గండికోట చరిత్ర
[సంక్షిప్త రూపకం]
రచన : పి.సుబ్బరాయుడు. కడప.

ప్రచురణ

Kadapa Chapter
Neknam Kalakshetram, Kadapa-516001.
ఇందలి పాత్రలు
1.కాకరాజు..రాజప్రతినిధి
2.సైనికుడు..
3.తిమ్మరాజు...రాజు
4మంత్రి
5.బంగారుతిమ్మరాజు...రాజు
6.అలియరామరాజు
7.సకలంచినతిరుమలరాజు..రాజు
8.మీర్జుమ్లా..సైనికాధికారి
8.పొదిలి లింగన్న...మంత్రి
10.మెయిలె...ఫిరంగితయారీదారు
11.సమీరా...నాట్యకత్తె
12.వ్యాఖ్యాత.
గండికోట చరిత్ర
[సంక్షిప్త రూపకం]
వ్యాఖ్యాత.
అది 12 వ శతాబ్దము నాటి,ములికినాడు,అనగా నేటి కమలాపురం
యర్రగుంట్ల,ముద్దనూరు,వేముల,వేంపల్లి,వీరపునాయునిపల్లి,తొండూరు,సింహాద్రీపురం,పులివెందుల జ్కమ్మలమడుగు
మొదలగు మండలాలు కలిసిన భూమి.కళ్యాణచాళుక్య వంశజులైన ఒకటవ అహ్యమలసోమేశ్వర మహారాజు పరిపాలిస్తున్న కాలమది. తనరాజప్రతినిధియైన కాకరాజు, ఇప్పటి యీ గండికోట వున్న ప్ర్రాంతాన్ని పరిశీలించి శోధించి కోటనిర్మామాణమునకున్న అవకాశాన్ని అంచనా వేస్తున్నడు---
మొదటి సన్నివేశం
సైనికుడు:-అయ్యా కాకరాజుగారు తమరు యీప్రాంతంలో కోట నిర్మించే అవకాశం కోసం రాజుగారి ఆనకు బద్దులైమమ్ముల్ని వెంట గొనిపరి వచ్చి రేయింబవళ్ళు పరిశీలీస్తున్నారు. నెలలు గడచి పోయాయి. కానీఅనువైన ప్రదేశం లభించలేదు.సంక్రాంతి దగ్గర కొస్తున్నది.చలి విపరీతంగా వుంది. ఇకచాలు వెనక్కువెళదాం పదండి. అవసరమనిపిస్తే మళ్ళీవద్దాం. ముందు ఇంటికి వెళ్ళి పండుగ చేసుకొందాం.
కాకరాజు -(వింటూనడుస్తూ)నీవుచెప్పిందీ నిజమే చెంచయ్యా...ఇక తిరిగి వెళ్ళాల్సిందే.వెళదాం..కానీ యీఒక్కరోజూవుందాం.ఈరోజు వేటకు వెళదాం. మన సైనికులిన్ని తీసుకురా-ఇక్కడ బాగాబలిసిన అడవిపందు లులున్నాయి . వేటాడి ఈసాయంత్రం విందు చేసు కొందాం.రేపు వెళ్ళిపోదాం.సరేనా?
సైనికుడు:-మంచిది...అలాగే సైనికులను సమాయత్తం చేసుకొస్తాను (వెళ్ళును)
కాకరాజు-(పంది అలికిడి విని కుడివైపు చూసి) అరే! అనుకున్నానో లేదో అప్పుడే పంది అలికిడి..ఆ(..ఆపొదలచాటున కాబోలు..సరి.. ఈ ఈటెతోవేసెద(అని ఈటెపైకెత్తును ఆశ్చర్యంనటిస్తూ)..అరెరే.. చిత్రంగా వుందే..తెల్లటిపంది పొదనుండి బయటకువచ్చినది. వరాహాలు ఇంత తెల్లగా కూడావుంటాయా? ఏమోచూదాం. (ఈటెదించిమున్డుకు పోయీ చూపుసారించి)కానరాదే! ఎలా పోయిందబ్బా(అని పరిశీలనగా చూస్తూవుండగా యెదురుగా ఒకశ్వేతవరాహం వచ్చినిలబడి కాకరాజూ-అని పిలిచింది.(పందిని ఊహించుకున్నా పరవాలేదు).
వరాహం:-కాకరాజూ-నేను..నేను..శ్వేతవరాహరూపముననున్న మహావిష్ణువును.(కాకరాజు ఆవైపునకు ఒకడుగు వేయును) ఆగూ..విను..ఇదే మీరాజు కోట నిర్మించుటకు అనువైన ప్రదేశం. కోట నిర్మించండి.నేను నీకు దర్శన మిచ్చినయిచ్చోట వైష్ణవాలయం నిర్మించండి,హైందవ సామ్రాజ్యం విస్తరింపజేయండి.
