Tuesday, 1 December 2020

దీపావళి

 
దీపావళి
(పౌరాణిక నాటిక)
 

రచన
పి. సుబ్బరాయుడు
42/490. భాగ్యనగర్ కాలనీ
కడప516002
సెల్: 9966504951.
 
 
 
ఇందలి పాత్రలు
 
1. శ్రీకృష్ణుడు
2. నారదుడు
3.గరుత్మంతుడ
4. నరకాసురుడు
5. మురాసురుడు
6. సత్యభామ
7. నాట్యకత్తె
 

 
దీపావళి
(పౌరాణిక నాటిక)
(ఆకాశం కర్టన్‍ముందు నారదుడు- పాట)
 
జలరుహనేత్రా - జగదాధీశ      
నారాయణ హరి - నమోనమో
 
          1. సృష్టి స్థితిలయ - కారణభూత
             బహిరంతర్గత - వ్యాపితతేజా
             కరివరదా హరి - కంస విధారి
             పాలిత మునిజన - పరమాత్మా హరి.--//జలరుహ నేత్ర//
 
         2. శ్రీమహిళాప్రియ - సర్వశక్తిమయ
             కరుణా రసఝరి - భవభయహారి
             భువనమోహనా - నందితసురగణా
             దీనజనావన - శ్రీనారాయణ ......       //జలరుహ నేత్ర//
 
         3. మాయమానుష - సంస్థితదేహా
             దివ్యకళా మయ - దీపితరూప
              త్రిగుణాతీతా - త్రిభువన నేతా
             గగనసదృశా - ఘనతాపహార....       //జలరుహ నేత్ర//
 
ఆహా! హరిలీలాగానమున కాలమిట్టే గడచిపోయినది. నా గగనయాన ప్రయాస తెలియకయే ద్వారక జేరితిని.  నారాయణ నారాయణ.    
(లైట్స్ ఆఫ్ అండ్ ఆన్  ఆకాశంకర్టన్ తొలగి ఉద్యానవనం కర్టన్ కనబడును - సత్యాకృష్ణుల పాట)
 
కృష్ణ:-  మనసులోన పొంగిపొరలె
           మధుర మధుర భావనలు...
 
సత్య:-      కదలనీవు నిన్నువీడి
           మదిని మెదలు తలపులు
 
కృష్ణ:-         ప్రేమయనగనే మొ నేను
              నిన్ను కలసి తెలిసికొంటి
              మనసులోన రేగు గుబులు
              కర్థమేమొ యెఱిగినాను.... // మనసు లోన//
 
సత్య:-      పరవశమున తేలిపోదు
             ప్రపంచమునె మరచిపోదు
             ప్రకృతిపురుషు లనగమనము
            కలసి మెలసి మెలగుదాము......       //కదల//
 
కృష్ణ:- నేనుహంస నీవు కొలను
 
సత్య:-   కమలమేను తుమ్మెదీవు
 
కృష్ణ:-  కాదు కాదు కాదుమనము
 
ఇద్దరు:-  అద్వైతపు సార మిపుడు
 
కృష్ణ:- //మనసులోన//
 
సత్య:-    //కదలనీవు//
 
సత్య:- స్వా మీ! వెళ్ళివచ్చెద. ఫలహారములు సిద్ధముచేసి  మిమ్ము గొంపోవుటకు యిట్టే మరలవచ్చెద.(వెళ్ళును. కృష్ణుడు అరుగుపై కూర్చొని మురళి వాయించుచుండును-చక్కని మురళీ గానం వినిపించవచ్చును).
 
నారద:- (ప్రవేసిస్తూ) నారాయణ... నారాయణ
 
కృష్ణ:- నారదమునీంద్రులకు నమోవాకములు. మహర్షీ దయచేయండి. ఈ చంద్రశిలా విలసితమైన తిన్నెపై ఆశీనులుకండు. (కూర్చొండును) ఊరకరారు మహాత్ములు. తమరేవిషయము మా చెవిన వేయుటకింత దూరము వచ్చిరో సెలవిండు.
 
నారద:-  సీ:  అంభోజ నాభున కంభోజనేత్రున
                  కంభోజమాలాసమన్వితునకు
               అంభోజపదున కనంతశక్తికి వాసు
                  దేవునకును దేవదేవునకును
                భక్తులు కోరినభంగి నేరూపైన
                 పొందువానికి నాదిపురుషునకును
                    నఖిలనిదానమై యాపూర్ణ విజ్ఞాను
                          డైనవానికి పరమత్మునకును
 
          ఆ:వె:  ధాతగన్న మేటితండ్రికి  నజునికి
                   నీకు వందనంబు నేనొనర్తు
                   నిఖిల భూతరూప, నిరుపమ, ఈశ,
                   రా, పరాత్మా, మహిత, యమిత చరిత.
 
దేవా! నీవు లోకంబుల సృజియించుటకు రజోగుణంబును, రక్షించుటకు సత్వగుణంబును, హరించుటకు తమోగుణంబును ధరియింతువు. కాలమూర్తివి, ప్రధానపూరుషుండవు. పరుండవీవ. ధరిత్రియు, వారియు, ననిలుండు, నాకాశంబు, తన్మాత్రలూ నింద్రియంబులును, దేవతలును, మనంబును, కర్తయును, మహత్తత్త్వంబును, చరాచరంబైన  విశ్వంబు నద్వితీయుండవైన నీయందు సంభవించు. అట్టి నీకు నేనేమి చెప్పువాడను. ప్రాగ్జోతిషపురాధీశడైన నరకుడు మితిమీరిపోయినాడు. అతడు మహాబలసంపన్నుడై ముల్లోకములనూ కల్లోల పరచుచు న్నాడు .
 
