ప్రకాశం
(సాంఘిక నాటకం)
రచన
పి.సుబ్బరాయుడు.
42/490. భాగ్యనగర్ కాలనీ
కడప -516002
సెల్-9966504951
ప్రకాశం
(సాంఘిక నాటకం)
ఇందలి పాత్రలు
1. ప్రకాశం (32)
2. కన్నప్ప (36)
3. ఎర్రన్న (40)
4. చిన్నన్న (40)
5. గోపాల్ (8)
6. భూషయ్య (50)
7. దొరస్వామి (50)
8. భీముడు (45)
ప్రకాశం
సాంఘిక నాటకం
(జివ్విచెట్టు-క్రింద పెద్దరుగు)
కన్నప్ప:- (స్టేజి అవతలనున్న కుక్కను రాయితో కొడుతూ) దీనెమ్మ సెయ్యి గరిసిందే!(మళ్ళీ రాయితోవేసి) సావునీయమ్మ నన్ను గరుస్తావా? (కుక్క కుయ్యో కుయ్యో శబ్ధం వినబడుతుంది)
ఎర్రన్న:- ( వస్తూ) ఒరే.. ఒరే..కన్నా.. ఆ కుక్క కాలిరగొట్టినావేందిరా!
కన్నప్ప:-నాసెయ్యి సూడు .. ఎట్టా గరిసిందో.
చిన్నయ్య:- (వచ్చి) ఒరే నువ్వు తక్కవైన వోడివా? దాని మూతిని బీడీతోగాల్చింటావ్.. అది కరిసుంటాది.
కన్నప్ప:- సాల్లేవయ్యా నీపరాచకాలు. కుక్కగరిసి నేనేడస్తావుంటే.. దీనెమ్మ యెన్ని సూదులేయించుకోవాలో యెమో.. మూడ్రోజుల్నించి పనికేబోలా. రేపట్నుంచి పనుండాది. ఈసూదుల కెప్పుడు బోవాలో? పనికెట్టా బోవాలో.. అంతా ఖర్మ..ఖర్మ..
ఎర్రన్న:- సూదులెందుకు లేరా.. అది మంచి కుక్కే. సుంకులమ్మ దగ్గరికిబోయ్యీ నల్లేరు రాగిబొట్టుతో కట్టు గట్టించుకో బోతాదిగానీ.. ఒరే నువ్వు కాలిరగొట్టిన కుక్క యెవుర్దనుకుంటుండావ్.
కన్న:- కుక్క ఎవుర్దైతే యేందన్నా.. నేను నొప్పి తో సచ్చాంటే..
చిన్న:- ఒరే కన్నా.. సస్తివి గదరా!
కన్న:- ఏందన్నా .. పిచ్చెక్కతాదంటావా..
చిన్న:- పిచ్చికత దేవుడెరుగు. ఆ కుక్క. భూషయ్యగారిదిరా!
ఎర్ర:- ఏందీ.. అది భూషయ్యగారిదా! వామ్మో.. దాని.. దానికాలా ఇరగొట్టినావ్.. వాళ్ళింక సన్నంగా వొదుల్తార్రా.. ఒరేకన్నా నిజంగానే సస్తివి గదరా!
కన్న:- ఏందన్నా అట్టా భయపడిచ్చావుండారు. కుక్కనన్ను గరిసింది గదా! మరి దాన్ని కొట్టకుండా వుంటానా?.. అయినా అది భూషయ్యగారిది కాదులేన్నా.
చిన్న:- అది భూషయ్యగారిదేరా.. దానికేంపరవాలా. ఆ పశులడాక్టేరును పిలిపించి కట్టుకట్టిస్తారు. మరి నీకతే పాపమనిపిస్తాండాది.
ఎర్ర:-వాళ్ళు మంచోళ్ళు గాదురా.. ఎర్రినాయాలా. మొన్న సూల్లా ఆ భూషయ్యమనవడు..
కన్న:- ఏమైందాయన మనవనికి?
ఎర్ర:- ఆళ్ళకేమైతాదిరా? .. ఐతేగ్యీతే మనకే యేమైనా గావాల.
కన్న:- పరాశకాలు మాని నువ్వు సెప్పేదేందో సరిగ్గా సెప్పరాన్నా
ఎర్ర:- ఆపిల్లోడు సాక్కునే పిల్లి గనబడలా..
చిన్న:- ఐతేఏంది?
ఎర్ర:- రాత్రికి పాలుబువ్వ తినిపిద్దామంటే ఎంత బిల్చినా రాలా. చుసినారు..చూసినారు..పొద్దునికీరాలా.
చిన్న:- ఐతే యేంది రా? ఇంగో కొత్తపిల్లిని నువ్వు దెచ్చి ఇచ్చింటావ్. అంతేనా?
ఎర్ర:- ఆఁ.. ఆ పిల్లగాడుతక్కువోడా? ఆపిల్లే గావాలని నాడు. ఇంగేముంది పనోల్లు ఎతికి ఎతికి యాతనబడినారు.
కన్న:- దొరకలా? ఐనా ఇప్పుడు పిల్లికతేందన్నా?
ఎర్ర:-సెప్పాలెమరి. సెపుతా యిను.. ఆపిల్లిని. . ఆ సింతసెట్లకింద గుడిశలేసుకొని వుండారే.. ఆ.. పచ్చబొట్లు బొడ్చే వోళ్ళు. ఆల్లు బట్టుకొని ఆల్ల సామికి బెట్టుకోని కాల్చుకొని తినేసినారు.
చిన్న:- మరి ఇంగెట్టాబ్బ.. ఆ పిల్లోడు యేడుపు మానిండడే.
ఎర్ర:- ఇంగజూసుకో భూషయ్యమనుసులు బోయి పిల్లికూర తిన్నోల్లను తిననోల్లను యేఒక్కర్ని వదల్లా. గుడిశలు తగలబెట్టేసి అందర్ని చెట్ట్లకు గట్టేసి వాతలు బెట్టినారు. పొద్దనికల్లా నాయాండ్లు యెట్టబొయినారో యేమో పత్తాల్యా.
కన్న:- నాకు బయమేస్తాందన్నా...ఆ భూషయ్య మనుసులు నన్నేమన్నా జేస్తారాయేంది..
చిన్న:- ఎందుకైనా మంచిది. రోంత వుశార్గావుండ్రోయ్.
ఏర్ర:- అవున్రోయ్ జాగర్తా. కుక్కకాలు సక్కంగాజేసి కట్టుగట్టిస్తారు. కాని నిన్ను బట్టకబోయి కట్టేసి కాల్లిరగ్గొడ్తారు. నీకుమాత్తరం కట్టూ గిట్టూ యేంల్యా. యేంజేస్తావో యేమో.
కన్న:- ఏందన్నా.. అట్లా బెదరగొడ్తాండారు. ఇప్పుడేంజేయాలబ్బా.. అన్నా ఎర్రన్నా..చిన్నయ్యా.. నాపెండ్లాం కాయాసం రోగంరా.. పిల్లోడు సన్నోడు ఓకంట జూస్తా వుండండి. మీకు దణ్ణంపెడతాండా. నే పట్నం పారిపోతా.. అన్నా.. బోతాండా.. రోంత దయబెట్టండి. (వెళ్ళి పోవును)
భీముడు:- (వచ్చి) ఎవుడ్రా.. మాయ్యగోరి కుక్కకాలిరగొట్టింది. ఒరే ఎర్రన్నా ఇట్రా (చొక్కా పట్టుకొని) నువ్వేనా కొట్టింది.
ఎర్ర:- లేదన్నా..
చిన్న:- భీమన్నా వాన్నోదిలెయ్.. కుక్కనుగొట్టింది కన్నాప్పగాని.. వాడు ఇప్పుడే ఇట్టా లగెత్తె.. (తప్పు దారి చూపిస్తాడు)
ఎర్ర:- ఔనన్నా.. వాడిట్టే బొయ్యినాడు. (అదే తప్పు దారి చూపిస్తాడు)
భీముడు:- సర్లే.. వాడెంతదూరం బోతాడ్లే. సూస్తా.. నాయాలు అయ్యగారి కుక్కను గొడ్తాడా.. వాని రొండుకాల్లిరగ్గొడతా..ఎట్టా బోయినాడోడు.
ఏర్ర: - ఇట్నే.. ఈట్నేన్నా..(ఒకప్రక్క చూపిస్తాడు)
చిన్న:- ఇట్నే.. ఈట్నేన్నా.. (ఇంకొ ప్రక్క చూపిస్తాడు)
భీముడు:- వాడిట్టా అంటాడు నువిట్టాంటావ్.. యేం తమాషా బడతాండార్రా..
ఇద్దరూ:- ఇట్టనే..ఇట్టనే బోయినాడన్నా..(ఇద్దరు తప్పుదారే చూపిస్తారు)
భీముడు:- నేనీవీధిగుండానేగదా వచ్చింది వాడు నాకు కనబడలేదే.
భీముడు:- నువ్వు సూసుకోనుండవ్ భీమన్న వాడిట్నే బొయినాడు.
భీముడు:- సరే.. వాడెక్కడికి బోతాడు. సందేలకింటికి రాడూ అప్పుడుంది వాని కత. ఇప్పుడు రోడ్డుమీదికి బోవాల. మనూరికి కొత్తయ్యవార్ని యేసినారంట ఆయనీరోజే బస్సుకొస్తాండాడంట పొయ్యి ఆయన్ను బిల్చుకోనిరావాల.(వెళ్ళును)
చిన్న:- ఎర్రన్నా..మనకెందుకొచ్చిన గొడవ. పోదాంపా..
ఎర్ర:- కుక్కనుగొట్టింది కన్నప్ప. కుక్క భూషయ్యది. ఇందులోమనకేం సంబంధం. అదంతా వొదిలేయ్. మనం పులిజూద మాడుకుందాం పట్టు.
చిన్న:- ఐతే నాయి పులులు నియ్యి మేకలు. (ఆ డుండే నాల్గు రాళ్ళుదీసి టక టకా మని, గీతలమీద బెడతాడు)
ఎర్ర:- సరే అట్టేగాని (క్రిందుండే గులకరాళ్ళు యేరితెచ్చి గీతలపై పెట్టి ఆట మొదలుపెడతాడు.)
చిన్న:- ఔ ఒరే ఎర్రన్నా.. ఆ భీముడు జెప్పిందేందీ..మనూరికి కొత్తయ్యవార్ని.. యేసినారా..(మేకను జంపి ప్రక్కనబెడతాడు)
ఎర్ర:- ఆఁ.. ఏయయ్యవారైనా యెన్నాలుంతాడులే? ఈపొద్దు బస్సులో వస్తాండాడుగదా.. రేబ్బస్సులో తిరుగు పయానం గడతాడు.(మేకను జరుపు తాడు)
చిన్న:- కాదుగూడదంటే ఇంగో నాల్గురోజులుండొచ్చు.(పులిని జరుపు తాడు)
ఎర్ర:-ఔన్లే.. ఈబడి ..ఈపిల్లలు.. మనూరి పెద్దోళ్ళు .. అంతా అర్థమయ్యేప్పటికి నాలుగు రోజులు బడతాదిలేమరి..(మేకను జంపుతాడు)
చిన్న:-అంతే... అంతేలే...(పులిని జరుపుతాడు)
ఎర్ర:- (మేకను జరిపి) నీఆట కట్టురా చిన్నన్నా..పులుల్ని కట్టేసినా..
చిన్న:- ఔనే .. ఈసారి నువ్వు పులులు దీసుకో. నాకు మేకలీ.. ఇంగోఆట ఆడదాం..
ఎర్ర:- అట్లే గానీ..సూద్దాం. ఎట్టాడతావో.( ఇంతలో ఓ బడిపంతులు
భుజానికి గుడ్డసంచి చేతిలో సూట్కేసు తీసుకోని వస్తాడు. అరుగుపై సూట్కేసు పెట్టి పులిజూదంలో మునిగిపోయిన వాల్లని పలకరించలేక కాసేపాగి ఎర్రన్న యెత్తుకోసం ఆలోచించిస్తున్న సమయం జూసి)
ప్రకాశం:-ఏమండీ.. ఏమండీ.. మిమ్మల్నే..
ఎర్ర:- ఉండుండు. ఒక్కనిమిషం. (ఆటలో ఒక్కజరుగు జరిగి) ఆఁ.. ఎవరు మీరూ.. ఎవురింటి కొచ్చినారు.
చిన్న:- యావూర్నించి వొచ్చినారయ్యా..
ప్రకాశం:- నేను టీచర్ని. ఈవూరికి బదిలీమీదొచ్చాను. నాపేరు ప్రకాశం
.
ఎర్ర:- ఓరి..ఓరి.. చిన్నయ్యా మనూరి కేసిన కొత్తైవారంట్రా..
చిన్న:- నమస్కారం సారూ.. ముందు కూకోండి (ఎర్రన్న కూడా చేతులు జోడిస్తాడు)
ఎర్ర:-ఔనూ.. బస్సుకాడికి భీముడు బోయినాడుగదా!
చిన్న:-మిమ్మల్ని బస్సు కాడనుండి భూషయ్యింటికాడికి బిల్చుకొని బోవడానికి వాళ్ళమనిషిని పంపినాడు గదా..సారూ.
ప్రకాశం:- నేను టవున్లో బస్సుకోసం యెదురుచూస్తుంటే ఈపక్కూరి ప్రసిడెంట్గారు ఆదారినేవస్తూ జీపునాపి నన్నెక్కించుకొనివచ్చి ఇక్కడదింపి వెళ్ళారు.
చిన్న:- ఓ అట్టనా! సరే దాందేముందిలే. నేను బిల్చుకొని బోయి భూషయ్యగారిల్లు జూపిస్తాలే.
