Tuesday, 1 December 2020

వేమన (ఏకపాత్రాభినయం)

 

వేమన (ఏకపాత్రాభినయం)

మరియు

పద్య, గద్య, గేయ కవితలు






రచన

పి.సుబ్బరాయుడు.

42/490 భాగ్యనగర్ కాలనీ

కడప 516002

సెల్-9966504951

 

వేమన

(ఏకపాత్రాభినయం)

ఏమంటిరీ... నేనెవరో తెలుపమంటిరా? "నేను". ఈ అనిత్యమైన దేహమే నేననుకొనుట వెర్రిగా కింకేమి? లోననున్న వాని యెఱుకలేక జనులు జడులై చరిస్తున్నారు. లోనివాని యెరుక గల్గినంతనే, వాడూ వీడూ ఒకటై పోతారు. ఒకటై యున్నావాడు, రూపనామక్రియల కతీతుడు. కనుక నేనెవడనో యేమని చెప్పుదును. ఏమంటిరి? లోకవ్యవహారార్థ మైయున్న చిరునామాయైనా తెలుపమందురా? సరి సరి, భవబంధములన్నీ తెగిపోయినవాణ్ని, నావాళ్ళు నాదీ యన్నదేదీ లేనివాణ్ని. ఇప్పుడీ వూరనున్నాను. ఇదేనావూరు. రేపుమరోవూరు. లోకము నన్ను "వేమన" యని పిలుస్తున్నది. గతమున హేమమునకై తపించి సాధించితి నని కాబోలు  నన్నా నామమున పిలుచు చున్నారు. ఇప్పుడా పసిడియూ నా కవసరము లేనిదైనది. అదంతయూ గతించిన విషయము. ఏమంటిరి? వనితావ్యామోహుడనైన నేను వలువనుగూడా విడిచితినే మందురా? నిజమే నేను పడతి పయ్యెదకు జిక్కితి ననుట ముమ్మాటికీ నిజమే. అన్నలారా! అది ఒకనాటిమాట. నేడు నాకున్న ఈ గోచి కూడా యీ వూరివారుపెట్టినదే. వారి ఇబ్బందిని గుర్తించి వుంచుకున్నాను. రేపు వూరుమారితే యిదీ పోతుంది. అన్నీవదులుకొని ఊరకున్నవాణ్ని. నన్నేల మరలా కదిలించెదరు?  ఆహా.. మీకోసము లౌక్యలోకమునకు దిగి వచ్చి నా అనుభవముల తెలుపమందురా? వాటివలన లోకమునకు ప్రయోజన మున్నాదా? సరిసరి, ఉన్ననూ లేకున్ననూ  మీమాట కాదననేల?  చెప్పెద.

          ఆ:వె.    సతులమాయజూచి సౌఖ్యంబు గలదని

                    మతివిహీనులైరి మనుజులెల్ల

                    గతుల, సతులవలన గానంగరాదయా

                    విశ్వదాభిరామ వినుర వేమ.

 

నా జీవితానుభవమున తెలుసుకొన్న సత్యమిది. సతుల వ్యామోహము ఉత్తమగతులను, దూరం చేస్తుందనుట అక్షర సత్యం నాయనా...

          ఆ:వె.    సతులు సుతులు మాయ సంసారములు మాయ

                    సుఖమసుఖము మాయ సొమ్ము మాయ.

                    మాయబ్రతుకు కింత మాయ గల్పించరా

                    విశ్వదాభిరామ వినుర వేమ.

 

అందుకే ఆ మాయనుండి విడివడు మార్గము దెలిసి మేల్కొంటిని. ఇక వస్త్రము విడిచితి నెందుకందురా?

          ఆ:వె.    నీళ్ళువోసి కడిగి నిత్యమ్ము శోధించి

                    కూడుబెట్టి మీద కోకజుట్టి

                    యేమిపాట్లుబడుదురీ దేహమునకై

                    విశ్వదాభిరామ వినుర వేమ.

అయినా..

 

         ఆ:వె.   తల్లిగర్భమందు తాబుట్టి నప్పుడు

                 మొదట బట్టలేదు తుదను లేదు

                 నడుమ బట్టగట్ట నగుబాటు గాదొకో

                 విశ్వదాభిరామ వినుర వేమ.

 

నాయనలారా! కేవలమూ వేషధారణ తోనే ఒకవ్యక్తి గొప్పదనము బయటపడదుగదా!

          ఆ:వె.    బోడితలలు మరియు బూడిదపూతల

                    ఆసనముల మారుతాసనముల

                    యోగికాడు లోన బాగుగాకుండిన

                    విశ్వదాభిరామ వినుర వేమ.

అంతేగాదు..

          ఆ:వె.    కాయగూరలు తిని కాషాయవస్త్రముల్

                    బోడినెత్తిగలిగి పొరలుచుండ్రు

                    తలలుబోడులైన తలపులుబోడులా

                    విశ్వదాభిరామ వినుర వేమ.