కృష్ణ:- నిజమే నారదా.. నిన్ననే ఇంద్రుడు యితర దిక్పాలురతో కలసివచ్చి, తమకు నరకునివల్ల కలిగిన అవమానములను యేకరువుపెట్టి వెళ్ళినాడు.
      
నారద:- శ్రీకృష్ణా.. యిప్పటికే ఇంద్రుడు అమరాద్రిస్థానము గోల్పోయినాడు. దేవమాత అదితి కుండలములను బలవంతముగ లాగికొని వచ్చినాడీ నరకాసురుడు. వరుణదేవుని దివ్యఛత్రమును సహితమపహరించినాడు.
 
కృష్ణ:- అంతియెకాదు నారదా.. వాడు త్వష్టప్రజాపతి   కు మార్తెను బలాత్కరించినాడు. పదునారువేలమంది కన్యలను చెరబట్టినాడు. ఇంతటితో వాని పాపము పండినది. ఇకవాడు యే మాత్రమూ క్షంతవ్యుడుకాడు. అందుకే వాని  సంహారమునకు వ్యూహ మాలోచించుచున్నాను.
 
నారద :- దుష్టసంహరమునకై అవతరించిన తమరికి, వీనిని నిర్జించుటెంతపని స్వామీ!
 
కృష్ణ:- లేదు నారదా.. వీనితల్లి భూదేవి వరాహవతార సమయమున నన్నుసేవించి వీనిని కన్నది. ఆనాడు భూదేవి నన్ను మెప్పించి తనకొడుకు తనప్రమేయము లేకుండా చావకుండునట్లు వరము బొందినది. అంతియేగాక అధికాధిక బలముగల సుప్రతీకమను యేనుగు వాని యధీనము. అది శత్రుసైన్యమునకు కాలుని వంటిది.
 
నారద:- దేవా! అవతారము మారిన మాత్రమున యేమైనది. అతడు మీ కుమారుడే గదా! పుత్రవధకు మనస్సంగీకరించుట లేదు కదా ప్రభూ..
 
కృష్ణ:- నారదా పొరబడితివి, నేను బంధరహితుడను. జనులు వారి వారి ప్రయోజనములకై నాతో బంధుత్వ మిత్రత్వములు నెఱపుదురేకానీ, నేను మాత్రము సర్వజనసముడను. నన్ను కట్టివైచు బంధము లోకమున లేనేలేదు.
 
          ఆ:వె:     ఒంటివాడ జుట్ట మొకడు లేడు.
                 కర్మఫలములొసగి గాచువాడ
                    నరకు డిపుడు జనుల నానావిధంబుల
                 బాధ పెట్టె వాడు పతనమగును.
 
తప్పదు. నావారూ పెరవారను మాటే లేదు. దుష్టుడైన నరకునకు చావు తప్పదు.
 
నారద:- దేవా.. నేనే పొరబడితిని. క్షమింపుడు. కృష్ణా.. భూదేవి తనయుడైన నరకుని సంహారము, భూదేవి ప్రమేయములేకుండా జరుగుటకు వీలులేదు. అదియేకదా మీ ఆలోచనకు కారణము.
 
కృష్ణ:- అవును నారదా.. అదియే ఆలోచించుచుంటిమి.  ఆఁ ఉపాయము దొరికినది.
 
    తే:     సత్యభామ భూదేవి అంశమ్మె సుమ్ము
         తాను భూదేవియైయుంట తానెఱుగదు
         సత్యభామకు రణమన్న సంబరంబు
         కాన నయ్యింతి గొనిపోదు కదన భూమి.
 
నారద:- అర్థమైనది దేవా! అర్థమైనది. సత్యభామాదేవి చూస్తూ వూర
కుండునా? నరకడు మిమ్ము దండింపవచ్చిన వానిపై దాడిసలుపక మానదు.
కృష్ణ:- నరకుడు చావక మిగలడు. అంతియెగాక సత్యభామ తనతండ్రి సాత్రాజిత్తునకు యేకైక కుమార్తె యైనందున, ముచ్చటపడి రణవిద్యలన్నియు నేర్పినాడు.
నారద:- అవి యన్నియు యిప్పుడు మీకుపయోగ పడనున్నవి. దేవా మీఆలోచనకు తిరుగుండునా? ఇక విజృంభింపుడు.
 
కృష్ణ:- కం:  జొచ్చెద ప్రాగ్జో తి ష పుర
              మచ్చట నరకుని వధించి నౌరా యనగన్
              మ్రుచ్చిలి తెచ్చిన సంపద 
               నిచ్చెద నిదె గైకొనుమని ఇంద్రాదులకున్
 
సత్య:- (వచ్చి) నారదమునీంద్రులు విచ్చేసినారు. శుభం మునీంద్రా శ్రీకృష్ణసతి సత్యభామాదేవి ప్రణతులివే గైకొనుడు.
 
నారద:- విజయోస్తు! సాత్రాజితీదేవీ.. దిగ్విజయమస్తు!
 
సత్య:- స్వామీ .. తమరేమో యుద్ధమునకు సన్నద్ధు లైనట్లు గంభీరముగా గన్పట్టుచున్నారు.
 
కృష్ణ:- ఔనుదేవీ .. చక్కగా గ్రహించితివి. నరకుని ఆగడములకు అంతులేకుండా పోయినది. సజ్జనుల ఆర్తనాదములు మిన్ను ముట్టినవి. వానికిక అంత్యకాలము సమీపించినది. నేనిక వానిపై యుద్ధము ప్రకటించి హతమార్చెదగాక!
 