ప్రకాశం:- మంచిది. మంచి పల్లెలున్నట్లున్నాయ్. మనుషులు చాలా మర్యాదస్తుల్లా వున్నారు. వారేమో జీపులో లిఫ్టిచ్చారు. మీరు వెంటవచ్చి ఊరి పెద్దతో పరిచయం జేస్తామంటున్నారు. ధన్యవాదాలు.
ఎర్ర:- ఔనౌను. మావూరోళ్ళు శానా మంచోళ్ళే సారూ.. మేంజెప్పడమెందుకూ నాలుగు రోజులుబోతే అంతా మీకే దెలుస్తుంది.
చిన్న:- ఆఁ..ఆఁ.. అంతా మీకే బాగా ఆర్థమై పోతాది. పోదాంపాండి. (సూట్కేసు చేతికందుకుంటాడు)
ప్రకాశం:- (వారించి సూట్కేసు తనే చేతికి దీసుకొని) మీపేరేమన్నారు.
చిన్న:- చిన్నన్న..
ప్రకాశం:- ఆఁ.. చిన్నన్న.. ముందు బడికెళదాం. అక్కడ ఈ సూట్కేసు సంచి పెట్టేసి కాళ్ళు మొగం కడుక్కొని పిల్లలకు నన్ను నేను పరిచయం జేసుకోని. ఆతర్వాత ఊరిపెద్దలైన భూషయ్యగారి ఇంటికెళదాం.
ఎర్ర:- ఏందేందిసారూ.. బడికెళతారా? యాడ బడి. ఇదేసారూ మీబడీ.. ఈజివ్విమాను ఈఅరుగే మీబడి.
చిన్న:- ఇక్కడింకో అయ్యవారూ లేడు, పిల్లోల్లూ లేరు.
ఎర్ర:- మీరే రెండోజులు బొయ్యినాక, ఇంటింటికీ బొయ్యి, బడి మల్లాబెట్టినాము పిల్లోలను బడికి బంపండని అడుక్కుంటే ఓ పదిమందైనా రారా! సూద్దాంలే సారూ..
చిన్న:- మీకు తోడుగా నేనొస్తాలే.. రేపొక్కరోజు తాలు మొన్నాడైతే రోజు బాగుంటుంది. సంధ్యాలైతే మనుసు లిండ్లకాడుంటారు. అప్పుడుబోతే పనౌతాది.
ప్రకాశం:- ఏమిటీ ఇది బడా! ఇక్కడికి పిల్లోల్లని నేనే పిలుసుకొచ్చు కోవాలా? మరి వర్షం గిర్షం వస్తే!
ఎర్ర:- అదేందిసారూ..అట్లా సిత్రంగా మాట్లాడతారు. వానావంగడివస్తే బడికి సెలవే (ఇద్దరూ నవ్వుతారు)
ప్రకాశం:- (తనలో) నవ్వుతారా! పిల్లల భవిష్యత్తును యిలా గాలికి వదిలేసి వీళ్ళెలా బాధ్యతారహితంగా నవ్వుతున్నారు. (ఇంతలో భీముడు వస్తాడు)
భీముడు:-సారూ.. మీరు బస్సులో వస్తాండారని రోడ్డు దగ్గరే వున్యా. బసొచ్చేదాకా జూసి, బస్సులో మీరు ల్యేకపోయే సరికి తిరుక్కోనొస్తావుంటే, ఓకొత్తాయన రచ్చబండ కాడికి బోతావుంటే సూసినానని శరబయ్య సెబితే మీరె వుంటారనుకొని సక్కంగా యీడికే వచ్చేసినాలే, ఇంగ పోదాం పాండి భూషయ్యగారు మీ కోసం కాసుక్కూకోనుంటారు.
ప్రకాశం:- (కాస్తా ఆలోచించి) సరే పదండి. (సూట్కేసు అందుకొనేంతలో భీముడే అందుకొని చక్కంగా వెనక్కి చూడకుండా ముందుకు బోతాడు. చేసేదిలేక టీచర్ అతని వెనకే వెళ్ళతాడు)
(లైట్స్ ఆఫ్ ఆండ్ ఆన్)
(అరుగు మీద ఓ ఎనిమిదేండ్ల పిల్లావాడు కూర్చొని అల్యూమినియం పాత్రపై దరువేసుకుంటూ, పాడుకుంటూ వుంటాడు)
పాట:
ఏంపల్లే సంతలో నే నుప్పుశనగా లమ్మబోతే
హక్కు నాదని హనుమంతన్నా డే
యీడి నుండి నువ్వు పో పో మన్నాడే.
చెన్నూరూ సినిమాకాడ శనిక్కాయ లే నమ్మబోతే
తలం నాదని సలీమన్నా డే.
ఈడనుండి నువ్వు పో పో మన్నాడే.
పులివెందలా బస్టాండులో జామపండ్లే నమ్మబోతే
నాకు అడ్డమని మత్తయ్యన్నా డే
ఈడనుండి నువ్వు పో పో మన్నా డే.
అందరునన్నూ పో పో మంటే యాడికి బోయేదీ
నేనేంచేసేది. మరి యెట్టా బతికేది
నేనెట్లా బతికేది:
(ఇంతలో టీచర్ వస్తాడు. ఆయన్ను చూసి పిల్లోడు పాట ఆపేస్తాడు.. అరుగు దిగుతాడు)
ప్రకా:- (కూర్చొంటూ) బాబూ యిలారా! నీ పేరేంటీ?
గోపాల్:- నాపేరు. గోపాల్ మానాయన పేరు కన్నప్ప. మాయమ్మ పేరు సాయమ్మ
ప్రకా:- మీ అమ్మా నాన్నల పేరు నే నడగలేదే
గోపాల్:- మల్లయినా అడుగుతారు గదా! అందుకనే చెప్పినా.
ప్రకా:- తెలివైన వాడివే! అది సరేగాని మరినీవు బడికి రావడంలేదేం?
గోపాల్: -_ బడికొస్తే.. బువ్వో.. మామ్మా కోసం, నాకోసం నేను అడుక్కోడానికి బోవాల.
ప్రకా:- ఏం.. మీనాయన సంపాదించి మిమ్మల్ని పోషించడం లేదా?
గోపాల్:- మానాయన యీడ వూళ్ళో లేడు గదా! వుంటే నేనెందుకడుక్కుంటా?
ప్రకా:- మీనాన్న యెక్కడికి, యెందుకు బోయినాడు.
గోపాల్:- అందరికీదెలుసు మరి మీకు దెలీదా?
ప్రకా:- నిజంగాతెలీదు.. నేనీవూరొచ్చిన కొత్త పంతుల్ని గదా! నాకెలాదెలుస్తాది.
గోపాల్:- (పంతులనగానే చేతులు జోడించి ) తప్పయింది సారూ.. నమస్తే. అన్నీజెప్తా. సారు నాకూ సదువు జెప్తారా?
ప్రకా:- గోపాల్.. నేనొచ్చిందే చదువు చెప్పడానికి, నీకుమాత్రం యెందుకు జెప్పను. తప్పకజెప్తా. ఇప్పుడుజెప్పు . మీనాయన యెక్కడికిబోయినాడు.
గోపాల్:- ఆ భూషయ్యగారి కుక్క కాలిరగ్గొట్టినాడు మా నాయన. వాళ్ళేమో మానాయన కాళ్లిరగ్గొడ్తామన్న్యారు. ఆఁ.. మానాయన సిక్కుతాడా వాళ్ళకు, లగెత్తినాడు. పట్నం బోయినాడంట.
ప్రకా:- ఏమిటీ.. కుక్కనుగొట్టినందుకు ఊరిడిచి పారిపోయినాడా మీనాయన. అరెరే..మరి మీఅమ్మయినా పనీపాటజేసి నీకు..
గోపాల్:-ఆఁ.. మా అమ్మేమి పనిజేస్తాది.. ఆయాసంగదా! ఆయాసమంటే తెలుసు గదా! ఉబ్బసం. మానాయన జెప్పిండులే.
ప్రకా:- ఓహో అలాగా.. అందుకు మందులేం దీసుకో లేదా మీఅమ్మ.
గోపాల్:- ఎందుకుల్యా.. మానాయన పెద్దాసుపత్రికి పిల్చకబొయ్ మాత్తర్లు మందులు ఇప్పించ్చినాడు. గానీ అమ్మే తింటేనా? అయన్నీ సూర్లో జెక్కింది. మానాయన ఒకరోజు గనుక్కోని బాగా తన్నినాడులే.
ప్రకా:- (తనలో) అయ్యో.. ఇంతచిన్నవయస్సులో యీ పిల్లవాడి కెంతకష్టం. (పైకి)సరే బాబూ - ఈ పొద్దుటినుంచి మీకు అన్నానికి నేను యేర్పాటు జేస్తా. నువ్వు మాత్రం బడికొచ్చి బాగాచదువుకో అడుక్కోడానికింకబోవద్దు. సరేనా?
గోపాల్:- మా నారయ్య తాతగూడా అడుక్కోవడం నీచంరా. నేనడుక్కుంటుండానని మీరూ ఆ పనిజేసేరు. వొద్దురా అనేవాడు. ఆయనిప్పుడు లేడులే సచ్చిపోయినాడు. నేనేం జేసేది. ఎవురూ పనీల్యా చిన్నపిళ్ళోడివి నువ్వేంజేస్తావురా పో అంటాండారు.ఇంగ నేను మాతాత పాడ్తావున్నే పాట, ఆ పాటే పాడుకుంటా అడుక్కుంటాండా. (కన్నీళ్ళు తుడుచు కుంటాడు.)
ప్రకా:- ఓహో నువ్విందాక పాడినపాట మీతాత జీవితానుభవమై వుండొచ్చు.
గోపాల్:- ఔన్సారూ.. అది మాతాత బతుకే పాటగా కవిగట్టినాడు. నాకు ఆ పాటేగాదు పద్యాలు కూడా వచ్చు. ముందున్నేసారు నేర్పినాడు. నాకు మొదటి పాఠం కూడా వచ్చు. రెండో తరగతికి గూడా యేసినాడాసారు.
ప్రకా:- అలాగా నీకొచ్చిన ఓ పద్యం జెప్పు చూద్దాం.
గోపాల్:- పట్టు బట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియ బట్టవలయు
పట్టి విడుచు కంటె పరగచచ్చుటమేలు
విశ్వదాభిరామ వినుర వేమా. (రాగం దీస్తాడు)
ప్రకాశం:- మరిదీనికర్థం దెలుసా?
గోపాల్:- చెప్పమంటారా?
ప్రకా:- చెప్పుచూద్దాం!
గోపాల్:- ఏదన్నా పని బెట్టుకుంటే సచ్చినా దాన్ని మద్దెలో వొదిలి పెట్టగూడదు. ఆ పని యెట్టైనా ఐపోజేయాల. ఇదిసార్ దానికర్థం.
ప్రకా:- చాలా చక్కగా చెప్పావ్. ఇంగనువ్వు పట్టుబట్టి చదువు నేను చదివిస్తాను. తప్పకుండా పైకొస్తావ్.
గోపాల్:- సరేసారూ.ఇంగజూస్కోండి నేనెట్టా సదువుతానో.
ప్రకా:- వెళ్ళు.. ఈరోజు బాగ ఆడుకో. సంతోషంగావుండు. రేపటినుండి నీ చదువు మొదలు.
గోపాల్:- సరేసారూ..(వెళ్ళును)
(ఇంతలో ఎర్రన్న, చిన్నన్న వస్తారు)
ఎర్రన్న:- ఏమైనా.. ఇది శానా అన్యాయంరా..
చిన్న:- నిజమేరా ఎర్రన్నా.. సన్నాసపకా మనుసులం యీ వూళ్ళో బతకలేంరా.
ప్రకా:- (కలగజేసుకొని) ఏమైందెర్రన్నా.. ఏందన్యాయమంటున్నావ్.
ఎర్రన్న:- మనశరబయ్యుండ్లా, వాడు పిల్లోనికి బాగల్యాకుంటే పెద్దాసుపత్రికి బోతావున్యాడు. ఆ మోతుబరి పెద్దరైతు వాన్ని బోనీల్యా.
ప్రకా:- ఆయనబోనిచ్చేదేంటి?
చిన్న:- బాగుందే.. ఆయన మళ్ళో చెరువు మట్టి దోల్తానన్నాడంట. ఆపని జేయడానికి వాయిదాలేస్తాండవని నిలేసి, ఆస్పత్రికి బోయేపని ఆపేసి బండిగట్టిచ్చి చెరువుకు బంపినాడంట. ఒకతడవ తోలేసరికి బండియిరుసు యిరిగి పాయె. ఇంగ కంసలాచారి దగ్గరికెల్లి కాంపించి అతుకేసే సరికి సందేలాయె.
ఎర్ర:- దావంతా ఎగుడుదిగుళ్లే. మనుసులేదిరగలేం ఇంగ బండేంబోతాది. బస్సోళ్ళుగూడ సచ్చాబతుకుతా ఓట్రిప్పు దిప్పుతాండారు.
ప్రకా:- ఇంతకీ ఆ పిల్లోనికెట్లా వుంది.
చిన్న:-పాయ.. రాత్రికి జరం యెక్కవాయ వాయవొచ్చ. ఆడికీ సుబ్బాచారి చేత నాటుమందు కూడా ఇప్పించినారు. లాభం లేకపాయ. తెల్లరుజాము కల్లా పిల్లోడు సచ్చిపాయ. ఈరోడ్దు బాగునింటే నాలుగుతడవలు మట్టిదోలి సంద్యాలకన్నా పట్నమాసుపత్రికి బోయింటే పిల్లోడు దక్కిండునేమో..
ప్రకా:- అయ్యో.. యెంతపని జరిగింది, పాపం..
ఎర్ర:- ఏంజేస్తాం అంతకాడికుంది రుణం. ఎవురి కర్మవారిది.
