Tuesday, 1 December 2020

ఊర్వశి

ఊర్వశి

(గేయ నాటిక)

ఊర్వశి

 

పి.సుబ్బరాయుడు.

42/490 భాగ్యనగర్ కాలనీ

కడప - 516002

సెల్-9966504951.

 

ఊర్వశి

(గేయ నాటిక)

 

ఇందలి పాత్రలు

 

1. కథకులు (ఇద్దరు)

2. రంభ

3. మేనక

4. నారయణముని

5. ఇంద్రుడు

6. కేశి

7. భరతముని

8. పురూరవుడు

9. ఊర్వశి

 

ఊర్వశి

(గేయ నాటిక)

 

ప్రార్థన: శ్లోవందే వందారు మందార

              మిందుభూషణ నందనం

               అమందానంద సందోహ

                బంధురం సిందురాననం

 

                    శ్లో: అగజానన పద్మార్కం

                          గజానన మహర్నిశం

                             అనేకదం తం భక్తానాం

                            ఏకదంత ముపాస్మహే.

 

          శ్లో:    ఆంగికం భువనం యస్యా

            వాచకం సర్వవాగ్మయం

           ఆహార్యం చంద్రతారది

              తం వందే సాత్వికం శివం

 

                                                                               (నీలపు తెర మధ్యలో ఒక పీఠం)

 

   వచనం:- ఇదే మహోత్తుంగ అంబరచుంబిత హిమగిరి ప్రాంతము.

                ఆవరిత శ్రీహరినామ మంగళ శబ్ద యుతము.

                నరనరాయణాది మునిపుంగవ తపోవనము.

                ఆధ్యాత్మిక తరంగాక్రమిత భూనభోభాగాంతరము.

                బదరికావనము.

 

   ఎంతలో యెంతమార్పు ఆకస్మిక వసంతాగమన మైనదే. చిత్రముగనున్నది.  ఇది ఇంద్రుని  పన్నాగము గానోపు.

 

కథకులు:- (ప్రవేశించి)                                   

 కొండమల్లియ లతలు - రేగుతరు లెగబ్రాకి

పువ్వులేవిరబూసి - జలజలా రాల్చెనూ

 నవపల్లవంబులే - సహకారములుదాల్చ

గుమికూడి వచ్చినవి - గండుకోయిలలవిగొ

చిగురుటాకులుమేసి  - తమగొంతు సవరించి

పంచమంబునపాడ-పరవశించెనువనము.                                          కలకలారావముల - చిలుకజంటలువచ్చి      

నేరేడు ఫలరసము - గ్రోలి తమకంబునా

సామవేదము పాడె - నేమొ యన సడిచేసె

  ఇట్టి మధుమా సంబు - ఆశ్చర్యముగరాగ

   ఇదె యదనని మరుడు - తన పూల తూపుల

     పదును బెట్టుకవచ్చె - బదరికావనమునకు

అతని వెనువెంటనే - అప్సరాంగనలైన

     మేనకయు రంభయు - చనుదెంచి మెఱసి

                  మేనిరుచు లెల్లడల -ప్రసరింపజేసిరి .                                                      (కథకులు వెళ్ళుదురు)

 

(పీఠం పై నారాయణముని,  పాట మధ్యలో వచ్చి ధ్యానంలో కూర్చొనును రంభా, మేనకలు గలగలా వచ్చి నాట్య మారంభింతురు)

 

రంభ:-   చాలునురా తపమూ - నారాయణముని

         ఇక-చాలునురా... తపమూ...