సత్య:- దానవోద్రేకస్థంభకులను పేరుగన్న తమరు నరకుని తప్పక కట్టడి చేయవలసినదే.
 
     శా:   దేవా! నీవు నిశాట సంఘముల నుద్దీపించి చెండాడ నీ
         ప్రావీణ్యంబులు సూడగోరుదు గదా ప్రాణేశా! మన్నించి న
         న్నీవెంటన్ గొనిపొమ్ము నేడు కరుణన్. నేజూచి యేతెంచి నీ
         దేవీ సంహతికెల్ల జెప్పుదు భవద్దీప్త ప్రతాపోన్నతుల్.
 
కృష్ణ:- (సత్యభామకు వినపడకుండా మెల్లగా) నారదా! సత్య సమయోచితముగనే స్పందించుచున్నది. అయిననూ వారించినట్లు నటించవలెనుగదా? మీరు గమనించుచుందురుగాక. (ప్రకాశముగా) దేవీ నీవు రణమునకేతెంతువా? ఆ నరకునితో యుద్ధము సామాన్యముగాదు.
 
సీ:  సమదపుస్పంధయ ఝంకారములు గావు
         బీషణ కుంభీంద్ర బృంహితములు
      వాయునిర్గత పద్మ వణరేణువులుగావు
         తురగరింఖా ముఖోద్ధూత రజము
      లాకీర్ణ జలతరంగా సారములుగావు
         శత్రుధనుర్ముక్త సాయకములు
       గలహంస సారస కాసారములుగావు
         దనుజేంద్ర సైన్య కదంబకములు
 
 
      తే:    కమల కల్హార కుసుమ సంఘములుగావు
         చటుల రిపుశూల ఖడ్గాది సాధనములు
         కన్య నీవేడ? రణరంగ గమనమేడ
         వత్తు వేగమ నిలువుము వలదు వలదు. 
 
సత్య:- స్వామీ .. తమరు నాప్రక్కనుండ నాకేమి భయము.
 
ఉ:  దానవులైననేమి? మరి దైత్య సమూహములైననేమి? నీ  
     మానిత బాహుదుర్గముల మాటున నుండగ నేమిశంక? నీ
     తో నరుదెంతు నేను కరతోయజముల్ ముకుళించిమొక్కెదన్
     మానుము వల్దటంచనక మమ్ము రణంబున నిల్పిచూడుమా!
 
నాయుద్ధ కౌశలము నొకసారి మీకు చూపించవలెనని ముచ్చటపడుచున్నదానను. కాదనకండి ప్రభూ..
 
నారద:- శ్రీకృష్ణా! సత్యభామదేవి కోరిక మన్నించదగ్గదే. ఆమె అసమాన వీరనారీమణి. తండ్రి శిక్షణలో అస్త్రప్రయోగములలో ఆరితేరిన శక్తిస్వరూపిణి. మీవెంటనుండుట మంచిదేకదా!
 
కృష్ణ:- నారదమునీంద్రా.. మీమాట కాదనదగునా? సరి సత్యభామ నావెంటనుండి నరకసంహారమున నాకు తోడైయుండుటకు సమ్మతించుచున్నాను.
 
 
నారద:- శ్రీకృష్ణా తమరిక దుష్టశిక్షణ కుపక్రమింపుడు. మాకు సెలవొసంగుడు.
 
సత్య:- మునీంద్రా మా అంతఃపురము ప్రవేశించి స్వామివారితో ఫలహారములు భుజించి వెళ్ళవచ్చునుగదా..పదండి స్వామీ..
 
నారద:- (తనలో) మాకు ఫలహారములు ఇక్కడే కావలసినన్ని లభించినవి. (ప్రకాశముగా) లేదుతల్లీ మాకడుపు నిండుగానున్నది. మీరువెళ్ళిరండు.
 
సత్యకృష్ణులు:- ఆట్లైన, మునీంద్ర యికమేము వెళ్ళివత్తుము.  సెలవు. (వెళ్ళుదురు)
 
నారద:- నారాయణ... నారాయణ.  జలరుహనేత్రా - జగదాధీశా
                                               నారాయణహరి - నమోనమో
                                                  నారాయణహరి – నమోనమో
 
రెండవ రంగము
 
(నరకాసురుడు ఆసవము సేవిస్తూ ఆశీనుడైయుండును యెదురుగా ఒకపాటపై నా ట్యకత్తె  నాట్య మాడుచుండును)
  పాట
సరిరారు నీకెవ్వరూ - ఓ నరకభూపతీ
సరిరారునీకెవ్వరూ..
 
మీసమ్ము మెలివేసి - నిలిచి చూచిన యంత
గుండెలదరగపారి - పోయేరు నీ రిపులు
కన్నులెర్రగజేసి - ఖడ్గమ్ము ఝుళిపింప
ఇంద్రుడైనను జడిసి - దాసోహమనియేను--// సరిరారు//
 
కన్నుగీటినచాలు - కమలాక్షులా యెడద
రతినాథుతూపుల - కెరగాక మానరు
సరస శృంగారముల - సౌందర్యగరిమల
తారా ప్రియుడైన నీ - సమ ఉజ్జి కాలేడు....     // సరిరారు//
 
శూరత్వమున నీవె - శృంగరమున నీవె
ఖరఖడ్గమునుద్రిప్ప - సుమశరము సంధింప
సమమైన నీ ప్రతిభ - స్తుతి పాత్రమౌ గాదె
రారా తడయగనేల - రమ్మందిరా జాణ....  // సరిరారు//
 
మురాసురుడు:- (ప్రవేశించి) వీరాధివీరా! రణరంగధీర! నరకాసుర ప్రభూ! జయము జయము.
 
