చక్రవర్తి
(చారిత్రాత్మక పద్యనాటకం)
రచన
పి.సుబ్బరాయుడు.
·
ఇందలి పాత్రలు
1. సిద్ధార్థుడు - బుద్ధుడు -
కథానాయకుడు
2. శుద్దోధనుడు - బుద్ధునితండ్రి
3. చెన్నుడు - అంతఃపుర రాజాంతరంగికుడు
4. మహానామ 5. కొండన్న - శిష్యులు
6. కన్నడు - బాధితుడు బుద్ధునిచే ఆదరింపవడినవాడు
7.అంగుళీమాలుడు - గజదొంగ - సన్యాసి
8. బిందుసారుడు - మగధ దేశాధిపతి
9. కోసలరాజు
10. మహానందుడు - రైతు - శిష్యుడు
11. నర్తకి...
12. యశోధర ... కథానాయకి- బుద్ధుని భార్య.
2. శుద్దోధనుడు - బుద్ధునితండ్రి
3. చెన్నుడు - అంతఃపుర రాజాంతరంగికుడు
4. మహానామ 5. కొండన్న - శిష్యులు
6. కన్నడు - బాధితుడు బుద్ధునిచే ఆదరింపవడినవాడు
7.అంగుళీమాలుడు - గజదొంగ - సన్యాసి
8. బిందుసారుడు - మగధ దేశాధిపతి
9. కోసలరాజు
10. మహానందుడు - రైతు - శిష్యుడు
11. నర్తకి...
12. యశోధర ... కథానాయకి- బుద్ధుని భార్య.
చక్రవర్తి
(చారిత్రాత్మక
పద్యనాటకం)
మొదటి
రంగం
- - నాంది -
- (రంగ స్థలం చీకటిగా వుంటుంది. రాను రాను క్రమంగా వెలుగు పెరుగుతూ రంగస్థలమంతా వెలుగౌతుంది నేపథ్యంనుండి వ్యాఖ్యానం వినబడుతుంది)
- భారతావని ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు ఇందెందరో మహనీయు లుద్భవించిరి. నిజతత్త్వమును బొంది జీవితాంతము గాఢాంధకారమున దారితెన్నుతెలియక కొట్టుమిట్టాడు, జగతికి వారి దివ్యత్వాము ద్వారా దారి జూపిరి. అట్టి మహనీయు లకారణముగా జన్మింపరు. ప్రపంచమునకు వారి అవసర మేర్పడి ఆతృతతో వారిరాకకై ఎదురుచూచుచున్న సమయముననే వారావిర్భవింతురు. ప్రకృతిమాత నిండు చూలాలై మాయాదేవి రూపమున ప్రసవవేదన ననుభవించి సమస్త దుఃఖాపహర తేజస్వరూపునకు జన్మనిచ్చిచనినది. ఆ ఆధ్యాత్మిక భాస్కర బింబము తిమిర ము చీల్చుకొనివచ్చి ద్యుతుల వెదజల్లు కాల మాసమన్న మగుచున్నది....అందుకుతగు వస్తువులు సమకూర్చు కొనుచున్నది కపిల వస్తునగరము.
- (రంగ స్థలంపై పూర్తి వెలుగు నిండును)
- (అంతఃపురం. శుద్ధోదన మహారాజు ఆసనముపై కూర్చొని ఒక ప్రక్కకు వ్రాలి నిద్రపోవుచుండును)
- (వ్యాఖ్యానం కొనసాగుతుంది)
- అతడే కపిలవస్తు పురాధీశుడు శుద్ధోదన మహారాజు. తనముద్దుల
- కొడుకు సిద్ధార్థుడు సిద్ధాంతుల శాస్త్రనిర్ధారణాను సారం సన్యాసి యగునో చక్రవర్తి యగునో తెలియని మానసిక వ్యధకు లోనైయున్నాడు. నిజమే మనిషి స్వార్థజీవి. ఫలితము తనకను కూలముగనే రావలయునని తాపత్రయ పడుట సహజము. నిర్ణయము భగవంతుని దని మనిషి నిమిత్తమాత్రుడని ఎన్నేని మాట లాడ వచ్చును. గాని అదే నిజమని తనప్రమేయ మేమీ ఫలించదని నమ్మి నిశ్చింతగా ఊరకుండ గలరా? ఉండలేరు ఉండిన ఈ ప్రపంచ మెందుకింత అల్లకల్లోలముగ నుండును. తనకొడుకు చక్రవర్తి యగుటకుకా వలసిన ఏర్పాట్లు కట్టుదిట్టముగా చేసి, కంటికి రెప్పవలె కాపాడు కొనుచున్నాడు. అయినా తనపై తనకు మాత్రము నమ్మకము కుదరకున్నది. విధివిధాన మెట్లున్నదో ఎవరి కెరుక? అన్ని సమస్యలకు కాలమే సమాధాన మియ్యసమర్థము
- చక్రవాక రాగం
- " విధిని దాటతరమే ఏరికిన్
- తిరుగులేనె లేదుగా దానికిన్ "
- శుద్ధోదనుడు:- (ఉలిక్కిపడిలేస్తాడు) ఎవరక్కడ - వెంటనే చెన్నుని ప్రవేశపెట్టండి.
- యశోధర:- (ప్రవేశించి) మామగారు...
- శుద్ధోదన:- చెన్నుడేడీ...
- యశో:- మామగారు... మీరు మామందిరంలో వున్నారు.. చెన్నుడు, మీకుమారుడు ఉద్యానవనంవైపు యేదోచర్చించు కొంటూ వెళ్ళారు. చాలాసేపే అయింది. ఇక వచ్చేసమయ మయింది లెండి... వీడు నిద్రపోయినట్టున్నాడు. (బిడ్డను ప్రక్కనున్న ఊయలలో వేయును) మామగారు...మీరెం దుచేతనో చాలా కంగారుగా వున్నారు ముఖమంతా
- చెమటలు ప ట్టాయి, ఏమైంది మామగారు మీకు. (అంటూ పైపంచె నందించును)
- శుద్ధోదన:- ఆ(.....(తుడుచుకొనును)
- యశోధర:- నాతోచెప్పటాని కేల సంకోచిస్తున్నారు. ఏమైంది మామగారు చెప్పండి.
- శుద్ధోదన:- అది...అది...
- యశోధర:- చెప్పండి మామగారు- ఏమైంది...
- ఆవె!! మానసమున తమరు లేనిపోనివి యె న్నో
- యోచనలను చేసి దాచికొనుచు
- క్రుంగిపోవ నేల కొంతమాకుదెలిపి
- సేద దీర రాదె శ్రేయ మలర.
- శుద్ధో:- మీకు చెప్పరాని రహస్యమేమీ లేదమ్మా.
- యశో:- అయితే చెప్పండి
- శుద్ధో:- నేనేదో ఆలోచిస్తూ .. ఈ ఆసనాన కూర్చొని యుంటినా... ఇంతలో ఎప్పుడు నిద్రముంచు కొచ్చిందో నాకే తెలియదు...
- యశో:- అయిన...
- శుద్ధో:- అప్పుడు నాకొక చిత్రమైన కలవచ్చిందమ్మా...
- యశో:- కలేగదా .... చెప్పండి మామగారు ..ఏమిటాకల?
- శుద్ధో:- అదేచెబుతున్నానమ్మా...
- మ!! కలనాపుత్రుడు సౌధమెక్కి సుషమన్ గన్పించి దోసిళ్ళతో
- పలువర్ణంబుల రత్నముల్ విసరుచున్ పల్మారు సుస్మేరుడై
- పిలువన్ భూరిజనంబు నేల నలిమెన్ ప్రేమంబుదీపింపగా
- పలు మారుల్ ప్రజ జైయనంగ దివికిన్ బ్రాకెన్ రవంబె0తయున్.
- అలా నాపుత్రుడు సౌధోపరిభాగంబు నుండి రత్నములు వెదజల్లుతుండగా జనులు వాటిని ఏరుకుంటూ జయజయధ్వానంబులు చేయుండగా ఆశబ్ధంబునకు ఉలికిపడి లేచితిని. ఇదేనమ్మా నా కలవర పాటుకు కారణము.
- యశో:- ఇందు మీరు కలవరపడవలసిందే మున్నది మామగారు మీ కుమారుడు ఉన్నతికి జేరి ప్రజలకు కానుకలిచ్చి తన చిరునవ్వుతో ప్రజల మనస్సును దోచుకొని మహారాజుగా వెలుగంది కీర్తికెక్కుట యేగదా మీరు కలగన్నది.
- శుద్ధో:- సౌధమెక్కట సంసారమును త్యజించి గురుపద మొందుట కాబోలు - అలా వెదజల్లు రత్నములు అతని బోధలుకాబోలు అతని చిరునవ్వులు జనసందోహము జూడ సన్యసించు జనములో కలిసి పోవుననిపించు చున్నది.
- యశోధర:- అదంతా మీభ్రమ. కలలు మన ఆలోచనల ప్రతిరూపము లే గదా! మీ రెట్లుభావించిన అట్ల అనిపించును. ఇక వదలి వేయుడు.
- శుద్ధో:- ఎందు కో నామనసున రేగిన అలజడి శాంతింప కున్నది.
- యశో:- మీరు మీకొడుకు విషయమై చేసిన ఏర్పాట్లు తెలిసికొని ఆశ్చర్య మైనది. మరీ ఇంత కట్టుదిట్టములు తగవు మామగారు. ఇవే విపరీతమునకు దారి తీస్తాయేమోనని పిస్తున్నది. మహారాజా మీరు నిశ్చింతగా వుండండి. మీకుమారుడు నన్ను మీమనుమని విడచి ఎక్కడికి వెళ్ళడు వెళ్ళలేడు.
- వీడ ప్పు డే నిద్రలేచాడు. (అంటూ పిల్లవానిని ఊయలనుండి దీసి రాజు చేతికిచ్చి) వీడితో కాసేపాడుకోండి మీ చింత ఇట్టేమాయ మౌతుంది
- శుద్ధో:- (పిల్లవాడిని సంతోషంగా చూస్తూ) నిజమే సౌందర్యరాశి నాకోడలి ప్రేమమయ దృక్కుకుల శృంఖలముల నుండి వాడు తప్పించు కొనలేడు. అంతేకాదు ముద్దులొలుకు ఈ పసిబాలుని బోసినవ్వుల బంధములు త్రెంచుకొని వెళ్ళు శక్తి వానికి లేదు. (అంటూ ఊయలలో వేసి ఊపును)
- ఆవె!! తనువు విడిచి మాయ తనయుని నాకిచ్చె
- వాడు కూడ నన్ను వదలి వెళ్ళి
- సన్యసించునన్న సహియింపగాలేను
- మనసులోని బాధ మరపురాదు.
- ఎంత సముదాయించుకొన్నను. నామనసు తిరిగి కీడునే శంకించుచున్నది. నాకుమారుడు చక్రవర్తియైనా కావచ్చునని జోతిష్యులు చెప్పిరిగదా... అట్లెందుకు కారాదు...ఔను అట్లేయగును. నేనే అనవసర మైన ఆలోచన చేయుచున్నాను. (ఇంతలో చెన్నుడు
- సిద్ధార్థుడు వస్తారు. సిద్ధార్థుడు వెళ్ళి ఊయలలోని బాలుని నవ్వుతూ పలకరించి వెళ్ళి తండ్రిప్రక్కన కూర్చొనును. శుద్ధోదన మహారాజు
- ము ఖంలో సంతోషం కనిపించును)
- చెన్నుడు:- మహారాజా ..... ఇకనాకు సెలువు ప్రసాదించండి వెళ్ళివత్తును.
- శుద్ధో:- సరి మంచిది....
- (తెరపడును)
- రెండవ రంగం
- (అంతఃపురం - సిద్ధార్థుడు ఒక చిలుక పంజరాన్ని త్రిప్పుతూ చిలుకకు పండు తినిపిస్తూ వుంటాడు)
- యశోధర:- (ప్రవేశించి) తమరిక్కడున్నారా? అంతఃపుర మంతాగాలించి గాలించి ఇటు వచ్చాను. రండి వెళదాం.
- సిద్ధా:- ఏదోవిశేషమున్నట్లున్నది. ప్రొద్దున్నే వంది మాగధులు బ్రాహ్మా ణుల
- జంట వచ్చి వారి స్తుతులతో ఆశీర్వాదములతో ఉక్కిరి బిక్కిరి చేసివెళ్ళారు. ఇప్పుడర్ధాంగి వంతు కాబోలు ,,, ఇంతకు ఏమిటి విశేషం.
- యశో:- అయ్యో...అదికూడా తెలియదా? ఈ రోజూ మీ 29 వ పుట్టినరోజు. పుట్టినరోజు పండు గండీ.... సరిసరి. మీరీరోజు ఇంకే కార్యక్రమాలు పెట్టుకోకండి ఈ రోజంతా మీరు మాచెంతేవుండాలి సుమా!
- సిద్ధార్థ:- అలాగే దేవిగారు.... అప్పుడే నాకు 29 సంవత్సరము లొచ్చినవిగా...
- ఉ!! కాలము సాగిపోవు తుదికన్గొన సాధ్యము కాదుదానికిన్
- కాలము మధ్యనిల్చినను గన్గొన నక్కట నాకెచిత్ర మౌ
- బాలుడనైననే నపుడె బాలుని తండ్రిగ మారితింతకున్
- చాలని యన్ననిల్వదు సజావుగ కాలము సాగిపోవులే.
- ఔరా కాలమెంత శీఘ్ర గతిన గడచి పోయింది. ఈ రాజ వైభవములు దర్పములు సుఖసంతోషములలో మునిగిపోయి కాలమే తెలియకుండా పోయింది. ఔనూ...ఇదే జీవితమా... ఇంతకుమించి యింకేమీ లేదా! (ఆలోచనలోపడును)
- యశోధర:- నాథా! మళ్ళీమీరు పరధ్యానంలోకి జారుకున్నారు. మా విన్నపం మీకు వినబడిందోలేదో...
- సిద్ధా:- లేదుదేవీ... మీరుచెప్పినట్టే చేసెదము. ఈ రోజంతా రాణిగారి అంతఃపుర మందే మాకాలక్షేపము... అంతియేగదా!
- యశో:- అంతియేగదా! అంటే అంతేకాదు...ఇదో ఈ విధంగా ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో నిశ్శబ్దంగా కూర్చుని మనసెక్కడో పెట్టి తనువు మాత్రం మాచెంత ఉంచడంకాదు...
- తే!! సంతసమున నేడెంతయు సరసులగుచు
- మొలక నగవులు మోమున నెలవుసేయ
- డెందమానందమున నిండ సుందరముగ
- నుండ వలయుమా కన్నుల పండువనగ.
- సిద్ధా:- యశోధరా! నీవంటి సుందరాంగి, ప్రేమమూర్తి సన్నిధిలో పరధ్యానమా...అదెలాసాధ్యం.. ఒక్కమాట చెప్పమంటారా రాణిగారు...
- యశో:- చెప్పండి..
- సిద్ధా:- నీ సాన్నిహిత్యంలో నేను లోకాన్నేమరచి పోతాను....ఒక్క మాటలో చెప్పాలంటే..నేను..నీప్రేమపిపాసిని.. నాప్రేమదేవత వీవు.
- యశో:- ఓ...హో...హో... యువరాజుల వారికి కవిత్వం పొంగిపొర్లు కొస్తున్నట్లున్నది....అంతాయిప్పుడే పొర్లిపోనివ్వకండి..రేపటికి కూడా కాస్తామిగల్చండి.