ప్రకా:- లేదయ్యా ఎర్రన్న మనమిట్టాచూస్తూ వూరకుంటే లాభంలేదయ్యా. ఊరంతా ఓచెయ్యేస్తే ఆ దారి సరిజేసుకోలేమా?
చిన్న:- అదెంతపని మూడురోజుల్లో ఐపోదూ.. కానీ ఆ రోడ్డుకాంట్రాక్టు ఒకసారి భూషయ్య ఇంగోసారి దొరస్వామిగారు తీసుకోని తకనాబొకనా రోడ్డేసి లెక్కలు దింటావుంటే.. మనం బోయి రోడ్డేయాలా?
ప్రకా:- వాళ్ళ పని వ్యవహారం తర్వాత జూద్దాం.. ముందుమనం మనూరికి రోడ్డేసుకొందాం. మనల్ని మనం కాపాడుకొందాం.
చిన్న:- సారూ..మీరిక్కడ ఉద్యోగం జేసుకోవడానికి వచ్చినారు. మామీద మీకెందుకింత ఇది చెప్పు.
ప్రకా:- నేను పరాయివాణ్ని కాదు. ఈ ఊరి టీచర్ని . అంటే అంటే గవర్నమెంట్ ఉద్యోగిని. ఈ దేశ పౌరుణ్ని. ఈపల్లెలో మీలో ఒకణ్ని. నాదొక చిన్న కోరిక.
చిన్న:- ఏంగావాలో చెప్పండి, మమ్మల్ని గురించి ఇంత ఆలోచన జేస్తావుండారు. మీకు మేమేమీ జెయ్యలేమా? చెప్పాండి.
ప్రకా:- నాకొక ఇల్లు బాడుగకు జూడండి. కొట్టమైనా పరవాలేదు. ఇక వచ్చేది వర్షాకాలం, బడికూడా అక్కడే నడుపుకుంటా.
ఎర్ర:- ఆ భూషయ్య ఇంట్ళో...
ప్రకా:- సౌకర్యంగానేవుంది. కానీ భూషయ్యగారి ఆలోచనలకు నాఆలోచనలకు పొంతన కుదరటంలేదు.
ఎర్ర:- ఏమైంది సారూ..
ప్రకా:- ఆయనకు ఈవూరి పిల్లలు చదువుకొని పైకిరావటం ఇష్టం లేదు. వాళ్ళపిల్లలు పట్నంవెళ్ళి చదువుకుంటారు.సరిపోతుంది. మీబిడ్డలు మాత్రం మీమాదిరే వాళ్లపొలాలల్లో పనిజేస్తూ కూలీలుగానే వుండిపోవాలన్నది వారి ఆలోచన. అలాకాకపోతే పొలాలెలా సాగౌతాయన్నది ఆయన వాదన.
చిన్న:- ఆయన చెప్పేదీ నిజమేగద సారూ..
ప్రకా:- రేపాయన కోతగోసే యంత్రాన్ని కొని తెస్తాడు. మీతోనాకు పని లేదంటాడు. మిమ్మల్ని సాకే బాధ్యత నాదికాదంటాడు. మీదారి మీ దంటాడు. అప్పుడేంజేస్తారు. ఐనా ఆయన వాదాన్ని నేనంగీకరించను. ఎవరూ తల్లిగర్భం నుండే భూమిని తెచ్చుకోలేదు. మీరు మాత్రమెందుకు భూమి స్వంతదార్లు కాలేరు? మీపిల్లలూ వాళ్ళపిల్లల మాదిరి డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లూ కాలేరు. కావాలనీ, యెదిగిరావాలన్నదే నా ఆలోచన.
ఎర్ర:- అదిమీరొక్కరనుకుంటే సరిపోతుందా సారూ.. ఇది జరిగేపనేనా?
ప్రకా:- అందరం కలిసికట్టుగా పని జేస్తే అసాధ్యమేదీలేదు. ఇలా ఎవరికి వారు మావల్లౌతుందా? నాకెందుకులే? అనుకోబట్టే వెనకబడిపోయాం. నామాట నమ్మండి నావెనక నడవండి.
ఎర్ర:- సరే..మీరింతగా మా మేలుగోరి చెబుతావుంటే మీమాటవినమా? వింటాం.. మీవెంటే నడుస్తాం.
ప్రకా:- నేను వెంటనే భూషయ్య యింటినుండి బయటపడాలి. వాళ్ల లెక్కలు వ్రాయడంతోనే సమయం చాలామటుకు వృధా అయి పోతున్నది. ఆ సమయం మిగుల్చుకొని నేను రాత్రిబడి నడిపి పెద్దలకు అక్షరజ్ఞానం కలిగించాలనుకుంటున్నాను. అందులకు కావలసిన పర్మిషన్ కూడా వ్రాసి తెప్పించుకున్నాను.
చిన్న:- ఇంతకముందో అయ్యవారు మీమాదిరే వాళ్ళలెక్కలు రాయనని తిరగబడినాడు. కానీ
ప్రకా:- కానీ..
చిన్న:- కానీ ఆయన బదిలీ చేయించుకొని ఊరిడిసి యెల్లిపోయినాడు. అంతేగాని మీ మాదిరి యిట్లా పల్లెజనంకోసం నిలబడల్యా.
ఎర్ర:- అంతే.. అదిసుతా మాపల్లెకు యేఅయ్యవారూ రాల్యా. ఆ మధ్యన ఒక అయ్యవారొచ్చినా యీబడి, వూరు జూసి రెండ్రోజులకే సెలవులో యింటికిబోయి, అట్టట్టే బదిలీ అయిపోయినాడంట. అదీ మావూరి ఖర్మ.
ప్రకా:- అన్నీ చక్కబడే కాలం దగ్గరలోనే వుంది. మీరు ముందు యిల్లు చూడండి. రాత్రి బడి తొందరలోనే ప్రారంభిస్తాం. రాత్రిబడికి ముందుగా మీరు వచ్చి చేరాలి. ఆతర్వాత వూళ్ళోవాళ్ళను మీవెంట వచ్చేటట్లు నచ్చజెప్పి తీసుకరావాలి. ప్రతిరోజూ చదువు తర్వాత వూరిబాగోగులు కాసేపు మాట్లాడుకొందాం. పనెదైనా వుంటే చేతనైనంతలో చేసేస్కుంటూబోదాం. ఆఁ.. ముందు ఓవారంలో రోడ్డేసే పని పూర్తిచేద్దాం. తర్వాత నేను నాలుగురోజులు సెలవు పెట్టి. టవున్లో కొన్ని పనులు జూసుకొని తిరిగొస్తా. ఆ తర్వాత మళ్లీ కలుసుకొని మాట్లాడుకొందాం.
ఎర్ర:- నేను బండిగట్టి రోడ్డుకు గుండ్రాళ్లు తోలుతా.
చిన్న:- నేను మరం దోలుతా. శరబయ్య మనోడేలే. వాడిమాటంటే అందరూ వింటారు. ఆడోల్లను పురమాయిస్తే నీళ్ళు తోడకస్తారు. రోడ్డెంత అయిపోతదిలే సారూ..
ప్రకా:- ఈ రోడ్డేయడమే మన మొదటి విజయం.
ఎర్ర:- విజయం మనదే! ఇంగ జూస్కోండి సారూ..
(లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)
(అరుగు మీద టీచర్ కూర్చొని వుంటాడు)
భీముడు:- (వచ్చి) అయ్యా మీరేమో మాయ్యగారి యిల్లొదిలి అగసాట్లు బడతాండారు. ఆడ మీమాదిరి లెక్కలు రాసేటోల్లు మరొకరు దొరక్క ఆయనే రాసుకోలేక కిందామీదా బడతాండాడు. ఎందుకీ అవస్త అయ్యగారింటికి రారాదా సారు..
ప్రకా:- ఈ మాటజెప్పటానికే వచ్చావా భీమన్నా?
భీముడు:- కాదనుకో.. అయ్యగారి మాటతోపాటే యేదో నాకు తోచింది నేనొక మాటన్నా నంతే. అయినా నామాటెవురింటారు, నా పిచ్చిగాని.
ప్రకా:- ఇంతకూ మీఅయ్యగారి మాటేంటో!
భీముడు:- ఏంలేదు.. రేపు అయ్యగారి పార్టీ మనుషులు అదే ఆ కొంగగుర్తు పార్టీ వోళ్ళు, నాయకులంతా వస్తాండారంట. ఈడ రచ్చబండకాడనే మీటింగు బెట్టుకోవాలంట. బడికి సెలవియ్యమని జెప్పిరమ్మన్నారు. అంతేసారూ..ఇంగేంల్యా.
ప్రకా:- అంటే ఎలక్షన్లు దగ్గర పడ్డాయన్న మాట.
భీముడు:- అదేవాళ్ళూ అనుకుంటావుండారు సారూ..
ప్రకా:- సరే.. వాళ్ళ మీటింగు జరుపుకోమను. భీమన్నా! మనలోమాట, పిల్లోల్లను నా యింటికి దీసుకొనిపోయి నాచదువు నేను జెప్పుకుంటాలే. ఇదేం మీయయ్యకు జెప్పద్దులే.
భీముడు:- ఏందీ.. పిల్లోల్లకు బడి, మీకొట్టంలో జెప్పుతారా?
ప్రకా:- ఏం భీమన్నా! నీకిష్టం లేదా?
భీముడు:-ఎంతమాటయ్యా! మావూరి పిల్లోల్లు బాగుపడతావుంటే నాకు సంతోసమేగదయ్యా! ఇంతమంచి అయ్యవారు దొరకడం మావూరు జేసుకున్నె పున్నెమయ్యా.. ఈ రోజు ముందున్నె బడికొట్టం గ్యాపక మొస్తాండాది.
ప్రకా:- ఏమిటీ.. ముందు బడికొట్టమునిందా! అదేమయింది?
భీముడు:- ఆ దొరసామి పశువుల కొట్టం బాగుచేయించి బడికిచ్చినాడు. పిల్లోల్లు వానొచ్చినా, మీటింగులు బెట్టినా. తిన్నాల్లొచ్చినా ఆఖరికి హరికథలు, బుర్రకథలు, డ్యాన్సులు యేంబెట్టిచ్చినా యీ చెట్టుకింద బడి మూసేసే పనిలేకుండా పిల్లోల్లు సదువుకొనేవోరు.
ప్రకా:- మరి ఇప్పుడెందుకు బడి, చెట్టుక్రిందకు మార్చినారు.
భీముడు:- ఏముంది సర్కారోల్లు యీవూరికి కొత్తబడెందుకు కట్టడం, కొత్తపల్లెలో కడ్తే బాగుంటుంది, యీవూళ్ళో దొరసామి కొట్టం దిట్టంగావుందని రాసుకొని బోయినారు. ఈదొరసామేమో ఎలక్షన్లో ఓడిపాయె.
ప్రకా:- ఆఁ.. ఓడిపోతే..
భీముడు:-ఆయనగారేమో చిర్రుబుర్రులాడి పిల్లోల్లను బయటికి దోలి, మళ్ళీ యెనుముల్ని గట్టేసుకునె. ఆయనకు ఓటేయనందుకు మావూరిబడి రెంటికీసెడ్డ రేవడాయె.
ప్రకా:- అట్లా గవర్నమెంటూ వదిలె, ఇట్లా దొరస్వామీ కాదనె. మళ్ళీ బడి వీధి పాలయిందన్నమాట. మరి భీమన్నా.. మీవూరి పెద్దలు యిలాజేస్తుంటే మీకు కోపంరాలేదా!
భీముడు:- ఎందుకురాదు సారూ.. కానీ యేంజేస్తాం. పేదవాని కోపం పెదవికి జేటని కుక్కిన పేనులా పడివున్నాం.
ప్రకా:- మరి భీమన్నా..యిప్పుడు మీదొర భూషయ్య సర్పంచేగదా! ఆయనేమయినా బడికోసం జేయచ్చుగదా!.
భీముడు:- ఆదొరసామి జేసినపని మాయ్య జేయడు సారూ. ఆయన కొట్టం గిట్టం యియ్యడు. దాంతో కోపమొచ్చినప్పుడు, వెనక్కు దీసుకొనే పనుండదు. అదే మేలుగదా! మాయ్యదంతా పైసా పెట్టుబడిలేని యాపారం. శానామంది కాంట్రాట్లు దీసుకొని పనులుజేసి సంపాదిస్తారు. మాయ్య పోటీకొస్తానని బెదిరించి వాళ్లదగ్గర కమీషను కొడ్తాడు. పెట్టుబడి పెట్టడం పనులు జేయడం ఆయన ఒంటికి సరిపోవు.(నాలుక కరుచుకొని) తప్పై పొయినాది పెద్దోళ్ళకతలు సెప్పగూడదు, యినగూడదు. ఆగబ్బంతా మనకెందుకులేండి.
ప్రకా:- మరి నువెందుకున్నావక్కడ?
భీముడు:- అడగ్గాకండి.. ఇట్టా బానిసబతుక్కు అలవాటుబడిపోయినాం. మాదీ ఒక బతుకేనా?
ప్రకా:- భీమన్నా యేమనుకోవద్దు. నాపని నే జేసుకుంటూబోతాను. గవర్నమెంటుతో పోరాడి మనవూరికి బడిబిల్డింగ్ వచ్చే టట్లు ప్రయత్నం చేస్తా. మరి ఆఖర్చులో కొంత మనవూరోళ్ళమే భరి0చాల్సి వస్తుంది. ఏంజేద్దామా అని ఆలోచిస్తున్నా.
భీముడు:- నాదగ్గర అప్పుడింత ఇప్పుడింత దాసుకున్న డబ్బులున్నాయ్. నాకైతే ముందూ యెనకా యెవరూలేరు. అంతా ఇచ్చేస్తాను. ఆపనేదో తొందరగా గానియ్యండి. కానీ యీ యిషయం యెవురికీ జెప్పమాకండి.