నరకుడు:- తమ్ముడా మురాసురా! యేమినీ రాకకు కారణము. ప్రాగ్జోతిషపురవాసులందరూ క్షేమమేకదా?
 
మురాసుర:- పరిపాలనాదక్షులూ, పరాక్రమోపేతులైన మీ రాజ్యమున కేమి ప్రభూ.. మూడుపువ్వులూ ఆరుకాయలూనై అభివృద్ధిపథమున సాగుచున్నది... కానీ..
నరకుడు:- ఆఁ.. ఆ కానీ యేమి మురాసురా?
 
మురాసురుడు:- ప్రభూ.. మీ ప్రాభవమునకోర్వలేక, ఆ ద్వారకాధీశుడు కృష్ణుడు మిమ్మెదిరించుటకు సాహసించుచున్నాడు. దండయాత్రకు కుట్రపన్నుచున్నాడని మన రహస్య చారులవల్ల తెలిసినది. మనము యుద్ధమునకు సన్నద్ధులమై యుండవలయును ప్రభూ..
 
నరకుడు:- ఆఁ.. కృష్ణుడా.. కృష్ణుడు నన్నెదిరించ సాహసించెనా? వాడెంతా వాని బలమెంత. అగ్నిలోనికి దుమికిన శలభమై మాడి మసైపోగలడు.
 
ఉ:  వీరుడ విక్రమార్కుడ. వివేకము గోల్పడి నన్నెదుర్కొనన్
     సారవిహీను డంగనల సన్నుతు డంబపు మాటకారి కౌ
     నే? రణమందు చచ్చుటకే వడి కృష్ణుడు వచ్చు. రానిమ్ము
     నేరడు వాడు. నే యముడ  నిక్కము వానికి వాని సేనకున్. 
 
మురాసుర:- అన్నా.. నరకాసురా! వాడు నిన్నెదుర్కొనునంత వరకూ నిలచునా? నాచే సురక్షితముగనున్న శస్త్రాగ్ని జలవాయు దుర్గముల
దాటి నన్ను జయించినగదా వాడు నిన్నెదుర్కొనుట. అది కలలోనిమాట.
 
కం:   చచ్చున్ నాచే కృష్ణుడు
        వచ్చిన ప్రాగ్జోతిషపుర వాకిట కడనే
         వచ్చిన భయమేమి గలదు
         రచ్చకు రానిమ్ము వాని రయమున ద్రుంతున్.
 
నరకుడు:- మంచిది. యికవాని రాకకై యెదురుచూడుము. వచ్చిన మరుక్షణమే మట్టుబెట్టి మాకు శుభవార్త వినిపింపుము.
 
మురాసుర:- శుభం. మీరన్నట్లే జరుగును. జై నరకభూపతికి, ఇకనాకు సెలవు ప్రభూ.  (వెళ్ళును)
 
మూడవ రంగము
 
(అంతఃపురము, కృష్ణుడు సత్యభామ ఆశీనులై యుందురు)
 
కృష్ణుడు:- మేము సత్వరమే ప్రాగ్జోతిషముపై దండెత్తవలసియున్నది. మా పరమ భక్తాగ్రేసరుడు వాహనరాజమూనైన గరుత్మంతుని వెంటనే కలిసికొమ్మని వర్తమానము పంపితిమి. ఇంకనూ రాడేమి?... ఎవరక్కడ ..
 
గరుత్మంతుడు:-(వచ్చి) వచ్చితిని, వచ్చితిని దేవా.. శ్రీకృష్ణపరంధామా.. మీ భక్తపరమాణువైన యీ గరుడుని ప్రణామములు స్వీకరింపుము. మీ ఆజ్ఞానుసారము సర్వసన్నద్ధుడనై మీ మ్రోల వ్రాలితిని. మీరు సతీసమేతులై నన్నధిరోహింపుడు. రణభూమి ప్రవేశమిప్పుడేచేతము.
 
కృష్ణ:- గరుత్మంతా..మనము యుద్ధము చేయబోవుచున్నది అరివీర భయంకరుడగు నరకాసురునితో  అతడు సుప్రతీక వేదండమునెక్కి మనల నెదిరింపగలడు. కడుజాగరూకులమై మెలగవలసి యుండును.
 
గరుడుడు:- గ్రహించితిని ప్రభూ! అంతియేకాదు వాని బలమూ బలగమూ కూడా గణించియేవచ్చితిని. శస్త్ర వాయుజలాగ్ని దుర్గములచే పరివేష్టింపబడియున్న ప్రాగ్జోతిషపురము నరకుని సోదరసముడగు మురాసురుని రక్షణలో నున్నది. అది యితరుల కభేద్యమే. కానీ మనకు కాదు ప్రభూ! మీరు నా వీపుపై ని ర్భీతిగా ఆసీనులై  వరము ప్రారంభించవచ్చును.
 
కృష్ణ:- మంచిది వైనతేయా! నీ వంటి ధీరుడు నాకు వాహనమై అండగ
నుండగా యిక అసాధ్యమేమున్నది. అయినను మనము శత్రువు బలమును తక్కువచేసి చూడరాదు.
 
కం:        మురుడైదుశిరంబులు గలిగి
         వరుసన్ కబళింపగలడు వసుధన్ వార్థిన్
         తరిగెద వాని శిరంబులు
         ధరపుత్రుడదిగని బెదరి దద్దరిలవలెన్
 
ఆవిధంగా నరకుని తొలుత మనసికంగా బలహీనుని జేయవలె.
 