- సిద్ధా:- రేపటికథరేపు. నేటికథనేడు. నీవుప్రేమనిష్యందివి మన ప్రేమకు తుదిలేదు. అది..అమరనదీ ప్రవాహము. యశోధరా!
- పాట(1)
- సిద్ధా:- మనసులోన పొంగి పొరలె
- మధుర మధుర భావనలు...
- యశో:- కదలనీవు నిన్ను వీడి
- మదిని మెదలు తలపులు.
- సిద్ధా:- ప్రేయయనగ నేమొ నేను
- నిన్ను కలసి తెలిసినాను
- మనసులోన రేగు గుబులు
- కర్థమేమొ ఎరిగి నాను... మనసు!!
- యశో:- పరవశమున తేలిపోదు
- ప్రపంచమునె మరిచిపోదు
- ప్రకృతి పురుషులనగ మనము
- కలిసి మెలసి మెలగుదాము... .కదల !!
- సిద్ధా:- నేను హంస నీవు కొలను
- యశో:- కమల మేను తుమ్మెదీవు
- సిద్ధా:- కాదు కాదు కాదు మనము
- ఇద్దదు:- అద్వైతపు సార మిపుడు
- సిద్ధా:- మనసులోన !!
- యశో:- కదలనీవు !!
- యశో:- నాథా! మన రాహులకుమారుడు నిద్రలేచి పరిచారికలను ముప్పతిప్పలు పెట్టుచుండును ఇకనేను వెళ్ళెదను. మీరూ వెంటనే బయలుదేరండి.
- సిద్ధా:- చిత్తం..రాణిగారి యాజ్ఞ... (యశోధర నవ్వి వెళ్ళిపోవును) యశోధర సమ క్ష మున మనస్సు కాస్తా ఊరట చెంది నట్లున్నదేగాని, అంతరాంతరాళలో యేదో వెలితి. బంధనకు గురైనట్లు భావన. (పంజరం వద్దచేరి) ఈ చిలుక బంగారు పంజరమున హాయిగానున్నదా? లేదు. నేనును ఈ రాజాంతః పురమున భార్యా బిడ్డల అనురాగ పంజరమున బంధీనేనా!... ఏమో? (అంటూ చిలుకను పంజరంనుండి తీసి బయటకు విసరును).
- ౩వ రంగం
- (అంతఃపురం శుద్ధోదన మహారాజు అసీనుడైయుండును)
- భటుడు:- (బయటనుండి) ప్రభూ చెన్నుడు మీ దర్శన మభిలషిస్తున్నాడు.
- శుద్ధో:- చెన్నునకు ప్రత్యేకంగా అనుమతి అవసరమా? సరిసరి ప్రవేశము కల్పించండి.
- చెన్ను:- (వచ్చి) ప్రభూ .... (ఏడుస్తు కాళ్ళపైబడును)
- శుద్ధో:- ఏమైనది చెన్నా....ఎందుకు దుఃఖిస్తున్నావు.
- చెన్ను:- ఈ నాడు జరగకూడని ఘటన జరిగి పోయింది ప్రభూ
- చెన్ను:- రాకుమారులు ఏ కట్టుదిట్టములు చేయకనే నగరసందర్శనం చేశారు ప్రభూ.
- శుద్ధో:- (అదిరిపడి) చెన్నూ...ఎందుకలా జరుగనిచ్చావ్.
- చెన్ను:- నాచేయిదాటిపోయింది ప్రభూ... రాకుమారులు ఎన్నడూ లేనిది ఈనాడు పట్టుబట్టి రథం సిద్ధంచేయించి నగర సందర్శనానికి పదమ న్నారు. ముందుగా ఏ ఏర్పాట్లూ చేయడానికి అవకాశమివ్వ లేదు ప్రభూ.
- శుద్ధో:- అసలు మీరు ఉద్యాన వనానికి కదా బయలు దేరారు.
- చెన్ను:- నిజమే ప్రభూ...ఉద్యానవనం వెళదామనగానే అక్కడి వాడిన పూలు సైతం తీయించి ఆహ్లాదకరంగా మార్పించేశాను. కానీ...
- శుద్ఢో:- కానీ...
- చెన్ను:-కానీ రాకుమారులు ఉద్యానవనం సందర్శన మాని సరాసరి నగర వీధుల సంచరించటానికి రథం సిద్ధంచేయమని బలవంత పెట్టి మరీ బయలుదేరారు.
- శుద్ఢో:- సరిసరి...
- తే.గీ!! చూడలేదు కదా చూడ కూడనట్టి
- దృశ్యముల్ పురవీధుల దిరుగు నపుడు.
- నొచ్చుకొను మాట లేవియు నుడువరుగద
- జనులు పురవీధి పుత్రుడు జనెడు వేళ.
- శుద్ధో:- ప్రభూ ఏమని చెప్పను..అదేమి చిత్రమోగానీ..చూడ కూడని దృశ్యములన్నీ వరుసగా దర్శన మిచ్చినవి.
- శుద్ధో:- ఆ....నాకుమారుడు చూడకూడని దృశ్యములు చూసెనా? చూచి మనసునొచ్చుకొనెనా యేమి? ఇంతకూ యేమైనది.
- చెన్ను:- మొదట నగర వీధులలో ఒక రోగిగనపడెను. వ్యాధిగ్రస్తుడగుట
- సహజమని అందులకు ఔషధసేవనం చేయించి స్వస్థత చేకూర్చ వచ్చని నచ్చజెప్పితిని. అందులకు కావలసిన వైద్యశాల లనేకము మన రాజ్యమున కలవని కూడా తెలిపితిని.
- శుద్ధో:- సరిసరి.. ఆతర్వాత...
- చెన్ను:- ఆతర్వాత ఒక ముసలివాడెదురయ్యాడు. వానిని చూచి కుమారుడు ఎందులకాతడు నడవలేక నడుస్తున్నాడు. వాని శరీరముపై ఆ ముడుత లేమిటి ఎందుకాతడు వణకుతున్నాడని ప్రశ్నల పరంపర కురిపించాడు ప్రభూ... నాశాయశక్తుల ప్రమత్నించి నేను వృద్ధాప్యము నందరూ ఎదుర్కో వలసిందేననీ..వయసు మీద పడిన తర్వాత ఈ అవస్థ తప్పదని సర్ది చెప్పయత్నించితిని గానీ కుమారుడు సమాధానపడి నట్లులేరు.
- శుద్ధో:- అటులనా...సరి. ఆవల యేమైనది
- చెన్ను:- ఆ తర్వాత...ఆ తర్వాత...
- శుధ్ధో:- ఆ తర్వాత ఏమైనది చెన్నా...నామనస్సు ఆతురత చెందుతున్నది చెప్పూ.
- చెన్ను:- ఆతర్వాత మాకు శవయాత్ర యెదురైనది ప్రభూ.
- శుద్ధో:- ఆఁ... శవయాత్రా!
- చెన్ను:- అవును ప్రభూ..
- కం!! చచ్చెద రేల జనులు ఆ
- చచ్చిన వారెటు చనెదరు చచ్చిన వెనుకన్
- నొచ్చుకొన నేల బంధుల్
- చచ్చుట తెలియంగ లేరె జనములు చెన్నా.
- అంటూ ప్రశ్నపై ప్రశ్నవేశారు ప్రభూ. నేనా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోయాను. మిన్నకుండి పోయాను ప్రభూ.
- శుద్ధో:- కుమారుని మనస్సు వికలమైనది. ఇప్పుడేమి చేయవలె ఉపశమింప జేయు మార్గము లేదా! చెన్నూ ఆలోచించు ఏదోఒకటి చెయ్యి చెన్నూ ఏదోఒకటి చెయ్యి...
- చెన్ను:- ఆ ఏర్పాట్లన్నీ చేసే మీవద్దకొచ్చాను ప్రభూ... కోసల దేశం నుండి ఒక నాట్యబృందం వచ్చింది. ఒక కన్నియ యీ మధ్యే రంగప్రవేశం చేసి ప్రేక్షకుల నుర్రూతలూగించిందని తెలిసింది. అదే ప్రదర్శన రాకుమారుల రాచమందిరంలో ఏర్పాటు చేయించి వచ్చాను ప్రభూ.
- శుద్ధో:- మంచిది..చెన్నూ జాగ్రత్తగా గమనిస్తూవుండు. కుమారుని మనస్సు వైరాగ్యము వైపుకు మరలరాదు..జాగ్రత్త!
- చెన్ను:- మీరింతగా మాకు చెప్పవలయునా ప్రభూ.. భారమునాపై వేసి మీరు విశ్రాంతిగైకొనండి.. వెళ్ళండిప్రభూ వెళ్ళి విశ్రాంతి గైకొనండి. (శుద్ధోదనుడువెళ్ళును) విధివిధాన మెట్లున్నదో ఎరుగము సంఘటనలు మాత్రము ఒకదానిపై ఒకటి ప్రతికూలముగనే తారసపడుతున్నవి. దైవేచ్ఛ. ఏమి జరుగునున్నదో చూతము గాక.
- తెరపడును
- 4వ రంగం
- (రాజమందిరంలో నృత్యం - సిద్ధార్థుడు యశోధర నృత్యం తిలకించ డానికి ఆసీను లై వుంటారు. చెన్నుడు ప్రక్కనిలిచియుండును)
- నృత్యం - పాట - 2
- ఏలరా బిగు వేలరా?
- స్వామి నన్నేలగా-నీకు...
- బిగువేలరా - స్వామి నన్నేలగా...ఏలరా!!
- కనులు కాయలుకాచె - నీకొరకు నేవేచి
- మనసు వేదన చెందె - నీచెంత నే లేక
- తనువు నిలువగ లేదు - కైదండనీ వీక
- తమక మోపగలేను - తడవు సేయక రారా!...ఏలరా
- కొండ మల్లియ పొదలు - ననుజూచినవ్వెరా
- పిల్లవాయువు తెరలు - ననుగేలి చేసెరా
- నాలోని అణు వణువు - నీకౌగిలిని గరిగి
- నేనె - నీవై పోవ - తపియించు - చున్నారా - ఏలరా!!
- సిద్ధా:- ఆపండి (నర్తకి పాట మధ్యలో ఆపేస్తుంది) ఇదిగో మీ పారితోషికము (రత్నాలమూట విసరివేయును) మీరిక వెళ్ళ వచ్చును. చెన్నూ మనము రేపు కలసికొందము.
- చెన్ను:- చిత్తము - (నర్తకి, వారిబృందము (వుంటే) చెన్నూ వెళ్ళుదురు)
- యశోధర:- నాథా! ఏల అంత విసుగు జెందుచున్నారు. ఆ నర్తకి అభిసారిక యై ఎంతచక్కని హావభావములు ప్రదర్శించుచున్నది. అంతలో ఆపుజేయించితిరి. మీకు ఆనందము కలిగించలేదా!
- సిద్ధా:- లేదు - అట్లని ఆ నర్తకి నటనలో లోపమున్నదని కారు. నామనసే ఈ రోజు బాగులేదు.
- యశో:- అవును మీరు ఈ రోజు వ్యాహ్యాళినుండి తిరిగి వచ్చినది మొదలు అదోలావున్నారు.
- సిద్దా:- అవును యశోధరా ..నాకేలనో ప్రపంచ మంతయు దుఃఖమయముగా తోచుచున్నది.
- యశో:- దుఃఖమా...మీకా!
- సిధ్ధా:- యశోధరా... ఈ దుఖము నీకు నాకు మనకు మాత్రమే పరిమితమై లేదు. విశ్వమంతయు దుఃఖముచే ఆవరింప బడియున్నది.
- యశోధర:- ఈ నాడేలనో మీరు చిత్రముగా మాట్లాడుతున్నారు.
- సిద్ధా:- అవును .. మానవులు వ్యాధిగ్రస్తులై బాధపడుతున్నారు.
- చు ట్టూవున్నవారిని దుఃఖమున ముంచుచున్నారు. ఈ దుఃఖము--
- ఉ!! లోకము క్రమ్మివైచినది లోగొని జీవుల మానసంబులన్
- బాకున జీల్చివైచినది. బాధలగుందెడి యీజనాళికిన్
- శోకము బాపు నే విధియు సూచన మాత్రము నైనదోపదెం
- దాక భరింతురీ జనులు దారుణ దుఃఖము. దారిలేదొకో.
- యశో:- మీరుబాధపడి నంత మాత్రమున లోకము లోని దుఃఖము తొలగిపోవునా? అదంతయు వారి కర్మఫలము.
- సిద్ధా:- కర్మ...కర్మ యనగా
- యశోధర:- అవి ఆధ్యాత్మిక విషయములు - వాటిని తెలుసు కొనవలె నన్న ఆచార్యుల నడుగుడు. గ్రంథముల పరిశీలింపుడు. మనము చేయవలసినది మాత్రము వైద్యశాలలు నిర్మించడము వృధ్ధులకు ఆశ్రయము గల్పించడము జనుల కింత ఓదార్పు నియ్యడము అవి మన రాజ్యంలో సక్రమంగానే నిర్వర్తింప బడుతున్నాయి.
- సిద్ధా:- ఇంతేనా! ఇంతకు మించి పరిష్కారమే లేదా?
- యశో:- ఎందుకు స్వామీ తమరు తలకు మించిన యోచన చేయుచున్నారు. వెళ్ళివిశ్రమిద్దాం రండి. నాకూ నిద్రముంచు కొస్తున్నది. బాలుడు కూడా నిద్రలోకి జారుకున్నాడు పదండి నాథా!
- సిద్ధా:- యశోధరా వెళ్ళి నీవు విశ్రం మిం పుము...పద(వెళ్ళి ఒక పుస్తకంతో తిరిగి వచ్చును) (అటూయిటూ తిరుగుతూ పస్తకపు పుటలు త్రిప్పును) రేపు వెళ్ళి తప్పక ఆచార్యులతో సంప్రదింతును.
- (లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)
- (సిద్ధార్థుడు దీర్ఝాలాచనలో వుండును)
- చెన్ను:- (ప్రవేశించి) యువరాజా...తమరు రాత్రి నిద్రపోయినట్లు లేదు. కనులు జేవురించి యున్నవి. ముఖము పాలిపోయి వున్నది.
- సిద్ధా:- నిజమే చెన్నూ రాత్రి నిద్రపట్టలేదు. అంతఃపుర పుస్తక భాండా గారమున గల గ్రంథముల నెన్నో తిరగ వైచితిని. నామదిలో రేగిన అలజడి శాంతించు సమాధానము దొరక లేదు.
- చెన్ను:- దానికింతగా యోచింప వెలెనా? అవసరము లేదురాకుమారా... తీరికగా మీరు చదివిన గ్రంథముల గూర్చి ఆచార్యులతో చర్చించ వచ్చును.
- సిద్ధా:- ప్రాతఃకాలముననే ఆచార్యులను దర్శించితిని. వారితో చర్చించితిని గూడా.
- చెన్ను:- అట్లయిన మీకు సమాధానము దొరికియేయుండును. ఇక చింతేల రాకుమారా.
- సిద్ధా:- సమాధానము దొరకలేదు సరిగదా నాలోని ఆవేదన ద్విగుణీకృతమైనది.
- చెన్ను:- రాకుమారా...
- సిద్ధా:- అవును చెన్నూ...మానవుడు కర్మానుగత ఫలితముల వెంట నిడుకొని పుట్టినాడట. అవివారు అనుభవించితీరవలెనట, వాటిలో మన జోక్యము అనవసరమట.