ప్రకా:-భీమయ్యా.. నీకుజెప్పినట్లే ఊరిలో పదిమందికీ జెప్పినా.. ఏదో ఒకరో ఇద్దరోతప్ప చాలమంది నీమాదిరే ముందుకొచ్చినారు. మేమున్నామని భరోసా యిచ్చినారు. కొంతమంది బడికట్టేటప్పుడు శరీరకష్టం జేస్తామన్నారు. నాకు చాలా సంతోషమైంది.
భీముడు:- మరింగేముంది.. ఆలోచనొదిలేసి ముందుకు పదండి.
ప్రకా:- అదిసరేగానీ.. ఇప్పుడుజెప్పు, నేను మీ భూషయ్యగారింటికొచ్చి ఆయనపద్దులు వ్రాసుకుంటూ వాళ్లు పెట్టేదితిని కూర్చోమంటావా?
భీముడు:- వద్దు సారూ..వద్దు. మీరు బయటేవుండండి.. ఊరు బాగుపడ్తాది.
(ఇంతలో దొరస్వామి వస్తాడు)
దొరస్వామి:- ఆఁ.. ఏమయ్యా అయ్యావారో నిన్ను గురించి శానా శానా వింటాండా. ఇంతకీ మీదేవూరు.. ఒరే భీముడూ.. ఏంరా మీయయ్య బాగుండాడా? ఏదో పెద్ద మీటింగు బె డతాండడంటనే? నాయాలు వోడు యీసారిగూడా గెలుస్తాడంటావా? అదేంకుదర్దని జెప్పు. ఈసారి దొరస్వామిదెబ్బకు యెవురైనా తోకలు ముడుసుకోవాల్సిదే మరి.
భీముడు:- అయ్యగోరూ..మాదేముందండి. సన్నోల్లం మీరూ మీరూ దేల్చుకోండి. మాటలు మాతో యెందుకండే.
దొరస్వామి:- అంతేనంటావ్..సరెలేపో..నీతోయేంది..
భీముడు:-సెలవండి.. పొయొస్తానయ్యా..(వెళ్ళును)
దొరస్వామి:- ఆఁ.. అయ్యవారా.. నువ్వు ఆ భూషయ్యయింటినుండి బయటబడి, యిల్లు దీసుకున్నావని విన్నా. మంచిపని జేసినావ్. ఆనాయాలు మాయలోనువ్వు బడల్యా. మంచిదైంది.
ప్రకా:- ఒకరింట్ళో చాలారోజులుండటం యేంబాగుంటుంది చెప్పండి. నాకు జీతమొస్తూంది కదా! నాయేర్పాట్లు నేను జూసుకోవాలిమరి, అందుకే బాడుగింటీకి మారా.
దొర:- ఈవూళ్ళో బాడుక్కిచ్చేంత యిల్లేముంటాయబ్బా.. సరేలే.. ఏదోరకంగా బయటపడి సర్దుకున్నావ్. సంతోషం. మరయ్యవారో.. అది సంతోషమేగానీ మనుషుల్ని గమ్మిచ్చి రోడ్డు పని జేయించినావుగదా! అదేంబాగాలేదయ్యా. ఏదో ఆ భూషయ్యగాడితో రాజీ జేసుకొని రోడ్డేసే కాంట్రాక్టు దీసుకొని నాలుగుడబ్బులు మిగిలించుకుంటాండా. మరి ప్రజా సేవజెయ్యాలగదా! పైసలేడనుంచి వస్తాయి చెప్పు.
ప్రకా:- ఎంతమాతండి.. దొరస్వామిగారు. వేసింది మట్టిరోడ్డేగదా! ఈసారి సిమెంట్ రోడ్డుకు ప్రయత్నించండి. పైన మేముండి రోడ్డువేయించుకుంటాం. సిమెంట్ అంగడినుండి మనూరి బండ్లతో మేమే దీసుకొని వస్తాం. రవాణాఖర్చులు కలిసొస్తాయ్. రోడ్డూ దిట్టంగావుంటుంది మీజీపు దిరగడాని కీ అనుకూలంగా వుంటుంది.
దొర:- (తనలో) నిలబడి మీరు దిట్టంగా రోడ్డేస్తే నాకు మిగిలేదేంది. బొచ్చ. ఇన్నాళ్ళూ రోడ్డేసొకసారి, ఎయ్యకుండానే ఒకసారి బిల్లులు పాస్జేయించుకొని డబ్బులు దిన్నాం. సూస్తావుంటే ఇంగ గుదిరేట్టు లేదు.
ప్రకా:- ఏదో ఆలోచనలో వున్నట్టున్నారు.
దొర:- అదిసరే.. నువుజెప్పింది బాగానేవుంది.. కానీ రేపు ఎగస్పార్టీ వాళ్ళ మీటీంగుందిగదా!.. మనమేమి జేయాలా అని ఆలోచిస్తున్నాలే. సరే మనమీటింగూ మరో పదిరోజుల్లో వుండోచ్చు. ఆ రోజూ బడికి సెలవీయాల. మామీటింగ్కు మీరొచ్చి అంతాయినాల. ఎందుకంటే మీరుగూడా మనూళ్ళోనే ఓటు రాయించు కున్నారటగదా!
ప్రకా:- బడికి సెలవిచ్చే అవసరం లేకుండా ఆదివారం మీటింగ్బెట్టుకుంటే జనమూ బాగాస్తారు, వాళ్ళతోపాటీ నేనూ వచ్చి ముఖ్యంగా మీ ఉపన్యాసం వింటా.
దొర:- బలేవోడివే మనమేంది మా ట్లాడే0ది మనకు మీటింగు మాట్లాడేది రాదులే.. వచ్చిన నాయకులే యేదో ఒకటి మాట్లాడ్తారు. ఖర్చు నేను బెట్టుకోవాల. నేను చేతులెత్తి దండాలు బెడితేచాలు. అయినా మర్చిపోయినా నువుండ్లా.. రోంతనాకు మాట్లాడేది నేర్పించరాదూ. నిన్ను మర్సిపోనులే. రేపెలక్షన్లో నువ్వు నాతట్టేలే. ఏమాలోచించమాక నీకిచ్చేది నీకిస్తాలే.
ప్రకా:- ఏదో చిన్నపిల్లల బడిటీచర్ని, నాకేందెలుస్తాయండి రాజకీయాలు. నన్నొదిలేయండి.
దొర:- అబ్బో మాకంతా తెగదెలుసుననా?.. పోన్లే ఆయిసయం రోంత తీరిగ్గా మాట్లాడుకొందంలే. పోయొచ్చా.
ప్రకా:- మంచిదండి. (నమస్కరిస్తాడు)
(లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)
(అరుగుమీద చిన్నయ్య కూర్చొని వుంటాడు)
చిన్న:- (టీచర్ రావడం చూసి) సెలవునుండి ఇప్పుడేనా రావడం సారూ..
ప్రకా:- మధ్యాన్నమే వచ్చినాలే..కాస్తా విశ్రాంతి దీసుకొని సాయంత్ర మయిందిగదా! అట్లా రచ్చబండ కాడి కెళ్లొద్దామని వచ్చినా... ఆఁ.. ఏం చిన్నయ్యా ఏదో ముభావంగావుండావ్.
చిన్న:- ఏంజెప్పమంటారు సారూ.. ఘోరం జరిగిపాయ. మన గోపాల్గానమ్మ సనిపాయ.
ప్రకా:- అరెరే.. ఏమయింది.. బాగానే వుం డె గదా!
చిన్న:- రాత్తిరికిరాత్తిరి ఆయాస మెక్కువైందంట. మేంబోయి సూసేతలికి సచ్చిపోయుండాది. పాపం పిల్లోడు ఆ గోపాల్ గాడు దిక్కులేనోడైపాయ. అమ్మ యిట్టా దాటుకొనె, నాయనేమో ఊరిడిసి యెట్నోబాయె.
ప్రకా:- నిజమే.. ఇంతచిన్నవయసులోనే వానికెంతకష్టం.
(ఇంతలో ఎర్రన్న, గోపాల్ వస్తారు - గోపాల్ టీచర్ కాళ్ళమీద బడి యేడుస్తాడు- టీచర్ ఓదారుస్తాడు)
ప్రకా:- ఏడవద్దు. నీకు నేనున్నాను. భయపడకు యేడిస్తే పోయినోళ్ళు తిరిగి రారు. నువ్వు తెలివైనవాడివి. ఇటువంటప్పుడే ధైర్యంగా వుండాలి. (గోపాల్ కళ్ళనీళ్ళు తుడుచుకొని టీచర్ సాయంతో అరుగెక్కి కూర్చొంటాడు)
ఏర్ర:- పాపమా సాయమ్మ పిల్లొనికోసం అల్లాడిపోయేది. మొగున్ని తలుచుకొని మొత్తుకొనేది. ఏంజేస్తాం, సారూ ఆడికీ మందులు దెప్పిచ్చి మీరుగూడా యిస్తావుండిరి. కానీ లాభం లేకపాయ. ఆయమ్మ మొగుడు కన్నప్ప, యాడుండాడో ఆచూకీలేకపోయె, ఏంజేస్తాం. సాయంత్రంగా మేమే న లు గురం గలిసి మట్టిలో గలిపేసినాం.
ప్రకా:- సరే.. జరిగిందేదో జరిగిపోయింది. మనం బాధపడి లాభంలేదు. గోపాల్ నాదగ్గరేవుంటాడు. మంచీచెడ్డ నేజూసుకుంటాను.
చిన్న:- మీరు పుణ్యాత్ములు సారూ.. మిమ్ముల్నాదేవుడు సల్లంగాజూడాల.
(ఇంతలో కన్నప్ప పరుగు పరుగున వచ్చి, కొడుకును కౌగిలించుకొని యేడుస్తూ)
కన్నప్ప:-నాయనా గోపాలా.. కొడుకా.. ఎంతపని జరిగి పోయిందిరా..ఒరే ఎర్రన్న, చిన్నన్న ఆలుబిడ్డల్ని దిక్కులేనోల్లను జేసి పోయినా.. నాచేజేతులా పెండ్లాన్ని జంపుకున్నా. నేను పాపీముడాకొడుకునురా.. పాపీముండాకొడుకును. (బోరునయేడ్చును)
ఎర్ర:- పెద్దోళ్ళకు భయపడి, పెండ్లాన్ని పిల్లోన్ని వొదిలి నీకొద్ది నువ్వు పారిపోయినావ్. మేమూతప్పుజేసినాంరా నీకు తోడుగా నిలబడాల్సింది బోయి నిన్ను మేమూ బెదరగొట్టినాము. ఈపాపంలో మాకు బాగముండా దిరా..సూడ్రా .. ఈ దేవుడు.. ఈ అయ్యవారే అడుక్కుంటావుండే నీకొడుకును దగ్గరదీసి, చదువుజెప్పి మీవోళ్ళకింత అన్నంబెట్టినాడురా..
కన్నప్ప:- సామీ..దణ్డాలు సామీ దణ్ణాలు. ఈపాపీనాయాల్ని చ్చమించు సామీ చ్చమించు. పానాలకు భయపడి పారిపోయినానే గాని, ఆలుబిడ్డల్ని మరిసిపోల్యా సామీ, మరచిపోల్యా. ఈడ్నుంచి తిరపతికి బొయినా, ఆడ్నుంచి చిత్తూరు బొయ్యి రిక్షాదొక్కి కాయకష్టంజేసి, ఓయమ్మ పంచనజేరి మంచికి చెడ్డకుపలికి నాలుగురూపాయలు కూడ బె ట్టుకొని, ఇదిగో పిల్లోనికి గుడ్డలు గొనొక్కున్యా. ఆ మహాతల్లి నాపెండ్లానికిచ్చిన యీచీరలు (ముటవిప్పి చూపి మళ్లీమూట గట్టుతూ) మూటగట్టుకొని వచ్చినా. ఈరేత్రికే పెండ్లాన్ని, పిల్లోన్ని బిల్చుకొని మల్లా యెల్లిపోదామని వచ్చినా. ఎల్లిపోయి ఆ యమ్మ యింట్లోనే పనిబాటా జేసుకోని బతుకుదామనుకున్నా. అంతా ఇట్టా అయిపోయింది. ఇంటికాడికి సాటుగాబోతినిగదా! అమ్మలక్కలంతా పిల్లోడిక్కడుండాడని జెపితే పరిగెత్తుకుంటా వచ్చినా.
ప్రకా:- కన్నప్పా ఏడవద్దు. జరిగిందేదో జరిగిపోయింది. మనిషి పిరికితనంతో ఉన్నది కోల్పోతాడేకాని యేమీ సాధించలేడు. నువ్వొచ్చేసినావ్. మేలైంది. కొడుకును బాగా చూసుకో. పదిమందితోపాటే నువ్వూ ఉండూరులోనే బతుక్కో. భయపడేకాలం పోయింది. మేమంతా నీకు సాయంగా వుంటాం ధైర్యంగావుండు.
ఎర్ర:- ఒరే కన్నప్పా.. భయమెందుకురా! ఇన్నాళ్ళూ ఎవురికివాళ్ళే అనేట్లు ఒంటెద్దు పోకడబోయి నష్టబోయినాం. ఈరోజు యీసారు రూపంలో మనకొక అండదొరికింది. ఇప్పుడా భూషయ్య, దొరసామే గాదు ఎవురూమనల్ని యేమీ జెయ్యలేరు.