గరుడుడు:- లెస్సబలికితిరి ప్రభూ! యిక నా ప్రతాపమూ తిలకింతురుగాక.
 
కం:        ముక్కున చీల్చెద వైరుల
         రక్కెద నా వాడి      గో  ళ్ళ రక్తము జిమ్మన్
         రక్కసుల నిలువనియ్యక
         చక్కగ జూడన్ బనిచెద సమవర్తిపురిన్
దేవా! గదా ఖడ్గ చక్ర బాణ బాణాసనములన్నింటిని నా వీపున మీకందుబాటులో నుండ ధరించెదను. దేవీసహితులై నన్నధిరోహింపరండు. దండయత్రకిదే శుభముహూర్తము.
 
కృష్ణ:- సత్యా! రణము తిలకింతునంటివిగదా! పద యికమేము దుష్టశిక్షణ కుద్యుక్తులము కావలసిన సమయమాసన్నమైనది.
 
సత్య:- స్వామీ.. నేనూ సన్నద్ధముగనేయున్నాను... కానీ నాథా నాకొక్క అవకాశము నిండు ఆ నరకుని నేనెదుర్కొనియెద.
 
కృష్ణ:- సత్యా! రణముసేయ నీకంత ఉత్సాహముగ నుండిన తప్పకనీకా అవకాశము నొసంగుదుము. యిదిగో గైకొనుము, యీవిల్లు సురనికరోల్లాసము. శూరకఠోరాసుర సైన్యత్రాసనము. బలగర్వనిరాసనము. సమయమాసన్న మైనపుదు విజృంభింతువుగాని లెమ్ము.  పద.
 
గరుడుడు:-శ్రీకృష్ణ పరమాత్మకూ జై.   (తెరపడును)
 
నాల్గవవ రంగము
 
(నరకాసురుడాసీనుడై యుండును నాగకన్య నాగస్వరముపై నాట్యము చేయుచుండును)
 
గరుత్మంతుడు:- (వచ్చి) ఓరీ నరకాధమా!
 
నరకుడు:- (ఆశ్చర్యపడి) ఆఁ.. యెవడవురానీవు. నా అనుమతి లేనిదే అంతఃపురమున కెట్లు ప్రవేశించితివి .. ఎవరక్కడ.
 
గరుడుడు:- నేను గరుత్మంతుడను. శ్రీకృష్ణదాసుడను. అరవకు. నీ వరచి గీపెట్టినా యెవ్వరూరారు. నీ భటులందరూ నారెక్కల గాడ్పులకు దిక్కులకు కొట్టుకొని పోయినారు.
 
నరకుడు:- ఆ పశువులకాపరి పెంచుకొంటున్న గ్రద్దవు నీవేనా?
 
గరుడుడు:- ఔను శ్రీకృష్ణపరమాత్మ వాహనాన్ని నేనే. గజకచ్ఛపుల
నాహారించి మహాబలసంపన్నుడనై ఇంద్రునెదిరించి గెల్చిన
వైనతేయుడను నేను.
 
నరక:- సరిసరి.. ఐన నీ వచ్చిన కారణమేమి?
 
గరుడ:- నరకా నీకింకనూతెలియదా! నీ కోట రక్షకుడైన మురాసురుడు చచ్చినాడు.
 
నరక:- ఆఁ..
 
గరుడ:- ఔను.. శ్రీకృష్ణచక్ర రక్తపిపాసకు వాడు బలైపోయినాడు. నీ దుర్గములన్నియూ ఆ దేవదేవుని మహాస్త్రాగ్నులలో భస్మపటలమై పోయినవి. యిప్పుడు నీకు దిక్కెవరూలేరు.
నరకుడు:- ఏమిటీ మురాసురుడు మరణించెనా? నా దుర్గములు దగ్దమైనవా?
 
గరుడ:- ఔను.. ఇక నీకొక్కటే మార్గము. శ్రీకృష్ణుని శరణుజొచ్చి అదితి కుండలములు వరుణఛత్రము అప్పజెప్పుము. చెరబట్టిన కన్యలను విడిచిపెట్టుము. లేదా చచ్చెదవు.
 
నరక:- బెదిరించుచున్నావా? ఓరీ పక్షీ, పులుగు కిచకిచలకు భయపడునంతటి బలహీనుడు కాడీ నరకాసురుడు. వెళ్ళు. సుప్రతీకారూఢుడనై యిదే రణప్రవేశము గావించుచున్నాడ. నీ పశుకాపరిని బెదరక  వరమున నిలువుమనుము. చూతముగాక! ఊ యిక వెళ్ళుము. 
గరుడ:- సరి.. నీకిచ్చిన మంచిఅవకాశమును జారవిడుచుకొంటివి. నీ మరణ శాసనము నీవే లిఖించుకొంటివి. నీకు పోగాలము దాపురించినది. సరి.. ఇక రణరంగమున కలిసికొందము. వచ్చెద (వెళ్ళును)
 
నరక:- కం:         ఔరా కృష్ణా పిలుతువె
                      రారమ్మని నన్ను యుద్ధరంగమ్మునకున్
                  తీరెనురా! నీకాయువు
                  పోరగ నిలుతువె? సముడవె పోరుల నాకున్.
 
