రుక్మిణి
(పౌరాణిక పద్యనాటకం)
శ్రీకృష్ణ - రుక్మిణి
రచన
పి.సుబ్బరాయుడు.
42/490 భాగ్యనగర్ కాలనీ
కడప 516002
సెల్-9966504951
ఇందలి పాత్రలు
1. శ్రీ కృష్ణుడు
2. నారదుడు
3. రుక్మి
4. భీష్మకుడు
5. అగ్నిద్యోతనుడు
6. సారి
7. సంసారి
8. రుక్మిణి *
రుక్మిణి
(పౌరాణిక పద్యనాటకం)
నాంది- గేయం
రుక్మిణి కల్యాణకథా
బాగవతుల కల్పలతా
చిత్రచిత్ర గతుల కథా
ఇదిరుక్మిణి ప్రేమకథా!
చెల్లిమనసు నొప్పించిన
మూర్ఖుడైన అన్నకథా. //రుక్మిణి కల్యాణ//
మనసులోని మాటదెలిపి
హరికి వర్తమానమంపి
తన నగరికి రుక్మిణీ
కృష్ణుని రప్పించిన కథా! //రుక్మిణి కల్యాణ//
మొదటి రంగము
(ఆకాశ వీధి - నారదుని పాట)
జలరుహనేత్రా - జగదాధీశ
నారాయణ హరి - నమోనమో.
చరణం-1
సృష్టిస్థితిలయ - కారణభూత
బహిరంతర్గత - వ్యాపిత తేజా
కరివరదా హరి - కంసవిధారీ
పాలితమునిజన - పరమాత్మా
హరి.//జలరుహనేత్రా//
నారద:-ఆహా! పరమానంద మైనది. నాపాటకు నేనే మురిసిపోయి నాట్యము
చేయుచుంటిని అవును, అది ఆ పుండరీకాక్షుని గుణగణ
గానమహిమగాక నాపాటదేమున్నది. ఆహా!
కం: భూషణములు సెవులకు బుధ
తోషణము లనేకజన్మదురిదౌఘ విని
శ్శోషణములు, మంగళతర
ఘోషణములు గరుడగమను గుణభాషణముల్.
నారాయణ....నారాయణ (తెర లేచును)
(కుండిననగర అంతఃపురం ఆనుకొనియున్న ఉద్యానవనం. భీష్మకుడు
చంద్రకాంత శిలావేదికపై కూర్చొని యుండును. అటూఇటూ సారి సంసారీ నిలబడి వుంటారు.
రుక్మిణి చెంతనే పూలు కోస్తూ వుంటుంది)
నారద:- (ప్రవేశిస్తూ) నారాయణ....నారాయణ...
భీష్మకరాజన్యులీవేళ ప్రశాంతముగా ఉపవనమున విశ్రాంతి గైకొంటునట్లున్నారు.
భీష్మకుడు:- నారదమునీంద్రులకు స్వాగతం.
మహదానందము, నమస్సులు. రండు ఆసీనులుకండు.(లేచి
అరుగు చూపించును. తనూ మరొక అరుగు పై కూర్చొండును. ఇంతలో రుక్మిణి కూడా పూలసజ్జతోవచ్చి)
రుక్మిణి:-(నమస్కరిస్తు) దేవమునీంద్రులకు నమస్సుమాంజలులు.
నారద:- అరెరె.. ఈ బాలామణీ రుక్మిణి కదూ! ఎంతలో
ఎంతైనది? శుభమస్తు! శీఘ్రమేవ కల్యాణపాప్తిరస్తూ.(దీవించును).
రుక్మిణి:- (సిగ్గుతో) పొండి స్వామీ.. మీరు మరీనూ..(ప్రక్కకు
తొలగును)
భీష్మక:- ఆడపిల్లలు ఇదోఅదో అంటుండగానే పెద్దవారై
పోతారు. ఈబిడ్డ నా వరాలమూట,
అదృష్ట దేవత.
కం: భాలేందురేఖ దోచిన
లాలితయగు నపరదిక్కు లాగున మౌనీ
చాలవెలిగె నా గేహము
బాలికజన్మించి యెదుగ భాసురమగుచున్
అట్టి నా ముద్దులపట్టికి ఒక మంచి సంబంధం చూడండి. వివాహమహోత్సవం జరిపించి
"శుభం" అందాం.
సారి:- (ముందుకు వచ్చి) స్వామీ! తమరు కలహాశనులు.
సంసారి:- ఈ పెండ్లి పేరుతో ... పనిలో పనిగా...
సారి:- కలహ కల్పనలు చేసీ... లేనిపోని...
సంసారి:- తంటాలు తెచ్చిపెట్టరు గదా!
నారద:- తంటాలమారినని, నా కెందుకయ్యా అపప్రధ నంటగడతారు. నా చేతలన్నీ
లోకకల్యాణానికే గదా!
భీష్మక:- ఒరే సారి! సంసారీ.. కాసేపు నోరుమూసుకొని
వుంటారా! ముందు మునీంద్రులకు క్షమపణ చెప్పండి.
సారి:- తప్పయింది.
సంసారి, సారి:- క్షమించండి స్వామీ....
భీష్మక:- మహర్షీ వీరు అంతఃపుర సంరక్షకులు, బహు విశ్వాసపాత్రులు. మీదుమిక్కిలి
మా శ్రేయోభిలాశులు. కానీ కొంత అమాయకులు. వారి మాటలు మనసులోవుంచుకోకండి.
నారద:- మహారాజా.. ఈ కలహశన బిరుదము నా కేనాడో
అంటగట్టబడినది. వీరనుటలో తప్పేమున్నది. సరిసరి. అది యట్లుంచుడు. మహారాజా నేను
త్రిలోకసంచారిని. నాకుతెలియని రాకుమారులా? అయినా ఇంత లక్ష్మీకళ ఉట్టిపడితున్న మన రుక్మిణికి
తగిన... వరుడు...(రుక్మిణి ఓరగంట గమనిస్తున్నట్లు పసిగట్టి సాగదీస్తూ)
తగినవరుడు..తగిన వరుడు ఇంకెవరు మహారాజా... శ్రీకృష్ణుడు.
సారి:- అదీ.. అలాచెప్పండి
మా రాకుమారికి ఇంతప్పటినుండి (చేతులతో చూపిస్తూ) కృష్ణుడంటే..
సారి:- వల్లమాలిన గౌరవం..
సంసారి:- ఆభిమానం,
ప్రేమ..
భీష్మక:- కాస్తా ఆగండ్రా! కృష్ణుడంటే... ఆ ద్వారకావాసుడు, వాసుదేవుడే కదా!
నారద:-చక్కగా గ్రహించితిరి. అవును.. ఆ వసుదేవనందనుడే
మన రుక్మిణికి తగిన వరుడు. అతడు సాక్షాత్తూ హరియవతారము.
సీ: కర్ణావతంసిత కర్ణికార ప్రభ
గండభాగద్యుతి గడలుకొనగ
భువనమోహన మైన
భ్రూవిలాసంబుతో
వామభాగానత వదనమొప్ప
నపసవ్యకరమృదులాంగుళీ
చాతురీ
షడ్జధ్వనికి మర్మ సరణి
జూప
డాకాలి మీద నడ్డముసాచి
నిల్పిన
పదనఖద్యుతి భూమి
బ్రబ్బికొనగ
తే:గీ. మౌళిఫింఛము కంఠదామమును
మెఱయ
విలసితగ్రామముగ నొక్క వేణువందు
బ్రహ్మగాంధర్వగీతంబు పలుకజేయు
జతుర నటమూర్తి గోపాల చక్రవర్తి.
భీష్మక:- మునీంద్రా! మామనసులోని మాటే మీనోటా వినబడినది. బంధువు లందరు కూడ యీమాటే
పదేపదే చెబుతున్నారు. ఇదిగో! వీరిమాటకూడ విన్నారుగదా! అట్లేచేద్దాం. శుభస్య శీఘ్రం.
మాఅభిమతాన్ని తెలియజేస్తూ ద్వారకకు వర్తమానాన్ని వెంటనే పంపిస్తాం.(వింటున్న రుక్మిణి
సంతోష పడుతుంది)
రుక్మి:- (ప్రవేశిస్తూ నారదునకు నమస్కరించి) తండ్రీ!
తమరిక్కడున్నారా! నేను అంతఃపురమంతా గాలించి వస్తున్నాను. రామ్మా! రుక్మిణి.. నీకొక
శుభవార్త నా మిత్రుడు శిశుపాలునితో నీ వివాహముచేయ నిశ్చయించి, ఒక శుభముహూర్తము గూడా నిర్ణయించి
వచ్చితిని.