- ఉ!! పుట్టుకతోనె కర్మఫలభోగము నంటుక వచ్చు ,నెట్టు లే
- ప ట్టున నైన దాని నిల ప్రక్కకు నెట్టగ జాల రెవ్వరున్
- గిట్టెడిదాక జీవులకు ఖేదము తప్పదు నిట్టివాటికై
- పట్టకు పట్టునీ విటుల బాలక పొమ్మిక వాదమేటి కిన్
- అని వెళ్ళమన్నారు. ఇది మన కర్తవ్యము నుండి తప్పించు కొను మాటలే
- గాని సత్యము కాదంటిని. మనిషి పుట్టక ముందే కర్మములుండుటేమిటి, వాటిని మూట గట్టుకొని పుట్టుకతో వెంట తెచ్చు కొనుటేమిటి. ఇవి నమ్మశక్యము
- గావంటిని.
- చెన్ను:- మది వారేమనిరి.
- సిద్ధా:- మరింకేమియులేదు తుదకు వారు చెప్పిన విషయము, తపస్సు పరమార్థ మరయుటకు తపస్సే మార్గమట.
- చెన్ను:- మరి మీరేమనుకొందురు?
- సిద్ధా:- నిజమే నేనే తపించి సమాధానము తెలిసికొనవలయును ఇంతకు మించి మార్గాంతరము లేదు. గ్రంథములు ఆచార్యుల సమాధానములు నన్ను శాంతింప జేయ సమర్థములు గావు నేనే ఈ దుఃఖమూలము నన్వేషించి పరిష్కారము కనుగొనవలె, అందుకు తపమే యేకైకమార్గము.
- చెన్ను:- రాకుమారా...తొందర పడకండి. మీరేమిటి తపస్సు చేయడమేమిటి. మీరు రాజవంశీకులు. రాజసమున జీవించవలె, పరిపాలన జేయవలె. రాజ్యవిస్తరణ గావించవలె. మీ తండ్రిగారి ఆకాంక్షకూడా యిదే.
- సిద్ధా:- ఎవరి ఆకాంక్షలు వారివి. రాజ్యపాలనకు సమర్థులెందరో వున్నారు. నా ఆకాంక్ష ఈ ప్రపంచమునుపట్టి పీడి స్తున్న దుఃఖమును నివారించుటే. అందులకు నేను వెంటనే సమాయత్తము గావలె. చెన్నూ...
- చెన్ను:- రాకుమారా...
- సిద్ధా:- నేటి రాత్రి మూడవ జామునకు నాకునీకు అశ్వములు సంసిద్ధము చేయ్యి. అంతఃపురము మేల్కొనక ముందే మనము బయలుదేరవలె. నన్నుమూడవ కంటికి తెలియ కుండా అంతఃపురము దాటించి నీవు తిరిగి రావచ్చును.
- చెన్ను:- యువరాజా!
- సిద్ధా:- ఈ విషయము రహస్యముగ నుంచుట నీ బాధ్యత. నామహాప్రస్థానమునకు ఎటువంటి ఆటంకము కలుగరాదు.
- చెన్ను:- మరి మహారాజుల వారు...
- సిద్ధా:- అనవసరముగ వారి దృష్టికి ఈ విషయము తెచ్చి నా ప్రయత్నము భగ్నము చేయకు. అలా జరిగితే నా ప్రయాణాన్ని మీరు తాత్కాలికంగా ఆపగలరే గాని శాశ్వతంగా కాదు. కాదు కూడదని నాప్రయత్నమునకు అడ్డుతగిలితే పరిణామాలు చాలా తీవ్రంగా వుంటాయి. ఇక నన్ను ఏ బంధము బంధించలేదు. నాదృఢ నిశ్చయము ముందు తండ్రీకొడుకు భార్యభర్త బంధములన్నీ తృణప్రాయములు - జాగ్రత్త.. ఇకనీవు మారు మాటాడక వెళ్ళిరమ్ము.
- చెన్ను:- కుమారా!...
- సిద్ధా:- నేటికి సెలవు .... ఇకనీవు వెళ్ళవచ్చును. (అంటూ ఇక ఎక్కువ మాటలకు తావివ్వక తానే అక్కడనుండి వెళ్ళిపోవును)
- చెన్ను:- ఔరా ఇక మేము మహారాజును ఓదార్చు కొనుట తప్ప మిగిలిన దేమియు లేదు. ప్రభువుల భయము నిజమైనది. ఒక వేళ నేనీ విషయము వెల్లడిచేసి బహిరంగ పరచినను రాకుమారుల తీరు
- ఏవిధముగా మారునో ఊహింపజాలము. యేదియేమైనను వారి మహాప్రస్థానము నాపగల శక్తి ఈ ప్రపంచమున ఎవ్వరికీ లేదని నిర్థారణమై పోయినది. రాకుమారా మీ వియోగ దుఃఖము మే మెట్లు భరింతు ము. తల్లిలేని బిడ్డను ఈ చేతులతో పెంచి పెద్దజేసినాడను, కడకు నాచేతులతోనే నట్టడవిలో దించి రావలసి వచ్చినది. నాకే దుఃఖమాగుటలేదు (ఏడ్చును) ఇక శుద్ధోదన మహారాజు యశోధరాదేవి పరిస్థితి ఏ మగునో ఊహింప వీలులేకున్నది.
- తే.గ; రాకుమారు నిల్పెడుశక్తి నాకులేదు
- వలను కాదెవ్వరికి నిక నిలుపలేరు
- విధిని నెదిరింప తరమె నెవ్విధిని నైన
- ప్రభువు నోదార్చుకొనుటెమా బాధ్యతిపుడు.
- తెరపడును
- తెర లేచును
- (రాజమందిరం చింతాక్రాంతమై వుంటుంది. రాజు, యశోధర కూర్చిని ఉంటారు చెన్నుడు చేతులు కట్టుకొని నిలుచుని వుంటాడు)
- శుద్ధోధన:- (దుఃఖిస్తూ) వాడి హృదయము బ్రహ్మదేవుడు పాషాణముతో చేశాడు. కాకపోతే మమ్మల్నిలా శోకసముద్రలో ముంచి వాడి దారి వాడు చూసుకోడు. చెన్నూ మాకువాడిపై గల ప్రేమలో శతాంశమైన వానికి మాపైవుండివుంటే ఇంత దారుణాని కొడిగట్టేవాడు కాదు. అయినా చెన్నూ నీకు తెలిసే యింతపని జరిగిందంటే నమ్మలేక పోతున్నాను. నాకు తెలియకుండా కుమారుణ్ని రాజనగ రు ఎందుకు దాటించావ్.
- కంటికి రెప్పలా కాచుకొని యున్న నీవే ఎలా చేయగలిగావీ పని.
- చెన్ను:- (కన్నీటితో) మహారాజా మీ మాటేమోగానీ సిద్ధార్థుల మనసు నేను బాగా ఎరుగుదును. ఆ సమయంలో రాకుమారుల మాట నాకు వినక తప్పినదికాదు. నేనేమాత్రం ఆయనకు విరుద్ధంగా ప్రవర్తించి వుంటే పర్యవసానం మరోలా వుండేది. ఏ అఘాయిత్యానికైనా వారు పాల్పడి వుండేవారు. అయినా మహారాజా రా కుమారులు నాకుమాత్రం తెలియకుండా వెళ్ళలేరను కుంటున్నారా? ఆలోచించండి. అలా వెళ్ళివుంటే రాకుమారు లెమయ్యారో కూడా మనకు తెలిసేదికాదు.
- యశోధర:- ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో వారు ఇల్లువిడచి వెళ్ళిపోయారు. ఏమాత్రం ముందుగా తెలిసివున్నా...
- చెన్ను:- అమ్మాయశోధరాదేవి...నిన్నేమని ఓ దార్చను తల్లీ - సిద్ధార్థుని వజ్రసంకల్పం నీకు అర్థంకాలేదు తల్లీ - ఏమాత్రం వీలున్నా రాకూమారున్ని నేను వెళ్ళనిచ్చేవాడినా తల్లీ - తండ్రీకొడుకు భార్యాభర్త బంధాలేవి తన్ను బంధించలేవని తెగేసి చెప్పాడు తల్లీ . తెలిసి వెళితే ఘర్షణ తప్ప మరే
- మార్పు వుండేది కాదు తల్లీ.
- శుద్ధోధన:- అయ్యో...నాకొడుకును సన్యాసి కాకుండా ఆపలేక పోయాను. వాడు చక్రవర్తియై వెలిగి పోవాలని కలలుగన్నాను. నాకలలన్నీ కల్లలై
- పోయాయి. అమ్మా యశోధర నేనునీకు అన్యాయం చేశాను తల్లీ. తెలిసి తెలిసి వానికి నీతో పెండ్లిచేసి తప్పుచేశాను. కనీసం పసిబిడ్డ రాహులుని చూసి యైనా వాడింతపనికి పూనుకో లేడను కొంటిని... ఔరా.... ఎంతపని జరిగి పోయినది.
- యశోధర:- లేదు మహారాజా మీరు చేసిన తప్పేమీలేదు. మీ కుమారుని జాతక విషయం తెలియకయే నేను వివాహం చేవుకొన్నానని మీరను
- కుంటే అదిపొరపాటే. నాకు మా తండ్రికి అన్ని విషయాలు తెలుసు. నా నాస్నేహం నాచెలిమి నాప్రేమతో నాభర్తను కట్టివేయగల ననుకొన్నాను. వివాహమాడాను ప్రేమించాను కడకు ఓడిపోయాను.
- కం: వలచి వలపింప జేయగ
- దలంచి నుద్వాహ మాడి తనుహృ ద్భా షన్
- మెలగితి నన్యోన్యముగన్
- కలచెన్ మది నాపతి ననుకాదని వెడలెన్.
- చెన్ను:- యశోధరాదేవీ.. సిద్ధార్థునిలో వచ్చిన పరివర్తనము తీవ్రమైనది. అతని ఆలోచనా తీరే ప్రత్యేకమైనది. ఈ ప్రపంచము లోని దుఃఖమునకు మూలము కనుగొని శాశ్వత నిర్మూలనము కొరకువారు తమమాచరింతు
- రట. ఇదెంత చిత్రము లోకమున సంపదకై మరణమును జయించుటకై సంతానమునకై త్రిభువన విజయమునకై తపమాచరించిన వారున్నారు. గానీ ఇట్లు తనకొరకై గాక లోకములోని జనుల దుఃఖనివారణకై తపించినవారు ఎవరైనాగలరా? ఆలోచించి చూడండి.
- చ!! వలదని పట్టుబట్టి పలువైభవముల్ సిరి సంపదల్ సుతుల్
- ముదితలు బంధు మిత్రు లను మోహపు రజ్జుల చుట్టికట్టివై
- వదలచి నార, మాతడును వాటికి జిక్కక దుఃఖమూలమున్
- వెదుకగ నేగె దీక్షగొని వేదన జెందుట పాడియౌనొకో!!.
- యశో:- అవును నాపతి నిస్వార్థచరితుడు లోకహితార్థము తపమునకు వెళ్ళినాడు. నేనేల బేలనై విలపించవలె. మహారాజా...మీరును దుఃఖించకండి. మనందరం ఆయన విజయము నాకాం క్ష్రి స్తూ ఆయన విజయులై మరలి వచ్చు సమయమునకై ఎదురు చూతము.
- చెన్ను:- ఔను...ఎదురు చూతము సిద్ధార్థులు తప్పక విజయము సాధింతురు. అందులకు నాకేకోశమునను సందేహము లేదు. వారు తప్పక తపోవిజయా నంతరము తిరిగివత్తురు. మనకు ఆనందమును గూర్తురు.
- శుద్ధో:- అంతకు మించి మేము మాత్రము చేయగల్గిన దేమున్నది. ఎదురుచూతుము. విధి నెదిరింప నెంచి ఓడిపోతిని. నా ప్రయత్నము లన్నీ నీటి మూటలైనవి. కానిమ్ము అంతయు పరాత్పరేచ్ఛ
- యశో:- నాభర్త సామాన్యుడు కాడు. తప్పక ఈ లోకమునకు నొకమార్గము చూపు దేశికోత్తముడు కాగలడు. అట్టి గట్టి నమ్మకము దృఢమై నా మనస్సుకు తోచుచున్నది. కాకున్న నా కొక్కమాట చెప్పి నన్నొప్పించి వెళ్ళియుండ వచ్చును గదా! అన్నదే నా ఆవేదన.... కానిండు నేనాయన విశ్వాసము పొందలేక పోతిని. (కన్నీరు తుడుచు కొనును)
- చెన్ను:- మహారాజా...మీరిలా దిగాలు పడితే మాకెవరు దిక్కు మనుమడు రాహుల కుమారున్ని చూడండి. వారికొరకైనా మీరు ధైర్యంగా వుండాలి. లేవండి మహారాజా...కర్తవ్యపరాయణులై ముందుకు సాగండి.
- శుద్ధో:- కం: ఎదిరించ నెంచితి విధిన్
- తుదకివ్విధినోడి పోతి తోచదుమది కె
- య్యదియును చెన్నూ ఇకనీ
- మదికిన్ తోచిన విధమున మనుపుము మమ్మున్.
- [అని చెన్నుని కౌగలించు కొనును)
- చెన్ను:- మహారాజా...ఈ కష్టము మీ ఒక్కరిదే కాదు. మనందరిది ఊరడిల్లండి ప్రభూ.... ఊరడిల్లండి.
- -తెరపడును-
- 5వ రంగం
- [సిద్ధార్థుడు అడవి ప్రాతంలో రావిచెట్టు క్రింద అరుగుపై కూర్చొని యుండును)
- మహానామ:- (ప్రవేశించి) తమరిక్కడున్నారా... మాసం దినంలయింది మిముచూచి, ఎక్కడి కెళ్ళారేంటి?
- సిద్ధా:- సన్యాసికి ఒక చోటేమిటి మహానామా - ఇన్నాళ్ళు మిశ్రిగ్రామంలోని ఉదకరామ పుత్త ఆశ్రమంలో వున్నాను.
- మహా:- అక్కడనుండి వచ్చేశావంటే అక్కడ కూడా ఏదోగొడవ పడి
- వుం టావు.
- సిద్ధా:- మహానామా నాకెందుకు గొడవ...నేనన్వేషకుణ్ని నా హృదయంలో రగిలిన సంశయజ్వాల చల్లార్చుకొను నిమిత్తమే నేను తెలిసిన మేధావులతో ప్రశ్నింతును. అది నీవు గొడవంటే నేనేమి చేయను.
- మహానామ:- నిజమే నేను నీ మనసు నర్థంచేసుకొంటిని... కాని ఆ మేధావులే తమ్ముతాము సర్వజ్ఞులుగా ప్రకటించుకొని విర్రవీగుచున్నారు. మీరడిగిన ప్రశ్నలకు వారి వద్ద సమాధానములు లేకనే వారు కోపగించుకొని మిమ్ము తరిమి వేయుచున్నారు.
- సిద్ధా:- కావచ్చు - నా ఆశకొద్ది వారినుండి ఏమైనా సమాధానము దొరుకు నేమోనని విచారించితి నంతేకాని వారి నిబ్బంది పెట్టడం నా అభిమతం కాదు. నీవే చూచితివి గదా ఆ అలరకలను గురువులు నన్నెట్లు హేళన చేసిరో.
- మహా:- అవు నవును - ఆరోజు మీరు ఈ సృష్టి ఎందుకు ఎవరు చేసిరని కదా వారి నడిగితిరి.