కాకరాజు:-ఆ(..ఏదీ వరాహం.కానరాదే..చిత్రంగాఉంది.ఇది నిజంగాదైవవాక్కు. కాదుకాదుదైవాజ్ఞ.ఇదే కోటనిర్మాణానికి తగినచోటు.శ్రీహరిదయచేత నా అన్వేషణ ఫలించింది..నమోనమః.(ఇంతలో సైనికుడు వస్తాడు)
సైనికుడు:-కాకరాజుగారూ యింకాఇక్కాడేవున్నారా...రండె..రండె మీపటమందిరం దగ్గర మీకోసం సైనికులు వేచియున్నారు. వేటకువెళ్ళాలన్నారుకదా!..రండిపోదం.
కాకరాజు:- చెంచన్నా..మన అన్వేషణ ఫలించిందయ్యా.. ఇదిగో.. ఇదేకోటనిర్మానానికి తగిన చోటు.శ్రీహరి శ్వేతవరాహరూపమున దర్శనమిచ్చి యీస్థలం చూపించి అదృశ్యమయ్యాడు-ఇక వేటాగీటా యేమీ వద్దు.వెళ్ళిపూజాద్రవ్యాలు సిద్దంచేయ్. ఇప్పుడే భూమిపూజ చేద్దాం. స్వామిదర్శనమిచ్చిన యిదే శుభముహూర్తం,వెళ్ళు (వెళ్ళుతున్న సైనికునిఖడ్గం అతని ఒరనుండి తీసుకొని భూమిపై నున్న చెట్లు చేమలు, కంపాకసువూ తనే శుభ్రంచేస్తున్నట్లు నటి స్తా డు)ఇంతలో సైనికుడు పూజాసామాగ్రి దొరికినమటుకు తెస్తాడు. కాకరజు ఒకశిలను నిలిపి పూజచేసి మ్రొక్కుతాడు,సైనికుడూ మ్రొక్కుతాడు
(తెరపడును)
వ్యాఖ్యాత
అలా ఆప్రదేశంలో క్రీ.శ.1123 లో మట్టికోట నిర్మిత మైంది ఆ తర్వాత యీ కోటను కాకతీయులు..అటుపిమ్మట విజయనగర రాజులు పాలిం చారు. క్రీ.శ1420 లో ప్రౌఢదేవరాయలు కలుబరైజ్ యుద్దం గెలిచాడు. తన విజయానికి యెంతగానోసహాయపడిన సేనాపతి తిమ్మనాయుడిని మెచ్చి ప్రౌఢదేవరాయలు గుత్తికోటను తిమ్మనాయునికి కాన్కగాయిచ్చాడు
రెండవ సన్నివేశం
తిమ్మనాయుడు:-(సింహాసనంపై కూర్చొని)మహామాత్యా ప్రౌఢ దేవరాయులు మహోదారుడు.గుత్తికోట,గండికోటలకు నన్నేలికగాజేసి,నాపైశత్రురాజులు కన్నెత్తియైనా చూడకుండా సైనికరక్షణ కల్పించినారు.
మంత్రి:-అవును మహారాజా!మీవంటి పరాక్రమశాలిని గుర్తించి మీకు సముచిత గౌరవమిచ్చినారు,విజయనగరాధిపులు.ఇది వారి వివేకమునకు తార్కాణము.
తిమ్మరాజు:-మంత్రివర్యా నిజానికి మేము పెమ్మసాని నాయకరాజ వంశీయులము.మాపూర్వికులు కాకతీయ మహారాజులకు సైనికులు గాపనిచేసినారు వారు మహాపరాక్రమవంతులని పేరుగడించినారు. కాలవైప రీ త్యము,కాకతీయుల పతనా నంతరము మావారు విజయనగరము వలస వచ్చినారు. విజయనగరరాజులు మావారి శౌర్యపరాక్రమములను మెచ్చి ఆదరించినారు.
మంత్రి:-ఆదరించినవారికి అన్నివిధముల సహకరించి కీర్తిమంతులై విజయనగరాధీశుల ఆదరణతో ఇప్పుడు మీరు గుత్తి మరియు గండికోటాధీశులుగా వెలుగొందుతున్నరు.