ప్రకా:- మనమంతా ఒక మాటమీదుంటే. ఎవరూ మనల్ని భయపెట్టలేరు. నిజానికి వాళ్ళేం మన శత్రువులుకాదు. ఒకళ్ళపై ఒకరం ఆధారపడి బ్రతుకుతున్నాం. వాళ్ళకుమనం అపకారం చెయ్యం. వాళ్ళూ మనకు అపకారం వెయ్యకూడదంతే.
చిన్న:- ఔను.. ఇదే న్యాయం.
ప్రకా:- సరే.. సుఖదుఃఖాలు సర్వసామాన్యం. ఓపికతో మనపనులు మనం జేసుకుంటూ సద్బుద్ధితో మెలగాలి. కష్టంసుఖం కలిసి పంచుకుందాం. పదిమందిమీ కలిసికట్టుగావుందాం. దానివల్ల దుఃఖం బలహీన పడు తుంది సంతోషం రెండింతలౌతుంది.
చిన్న:- మంచీచెడ్డా చెప్పేవాళ్ళుల్యాక యిన్నాళ్ళు మట్టిగొట్టుకపోయాం. ఇంగజూసుకోండి. పల్లెంటే యిదిరా అనాలంతా..
ప్రకా:- మాటల్లోబడి మరచేబోయా.. నేను యీవారంరోజులూ మనూరి పనిమీదనే పట్నంబోయా. ఎమ్మెల్లేని కలిశా. మనూరి పరిస్థితి వివరించిచెప్పినా. ఆయన అంతావిని మన భూషయ్యగారినీ, దొరస్వామిగారినీ బిలిపించుకొని ఆయనే సర్దిచెప్పి అందరూ కలిసిమెలిసుండేట్లు చూస్తామన్నారు. మనల్నిగూడా పాతవిషయా లేవీ మనసులోపెట్టుకోవద్దన్నారు. బడి, ఊరికి సిమెంటురోడ్డు, ఒక ఆసుపత్రి మనూరికి వచ్చేయెర్పాట్లు తనే స్వతహాగా జూస్తామన్నారు. అంతెందుకూ నా యెదురుగానే యివన్నీ కలెక్టర్గారితో ఫోన్లో మాట్లాడినారు. తర్వాత మంత్రిగారితోగూడా మాట్లాడతామన్నారు. ఓరెన్నెల్ల తర్వాత మరొక్కసారి కలవమనిగూడా చెప్పినారు. అప్పుడు వీలైతే మనజిల్లా ఇన్ఛార్జ్మంత్రితో నన్నే మాట్లాడిస్తానన్నారు.
ఎర్ర:-చాల సంతోషం సారూ.. ఈ దుఃఖసమయంలో ఓ మాంచి సల్లనిమాటజెప్పినారు.
ప్రకా:-పదండి పోదాం. చీకటి బడుతూంది, ఇళ్ళకెళదాం.
చిన్న:- ఈరోజు అందరికీ మాయింటి నుండే భోజనం. పదండి. అయ్యవారికొట్టానికి.. నేనోగంటలో భోజనంతో మీముందుంటా. అందరం మాట్లాడుకుంటా భోంచేద్దాం. ఆ వచ్చేటప్పుడు శరబయ్యనూ లింగాచారిని గూడా బిలుచుకొని వస్తా. లింగాచారి మాంచి హుశారైన పల్లెపాటలు బాడతాడు. మనూరికొచ్చే మంచిరోజుల్ను గురించి అందరికీ దెలియాలంటే ముందు శరబయ్యకు దెలియాల. ఆయనకుదెలిస్తే అందరికీ దెలిసినట్టే.
ప్రకా:- నిజమే.. శరబయ్యతో నేను ముఖ్యంగా మాట్లాడాల. ఓనిముషమాలస్యమైనా శరబయ్యను బిలుచుకొనేరా. రోడ్డుపనప్పుడు ఆయనజేసిన సాయం ఇంతాఅంతాగాదు.
చిన్న:- అట్నేలేసారూ..నాపెండ్లాన్ని ఇట్టా వంటకు పురమాయించి అట్లా వాళ్ళను మీయింటికి పాండని జెప్పొస్తాలే.
ఎర్ర:- ఇంగ ఊరంత మనవైపే. మీరాత్రిబడి సూసుకోండిసారు.. అసలుబడిని మించిబోతాది.. (అందరూ నవ్వుతారు)
(లైట్స్ ఆఫ్ ఆండ్ ఆన్)
(అరుగు మీద టీచర్ వుంటాడు)
దొరస్వామి:- (వచ్చి) ఏందయ్యా అయ్యవారూ.. ఇది నీ నిర్వాకమేనా? (కాగితం జూపిస్తాడు)
ప్రకా:- ఔను.. ఇది మనూరు రోడ్డు వేయకుండానే వేసినట్లు వ్రాసుకొని బిల్లులు పాస్ జేసుకొని డబ్బులు దిన్నారని వూరివాళ్ళు వేసిన పిటీషను జిరాక్సు కాపీ, ఇది మీచేతికెలావచ్చింది.
దొర:- నాలుగురూపాయలు బారేస్తే ఆ రూరల్ డెవలెప్మెంట్ ఆఫీసోళ్ళు యిచ్చినారు. ఐనా అయ్యవారూ.. పిల్లోల్లకు సదువుచెప్పుకోక యీపనులన్నీ నీకెందుకు జెప్పు. ఏంనేనొక్కన్నే దిన్నానా డబ్బంతా? ఆ ఎగస్పార్టీ భూషయ్య కింతయిస్తి ఆఫీసులో యింతఖర్చాయ. ఏదోరావలసింది పూర్తిగాచేతికొస్తే నీకింత ఇద్దాంలే అనుకుంటి. అంతలోనే ఇంతపని జేసినావే.
ప్రకా:- నాదేముంది, కష్టపడి పనిజేసి పల్లెప్రజలు రోడ్డేసుకుంటే, మీరీమాదిరి మేమేరోడ్డేసినామని పంచుకతింటే ఊరుకుంటారాండి. నిలబడి కొలతలు దీయిస్తావుంటే అనుమానమొచ్చింది.
దొర:- అనుమానమొచ్చింది. పల్లెనాయండ్ల చేత పిటీషన్ బెట్టించినారు. ఏమైతాది. మర్యాదగా నాయెంట రేపొచ్చి ఆకాగితం యెనక్కి దీసుకో, లేకపోతే బాగుండదు.
ప్రకా:- ఊళ్ళోవాల్లంతా మొత్తంస0తకాలు బెట్టి పిటీషన్ వేస్తే నేనొచ్చి వాపసు దీసుకోమంటారేంటి? మీకు దెలుసునోలేదో అలా నాఒక్కరికీ పిటీషన్ వాపసియ్యరు.
ప్రకా:- అయితే యెలాగయ్యామరి. ఆ కలక్టర్ దర్యాప్తుజేయిస్తే, అప్పుడైనా నువ్వూ నీమనుషులు నేనే రోడ్డేసినానని సాక్ష్యం జెప్పండి.
ప్రకా:- ఏమిటండీ.. నేనూ.. నామనుషులూ అంటారేమిటి. ప్రత్యేకంగా నాకేమనుషులూ లేరు. వూళ్ళోవాళ్ళందరిని బిలిచి మీరేం జెప్పుకుంటారో జెప్పుకోండి. ఇందులో నాప్రమేయం నామమాత్రం. కష్టపడిపనిజేసినోళ్ళు. వాళ్ళకు కోపమొస్తే నేనేంజేయను.
దొర:- అట్టంటావా? అయ్యవారో జరిగిందేదోజరిగింది.వాళ్ళకు సర్దిచెప్పి, నన్నీ గండంనుంచి బయటెయ్యి. నీ ఋణముంచుకోనులే.
ప్రకా:- నాఋణం.. నాఋణం అంటారేమిటి. నేనలాంటివాణ్ని కాను. మరోసారి ఆమాటని నన్నవమాన పరచకండి. చెప్పానుగా ఇందులో నాప్రమేయం నామమాత్రమని.
దొర:-ఊళ్ళోవాళ్ళ ముందర ఈ విషయం జెప్పుకోవడం నూనతగావుంటాది. తలెత్తుకొని దిరగలేం... సరేసరే.. రోంత ఆలోచించు. మళ్ళామాట్లాడు కొందాం, వాడు కన్నప్ప వస్తావుండాడు. వానిదగ్గరెందుకులే యీ పంచాయితీ, మళ్ళీవస్తా.(పోవును)
ప్రకా:- జనం బెదిరినంతకాలం వీళ్ళ ఆటలు సాగాయ్. ఆడింది ఆట పాడింది పాటగా జరుపుకొని దోచుకతిన్నారు. ఇప్పుడు ప్రజల్లో కాస్తా చైతన్యమొచ్చేసరికి ఇలా ప్రలోభాలతో లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అవేం కుదరవని తెలియదితనికి. (కన్నప్ప రావడం చూచి) రా..కన్నప్పా రా.. ఒంటరిగావచ్చావే మనోళ్ళెవరూరాలేదా?
కన్నప్ప:-మీతో ఒంటిగా మాట్లాడాలనే వచ్చినాను సారూ..
ప్రకా:- ఏంకన్నప్పా! ఒంటిగా మాట్లాడేంత రహస్యమేముందప్పా మన మధ్యన.
కన్నప్ప:-రహస్యమేమీ లేదు సారూ.. మాకోసం యింత జేస్తావుండారు. మీ మంచీ చెడ్డా గూడా రోంత మేమూ ఆలోచించొద్దా సారూ..
ప్రకా:-నామంచి చెడ్డా యేముంది కన్నప్పా! నాకథ అంతచెప్పుకోదగ్గ కథ గాదులే.
కన్నప్ప:- ఎందుకుసారూ మీకీ ఒంటరి జీవితం. అయినా మీకిష్టం లేకపోతే చెప్పద్దులేండి.
ప్రకా:- అవసరమనిపించలేదు. అంతేగాని నా జీవితం మీవద్ద రహస్యంగా ఉంచాలనిగాదు కన్నప్పా.
కనప్ప:- చెప్పండి బాబూ.. కావలసినవాళ్ళతో చెప్పుకుంటే బాధ తగ్గుతుందని మీరే చెబుతుంటారుగదా!
ప్రకా:- అయినా నన్నింతగా అడుగుతున్నావుగనుక చెబుతా విను.
కన్నప్ప:-చెప్పండి.
ప్రకా:- నాకు పెళ్ళయింది. మా మామగారికి నాభార్య ఒక్కగానొక్క కూతూరు. గారాబంగాపెరిగింది. మా మామగారు నన్ను ఇల్లిటం ఉండమన్నారు. ఆస్తిలో కొడుకుతోపాటి వాటాకూడా యిస్తామన్నారు. నేనొప్పుకోలేదు.
కన్నప్ప:- మీ అమ్మానాన్నలతోగదా! ఆయన యీవిషయం అడగాల?
ప్రకా:- నాకు తల్లిదండ్రులులేరు. వాళ్ళు నా పసితనాన్నేపోయారు. మేనమామ దగ్గర పెరిగాను. మా మేనమామ ఒకరకంగా నాకు తెలియకుండానే నన్ను అమ్మేసుకున్నాడు. నాకు విషయం తర్వాతదెలిసింది. బిడ్డనిచ్చినమామ ఆలోచన వేరేగావుంది ఏదో..ఒకరకంగా చదువు కున్న వాడు. చెడుఅలవాట్లేమీలేవు. వెనకాముందు ఎవరూలేరు. వీడికి పిల్లనిస్తే ఇల్లరికముంచుకోవచ్చు. బిడ్డ కళ్లయెదుటే వుంటుందనుకున్నాడాయన.
కన్నప్ప:- ఆయన ఆలోచనలో తప్పేముంది బాబూ. ఇల్లరికముండకబోయార.
ప్రకా:- నిజమే కన్నప్పా.. నేనూఅలాగే అనుకున్నా. కానీ..
కన్న:- కానీ.. యేంటిబాబూ, మీరు తప్పుచేశారనిపిస్తాండాది.
ప్రకా:- ముందునా మాట నిను కన్నప్పా.
కన్న:- ఆఁ..చెప్పండి.
ప్రకా:- ఆతర్వాత మా మామ కొడుక్కి పెండ్లిచేసినాడు. కోడలింటికొచ్చింది. ఆమెకు మేము వాళ్ళతో కలిసివుండటం నచ్చలేదు. నా బావమరిది ఆమెవైపే మొగ్గు చూపాడు. ఇంతలోనాకు ట్రాన్స్ఫర్అయ్యింది. ఆసాకుతో నాసంసారం వేరుపడి, వాళ్ళకు ఇబ్బంది లేకుండా చేద్దామనుకున్నాను.
కన్న:- అలాగాబాబూ! చాలా మంచి నిర్ణయమే దీసుకున్నారు.
ప్రకా:- నేను మంచిదే అనుకున్నానుకానీ.. కానీ.. నాభార్య ససేమిరా అంది. అన్నభార్యతో తగవులాడడం మొదలు పెట్టింది. పట్టుదలకుపోయి, నన్ను ఉద్యోగానికి రాజీనామాచేసి వాళ్లనాన్న వ్యాపారం చూసుకోమంది. మనహక్కు వదులుకోకూడదంది. కాదుకూడదని నువ్వు టీచర్గా బదిలీ మీదబోతే నేనుమాత్రం వెంటరానంది. అన్నాచెల్లెల్ల మధ్య అఘాతం పెరగకూడదని నేనెంత సర్ది చెప్పినా ప్రయోజనం లేకపొయింది.
కన్న:- ఆతర్వాత మీరు గడపదాటి వచ్చేశారు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? నేనుచెబుతావినండి.
ప్రక:- నీవుజెప్పడమేమిటి, నీకెలాదెలుసూ..