- సిద్ధా:- అంతేగాదు అసలీ సృష్టిలో ఇన్నిహెచ్చుతగ్గు లెందుకు న్నవని
- కూడా అడిగితిని. అందుకాయన కోపగించుకొని ఎందు కంటే ఏమి చెప్పగలం? భగవంతుని సృష్టినే ఎందుకని ప్రశ్నిస్తావా? ఆ సృష్టిచేయు వేళ నేనక్కడుండి వుంటె....ఇదిగో నీవంటి మూర్ఖులిట్టి ప్రశ్నలు వేయుట కవకాశం లేకుండా భగవంతుని చేతినిగట్టిగా పట్టేసి సృష్టిక్రియనాపేసే వాడిని. అంటూ విరుచుక పడ్డారు.
- మహా:- అవునవును. నాకంతా జ్ఞాపకమున్నది. అప్పుడందురూ నిన్ను అజ్ఞానిగా భావించి నవ్వి ఎగతాళి చేశారు. మీరప్పటినుండి మళ్ళీ కనవడలేదు.
- సిద్ధా:- వారు జవాబు చెప్పలేక పోగా ప్రశ్ననే అసందర్భమనిరి. అందులకు వారి శిష్యులు వత్తాసుపలికిరి.
- మహా:- నిజమే మరి....అవన్నీవారికెందుకు. ఆగురువుల నీడలో శిష్యులకు సౌకర్యంగావుంది. వారు వారి గురువును సమర్థించు కోక ఏంచేస్తారు చెప్పండి. అయ్యాసిద్ధార్థా...మీకు మాత్రం యివన్నీ ఎందుకు,
- పద... ఆ సార్నాథ్ లో సత్రయాగం చేస్తున్నారట ఓ మాసం మెండుగా సంతర్పణలు చేస్తారు. అనాయాసంగా భోజనం లభిస్తుంది. పదండి.
- (ఇంతలో కొండన్న వస్తాడు)
- కొండన్న:- అయ్యా తమరిక్కడున్నారా? మీరు ఉదకరామపుత్తవారి ఆశ్రమంలో ఓ వారంరోజుల క్రితంకనిపించారు.
- సిద్ధా:- నిజమే ఆ ఆశ్రమవాసులు చాలా సౌమ్యులు. మంచివారు.
- కొండన్న:- అదిసరే... మరిమీరు....
- సిద్ధా:- అక్కడనుండి ఎందుకొచ్చేశారని గదా సందేహం.
- కొండ:- అవును.
- సిద్ధా:- నేనా ఆశ్రమాధిపతి ఉదకరామ పుత్త వారిని నాకున్న సందేహాలడిగాను.
- మహానామ:- అవే...ఆసందేహాలేనా?
- కొండ:- వారేమన్నారు.
- సిద్ధా:- అయ్యా మీ ప్రశ్నలకు మా వద్ద సమాధానాలు లేవు. మేము మా పెద్దల అడుగుజాడల్లో వారి ఆదేశానుసారం పూజలు వ్రతములు క్రతువులు చేసుక పోతున్నాం. ఆశ్రమంలో ఉండండి. మాకార్యక్రమాలు పరిశీలించండి ఇష్టమైతే మాతోకలిసి కార్యక్రమాలలో పాల్గొనండి లేకపోతే మీ అన్వేషణ మీరు కొనసాగించండి అన్నారు.
- మహా:- మంచిదే కదా?
- సిద్ధా:- మంచిదే... కానీ నాకక్కడ సమాధానం దొరక లేదు వారి క్రతువులు వ్రతములు నన్ను సమాధాన పరచ లేక పోయాయి. తిరిగి నా అన్వేషణలో నేనున్నాను. ఈ క్రమంలో గురుకౌండిన్యుల వారినీ కలిశాను. వారు నన్ను మెచ్చుకొని నా అన్వేషణ వారి ఆశ్రమంలోనే కొనసాగించ మన్నారు. తనకు వారసునిగా ఆశ్రమాన్ని గైకొనమన్నారు కూడా.
- కొండ:- మంచి అవకాశం - అక్కడే ఉండి పోవలసింది.
- సిద్ధా:- సమాధానం దొరకని సన్యాసినినేను - నాకు ఆశ్రమాధిపత్యమా? తగదు - తగదని వచ్చేశాను.
- మహా:- ఇంకా మీకు సమాధానం దొరుకుతుందన్న నమ్మకముందా?
- కొండ:- ఎందుకొచ్చిన శ్రమ. మీరు చూస్తే చాలా నిరాడంబర నిజాయితీ పరులైన పెద్దవంశమునకు చెందిన వారులావున్నారు. మేము మీ శిష్యులుగా మీవెంటేవుంటాం. పదండి సార్నాథ్ సత్రయాగానికి.
- అన్నందొరుకుతుంది - మీ అన్వేషణా సాగుతుంది.
- సిద్ధా:- నేనే తెలియని వాడనై అంధకారమున కొట్టుమిట్టాడుచున్నాను నాకు శిష్యులా? వద్దు.
- మహా:- కొండన్న చెప్పింది సమంజసంగా నేవుంది. జీవన యాత్ర సాగడానికి యిదెంతో అవసరం. మీరు గురువులు మేము శిష్యులం ఏదోమీకు తోచింది చెప్పండి. మేము వింటాం. మన మొక జట్టుగా వుందాం. చాలాచోట్ల తిరిగాం అంతాయింతే. సరేననండి. మీ అన్వేషణ మీరు చేసుకోండి. దానికి మేమడ్డురాం - పదండి పోదాం.
- సిద్ధా:- మిత్రులారా నాపై మీకెందు కింత మమకారం. దయచేసి అర్థం చేసుకోండి. ఆత్మవంచన చేసుకొని గురుశిష్యుల నాటకమాడలేను.
- కొండ:- అయితే మీరు మావెంట రారా?
- సిద్దా:- మిత్రులారా నేను సన్యాసినైన క్రొత్తలో ఒక వూరి సత్రంలో నాసంశయ నివృత్తికోసం అన్నాహారాలు మాని తపమాచరించడం ప్రారంభించాను. ఆవూరిజనులు నన్నుచూచి యోగి అన్నారు మహాత్ముడన్నారు. నమస్కరించారు పూజించారు ఆఖరుకు భజనలు కూడా చేశారు. నా నిరాహార దీక్షను ప్రస్తుతించారు. నాలుగు రోజులైంది, నాలో ఆకలి బాధ అదికమైంది - 10 రోజులకు నీరసించి పడిపోయాను. అప్పుడు నా పరిస్థితి గమనించి ఒక చల్లనితల్లి సుజాతామాత నాకు చల్లను తాపి శాంతపరిచింది రోజు నాపైదయతో ఆమె యిచ్చే ఆహారాన్ని భుజించి. నాతపం కొనసాగించాను. కడుపు ఎండగట్టి అసలు ఏ తపము చేయలేమని మితాహారం అవసరమని నాకర్థమయింది ఒకరోజుఆ సుజాతమ్మ నాకు ఇంత చద్దన్నం పెడుతుండగా ఊరి వారొకరుచూశారు. అంతే. వార్తదావానలంలాప్రాకి పోయింది. ప్రజలు తండోప తండాలు గావచ్చారు. నన్ను దొంగస్వామన్నారు. మోసగాడన్నారు. మాయ లోడన్నారు. దొంగ దీక్షచేస్తున్నాడన్నారు. ఇక ఆఖరుకు నన్నక్కడనుండి మెడబట్టి గెంటేశారు. నిజానికి వారికి నేను స్వామినని గాని, యోగినని గాని చెప్పలేదు. నేను నిరాహారదిక్షలో ఉన్నానని మాటవరసకైనా అనలేదు. అంతే వారే అనుకొన్నారు పూజించారు. తిరిగి వారే నిందించి తరిమేశారు. కనుక మిత్రులారా మీరువెళ్ళండి. గురుశిష్యుల నాటకం కేవలం ఆత్మవంచన. అదృష్టముంటే మళ్ళీ కలుసుకుందాం. నేనిక్కడే దీక్షకొనసాగిస్తాను. విశ్వవ్యాపితమైన దుఃఖమూలాన్ని నా అంతరాంతరాళలో అన్వేషిస్తాను. దయచేసి మీరిక వెళ్ళిరండి.
- కొండ:- అయ్యా తమరమాయకులు ఎలాజీవిస్తారో ఏమో? మిమ్ముల్ని విడిచి వెళ్ళబుద్ధికావడం లేదు. కానీ వెళ్ళక తప్పదు కదా!
- మహా:- అయ్యామీరు జ్ఞానులై మాకూ దారిచూపాలనే కోరుకొంటున్నాం - కానీ యిది అరణ్యప్రాంతం క్రూరమృగాలుం డొచ్చు. చీకటి పడక ముందే యిక్కడి నుండి మీరు క్షేమంగా వెళ్ళ0డి. సెలవు.
- ఇద్దరు:- అయ్యా ఇక మీయిష్టం సెలవు - నమస్తే!
- (ఇద్దరూ వెళ్ళుదురు )
- సిద్ధా:- ఇక నేను ఈ అశ్వత్థవృక్షఛాయను వీడను. ఇంకెవ్వరిని ఆశ్రయింపను. నాసంశయములన్నీ తీరి పరిష్కార మిక్క డే లభించవలె. ఇకనాకు జలాన్నములతో పనిలేదు. ప్రాణము నిలువనిమ్ము లేక పోనిమ్ము. ఇక నేను లేచుటన్నది సంశయనివారణానంతరమే. ఏమిజరగనున్నదో జరగనిమ్ము. ఇదేనా దృఢ నిర్ణయము.
- (సిద్ధార్థుడు కళ్ళుమూసుకొని పద్మాసనంలో ధ్యానం మొదలు పెట్టును. అతనిపై కాసేపు కలర్స్ వీలు ద్వారా వెలుగులు వేసి వెమ్మదిగా మరలా రంగస్థలం ప్రశాంతతకు తేవాలి)
- సిద్ధా:- ఆహా.... ఒక ప్రశాంత వెలుగు క్రమేణా వ్యాపిస్తూ విశ్వమంతా క్రమ్మేస్తున్నది. ఆ వెలుగులో నన్నునేను కోల్పోతున్నాను. నే నెక్కడున్నానో నాకు తెలియరావడం లేదు. ఆ వెలుగులో నేను లీనమై పోయాను. నా ఉనికిని నేనుకోల్పోయాను. నేను వెలుగును. వెలుగేనేను. నాకుగల సందేహములన్నీ విచ్చిపోతున్నాయి. దుఃఖమూలం తెలియవచ్చింది. దుఃఖవ్యాప్తి దుఃఖాంతం కూడా నాకు తేట తెల్లమయింది. ఈ సమస్తవిశ్వం నా యె దుట తెరచిన గ్రం థమైంది ఏదో శబ్దం హృద్యంగా వినబడుతూవుంది. బుద్ధంశరణం గచ్చామి. సంఘంశరణం గచ్చామి. ధర్మంశరణంగచ్చామి.... నేను బుద్ధుడ నయ్యాను. బుద్ధత్వం నాకు ప్రసాదింపబడింది.
- (బుద్ధుడు లేచి నలువైపుల తేరిపార జూస్తాడు రెండడుగులు ముందుకు వేసి స్టిల్ అయిపోతాడు) (ఆకాశ వాణి వినబడు తుంది)
- దివ్యరూపము నందిన తేజమీవు
- ప్రాణరూపివి. నిర్వాణ పదవి వీవు
- ఈ విశ్వమున కిక నీవె శరణు
- భవ్య భవదీయ జ్యోతి ప్రభావ మందు
- లోకమందలి తిమిర మంతమ్ము గానిమ్ము
- నీ పాదరజవహ్నిచే భస్మపటలమ్ము-
- జేయుము మాలిన్యములను
- భ్రమల తొలగించి సత్యమ్ము
- సాక్షాత్కరింప జేయుము -
- నీ విపుడు నిజమైన సిద్ధార్థునివి. అర్థించిన వెల్ల సిద్ధించు కొన్నవాడవు. సర్వార్థసిద్ధివి. నేటినుండి బుద్ధుడవు నీవు బుద్ధుడవు బుద్ధుడవు బుద్ధుడవు.... ఇకనీ యవతార కార్యక్రమము ప్రారంభించుటకు సమయ మాసన్నమైనది. పద, పద అడుగు ముందుకేయి. (అడుగులు చిన్నగా ముందుకేస్తూ స్టిల్)
- 6వ రంగం
- (సార్ నాద్ లోని ఒక ఉద్యానవనము)
- (బుద్ధుడు అరుగు పై కూర్చొని వుండును. మహానామ కొండన్న ప్రవేశం)
- కొండన్న:- మహాశయా మీరు వచ్చేశారా...
- మహానామ:- మిమ్మల్ని ఆనాడు అరణ్యంలో వదలి వచ్చిన నాటి నుండి మీరేమైపోయారోనని మనస్సు కలవర పడుతూనే వుండింది.
- కొండన్న:- ఏమిటలా ఉన్నారు.
- మహా:- అరె...ముఖముపై కాంతి తాండవిస్తున్నది.
- కొండ:- ఔను మీలో చాలామార్పు కనబడుతున్నది. ఆ గంభీరత ఆప్రసన్నత. ఆ నిస్సంశయ జ్ఞాన ముద్ర... అంతాక్రొత్తగావుంది.
- బుద్ధు:- ఔను మిత్రులారా... తదాగతుడు బుద్ధుడైనాడు. ఇక నన్ను బుద్ధుడని పిలవండి. నాతపస్సు ఫలించింది. జ్ఞానోదయమైంది. ఇక నా ద్వారా లోకము మే ల్కొన వలసి వుంది. మీరు నావెంట నడవండి. లోకోద్ధరణలో పాలు పంచుకోండి. నే చేప్పేది శ్రద్ధగా వినండి.
- కొండ:- సిద్ధార్థా...కాదుకాదు బుద్ధదేవా! ఒక్క నిముషమాగండి అదిగో మా మిత్రులు బప్ప, బద్దియ, అస్సజి కూడా వస్తున్నారు. అందరం కలిసేవింటాం. అదిగో వారు మాటలోనే వచ్చేశారు. మిత్రులారా సుఖాసీనులు కండి. వీరు బుద్ధదేవులు. మనకు వారి తొలి బోధ వినిపిస్తారు సరిసరి అక్కడే కూర్చోండి. సావధానంగా విన్నాం.
- (అంటూ ఇద్దరు ఎదురుగా కూర్చొందురు)
- బుద్ధ:- బుద్ధం శరణంగచ్ఛామి - సంఘం శరణం గచ్ఛామి - ధర్మం శరణం గచ్ఛామి - నేను బోధించు మార్గము మధ్యమము. కఠిన తపోనియమయులతో దేహమును శుష్కింప జేసికొని తపించి పోవుట కాదు. భోగలాలసత్వంతో విచ్చలవిడిగా సంచరించుటాకాదు. సమత్వబుద్ధితో శుద్ధమై నిర్వాణపదము నందుకొన వలసి యున్నది. ఉప వాసములు శరీరమును క్రుంగదీయును మానసమును అల్లకల్లోలము జేయును. లౌకిక జ్ఞానము నొసగుటకు కూడా ఉపవాసములు శక్తి వంత ములు కావు వాటివల్ల ఇంద్రియములు వశమగుటకల్ల. నూనెకు బదులు నీటితో దీపము వెలిగించ యత్నించువాడు చీకటిని పారద్రోల జాలడు. స్వాభావిక మైనకోరికలు నిర్వర్తింపబడుట సమంజసమే. తగని కోరికలే దుఃఖమూలము - జీవితావసరములను తృప్తి పరచుకొనుట దోషము కాదు. శరీరము నారోగ్యముగా నుంచుకొనుట మనవిధి. అనారోగ్యము సచ్చింతనకు ఆటకంకము...