తిమ్మరాజు:-మహామంత్రీ..గతం మరచిపోయి,రాజ్యలక్ష్మి లభించె గదాయని విర్రవీగడం మాకు నచ్చదు,మాకు లభించిన యీ సదవకాశమును సద్వినియోగపరచుకొని ప్రజలకు వీలైనంత మేలు చేయాలన్నదే మా ఆకాంక్ష.
మంత్రి:-మహారాజా తమరు ధర్మాత్ములు.కనుకనే యీవిధంగా ఆలోచిస్తున్నారు విజయనగరపాలకుల యేలుబడిలో మనము సామంతులము,వారి చట్టములే మనమూ చాలావరకు మనప్రజలపై అమలు చేస్తున్నాము.వీటిలో పన్నుల విషయమై మనం కాస్తా ఆలోచించాలిప్రభూ.
తిమ్మరాజు:-ఏపన్నులు..
మంత్రి:-కొన్నిపన్నులు ప్రజలకు భారమౌతున్నాయి పభూ. . అందులోముఖ్యంగా పెళ్ళిపన్ను దానినుండి తమరు ప్రజలను విముక్తులనుజేయాలి.ఇది ప్రజలతరపున నా ప్రత్యేకవిన్నపము.
తిమ్మరాజు:-అవశ్యము.ఇప్పుడు దైవకృపవల్ల మన ప్రాంతము సుభిక్షముగ నున్నది. ధనధాన్యాగారములు నిండుగానున్నవి. కొరతలేదు.ప్రజలను పీడించు పెళ్ళిపన్ను నేటితోరద్దు చేస్తున్నాను. భారమని ప్రజలు తలంచిన యేపన్నూ నేను విధించను.మిగిలిన వాటి విషయమై ఒక నివేదిక తయారుచేసుకొని రండు.పరిశీలింతము.
మంత్రి:-సంతోషము-రాజ్యపరిపాలనకు పన్నులవసరమే,కానీ అవి తుమ్మెదలు పూలనుండి మకరందము గ్రహించి నట్లుండవలె గానీ , పువ్వులను గోటితో గిల్లి బాధించినట్లుండరాదు.తమరు ప్రజానురంజకు లైన పాలకులని మరొకసారి నిరూపించు కున్నారు.మీకు శూభమగుగాక!
తిమ్మరాజు:-మహామంత్రీ..కోటపాతదై బీటలువారుచున్నది. రక్షణ విషయమున అజాగ్రత్త పనికిరాదు.ధనము సమృద్ధిగానున్నది.బలగము కావలసినంతున్నది మనము రాతికోటను నీటికోనేరును నిర్మింతుము.. మీరేమందురు.
మంత్రి:-చక్కని ని ర్ణ యము.పజలునూ సంతసింతురు.శుభశ్యశీఘ్రం.మంచిముహూర్తముచూచి పనులు ప్రారంభిస్తాం మహారాజా...సెలవు.
(తెరపడును)
వ్యాఖ్యాత
అలా తిమ్మరాజు ఇప్పుడు కనబడుతున్న యీ రాతికోటను, మాధవరాయ కోవెలను శివాలయాన్ని కూడా నిర్మించి ప్రజల ప్రతినమ్మకన్నీ గౌరవించాడు. ఆరాజు నిర్మించిన కోనేరులోని నీరుశత్రురాజుల తలలు నరికినకత్తులు కడుగుటవల్ల యెర్రగా మారినవని ప్రతీతి. ఆతర్వత యీకోటను క్రీ.శ.1509నుండి1530 వరకు రామలింగనాయుడు పాలించాడు. ఈతడు శ్రీకృష్ణదేవ రాయల సేనాపతిగా పనిచేసి రాయచూరు గుల్బర్గా యుద్ధాలు గెలిచాడు తాడిపత్రిలోని చింతలరాయునిదేవళం, బుగ్గరామ లింగేశ్వర ఆలయాలు నిర్మించాడు. కృష్ణరాయలకాలం రామలింగ నాయుని కాలం గడచిపోయింది. క్రీ.శ.1530 లో బంగారు తిమ్మనాయుడు గండికోట పాలకుడయ్యాడు. విజయ నగర ప్రాభవం తరుగజొచ్చింది అంతర్యుద్ధాలతో అట్టుడికిపోయింది. బహమనీ సుల్తానులతో చేయికలిపి ఆధిక్యంచూపి సకలం చినతిరుమలరాజు రాయల సింహాసన మధిష్ఠించాడు. అలియ రామరాయలు పరారై గండికోటలో బంగారుతిమ్మనాయుని శరణుజొచ్చాడు.