నేటితో నీయాట కట్టు.  ఎవరక్కడ  నావేదండమునలంకరించి సిద్ధముగనుంచుడు. నేనిదే రణరంగప్రవేశముజేయువాడ.  (తెరపడును)
ఐదవరంగము
 
(ఆకాశవీధి నారదుడు - పాట)
 
నారద:- నారాయణ... నారాయణ.  జలరుహనేత్రా - జగదాధీశా
                                               నారాయణహరి - నమోనమో
                                                 నారాయణహరి - నమోనమో
 
ఆహా యేమినా అదృష్టము మహత్తర ఘట్టమును యీ మేఘమధ్యము నుండి కనుగొనుచుంటిని. యుద్ధము భీకరమగు చున్నది. ఆహహా.. సత్యాదేవి వేణిని జొల్లెమువెట్టి పాణిన్ పయ్యెద చక్కగాదురిమి ధీరయై గంభీరయై రణమున నిల్చి పోరు సల్పుచున్న తీరు మహాద్భుతము.
 
శా:- జ్యావల్లీ ధ్వని గర్జనంబుగ  సురల్ సారంగయూధంబుగా
       నావిలింద్రశారాసనంబుగ సరోజాక్షుండు మేఘంబుగా
       దావిద్యుల్లతభంగి నింతి సురజిద్దావాగ్ని మగ్నంబుగా
       బావృట్కాలము సేసె బాణచయ మంభశ్శీకరశ్రేణిగాన్.
 
ఆహా..
          సీ: రాకేందుబింబమై రవిబింబమైయొప్పు
                  నీరజాతేక్షణ నెమ్మొగంబు
              కందర్పకేతువై ఘనధూమకేతువై
                 యరుల బూబోడి చేలాంచలంబు
 
              భావజు పరిధియై ప్రళయార్కు పగిదియై
                 మెఱయు నాకృష్టమై మెలతచాప
              మమృత ప్రవాహమై యనల సందోహమై
                  తనరారు నింతి సందర్శనమ్ము
 
ఆ:వె:      హర్షదాయియై మహారోషదాయియై
         పరగముద్దరాలి బాణవృష్టి
         హరికి నరికి జూడ నందంద శృంగార
         వీరరసము లోలి విస్తరిల్ల.
 
అరెరే..కారణమేమైయుండునో.. యుద్ధమాగినది. నరకాసురుడు గజమును, సత్యాకృష్ణులు గరుత్మంతుని దిగి యెదురెదురై వచ్చుచున్నారు. అదిగో ఆవైపు నుండి గమనించెదగాక. (రంగస్థలము వీడును - తెరలేచి యుద్దరంగము కనబడును సత్యాకృష్ణులు నరకాసురుడూ యెదురెదురుగా నుందురు)
 
నరకుడు:- చాలునీ అంగనాలోలత్వము. ఆలి అండలేనిదే ఆలము సేయలేవా? నిద్ర మత్తులోనున్న మా మురాసురుని జంపితినని విర్రవీగకు. మూతిన మీసమే మొలవని పేడివీవు. సిగ్గమాలి నారీకవచుడవై వచ్చి నన్నుదండిప దలచుట నీవెర్రితనము. ఇప్పటికైననూ మించిపోయినదిలేదు. వెనుదిరిగి పొమ్ము. ప్రాణముల రక్షించుకొనుము.
 
సత్య:- నరకాధమా! నీ దుండగములు మితిమీరిపోయినవి. ఇంతవరకు నిన్ను క్షమించినది, నిన్నునీవు సరిదిద్దుకొనుటకు అవకాశమిచ్చుటకేగానీ, నీకు భయపడిగాదు. నీకిచ్చిన అవకాశములనన్నిటినీ దుర్వినియోగము చేసుకొంటివి. ఇకనీకు మరణముతథ్యము.
 
నరకుడు:- ఆడువారితో నాకు మాటలేల, కృష్ణా.. నీసతిని ప్రక్కనుంచి, మగవానివలె నీ గ్రద్ధనెక్కి నాతో రణము సేయుము.
 
కం:        మగువ మగవారిముందర
         మగతనములుసూప రణము మానుట నీకున్
         మగతనము గాదు దనుజులు
         మగువలదెస జనరు మగలమగలగుట హరీ..
 
కనుకనే చెప్పుచుంటిని. సత్యభామదేవీ! నీతో మాటలేల? అయిననూ నీమేలుగోరి కడసారిగాజెప్పుచుంటిని, నీవేల రణభూమికి వచ్చితివి? అయిననూ నీకువచ్చిన భయములేదు. తక్షణమే బయలుదేరి ద్వారకకు మరలివెళ్ళుము. స్త్రీహత్యకీభూపుత్రుడెన్నటికినీ పాల్పడడు. మీహితముగోరి మిమ్ము హెచ్చరించుటకే యుద్ధమునాపి మీ యొద్దకేతెంచితిని. ఊఁ రణభూమి వీడి వెళ్ళిపొమ్ము.
 
సత్య:- నరకాసురా! నీ బెదరింపులకు జంకి పురికి తిరిగిపోదుననుకొంటివా? అది యెన్నటికినీ జరుగదు. నీచావు తర్వాతనే మాతిరుగు ప్రయాణము. వెళ్ళుము. వెళ్ళి వీరునివలె యుద్ధము సేయుము. చావునీకెలాగూ తప్పదు. కనీసము యోధుడవన్న కీర్తినైనా దక్కించుకో  ఊఁ వెళ్ళుము.
 
కృష్ణ:- అర్థమైనదికదా!
 
          కం:       నరకా ఖండించెద మ
                 త్కరకాండాసన విముక్త ఘనశరముల భీ
                 కరకాయు నిన్ను సురకి
                 న్నరకాంతలు సూచి నేడు నందంబొందన్
 
వెళ్ళుము వెళ్ళియుద్ధసన్నద్ధుడవుకమ్ము.
 