- (లైట్స్ ఆఫ్ అండ్ ఆన్)
- (వెనుక స్క్రీన్ మాత్రం మారుతుంది వెనుక ఒక ఆరామం స్క్రీన్ వుంటుంది)
- బుద్ధు:- సహచరులారా ... ఈప్రపంచమే దుఃఖమయం. దీని నధిగమించుటకు ఈ బుద్ధుని మధ్యమమార్గమే శరణ్యము.
- కం: కలదిల దుఃఖమవశ్యము
- కలదా దుఃఖము నకుగల కారణమెన్నన్
- కలదంతము దుఃఖమునకు
- కలగాదిది వాస్తవమ్ము కనుడీ నిజమున్.
- మానవుని లోని తగనికోరికలే దుఃఖమునకు మూలమని గ్రహించండి.
- కొండ:- మహాత్మా మీ బోధనలలో అప్పుడప్పుడూ నిర్వాణము, నిబ్బనము అనుచున్నారు. వాటి అర్థమేమిటో తెలియజేయండి.
- బుద్ధు:- అవి సాధకుడు సత్యాన్వేషణ చేస్తూ అందుకొనే ఉన్నతోన్నత స్థితులు. వివరించడానికి వీలునేనివి. అనుభవపూర్వకముగా అస్థితులను అందుకొని ఆనందించ దగ్గవి. ఎవరి నిర్వాణమునకై వారే తపించవలసియున్నది. గురువులు మహాత్ములు సాధకునికి సహాయ పడగలరేకాని అట్టి స్థితులను చేతికందించినంత సులువుగా కలుగ జేయలేరు తపనతప్పదు.
- (ఇంతలో ఒక మనిషి బాధతో మూలుగుతున్న శబ్దం వినవస్తుంది)
- బుద్ధు:- ఎవరో బాధతో రోదిస్తున్నారు. ఆవైపు వెళ్ళిగమనించండి.
- మహా:- అవును ఎవరిదో రోదనము వినిపిస్తున్నది (అంటూ కొండన్నతో కలిసి వెళ్ళి ఒక మనిషిని బలవంతంగా నడిపించు కొంటూ వస్తారు)
- బుద్ధు:- అయ్యో ఒంటినిండా దెబ్బలతో బాధపడుతున్నావు... అరుగు మీద పడుకో (అంటూ చేయి ప ట్టి సహాయంచేయబోవును)
- కన్నడు:- అయ్యో వద్దుస్వామి...నేనంటరాని వాన్ని... మీరు స్వాములు పెద్దలు నన్ను తగలకండి.
- బుద్ధ:- ఈ ఆరామంలో ఆనియమాలేవీ లేవు. ఇక్కడ అందరూ సమానం. ఇతన్ని అరుగుపై శయనింప జేసి గాయములు శుభ్రం చేయండి నేను ఆకుపసరు సమకూరుస్తాను (అంటూ వెళ్ళును)
- (ఇద్దరు శిష్యులు తమబుర్రలోని నీళ్ళతో జోలెలోని పాతగడ్డలతో గాయాలు శుభ్రంచేస్తారు. బుద్ధుడు యింతలో ఒక మట్టికప్పులో ఆకుపసరు తెచ్చి గాయాలకు రాస్తాడు. శిష్యులు కట్టుకట్టి నీళ్ళుతాపి. అటుకులిచ్చి తినమంటారు. కన్నడు కాస్తా సేదదీరుతాడు)
- కన్నడు:- అయ్యా మీరు చూస్తేదేవతల్లా ఉన్నారు. ఇది దేవలోకం లావుంది. ఒక అంటరాని వాన్ని అక్కునజేర్చుకొని సేవలు చేసి బాధ బాపినారు. దండాలు స్వాములూ దండాలు.
- బుద్ధుడు:- ఇప్పుడెలావుంది.
- కన్నడు:- స్వామీ తమరిచేయి తగలగానే నొప్పులన్నీ మంత్రం వేసినట్లు తగ్గిపోయాయి. ఇప్పుడు కాస్తాబాగుంది.
- బుద్ధు:- సరే...మంచిది...నీకీదెబ్బలెలా తగిలాయి. నీవీయవస్థకు రావడానికి కారణమేమి? చెప్పు - నీకేంభయంలేదు. వివరంగాచెప్పు.
- కన్నడు:- స్వామీ నా యీ అవస్థకు నేనేకారణం మరెవరోకాదు. తప్పు చేశాను. దండించారు.
- బుద్ధు:- ఏమితప్పుచేచావు? ఎవరు దండించారు? కాస్తావివరంగా చెప్పు.
- కన్న:- ప్రొద్దున్నే కొండకు కట్టెలకు బోయా. ఎండు కట్టెలేరుకొని కట్టగట్టుకొని, కట్టనెత్తిన బెట్టుకొని తొందర తొందరగా ఊళ్ళోకొచ్చా. పొద్దుగులుగా కట్టెలమ్ముకొని ఇన్నినూకలు కొనుక్కొని తొందరగా యింటికి బోదామని ఊరివీధుల్లోకొచ్చేశా. ఆతొందరలో కాలిచెప్పులు చేతబట్టు కోవడం మరిచిపోయా అట్టే కాళ్ళకేసుకొని పెద్దోళ్ళ ఈదిలో నడిశా. ఇంకేముంది పెద్దోళ్ళకు కోపమొచ్చింది. చితకబాది ఊరవతలికి ఈడ్చేసినారు. క్రిందా మీద బడుతూ ఈ డి కొచ్చి సొమ్మసిల్లి పడిపోయినా మెలకవచ్చి మూలుగుతా వుంటే. మీ రొచ్చి కాపాడినారు. తప్పునాదే స్వామీ - దండాలు.
- బుద్దు:- చూచితిరా మిత్రులారా? ఈ అమాయకుడు చేసిన తప్పిసుమంతైనా గలదా? వీధి అందరికదా. కట్టెలు వారి కోసమేగదా అమ్మబోయాడు. అటువంటప్పుడు తన పాదరక్షలు తనకాళ్ళకు వేసుకోవడం నడవడం తప్పా.
- కొండ:- ఔను. అదెలా తప్పవుతుంది.
- బుద్ధు:- నిజంగా తప్పేకాదు. కానీ తప్పని ఈ అమాయకుడే స్వతహాగా ఒప్పుకొంటున్నాడు.
- మహా:- అవును మాహాత్మా ఈ సంఘం అంటరాని వాడనే ముద్రవేసి కొందర్ని హింసిస్తున్నది.
- బుద్దు:- అంటరాని వాడని అగ్రకులస్తుడని సంఘ0 యిలా మనిషిని మనిషిని విడదీసి అల్పుని బలహీనుని హింసిస్తున్నది. చూశారుగా అల్పుడైనా ఈ మిత్రుని చేతనే చేయని తప్పును తప్పుగా అంగీకరించేట్లు చేసింది. ఔరా ఎంత పతనావస్థకు చేరిందీ సంఘం.
- ఆ:వె: గొప్పవార మనుచు కూరిమి విడనాడి
- ప రు ల నీచులనుచు పలుకు నా డె
- మనుజుడొందు నఘము మనుగడయును చెడు
- ఫలితమేమి లేక పతన మొందు.
- మాహానామ:- నిజము మాహాత్మా.
- ఆ:వె: అల్పుడ నని యెంచి అణకువ జూపించి
- బాధ పెట్టినట్టి వారినైన
- ఎదిరి దిట్టనట్టి ఈతండె ఘనుడౌను
- కఠిను లెవుడు గారు ఖచ్చితముగ.
- కొండ:- లెస్స బల్కితివి మిత్రమా నీ వన్నది అక్షరాలా నిజం.
- బుద్ధ:- మిత్రులారా మనమిక మెండుగా జనంలోకి చొచ్చుకొని వెళ్ళవలె దీనుల దరి జేర్చుకొనవలె. బోధల ద్వారా గొప్పవారమనుకొను వారిలో మార్పు తీసుకొని రావలె. సంఘాన్ని సంస్కరించవలె. ఇదిగో ఈ దీనుని స్వస్తత తర్వాత మన పయనమారంభిద్దాం. సిద్ధంగా వుండండి.
- కొండ:- ఇంతవరకు మహాత్ముల వెతుక్కుంటు జిజ్ఞాసులు వచ్చి గురువుల సేవించి తరించిన వారేగానీ. ఇలా మహాత్ములే వెతుక్కుంటూ సామాన్య జనంలోకి వెళ్ళడం నేను కనీ వినీ ఎరుగను.
- మ: తమమోక్ష0బునకై తపించి గురుపాదాబ్జమ్ములన్ కొల్వనెం
- చిమహారణ్యములందు నిల్చి సుజనుల్ చింతించి గుర్వాజ్ఞ పై
- సమబుద్ధిన్నిడి. సేవజేసి మనుచున్ సంసిద్ధి సాయుజ్యమున్
- సముపార్జించిరిగాని యిట్లు మునులే సామాన్యులన్ జేరిరే.
- మహా:- ఇది అసమాన్యము భావితరాలకిది మార్గదర్శకము.
- బుద్ధు:- ఔను కాలాను గుణమైన మార్పుయిది. బోధకులే జన సమూహము లోని కెళ్ళవలసిన సమయమిది. బుద్ధంశరణం
- గచ్చామి - సంఘంశరణం గచ్చామి - ధర్మంశరణం గచ్చామి.
- (తెరవ్రాలును)
- 7వ రంగం
- (రాజాంతఃపురం - రాజు ఆసవం సేవిస్తూ నృత్యం తిలకిస్తూవుండును)
- పాట - ౩
- సరిరారు నీ కెవ్వరూ - ఓ రాజ శిఖామణి
- సరిరారు నీ కెవ్వరూ -
- మీసమ్ము మెలివేసి - నిలిచి చూచిన యంత
- గుండె లదరగ పారి - పోయేరు నీ యరులు
- కన్నులెఱ్ఱగ జేసి - ఖడ్గమ్ముఝుళిపించ
- ఇం ద్రుం డైనను జడిసి - దాసోహ మని యేను --- సరికారు!!
- కన్నుగీటినచాలు - కమలాక్షులా ఎడద
- రతినాథు తూపుల -కెఱగాకమానదు
- సరస శృంగారముల - సౌందర్యగరిమల
- తారాప్రియుడైననీ - సమ ఉజ్జికాలేడు --- సరికారు!!
- శూరత్వమున నీవె - శృంగార ముమనమీవె
- ఖర ఖడ్గమును ద్రిప్ప - సుమశరము సంధింప
- సమమైన నీప్రతిభ - స్తుతిపాత్ర మౌగాదె
- రారా తడయగ నేల - రమ్మందిరా జాణ --- సరిరారు!!
- రారా.... తడయగ నేలరా .... రా (అంటూ చేయి పట్టిలాగుతుంది రాజు లేవడు)
- నర్తకి:- మహారాజా ఈ రోజెందు చేతనో మీరు ముబావంగా ఉన్నారు. కారణం తెలుసుకోవచ్చా.
- బిందుసారుడు:- అంబాపాలీ నీ వన్నట్లు నేను శత్రురాజులకు సింహ స్వప్నాన్నే - నీ వంటి రసికరాణులకు మన్మథున్నే కానీ ఈ మధ్యయొక చిత్రమైన చిక్కొచ్చిపడింది. ఎవరో బుధ్ధుడట సన్యాసి వలె నున్నాడట. ఏవేవోతనకు తోచిన క్రొత్త బోధలు చేస్తున్నాడట.
- నర్తకి:- చేసుకొన నివ్వం డి. వారి బోధలవల్ల మీ కొచ్చిన నష్టమేమి గలదు.
- బిందుసార:- అంతమాత్రమున కతడాగిన మనకొచ్చిన చిక్కేమీ లేదు. కానీ అతడు యజ్ఞయాగాదులను వ్యతిరేకించు చున్నాడు.
- ఉ: జన్నము సేయువేళల అజమ్ముల నగ్నికి నాహుతియ్యతా
- మున్నుగ వచ్చి యాగమును ముందుకుసాగగ నీక ఆడ్డమై
- క్రన్నన కార్యమున్ జెరచి క్రాలగ జేయుచు నున్నయాతనిన్
- మన్నన జేయుటెట్లు మరి మౌనిని దండితు జేయుటెట్లొకో.
- యని డోలాయమాన మనస్కుడనై యున్నాను. మరి యాజకు లేమో అతనిపై చర్య గై కొనుమని ఒత్తిడి చేయుచున్నారు, మేమిక యజ్ఞములు చేయుటెట్లని. మేము యజ్ఞములు మానితే మీకుపరలోక గతులుండవని భ్రష్టులమై పోదుమని కఠినముగా మాట్లాడుచున్నారు. మరి అటుచూస్తే ఓ సాత్వికుడైన బోధకుడు అతన్నెలా దండించాలో తెలియడం లేదు.
- నర్తకి:- మాహారాజ ... మేమును ఆబోధకున్ని గురించి వింటిమి. అంతేగాదు ఆ మహనీయు డెవరో నాకు తెలుసు.
- తే:గీ: రాజ వంశీయు డతడు విరాగియగుచు
- కపిలవస్తు రాజ్యము వీడి విపిన మందు
- తపము లొనరించి బుద్ధుడై ధాత్రియందు
- బోధగావించి ప్రజకు సద్భుద్ధి గరుపు.
- నేను నాట్యరంగమున అడుగడిన తొలిదినములలో కపిలవస్తు రాజనగరులో ఈ రాకుమారుని విరక్తిని నివారించు నిమిత్తం నా నాట్యపదర్శ న ఏర్పాటు చేయడం జరిగింది. మా నాట్యము, అందాలరాసి యైన ఆయనభార్య, బోసినవ్వుల చిన్నికుమారుడు, రాజ్యాధికారము, సంపదలు యివేవి అతన్ని నిలువరించ లేక పోయాయి. అతడు తపస్సుచేసి బుద్దుడైనాడు. అతడు సామాన్యుడుకాడు. అతనిబోధలు వినదగ్గవి మహారాజ.
- బిందు:- అహా! అతడంతటి త్యాగధనుడా! ఏమైననేమి. విషయ మెఱుంగుటకు అతనిని మాసమక్షమునకు రమ్మంటిమి. ఆతడీదిన మే మమ్ముకలియుటకు రానున్నాడు. అందుకే అతడేమి చెప్పునో నేనెట్లు నచ్చజెప్పవలెనో నను ఆలోచనలోనుంటిని.
- భటుడు:- (బయటినుండి) ప్రభూ ఎవరోబుద్ధుడట మీదర్శన మభిలషిస్తున్నాడు.
- బిందు:- అవస్యము - ప్రవేశము కల్పించండి.
- నర్తకి:- ప్రభూ ... నేనా తెరచాటునుండి ఆ మహాత్ముని దర్శించుకొనెద అనుమతించండి.
- బిందు:- అందుల కభ్యంతరమేమున్నది. అవస్యము దర్శించుకొమ్ము.
- బుద్ధు:- (ప్రవేశిస్తూ) స్వస్తి.
- బిందు:- ప్రణామములు - బుద్ధదేవా! దయచేసి ఆసనాన్నలంకరించండి. (ఆసనము చూపును) మహానుభావా! మిమ్ములను చూస్తే అత్యంత సాత్వికులుగా తోచుచున్నారు. మీ ముఖమండలము తేజోమయమై విరాజిల్లుతున్నది. మరి తమరు యజ్ఞయాగాదులను ప్రోత్సహించ వలసినది పోయి ఇట్లేల వ్యతిరేకించుచున్నారు.
- బుద్ధ:- రాజా...నేనొక్కమాట మిమ్ముల నడుగ వచ్చునా?
- బిందు:- అవస్యం నిరభ్యంతరంగా అడగండి.
- బుద్ధ:- ఈ యజ్ఞయాగాదులు మీరెందుకు చేస్తున్నారు.