         రంభనునేను - రసికాగ్రణిని

 

మేనక:- మేనకనేనూ - మెరుపుతీవియను

 

ఇద్దరు:-    అంగజునకు తోడు - అరుదెంచినామూ.  /చాలును/

 

రంభ:-   శృంగారమొలికించి - రతిక్రీడలనుదేల్చి

 

మేనక:-  ముద్దు మురిపెముజూపి - మమ్మేలుకొన రార

 

ఇద్దరు:-    సంయమివరరార - రసరాజ్య మేలుదము.                                                                      /చాలును/

 

రంభ:-    మీ జపతపములు - యెమిటికివియెన్న

 

మేనక:-  మము పొందుటకే - గద రా స్వామీ

 

ఇద్దరు:-   తడవదియేలర - తమిదీర దరిజేర           //చాలును//

 

(మునిపై పూలు జల్లుదురు నారాయణముని కళ్ళు దెరచి రంభామేనకల యెడ చులకనగాజూచి చిరునవ్వు నవ్వి)

 

             కం:    ఏపాటిది మీ యందము

                 ఏపాటిది యభినయంబు యిదిగో గనుడీ

                 నాపావన ఊరువునను

                 ఏపారెడి నందగత్తె నిప్పుడె పుట్టున్

 

(తొడపై తట్టును. ఒక్క ఫ్లాష్ లైట్ తో ముని వెనుకనే వున్న నర్తకి బయటికి వచ్చును)

 

ఊర్వశి:- (పాట)       రంభా మేనకా - మీలయహొయలూ

                     చెల్లవులేయిట - చాలును పొమ్మిక

 

                 నరనారాయణ - మునులకు నిలయము

                 అందములకు మరి - ఆకర్షణలకు

                 లొంగని ఆధ్యా - త్మిక తరంగముల

                     ఆలవాలమగు - దివ్య స్థలమిది               //రంభా//

 

         ఊరువు చరచిన - యంతమాత్రమున

         అందచందముల - అ భినయ ములలో

         సాటిలేనినా - జననంబాయెను.                   //రంభా//

 

         ననుగన్న యా - నారాయనముని

         కన్నెర్రజేయక - మున్నే మేల్కొని

         తడవదిసేయక - తిరిగిపొండిక

         ఇట్టి ప్రయత్నము - లెప్పుడు సేయక.        //రంభా//

 

రంభా మేనకలు:- (మోకాళ్ళపై నిలచి)

                  మాతప్పు సైరించి - మమ్ముక్షమియించి

            కాపాడుమోస్వామి - నారాయణమునీ

                

 ఇం ద్రుడు:- ( అప్పుడేవచ్చి)

         బదరికావనవాస - బ్రహ్మతేజోరూపా

         నీవె శ్రీహరివంచు - తెలిసికొన నైతీ

                                                           

ముగ్గురు:- మాతప్పు సైరించి - మమ్ముక్షమియించి

             కాపాడుమోస్వామి - నారాయణమునీ

             పాహిమాం పాహిమాం పాహిమాం.

                                                    నారాయణముని:- (వచనం)  ఇంద్రా, రంభామేనకలారా..     భయపడవలదు.  మిమ్ముమన్నించితిని. శుభమస్తు!

 

ఊర్వసి:- నెలవెయ్యది - తండ్రీ

         నే నిలువగానిక - నెలవెయ్యది తండ్రీ

         ఏడేడు పదునాల్గు - లోకములలోనేను

         నెటనుందును తండ్రీ _ నేనిక

         నెటు మనుదును - తండ్రీ

 

నారాయణముని:- (వచనం) పుత్రీ! నీకొక ఆనందదాయక మైన                           నెలవు నేర్పరచుటకే వీరి నందరినీ మన్నించి,

                        ఆశీస్సులొసంగితిని. ఇంద్రా!

 

           కం:      సైచితి నీదగు తప్పును

                 మెచ్చితి నీ వినయము విను మీ కన్యన్

                యిచ్చితి గొనుమా కాన్కగ

               యిచ్చక మొదవగ సురసభ లింపును బెంచన్

 

ఈ ఇంతి నా ఊరువులనుండి జన్మించినది గావున ఊర్వశియని పిలువుడు. ఊర్వశీ ..యికనీకు సంతోషమేగదా! సురసభలందు పుణ్యజనులకు ఆనందముల పంచి హాయిగ విహరింపుము-

 

ఇంద్రుడు:- (వచనం) మీ ఆజ్ఞమాకు శిరోధార్యము స్వామీ.. ఊర్వశిని   గ్రహించి  స్వర్గమునకు తిరిగి వెళ్ళెదను. సెలవు.