నరకుడు:- కృష్ణా .. నీవునన్ను యుద్ధమునకు పురికొల్పుదువా? సతిసహాయముతో రణమునకేతెంచి నపుడే నీ పస బయటపడినది. నీవు కపటివి, మోసకాడివి, భూటకపుమనిషివి, నీమాటలూ చేతలూ అన్నియూకల్లలు.
 
 
తే:        బురద పామున కుండదు భూరి పడగ
         నాట్యము పడగపైనన్న నమ్మ వశమె
         కొండ కదలించి పైకెత్త గుంత పడదె
         నీరు గుంతలో చేరదే నిలిచితెచట.
 
ఊరంతావర్షపునీరు. కొండక్రిందిగుంతలోనూ నీరే మరినీవు కొండను గొడుగుజేసి గోగోపాలకుల రక్షించుట కల్లగాదా? నీ మనుషుల కల్లప్రచారముతప్ప నీవు చెప్పుకొనుచున్న మహిమలన్నియూ భూటకములు. ముసలెద్దును, కొంగనూ జంపి పెద్దవీరుడవని జెప్పుకొను చున్నావు. యిది మిగుల సిగ్గుపడవలసిన విషయము. సరిసరి యికమీరు మంచిమాటలతో వినువారు కాదు. వెళ్ళూ కృష్ణా.. సత్వరమే పక్షివాహనుడవుకమ్ము. నేనునా వేదండమునెక్కి తలపడెదను. నేనో నీవో యీనాడు తేలిపోగలదు.
 
కృష్ణ:- నరకా! నాలీలలు నీవంటి మూర్ఖులకు అర్థముగావు. నీకు వివరించ వలసిన అవసరమూనాకులేదు. నాబాణప్రయోగమే, నేనెవరో నా బలపరాక్రమమెట్టిదో తెలియజెప్పగలదు. ఇక మాటలతో పనియేల? యుద్ధమునకు సిద్ధముకమ్ము. (అటు నరకుడు యిటు సత్యాకృష్ణులు బయటికి వెళ్ళుదురు - తిరిగీ ఆకాశము కర్టన్ దిగును)
 
నారదుడు:- (మధ్యకువచ్చి) ఆఁ..  ఔరా! చూచుచుండగనే యుద్ధము భయానకముగామారిపోయినది. నరకుడు కోపోద్రిక్తుడై బాణవర్షము గురిపించుచున్నాడు. అదిగో నరకుడు గదాదండము చేబూనినాడు.  ఆ..ఆ..ఆ.. గద సత్యాదేవిని తప్పించుకొని కృష్ణుని మస్తకమునకు తగిలినది. ఔరా యదువీరుడు గరుడునిపైనే మూర్చిల్లినాడు. సత్యభామ ధీరయై విల్లెక్కుపెట్టి నిలచినది. లేదులేదు కృష్ణునకు యేయపాయమూ సంభవింపలేదు. అది తాత్కాలిక స్వల్పకాల మూర్చయే. అదిగో సత్యభామను ప్రక్కకు తొలగుమని కృష్ణుడు విజృంభించినాడు. వైష్ణవాస్త్రము సంధించి వదలినాడు. ఆ.. ఆ.. ఆ అస్త్రముధాటికి  అమ్మా.. యని యరచి నరకుడు గజముపైనుండి నేలపైబడినాడు. సత్యాకృష్ణులు గరుడవాహనము దిగి నరకుని సమీపించుచున్నారు. గరుడుడు సుప్రతీకగజమును తన ముక్కుతో గోళ్ళతో రక్కి  చీకాకుపరచి తరుము చున్నాడు. గరుడుని రెక్కల గాలికి సైన్యము చెల్లచెదరై పారిపోవుచున్నది. నేనిప్పుడు వెంటనే భూమికి దిగవలసియున్నది. నారాయణ.. నారాయణ..(ఆకాశము కర్టన్ తొలగి యుద్ధము సీనూ, అక్కడ నరకుడు బాణము యెదపై గ్రుచ్చుకొని  నేలపై ప్రాకుతూ కొంచము జరుగును యింతలో సత్యాకృష్ణులు అక్కడికి వత్తురు.)
 
నరకుడు:- ఆఁ .. తల్లీభూమాతా! నీకుమారున కీనాటికి అయువు తీరినదాతల్లీ ... సత్యభామాదేవి నాతల్లి గానోపు, లేకున్న నన్ను మృత్యువు వరింపదుగదా! అమ్మా.. సత్యభామాదేవి .. కాదు కాదు భూమాతా! ఇకనాకుసెలవు. నాతప్పిదములతో నీపై భారము పెంచి నీకు కష్టమువాటిల్లజేసితిని. మూఢాత్ముడనై మెలగితిని. నాకు శ్రీహరిచే మరణము కలుగుచున్నందుకు సంతసించుచున్నాను. తల్లీ ఆనందపడుచున్నాను. మాతా.. అందుకొనుము యిదేనా తుది వందనము. (క్రిందపడి ప్రాణము వదలును)
 
నారద:- నారాయణ.. నారాయణ...
 
సత్య:- నారదా.. తమరు.. యీ రణభూమిన. ..
 
నారద:- అవును తల్లీ తారసపడవలసిన అవసరమయ్యే వచ్చితిని. తల్లీ నీవు నరకాసురుని వాక్కు ప్రకారము భూదేవివి. నీ ప్రమేయముననే లోకకంటకుడైన నీ కొడుకు నరకుడు పరలోకగతుడైనాడు. ఇదంతయూ జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణదేవుని లీలానాటకము. ఇందు మనమందరమూ కేవలము పాత్రధారులము.
 