మూడవ సన్నివేశం
బంగారుతిమ్మనాయుడు:-(అలియరామరాయల వైపు జూచి) రాయలవారూ..మీరు భయపడకండి..ఇక్కడ మీ కేవిధమైన ఆపదా సంభవించదు. కాలం తమరికి కలసిరాలేదు.చింతించ కండి. చూద్దాం. ఆ సకలంచినతిరుమలరాజు ఇక్కడేనన్ను కలుసుకొని యేదో సంధివిషయం మాట్లాడతానన్నాడు. రానివ్వండి చూద్దాం. అతనితో చర్చ మీకు మేలే చేకూర్చ వచ్చు.
అలియరామరాజు:-లేదు తిమ్మనయుడుగారు..అతడునన్ను మీ వద్దనుండి బెదిరించి పట్టుకపోయిశిక్షించటానికే యీప్రయత్నము చేయుచున్నడు.
బంగారు:-అలాయేనాటికీ జరుగదు.నాకంఠంలో ప్రాణముండగా మిమ్ములను వాని కప్పగించను.మీరు నిర్భయంగా వుండండి.
అలియరామ:-వాడు అతిమాటకారి,మోసకారి,మాటలతో మిమ్ము తికమకపెట్టి నన్ను పట్టుకపోగలడు.
బంగారు:-తమరిక్కడే నిర్భయంగా కూర్చోండి వాడు మిమ్ముల నేమీ చేయలేడు. రానివ్వండతన్ని.యేంజరుగతుందో మేరే చూద్దురుగానీ.
అలియరామ:-అలాగే మీరుచెప్పినట్లే ఇక్కడే కూర్చుంటాను.
(బయటనుండి-- విజయనగర సామ్రాజ్యాధీశులు... శ్రీశ్రీశ్రీసకలం చినతిరుమలరాజుగారు తమదర్శనమభిలషిస్తున్నారు ప్రభూ..)
బంగారు:- అనుమతిస్తున్నామ్.వారికి మా స్వాగతం పలకండి
(సకలంచినతిరుమలరాజు ప్రవేశం)(లేచి) చినతిరుమల రాజు
గారూ నమస్కారం. దయచేయండి. ఆసనంగ్రహించండి. పనిచాలా గంభీరమైనదే అయివుండాలి, లేకపోతేసాక్షాత్తూ విజయనగరప్రభువులే కదిలిరారుగదా!
సకలం:-నమస్కారం. నీకు తెలియదా తిమ్మరాజూ..సమంతుడవైన నీవు మా శత్రువు రామరాజునకాశ్రయమిచ్చి మళ్ళీ విషయమేమని నన్నే అడుగు తున్నావా? వెంటనే రామరాయలును మా కప్పగించి క్షమాపణ కోరు.. ఇప్పటికైనా మించిపోయిందిలేదు..క్షమిస్తాం.
బంగారు:-ఇంతసూటిగా మీరు ఆజ్ఞాపిస్తున్నప్పుడు మేమునూ సూటిగానే చెబుతున్నాం..లేవండి..వచ్చినదారినే వెళ్ళండి. శరణార్ధిని అప్పగించే పిరికిపందనన్న అపకీర్తిని యీ బంగారు తిమ్మనాయుడు యేనాటికీ మూటగట్టుకొనడు. ఇక మీ ఇష్టము వచ్చిన పనిచేసుకోండి. వెంటనే ఇక్కడనుండి దయ చేయండి (గర్జించును)ఊ..(సకలంచినతిరుమలరాజు కోపంతో వూగిపోతూ కాసేపు నిలబడి బయటికి వేగంగా వెళ్ళిపోవును)
అలియరామ:-బంగారుతిమ్మరాజుగారూ పేరుకు తగ్గట్టే మీ మనసు బంగారం. ఆశ్రితులను రక్షించి రాజధర్మాన్ని పాటించారు
బంగారు:-రామరాజుగారూ..నేను రాజధర్మాన్ని పాటించానంతే అంతగా పొగడనక్కరలేదు.మీరు నిర్భయంగా హాయిగా వుండండి.ఇక పదండి పోదాం.