 

ఊర్వశి:-   కం:  ధన్యతగాంచెన్ జన్మము

                 మాన్యతతో స్వర్గమందు మసలుదు నింకన్

                 విన్యసిత నాట్యకళలన్

                 మన్యువుగానెంచి జూపి మైమరపింతున్

 

నారయణముని:- మహదానందము. నీ ఆశయము                      నిర్విఘ్నముగా          నెరవేరుగాక.. శుభం.. వెళ్ళిరండు.

 

(అందరూ నారయణమునికి నమస్కరింతురు... స్టేజి స్టిల్.)

 

వెలుగు పోయి వెలుగు వచ్చును

(అడవి ప్రాంతము - జీర్ణశివాలయము - రంగస్థలం మీది పీఠం మీద శివలింగం వుంచితే సరిపోతుంది రంభ, మేనక, ఊర్వశి ప్రవేశింతురు)

 

రంభ:- (వచనం)  ఇది అటవీస్థలము కనుకనే నరసంచారము లేదు.  శివపూజ  జేసికొనుటకు మనకిది అనువగు ప్రదేశము.

 

మేనక:- మన మానందమున నాట్యమాడి, పరమేశ్వరునకు అంజలి     ఘటింతము.

 

ఇద్దరు:-    హర హర హర - హర శంభో

 

రంభ:-             జటా జూట ధరా - జగన్నాయకా

                          గజచర్మాంబర - శూలాయుధ ధర

                         మునిజన పో షా - శివ శివ శంకర

 

ఊర్వశి:-    గొనుమిదె దేవా - పుష్పాంజలులు

                         (శివునిపై పూలు జల్లును)

 

ఇద్దరు:-  హర హర హర - హర శంభో

 

మేనక:-         వృషభ వాహనా - నిటాలనయనా

                          గిరిజారమణా - నాగాభరణా

                          సురగంగాధర - చంద్రశేఖరా

ఊర్వశి:-       గొనుమిదె దేవా -దీపాంజలులు

                            (శివునికి హారతిచ్చును)

(అందరూ శివునకు మ్రొక్కుదురు. రంగస్థలమున కాస్తా ముందుకు వచ్చి - చూపు సారించి  భూలోకసౌందర్యమును తిలకించుచు)

 

రంభ:-             కనుమా మేనక -  యిలగల యందము

                 చూడుమె ఊర్వశి - వనసోయగము

 

                          కిలకిలరవములు - చిలుకలు చేసెను

                          హరిణములవిగో - గెంతుచు తిరిగెను

 

         కేకి ఫింఛముల - విప్పుచు నాడెను

         వనకుక్కుటములు - కూయుచు నెగిరెను    |కనుమా|

 

మేనక::-అవునవునే చెలి - కనువిందాయెను

          అరవిరిసిన యా - కమలము జూడుము

 తావుల నలిమెడు - మొల్లల గాంచుము

గలగల పారెడు - ఝరముల నరయుము.     |కనుమా రంభా|

 

రంభ:- (వచనం)  ఊర్వశీ యీ సుందర ప్రకృతిలో ఒకసారి విహరించి వత్తమా?

 

మేనక:- (వచనం) విహరించి తీరవలసినదే. పద పోదము.

