘు.

 

రఘు:- పర్వాలేదు. కాస్తా టెన్‍షన్‍కు గురయ్యారు. విషయమేమిటి.

 

ప్రకా:- శేఖర్ చనిపోయాడు.

 

రఘు:- వాట్ శేఖర్ చనిపోయాడా?

 

ప్రకా:- యాక్సిడెంట్. విపరీతంగా తాగి రోడ్డు మధ్యన పడిపోయాడట. అంతలో బస్సు వచ్చి తొక్కేసిందట.

 

రఘు:-పూర్‍ఫెలో పండంటి జీవితం పాడుచేసుకొన్నాడు. ఎన్ని మంచి అవకాశాలు కల్పించినా ఉపయోగపెట్టుకోలేక పోయాడు. నాన్నగారూ మీరెల్లి టాక్సీ తీసుకరండి గోపాల్‍రావ్ గార్ని మనింటికి తీసుకెళతాను. అక్కడ మందులూ ఈక్విప్మెంట్ ఉన్నాయి. మీరు నిదానంగా విషయంచెప్పి శాంతను కూడా అక్కడికే తీసుకరండి.

 

ప్రకా:- అలగే.. ముందు టాక్సీతీసుకొస్తాను. (బయలు దేరును)

 

 

లైట్స్ ఆఫ్ ఆండ్ ఆన్

 

(రఘు ప్రవేసించి కాలింగ్ బెల్ నొక్కుతాడు)

 

శాంత:- (బయటకువచ్చి) మీరా డాక్టర్‍గారూ మానాన్నగారు యింట్లో లేరు. బయటికెళ్ళారు. ఏమైనా చెప్పలా?

 

రఘు:- నేను నీ కోసమేవచ్చాను శాంతా... రండి అలా కూర్చొని మాట్లాడుకొందాం. (లాన్‍లోని కుర్చీవైపు కదులును-వెంట శాంత కూడా వస్తూ)

 

శాంత:- నాకోసం వచ్చారానేను బాగానే వున్నాను డాక్టర్‍గారూ..

 

రఘు:- ఏంబావున్నావ్ శాంతా! నీవాలకం చూస్తూనే తెలుస్తూంది నీవెంత నీరసించావోమానసికంగా యెంత కృంగిపోయావో? (ఇద్దరూ కూర్చుందురు)

 

శాంత:- మనసుకు కూడా మందులిస్తారా మీరు.

 

రఘు:- యిస్తాను శాంతా. తప్పక యిస్తాను. నా హృదయంలో నీకు స్థానమిచ్చి ట్రీట్ చేస్తాను..నేను నిన్ను పెండ్లి చేసుకుంటాను శాంతా.

 

శాంత:- రఘుగారూ.. మీరు..

 

రఘు:- ఔను శాంతా.. నేను యింత నేరుగా అడుగుతున్నందుకు క్షమించండి. నాకు యెలా మాట్లాడాలో తెలీదు. అన్యధా భావించకండి. నన్ను కాదనడానికి కారణముంటే చెప్పండి. లేదు లేదు కారణం చెప్పక్కరలేదువద్దంటే చెప్పండి వెళ్ళిపోతాను. మళ్ళీ యెప్పుడూ మిమ్మల్ని విసిగించను. (లేవబోవును)

 

శాంత:- రఘుగారూ ఆగండి. ఒకనిమిషమాలోచించండి. మా మీద జాలితో యెంతటి త్యాగానికైన సిద్దమౌతారా! 

 

రఘు:- లేదు శాంతా. నీతోకలిసీ నా జీవితం సఫలంజేసుకొంటాను. నీ మీద జాలితోకాదు శాంతనేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నానుఆరాదిస్తున్నాను. అయినాసరే.. మీకు నచ్చకపోతే చెప్పండి మళ్ళీ యీవైపుకు కూడారాను. మీరు ప్రాక్టికల్‍గా ఆలోచించిచూడండి. నా ప్రపోసల్ కాదనలేరు.

 

శాంత:- డాక్టర్‍గారూ..మీరు నామీద జాలితోనే యీనిర్ణయానికొచ్చారు. మీ మంచితనాన్ని మా స్వార్థానికి బలిచేయడం న్యాయమనిపించడంలేదు.