వ్యాఖ్యానం
అలా బెడిసిన సంధి యుద్ధరూపం దాల్చింది. తాడిపత్రి సమీపంలోని కోమనూతలపాడు వద్ద సంకుల సమరం జరిగింది సకలం చిన తిరుమలరాజు ఓడిపోయాడు. బంగారుతిమ్మనాయుడు సకలం చినతిరుమలరాజు తలతీయించి విజయనగర ప్రజలకు కానుకగా పంపించాడు. విజయనగర సింహాసనంపై బంగారుతిమ్మనాయుని సమక్షంలో సదాశివరాయలు ఆసీనుడైనాడు.కాలం వేగంగా గడచి పోయింది. క్రీ, శ. 1652 లో తిమ్మనాయుని సంతతివాడైన చిన తిమ్మనాయుడు గండికోట రాజయ్యాడు. ఇతడు కళారాధకుడు, కవిపోషకుడు.ఈతని కొలువులో చిత్రకవి, అనంతకవి అను ఉద్దండ పండితులుండేవారు. వారు విష్ణుచిత్తీయం, హరిశ్చంద్రో పాఖ్యానం వంటి కావ్యాలు రచించి కీర్తిగడించారు. ఈకలంలోనే విజయనగరసామ్రాజ్యం బహమనీసుల్తానుల వశమైపోయింది. గండికోటను చినతిమ్మనాయుడు స్వతంత్రరాజ్యంగా ప్రకటించి వైచాడు. ఈదశలో గండికోటపై గోల్కొండ సుల్తానుల కన్ను బడింది. సుల్తన్ కుతుబ్షా సైన్య ఆర్ధిక వ్యవహారాలు చూసే మీర్జుమ్లా కర్నాటకలోని కోటలను జయిస్తూ గుత్తి కోటను వశ పరచుకొని గండికోట వైపు సాగాడు. కోట దుర్భేద్యము గాన ఆలోచనలో పడ్డాడు.
నాల్గవ సన్నివేశం
మీర్జుమ్లా:-(అటూఇటూ తిరుగుతూ) గండికోటను నేరుగా దాడిచేసి జయించలేమ్ ఏదో ఒక కుట్ర,ఒకవ్యూహమ్ పన్నలే. ఆలోచించి ఆలోచించి తల వేడి ఎక్కుతూంది (ఆశీనుడై) ఎవరక్కడా... నాట్యకత్తె సమీరాను జల్దీ యహా బులావ్(అటూఇటూతిరుగు తుండగా సమీరా వస్తుంది)సమీరా మేం ఆలోచించి ఆలోచించి అలసిపోయమ్. ఏదీ నీ ఆటా పాటాతోమాకు ఆనందమ్ శేయ్ ఖుషీ ఖుషీగా నాట్యమ్ శేయ్(అంటూ ఆసవం సేవిస్తాడు)
సమీర:-జీహుజూర్(రికార్ద్ పాటపై నాట్యం)
(నాట్యం పూర్తి కావస్తుందనగా గబాలున లేస్తాడు మీర్జుమ్లా.)
మీర్జుమ్లా:-ఆగూ..(పాట ఆగిపోతుంది) ఇప్పుడు మా కొక ఉపాయమ్ వచ్చింది. చినతిమ్మనాయున్ కి దగ్గర్ వాడ్ ఒకడ్ కవాలె మాకు వాన్ని యేదోవిధంగా ఆశసూపి మనపరమ్ సేసు కోవలాలే వాని తో రహస్యాల్ రాబట్టి రాజావార్ ని కంజోర్ చేసి కోటలో జొరబడాలే. అంతకంటే వేరే మార్గమ్ లేదు మనకూ..
సమీరా:-అదెంతపని హుజూర్... రాజావారి మంత్రి పొదిలిలింగన్న వున్నాడు. వాడు దురాశాపరుడు. తాగుడుకు బానిస. మీ కొలువుకు రాకముందు నేను వాని దగ్గరే వుండినాను. వాన్ని వలలోవేసుకొని ఆశజూపి ఆసవం తాపి మీ పరం చేస్తాను.వాడు రాజుకు నమ్మకస్తుడు.వెన్నుపోటు పొడవటానికి వాడు మీకు సరిగ్గా పనికి వస్తాడు.
మీర్జుమ్లా:-సెహబాష్ సమీరా.. (అంటూ మెడలోని హారం సమీరాకు బహూకరిస్తాడు.)
(తెరపడును)
ఐదవ సన్నివేశం
(పొదిలిలింగన్న తాగిమత్తులోతూలుతుంటడు. సమీరా అతన్ని ఆడిస్తూ
పాడుతూ నృత్యంచేస్తూవుంటుంది (పాట రికార్డ్ పాట సరిపోతుంది) (మీర్జుమ్లా ప్రవేశంతో సమీరా నిష్క్రమిస్తుంది. లింగన్న కాస్తా మెలకువలోనికి వస్తాడు.)
మీర్జుమ్లా:-క్షమించండి లింగన్నాసాబ్ మీ సంతోశాన్కి అడ్డం వచ్చి నట్లున్నాం.