 

ఊర్వశి:-           ఆ:వె:     శివుని ఆలయమును చిత్తమెప్పదు వీడ

                          చెలియలార తడవు సేయకటను

                          అడవి దిరిగి రండు ఆనందమునమీరు

                          వెళ్ళివచ్చు వరకు వేచియుందు

 

రంభ:- మంచిది

 

మేనక:- (వచనం) అలాగే కానిమ్ము. మేము తొందరగనే        తిరిగివత్తము. (రంభామేనకలు వెళ్ళుదురు)

 

(ఊర్వశి వారు వెళ్ళినవైపే కాసేపు చూచి, శివలింగం వైపు మరలును)

 

కేశి:- (ప్రవేశించి) ఆఁహా.. నీ సాటి సుందరి - లేదెందు వెదుకంగ

                  ఏమంద మేమందమే - చిలకల కొలికిరో

                                                          | ఏమంద|

 

ఊర్వశి:- (వచనం)ఎవరునీవు, నేను శివుని సేవింప వచ్చిన అప్సరసను.  వెళ్ళుమిటనుండి. రాకు నాచెంతకు.

 

 కేశి యనువాడనే - రక్కసుల రేడ నే

తగిన దానవె యింతి - నాచెంత నీవుండ

రా రమ్ము నా వెంట - రాననగ రాదింక

బెట్టు సేయగరాదె - కొమ్మా ముద్దులగుమ్మ

 

(కేశి ఊర్వశిని కబళింపబోవును)

 

ఊర్వశి:- రక్షమాం..  రక్షమాం.. రక్షమాం... (గట్టిగా అరచును)

 

రంభామేనకలు:- (వచ్చి కేశి దుందుడుకు తనము చూచి)  రక్షించండి..  రక్షించండి..  రక్షించండి (కేశి ఊర్వశిని లాక్కొని పోవును)

 

పురూరవుడు:-  (వచనం) (ప్రవేశించి)  పద్మాక్షులారా! భయపడకుడు. నేను ప్రతిష్టానపురాధీశుడను, పురూరవుడను.

 

కం||    భూమి పురూరవు డేలగ

         భామినులేలా పడగను బాధల నెందున్

         ఏమి కతంబున వగతురొ

             ఏమైనదొ మీకు  జెపుడు నిప్పుడె మాకున్

 

మేనక:-  ఆ:వె: అప్సరలము మేము ఆదిదేవుని గొల్వ

                 వచ్చినాము కలసి వసుధ పైకి

                 ఒక్క రక్కసుండు ఊర్వశి మాచెలిన్

                 నపహరించి చనియె ననఘ నిపుడె.

 

పురూరవ:- (వచనం)  దిగులొందకుడు.  మీచెలిని  విడిపించి  దెచ్చి  మీ కప్పగింతును. (ఒరనుండి ఖడ్గము దీసి ) ఓరీ రాక్షసాధమా!.. నిలు నిలు..(వెళ్ళును)

 

రంభ:-  (పాట) (శివలింగాన్ని సమీపిస్తూ) కాపాడుమాదేవ.

 

మేనక:-           కరుణామయా..                                               

రంభ:-         అన్యము పుణ్యము - నెరుగని యతివ

                 ఊర్వశి రాక్షస - బలమునకు లోబడె

 

మేనక:-            ఇడుములుబడు మా - చెలి ఊర్వశినీ

                          కాపాడగ నొక - నరపతి యరిగె

 

రంభ:-         సవశక్తిమయా - శివశివ మూర్తీ

                 రక్కసినేతను - రణమున నణచి

 

మేనక:-        పురూరవునకే - విజయము గూర్చీ

                 మా చెలి కాపద - బాపుముదేవా

 

 

వెలుగు పోయి వెలుగు వచ్చును

(రంగస్థలం మీద శివలింగం తీసివేయబడి కర్టన్ మత్రమే వుండును - పురూరవుడు రక్తసిక్తమైన ఖడ్గము నొకచేత ఊర్వశి నొకచేత పట్టుకొని ప్రవేశించును)

 

పురూరవుడు:- అప్సరశిరోమణీ ఊర్వశీ..

 

         కం|| చచ్చెను రాక్షసు డిక నీ                                             కొచ్చిన భయమేమిలేదు కూరిమి తోడన్

              వచ్చిన దారిన్ స్వర్గము

              చక్కగ నీ సఖులగలసి చనవచ్చు నికన్.            