- బిందు:- ఉత్తమలోక ప్రాప్తికి . మోక్షము సాధింధిటకు. అంతేగాదు ఇంద్రుడు సంతసించి వర్షములు కురిపించుటకు. కరువుకాటకములు లేక రాజ్యము సుబిక్షముగ నుండుటకు.
- బుద్ధ:- మహారాజ ... ప్రపంచమున జనులు కష్టములకు గురియై దుఃఖపూరితులై యుండుట గమనించ లేదా,
- బిందు:- ఎందుకు గమనించలేదు గమనించియేగదా ఈ యజ్ఞయాగములు జేయించున్నది.
- బుద్ధ:- మీ కన్నుల ఎదుట దుఃఖపూరితమైన ప్రపంచము ఇంత స్పష్టముగా కనబడుచుండగా దీని కతీతముగా మరొక లోక మున్న దనుటకు మనకే మధికారము గలదు. ఖాద్యవస్తువులనేకములు అగ్నిలో దహించివేసి ప్రజల కాకలితీరుననుట ఎంత సమంజసము. అంతేగాక నోరులేని మూగజీవుల నవరంధ్రములు బిగబట్టిచంపి అగ్నిలో కాల్చుట పాపహేతువుకాని పుణ్యప్రదమని యెట్లుచెప్పగలము. ఒక్క జంతువు నైనా నేనిక అగ్నిలో పడనీయను. కాదు కూడదనిన ముందు నన్నుయాగ పశువును చేసిచంపుడు. ఆ తర్వాత ఈ హింస కొనసాగించుడు.
- ఉ: జన్నము లంచు చేయు వధ చాలిక ఆపదబాపుడన్నయే
- అన్నెము పున్నెమున్ యెరుగదాపశుజాలము మానవత్వమే
- యెన్నగ మిన్న మోక్షమని యివ్విధి హింసకు బూనవచ్చునే.
- విన్నప మేనుసేతు దయవీడకు డన్న మనంబునందునన్.
- ఇక మోక్షమందురా అదెక్కడగలదు. అనేకములైన వ్యసనములకు బానిసలై చరించుచున్న మానవులకు వాటినుండి బయటపడుటే మోక్షము. వాస్తము మీ ఎరుక లోనికి వచ్చి మాయవీడుటే మోక్షము.
- ఉ: ఎక్కడి మోక్షమయ్య నిక నెవ్విధి గల్గును భూజనాళి కిం
- పెక్కువ గల్గెహింస నెడ యెన్నివిధంబుల నెంచిజూచినన్
- నిక్కము జీవకోటినెడ నిర్దయ మోక్షపు జాడబోదుయిం
- పెక్కగ సద్గుణమ్ములిక నేర్పడ బెంచి శుభంబులొందుడీ.
- నర్తకి:- (ప్రవేశించి) మహాత్మా క్షమింపుడు. (కాళ్ళమీదపడును) మీ బోధలన్ని చాటునుండి వింటున్నాను. నన్ననుగ్రహించండి. నాశేష జీవితం మీ మార్గంలో పయనించుటకు అనుమతించండి.
- బుద్ధు:- నర్తకీ మణీ...నీ విద్య జనసమ్మతము. అలసట జెందిన రాజున కింత ఆహ్లాదము కలిగించి తిరిగి అతడు నూతనోత్సాహముతో ప్రజోపకార కార్యములందు నిమగ్న మగుటకు సహరించవలె కానీ రాజును వ్యసనపరుని, అధర్మ వర్తనునిగా మార్చుటకు కాదు. కళలవల్లను ధర్మము సంస్థాపించ వచ్చును. అదిగుర్తె రిగి నీవును నీ కళను కొనసాగిస్తూ మా మార్గమనుసరింప వచ్చును. నీవనుగ్రహింప బడినదానవు. మాబోధనలను కళాత్మకముగా వ్యాపింప జేయుము. నీకు శుభమగును.
- నర్తకి:- మహాప్రసాదము.
- బిందు:- బుద్ధదేవా మీదర్శన భాగ్యమున నాకు కనువిప్పు గల్గినది. నాలో యేదో అలౌకికానందము పొడసూవుచున్నది ఈ ప్రదేశమంతయు ఏదో కాంతితోనిండి నట్లనిపించుచిన్నది. నాకీ రాజ్యసంపదల మీద విరక్తి కలుగుచున్నది. నన్ననుగ్రహించి మీవెంట నడువనివ్వండి.
- బుద్ధ:- మహారాజా - లోకము లోని వారందరూ సన్యసించవలసిన పనిలేదు. అసలు సన్యాసమనునది ఒక మాననిక స్థితి. అట్టి గొప్పస్థితి నీకనుగ్రహింపబడినది. ఇక నీవు రాజ్యాధి నేతవైకూడా సన్యాసివే. నిన్నీప్రాపంచిక భోగములు ఆకర్షింప జాలవు. నామార్గము ననుసరిస్తూ పరిపాలన సాగించు- దీక్షగైకొనుటకు మా ఆరామమునొకసారి దర్శించు.
- బిందు:- చిత్తము మీ ఆదేశము మాకు శిరోధార్యము.
- బుద్ధ:- మాకిక సెలవు వెళ్ళివచ్చెదము.
- బిందు:- దేవా...మమ్ము మన్నించి మా ఆతి థ్యాన్ని స్వీకరించండి మీ అనుచరగణంతో ఈనాడు మాయింట బిక్ష స్వీకరించండి. మమ్మా
- శీర్వదించండి. (నమస్కరించును)
- బుధ్ధు:- మేము మీయెడల ప్రసన్నుల మైతిమి. మీ కోరికప్రకారమే మీయింట బిక్ష తప్పక స్వీకరింతుము, తదాస్తూ!
- (తెరవాలును)
- 8వ రంగం
- (అడవి - అంగుళీమాలుడు ప్రవేశం)
- అంగుళీమాలుడు:- ఈ అంగుళీమాలుడు దూర్తుడు, దుర్మార్గుడా. ఈ కోసల ప్రజలు మాత్రము సత్యసంధులా? (నవ్వి) ఈ కోసల వాసుల గోడు విని రాజు నన్ను బంధించునట, శిక్షించునట. ఏమని బంధించును ఎందుకు బంధించును ఎట్లుబంధించును. బంధించ దలచిన మొదట నేనిట్లు క్రూరుడగుటకు కారణభూతులైన గురుకుల వాసులను మొదట బంధించి శి క్షించమనుము. తర్వాత నావిషయ మాలోచించ వచ్చును. నే నెట్లుదోషి నగుదును. తక్షశిల గురుకులంలో సక్రమంగా విద్య నభ్య సిస్తున్న నన్ను, గురువు చెప్పుడు మాటలువిని మధ్యలోనే విద్యముగించి వెళ్ళిపొమ్మంటారా! అంతటితో వదలక గురుదక్షిణగా వెయ్యిమంది చిటికెన వేళ్ళు సమర్పించమని ఆజ్ఞాపిస్తారా? మరినేను క్రూరున్ని హంతకున్ని కాకుంటే ఎలా గురుదక్షిణ చెల్లించగను. వేళ్ళుకత్తిరిస్తూ కూకుంటే నన్ను కోసల నగరవాసులు భరిస్తారా? మన్నిస్తారా? మరినేను దోపిడీదొంగను కాకుండా ఎలా, ఎలా బ్రతకగలను. ఎవరాలోచిస్తారిదంతా?
- మాతండ్రిగారు కోసల రాజపురోహితులు. నాకు అహింసకుడని పేరు
- పె ట్టారు. గురుకులంలో చేర్పించారు. అందరి కంటే చురుగ్గావుండి చెప్పినపాఠాలు చెప్పినట్లు నేర్చుకొన్నాను. గురువులు, గురుపత్నినన్ను ఎంతగానో ప్రేమతో ఆదరించారు. (నవ్వి) ఇదినా సహాధ్యాయులలో ఈర్షరేకెత్తించింది. వారునన్ను...
- ఆ:వె: తల్లిసమయగు గురుదార మరగినాడు
- తులువ అధము దితడు దూర్తుడనుచు
- కాని పోనివెన్నొ కల్పనల్ గావింప
- గురుడు నమ్మి నన్ను తరిమివైచె.
- ఇట్టిపరిస్థితులలో ఇక నేనేమిసేతును. ధర్మాధర్మాముల లోతుగా విచారించువారెవరు? అటు గురుకులమే కాదు తల్లిదండ్రులు పురవాసులు ఒక్కరేమిటి అందరూ నన్నసహ్యించు కొన్నారు. బహిష్కరించారు. ఇక నేను గజదొంగను గాక యేమౌతాను. కానిమ్ము యిప్పటికి 999 వ్రేళ్లుత్రెంచినాను. ఇక మిగిలిన ఆ ఒక్కటి కూడా సేకరించి గురుదక్షిణ చెల్లించి అప్పుడు చూపిస్తాను నాఅసలు ప్రతాపం.
- ఉ: దోసము లేని నన్ను కడు దూర్తుడ నంచు బ హిష్కరించి నా
- గ్రాసము లాగి వైచి నను కారడవిం చరియింపనెట్టిరీ
- కోసలదేశవాసు లిక క్రూరత వీరిని జంప కుందునే
- కోసల రాజు నన్నెదిరి కూలగ జేయసమర్థు డౌనకో.
- అదియును చూచెదగాక అతడేమో నన్ను కట్టెద కొట్టెద చంపెదనని బీరములు పల్కుచున్నాడట వెర్రివాడు. నన్నువాడేమి చేయును. ఇకనాభవితను సర్వనాశ మొనరించిన ఆ తక్షశిల గురుకులాన్ని సర్వనాశనం చేసేవరకు నిద్రపోను. వెయ్యివేళ్ళు సమర్పించి గురుఋణం తీర్చడ మాలస్యం. తక్షణం వారు చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరుతారు.
- కం: మన్నించ నొకని నైనన్
- క్రన్ననకారించి పట్టి కసిదీరంగన్
- నన్నిట్టిదశకు దెచ్చిన
- నన్నీచులగు గురుశిష్యులందర గూల్తున్.
- (బుద్ధంశరణం గచ్ఛామి - సంఘం శరణం గచ్ఛామి - బుద్ధం శరణం గచ్ఛామి అన్న శబ్ధం వినబడుతుంది) ఎవరో సాధువు వలెమన్నాడు. ఓరే సన్యాసి నిలు నిలు లేదంటే చస్తావు. ( అని ఆ వైపుకు పరుగెత్తినా పట్టుకొనలేక పోయాడు. ఇంతలో బుద్ధుడు అంగుళీమాలుని వెనుకకు వచ్చినిల బడతాడు)
- బుద్ధ:- అంగుళీమాలా నేను నిలచి చాలా సేపై నది. ఇక నీవే నిలిచి ఆలోచించ వలసి యున్నది.
- అంగుళి:- (వళ్ళుజలదరింపంగా) ఎవరు నీవు...నే..నే..నెవరో తెలుసా.
- బుద్ధ:- నిన్నెరుగని వారుందురా అంగుళీమాలా! నేను బుద్ధుడను నిన్ను కలుసు కోడానికేవచ్చాను.
- అంగుళి:- ఇప్పుడు నేను చూస్తుండగానే అంత జోరుగా నా కందకుండా నడిచి పోతున్నావ్. కానీ నిలిచి చాలా సేపయిందంటున్నావ్. ఏమిటి నీ మాట కేమైనా అర్థపర్థం ఉందా?
- బుద్ధ:- అంగుళీ! నేను హింసామార్గమున నడువక నిలచి చాలా కాలమే యైనది. మరినీవూ నిలువ వలెగదా!
- అంగుళి:- ఓహో మాటల చమత్కారివే. నే నెవరో తెలిపి భయం లేక నాకెదురు పడ్డావంటే సాహసివే.
- బుద్ధ:- నాకెందుకు భయం నేను సన్యాసిని నాదగ్గరే ముందని దోచుకుంటావ్.
- అంగుళి:- వేలుందికదా.
- బుద్ఢ:- ఏమిటి నీ వెర్రి జనుల వేళ్ళు గొంపోయి నినుదిట్టిన గురువు కిచ్చుట అంతముఖ్యమా ... అతడు గురువు నీదొక ఋణము. చాలు చాలిక ఈ హింస.
- అంగుళీ:- ఇవన్నీ నీకెలా తెలుసు.
- బుద్ధ:- నీలోనీవు మదన పడుట, కక్షసాధింతునని ఉ ద్రి క్తుడవగుట, అంతయు వింటిని.
- అంగుళి:- వింటివిగదా? మరినేను గజదొంగ నగుటకు నేను కాదు గదా కారణము.
- బుద్ధ:- ఔను...నీవుపల్కినది అక్షరాలానిజము. నీవనుకొన్నట్లు సంఘమే నిన్నిట్లుగావించినది. కానీ....
- అంగుళి:- కానీ యేమిటి... వాస్తవ మదేకదా!
- బుద్ధ:- కానీ ఆ సంఘమే నిన్ను తిరిగి రక్షించ వలసి యున్నది.
- అంగుళి:- ఏమి... ఈసంఘము. ఈ కోసలవాసులు నన్నురక్షింతురా? (నవ్వి) సన్యాసీ - నాతో పరాచకకములా? నేనన్నవారు వణికి పోదురు.
- బుద్ధ:- అంగుళీ ... నీవు శక్తిమంతుడవే - కోసలరాజు కూడా నిన్నేమి చేయలేడు - నిజమే కానీ.
- ఆ: జరరుజ మరణంబు జనులకు సహజము
- వయసు పైబడంగ వంగి పో యి
- వ్యాధి బాధల బడి వణకుచు కదలంగ
- వీధి కుక్కలైన వెంట బడవె.
- కనుక అంగుళీమాలా నీ ఈ బలపౌరుషములు. శక్తియుక్తులు శాశ్వతములు గావు. క్షీణదశ తప్పదు. అప్పుడీ సంఘమే శరణ్యము. ఏ సంఘము నిన్ను త్రోసి పుచ్చినదో ఆ సంఘమే నిన్ను తప్పకాదరిస్తుంది.
- క0: కలతల్ గల్గిన మనుజుల
- నిలసరిజేయగ వెలసెను యింపగు సుగుణం
- ఋలకిరవగు సహకారము-
- గలసంఘము . రమ్మచటికి కాదన కిపుడున్.
- అంగుళి:- మహాత్మా .... యింతవరకు
- తే:గీ: నన్ను చూచిన మాత్రాన వెన్నుచూపి
- జనులు పారిపోయిరిగాని మనసు విప్పి
- యిట్లుమాట్లాడు సాహస మెవరుగాని
- చెయ్యలేదిప్పుదిడియేమొ నయ్యెనాకు.
- ఎప్పుడుగాని గద్దించి హింసించి దోచుకొనుటేగాని ఒకరి మాట విన నిచ్చిగించి ఎరుగని నేను మీమాట వినుటకు మనసంగీకరించు చున్నది. మీ మాటలు మంత్రములై నాలో యేదో ఒక ప్రశాంతస్థితిని నెలకొల్పు చున్నది. మీ మాటలు నిత్యసత్యములని నా హృదయము నినదించు చున్నది. ఏదోదివ్య కాంతి నన్నావరించినట్లున్నది. నాగురుదక్షిణ. నాపంతము అంతయు అవివేకములని తోచుచున్నవి. మహాత్మా యే మంటిరి... సంఘమునన్ను అంగీకరించు ననియా అంటిరి.
- బుద్ధ:- ఔను...తప్పక అంగీకరించును. పద...నావెంట నడువుము.