గన్న:-పరవాలేదు.. రండి కూర్చొండి. మీరు పంపిన కమ్మ చాలా రహస్యంగానే అందింది. మంచిది. చదివాం. మీరు వ్రాసిన ప్రకారం గుత్తిలోట నాపరంచేయాలి చాలు. మీపని ఇక చిటికలో అయిపోతుంది.
మీర్జుమ్లా:-మాది మాటంటే మాటే... తప్పం.. సరే యిక వ్యూహమేమో మాకూ వివరంగాచెప్పండి.
లింగన్న:-సరే వినండి. రేపు మా మహారాజు మాకు విందిస్తున్నాడు నామనుషులు. వంటశాలలో చేరిపోయారు. రాజుగారికి విషాన్నం ఉపాయంగా యే అనుమానం రాకుండా రెండవసారి మారువడ్డించే నెపంతో పెట్టేస్తారు. అంతటితో రాజుగారిపని అయిపోతుంది. రాజ్యం శోకసముద్రమైపోతుంది. ఎవరో సామంతులు రాజుగారిశవదర్శనానికి వస్తున్నారని నేనే దగ్గరుండి కోటతలుపులు తెరిపిస్తాను.సరిగ్గా రేపు మూడుగంటలకు సైన్యంతోవచ్చి కోటలోకి జొరబడు. నేను సమయం సూచిస్తూ కొమ్ము వూదుతాను, సిద్ధంగావుండండి.
మీర్జుమ్లా:-సంతోషం..బహుత్..బహుత్..అచ్చా.ఇక మేము వెళ్ళివస్తామ్.
లింగన్న:-మాటమాత్రం మరచిపోవద్దు మీర్జుమ్లాసాబ్.
మీర్జుమ్లా:-అరెరే.. మీరు తొందరలోనే గత్తిరాజు అవుతార్... ఫికర్ మత్ కరో.. ఇంక మేంవస్తాం. (వెళ్ళును)
( తెరపడును)
ఆరవ సన్నివేశం
(మీర్జుమ్లా ఆసనంపై కుర్చొనివుండగా పొడిలిలింగన్న వస్తాడు)
లింగన్న:-మీర్జుమ్లసాబ్ మీతో కుదుర్చుకోన్న ఒప్పందం ప్రకారం చినతిమ్మనాయుడిని విషప్రయోగంతో చంపించాను, దుర్భేద్యమైన గండికోట రహస్యాలన్నీ విప్పిచెప్పి కోట నీవశమయ్యేట్లు చేశాం.
మీర్జుమ్లా:-అరె బేవకూఫ్ లింగన్నా.. రాజుకొడుకు రహస్యమార్గం గుండా తప్పించుకపోయినాడ్. నువ్ యేమి చేసినావ్ . మాకు హెచ్చరిక
చెయ్ కుండా బాగతాగి నిద్రపొయినావ్.
లింగన్న:-నిజమే..పొరపాటేజరిగింది. ఐనా ఆ జాగ్రత్తలు మీరు తీసుకొని వుండాల్సింది. నాకేంసంబంధంలేదు.మిగిలిన రాజకుటుంబీకులు బంధీలయ్యారుగదా! వాళ్ళతో రహస్యాలు రాబట్టండీ.
మీర్జుమ్లా:-అది మాకు తెలీదు అనుకున్నావ్ .. నీకు తెలివిలేద్ లింగన్నా.. వాళ్ళు ప్రాణంపోయినా ఒక్క మాట చెప్పలేద్.
లింగన్న:-అయితే వాళ్ళను చంపేశావన్నమాట.. సరే పోనివ్వండి మరినాకు అప్పజేప్పుతామన్న గుత్తికోట మాటేమిటి? మాటప్రకారం గుత్తికోట వెంటనే నావశం జేయండి.
మీర్జుమ్లా:-అరే బేవకూఫ్ మదిరకు మగవకు దాసుడు నువ్.. నిన్నుప్రలోభమ్ పెట్టీ కోటను జయించామ్. అదిమా వ్యూహమ్ బే. తెల్సా..
లింగన్న:-అంటే గుత్తికోట.....
మీర్జుమ్లా:-గుత్తికోట నీకివ్వమ్ హనుమనగుత్తి ఫర్మానా యిస్తామ్ తీసుకో.
లింగన్న:-అన్యాయం. ఒక్కగ్రామమా... ఇది మరీ అన్యాయం.
మీర్జుమ్లా:-అరే ద్రోహీ.. దేవునిలాంటి రాజుకే మోసమ్ చేసినావ్ నీకు న్యాయం అన్యాయం యేందిబే.చల్ చల్.. అరే.. ఎవరక్కడ.. ఈబద్మాష్ ను బయటికి పంపండి... రాజ్యంనుండి వెళ్ళగొట్టండి.