(పురూరవుడు చేయి వదలగా కొంతదూరము జరిగి)

        

ఊర్వశి:- (వచనం) (తనలో) ఆఁహా.. ఏమి యీ పురూరవుని సౌందర్యము. శరీర  ధారుఢ్యము

 

         కం||   ఈ వీరుని రూపముగన

                భావజు విరితూపులు మది వడితాకెనహో

                నే విడచి నితని తోడున్

                నేవిధి నాకమున నుందు నెటు మనుదు నికన్

 

పురూరవుడు:- (తనలో) స్వర్గమునకు నీవిక వెళ్ళవచ్చునని నోటిమాటగా నంటినేగాగనీ.. ఈ సుందరి యెడబాటు సహింపనోపుదునే.. ఆఁహా..

 

 

         సీ||   కాంచన వర్ణమై కాంతులీనెడు మేను

                 నిడివి చాల గలట్టి నీలికనులు

               అరుణవర్ణంబై మెఱయు నట్టి యధరంబు

                 ధవళకాంతుల జిమ్ము దంతచయము

              సమపీన వైభవ సాధిత స్థనములు

                 సన్మోహనంబైన సన్న నడుము

               నాణ్యమై నొప్పారు నవకపు కరములు

                 ఘననితంబములపై గదలు కురులు

 

         తే:గే:  అన్ని విధముల నియ్యింతి అందమందు

                సాటి లేనట్టి దనియన సత్యమౌను

                యిట్టి సుందరిన్ గననౌనె నెచట నైన

                ధన్యుడను గాదె ఊర్వశి తనది యైన.

 

(ఇంతలో రంభామేనకలు అక్కడికి వచ్చెదరు)

 

రంభ:- (వచనం) చెలీ ఊర్వశీ.. క్షేమమేగదా!

 

మేనక:- (వచనం ఊర్వశీ.. నీ కేఆపదా కలుగలేదుగదా!

 

పురూరవ: (వచనం) - ఆ రాక్షసుడు కేశి నాచే హతమైనాడు. మీ చెలి సురక్షితముగా నున్నది. మీరిక స్వర్గమునకు సజావుగా వెళ్ళవచ్చును.

 

రంభ:- మహారాజా! పురూరవా!  మీకుమా ధన్యవాదములు.

 

మేనక:- ధన్యవాదములు.

 

(ఊర్వశి పురూరవునివైపే చూస్తూ రంభామేనకలతో కలసి వెళ్ళును)

వెలుగు పోయి వెలుగు వచ్చును

(రంగస్థలంపైకి ఒకసారి ఊర్వశి ఒకసారి పురూరవుడు చెరోవైపునుండి వచ్చి విరహము నభినయిస్తారు)

 

ఊర్వశి:- మనసు మనసున లేదు - మరలుగొనె నీ పైన

          హృదయమున నీరూపె _ ముద్రించుకొనిపోయె

  మరచిపోయెదమన్న - నావలను గాదయె

  నాతనువు నీదెయను - భావమది మది నిండె                 |మనసు

                                                                                                      

                          (ఊర్వశి వెళ్ళును)

 

పురూరవుడు:- చెలి యేమొ స్వర్గమున - నేనేమొ యిలపైన

                 ఐననేమో మరీ - సామీప్య స్థితిదోచు

         కనులు మూసినగాని - తెరచి చూచినగాని

         ఊర్వశియె గనిపించు - విశ్వమంతయు నాకు  |మనసు |                                                         

(పురూరవుడు వెళ్ళును)

 

ఊర్వశి:- దేవేంద్రునెదుటనే - నాట్యమాడుచునున్న

          నీయెదుటనే నేను - ఆడుచున్నటులుండు

 పాట భావమునందు - మనసు నిలచుటలేదు

   భావమంతయు నీదు - స్తుతిగానె మది దోచు    |మనసు|

                                                                                        