కం:- చెల్లీ! శిశుపాలమహీ
వల్లభుడురువిక్రముండు. వాని చెలిమినే
నెల్లప్పుడభిలషింతున్
వల్లెయన కులజులు, నిత్తు వానికి నిన్నున్.
(రుక్మిణి ఆమాటలు విని బాధపడుతూ మొగంత్రిప్పుకొంటుంది)
భీష్మక:- కుమారా నీ చెల్లి యీ సంబంధమునకు
సుముఖముగానునట్లు లేదు. నా మాటవినుము.
తే:గీ. సన్నిహితులెల్ల కృష్ణుడు
సముడటంచు
తలచుచున్నారు. నీ చెల్లితలపుగూడ
నట్టెయున్నది. పట్టకు మన్న పట్టు
ఆడు బిడ్డను బాధింప వీడు సిరులు.
రుక్మి:- తండ్రీ.. రుక్మిణి చిన్నపిల్ల. అమాయకురాలు.
తెలియనిపిల్ల. చెల్లెలి బాగోగులు అన్నగదా ఆలోచించవలె..
తే:గీ.
చేదియువరాజుతో పోల్చ రాదు
కృష్ణు
ఇతని వైభవ మెవ్విధి నతడు బొందు
ఆలమందల కాపరి యతనితోడ
నెయ్య మెట్టుల సేయుద మయ్య మనము.
కనుక తండ్రీ.. నామాట కడ్డుపడకుము. నారదమునీంద్రా మీరైననూ చెప్పుడు.
సంసారి:- రాకుమారా నారదమునీంద్రులు.. ముందే సెలవిచ్చి
యున్నరు గదా!
సారి:- ఏమి స్వామీ చెప్పండి....
నారద:- ఆఁ నామాటదేమున్నది.. మీయోచన బహుచక్కగా యున్నది
రాకుమారా..
సంసారి:- అదేమిటి స్వామీ...
సారి:- అప్పుడే మాట మారుస్తున్నారు..
భీష్మక:- మునీంద్రా... మీరేగదా....
నారద:- మహారాజా.. ఆమాటలు యువరాజులవారీ మాట అనక
ముందుటిమాటలు. ఏదో తోచిన సంబంధముల గూర్చి మాటవరసకు సలహా మాత్ర మిచ్చితిని గానీ..
యువరాజుమాటతో అవన్నీ రద్దు. ఇక.. యువరాజుమాటే మనందరిమాట.(మనసులో) ఇకనాకు కావలసినంత
కలహభోజనము లభింపనున్నది. అప్రయత్నముగనే నా ఆహారము నాకందుచున్నది. (ప్రకాశముగా)
మహారాజా యికనేను వెళ్ళివత్తును. నారాయణ....నారాయణ.(వెళ్ళును)
రుక్మి:- ముహూర్తమునకు పక్షము దినములే గడువున్నది.
వెళ్ళి పెళ్ళిపనులు వేగిరపరచవలసి యున్నది. ఇకనేను వెళ్ళివచ్చెద. (వెళ్ళును)
రుక్మిణి:- నాన్నా...(తండ్రి భుజముపై వ్రాలి రోదించును)
భీష్మకుడు:- అమ్మా...నేనేమి చేయుదును. మీయన్న
వట్టి మూర్ఖుడు. వాడిమాట వాడిదేకానీ,
మనమాట వినడు. నేను అశక్తుడను తల్లీ..అశక్తుడను. (అని బధపడుతూ
నిష్క్రమించును)
(రుక్మిణి కొంత బాధపడుతూ యోచించి, ఒక నిర్ణయమునకు వచ్చి సారిని చేతితోసైగచేసి
పిలుస్తుంది)
సారి:-(వచ్చి) అమ్మా!
రుక్మిణి:- సారీ.. నువువెళ్ళి వెంటనే బ్రాహ్మణోత్తముడైన
ఆగ్నిద్యోతనులవారిని దర్శించు. వారికి మా
విన్నపముగా చెప్పి వెంటనే పిలుచుకొనిరమ్ము.
సారి:- చిత్తము తల్లీ..(వెళ్ళును)
సంసారి:- (దగ్గరకు వచ్చి) అమ్మా.. మిమ్ములనుచూస్తుంటే
నాకు దుఃఖమాగడము లేదు.(ఏడ్చును) అమ్మా మీరు బ్రహ్మణోత్తములతో మాట్లాడి
పంపించునంతవరకూ మరెవ్వరూ యీ ఉద్యానవనమునకు రాకుండా ద్వారముకడ కావలి యుందును.
వెళ్ళివచ్చెదను తల్లీ (వెళ్ళును)
రుక్మిణి పాట..
నీరజ నయనా - నెనఱుజూపవా
నిన్నే నా మది - నిలిపిన దాన.
పంతముబూని - నా సహోదరుడు
ననునిను విడదీయ - మదినెంచి నాడు
వానినడ్డుకొన - నొకడునులేడు
నామొర వినవా - ఓ పరమేశా. // నీరజ నయనా //
జననంబాదిగ - నీవేగతియని
ఒక క్షణమైనా - నిన్ను మరువనూ
అట్టి నన్ను నిను -
మరచిపొమ్మనగ
నా తరమగునా-ఓ జగధీశా......// నీరజ నయనా //
కృష్ణా యనియన - ఓ యని పలికెద
వని నిను భక్తులు - పొగడగ వినమే
నా హృదిరేగిన -పరితాపమ్మును
బాపగ రావా - ఓ సర్వేశా.......// నిరజ నయనా //
(పాట అనంతరం సారి,
సంసారీ అగ్నిద్యోతనుడు వస్తారు. అగ్నిద్యోతనుడు రుక్మిణివైపు నడుస్తాడు సారీ, సంసారీ వెనక్కు సర్దుకుంటారు)
ఆగ్నిద్యోతనుడు:- స్వస్తి! (రుక్మిణి
నమస్కరిస్తుంది) అమ్మా.. రుక్మిణీ సారి విషయమంతా వివరించి చెప్పినాడు తల్లీ.
రుక్మిణి:- స్వామీ!..
తే:గీ. అన్న నెదిరింపలేడయ్య అయ్య గూడ
యింక నా మొరలినువార లెవరు గలరు
పతిగ శ్రీకృష్ణునిన్ నేను బడయకున్న
మరణమే శరణ్యంబయ్య మాన్య చరిత. (దుఃఖించును)
అగ్నిద్యోతనుడు:- రాకుమారీ రుక్మిణీదేవీ.. నేను
శ్రీకృష్ణుని భక్తుడను.నీ వంటి శుభగుణరాశి మా శ్రీకృష్ణదేవునకు పత్నియగుట యెంతేని
సమంజసము. నన్ను నమ్ము తల్లీ! నేను ద్వారక కేగి వాసుదేవునకు విషయమెఱింగించి, ఒప్పించి నిన్నుద్వాహమాడ
గొనివత్తును.
రుక్మిణి:- బ్రాహ్మణోత్తమా! ...
అగ్నిద్యోతనుడు:- ఇది తథ్యము తల్లీ.. అమ్మా
రుక్మిణీ..
కం. నీవిక
సేయకు మమ్మా
ఆవంతైనను విచార, మా శ్రీకృష్ణున్
యేవిధి నైనను దెచ్చెద
నీ వానందాబ్ఢి మునుగ
నీరజనయనా.
అమ్మా.. నీవిక భయము వీడి,
యిదిగో యీ తాళపత్రమున మా స్వామి గోపలకృష్ణునకు వివాహ మంగళ ప్రశస్తంబైన
సందేశమును లిఖించి యిమ్ము. కార్యము సానుకూలము జేసికొని వత్తును.(తాళపత్రమును
రుక్మిణి అందుకొని అరుగు పై కూర్చొని వ్రాయడం ప్రారంభించును)
సారి:- స్వామీ.. మీకు సాయముగా...
సంసారి:- మేమునూ ద్వారక వత్తుము.
సారి:- వెంటతీసుకొని లెళ్ళండి స్వామీ.
అగ్నిద్యో:- మిత్రులారా! ఇక్కడ మీఅవసరమేంతో
ఉన్నది. వైదర్భిని కంటికి రెప్పలా కాపాడుకోండి. రాకుమారి నిరాశానిస్పృహలకు
గురికాకుండా ధైర్యము చెబుతూ సమయానుకూలముగా నడచుకోండి
సంసారి:- అలాగేచేస్తాం. మారాకుమారికోసం ప్రాణాలైనాయిస్తాం.
అగ్నిద్యో:- ఈ విషయములన్నియూ రహస్యంగా ఉంచండి.
జాగ్రత్త. యువరాజుకు తెలిస్తే,
పని భగ్నమై పోతుంది.