లింగన్న:-వద్దులెండి మీర్జుమ్లా గా రూ.. నేనే వెళతాను ఆహుమగుత్తైనా ఇప్పించండిచాలు..
మీర్జుమ్లా:-సరే సరే.. ఇక నడుబయటికి.(లింగన్న వెళ్ళును)
(బయటినుండి--సాబ్ ఫిరంగ్ బనానేవాలా అంగ్రేజి మెయిలీసాబ్ మిమ్మల్ని కలవడానికి వచ్చినార్ క్యా అందర్ బేజూ సాబ్) హా లోపలికి రమ్మనండి.
మెయిలే:-(వచ్చి)మీర్ సాబ్. సలాం(మీర్ కూడా చేత్తో సలాంచేయును)
మీర్జుమ్లా:-కూర్చోండి... ఇక చెప్పండి.
మెయిలే:-మీర్ సబ్.. మీమాట కాదనలేక ఆయుధాలు ఫిరంగులూ చేయిస్తామంటున్నాను. కానీ దానికికావలసిన లోహమ్ అదే మెటల్ కోటలో లేదు మీరు చెప్పినట్లు దేవళాలలోని విగ్రహాలని సైనికులుతెచ్చి గుట్ట పోసినారు. ఈ మెటల్ నో యూజ్, ఇది ఫిరంగులకు పనికి రాదు.
మీర్జుమ్లా:-మరేంచేద్దాం ఉన్నదదే.. దానితోనే ఫిరంగులు చేయాలె. మాసైనికులు ప్రజలు ఆఖరికి మీరూ వద్దన్నా ఈపని చేసినామ్. ఇంగేమ్ జేయలే. వేరే మార్గమ్ లేదు.బయటి నుండి తెచ్చేదాన్కి వీలులేద్. శత్రువుల్ జోరబడే ప్రమాదమ్ వుంది. ఇప్పుడు తప్పించుకొని పారి పోయిన రాజుకొడుకు జనాన్ని జమా చేసుకొని మా పైకి దాడిచేస్తే మేం యేమిచేయాలె. ముందు యేదోఒకటి జెయ్యండి.
మెయిలే:-ఇంతమంది మనసు నొప్పించి ఈపని జేయడం మంచిది కాదనిపిస్తుంది. ప్రజలు ఆ విగ్రహాలను దేవుడంటున్నారు. మననమ్మకం అటుంచండి. వారిని బాధించి వాళ్ళను పాలించడం సులువు కాదు. ఎవరినమ్మకం వారిది. ప్రజల మనసు నొప్పించడం బాగాలేదు మీర్సాబ్. మరొక్కసారి ఆలోచించండి.
మీర్జుమ్లా:-అరే.. మేము చెయ్యామంటున్నాం.. చెయ్యండి అది మంచి చెడ్డా పాపం పుణ్యం మాది.. మీకెందుకు.. జానేదేవ్.. జావ్ కాంకరో.
మెయిలే:-సరే మీఇష్ఠమ్. అలాగే చెయ్యడానికి ప్రయత్నింస్తాం..
ఇక వె ళ్ళివస్తాం.. సలాం. (వెళ్ళును)
( తెరపడును)
వ్యాఖ్యాత
అలా పూజారులు ప్రజలు అడ్డుపడినా వారిని హింసించి సైనికులు సైతంవద్దని హితవు పల్కినా వినకుండా విగ్రహాలను కరిగించి ఫిరంగులనుచేయించాడు. కానీ ఆలోహంతో చేసిన ఫిరంగులు నెర్రెలువారి చెడిపోయాయి. అవేవీ పనికిరాలేదు. భక్తులు మీర్జుమ్లా దౌర్జన్యానికి భయపడి మాధవరాయస్వామిని రాత్రికిరాత్రే గర్భగుడి వెనుకగోడ పగులగొట్టి తేసుకొనిపోయి మైదుకూరులో పాడుబడిన బావిలో దాచిపెట్టి, ఆతర్వత మైదుకూరులో ఆలయం నిర్మించుకొని ప్రతిష్ఠించుకున్నారు. ఈ విషయాలన్ని కనులారచూచిన జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ అనే ఫ్రెంచ్ వజ్రాలవ్యాపారి తాను వ్రాసిన ట్రావెల్స్ ఇన్ ఇండియా అను పుస్తకములో విపులంగా వ్రాశారు.