 

రఘు:- లేదు శాంతా.. నిజంగా నిన్ను నేను మనస్పూర్తిగా  ప్రేమిస్తున్నాను. మీమీద జాలిలేదనలేనుగానీకేవలం జాలితోనే నిన్నునేను కోరుకోవడం లేదు. నీ జతలో నాజీవితం పండించుకోవాలనే ఆశతోనే నేనీ ప్రపోసల్ మీముందుంచాను. (ఇంతలో గోపాల్‍రావ్ వచ్చి వెనకే నిలబడిపోతాడు)

 

శాంత:- నిజంగా మీకు నామీద ప్రేమేవుంటే. పెండ్లికి ముందే నన్నీమాట యెందుకడగలేక పోయారు?

 

రఘు:- అదినావివశత. మీ నాన్నగారి ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తించలేని అశక్తత. శాంతా! నాప్రేమను నా మనసులోనే అణచుకొని బాధపడ్డాను. నాయిష్టం చెబితే యెక్కడ మీ నాన్న మానాన్నను అపార్థం చేసుకొని నావల్ల యిద్దరు మంచి స్నేహితులు విడిపోతారోననీఅలా వారి స్నేహం చెడిపోవడం యిష్టంలేక మౌనంగా వుండిపోయాను. నా ప్రేమకంటే వారి స్నేహమే ముఖ్యమనుకున్నాను. 

 

గోపా:- (ముందుకు వచ్చి) బాబు రఘూ..

 

రఘు:- నమస్కారం రావుగారు.. నేనూ...

 

గోపా:- అంతావిన్నాను బాబూ విన్నాను.  అమ్మా.. శాంతా నువ్వు దురదృష్ట వంతురాలివి కాదమ్మా.. అదృష్టవంతురాలివి. ఇప్పటికే వీళ్ళను అర్థంచేసుకోలేక మూర్ఖతతో చాలానష్టపోయాం తల్లీ. వీళ్ళు మనుషులు కాదు తల్లీ మనపాలిటి దేవుళ్ళు. నిజంగా దేవుళ్ళు.

 

రఘు:- అంతమాటానకండి మామయ్యా. వస్తాను. శాంతా వస్తాను. ఈ విషయాలు మానాన్నగారు మాట్లాడితేనే బాగుంటుంది. మీరు సరేనంటే నాన్నగారు రేపుదయం వచ్చి మట్లాడతారు. ఒక్కమాట పెండ్లి సింపుల్ గా జరిపించడం మంచిది. ఇది నా అభిప్రాయం. ఆపై మీయిష్టం.

 

గొపా:- అలగే బాబు. ఇక మీయిష్టమే మాయిష్టం.

 

 

 

లైట్స్ ఆఫ్ అండ్ ఆన్

 

(గోపాల్‍రావ్ సంతోషంగా లాన్‍లో వాకింగ్ చేస్తూ వుండును)

 

ప్రకా:- (వచ్చి) ఇదిగోరా.. నీ అల్లుని ఉత్తరంపల్లెలో గాంధీజీ పేరుమీద హైస్కూలు కట్టించారు. గ్రంథాలయం పెట్టించారట. మాకోడలు శాంత వయోజనవిద్యామందిరం స్థాపించి రాత్రిబడి నడిపి ఊరి జనానికి గురువై పోయిందనుకో. ఊళ్ళొ మన శాంత మాటే వేదమట.

 

గోపా:- పరుసవేది దేనికి తగిలితే అది బంగరైపోతుందోయ్.

 

ప్రకా:- అంటే?

 

గోపా:- ఇంకేముందీ మీరు అడుగుపెట్టినవూరు బంగారం. మీయిల్లు మెట్టిన నాబిడ్డ బంగారం.

 

ప్రకా:- మతో సహవాసం చెసిన నీ మనసూ బంగరమేలేవోయ్. ఇక పదరా ఇక్కడ మనకేం పనివెళ్ళి పల్లె జేరుకుందాం. ప్లాన్‍జెయ్యి. పల్లెకుపోదాం శాంతను జూద్దాం చలోచలో.. (ఇద్దరూ నవ్వుకొందురు)

 

 

సమాప్తమ్

 

No comments:

Post a Comment

నాకు చదువురాదు, Naaku Chaduvu Raadu

  నాకు   చదువు   రాదు ( ఏకపాత్రభినయము )     (పాత్ర: ఓ 50 సంవత్సరాల  పేద పెద్దమనిషి ) అమ్మా!  శారదా ... ( బోరున   యేడ్చును ).  తల్లీ   యీ   గ...