సారి:- సరేసరే అలగేచేస్తాం. మీదారి బత్యమునకు టంకములు
సమకూర్చి...
సంసారి- మీ ఇంటికి చేరుస్తాం.
అగ్నిద్యో:-అలాగేకానివ్వండి. (ఇంతలో రుక్మిణి, వ్రాసిన తటియాకు నందిస్తుంది.
అగ్నిద్యోతనుడు రుక్మిణిని,
సారి, సంసారిని దీవించి ) ఇక మీరు
బయలుదేరండి అంతా శుభమే జరుగుతుంది.
(రుక్మిణి,సారి,సంసారి వెళ్ళుదురు)
అగ్నిద్యో:-ఆహాఁ.. యేమి నా భాగ్యము.
కం: శ్రీహరి యవతారంబై
మోహనరూపుడగు కృష్ణు, మురళీధరును
ద్వాహంబు గూర్చు భాగ్యం
బాహా నా కబ్బెను. మహదానందమయెన్
(తెరవ్రాలును)
రెండవ రంగము
(ఆకాశ నీధి - నారదుని పాట)
చరణం-2
జలరుహనేత్రా - జగదాధీశా
నారయణ హరీ - నమోనమో
శ్రీమహిళా ప్రియ - సర్వశక్తిమయ
కరుణారస ఝరీ - భవభయ హారి
భువనమోహనా - నందితసురగణ
దీనజనావన - నారాయణా....//జలరుహనేత్రా//
(తెర లేచును)
(ద్వారకలో అంతఃపురం - కృష్ణుడు కూర్చొని వుంటాడు)
నారద:- (ప్రవేసిస్తూ) నారాయణ..నారాయణ.
కృష్ణ:- (లేచి) నారద మునీంద్రులకు నమోవాకములు. (ఆసనము
చూపి కూర్చొండనిచ్చి, తానూ కూర్చొండును.
నారద:- పరంధామా! తమరేదో గంభీరమైన విషయమై ధీర్ఘాలోచనలో
నున్నట్లున్నారు.
తే:గీ. ధూర్త
కంసాది విమతుల దునిమివైచి
నెఱపినారయ్య శాంతిని నెనఱు మీర
మరల మోమున చిరునవ్వు తరిగె నేల
వివరమొక్కింత దెల్పవే వేదవేద్య.
కృష్ణ:- నారదా! నా యీ కృష్ణావతారము అనన్యసామాన్యము. భూభారము
నివారించుటకు యింకనూ అనేక కార్యములకు శ్రీకారము చుట్టవలసి యున్నది.
తే:గీ. జయవిజయులిల మూడవ జన్మమెత్తి
పూని నాపైన శత్రుత్వ మూనినారు
వారి నెదిరించి దండించి దారి చూపి
కలుపుకోవలె నాయందు కలుషమణచి.
వారు శిశుపాల దంతవక్రులై పుట్టి యిప్పటికే నన్ను నిందించుచూ దిట్టుచూ వారి
వైపునకు నన్నాకర్షించుచున్నారు. ఇవి గాక యిట్టిపనులు లింకెన్నేని గలవు. మహాభారత
సంగ్రామమున కప్పుడే బీజము పడిపోయినది. దాని నిర్వహణ బాధ్యతలు స్వీకరించి, మత్తులగు రాజులను రణభూమికి
బలిపెట్టి పాపభారము తగ్గించవలసి యున్నది. భక్తుల కాపాడవలసి యున్నది.
నారద:- కృష్ణా! ఇప్పుడు నాకర్థమైనది. శిశుపాలుడేల
రుక్మికి మిత్రుడై రమాంశయైన రుక్మిణీదేవిని పెండ్లాడ గోరుచున్నాడో.
కృష్ణ:- ఔను. శిశుపాలుడు నాకాగ్రహము కలిగించి నాచే
సంహరింపబడుటకూ, శాపవిముక్తి బడయుటకూ
శ్రమపడుచున్నాడు. కానీ అందులకింకనూ సమయమున్నది.
నారద:- అట్లయిన రుక్మిణీ కల్యాణము...
కృష్ణ:- ఈ కృష్ణునితో జరిగి తీరును. ఆ యువతి లక్ష్మి
యని నీకు తెలియునుగదా నారదా! లక్ష్మి హరిసొమ్ము. హరికే జెందును.
నారద:- ఈ విషయము రుక్మిణీదేవికి తెలియదా దేవదేవా!
కృష్ణ:- తెలియదు నారదా.. ఆందుకే ఆ కన్య నాకై పరితపించు
చున్నది. మానవ జన్మమెత్తి మాయలోపడి,
నను చేరుకొందునో లేనోనని,
రోదించుచున్నది. ఇప్పుడా కన్నియ జీవునకు ప్రతీకయై పరమాత్మను జేరుటకు తపించు
చున్నది. అచిరలాలములోనే తప్త బంగారమై రుక్మిణి శుభముల బడయగలదు.
నారద:- స్వామీ.. మీ లీలలు దెలియ నెవరి తరము.
భటుడు:- (బయటినుండి) ఎవరో పరదేశి బ్రహ్మణుడు, తమ దర్శన మభిలషిస్తున్నాడు ప్రభూ!
కృష్ణుడు:- మంచిది ప్రవేశపెట్టుడు.
నారద:- ఇదియూ తమరి భక్తపాలన కళాసంరంభమున భాగమేకాబోలు.
శ్రీకృష్ణదేవా యికనేను వెళ్ళి వచ్చెద. నారాయణ...నారాయణ.(వెళ్లును)
అగ్నిద్యోతనుడు:- (ప్రవేశిస్తూ) స్వస్తి శ్రీకృష్ణదేవా
స్వస్తి. (దీవించును)
కృష్ణ:- భాగవతోత్తమా! నమస్సులు. దయచేయండి, యీ ఆసనాన్నలంకరించండి.(లేచి ఆసనం
చూపించును.)
సీ:
జగతీసురేశ్వరా సంతోషచిత్తుండ
వైయున్న నీ ధర్మ
మతిసులభము
వృద్ధసమ్మతమిది.
విత్తమెయ్యదియైన
బ్రాపింప హర్షించు
బ్రాహ్మణుండు
తన ధర్మమున నుండు దరలడా
ధర్మంబు
కోరిక లతనికి కురియుచుండు
సంతోషి గాడేని శక్రుడైన
నశించు
నిర్ఢనుండైనను నింద్రు
బోలు
ఆ:వె. సంతసించెనేని సర్వభూత
సుహృత్త
ములకు బాప్త లాభ ముదితమాన
సులకు శాంతులకును సుజనులకును గర్వ
హీనులకును వినతు లే నొనర్తు.
విప్రోత్తమా!
ఉ. ఎవ్వని దేశమందునికి యెవ్వని చే గుశలంబుగల్గు
మీ
కెవ్వని రాజ్యమందు ప్రజలెల్ల సుఖింతురు వాడు
మత్ప్రియుం
డివ్వనరాశి దుర్గమన కెట్లరుదెంచితి వయ్య నీవు
లే
నవ్వులు గావు నీ తలంపునం గల మేలొనరింతు ధీమణీ.
ఆగ్నిద్యోతన:- దేవా!
చం:- వినుము విదర్భదేశమున వీరుడు
కుండినభర్తభీష్మకుం
డను నొక దొడ్డరాజుగల డాతనికేవురు పుత్రులగ్రజుం
డనయుడు రుక్మినాబరగు
నందరకున్ గడగొట్టు చెల్లెలై
మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినా
బ్రసిద్ధయై.
నేను కన్నియ పంపున మిము దర్శింపవచ్చితిని. అయ్యిందువదన మీకు కైకర్యంబు
సేయగోరి వివాహ మంగళ ప్రశస్తంబైన యొక సందేశంబు మీ పదకంజ యుగమ్ము చెంత నుంచుమని
నన్ను పంపినది.(లేచి నిలబడి)
కం: ఆ లలన
రూపు బుద్ధియు
శీలము లక్షణము గుణము
చింతింపగనా
బాలారత్నము మీ కి
ల్లాలుగ తగునయ్య దేవ, హరియవతారా.
ఇది మా రాకుమారి సందేశము. కాదుకాదు రుక్మిణీదేవి హృదయము. (అంటూ తాటియాకు నందించును.
కృష్ణుదు తీసుకొని నిలబడి చూపులు ఆ పత్రంపై నిలుపును. సీన్ స్టిల్ అవుతుంది. రంగము
కలర్స్‍వీల్ త్రిప్పి బ్లర్ చేయాలి. కృష్ణుడు, అగ్నిద్యోతనుడు బయటికి వచ్చేసి, రుక్మిణి స్టేజి మీదకు వచ్చేయాలి.