కన్న:- ముందు నేచెప్పేది వినండి. ఆతర్వాత అంతా అదేఅర్ఠమై పోతుంది. మీభార్య సుభద్రమ్మగారు తండ్రితో వుండి పోయింది. కానీ మీమామగారు తర్వాత ఒక యేడాదికి గుండె పోటొచ్చిచనిపోయారు.
ప్రకా:- తెలిసింది . నేను వెళ్ళాను. కానీ ఎవ్వరూ పలకరించలేదు. తిరిగొచ్చేశాను.
కన్న:- మీరొచ్చేశారు.. సుభద్రమ్మ కష్టాలు అప్పట్నుంచే మొదలైనాయ్. ఇంటికోడలికి ఆడబిడ్డకూ రచ్చ ముదిరింది. అన్న యెటూ చెప్పలేక తండ్రిగారి వీలునామాప్రకారం, ఆస్తి పంచియిచ్చి చెల్లెల్ని పంపేసినాడు. ఇప్పుడామె భర్తను దూరంచేసుకొని చేసినతప్పుకు బాధపడతావుంది. నేను యీడనుండి తిరపతికిబోయి మళ్ళీ ఆడనుండి చిత్తూర్లో నానా అవస్తలూ పడి ఆఖరికి సుభద్రమ్మగారింట్లో పనికి కుదురుకున్నా. అప్పు డొకసారి మీ ఫోటో ఆమింట్లో చూసినా.. అందుకేసారూ మిమ్మల్ని గుర్తు పట్టినా.. సారూ ఆమె యెంతో మంచిదిసారు. ముందుటిమాటేమో గానీ ఇప్పుడామె దయగల తల్లి. ఆమంతటి దాత వూళ్ళో లేరని పేరు బాబూ.
ప్రకా:- మంచిదే. ఎవరైనా పదిమందికి మేలుజేస్తావుంటే మంచిదేకదా!
కన్న:- అంతేగానీ సుభద్రమ్మగారిని రమ్మనరన్న మాట.
ప్రకా:- కన్నప్పా.. సుభద్ర కలవారిబిడ్డ. తనకు కొదవేమిటీ తనకిష్టమొచ్చిన చోట వుంటుంది. వుండనీ..
కన్న:- (తనలో) సరే మిమ్మలనెట్లా కలపాలో నాకు దెలుసులే. (పైకి) అంతెలేండి. ఆ బ్రహ్మదేవుడు మనుషుల్ని ఎట్టా గలుపుతాడో ఎట్టాయిడగొడ్తాడో మళ్ళీ ఎట్టాగలుపుతాడో వానికేదెలుసు. ఆఁ.. అదిసరేగాని సారూ.. సర్పంచ్ ఎలక్షన్ లొస్తావుండాయిగదా! ఇప్పుడు మనవూరి నాయకులిద్దరూ మెండుగా జనాల్లేకొస్తాండారు. పిలిచీ పేరుబెట్టి పలకరిస్తున్నారు.
ప్రకా:- అవును కన్నాప్పా. తొందరలోనే ఎన్నికలు జరుగుతాయ్. మనమంతా ఈసారి జాగ్రత్తగా ఓటేయ్యాల. వాళ్ళిచ్చే పదిపరక్కు చెయ్యిజాచగూడదు.
కన్న:- దొందుదొందే.. ఎవురి కేసినా ఒకటేసారూ.. ఒకడు కంసుడు ఇంగొకడు బకాసురుడు. ఈరిద్దరికి పోటీయిచ్చే మూడోవాడుంటే బాగున్ను. ఈల్లిద్దరికి బుద్ధిజెబుదుము.
ప్రకా:- అమ్మో.. చాలాదూరం ఆలొచించినావె. పెద్దమార్పే. ఐనా నేను గవర్నమెంటు టీచర్ని. నాకెందుకు రాజకీయాలుచెప్పూ. నిలబడినవాళ్ళలో నీతిపరుడుంటే ఓటేస్తా, లేకపోతే డబ్బాలో ఖాళీ ఓటేసొస్తా.
కన్న:- అది మాత్ర మెందుకు ఊరకుంటే పోల్యా.
ప్రకా:- లేదు ఓటుమాత్రంవేస్తా. నా ఓటు దొంగోటేసుకొనే అవకాశమివ్వను.
కన్న:- అందువల్ల యేం మేలుందిసారూ.. సరే పొద్దు బోయింది నరసన్నతో ఓమాట మాట్లాడాల వస్తా.(బయలుదేరును)
(లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)
(ఎర్రన్న, కన్నప్ప, చిన్నన్న కూర్చొని వుంటారు - గోపాల్ ఓప్రక్కన కూర్చొని ఏదో వ్రాసుకుంటూ వుంటాడు)
ఎర్రన్న:- ఎలక్షన్లు వచ్చేస్తున్నయ్, ఈసారి ఎవురి కేద్దంరా ఓటు.
కన్న:- ఎవురి కోటేద్దామనికాదు ముందు ఆలోచించాల్సింది. మనలో ఎవుర్ని పోటీకి నిలబెట్టాలా అనేది ఇప్పుడాలోచించాల.
చిన్న:- ఏందీ.. మూడో మనిషా?
కన్న:- ఇంగసాలు ఈ ఇద్దరి దొరల పీకుడు. ఆలోచించండి. ఈసారైనా ఓమంచి మనిషిని పోటీకి దింపి గెలిపించుకోవాల.
ఎర్ర:- ఎట్టుండేవోడివి ఎట్టామారిపోయినావురా! ఎంతధైర్యంగా మాట్లాడతాండావ్.
చిన్న:- నిజమే కన్నప్ప మాటా సరైందే. ఒకనిమిషం ఆలోచించి చూడండి. ఏమైతది ఇంకోమనిషి పోటీచేస్తే.
ఎర్ర:- ఆఁ.. ఏమైద్దీ. బెదిరింపులేంకుదరవ్. కాకపోతే వాళ్లు ఖర్చుబెట్టినట్లు మనంఖర్చు బెట్టలేం అంతే . ఓడిపోయినా మించిపోయిందిలేదు. మనం జెప్పదల్చు కొనింది ప్రజలకుజెప్పొచ్చు. కొంతమందైనా మనమాటా వినే వాళ్ళుంటారు. ఆలోచించండి.
కన్న:-మంచిమాటజెప్పినావన్నా. ఐనా సల్లుబోకుండా పనిజేద్దాం. ఇంటింటికి దిరిగి డబ్బుకు ప్రజలమ్ముడుబోకుండా నచ్చజెప్పుదాం. ఐనా నాకుదెలిసినంతవరకు ఆ దొరలకు ప్రజలు డబ్బుదీసుకోనిగూడా ఓటెయ్యరు.
చిన్న:- నిజమే.. ప్రతిఒక్కరూ ఏదోవిధంగా ఈ దొరల్తో ఇబ్బంది బడినవాళ్ళే. చేసేదిలేక ఇట్టా అణగిమణగి వుండారంతే. మూడోవాడుంటే వాళ్ళకెవుర్రా ఓటేసేది.
ఎర్ర:- ఔన్రా.. ఇదిరోంత ఆలోచించాల్సిన విషయమే.
(ఇంతలో భూషయ్య, భీముడు వస్తారు)
భూష:- ఏంరా ఎర్రన్నా,చినన్నా బాగుండారా.. ఒరే కన్నాప్పగూడా యీన్నేవుండాడే. బాగున్నావా కన్నప్పా..(పక్కనేవున్న గోపాల్ గడ్డాన్ని చేత్తోతగిలి ముద్దుబెట్టుకుంటాడు. గోపాల్ చెయ్యి విదిలించుకొని ఏదోవ్రాసుకుంటూ వుంటాడు.)
ఎర్ర:- మీరేందయ్యగారూ .. ఈడి కొచ్చినా రు, రండి..కూకోండి.
భూష:- అట్టా పొలంకాడ నుండి వస్తా మీరు గనబడితే ఇట్టావస్తిలే. అందరూ బాగుండారుగదా!.. ఆఁ.. ఏంల్యే.. ఎన్నికలొస్తాండాయిగదా, ఈసారి మల్లా నన్నేగెలిపించాల. టవున్లన్నీ దిరిగొచ్చినోడివి కన్నప్పా.. నువ్వుజెప్పప్పా.. ఒకమంచి కాలక్షేపంబెట్టుకుందాం. హరికథలూ బుర్ర కథలూ పాతబడిపొయినాయ్ వొద్దప్పా..మాంచి బ్రేకుడ్యాన్సులు దెప్పిస్తాం.. ఏరా గోపాలూ ఆరోజుకు నువ్వూ డ్యాన్సెయ్యాల. బాగా నేర్చుకో.. నీకు డ్రస్సు కుట్టిస్తాలే.
కన్న:- ఎందుకులేండయ్యగారూ.. ఖర్చుదండగ. మీరొచ్చి నిలబడి ఓటడిగితేసరిపోతుందిలే.
భూష:- నువ్వుచెప్పింది బాగానేవుంది, గానీ వాడు దొరస్వామి ఊరుకుంటాడా? వానికంటేముందే మాంచి రంజైన ప్రోగ్రాం బెట్టించకుంటే కుదరదప్పా. వాడు తక్కవోడుగాదు.
ఎర్ర:- (తనలో) ఇదికూడా ఆయనకు భయపడేగానీ, మనకోసంగాదన్న మాట.
భూష:- ఏంది ఎర్రన్నా.. నీలోనువ్వే మాట్లాడుకుంటాండావ్.
ఎర్ర:- ఏంలేదయ్యగారూ.. మీయిష్టం మీకేది తోస్తే అదేచెయ్యండి.
భూష:- నిజమేలే.. మీరంతా.. మనోళ్ళేగదాని అడిగినాలే.. ఐనా వూరంతా ఈమధ్యన సచ్చుగావుంది. మాంచి హుషారైన ప్రోగ్రాం బెట్టించాల. సరే.. నేనింగరోంత ఆలోచనజేసి మొత్తంమీద ఓ మంచి ప్రోగ్రామైతే బెట్టిస్తా. పదరా భీమా.. పోదాం.. ఆ అయ్యవార్ని గూడా ఒకసారి కలుసుగోవాల. రేప్పట్నం బోయొచ్చి సిన్నంగా మాట్లాడాల్లే.. పదా.. (ఇద్దరూ వెళ్ళుదురు)
కన్న:- చూసినావన్నా.. మనకోసం డ్యాన్సులు బెట్టించి..
ఎర్ర:- సచ్చుగావున్నోళ్ళకు హుషారెక్కిస్తాడంటరా.. భూషయ్య.
చిన్న:- ఇన్నాళ్ళూ అమాయకులమై యీళ్ళాడినట్ల ల్లా ఆడినం. ఓయాబైనోటు ఓసారాయి పొట్లం యిస్తే చిందేసినాం.
కనప్ప:- ఇప్పుడు మనం సారాయీ తాగడంల్యా, వీధుల్లో దొర్లాడటమూల్యా. అందుకేగామోసు మనకు ఉషారు తగ్గిందని భూషయ్యగారు తేల్చేసినారు. సూద్దాం. ఏదియేమైనా మనందరం కలిసి బాగా ఆలోచించి ఒక నిర్ణయం మాత్రం దీసుకోవాల.
ఎర్ర:- ఆఁ.. ఆలోచిద్దాం వూళ్ళో ఇంగాపదిమందితోకలిసి మాట్లాడుదాం.. ఊరి మేలుకోసం మనంగాక ఇంగొకరెవురు ఆలోచిస్తారు. మనమే ఆలోచనజేయాల.. సరే చినుకులు బడేటట్లున్నాయ్ పదండిపోదాం..
(లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)
(టీచర్ అరుగు మీదుంటాడు)
ప్రకా:- (వచ్చే కన్నప్పను జూసి ) రా కన్నప్పా.. రా.. ఈమధ్యన మీదమీద ఎక్కడికో దూరమే పొయ్యొస్తా వుండావ్.. ఒకటి రెండు సార్లు బస్సెక్కు తుంటే జూసినాలే.
కన్న:-పనై పొయ్యిందిలెండయ్యా.. ఇంగ్యాడికీ బొయ్యేపనిలేదులే.
ప్రకా:- ఇంతకూ యెక్కడికి బొయ్యొస్తున్నావో, పనేమిటో మాత్రం జెప్పవన్న మాట.
కన్న:- మీకుదెలియకుండా బోతాదా? అంతాదెలిసిబోతాది లేండి. ఇదిగో.. తీసుకోండి, సుభద్రమ్మగారు మీకియ్యమన్నారు. ఒకటి చెక్కుబుక్కు, రెండోది బ్యాంకుపాసుబుక్కు. చెక్కుబుక్కు కాగితాలన్నిటిలో అమ్మగారు సంతకాలు చేసిచ్చినారు. చూసుకోండి. (చేతికందిస్తాడు)
ప్రకా:- అంటే నువ్వు చిత్తూరు వెళ్ళి..
కన్న:- ఆతల్లి కోసం ఇంగ చిత్తూరుకెందుకూ.. ఆమే మనూరు వచ్చేసి0దిగదా!
ప్రకా:- ఏమిటీ! సుభద్ర మనూరొచ్చిందా? (దిగ్గున లేస్తాడు)
కన్న:- ఔను బాబుగారూ.. ఆమెతన ఆస్తినంతా అమ్మేసి డబ్బు బ్యాంకులో వేసి ఆ బుక్కులు మీకిచ్చి రమ్మన్నారు. మీరనుమతిస్తే, యింట్లో అడుగుబెడతారు. లేకుంటే పంచనే వుంటామన్నారు.
ప్రకా:- కన్నప్పా! ఇదంతా నీ నిర్వాహకమే నన్నమాట.