(ఊర్వశి వెళ్ళును)

 

పురూరవ:-  నిను గలియు భాగ్యమ్ము - నాకున్నదోలేదొ

                 నీపైని తమియేమొ - తరుగకున్నది నాలో

నీపాద మంజీర - రవళులె వినిపించు

చెలియ నీ కౌగిలిలొ – కరిగినట్లనిపించు    |మనసు|                    (పురూరవుడు వెళ్ళును)

 

కథకులు:- (వచ్చి) ఇవ్విధంబున ఊర్వశీపురూరవులు ఒకరిపైనొకరు మరులుగొని మన్మధావస్థలకు గురియగుచుండ..

 

                 దానవులు స్వర్గమ్ము - నాక్రమింపంగా

                 సమరమై నాకమ్ము - రక్తమయమయ్యె

                 అపుడు పురూరవున్ -  నాకపతి పిలిపించి

                 రాక్షసుల దండింప - రమ్మనీ యడిగే

 

 

         దేవతల ఆపదల్ - తాదీర్చ గా దలచి

               వెళ్ళి పురూరవుడు - దనుజులన్ దండించి

         విజయమ్ము జేకూర్చె - దేవతల కపుడు

       ఆనందమున పొంగి - దేవరాజదిగో

 

                 అర్ధాసనంబొసగి - సన్మా నమున్ జేసి

                          అచ్చరల నాట్యమ్ము - నేర్పాటుచేసె

 

         (కథకులు వెళ్ళుదురు)

 

వెలుగు పోయి వెలుగు వచ్చును

 

(ఇంద్రుడు, పురూరవుడు సింహాసనాసీనులై వుందురు - భరతముని ఒకవైపు పీఠము పై నుండును)

        

కం||    వినుమా భరతమునీంద్రా

         ఘనుడు పురూరవుడితడు కలన జయంబున్

         మనకిచ్చె గాన నీతని

         మనమలరన్ జూపుడయ్య మానితకళలన్

 

భరతముని:- కం||      మీరలు సంతోషపడగ

                          శ్రీరమ కల్యాణకథను రీతిగ నిపుడే

                          ప్రారంభింతురు కనుడీ

                          సారసలోచనలు పూని సదమల వృత్తిన్

 

అప్సరాంగనలారా! మీ కళాకౌశలమును ప్రదర్శింపుడు.

 

(రంభామేనకలు చెలులుగా ఊర్వశి లక్ష్మిగా రమాస్వయంవర కథను ప్రారంభింతురు - చెలులు లక్ష్మి కిరువైపులా నుందురు. లక్ష్మి వరమాల చేబూనియుండును)

 

 

చెలి-1:-             వరునెన్ను కొననెంచి - వచ్చేనూ

                 తగు-వరుని వరియింపంగ - వచ్చేనూ

 

రమయను నామమున - రంజిల్లు నీచెలువ

సాగరుని కూతురూ - చందురుని తో బుట్టు    |వరునెన్ను|                                                    

 

 

చెలి-2:- పన్నీట స్నానంబు -  తాజేసి చక్కగా

ధవళదుకూలములు - ధరియించి మెఱయుచూ    |వరునెన్ను|                                                       

 

 

చెలి-1:- అమ్మ యిటురమ్మ -  ఓ బంగారుబొమ్మా

         సాగరుడు మీ తండ్రి - దర్పమొప్పగ దీర్చె

 

చెలి-2:-  వరమంటపమ్మిది - పెండ్లి కొడుకులు వచ్చి

          వరుసగా కుర్చొండి - యున్నారు కనుగొమ్మ

ఇద్దరూ:-   అమ్మ ఇటురమ్మ - ఓ బంగారుబొమ్మ

             వరునిమెడ పూదండ - వేయవేయమ్మా

 

(రంగస్థలం మూడువైపులా పెండ్లికొడుకులను జూపింతురు)

 