తిరిగీ స్టేజి ప్రకాశవంత మౌతుంది)
రుక్మిణి:-
* సీ: ఏ నీగుణములు కర్ణేద్రియములు సోక
దేహతాపంబులు దీఱిపోవు
నేనీ శుభాకారమీక్షింప గన్నుల
కకిలార్థలాభంబు
గలుగుచుండు
నేనీ చరణసేవ లేపొద్దుచ్చేసిన
భువనోన్నతత్వంబు
బొందగలుగు
నేనీలసన్నామ మే పొద్దు భక్తితో
దడవిన బంధసంతతులు వాయు
తే:గీ. నట్టి నీయందు నాచిత్త మనవరతము
నచ్చియున్నది నీయాన నాన లేదు
కరుణ జూడుము కంసారి ఖలవిదారి
శ్రీయుతాకార మానినీ చిత్త చోర.
శా: ధన్యున్ లోకమనోభిరాము
గులవిద్యా రూప తారుణ్య సౌ
జన్య శ్రీ బల దాన శౌర్య
కరుణాసంశోభితున్ నిన్ను నే
కన్యల్ గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా
జన్యానేకపసింహ, నావలననే జన్మించెనే మోహముల్
*ఉ: శ్రీయుతమూర్తి యో పురుషసింహమ, సింహముపాలిసొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ
ధ్యాయినియైన నన్ను వడిదా గొనిపోయెదనంచు నున్న వా
డా యధమాధముం డెఱుగ డద్భుత మైన భవత్ప్రతాపమున్
మ: వ్రతముల్, దేవ, గురు, ద్విజన్మ, బుధసేవల్ దానధర్మాదులున్
గతజన్మంబుల నీశ్వరున్ హరి
జగత్కల్యాణు గాంక్షించి చే
సితి నేనిన్
వసుదేవనందనుడు నా చిత్తేశుడౌగాక ని
ర్జితులై పోదురుగాక
సంగరములో జేదీశముఖ్యాధముల్.
*ఉ: అంకిలి సెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లి యో
పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే
యుంకువజేసి కృష్ణ పురుషోత్తమ జేకొని పొమ్ము వచ్చెదన్
*సీ: లోపలి సౌధంబులోన
వర్తింపంగ
దేవచ్చునే నిన్ను
దెత్తునేని
కావలివారల గల బంధువుల జంపి
కాని తేరాదని కమలనయన
భావించితేని నుపాయంబు
సెప్పెద
నాలింపు కులదేవయాత్ర జేసి
నగరంబు వెలువడి నగజాతకును
మ్రొక్క
బెండ్లికి మునుపడ మెండ్లి
కూతు
తే:గీ. నెలమి మావారు బంపుదు రేను నట్లు
పురము వెలువడి యేతెంచి భూతనాధు
సతికి మ్రొక్కంగ నీవు నా సమయమందు
వచ్చి కొనిపొమ్ము నన్ను నవార్యచరిత.
*మ: ఘనులాత్మీయ తమోనివృత్తి కొఱకై గౌరీశు మర్యాద నె
వ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వాంఛింతు రేనట్టి నీ
యనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్
నూఱు జన్మంబులన్
నిను జింతించుచు బ్రాణముల్ విడిచెదన్
నిక్కంబు ప్రాణేశ్వరా.
సీ: ప్రాణేశ నీ మంజుభాషలు వినలేని
కర్ణరంద్రంబుల కలిమియేల
పురుషరత్నమ నీవు
భోగింపగాలేని
తనులత వలని సౌందర్యమేల
భువనమోహన నిన్ను బొడగానగాలేని
చక్షురింద్రియముల సత్వమేల
దయిత నీ యధరామృతం
బానగాలేని
జిహ్వకు ఫలరస సిద్ధియేల
ఆ:వె. నీరజాతనయన నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణ మేల
ధన్యచరిత నీకు దాస్యంబు సేయని
జన్మమేల యెన్ని జన్మములకు.
(మళ్ళీ రంగస్థలం కలర్‍వీల్ తో బ్లర్ చేసి. రుక్మిణిని
బయటకు పంపి, తిరిగి కృష్ణుడు, ఆగ్నిద్యోతనుడు రంగస్థలం మీద
ముందుటి స్టిల్ లో నిలబడాలి. స్టేజి ప్రకాశవంతమవ్వాలి. ఈ సీన్‍లో "*" యీ
గుర్తుగల పద్యలు మాత్రం పాడుకొని మిగిలినవి వద్దనుకుంటే వదెలేయవచ్చును )
అగ్నిద్యోతన:- కృష్ణా... (కృష్ణుడు స్టిల్ నుంచి
యధాస్థితికి వస్తాడు)
ఉ. ఆ యెలనాగ నీకు దగు నంగనకున్ దగుదీవు మాయుపా ధ్యాయుల యాన పెండ్లియగు
దప్పదు జాడ్యములేల నీవు నీ
తోయము వారి గూడికొని
తోయరుహానన దెత్తుగాని వి
చ్చేయుము శత్రులన్ నుఱుముసేయుము, సేయుము శోభనంబిలన్.
కృష్ణుడు:- బ్రాహ్మణోత్తమా..
ఉ. కన్నియ మీద నాతలపు గాఢము
కూరుకురాదు రేయి నా
కెన్నడు. నా వివాహము సహింపక రుక్మి తలంచు. కీడు
నే
మున్నె యెరుంగుదున్ బరులమూకలడంచి కుమారిదెత్తు
వి
ద్వన్నుత మ్రానుద్రచ్చి నవవహ్ని శిఖన్ వడిదెచ్చు
కైవడిన్
కం: వచ్చెద విదర్భభూమికి
జొచ్చెదభీష్మకుని పురము సురుచిర లీలన్
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి
వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చిన పోరన్
అగ్నిద్యోతన:- దేవా! మనము శీఘ్రమే కుండినపురంబు
చేరవలె.
కృష్ణ:- అవశ్యము.. ఎవరక్కడ విదర్భకు వెంటనే బయలు దేరవలె.
రథము సిద్ధము చేయింపుడు.
మూడవ రంగము
(రాజాంతఃపుర ఉద్యానవనము - భీష్మకుడు
కూర్చొని వుండును. సారి,
సంసారి ఇరుప్రక్కలా నిలబడి యుందురు.)
సారి:- కుండిన నగర మంతయూ చాల సందడిగ నున్నది.
సీ. రచ్చలు
క్రంతలు రాజమార్గంబులు
విపణి దేశంబులు విశదములుగ
జేసిరి చందనసిక్త
తోయంబులు
గలయంగజల్లిరి కలువడములు
రమణీయ వివిధ తోరణములు
గట్టిరి
సకల గృహంబుల జక్కజేసి
కర్పూర కుంకుమాగరు
ధూపములు వెట్టి
రతివలు బురుషులు నన్ని
యెడల
ఆ:వె. వివిధ
వస్త్రములను వివిధ మాల్యభర
ణానులేపనముల నమరియుండి
రఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి
రుత్సవమున నగర మొప్పె రాజ.
సంసారి:- మహారాజా!
మ: భటసంఘంబులతో రథావళులతో
భద్రేభ యూధంబుతో
బటువేగాన్విత ఘోటక
వ్రజముతో బంధు ప్రియ శ్రేణితో
గటుసంరంరంభముతో
విదర్భతనయన్ గైకొందునంచున్ విశం
కట వృత్తిం జనుదెంచె
జైత్యుడు గడున్ గాంభీర్యమున్ జూపుచున్.
భీష్మకుడు:- ఏమైననేమి? నా బిడ్డ దుఃఖితయై యున్నది.
చం:-తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు కొప్పు
జక్కగా
ముడువదు నెచ్చెలి గదిసి ముచ్చటకున్ జన దన్నమేనియున్
గుడువదు నీరమున్ గొనదు
కూరిమి కీరముజేరి పద్యమున్
నొడువదు వల్లకీగుణ
వినోదము సేయదు డాయదన్యులన్
మనసుకు నచ్చిన ఆ శ్రీకృష్ణునితో నా బిడ్డ వివాహము చేయలేని అశక్తుడనైతిని.
ఒక్కగానొక్క ఆడుబిడ్డ. గొంతుకోయుచుంటిని. నా పాపమునకు నిష్కృతిలేదు. రుక్మిణి
సేదదీరుటకు ఉద్యానవనమునకు వచ్చును. మీరైననూ నాలుగు ఓదార్పు మాటలు పలుకుడు.
మీచేతులలో పెరిగిన బిడ్డ మీమాటలతో నా బిడ్డ కొంతైనా స్వాంతనము జెందగలదు.
సారి:- అలాగే ప్రభూ!