- అంగుళి:- మీ ఆజ్ఞశిరోధార్యము - (ఇద్దరూ బయటకు నడుస్తారు) [ బుద్ధం శరణం గచ్ఛామి - సంఘం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి]
- (స్టేజి క్రమేణ చీకటౌతుంది - ఇలా జరుగుతుండగా నేప థ్యవ్యా ఖ్యానం వినబడుతుంది)
- ఇది బుద్ధదేవుడు నడయాడిన భూమి. ఇచ్చటి అణువణువు పవిత్రమై దివ్యప్రకంపనలతో నిండి పోయినది. ఆ మహనీయుని తనువు సోకి గాలి మహత్తును హత్తుకొన్నది. ఇక్కడి క్రూరమృగములు సైతము సాత్వికతను సంతరించుకొని అల్పజీవుల నాదరించుచున్నవి. ఆహా ఏమి ఈ ప్రశాంతత ఏమిఈ దివ్యమధురానుభూతి. ఈ అంగుళీమాలుడే కాదు మరెంత క్రూరుడైనా ఇట్టే సాత్వికతను సంతరించుకోవలసిందే. అందుకు తిరుగులేదు. అదీ ఆయన మహాత్మ్యము.
- (తెరవాలును)
- 9వ రంగము
- (ఇల్లుసీన్ - బుద్ఢుడు తడిసి వుంటాడు. గాలి వాన హోరుతో రంగస్థలం కనబడుతుంది. ఆ హోరును అధిగ మిస్తూ. బుద్ధం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. ధర్మంశరణం గచ్ఛామి శబ్ధం వినబడుతుంది. బుద్ధుడు గోడవార నిలబడి వుంటాడు. ఇంటిలోపలినుండి ఒక మోతుబరి
- రైతుగొడుగు పట్టుకొని బయటకు వస్తాడు)
- రైతు:- ఎవరూ.. ఎవరక్కడ ( ముందుకువచ్చి చూస్తాడు)
- బుద్ధు:- నేను బుద్ధుడను - మా ఆరామము వెళ్ళునంతలో గాలీవాన ఉదృతమై నిలిచిపోతిని.
- రైతు:- ఓహో సన్యాసులా ... సన్యాసులకు మాయింట తావులేదు.
- బుద్ధు:- సన్యాసులకు మాత్రము మీరు తావివ్వరా? ఎందుకో?
- రైతు:- పని పాట మాని సోమరి పోతులై ఊరి మీదబడి తిరుగుచు కష్టించి రైతులు పండించిన ధాన్యమును వృధాగా తినివేయు సన్యాసులన్న నాకసహ్యము. మీరుభూమికి బరువని ఈ మహానందుని విశ్వాసము.
- బుద్ధ:- మహానందా మే మట్టివారముకాము.
- రైతు:- మీరెట్టివారో నా కనవసరము. మాయింట సన్యాసులకు తావులేదనుట మాత్రము స్పష్టము.
- బుద్ధ:- కానిమ్ము....నీ ఇచ్చవచ్చినట్లే కానిమ్ము.
- (పాట-4)
- రైతు:- పసుపు బట్ట కట్టినట్టి - పనిలేని సన్యాసి
- నాయింటనీకు లేదు - ఆవంతయైన చోటు.
- బుద్ధ:- సరి సరి ఓ పెద్డరైత - లేదులె ఇబ్బంది యేమి.
- నిలుతును నీ రేయి యిచటె - నీ వలమట పడవలదులె.
- రైతు:- ధాన్యమంత యిల్లుచేరె - పశువులు పాకలకు జేరె
- నీలిగగన ఘనాఘనమ - కురియుము నీ కడ్డులేదు. -/పసుపు/
- బుద్ధ:- నిగ్రహమున మననున్నది - దృఢమై నాహృదియున్నది
- నీలిగగన ఘనాఘనమ - కురియుము నీ కడ్డులేదు. /సరిసరి/-/
- రైతు:- నెగడు నిగిడి మండు చుండె - ప్రియసఖినాప్రక్కనుండె
- నీలిగగన ఘనాఘనమ - కురియుము నీ కడ్డులేదు./ పసుపు/
- బుద్ధు:- ఇంద్రియములు అదుపునుండె - చింత చీకు లేకుండె
- నీలిగగన ఘనాఘనమ - కురియుము నీకడ్డులేదు. - /సరిసరి!/
- [ఇంతలో పిడుగు శబ్దం. బుద్ధుడు పిడుగును తనచేతితో ఆవతలికి నెట్టివేసినట్లు చెయ్యినూపును. ఉరుములు మెరుపులు . ఇంటి నుండి ఏమండీ అన్నభార్యకేక. నాన్న నాన్న అన్న పిల్లల అరుపులు - ఆవుల దూడల అరుపులు - రైతు భయపడును.)
- బుద్ధ:- మహానందా అన్నీ కట్టుదిట్టంగా వున్నాయంటివి - ఇంతలో భయపడితివి. అభద్రతకు లోనైతివి - ఔరా కీడుశంకించటం మానలేకపోతివి గదా.
- రైదు:- నీకు భయమేయటం లేదా సన్యాసి.
- బుద్ధ:- సన్యాసిని నాకెందుకు భయం. మహాప్రళయం సంభవించినా ఈ తథాగతునకు వెరపు లేదు. పోతుందనే భయం, ఏరి కూర్చుకొన్నవానికి గాని సమాధాన పడినవానికి గాదుగదా! ఐనా పిడుగు అల్లంత దూరాన పడినదిలే. వెళ్ళి విశ్రమించు పో.
- రైతు:- స్వామీ... నన్ను క్షమించండి - తప్పయినది మన్నించండి లోనికి దయచేయండి.
- బుద్ధు:- మహానందా... నీవునూ అనుగ్రహింప బడిన నాడవే వర్షం తగ్గిపోయింది. మరొకసారి కలుసుకొందాం. వెళ్ళివచ్చెద. సెలవు.
- [బుద్ధం శరణం గచ్చామి - సంఘం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి. అనుశబ్దం వినపడు తుండగా]
- తెరవాలును-
- 10వ రంగం
- (బౌద్ధారామం . కన్నడు అహింసకుడు అరుగుపై ఉంటారు. ఇ0కా రెండుమూడు అరుగులుంటాయి. అహింసకునికి కట్లుకట్టి ఉంటారు)
- కన్నడు:- ఆహా అదృష్టము బాగుండి ఈ మహనీయుని పంచజేరాము. ఆనాడు పెద్దకులాలవాళ్ళునాకు మహోపకారమేచేశారు. లేకున్న ఈమహాత్ముని కరుణకు నోచుకొని యుండనుగదా!
- అంగుళి:- నీ వొక్కడివేగాదు. ఆయన ఆదరణ, సద్బోధ బడసి తమ నిర్వాణ పథము పై పురోగమించు చున్న వారెందరో కదా! నిన్న మన ఆరామంలో ఒక చిత్రమైన సంఘటన జరిగింది.
- కన్న:- ఔనా...నేను కన్గొనలేక పోయితిని గదా...ఏం చేద్దాం. ఇక్కడి కామడ దూరంలోని రెండు పల్లెల ప్రజలు ఘర్షణకు దిగిరి. వారి నెంత సమాధాన పరచినను ఫలితములేక పోయెను. వారికి తగవులాడు కొనుటే ముచ్చ టాయెను కాబోలు. ఒకరిపైనొకరు కత్తులు దూసుకొనిరి. పర్యవసానం 10 మంది దుర్మరణం 50 మందికి తీవ్రగాయాలు. నేను ఆ గాయపడిన వారికి లేపనములు రాసి కట్లుగట్టి అన్నపానీయములు సమకూర్చి బుద్ధిచెప్పి వచ్చుసరికి బాగా ప్రొద్దుపోయినది.
- అంగుళి:- మనమాట వినక. తగవులాడు కొన్నవారికి మనం చికిత్స చేయుటేమిటి.
- కన్నడు:- ఇదే మన బుద్ధదేవుని బోధలోని విశేషం. మనమాట బుద్ధదేవుని బోధ విననీ నినకపోనీ... మన సేవా వృత్తిని మాత్రం కర్తవ్యంగా నిర్వహించవలసిందే.
- ఆ: మంచి మాటలాడి మనసుల సరిదిద్ది
- శాంతి నిలుప వలయు సంఘ మందు
- వినక చెడిన వారి వేదనలను గూడ
- బాపవలయు మనము కోపపడక.
- అంగుళి:- ఆహా ఎంత ఓర్పు... ఎంతసహనము. బుద్ధదేవుని బోధ అందుకే అసమాన్యము.
- కన్న:- అహింసకా నేనులేని సమయంలో ఏదో చిత్రము జరిగిందన్నావ్.
- అంగుళి:- ఔను నిన్న ఒక వృద్ధురాలి కొడుకు పాము కరచి చనిపోయి నాడు. ఆమెకు వాడొక్కడే కొడుకు. అన్నిటికి వాడే దిక్కట. శవాన్ని బుద్ధభగవానుని దగ్గరకు తెచ్చి ఆమె కన్నీరు మున్నీరుగా రోదించింది. బ్రతికించమని బ్రతిమలాడింది.
- కన్న: ఆ ... అప్పుడేయయింది.
- అంగుళి:- బుద్ధభగవానుడు ఆమె రోదనకు అభ్యర్థనకు కరిగిపోయి ఆమెనొక్క పనిచేయమన్నాడు.
- కన్న:- ఏమాపని...
- అంగుళి:- ఏమీ లేదు ఊరిలోకి వెళ్ళి చావులెరుగని యిల్లుతెలిసికొని
- ఆ యింటినుండి ఒక్క పిడికెడు నువ్వులు తెమ్మన్నాడు.
- కన్నడు:- ఆమె వెళ్ళి తెచ్చిందా?
- అంగుళి:- లేదు...ఊరిలో చావు దుఃఖమెరుగని కుటుంబమే ఆమెకు దొరకలేదు. బుద్ధదేవుని కృపాకటాక్షమామె మీదపడి క్రమంగా ఆమె
- ఓ దార్పునకు గురైంది. ఆమె కసలు విషయం బోధపడింది. తనకే ప్రత్యేకముగా దుఃఖము కేటాయింప బడలేదని, పుట్టిన ప్రతిజీవికి అది సహజమని ఆమె గ్రహించింది. శాంతించింది ధైర్యము కూడ గట్టు కొనింది. ఆతర్వాత స్వయంగా బుద్ధదేవులే మావంటివారి సహాయంతో శవానికి అంతిమసంస్కారం గావించారు.
- కన్న:- ఆహా...ఎంతచిత్రము. ఆయన కొనచూపులతోనే మహాప్రశాంతత ప్రసాదించగలడు. ఏ మంత్రములేదు తంత్రమూ లేదు. అతిసహజంగా జనుల మనంబులకు స్వాంతన చేకూర్చగల మహనీయుడాయన.
- (ఇంతలో బుద్ధుడు, కోసలరాజు, నర్తకి (కాషాయంలో) మహానందుడు (రైతు) ఇద్దరు శిష్యులు ప్రవేశిస్తారు. బుద్ధ0 శరణం గఛ్చామి. సంఘం శరణం గఛ్చామి. ధర్మశరణం గఛ్చామి అన్న శబ్ధంతో వారిరాక పూర్తవుతుంది. అరుగులపై కూర్చోవడానికి కాస్తాతటపటాయిస్తుంటారు)
- బుద్ధ:- (కూర్చొని) తధాగతుడు సమదర్శి...మీరు ఏవిధమైన అరమరికలు లేకుండా మాసమక్షమున కూర్చొన వచ్చును. జంకుగొంకులు మాని అందరూ స్వేచ్ఛగా ఆసీనులు కండి. (అందరూ కూర్చొందురు) (కన్నడు అందరికి మట్టిపిడతలతో పానియమిచ్చును)
- బుద్ధ:- మహానందా...సన్యాసులు వృధాజీవులనిగదా యంటివి.
- మహానంద:- దేవా తప్పయినది. నామాట నుపసంహరించు కొంటున్నాను మన్నించండి. (లేచి చేతులు జోడించును)
- బుద్ధ:- లేదు... నీవ్నది తప్పుకాదు. లోకములో అనేకమంది సన్యాసులు వృధా జీవితం గడుపుతున్నారు. వారు గంగిరెద్ధుల వలె పోషింప బడుతున్నారనుట నిక్కము. కానీ తదాగతుడు ఆపద్ధతి మార్చివేసినాడు. నా సహచరులు అన్నము పెట్టిన సంఘమునకు సదాసేవకులు. అదిగో ఆకన్నడు.
- కన్నడు:- (లేచి) చిత్తం.
- బుద్ధుడు:- ఇతడు మంచి శస్త్రవైద్యము నేర్చినాడు. గాయములకు మలాము పూసి కట్టుగట్టి బాధను నివారించుటలో దిట్ట.
- కన్న:- అంతా బుద్ధదేవుని దయ. వారి అమృత మయ బోధనలను సైతం లెక్కసేయక కొందరు రాజులు కత్తులు దూస్తూనే వున్నారు. యుద్ధాలు సాగిస్తూ నేవున్నారు. వారి అవివేకము వల్ల క్షతగాత్రులైన వారిసేవకై నియోగింప బడిన దాసుడను.
- (రైతుచెంపలు వేసుకొని కన్ననికి నమస్కరించును కన్నడు ప్రతినమస్కారంచేసి కూర్చొనును)
- కోసలరాజు:- ఈ మిత్రుడు చెప్పినది అక్షరసత్యము. నేను మీ బోధనలవిని స్పందించి శాంతిమార్గంలో సంచరిస్తున్నా, కొందరు దూర్తులవల్ల ప్రజలకు ముప్పు తప్పడం లేదు. మచ్చుకు అంగుళీమాలున్నే చూడండి. వాడు సజ్జనుడై మమ్మావేదనకు లోను చేయకుండా ఉండగలడా?
- బుద్ధ:- కోసలాధీశా! మీ బాధ ఎప్పుడో తీరిపోయినది. ఆ హింసకుడు అహింసకుడై ప్రజాసేవలో నిమగ్నమైపోయాడు. నిజానికతడు సంఘం చేసిన హింసకుడు. తిరిగి అహింసకుడై తరించాడు.
- కోసలరాజు:- నిజమా...నమ్మలేకపోతున్నాను.
- బుద్ధ:- అడుగో...అతడే నీ వెరపుకు కారణమైన అంగుళీమాలుడు కాదు కాదు అహింసకుడు.
- (అంగుళిలేచి నమస్కరించి కూర్చొనును రాజు ఆశ్చర్యపడి వెంటనే కత్తిదూసి మరలా ఒరలోనికిత్రోసి శాంతించి కూర్చొనును)
- బుద్ధ:- మహారాజా....
- కం: బలిమి నలవికాని పనియు
- చెలిమిన్ నవలీలగాదె చేయగ నెపుడున్
- తెలియగ వలయున్ జనులకు
- కలిమి బలంబులకు మిన్న కరుణయటంచున్.
- అతడు దయ కరుణ స్నేహము నవలంభించి నా మార్గమున నడచు చున్నాడు. అతడేమి చేయుచున్నాడో తెలుసా. ప్రసవవేదనతో బాధపడు తల్లులకు ఉపశమనం గలిగించి సుఖప్రసవములు చేయించు చున్నాడు. ఆ విద్యలో అతడు సిద్ధహస్తుడు.