చెలి1:- యక్షులకు రాజీతడమ్మా - ఇందీవరాక్షు డిత డమ్మా

         అందముగ చిరునవ్వు - చిందించు మోమునా

         నిత్యసంతోషమున - నుండునమ్మా యితడు

         తగినవాడనుకొన్న కొమ్మా - వరమాల వేయొచ్చు నమ్మా

 

చెలి2:- కిన్నెరుల ప్రభువీతడమ్మా - కీరనాధుండమ్మ యితడు

         వీణపై విన్యాసములకూ - పేరువడసిన వాడె కొమ్మా

         పేరురము గలవాడె యింతీ - పెన్నిధుల కధినాధు డితడు

         తగినవాడనుకొన్న కొమ్మా - వరమాల వేయొచ్చు నమ్మా

 

చెలి1:- గంధర్వపతి యీతడమ్మా - దివ్యధాముండమ్మ యితడు అంగసౌష్ఠవ మితని సొమ్ము - అస్త్రవిద్యాధికుండితడె కొమ్మా                 మంత్ర తంత్రములెన్నో యెరుగు - మహిమాన్వితుండగుచు మెలగు

తగినవాడనుకొన్న కొమ్మా - వరమాల వేయొచ్చు నమ్మా

 

 

చెలి2:- నాగనాయకుడీత డమ్మా - నీలకేతుం డితని పేరూ

శేషనాగుల కితడు ప్రియుడు - భోగభాగ్యము లితని పరము

 నాగాయుత బలము గలిగి - యెంత వారికి లొంగ డితడు

తగినవాడనుకొన్న కొమ్మా - వరమాల వేయొచ్చు నమ్మా

 

లక్ష్మి:- (ఒక చెలివైపు జూచి)  చెలియా!

               (రెండవ చెలివైపు జూచి)

 

    కం||        చెలియా యేలా శ్రమపడ                                         వలతున్ చూపింపు మా కువలయాంబకునిన్

           లలితున్ పురూరవనృపున్ (తడబడి సరిదిద్దుకొని)

            లలితున్ పురుషోత్తమునిన్                                                            అలవైకుంఠపుర వాసుడైవెలుగుహరిన్

 

భరతముని:- (వచనం) (కోపముతో) ఊర్వశీ.. ఆపు.. యేమియా నిర్లక్ష్యము, మైమరపు. పురుషోత్తముని పురూరవ నృపుడందువా! కామాతిరేకమున నీవు పవిత్ర కళను మలినపరచితివి. దివిజ లోకముననుండ నీవిక తగవు. కర్మభూమియగు భూతలమున బడిపోదువుగాక! (శపించి భరతముని వెళ్ళిపోవును. రంభా మేనకలు వెనక్కు జరుగుతూ బయటికి వెళ్ళుదురు. ఊర్వశి తలదించుకొని నిలుచుండును)

                                 

ఇంద్రుడు:- (వచనం) మిత్రా పురూరవా! భరతముని శాపము నీ యెడల  వరమేయైనది.

                 అవని జేరినయట్టి - ఊర్వశిన్ జెపట్టి

                 స్వర్గసుఖములునీవు - యిలలోనె పొందెదవు

                 చంద్రార్కతారలూ - నున్నంతవరకు

                 నీచరిత నిలచులే – పోయిరమ్మికను

(వెలుగు పోయి వెలుగు వచ్చును)

 

కథకుడు1:- భుమికేతెంచియా - పురూరవుండపుడు

            ఉర్వశిం గలసికొని - ఆమెనియమముల

              అం గీకరించి యా - ఇంతి కౌగిటను

            స్వర్గసుఖముల నెల్ల - బడసినా డారాజు

 

కథకుడు2:- (వచనం)  పురూరవునకు ఊర్వశి కొన్ని                             నియమముల  బెట్టిందా? యేమిటయ్యా అవి?