సంసారి:- నగరమంతా యేమనుకుంటున్నారో తెలుసా ప్రభూ!
సారి:-ఆ శిశుపాలుడు ధూర్తుడట..
సంసారి:-అతడు పుట్టినపుడు నాలుగు చేతులూ నొసటికన్నుతో
వికారస్వరూపుడై భయము గొల్పుచుండెనట.
సారి:- అసలు కృష్ణుడు తాకడంవల్లనే వాని దయ్యంరూపు
పోయి మామూలు మనిషయ్యాడట.
సంసారి:- అయినా ప్రభూ.. అతడు కృష్ణునకు మేనత్త కొడుకు.
సారి:- మన రుక్మిణికి వరుస కుదరదు. అతడు మన
రాకుమారికి సరిపోడు.
భీష్మక:- ఇవన్ని నాకు తెలియవనుకొంటున్నారా.. తెలుసు. ఆ
శిశుపాలుడు కృష్ణుని చేతిలోనే చస్తాడనికూడా తెలుసు. అందుకే నేనింత వ్యధజెందుతున్నాను.(కన్నీరు
తుడుచు కొనును).
సారి:- మరి యినన్నీ యువరాజుకు ..
సంసారి:- వివరించవచ్చుగదా మహరాజా!
భీష్మక:- చెప్పకేమి.. ఒకటికి పదిసార్లు చెవిలో
గూడుకట్టుకొని చెప్పితిని. వింటేనా? అదంతా కృష్ణుడు పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారమట.
అంతా కట్టుకథయట. నమ్మదగినవి కావని కొట్టిపారవైచినాడు. అంతేగకుండా యీ వివాహము వలన
రాజకీయ ప్రయోజన మున్నదట. మనరాజ్యము బలపడుతుందట.శత్రుదుర్భేధ్య మౌతుందట.
సారి:- రాజకీయములకూ ఆడుబిడ్డ జీవితమునకూ
ముడిపెట్టవచ్చునా? ప్రభూ!
సంసారి:- ఇది మరీ అన్యాయం ప్రభూ..
భీష్మక:- నిజమే. మీరన్నది అక్షరాలా నిజమే.. ఆడుబిడ్డ ఉసురు
తగులుతుందిరా! మూర్ఖూడా యని రుక్మికి యెంతగనో నచ్చజెప్పితిని. వాడు వినలేదు.
సరికదా.. రాజకుటుంబీకులకు రాజ్యంకోసం యిటువంటి త్యాగాలు తప్పవట. కృష్ణునితో సంబంధం
మనల్ని బలహీనుల్ని చేస్తుందట. అతడు హరియవతారమన్నది అబద్ధమట. కొడుకునకు
బుద్ధిగరపలేని తండ్రినైతిని. అంతా నాదురదృష్టము.
సారి:- అదిగో ప్రభూ! రాకుమారి ఉద్యానవనమున
ప్రవేశించినది.
సంసారి:- రాకుమారి యిటేవచ్చుచున్నది ప్రభూ! (రుక్మిణి
వచ్చి కూర్చొన్న భీష్మకుని ఒడిలో వ్రాలిపోయి విలపిస్తుంది)
భీష్మక:- అమ్మా రుక్మిణీ నన్ను క్షమించుతల్లీ.. నేనే
నీకు లేనిపోని ఆశలు కల్పించాను. కృష్ణునితో సంబంధము కుదురుస్తానని వృధామాటలు
పలికితిని తల్లీ. ఏమిచేయుదును యువరాజును కట్టడి చేయలేని దుర్బలుడను. నీ యెదుట
నిలబడుటకు కూడా అర్హత లేదు తల్లీనాకు.(కన్నీరు తుడుచుకుంటూ వెళ్ళిపోవును.)
సారి:- తల్లీ! చింతించకు విప్రుడు అగ్నిద్యోతనుడు ఈ
క్ష ణమో మరుక్షణమో శుభవార్తతేకపోడు. ఊరడిల్లు తల్లీ ఊరడిల్లు.
రుక్మిణి:- అయ్యా మీరు అంతఃపురరక్షకులేకారు, నాకు పిత్రుసమానులు. మీరునాకై పరితపింపవలదు. నేను కొరనోము నోచిన దానను. నా
దురదృష్టమునకు మీరేమిచేయుదురు. నన్ను యేకాంతమున నుండనిండు.
సంసారి:- మంచిది తల్లీ.. వెళ్ళిమేము ఉపవన ద్వారముకడ
వేచియుందుము.(వెళ్ళుదురు)
రుక్మిణి:- కృష్ణా! దేవాదిదేవా!
శా: లగ్నంబెల్లి వివాహమున్
గదిసె నేలారాడు గోవిందు డు
ద్విగ్నం బయ్యెడి మానసంబు
వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుం
డగ్నిద్యోతనుడేటికిందడిసె? నాయత్నంబు సిద్ధించునో
భగ్నంబై చనునో విరించికృత మెబ్బంగిన్
బ్రవర్తించునో.
మ: ఘనుడా భూసురుడేగెనో నడుమ
మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుడిది తప్పుగా
దలచెనో విచ్చేసెనో ఈశ్వరుం
డనుకూలింప దలంచునో తలపడో
యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుగునో యెఱుగదో
నాభాగ్య మెట్లున్నదో.
(అంటూ అలా నడుస్తూ రంగస్థలం దాటుతుంది. ఇటువైపు నుండి
సారి, సంసారి, అగ్నిద్యోతనుడు ప్రవేశిస్తారు)
సారి:- తమరొచ్చారు. బ్రతికించారు. లేకపోతే రాకుమారి
పరిస్థితి విషమస్థితికి జేరుకొనియుండెడిది. నిన్నటినుండి గమనిస్తున్నాము.
పిచ్చితల్లి యేదేదో మాట్లడుతున్నది.
ఉ: పోడను బ్రాహ్మణుండు
యదుపుంగవువీటికి వాసుదేవుడున్
రాడను నింకబోయి హరి
రమ్మని జీరెడు యిష్టబంధుడున్
లేడను రుక్మికిన్ దగవు
లేదిట జైత్యున కిత్తు నంచు ను
న్నాడను గౌరికీశ్వరికి
నావలనన్ కృపలేదు లేదనున్.
సంసారి:- బ్రాహ్మణోత్తమా!
ఉ: చెప్పదు తల్లికిన్ దలపు
జిక్కు దెశల్ దరహాస చంద్రికన్
గప్పదు వక్త్ర తామరసగంధ సమాగత భృగసంగమున్
రొప్పదు నిద్రగైకొన, దురోజపరస్పరసక్త హారముల్
విప్పదు, కృష్ణమార్గగత వీక్షణ
పంక్తుల ద్రిప్పదెప్పుడున్
సారి:- అదిగో రుక్మిణీదేవి.. (రుక్మిణి
స్తేజి లోకి రెండడుగులు మామూలుగావేసి,
అగ్నిద్యోతనుని చూచి చకచకా వచ్చి చేతులు జోడించి ఆతురతతో నిలబడుతుంది. సారి, సంసారి ప్రక్కకు తప్పుకుంటారు)
అగ్నిద్యోతనుడు:- (దీవించి) శుభమస్తు..
కల్యానమస్తు! అమ్మా.. రుక్మిణీదేవీ..
ఉ: మెచ్చె భవద్గుణోన్నతి. అమేయ
ధానావళు లిచ్చెనాకు దా
వచ్చె సుదర్శనాయుధుండు. వాడె సురాసురులడ్డమై
వచ్చిననైన రాక్షస వివాహమునన్ గొనిపోవునిన్ను.
నీ
సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించె
కన్యకా.
రుక్మిణి:- అయ్యా..
మ: జలజతేక్షణు తోడి
తెచ్చితివి నా సందేశమున్ జెప్పి నన్
నిలువంబెట్టితి నీ కృపన్
బ్రతికితిన్ నీయంత పుణ్యాత్మకుల్
గలరే దీనికి నీకు
బ్రత్యుపకృతిన్ గావింప నేనేర నం
జలిగావించెద
భూసురాన్వయమణీ, సద్భంధ్సుచింతమణీ
అగ్నిద్యోతనుడు:- మంచిది తల్లీ.. ఇక నీవు నిర్భయవై
మీకులాచార ప్రకారము రేపటి దినమున దుర్గ గుడికి పెళ్ళికూతురివై ప్రవేశింపుము. ఇక..
మ: ఖగనాథుండమరేంద్రు గెల్చి సుధమున్
గైకొన్న చందంబునన్
జగతీనాథుల
జైద్యపక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భ
ద్రగుడై చక్రి వరించు
నిన్ను రమణీ రాజీవగంధీ! రమా
భగవత్యంశభవా! మహాగుణమణీ!