 

కనుక అతిప్రథానమైనది చిత్తశుద్ధి...

 

          ఆ:వె.    చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు

                    కొంచమైన నదియు కొదువగాదు

                    విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత

                    విశ్వదాభిరామ వినుర వేమ.

 

చిత్తము నిల్పుట, ఆచిత్తాశ్రయమైన ఆత్మ శుద్ధమై యుండుట, అత్యావశ్యకము..

 

          ఆ:వె.    ఆత్మశుద్ధి లేని ఆచార మదియేల

                    భాండశుద్ధి లేని పాకమేల

                    చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా?

                    విశ్వదాభిరామ వినుర వేమ.

 

చిత్తశుద్ధి గలిగి ఆచేసేదేదో సక్రమంగా చేయవలె గానీ, అంతజేసితిని ఇంతజేసితిని అని గొప్పలు చెప్పుకోవడం సరికాదు నాయనా!

          ఆ:వె.    గంగిగోవుపాలు గరిటెడైననుచాలు

                    కడవడైననేమి ఖరముపాలు

                    భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు

                    విశ్వదాభిరామ వినుర వేమ.

 

మరొక్కమాట యేపూజలైనా, వ్రతములైనా, క్రతువులైనా, తపములైనా, ధ్యానములైనా దృఢనిశ్చయము గట్టిపట్టుదల, ధ్యేయవస్తువుపై చెదరని గురి, లేనిదే ఫలితముండదు నాయనా...

 

          ఆ:వె.    పట్టుబట్టరాదు పట్టి విడువరాదు

                    పట్టెనేని బిగియ పట్టవలయు

                    పట్టి విడచుకంటె పరగచచ్చుట మేలు

                    విశ్వదాభిరామ వినుర వేమ.

 

ఇది నాయనా విజయరహస్యము. కనుక గుర్తెరిగి మసలుకోండి. గట్టిపట్టుదల చిత్తశుద్ధి గలిగి తగు విచారణ చేసి తెలుసుకొనవలెగాని చిత్తభ్రమకులోనై ప్రాకులాదుటవల్ల ప్రయోజనమేమి? "అహంబ్రహ్మస్మి" యనిగదా పెద్దలమాట, మరి బయట దేనికై మన దేవులాట...

 

          ఆ:వె.   వెన్నచేతబట్టి వివరంబు దెలియక

                    ఘృతము గోరునట్టి యతని భంగి

                    తాను దైవమయ్యు దైవంబు దలచును

                    విశ్వదాభిరామ వినుర వేమ.

 

నిజానికి స్వానుభవం వల్ల గాక, కేవలం శాస్త్రపఠనంవల్ల ఫలితం శూన్యం

 

          ఆ:వె.   స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే

                    సంయమనము చెడును సాధకునకు

                    చిత్రదీపమునను చీకటి విడనట్లు

                    విశ్వదాభిరామ వినుర వేమ.

గోడపై దీపం బొమ్మ గీస్తే చీకటి పోతుందా. పోదుగదా! మరియొకమాట, మేము గొప్పకులస్తులం విద్యావంతులం అనుకొనేవారంతా భ్రమలోనే పడిపోయారు. వారు వారికి తెలియకుండానే, ధనవంతుల యెదుట ప్రతిభజూపుకొనే తాపత్రయంలో సాగిలబడి పతనమౌతున్నారు గదా! నాయనా...

          ఆ:వె.   కులముగలుగువారు గోత్రంబు గలవారు

                    విద్యచేత విర్రవీగువారు

                    పసిడిగల్గు వాని బానిసకొడుకులు

                    విశ్వదాభిరామ వినుర వేమ.

అందువల్ల, కావలసింది గుణముగాని ఉత్తుత్తిగొప్పలు చెప్పుకోవడానికి పనికివచ్చే కులము గాదు. అయినా, వల్మీకి యే కులంవాడు...

          ఆ:వె.   రామనామ పఠనచే మహి వాల్మీకి

                    పరగ బోయడయ్యు బాపడయ్యె

                    కులము ఘనముగాదు గుణమె ఘనంబురా

                    విశ్వదాభిరామ వినుర వేమ.

కనుక...

          ఆ:వె.   ఉర్వివారికెల్ల ఒక్క కంచముబెట్టి

                    పొత్తుగుడిపి కులము పొలయజేసి

                    తలను జేయిబెట్టి తగనమ్మ జెప్పరా

                    విశ్వదాభిరామ వినుర వేమ.

 

కులాలు కూలిపోయేరోజు రానేవస్తుంది. ధనానికున్న పలుకుబడి నశించేతీరుతుంది. సహృదయతకు విలువ పెరుగుతుంది. వాస్తవానికి సహృదయుడు నాటికీ, నేటికీ, యేనాటికీ పూజ్యుడే...