 

 

కథకుడు1:- తనతోడ వచ్చినా - తగరులన్ సాకమనె

             నగ్నముగ తనయెదుట - కనబడగరాదనె

             ఒకనాడు పొట్టేండ్ల - దొంగలెత్తుకపోవ

             వాటికొఱకై మరచి -నవగ్నముగ రాజేగి

            విడిపించుకొని వచ్చు - తరిజూచె నూర్వశి

 

 

కథకుడు2:- (వచనం) అరెరే.. నియమ భంగమైనది గదా! మరి                                        ఆ మీదటేమయ్యనో?

 

కథకుడు1:- (వచనం) ఊర్వశి పురూరవుని వదలి వెళ్ళిపోయినది.

 

కథకుడు2:- మరి

 

కథకుడు1:- (వచనం)అయిననేమి.. పురూరవుడు అనేక కష్టముల నెదుర్కొని, మరల ఊర్వశిని తనదానిగా జేకొనె. మరలవారు ఆనందలహరుల తేలియాడినారు.(కథకులు వెళ్ళిపోవుదురు ఉర్వశీపురూరవులు ప్రవేశింతురు)

పురూరవుడు:- సీ|| పుండరీకములను బోలునీ కనుదోయి

                          నీలభములసాటి నీదు కురులు                                 తిలపుష్పమనదగు నెలతనీ నాశిక

                          కంబువనగ నీదు కంఠమొప్పు

                      బింబఫలారుణ విధము నీ యధరంబు                                                    దానిమ్మగింజలే దంతచయము

                      నిమ్మపండననొప్పు నీ మేని వర్ణంబు                              పల్లవములు నీదు పాదయుగము

                                          

         ఆ:వె:-  పద్మ సమము ముఖము భామినీ యేమందు

                 అందమునను మరియు అభినయమున

                 మేటివైన నీకు సాటిలేరెవ్వరూ

                 చెలియ నాదు చెంత జేరరమ్ము

ఉర్వశి:-       ప్రియా!

 

         ప్రేమయనగ నేమొ తెలుప - వెలసినాము జగతి మనము

పురూరవ:- ప్రేయసీ!

 

వలపనంగ యిది యటంచు - లోక మెఱుగ మసలినాము నాయందచందములకు - తగిన జంట నీవె యనుచు

 నాకెనేను నా మనసును - నీ వశముగ జేసినాను

 

పురూరవ:-  ఇంతటి ప్రియమైన జంట - త్రిభువనముల లేదటంచు

              మెచ్చి విరుల జల్లులవిగొ - కురిపించెను విహాయసము

 

ఊర్వశి:-   నెనరూ ప్రేమలను గలిపి - నిన్ను నన్ను పోల్చిచూప

 

పురూరవ:-  సరిసరి యిది తగునటంచు - విశ్వమెల్ల                                                                       తలయూచెను

 

ఊర్వశి:- ప్రేమయనగ నేమొ తెలుప - వెలసినము జగతి మనము

 

పురూరవ:- వలపనంగ యిది యటంచు - లోక మెఱుగ                                                                    మసలినాము

 

 

 

 

కథకులు:- (వచనం) ఇవ్విదంబున ఊర్వశీపురూరవులు యిలపై యనురాగమొప్ప మెలగి శ్రూతాయువు, సత్యాయువు, శతాయువు, ఆయువనందగు పుత్రులెందరనో వడసి, చంద్రవంశమును చరితార్థము గావించి కడకు త్రిదివమున కేగిరి.     

 

శుభం.

 

                 మంగళం కోసలేంద్రాయా

                 మహనీయ గుణాత్మనే

                 చక్రవర్తి తనూజాయా

                 సార్వభౌమాయ మంగళం

v     

No comments:

Post a Comment

నాకు చదువురాదు, Naaku Chaduvu Raadu

  నాకు   చదువు   రాదు ( ఏకపాత్రభినయము )     (పాత్ర: ఓ 50 సంవత్సరాల  పేద పెద్దమనిషి ) అమ్మా!  శారదా ... ( బోరున   యేడ్చును ).  తల్లీ   యీ   గ...