బాలామణీ! రుక్మిణీ.
ఇక నేను వెళ్ళివచ్చెద తల్లీ..(దీవించి వెళ్ళును)
రుక్మిణి:- పాట.
ఆమని అడుగిడి - నామానస వని
నవ్యకళామయ - కాంతుల
నిండెను
గ్రీష్మము పోదని - తొలకరి రాదని
చిగురించుట యీ - జన్మకె లేదని
దిగులేలనె - ఓ మల్లియతీగ
కనవే కురిసెను - సుధజల్లులవే //ఆమని అడుగిడి//
ముసిరిన చీకటి -
విడిపోదనుచును
వెన్నెల రాత్రులు -
ఇకలేవనుచును
కుందెద వేలనే - నీలి
గగనమా
కనవే జాబిలి -
కనుపించెనదే //ఆమని అడుగిడి//
ప్రియునిరాకకై- పరితపించునా
మదిలోయలమిన - ఘనతిమిరమ్ములు
వచ్చెనదే యదు _ సింహు డనంగను
సురుచిరములవే - దీపించినవీ // ఆమని అడుగిడి//
(పాట అనంతరం సారి,
సంసారి ప్రవేసిస్తారు)
సారి:- అమ్మ.. రుక్మిణీదేవీ సర్వం గ్రహించాం.
సంసారి:- మహదానందభరితుల మయ్యాం.
సారి:- పద తల్లీ.. ఇక అంతఃపురం వెళదాం.(అంటూ అందరూ ముందుకు
కదులుతారు. స్టేజిదాటి, తిరిగీ సారి సంసారి స్టేజిలోనికి
వచ్చి)
సారి/సంసారి:- (ఒక్కొక్క లైను ఒక్కొక్కరుగ
పూర్తి చేస్తారు)
మ: తగునా చక్రి విదర్భరాజసుతకున్
దథ్యంబు వైదర్భియున్
తగునా చక్రికి నింతమంచి
తగునే దాంపత్య మీయిద్దరిన్
తగులంగట్టిన బ్రహ్మనేర్పరిగదా
దర్పాహతారాతియై
మగడౌ గావుత జక్రి యీ
రమణికిన్ మాపుణ్య మూలంబునన్.
తెరవ్రాలును
నాల్గవ రంగము
(దుర్గ గుడి. అగ్నిద్యోతనుడు
పూజారిగా నుండును. రుక్మిణి పూజచేయుచుండును)
రుక్మిణి:- పాట
మదిని నిన్నె దలచితి -
హరిని పతిగ గోరితీ
ఏలనమ్మ యీ పరీక్ష -
నాదుకోర్కె దీర్చరమ్మ
హరు శరీర మర్థమగుచు -
పతిని విడువలేదు నీవు
ప్రేమ విలువ నిన్ను మించి - తెలిసినవారెవరు
తల్లీ
నీ పదముల వ్రాలినాను - నీ
శరణము జొచ్చినాను
నన్నుగావ వేరెవ్వరు -
లేరు తల్లి నీవు దక్క .....//మదిని నిన్నె//
నిన్ను నమ్మి నీ గుడికి - వచ్చినన్ను గొనిపొమ్మని
హరికి కబురు పంపినాను - తెగువచేసి నిలిచినాను
తల్లీ హరి నీ కోవెల - ననుహరింప వచ్చు వేళ
ఏ విఘ్నము కలుగకుండ - మాతోడుగ నిలువు మమ్మ..//.మదిని
నిన్నె//
ఉ: నమ్మితి నామనంబున
సనాతనులైన యుమామహేశులన్
మిమ్ము పురాణదంపతుల మేలు
భజింతు గదమ్మ మేటిపె
ద్దమ్మ దయాంబురాశివి
గదమ్మ హరిం బతిసేయుమమ్మ నిన్
నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ.
(సారి,
సంసారి ప్రవేసింతురు.)
సారి:- అమ్మా రుక్మిణీదేవీ.. నీ పూజ ఫలించిందమ్మా..
సంసారి:- రథారూఢుడై శ్రీకృష్ణుడు వచ్చి గుడిముందు
దిగినాడు...
సారి:-ఆ పరమపురుషుని చూచినంతనే మొహరించిన సైనికులందరూ
విభ్రమమునకు లోనై నిశ్చేస్టులై..
సంసారి:- నిలువు గుడ్లు వేసుకొని అట్టే నిలబడి పోయారు
తల్లీ..
సారి:- అదిగో ఆ గోపాలకృష్ణమూర్తి దేవ్యాలయము
ప్రవేశిస్తున్నారు.
(కృష్ణుడు ప్రవేశించును. సారి విషయము
గమనించుటకు బయటికి లెళ్ళును కృష్ణుడు రుక్మిణి ప్రక్కకుచేరి చిరునవ్వునవ్వి దేవికి
నమస్కరించును)
కృష్ణుడు:
ఊ: అమ్మలగన్నయమ్మ ముగురమ్మల
మూలపుటమ్మచాలపె
ద్దమ్మ సురారులమ్మ
కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల
మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృపన్ యనుజ్ఞ
నిడుమమ్మ, గ్రహించెద నమ్మ రుక్మిణిన్
(రుక్మిణి చేయి పట్టుకొనును)
సారి:- (బయట గమనించివచ్చి) అమ్మా రుక్మిణీదేవీ! ఇక
బయలుదేరండి. వార్త యువరాజులవారికి చేరిపోయింది.
కృష్ణ:- తొందరేమున్నదీ బావగారి మర్యాదలు గైకొనియే
వెళ్ళవచ్చును.
అగ్నిద్యోత:- శ్రీకృష్ణదేవా! హాస్యమునకిది
సమయముగాదు. అవాంచిత రక్తపాతము రాకుమారి కిష్టము లేదు. అందుకేగదా యీయేర్పాటు.
కృష్ణా! మన్నింపవలయును.
కృష్ణ:- అట్లైన మేమునూ ఆలోచిచవలసినదే... సరిసరి యిక
మేము వెళ్ళివత్తుము (కృష్ణుడు,
రుక్మిణి నమస్కరింతురు)
(సారి,
సంసారి, అగ్నిద్యోతనుడు అక్షతలు చల్లి
దీవిస్తూ చేతులు పైకెత్తుదురు. రుక్మిణీ కృష్ణులు వెనక్కి వెనక్కి నడుస్తూ
చేయీచేయీ పట్టుకొని గుడి గడప దాటుదురు.)
అగ్నిద్యోత:- ఆహా! యేమి మన రాకుమారి రుక్మిణీదేవి దేహకాంతి, ముఖవర్చస్సు. శ్రీకృష్ణుని పొడగన్న
ఆ ఇంతి మేఘమద్యంబు వెలువడి విలసించు,
క్రొక్కారు మెఱంగు తెరంగున,
మృగధర మండలంబు నిర్గమించి చరించు మృగంబు చందంబున, కమలభవుండెత్తిన జవనిక మఱుగు దెరలి
పొడసూపిన మోహినీదేవత కైవడి,
దేవదానవ సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాణ పన్నగేంద్ర పాశపరివలయిత పర్యాయ
పరిభ్రాంత మందరాచల మంథాన మధ్యమాన ఘూర్ణిత ఘూమఘుమాయిత మహార్ణవ మధ్యంబు నుండి
చనుదెంచు నిందిరాసుందరివైభవమునకు దీటుగా కృష్ణకరగ్రహణంబున దేదీప్యమానంబుగ
వెలింగినది.
సారి:- మరి యా ద్వారకావాసుడు గోవిందుడో.. చంద్రమండలముఖుడై
సంసారి:-కంఠీరవేంద్రావలగ్నుడై
సారి:-నవాంభోజదళాక్షుడై
సంసారి:- చారుతర వక్షుడై
సారి:- మేఘ సంకాశ దేహుడై
సంసారి:- నగారాతి గజేంద్రహస్త నిభ బాహుడై
సారి:- ఆహాఁ కన్నులవిందు చేసెను.
ముగ్గురూ:- ఇదెల్ల కనులారాగాంచిన మన అదృష్టమే అదృష్టము.
(ఇంతలో రుక్మి క్రోధావేశుడై వచ్చును)
రుక్మి:- ఓరీ.. సారీ, సంసారీ.. ఎక్కడరావాడు? నాచెల్లెలి నపహరించవచ్చిన ఆగోపాలాధముడెక్కడ?
సారి:- ఇంకెక్కడ రాకుమారా!.. అగ్నిద్యోతన స్వామిని
లెక్కసేయక ..
సంసారి:- మమ్ములను చితకబాది.
సారి:- రాకుమారి చేయిబట్టుకొని..
సంసారి:- అదేపోత...