కన్న:- ఔను బాబూ.. తప్పైతే క్షమించండి. వొద్దొద్దు మీయిష్టమొచ్చిన శిక్ష వేయండి. అనుభవిస్తాను. ఆతల్లి తన యిల్లు వెతుక్కుంటూ వచ్చింది. ఆమెను మాత్రం కాదనకండి. తప్పు యెవురైనాచేస్తారు. అదిమానవ సహజం. తప్పు సరిదిద్దుకోడమే గొప్పని మీరే కదా! మాకుపదేపదే చెబుతుంటారు. సుభద్రమ్మగారు కూడా తనతప్పు తాను తెలుసుకొని తనింటికి వచ్చేశారు. ఊళ్ళో యెన్నో కుటుంబాలకు బుద్ధిచెప్పి నిలబెట్టారు. యసనాలు మాన్పించినారు. మీకుటుంబం నిలబెట్టే అవకాశం మాకియ్యండి. మాయీ ఒక్కమాటా యినుకోండి. మీరుజెప్పిన పతిమాటా మేము జవదాటం. మీరు గీసినగీటు దాటం. దయచేసి యినుకోండి (కాళ్ళపై బడును)
ప్రకా:- కన్నప్పా.. లే.. ఇన్నిచెప్పాల్సిన పన్లేదయ్యా.. నేను నాసుభద్రను వదులుకోవాలని యేనాడూ అనుకోలేదయ్యా.. పంతాలకూ ప ట్టింపులకూ పొయ్యినప్పుడు ఇరుప్రక్కలా తప్పులు ద్రొల్లుతాయి. సరే.. నీమాటైనావిని సుభద్ర తన ఇళ్ళువెతుక్కుంటూ వచ్చింది. మంచిదే. కానీ తనడబ్బు నా
కెందుకయ్యా. ఇవిగో సుభద్రకే ఇచ్చేయి. తనూ బాగా చదువుకొన్నదే. తనకుతోచినట్లు తనే ఈ డబ్బు సద్వినియోగం చెయ్యమను. నా
కభ్యంతర మేముంటుంది చెప్పూ. సుభద్ర నన్నింకా అర్థం చేసుకో లేదయ్యా, ఈడబ్బు నాచేత బెడితేనే గాని ఇంట్లోకి రానివ్వననా? ఎంతవెర్రి ఆలోచన.
కన్న:- అపార్థం చేసుకోకండి బాబూ. మీత్యాగబుద్ధిని సంఘసేవనూ అర్థం చేసుకొని, మీమీద గొప్పనమ్మకంతో ఆబుక్కులు నా కిచ్చి పంపారే
గానీ వేరేయేంలేదు. "ఆపుస్తకాలు ఆయనచేతిలో బెట్టిరా.. నన్ను క్షమించ మనిజెప్పు. ఇక ఆయనిష్టం. ఈడబ్బుమాత్రం ఆయనజేసే సత్కార్యాలకు నా సహాయమనికోమను" అని మరీ జెప్పి పంపించారు. తమరు వేరుగా అనుకోమాకండి. (ఇంతలొ గోపాల్వచ్చి అరుగు మీద కూర్చుంటాడు)
ప్రకా:- నా ఉద్దేశ్యమర్థమైందిగదా! నాకు మాత్రమెవరున్నారు జెప్పు. నీమాటగాక యింకెవరి మాట వింటానయ్యానేను. వెళ్లు..యివిగో తాళంచెవీ, బుక్కులూ తనదగ్గరే వుంచుకోమను. ముందు ఇంట్లోకి బొమ్మను. కాసెపట్లో వస్తాననిజెప్పు.
కన్న:-నా జన్మధన్యమైంది. బాబూ, మీరుమాకుజేసిన గొప్ప సాయానికి ఆవగింజంతైనా రుణం దీర్చుకొన్నట్లయింది. సంతోషమైంది బాబూ.. ఆనందం.. ఆనందంగా వుంది.
(గోపాల్ అరుగుదిగి వచ్చి కన్నప్పచేతిలోని తాళంచెవి లాక్కోని)
గోపాల్:- నాన్నా.. అమ్మగార్ని ఇంట్లోకి పంపి సామాన్లు సర్ది బియ్యం కురగాయలు దెచ్చి (ఆయాసపడుతూ చెబుతుంటాడు)
కన్న:- ఒరే.. గోపాలూ.. అయన్నీ రేపు జూసుకుందాంలేరా.. ఈపూట అమ్మగారు వంటావార్పు జేయాల్సినపనిలేదులేరా.. మనమే వంటజేసి మనూరివంట రుచి జూపిద్దాం. ను రోంత సిన్నాంగాబో కిందబడేవ్. (గోపాల్ వెళ్ళును) ఇప్పుడు మళ్ళా ఎక్కడికి బోతారులేసారూ.. పనుంటే రేపు జూసుకుందురుగానీ. పదండయ్యా.. ఇంటికిబోదాం.
ప్రకా:- సరే పదా.. (కదుల్తారు)
(లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)
(అరుగుపై టీచర్ కూర్చొని వుంటాడు. భూషయ్య, భీముడూ వస్తారు)
భూషయ్య:- ఏందయ్యవారో.. నీకత జేస్తిగావుండాదే.
ప్రకా:- ఏందండీ భూషయ్యగారూ.. ఇప్పుడేమయింది. ముందిలా కూర్చోండి. మీరిక్కడికి రావడమేమిటి? ఒకమాట జెప్పిపంపుంటే నేనే మీబ0గళా కొచ్చుండే వాణ్ని గదా?
భూష:- మేంబిలిపిస్తే వచ్చేట్లున్నావా? నీలెవెల్ పెరిగిపోయిందిగదా..
ప్రకా:- అవేంమాటలండి. ఊర్లో చిన్నపిల్లోడు పిల్చినా పలికేవాణ్ని, మీరు పిలిస్తేరానా?
భూష:-అదేకదానేననేది. ఊళ్ళో వాళ్ళకంతా నాయకుడివైపోయినావులే. ఎందుకు పలకవు పలుకుతావ్. అదిసరేగాని, యీమధ్యన ఆదొరస్వామి గాడితో తెగమంతనాలు జేస్తున్నావంట.
ప్రకా:- అదికేవలం మీ అపోహ. నిన్నొచ్చి ఆయనా యిదేమాటన్నాడు.
భూష:- ఏమన్నాడేంటి?
ప్రకా:- అదే.. మీరూనేనూ కుమ్మక్కైపోయి ఆయనమీద కుట్ర పన్నుతున్నామంట.
భూష:- అయితే నేవిన్నదంతా అబద్దమంటావా?
ప్రకా:- అసలేంవిన్నారు.
భూష:- నువ్వూ దొరస్వామీ ఒక్కటై రేపొచ్చే ఎలక్షన్లలో నన్నోడించడానికి పెద్దప్లానే వేస్తాండారంట గదా?
ప్రకా:- అదంతాకల్ల. నేను టీచర్ని ప్రభుత్వజీతం తీసుకొని పనిజేసే ఉద్యోగిని. నేను మీ రాజకీయాలలో జోక్యం చేసుకోకూడదు. చేసుకోను కూడా. మీరాజకీయాలేవో మీరుజూసుకోండి నాజోలికి రావద్దు. ఒకరితర్వాత ఒకరొచ్చి నన్ను యిబ్బంది పెట్టకండి. దయచేసి నామానాన నన్ను బ్రతకనివ్వండి. మీకో నమస్కారం. వెళ్ళిరండి.
భూష:- వెళ్ళొస్తామండి..అది నువ్వు జెప్పాల్సిన పనిల్యా. చాలా నీతులే జెపుతాండావ్. యియన్నీ మాకుదెలీనివిగావ్. ఇదిగో అయ్యవారో! మర్యాదగాజెపుతాండా. రా.. వచ్చీ.. నాతరపున పనిజెయ్. నీక్కావలసినంత డబ్బిస్తా. అడుగు, యెంతగావాలో. వచ్చి రేప్పొద్దన్నే దీసకపో. లేకుంటే మా భీమునిచేత పంపిస్తా, తీసుకో. ఊళ్ళో జనానికి నాకే ఓటెయ్యమని రేపు గట్టిగా జెప్పాల.
ప్రకా:- అయ్యా! మీరుజెప్పే పనులేవీ నేను జెయ్యలేను. నన్ననవసరంగా మీ రాజకీయాల్లోకి లాగకండి. నే రానును, రాలేను. నన్నొదిలేయండి మహాప్రభో! వదిలేయండి.(ఇంతలో ఎర్రన్న, చిన్నన్న వస్తారు)
భూష:- సరే.. యీమాటమీదేవుండు. బాగా ఆలోచించుకో.. వస్తే నా పక్కకురా.. బాగుపడతావ్. చూస్కో యేమైనా ఎగస్పార్టీ వాళ్ళతోగలిసి పితలటకం జేస్తావుండావని తెలిసిందా? నాకత నీకు దెలియదు. ప్రాణాలతో విడువను. లేకపోతే ఒకటిజెయ్.
ప్రకా:- ఏంటది?
భూష:- బదిలీ జేయించుకొని యావూరికైనా ఎల్లిపో. బదిలీదరఖాస్తు నా చేతికీ. ఓనాల్గువేలు ఖర్చైనా నిన్ను నేను ఊరుదాటేట్లుజేస్తా. పీడ విరగ డైపోతాది.
ఎర్ర:- ఏందయ్యా.. భూషయ్యగారూ.. మనపిల్లలకి ఆయనొచ్చినాకనేగదా! నాలుగక్షరాలొచ్చినాయాయ్ ఆయన్ను ఊరుదాటిస్తా మంటారేమిటీ. ఆయనకేవూరైనా ఆయనజీతం ఆయనకొస్తాది. మనకే మళ్ళా మరో అయ్యవారు దొరకద్దూ..
భూష:- ఇతడుబోతే యితని జేజినాయనలాంటోడు యింకోడొస్తాడు. అయినా మీకెందుకురా యిదంతా? ఎవుడువూళ్ళో వుండాలో, ఎవుడ్ని సాగనంపాలో మేంజూసుకుంట్టాం.
చిన్న:- అదేమిటండి.. అట్లా మాట్లాడతారూ.. ఈయనుండబట్టే రేత్రిబడి బెట్టి మాకూ నాలుగక్షరాలు నేర్పె. ఆయన మనూళ్ళో వుండాల... అంతే..
భూష:- ఓహో.. మనుషుల్ని కట్టగట్టుకొని నాకే తిరగబడేట్లు జేస్తావుండావంటే. పెద్దకుట్రే జరుగు తూందన్నమాట. ఇంగ ఊరుకుండేదిల్యా.. అయ్యవారో నిన్నింగవదల్ను. ఆఖరుసారిగా మర్యాదగా చెబూతాండా.. నాకు సపోర్టుగా వుంటారా.. సరే..లేకపోతే నాయాండ్లారా పుచ్చలు, పుచ్చలు లేసిపోతాయ్.
ఎర్ర:- ఏమండి అట్లా బెదిరిస్తారు. మీరిట్లా మాట్లాడం యేంబాగాలేదండి. ఊరిపెద్దలు పెద్దరికంతో మెలగాలండి. ఓటేయ్యమన్నారు బాగుంది. ఊరికేమైన మేలుజేస్తామనండి ఇంగాబాగుంటుంది. ఊరికి పనికొచ్చేవార్ని తరిమేస్తా, సంపుతా నంటే ఎట్లాగండీ. అయ్యవారి నొదిలేయండి. ఆయన మీరాజకీయాలు నాకొద్దో అంటే వినరేమండి.
చిన్న:- చాలాకాలంకిందటే అయ్యవారా.. నువ్వు మావూరికి సర్పంచ్ గారాదా? ఈ అయ్యవారుద్యోగం వదిలేయమంటే ససేమిరా కాదన్నాడు. ఈ వూళ్ళో మీలో ఒకనిగా వుంటా. నా టీచర్ఉద్యోగం నేజేసుకుంటా. నాకేపదవులూ వద్దంటే వద్దన్నాడండి.
భూష:- ఓహో యీయన్నే నిలబెట్టాలనుకోవడం కూడా జరిగిందా? గెలవలేమని దెలిసుకోని తగ్గుంటారు. ఇంగ కట్టగట్టుకొని ఆ దొరస్వామి గాడితో మంతనాలు జరిపి నాకే ఎసరుపెట్టాలని జూస్తాండారన్నమాట.
ప్రకా:- ఎర్రన్నా, చిన్నన్నా పెద్దవారితో వివాదమెందుకూ.. ఆయన నన్నుగదా అడుగుతున్నారు, నేను జెపుతానాయనతో. మీరు వూరుకోండి.
భూష:- ఏందిరా ఇంగానువ్వు జెప్పేది. ఇంతకాడికొచ్చినాక నినింక వదల్ను. ఇదేనీకు ఆఖరు రోజు. సావ్.. (రొప్పుతూ కోపంతో వూగిపొతూ జుబ్బా జేబులోంచి పిస్టల్ దీసి ఆలోచననశించి టీచర్నికాలుస్తాడు. ఇదంతా గమనిస్తున్నభీముడు తటాలున టీచర్కు అడ్డంవచ్చి గుండుతగిలి ఆఁ..అంటూ క్రిందపడి పోతాడు. మళ్లీ భూషయ్య కాల్చబోయేసరికి కన్నప్ప పరిగెత్తుకొచ్చి భూషయ్యను వాటేసుకొని వెనక్కి లాగేస్తాదు. ఇంతలో గోపాల్ అరుగుమీదుండే దోటీ కట్టెతో గట్టిగామోది పిస్టల్ ఎగరగొట్టేస్తాడు. చిన్నన్న, ఎర్రన్న వెంటనే భూషయ్యను ఒడిసి పట్టి చెట్టుకు కట్టేస్టారు. టీచర్ ఒడిలోకి భీముణ్ని చేర్చుకొని)
ప్రకా:- ఎంతపని జేసినావయ్యా..భీమయ్యా.. నాకోసం నువ్వు తుపాకీ గుండుకు రొమ్మొడ్డినావా? అయ్యో.. యెంతపని జేసినావయ్యా..