సత్య:- నాథా! ఏమిటీవింత. నేను .. నేను భూదేవినా? నావలన నరకుడు మరణించెనా?
 
కృష్ణ:- అవును సత్యా.. నరకుడు తనతల్లీ భూదేవి ప్రమేయము లేనిదే చావడు. అది తొల్లినేను వరాహావతారుడనై యున్న సమయమున భూదేవి వడసిన వరము. అందులకే నిన్నీ రణమున ప్రోత్సహించితిని. నరకుడు మన పుత్రుడు. కానీ లోకకంటకుడు. సంహరించక తప్పినదికాదు.
 
సత్య:- ఔరా.. కుమారా యెంతపని జరిగినది.
 
నారద:- తల్లీ మీరు కారణజన్ములు. సామాన్యులవలె కంటతడిపెట్టరాదు. ఇందులో మీతప్పేమియూలేదు. నరకుడు దూర్తుడు. అతని దూర్తత్వమే అతని మరణహేతువైనది. వాస్తవము మీకు తెలియనిది కాదు.
 ఊరడిల్లండి.  ఇక జరుగవలసిన దానిని గూర్చి ఆలోచించండి. నరకాసుర కుమారుడు భగదత్తుడు తమ్ముడైన దండనాథునితోకలసి
భయభ్రాంత చిత్తుడై దేవమాత అదితి కుండలములూ, వరుణఛత్రమూ
మీకంద జేయుటకు సిద్ధముగనున్నాడు. మీయెదుటపడ శంకించు
చున్నాడు.  కృష్ణా!
 
చం:      దయనిడి సూడుమా నరకదైత్యుని బిడ్డడు వాడు నీ దెసన్
         భయమున నున్నవాడు. గడు బాలుడనన్య శరణ్యుడార్తు డా
         శ్రయరహితుండు దండ్రిక్రియ శౌర్యము నేరడు. నీ పదాంబుజ
         ద్వయి మదినెంచు భక్త పరతంత్ర సువీక్షణ దీనరక్షకా!
 
అతడు మీదుమిక్కిలి మీమనుమడు వానిని రక్షింపుము.
 
కృష్ణ:- నారదా.. నాకు రాజ్యకాంక్ష యిసుమంతైననూలేదు. నరకుని రాజ్యము తప్పక భగదత్తుని కిత్తము. ఇప్పుడే అతని కభమిచ్చి పట్టభిషిక్తుని జేసి ద్వారకకు బయలుదేరెదము. దేవతలసొమ్ము వీలైనంత తొందరలో వారి కప్పగింతుము.
 
సత్య:- ఇప్పుడు మనస్సు కొకింత ఊరట లభించినది. మనుమలను కనులార జూచుకొని మనసారా దీవించి భగదత్తుని పట్టభిషిక్తుని జేసి సంతోషింతుము.  నా యనా గరుత్మంతా.. వెళ్ళు.. వెళ్ళి తగిన యేర్పాట్లు సత్వరమే గావించుము. భగదత్తుని అంతఃపురముననే నిలువుమనుము. మేమే బయలుదేరి దీవించుటకు వచ్చుచున్నామని తెలుపుము.
 
గరుడుడు:- చిత్తముతల్లీ.. అట్లే గావింతును. (వెళ్ళును)
 
నారద:- కృష్ణా! నరకుడు చేపట్టిన పదహారువేలమంది కన్యలకూ విడుదలైతేగలిగినది. కానీ వారి భవిష్యత్తు...
 
కృష్ణ :- నారదా! వారందరూ కారాగారమున నిత్యమూ నన్నే స్మరించి నా భక్తులైనారు. వారిని లోకము చిన్నచూపు చూడనిత్తునా? లేదు. వారినందరినీ నా పత్నులుగా స్వీక రించనున్నాను. వారికి నా భార్యలుగా లోకమున గుర్తింపు నియ్యనున్నాను. వారు సగౌరవముగా జీవింపగలరు. మాది విడదీయరాని అలౌకిక భక్తిబంధము. అది శారీరక సంబంధమున కతీతము.
 
నారద:- సంతోషము.  దేవా! నరకాసురవధ, తమరి విజయవార్త ఆకాశవాణి ద్వారా సర్వలోకములకూ చేరిపోయినది. లోకములన్నియూ పండువ చేసుకొంటున్నవి. నేడు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. ఇది నరకచతుర్దశిగా స్థిరపడగలదు. రేపే అమావాస్య. చెడుపై మంచి విజయము సాధించిన దినము. కనుక జనులు చీకటి పొడసూపకుండా దీపముల వరుసలతో తమయిళ్ళను అలంకరించి ఉత్సవము జరుపుకోనున్నారు. నేటినుండి యీ అమావాస్య దినమును "దీపావళి" పర్వదినంగా జరుపుకొంటారు -     శుభమ్.
 
                శ్లో :   కృష్ణాయ వాసుదేవాయ
                    దేవకీ నందనాయచ
                    నందగోప కుమారాయ
                    గోవిందాయ నమోనమః.
* 
నాటికను 30-10-2016 ఆదివారం, దీపావళి రోజున, కడప ఆకాశవాణి కేంద్రం సాయంత్రం 6-00 గంటలకు ప్రసారం చేసినది.
 

No comments:

Post a Comment

నాకు చదువురాదు, Naaku Chaduvu Raadu

  నాకు   చదువు   రాదు ( ఏకపాత్రభినయము )     (పాత్ర: ఓ 50 సంవత్సరాల  పేద పెద్దమనిషి ) అమ్మా!  శారదా ... ( బోరున   యేడ్చును ).  తల్లీ   యీ   గ...