రుక్మి:- ఛీ.. పిరికిపందలు(సారీ, సంసారికి రెండు తగిలించి) ప్రక్కకు
జరగండి. విదర్భదేశ వీరసైనికులారా! మీశస్త్రాస్త్రములు ధరించి వేగిరం బయలుదేరండి. ఆ
ఆలకాపరి నడ్డగించండి.( ఆలయ ముఖద్వారంవద్దకువెళ్ళి బయటకు చూపు సారించి)
మ: ఘనసింహంబులకీర్తి నీచమృగముల్
గైకొన్న చందంబునన్
మనకీర్తుల్ గొని
బాలదోడ్కొనుచు నున్మాదంబుతో గోపకుల్
సనుచున్నారదె శౌర్య
మేమిటికి మీ శస్త్రాస్త్రముల్ గాల్పనే
తనుమధ్యన్ విడిపింప మేని నగరే
ధాత్రీజనుల్ క్రంతలన్
ఓరీ.. యాదవకులాధమా ఏమిరానీదుస్సాహసము. నీకు పోగలము దాపురించి ముముజెనకినావు.
ఫలితమనుభవింతువు గాక.
కం: చొచ్చెద వెక్కడ కృష్ణా
వ్రచ్చెద నీ సేనలెల్ల వలవల నేడ్వన్
నొచ్చెదరును విచ్చెదరును
జచ్చెదరును నేడు రుక్మిశస్త్రాస్త్రములన్.
(బయటికి వెళ్ళును)
సారి:-ఇప్పుడు కృష్ణుడొక్కడు కాడు. వారి అగ్రజులు
బలరామదేవులు కూడా సైన్యసమేతులై కృష్ణునకు తోడై యున్నారు.
అగ్నిద్యోత:- నీవు బయటకు వెళ్ళినపుడు యీ సమచారము
తెలిసినదిగదా! ఆ విషయము రుక్మికిగూడా చేరిపోయినట్లున్నది. అందుకే సైన్యసమేతముగా వెంబడించు చున్నాడు.
సారి:- అబ్భో గొప్పభీరములు పల్కెను... చంపునో మరి..
సంసారి:- చచ్చుబడి వచ్చునో!
అగ్నిద్యోత:- చూడవలె మరి..
(ఆందరూ నవ్వుదురు. అగ్నిద్యోతనుడు దేవీ ప్రసాదము పంచును
సారీ,సంసారి కళ్ళకద్దుకొని
స్వ్వీకరిస్తారు)
అగ్నిద్యోత:-సారీ, సంసారీ.. ఇకపదండి. వెళ్ళి శిశుపాలునితో
పెళ్ళిగండం గడచిందనీ, రుక్మిణి కృష్ణుని కరగ్రహణంచేసి
రథమెక్కి కృష్ణునివెంట ద్వారక వెళ్ళిందనీ
భీష్మకమహారాజులవారికెరిగిద్దాం.
సారి:- ఔనౌను.. వెంట నే తెలియజేయలి.
సంసారి:- హహారాజులవారు మహదానందభరితులౌతారు.
అగ్నిద్యోత:- పదండి యికవెళదాం.(కదులుదురు)
(తెర పడును)
ఐదవరంగము
(ఆకాశంలో నారదుని పాట)
జలరుహనేత్రా - జగదాధీశ
నారాయణ హరి - నమోనమో.
మాయామానుష - సంస్థిత దేహ
దివ్యకళామయ - దీపిత రూప
త్రిగుణాతీత- త్రిభువన నేత
గగనసదృశా - ఘనతాప హార....//జలరుహనేత్రా//
పరమాత్మస్మరణలో తన్మయత్వముచెంది నే నిప్పుడెక్కడకుచేరితినో తెలియరాకున్నాది.
(క్రిందకు చూచి) అరెరే.. భూమిపై యేమిటీ భీభత్సము. మహాసంగ్రామము జరిగినట్లున్నది.
(జాగ్రత్తగా గమనించి) ఔరా యివి మగధ,
చేది, సాళ్వ, విదర్భ సైన్యములు. భయభ్రాంతులై
పరుగులు దీయుచున్నారు. యాదవవీరులు వారిని అవలీలగా జయించి తరుము చున్నారు. అదిగో
అక్కడ జరససంధ సాళ్వ శిశుపాలురు గాబోలు యేదో చర్చించుకొని తోకముడిచి వెనుదిరిగి
వెళ్ళుచున్నారు. అయ్యో.. యిడిగో రుక్మి యిక్కడ ఒంటరివాడై బుసలు గొట్టు చున్నాడు. రోషము
తగ్గలేదు యిప్పుడే అశ్వారూఢుడై ద్వారక వైపు పరుగు పెడుతున్నాడు. పరిస్థితిని
బట్టిచూడ శ్రీకృష్ణులు రుక్మిణీ అపహరణము పరిపూర్ణము గావించినట్లున్నారు. కథ మంచి
రసకందాయమున బడినది. వీక్షించెదగాక! నారాయణ..నారాయణ.(నారదుడు స్టేజి బయటికి నడచును)
(తెర లేచును)
(అటవీ ప్రదేశం - రుక్మిణీకృష్ణులు ప్రవేశం)
కృష్ణుడు:- దేవీ! యాదవ వీరులముందు శత్రుసైన్యములు నిలువలేక
పోయినవి. యదువీరులు విజయగర్వమున ద్వారకకు బయలుదేరినారు. ఇక రుక్మిణీదేవి
ద్వారకనడుగిడుటే ఆలస్యము ఘనస్వాగతము లభించును కాబోలు.
రుక్మిణి:- స్వాగతము నాకా? ఓడిపోయిన ఒక అన్న చెల్లెలిని.
కృష్ణ:- ఆహాఁ .. చతురమతివే.. స్వాగతము
రుక్మిచెల్లెలికికాదు, ఈ నందనందనుని ఓరచూపుతో యిట్టే
పరాజితునిజేసిన విదర్భరాకుమారికి.
రుక్మిణి:- పొండి స్వామీ! మీతోమాటలాడగల సమర్ధులెవ్వరు..
అంతా మీలీలయేగదా..
కృష్ణ:- (నవ్వి).. రుక్మిణీ ఈ వనప్రాంతము చాల
రమణీయముగా నున్నది.
ఉ: నీలపురంగు నింగిఁ గిరి
నెత్తికి నెత్తుక నిల్చి నవ్వుచు న్
శైలపుటంచు నుండి దిగజారు
ఝరుల్ సితకాంతులీనుచున్
వేలవిరుల్ సువర్ణరుచి
వింతగ నింపుచు తీవెలూగుచున్
నేలకు నిన్ని యందములు
నిండుగగూర్పవె హాయిగొల్పుచున్
ఇచ్చట నొక్కింతసేపు విశ్రాంతి గైకొని బయలుదేరుదము. ఇంతలో రథాశ్వములు సేదదీరి
ప్రయాణమునకు సిద్ధము కాగలవు.
రుక్మిణి:- అవశ్యము.
రుక్మి:- (ప్రవేశించి) ఓరీ.. పశువులకాపరీ కృష్ణా!
యేమిరానీ కండకావరము. నాచెల్లేలినే అపహరించి తెత్తువా? నే నప్పుడే పరాజితుడనైతినని
సంబరపడుచున్నావు కాబోలు. నీవేకాదు నీయట్టివారు వేయిమందైననూ నన్నెర్చి బ్రతకలేరు. ఊ
కాచుకో..
కృష్ణ:- రుక్మీ.. తొందరపడకు శాంతము వహించు.
అయినదేదోఅయినది. నేను నీతో చెలిమి నభిలషిస్తున్నాను. నెయ్యము నెఱుపనెంచినాను.
రుక్మి:- ఓరీ.. చోరాగ్రణీ! గోపికావస్త్రాపహారీ! నీతో
విదర్భాధీశులు నెయ్యము చేయవలయునా? నీవెక్కడ? మేమెక్కడ?
సీ: మాసరివాడవా మాపాపగొనిపోవ
నేపాటిగలవాడ వేది వంశ
మెందుజన్మించితి వెక్కడ
బెరిగితి
వెయ్యది నడవడి
యెవ్వడెరుగు
మానహీనుడవీవు మర్యాద
లెరుగవు
మాయగైకొని గాని మలయరావు
నిజరూపమున శత్రు
నివహంబుపైబోవు
వసుధేశుడవుగావు వానిలేదు
ఆ:నె. కొమ్మనిమ్ము నీవు
గుణరహితుడవు
విడువు. విడువవేని విలయకాల
శిఖిశిఖాసమాన శితశిలీముఖముల
గర్వమెల్ల గొందు గలహమందు.