భీముడు:- అయ్యా..మీరు బతికి పోయారు. నాకంతేచాలు. నాలాంటోడు వుంటేయెంత పోతేయెంత... దాహం..దాహం.. (గోపాల్ అరుగుమీదుండే, టీచర్ నీళ్ళబాటల్ తెచ్చి టీచర్ కిస్తాడు. టీచర్ భీమునికి నీళ్ళు తాపుతాడు)
ప్రకా:- గోపాల్ నువ్వూ మీనాయన వెళ్ళి బండిగట్టండి. చిన్నయ్యా నువ్వెళ్ళి బస్సాపు (టైంజూసి) బస్సొచ్చే టైమైంది పరిగెత్తు. వెంటనే ఆస్పత్రికెళ్ళాల.. ఊఁ.. పరిగెత్తు.
భీముడు:-ఎందుకయ్యా.. వాళ్ళనట్టా తరుముతావు. ఆగండి ఎవురూ ఎక్కడికీబోవద్దు. నేను బతకను. నాపనై పోయిది. దుర్మార్గుల పంచనజేరి ఊడిగంజేసి వాళ్ళకు తాళం గొట్టిన వాళ్ళంతా ఇట్టాబోవాల్సిందే. అన్నలార నాకత జూసినారుగదా? మర్సిపోమాకండి. మనుసులోబెట్టుకోండి.(టీచర్ సైగజేయగానే ఎవరిపనిమీదవాళ్ళు వెళ్ళతారు.) అయ్యవారా.. యీపొద్దు భూషయ్య నిన్ను జంపడానికే వచ్చినాడు. అందుకేనేను కనిపెట్టు కోనున్యా. రాత్రంతా ఆయన మనుషులు శానాశానా నూరిపోసినారు. నిన్నుసంపి నన్ను జైలుకు పంపాలని గూడా మాటలైనై. ఆళ్ళమాటలన్నీ భూషయ్యకు యిసమెక్కినట్లు తలకెక్కినై.
ప్రకా:- నేనెవరికీ ద్రోహం చేయలేదే..అలా వా ళ్ళెం దుకు చెప్పారు.
భీముడు:-పిచ్చయ్యవారా! అట్లావాళ్ళు జెప్పి యగదోయకపొతే, వాళ్లకుసారాయి వూరికేబోయిస్తారా? మీసాలెగరేస్తా బలాదూర్ దిరగడానికి డబ్బులెవరిస్తారు. (ఎక్కుళ్లు ఆయాసం వచ్చేస్తాయి. వూపిరి పీల్చలేక కళ్ళుతేలేస్తాడు. టీచర్ కొద్దిగా నీళ్లు త్రాగిస్తాడు. భీమయ్య ఆఖరుశ్వాసవదులుతాడు. చనిపోతాడు. టీచర్ భీమయ్య రెండుకళ్ళూమూసి వొళ్లోనుంచిదించి క్రింద పడుకోబెడతాడు.)
ప్రకా:- ఇక జరగవలసింది పోలీసులూ, గ్రామసచివాలయసిబ్బంది చూసుకుంటారు. వాళ్ళకిప్పుడే కబురుచేస్తాను. భయమేమీలేదు. నిర్భయంగా చూసింది చూసినట్లు చెప్పండి. (కన్నీళ్ళు తుడుచుకుంటూ ప్రక్కకు వస్తాడు.)
(లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)
(అరుగుమీద గోపాల్ పుస్తకం దీసి యేదో టీచర్కుచూపిస్తుంటాడు)
ఎర్ర:- (వస్తూ) సారూ పేపరు జూసినారా..(జుబ్బాజేబులోంచి పేపర్ దీస్తాడు)
ప్రకా:- ఏదీ మనూరి సర్పంచ్ ఎన్నికలగురించేనా?
ఏర్ర:- అయితే మీకు ముందే దెలుసన్నమాట.
ప్రకా:- రాత్రి రేడియోలో జెప్పినారు లేవయ్యా.. నీకిప్పుడు దెలిసింది. మనోళ్ళందరికి రాత్రే దెలిసి పోయింది. రా.. ఈరోజు ఆదివారంగదా.. బడిలేదులే.. తొందరేంలేదు కూర్చో.. ఆపేపరిట్లియ్యి వివరంగా చదువుదాం.
(ఇంతలో చిన్నయ్యా ఆతర్వాత కన్నప్ప ఒకరి తర్వాత ఒకరొస్తారు.)
చిన్న:- చూసినావా ఎర్రన్నా.. మనూరి రాజకీయాలు యెంత చిత్రంగా మారి పోయినాయో? ఈభూషయ్యా, దొరసామి ఇనపపాదాలకింద బడి నలిగి పోతుంటిమి. ఇప్పుడు జూడు యేమైందో.. ఒకరేమో ఖూనీకేసులో ఇరుక్కునె. ఇంగొకడు రోడ్డుపని దొం గబిల్లుల కేసులో చిక్కోనిపాయ.
కన్నప్ప:- అయితే మాత్రం వాళ్ళు అంతసులువుగావదుల్తారా! కేసులు తలకిందులు జేసి మళ్ళీ మనల్ని భూతాలై పేడించరూ..
ఎర్ర:- నీకూ ఇంగా అసలు విషయం దెలిసినట్లు లేదే? కన్నప్పా..
కన్న:- అసలు విషయమా? ఏందన్నా.. నాకుదెలీదే. ఆ ఎంగటన్నకు బాగలేదంటే, సూడ్డానికి పట్నంబొయ్యి ఇయ్యాల పొద్దున్నే వొచ్చినా. పేపరింకా జూడలేదులే.
ఎర్ర:- ఐతే ఇప్పుడిను జెప్పూతా..
కన్న:-ఇంతకూ జరిగిందేమిటో జెప్పరాదూ.. ఈ నసుగు డెందుకూ..
ఎర్ర:- తొందరెందుకూ.. విను..మనవూరి సర్పంచ్ సీటు గిరిజన కోటా కిందికి బోయిందంట. అంటే మనూరి యానాది, ఎరికల కులస్తుడే ఇప్పుడు పోటీ జేయాల. అంతే! ఆపాతదొరల కిక్కడ సీటు లేదు.
ప్రకా:- అర్థమైందిగదా! అంతేగాకుండా.. ఏకగ్రీవంగా యెన్నికకాబడిన పంచయితీకి ప్రత్యేక గ్రాంటు కూడా ప్రకటించారు.
చిన్న:-సారూ.. మనూరికి నాలుగు దిక్కులనుండి అదృష్టం కమ్ముకొస్తాందయ్యా
ప్రకా:- అంటే ఏందన్నా... చిన్నన్న.. నాక్కూడా అర్థంగాకుండా మాట్లాడుతున్నావ్.
చిన్న:- అంతేసారూ.. మరి మీరు నేర్పిన తెలివితేటలేగదా! వివరంగా జెబుతా వినండి. మీరు రాజకీయాలంటేనే గిట్టదంటారు. అసలా విషయమే మమ్మల్ని మాట్లాడనియ్యరు గదా!
ప్రకా:- అవును.. ఐతే..
చిన్న:-అయితే ఏముందీ.. మేమే ఊళ్ళో పదిమందిమీ కలిసి గూర్చిని, ఊరి బాగోగులు ఆలోచించి, ఈఊరి రాక్షసుల బారినుండి ఎట్లా బయట పడాలా అని చర్చ జేసి, ఆఖరికి మన కన్నప్పను ఎన్నికల్లో పోటీకి నిలబెట్టాలని ధైర్యంగా ఖరారు జేసినాం. సమయమొచ్చినప్పుడు జెబుదామని మనసులో బెట్టుకున్నాం
ఎర్ర:- సారూ.. మీకు జెబుదామంటే.. మీరు రాజకీయాలంటేనే కసురుకుంటావుంటే ఎట్టాజెప్పగలం.
చిన్న:- ఇప్పుడు సమయమొచ్చింది. మనకన్నప్ప యానాది కులస్తుడు. ఊళ్ళుదిరిగి మాటతీరుగూడా రోంత సుబ్బరంగా అలవాటు జేసుకున్నాడు. ఎలాగూ ముందే అనుకున్నామ్. ఊళ్ళో అందరికీ కన్నప్పంటే సమ్మతమే. ఇంగ పోటీలేకుండా ఎన్నిక జరిగి పోతుంది. మంచిదేగదా సారూ..
ప్రకా:- అరే కన్నప్ప గిరిజనుడా! నాకుదెలీనేదెలీదే!
ఎర్ర:-మీలాంటివాళ్ళకు యీ కులాల విషయంతో పనేముంటుంది సారూ.. మీలాంటి ధర్మాత్ములేవుంటే. ఈకేటాయింపులతో పనేముంటుంది సారూ.. అందరూ చెప్పకుండానే చకచకా యెదిగి రారూ..
ప్రకా:- లేదు, బలహీనవర్గాలు యింకా బాగుపడలేదు యీ కేటాయింపులు యింకా కొనసాగాల్సిందే
కన్న:-(కన్నీరు తుడుచుకుంటూ) మీరంతా నాకుదెలీకుండానే నాపైన ఇన్ని ఆశలు పెట్టుకున్నారా! నేనేంది, ఊరికి సర్పంచ్ గావడమేంది. నా వల్లయే పనేనా?
చిన్న:- కన్నప్పా.. ఈపెద్దోళ్ళ దౌర్జన్యానికి సంసారమే పాడై అష్టకష్టాలూ పడినోడివి. కష్టంసుఖం తెలిసినోడివి. ఆయ్యవారిలాంటి వాళ్ళ అండదండలున్నోడివి మేమంతా ఎప్పుడూ నీకు తోడుంటాం. నువ్వట్టుండు. పనులన్నీ యెట్టా జరిగిపోతాయో సూడు. ఐనా ఇంగో గిరిజన నాయకుడు మాకేడిజెప్పు. నీకుతప్పదప్పా కన్నప్పా..
ప్రకా:- మరోసారి చిన్నాపెద్దా కలిసి మాట్లాడుకోండి. ఊరి పెద్దల ఆశీర్వాదంకూడా తీసుకోండి. వాళ్ళెలాగూ పోటీలో వుండడానికి వీల్లేదు. కనుక మన్నిస్తారు. అందర్నీ కలుకొనిపోతే ఏకగ్రీవం సులభమౌతుంది. ఏకగ్రీవమైతే వూళ్ళో రచ్చలూ రావిళ్ళుండవు. ఎన్నికలపేరుతో దుబారా ఖర్చులూ వుండవు. దానికి తోడూ ప్రత్యేక గ్రాంటూ వస్తుంది అంతా ఊరికే ఉపయోగపడుతుంది.
ఎర్ర:- ఇంగా మాట్లాడేముందబ్బా. ఎంతమట్లాడినా ఇంతేగదా! అయినా సారు జెప్పినాడు గాబట్టి ఒకసారిమాట్లాడుకుందాం. ఆతర్వాత పెద్దలకూ ఓ నమస్కారం బెట్టొద్దాం. అది మనకు నూనతేంగాదు. వినయంతోనే మెలుగుదాం.
ప్రకా:- ఇంకో శుభవార్త. మీకుచె ప్పాలనేవచ్చినా.. ఐతే ఈఎన్నికల సందడిలోబడి మరిచేపోయా..
కన్న:- ఇంకో శుభవార్తా.. ఏంటది సారూ..
ప్రకా:- మనూరికి ఒక ఆసుపత్రి, ఒకబడి మా సుభద్ర తను ఖర్చు బెట్టి నిర్మిస్తానని ప్రభుత్వానికి ప్లాన్లతోసహా దరఖాస్తు పంపింది. అనుమతికూడా ఇదిగో వచ్చేసింది. దానికి తోడు మన భీమన్న పోస్టాఫీసులో దా చుకున్న డబ్బు, ఈవూరి టీచర్ ప్రకాశంకు జెందాలని నామినేషన్ యిచ్చినాడంట. అది ఇంకోరెండురోజుల్లో నా చేతికొస్తుంది. దాంతో ఆయనపేరుతోనే ఓపిల్లల పార్కూ, అందులో బోరింగు వేయిద్దాం. ఇది నాసలహా మాత్రమే! మీరూ ఆలోచించండి. నలుగురం ఏంజేద్దామను కుంటే అదే చేద్దాం. ఇకబోతే బడి ఎన్నికలైన తర్వాతగాని తయారుగాదు. టైంబడుతుంది. కనుక కొత్త సర్పంచ్ చేతనే ప్రారంభం చేయిద్దాం. ఐతే ఒక్క షరతు.
చిన్న:- అదేంది సారూ.. మల్లా..
ప్రకా:- బడి ప్రారంభించే సర్పంచు ఏకగ్రీవంగా ఎన్నికైతేనే యిదంతా.. లేకపోతే..
చిన్న:- లేకపోతే.
ప్రకా:- లేకపోతే మాబడికొచ్చే అమ్మాయిచేత ప్రారంభింపజేస్తా.
ఎర్ర:- ఒద్దులేసారూ.. సర్పంచే ప్రారంభించనీ.. ఆడబిడ్డ కుడికాలు ముందుబెట్టి బడిలోకొస్తాదిలే.
చిన్న:- మనూరికి నాలుగుదిక్కులనుంచి కాదబ్బో, ఎనిమిది, కాదుకాదు పైనాకిందా గలిపి పది, అదే దశదిశలనుంచి ప్రకాశం ప్రసరిస్తూందిప్పుడు.
ప్రకా:- అబ్బో చిన్నన్నకు కవిత్వమొచ్చేసిందే.. శుభమ్. (అందరూ ఆనందంగా నవ్వేస్తారు)
సమాప్తము
v
No comments:
Post a Comment