ఏడవ సన్నివేశం
(మీర్జుమ్లా నమాజు చేసుకుంటూ ప్రశాంతంగా కనిపిస్తాడు)
మీర్జుమ్లా :-(లేచి) ఇక్కడి మహమ్మదీయ ప్రవచకులు చాలా మంచి వారు. దయగల అల్లాపై అపారమైన నమ్మకంతో వున్నార్. నిన్న ముల్లావారి నాల్గు మంచి మాటల్ విన్నమ్.. మనసుకు శాంతం దొరికింది. ఈరోజు ప్రశాంతంగా నమాజ్ చేసుకున్నాం. ఇన్నాళ్ళు రక్తదాహంతో యుద్ధాలు చేస్తూ, వ్యూహాల్ ప్రతివ్యూహాల్ కుట్రల్ కుతంత్రాల్ తో మనసు బరువూ అయ్యింది. ఇప్పుడిక్కడి ప్రశాంత వాతావరణంలో ముస్లిం శాంతిదూతల కొరాన్ వచనాలు నన్ను ప్రభావితం చేశాయ్. నాసైనికులు వీరధివీరులు. ఈగండికోట దిట్టమైనది. ప్రజలు మంచివార్ హిందూముస్లింలు అన్యోన్యంగా మెలగుచున్నార్. మా ముస్లిం పెద్దల్ మాట విని మంచి పరిపాలకుడుగా పేరు తెచ్చుకోవాలె. కరువుకాటకాలలో ఆదుకొనే ఒక పెద్దధాన్యాగారం కట్టాలె. పాశాంతంగా నమజ్ చేసుకోవడానికి మశీదు కట్టుకోవాలె. హిందువులతో అనవసర వైరమెందుకూ? వారూ నా ప్రజలే వారితో స్నేహంగా మెలగాలె. వారిని ఆదరించాలె. ఇక నేనే గండికోట సుల్తానై స్వతంత్రం ప్రకటించుకోవాలె. ఇక్కడే ప్రశాంతంగా శేషజీవితం గడపాలె.
వ్యాఖ్యాత
ఇలా మీర్జుమ్లా సజ్జనత్వంవహించి మంచి పరిపాలకుడై ధాన్యాగారం, మసీదు నిర్మించాడు. ఇక సామంతరాజుగా కాక స్వతంత్రం ప్రకటించు కొందాం అనుకుంటుండగానే గోల్కొండ ఢిల్లినవాబ్ షాజహాన్ కైవసమైపోయింది. దాంతోమీర్జుమ్లా షాజహాన్ సామంతుడుగా వుండిపోయాడు. హిందువులతో స్నేహంగావుంటూ వారి దేవాలయాలను పునరుద్దరించాలనే సదుద్దేశంతో ఢిల్లీకి లేఖలువ్రాశాడు. అంతలో ఢిల్లీప్రభుత్వం మారి ఔరంగజేబు సుల్తానయ్యాడు. ఆయనవద్దనుండి మీర్జుమ్లాకు సానుకూలత లభించ లేదు.అనుకున్న యే మంచిపనీ చేయలేకపోయాడు.ఔరంగజేబు మీర్జుమ్లాను బెంగాల్ గవర్నర్ జనరల్ గా బదిలీచేశాడు. గండికోటలో తనచేకూల్చబడిన దేవాలయాలను నిర్మించలేకపోయాడు. ఆఖరుకు మీర్జుమ్లా క్రీ.శ. 1663 లో అస్సాం గారో కొడల్లో జబ్బుపడి మరణించాడు. ఔరంగజేబ్ మరణానంతరం క్రీ.శ .1717 నుండి 1779 వరకు మొగల్ జుబేదారులు సమంజల్ మయానావంశీయులైన కడప నవాబులు గండికోటను పాలించారు.
గమనించండి గండికోట తూర్పుదక్షిణాలుగా నాలుగున్నరమైళ్ళు విస్తీర్ణం కలిగివుంది. నూటఒక్క బురుజులున్నాయి. వంపులు తిరిగిన రక్షణగోడలున్నాయి. ఉత్తరపశ్చిమ దిక్కులలో పెన్నానది ప్రవహిస్తూ సహజసిద్ధమైన లోయ కనిపిస్తుంది. దీనివల్లనే ఇది గండికోటగా పేరుగాంచింది. ఇంతపెద్దకోట, పెన్నగండి, చూడటానికి ముచ్చట గొల్పుతున్నది. ఇది చూసితీరవలసిన దర్శనీయస్థలం-
సమాప్తం
సూచన:- రెండు పాత్రలు ఒకే నటునికి యివ్వడం ద్వారా నటులను
సర్దుబాటు చేసుకోవచ్చును.
No comments:
Post a Comment