కృష్ణ:- ఏమంటివేమంటివి. నేను మీసరిగాననియా? ఔను నేనెక్కడ? నీవెక్కడ? బావా కొంచమాలోచించుము. నీవునన్ను తెగడుచున్నావా? లేక పొగడుచున్నావా?
రుక్మి:- నీవు మాయలమారివి. మాటల చమత్కారివి. నీతోనాకు మాటలేమిటికి.
చేవుంటే రా! నాతోతలపడు. (ఖడ్గము ఒరనుండిబెరికి మీదికిబోవును.)
(వెంటనే రుక్మిమణికట్టు కృష్ణుడు ఒడిసిపట్టి
మెలివేయును. ఖడ్గము చేజారి క్రిందపడిపోవును. అదేపట్టుమీద చేతిని మరింత వడద్రిప్పి
కాలితో గట్టిగా తన్నడంతో క్రిందపడిపోవును. లేచునంతలో కృష్ణుడు ఖడ్గము దీసుకొని
రుక్మిగుండె కానించును.)
రుక్మిణి:- (వచ్చి కృష్ణుని పాదములు బట్టుకొని)
మత్త: నిన్ను
నీశ్వరు దేవదేవుని నిర్ణయింపగ లేక యో
సన్నుతామర కీర్తిశోభిత సర్వలోకశరణ్య మా
యన్న యీతడు నేడు చేసె మహాపరాధము నీయెడన్
నన్ను మన్నన చేసికావు మనాథనాథ దయానిధీ
స్వామీ!
మత్త: కల్లలేదని విన్నవించుట
గాదు వల్లభ యీతనిన్
బ్రల్లదుం దెగజూచి తేనియు భగ్యవంతులమైతిమే
మల్లుడయ్యె ముకుందు డీశ్వరు డంచు మోదితులైన మా
తల్లిదండ్రులు పుత్రశోకము దాల్చి చిక్కుదు
రీశ్వరా!
కృష్ణ:- రుక్మీ.. నీవు నా రుక్మిణి అన్నవైనందున
బ్రతికితివి. ఇట్టి సాహసమునకు మరెప్పుడునూ పూనుకొనకుము. (అంటూ ఖడ్గము రొమ్ముపై
నుండి దీసి మీసము మరియూ తల చారలు చారలుగా గొరిగివేయును. ఇందు కొఱకు కలర్‍వీల్ తో
స్తేజి బ్లర్‍చేసి విగ్గు మార్చవచ్చును. ఇంతలో సారి, సంసారి ఆయాస పడుతూ స్తేజి పైకివస్తారు)
సారి:- (రుక్మివద్దకు వచ్చి) ప్రభూ.. మీరు..
సంసారి:- మీరేనా యువరాజా! (ఏడ్చును)
రుక్మి:- సరిసరి.. చేది, సాళ్వ,
మగధాధీశులేమయ్యారు. ఇంకనూ రారే..
సారి:- ప్రభూ.. వారు యెప్పుడో తిరిగి వెళ్ళిపోయారు. ఈ
కన్యగాకుంటే మరోకన్య. పెళ్ళిజేసుకోవడానికి..
సంసారి:- పిల్లలే కరువయ్యారా! ఈ రచ్చతో మనకేంపని..
సారి:- అని వెళ్ళిపోయారట ప్రభూ.. మీక్షేమసమాచారం ..
సంసారి:- తెలుసుకొని రావటానికి మహారాజుగారు..
సంసరి:- మమ్మల్ని పంపారు.
రుక్మి:- ఏడిచారు.
కృష్ణ:- రుక్మీ.. చింతచచ్చినా పులుపుచావలేదన్నట్లుంది
నీ వాలకం. ఏమినీ వెఱ్ఱి. శిశుపాలజరాసంధులేకాదు. లోకములన్నీ ఒక్కపెట్టున
దండెత్తి వచ్చినను యీ కృష్ణుని ధాటికి ఒక్కక్షణమైనను నిలువజాలరు. నీ
మిత్రులిది యెరిగియే పలాయనము చిత్తగించిరి. నీవు మూర్ఖాతిమూర్ఖుడవై నన్నెదిరించ
సాహసించితివి. ఫలితమనుభవించితివి.
నారద:- (ప్రవేశించి) నారాయణ..నారాయణ. పరంధామా
యేమిటిది..
కం: తలమనక భీష్మనందను
తలయును మూతియును గొఱుగ దగవే బంధుం
దలయును మూతియు గొరుగుట
తల దఱుగుటకంటె దుచ్ఛతరముమహాత్మా.
శ్రీకృష్ణదేవా!
కం: కొందఱు
రిపులని కీడును
కొందఱు హితులంచుమేలు గూర్పవు నిజమీ
వందరి యందును సముడవు
పొందగనేలయ్య విషమబుద్ధి ననంతా.
కృష్ణ:- మహర్షీ.. యిది కేవలమూ అతని తప్పిదమునకు
దండనమాత్రమే గానీ నాకేల యీతనితో వైరము. నేనప్పుడూ, యిప్పుడూ,
యెప్పుడూ సమదర్శినే. రుక్మిపై నాకిసుమంతైననూ కోపములేదు. రుక్మీ.. వెళ్ళు..
వెళ్ళీ బుద్ధి మంతుడవై మసలుకొనుము.(రుక్మి తలదించుకొని సిగ్గుతో వెళ్ళును. వెంట
సారి, సంసారికూడ వెళ్ళి మరల యీ యిద్దరూ
స్టేజి మీదకు వచ్చి చిరునవ్వుతో రుక్మిణీ కృష్ణులను ఆశీర్వదించి మరలి పోవుదురు)
నారద:- ఆహాఁ! భక్తమానససరోవర రాజీవా! లీలామనుష విగ్రహ!
రమారమణా! కృష్ణా! నీవు వైదర్భీసమేతుడవై మెరగు చెంగటనున్న మేఘంబు కైవడి
విరాజిల్లుచున్నాడవు. నూత్నవధూవరుల రూపమున మిముకనుంగొని నా మానసమానందాబ్ది
నోలలాడుచున్నది.. ఔరా..అదిగో దేవతలు ఆకాశమునుండి పూలవర్షము గురిపించుచున్నారు.
(మాటతోనే పూలవర్షము కురియును నారదుడు తన వీణపై నుంచుకొని యున్న పూమాలలనందించి రుక్మిణీ
కృష్ణులను మార్చుకోమ్మని సైగచేయును. రుక్మిణీ కృష్ణులు మాలలు మార్చుకొందురు.
క్రొత్తవధూవరులవలె కరగ్రహణముచేసి నిలుచుందురు. నారదుడు ఆశీర్వదించును)
కం: రాజీవలోచనుడు హరి
రాజసమూహమ్ము గెలిచి రాజసమొప్పన్
రాజముఖి రుక్మిణి కరము
రాజిల్లగ మామనంబు రహిబట్టె దగన్
ఇయ్యది మహత్తర ఘట్టము. వీక్షించినవారి అదృష్టమే అదృష్టము.
నారాయణ..నారాయణ.(వెళ్లును)
(రుక్మిణీ కృష్ణులు ఒకరినొకరు ఓరచూపులు చూచుకొని
యుగళగీతం పాడుకొందురు)
కృష్ణ: వలచినచెలునిటు - దరిజేరుకొని
తగునే యీవిధి- బిడియము నను బడ
రుక్మిణి:
వలచిన ప్రియుడే - దరిజేరుకొన
ఏలనొ బిడియము - నాయెద బొడమెను
కృష్ణ:
ప్రకృతి పురుషులు - మురిపెములాడ
వలదనవలదే - సిగ్గులు
దాకొన
రుక్మిణి:
వలదని యెంతగ - సముదాయించిన
వదలక మరిమరి - చేసెను గేలీ.. //వలచినచెలు//
కృష్ణ:
చందనపరి - ష్వంగమునకునై
తదబడనేల నే - భోగినీ సఖీ
రుక్మిణి: గోవిందా! నీ - కెందుకు తొందర
నీ కరములనే -
చిక్కినదాన..//వలచినచెలు//
(పాట ముగుస్తుండగా స్టిల్ లోకి రుక్మిణీ కృష్ణులు
వస్తారు. తెరదిగుచుండగా చరమ గీతం వినబడుతుంది)
చరమగీతం
రుక్మిణి కల్యాణకథా
భాగవతుల కల్పలతా
చిత్రచిత్ర గతులకథా
ఇది రుక్మిణి ప్రేమకథా
వధువుకు తగు వరుని గూర్చి
పెండ్లి త్వరిత గతిని
జరుపు
మహిమాన్విత మైన కథా
శుభములనిడు
పుణ్యకథ.//రుక్మిణి//
శుభం భూయాత్ - ఓం తత్ సత్
No comments:
Post a Comment