 

 

          ఆ:వె.   ఏమిగొనుచు వచ్చె యేమితా గొనిపోయె

                    పుట్టువేళ నరుడు గిట్టువేళ

                    ధనము లెచటికేగె తానేగె నెచటికి

                    విశ్వదాభిరామ వినుర వేమ.

 

ఔరా..

          ఆ:వె.   వెళ్ళివచ్చునాడు, మళ్ళిపోయెడునాడు

                    వెంటరాదు ధనము కొంచు బోడు

                    తానడేద బోనొ ధనమేడబోవునో

                    విశ్వదాభిరామ వినుర వేమ.

 

కనుక వస్తు, వాహన, ధనాకర్షణకు లోబడి కొట్టుకొనిబోవు నూరుమంది కంటే ఉత్తముడొక్కడు చాలు.

 

          ఆ:వె.   పంది పిల్లలీను పదియునైదింటిని

                    కుంజరమ్ము నీను కొదమ నొకటి

                    ఉత్తమపురుషుండు నొక్కడు చాలడా

                    విశ్వదాభిరామ వినుర వేమ.

 

అయినా యివ్వన్నీ తెలియని వడెవ్వడు? నా కసలే తెలియదన్నవాడు మోసకారి. అంతానాకు తెలుసన్నవాడు వట్టి మాటకారి. నిశ్శబ్డముగా కార్యనిర్వహణము చేయువాడే నేర్పరి.

 

          ఆ:వె.   నేరనన్నవాడు నెఱజాణ మహిలోన

                    నేర్తునన్నవాడు వార్తకాడు

                    ఊరకుండువాడు ఉత్తమయోగిరా

                    విశ్వదాభిరామ వినుర వేమ.

 

ఊరకుండటం అనుకున్నంత సులువు కాదు నాయనా. మాటలుడుగవచ్చు, కానీ మనసు మాత్రం నిలువదు నాయనా. అది పరిపరి విధముల పరిభ్రమిస్తూనేవుంటుంది. దానినాపడం సామాన్యం కాదు. మనస్సును లోనికి మరల్చి, చిత్తం అచ్యుతునిపై నిలిపి నిన్నూ నీచుట్టూవున్న ప్రపంచాన్ని మరచిపోవాలి. అదే నిజమైన విద్య. ఈ విద్య గురుసేవవల్లనే లభ్యమౌతుంది.

 

          ఆ:వె.   వెదుక వెదుక దొరుకు వేదాంతవేద్యుండు

                    వెదుకువాని దాను వెదుకు చుండు

                    వెదక నేర్చునట్టి వెరవరుల్ గలరొకో

                    విశ్వదాభిరామ వినుర వేమ.

 

నిజమైన శ్రద్ధవుంటే సద్గురువు లభించితీరుతాడు. దానికి అన్వేషణ తప్పదు. ఆ విధంగా అన్వేషించే వానికై గురువూ అన్వేషిస్తూవుంటాడు.

 

          ఆ:వె.   తేనెతెరల జాడ తేనెటీగ యెఱుంగు

                    సుమరసంబుజాడ భ్రమర మెరుగు

                    పరమయోగి జాడ భక్తుడెఱుంగును

                    విశ్వదాభిరామ వినుర వేమ.

 

తపనతో వెదుకువారే నేడు కరువైనారు. అయినా భక్తుడగు సత్యాన్వేషకునకు దొరకడన్న ప్రశ్నే ఉత్పన్నంకాదు. పూదేనె జాడ  తేనెటిగ కనుగొన్నట్లే, శిష్యుడు సద్గురుని కనుక్కొనితీరుతాడు. దీపం పెట్టగానే చీకటి తొలగిపోయినట్లు సంశయనివృత్తి, సాక్షాత్కారం గురుసేవలో వాటికై అవే లభిస్తాయి. అట్లుగాక ఇహలోక సౌఖ్యములకు వెంపర్లాడు వానికివి దొరకవుగాక దొరకవు.

 

          ఆ:వె.   అల్పసుఖములెల్ల నాశించి మనుజుడు

                    బహుళ దుఃఖములను బాధపడును

                    పరసుఖంబు నొంది బ్రతుకంగ నేరడు

                    విశ్వదాభిరామ వినుర వేమ.

 

కనుక,  ఇవన్నీ  మాటలతో జరిగే పనులు కావు, ఐనా నా చేత చాలమాట్లాడించినావు. సాధనముననేగానీ పనులు సమకూరవని గుర్తెరిగి, స్పందనైనా గలిగి, సాధనకుపక్రమిస్తావని నా ఆశ. మంచిది ఇక వెళ్ళివచ్చెద. సెలవు.

 

 

 

సమాప్తమ్

 

No comments:

Post a Comment

నాకు చదువురాదు, Naaku Chaduvu Raadu

  నాకు   చదువు   రాదు ( ఏకపాత్రభినయము )     (పాత్ర: ఓ 50 సంవత్సరాల  పేద పెద్దమనిషి ) అమ్మా!  శారదా ... ( బోరున   యేడ్చును ).  తల్లీ   యీ   గ...