- అంగుళి:- అంతా బుద్ధదేవునిదయ నా దేమున్నది అంతా ఆయనచలువే నేను నిమిత్త మాత్రడను. "ఈ అహింసకుడు జన్మించినదాదిగా ఎవరి మనసు నొప్పించి యెరుగడు. ఇది సత్యమైతే ఈ ఇల్లాలి ప్రసవ వేదన శమించుగాక " యని మంత్రించిన నీరు యిమ్మన్నారు ఇస్తున్నాను. తల్లులు బాధారహితులై ప్రసవించి తల్లీబిడ్డలు క్షేమముగ నుండుట గమనిస్తున్నారు.
- నర్తకి:- బుద్ధదేవా... మన్నించండి. ఇది అబద్దముగదా... ఇతడు నిన్నమొన్నటిదాక గజదొంగ గదా! అతని మాటలు సత్యమగుటేమిటి, బాధలు నివారణమై సుఖప్రసవ మగుటేమిటి చిత్రముగ నున్నది.
- బుద్ధ:- అంబాపాలీ! నీవ న్నది నీ ఆలోచనా పరిధిలో నిక్కమే కానీ హింసకుడు నశించి అహింసకుడుగా ప్రభవించినాడు. అతడికిది వాస్తవమున మరుజన్మ కనుకనే అతడు జన్మించిన దాది అహింసావాదియే.
- అంగుళి:- అమ్మా నేను మరుజన్మమెత్తినా నా గతచరిత్ర తెలిసినవారు నన్నుమన్నించుటలేదు. మొన్న బక్షకై వెళ్ళగా పూర్వము నాచేపీడింప బడినవారు నన్ను గుర్తించి చావ బాదినారు. బుద్ధదేవు నాజ్ఞ. వారిని నేను తిరిగి దండించడానికి వీలులేదు. దెబ్బలుతిని వచ్చితిని. కన్నడు బుద్ధదేవులు నాకుపచారములు చేసి నన్నుతిరిగి కోలుకొనేట్లు చేసినారు.
- నర్తకి:- ఆహా ఎంతమార్పు. ఊహించనలవికాకున్నది. ఈ అంగుళీమాలుడు. నిజమైన అహింసకుడు.
- కోసలరాజు:- బుద్ధదేవా మనిషి మార్పుజెందుటే మరుజన్మంటున్నారు మంచిదే మరి వాస్తవానికి మనిషి మరణించి మరల పుట్టడం జరుగునా లేదా? మీఅభిప్రాయమేమి?
- బుద్ధ:- రాజా...
- ఆ:వె: కడలి నలలు పుట్టి కడకుదరిని దాకి
- అంతరించిపోవు నంతెగాని
- అంతరించినట్టి యాయలలె దిరిగి
- పుట్టుననెడి మాట వట్టిమాట.
- సముద్రలోకి అలలు పుట్టి దరిదాకి నశించిన అల మరలా వస్తుందా - అంతే మరుజన్మకూడా.
- కోసలరాజు:- అట్లయిన మరి భగవంతుడు. ఆ భగవంతుడుండు పరంధామము, నరకము స్వర్గము వీటి మాటేమిటి.
- బుద్ధ:- భగవంతుడు, దేవుడు...ఇంతకూ భగవంతుడున్నాడనుటకు నిదర్శన మే మైనా కలదా? మీరు చూచితిరా?
- కోసలరాజు:- లేదు...
- బుద్ధ:- మరి మీ పూర్వీకులు, వారును చూచియుండరు.
- కోసలరాజు:- కాని కలడని మాత్రమనిరి.
- బుద్ధ:- చం!! కలడను మాట పల్కుటయె గాని కనుంగొని నట్టివారొక0
- డిలగన రారు నట్టి పరమేశు గురించిన చింతయేలయీ
- కలుగుట లేకపోవుట యు గాక భువింగల దీనుబాధలన్
- కలయగ జూచి తీర్చవలె గాని వృధాయగు పల్కులేటికిన్.
- మీ కల్పన నిజమేయై దేవుడుండనిండు. అయిన నేమి? నీ సత్ప్రవర్తన వల్ల నిన్నాదేవుడు గాచును. అట్లుగాక దేవుడు లేడందురా? పోనిమ్ము నీ సత్ప్రవర్తన వల్ల లోకము మేలుపడును. కనుక సత్ప్రవర్తన యే నా దృష్టిలో ప్రధానాంశము గనుక ఉన్నాడో లేడో తేలని దేవుని ప్రసక్తి వీడుము. నడవడి సరిజేసుకొని మేలు పొందుము.
- ఆ:వె: జారచోరతనము చంపుట బొంకుట
- త్రాగుటయును విడచి ధాత్రియందు
- వినయశీలురగుచు లిలసిల్లెదరు గాక
- శాంతిసౌఖ్యమంది సంఘజనులు.
- నర్తకి:- మహాత్మా ఎంతచక్కగా సెలవిచ్చితిరి. ఎటుచూచినను సత్ప్రవర్తనయే ఈ లోకమునకు రక్ష. జనులందరు మంచి నడవడిలో మెలగిన భువికన్నవేరు స్వర్గమేమున్నది. మహాత్మామీరు లోకోద్ధరణకై అష్టాంగయోగము నిర్మించిరని వింటిని, కృపాళువులై అది మాకు తెలియ జేసి ధన్యుల జేయప్రార్థన.
- బుద్ధ:- అవస్యము వినుడు సమ్యగ్ సంకల్పము సమగ్వాక్కు సమ్యగ్ కర్మాంతము సమ్యగ్ జీవనము. సమ్యగ్ వ్యాయామము నమ్య గ్ స్మృతి సమ్యగ్ సమాధి ఇవీనామార్గము లోని అష్టాంగములు మహానామా వీటినిగురించి వీరికి నీవు వివరించి చెప్పుము.
- మహా:- చిత్తము.
- సీ!! సరియగు న ర్థం బు సమ్మతి గ్రహించు
- మూఢనమ్మకముల ముందు విడచి
- అత్యున్నతంబైన ఆలోచనలు చేసి
- పలుక న ర్హం బైన పలుకు పలుకు
- ఆదర్శవంతమై యలరు జీవనమును
- సత్కర్మయుతము నై సాగనిమ్ము
- నియమ బద్ధంబైన నీతి మార్గంబున
- బుద్ధివికాసమ్ము బొందిచనుము.
- తే!!గే!! ద్యాన మేకాగ్ర వృత్తిమై దవిలి చేసి
- జన్మమీరీతి గడ తేర్చి సాగిపొమ్ము
- కోర కుండగ మోక్షమ్ము కోరి వచ్చు
- నెలమి నీ మార్గమున బోవ నిక్క మమ్మ.
- నర్తకి:- మరల మోక్షమా?
- కొండన్న:- మోక్షమన బాధాదుఃఖముల నుండి తగని కోరికల నుండి విడుదల పొందుటేగదా!
- నర్తకి:- అర్థమైనది. ధన్యురాలను.
- (ఇంతలో కన్నడు బయట కివెళ్ళి ఒక కమ్మతెచ్చి బుద్ధుని చేతికిచ్చును.)
- కన్నడు:- దేవా! ఒక వార్తాహరుడు కపిలవస్తునుండి వచ్చినాడట ఈ కమ్మనిచ్చి, మీజవాబు కోసం ఆరామం వెలుపల వేచి యున్నాడు.
- బుద్ధు:- (చదువుకొని) మనకు కపిల వస్తునుండి పిలుపు వచ్చినది. కపిల వస్తు రాజన్యులు శుద్ధోధన మహారాజు మన రాక నభిలసిస్తున్నాడు.
- కొండ:- ఆహా ఎంత భాగ్యము ఇది మీ తండ్రిగారి నుండి పిలుపుగదా తప్పక వెళ్ళెదము.
- మహానామ:- మాతల్లి యశోధరాదేవిని దర్శించుకొను భాగ్యము ఇన్నేళ్ళకు కలుగ బోవుతున్నది కాదనకండి స్వామీ.
- బుద్ధ:- స్వపర బేధములు మనకులేవు. ఇప్పటికిప్పుడు మన కితర ప్రాంతముల నుండి ఆహ్వనము లేవీ లేవు కదా!
- అంగళి:- లేవు మహాత్మా మనం కపిల వస్తు వెళదాం.
- బుద్ధ:- అవస్యం కపిల వస్తు వెళదాం. రాజకుటుంబం సిద్ధార్థ వియోగ భారంతో కృంగియున్నది. వారి నోదార్చడం కూడా మనవిధియైయున్నది తప్పక వెళదాం.
- (కన్నడు వార్తాహరునికి జవాబు చెప్పటకు అటువైపు తిరుగును)
- -తెరవాలును-
- 11వ రంగం
- (కపిల వస్తు పొలిమేరలో ఒక వనము. శుద్ధోధన మహారాజు అరుగుపై కూర్చొని వుంటాడు. రాహులుడు రాజు వడిలో ఉండగా చెన్నుడు నిల్చొని వుంటాడు)
- శుద్ధోధన:- చెన్నూ కుమార దర్శనమునకై మనస్సు తహతహలాడు తున్నదయ్యా...
- చెన్ను:- ఇంకెంత సేపూ…బుద్ధభగవానులు వచ్చేవేళయింది మహారాజా!
- శుద్ధో:- స్వాగత సత్కారములు ఘనంగా ఏర్పాటు చేసి వంది మాగధుల కైవారాలతో కుమారున్ని అంతఃపురం తీసుకెళదామంటే. అవేవి కుమారునికి రుచింపవని మాన్పించితివి. ఇట్లుమనం ముగ్గురమే కుమారునికి స్వాగతం పల్కడం...
- చెన్ను:- మహారాజా...మీ రక్షణార్థం బలగాలను అల్లంతదూరంలో మొహ రించి వుంచాం. ఇక తధాగతుని ఆహ్వాన మంటారా స్వతహాగా కపిలవస్తు మహారాజులే తరలి వచ్చారు. ఇంకేంకావాలి వచ్చేవారికి నచ్చాలిగానీ ఏర్పాట్లదేమున్నది ప్రభూ!
- శుద్ధో:- తధాగతు డంటావ్ వచ్చేవారంటావ్. రాజాహ్వానమంటావ్. చెన్నూనేను తండ్రినయ్యా వచ్చేవాడు నాకుమారుడయ్యా.
- చెన్ను:- మహారాజా ఇంకాసేపట్లో కలుసుకోబోతున్నారు. అన్నీ మీరేచూస్తారు గదా! మీ మానసికోద్వేగాన్ని కాస్త అదుపుచేసుకోవాలి మహారాజా.
- శుద్ధో:- నేను తొందర పడుతున్నానా చెన్నూ...
- చెన్ను:- పరవాలేదు మహారాజా...ఒకతండ్రికి ఆ మాత్రం తొందరుండటం సహజమే.
- శుద్ధో:- పాత సంఘటనలన్నీ దొంతర దొంతరలుగా జ్ఞాపకమొస్తునాయి చెన్నూ. ఆనాడు రాకుమారులు ఉద్యానవనంలో విహరించుచుండగా ఆకాశంలో విహరిస్తున్న హంసను నాతమ్ముని కొడుకు దేవదత్తుడు బాణంతో క్రిందబడవైచాడు. సిధ్దార్ధుడు ఆ హంసను రక్షించి దానికి కట్టుకట్టి వైద్యము చేయించి కాపాడాడు. అంతఃపురంలో హాయిగా హంసతో ఆడుకుంటున్న సిద్ధార్థునిచూచి దేవదత్తుడు. హంసనాదని వివాదమునకు దిగాడు. వ్యవహారం న్యాయస్థానం వరకు వెళ్ళింది. న్యాయాధిపతి హంసను తెప్పించి న్యాయస్థానంలో వదిలాడు. అది ఎగురుకుంటూ వెళ్ళి సిద్ధార్థుని ఒడిలో వాలింది. న్యాయాధిపతి రక్షించిన సిద్ధార్థునిదే హంసగాని గాయపరచి నేల పడగొట్టిన దేవదత్తునిదికాదని తీర్పునిచ్చాడు. అప్పుడు నాకుమారుడు సిద్ధార్థుని ముఖం వెలిగిపోయింది. ఆనాడు వానిసంతోషానికవధులులేవు. నాకుమారుడు బాల్యంనుండి జాలి కరుణ దయ తో ఎప్పుడూ కళకళలాడుతూ వుండేవాడు - వాడెప్పుడూ అహింసావాది. అదేనేడూ పరిఢ విల్లింది.
- చెన్ను:- నిజమే మహారాజా...తదాగతుడు. యజ్ఞయాగాదులందు కూడా బలులను నిషేధించినాడు. కఠినులైన మగధాధీశులను కోసలరాజులను తన మతమున కాకర్షించినాడు. గజదొంగ అంగుళీమాలుని సైతం తనప్రేమ తత్త్వంతో అహింసకునిగా మార్చివేసినాడు.
- (బుద్ధం శరణంగఛ్చామి - సంఘం శరణం గఛ్చామి - దర్మంశరణం గఛ్చామి అన్న శబ్ధాలతో బౌద్ధబిక్షువుతో కలసి బుద్ధుడు ప్రవేశిస్తాడు)
- శుద్ధో:- కుమారా! (లేచి కొడుకువైపుకు నడుస్తాడు. బాలుడు బెరుకు బెరుగ్గా రాజువెనక్కు నక్కుతాడు. బాలున్ని రాజు బుద్ధునికి చూపి)
- మీతండ్రిరా రావుహులకుమారా వెళ్ళి పాదాభి వందనం చెయ్యి (అంటూ చెయ్యిపట్టుకొని ముందుకు నడిపిస్తాడు. రాహులుడు పాదాభివందనం చేస్తాడు బుద్ధుడు తల నిమురుతాడు.)
- బుధ్ధు:- (చెన్నుని వైపుదిరిగి) చెన్నూ! అంటూ కౌగిలించుకుంటాడు) చెన్నుడు కన్నీరు తుడుచుకుంటూ కౌగిలినుండి విడిబడి)
- తే:గీ:స్వాగతంబయ్య బుద్ధదేవా పదమ్ము
- లిడుము ముందుకు నీరాక కిన్నియేండ్లు
- వేచియున్నది ఈ నేల వేదనమున
- వేగ రావయ్య తడవేల వినుతశీల.
- బుద్ధ:- చెన్నూ ఒక సన్యాసికి, బిక్షకునకు స్వాగత మేల నయ్యా.
- శుద్ధో:- కుమారా పద, అంతఃపురము నీకై సర్వాంగ సుందరముగా అలంకరింప బడియున్నది. యశోధర నీరాకకై కన్నుల వత్తులేసుకొని కాచికొనియున్నది. పదనాయనా..చెన్నూ వెంటనే రథము తెప్పింపుము. మనము బయలుదేరుదము.
- బుద్ధ:- మహారాజా! యేల తొందరపడెదరు. శాంతింపుడు నేనొక సామాన్య సన్యాసిని బిక్షకుడను.
- తే!!గీ!! బిక్షకునకేల రథములు . బిక్షకొరకు
- గడప గడపకు యాచింప నడవ వలయు
- వత్తుమీయింటికింగూడ పటువ బట్టి.
- బిక్షయిడుడప్పు డంతియె ప్రియముమాకు.
- మీరిక బయలుదేరుడు మా అనుచర గణము తోపాటు ఈ ఉపవనమున కొంత విశ్రాంతిగైకొని బిక్షకు కదలివత్తుము.
- శిద్ధో:- కుమారా...నన్నింకా పరీక్షిస్తున్నావా? ఇదేమి విడ్డూరము నాయనా రాజనగరు, నీయిల్లురా నీయింటికి నీవు యాచనకు వచ్చుటేమిటిరా? (అనిరోదించును . బాలుడూ ఏడ్చును)
- బుద్ధ:- ఊరడిల్లండి ఈ తధాగతునకు స్వపర భేద మేమున్నది. ఈ నగరులోని ప్రతియిల్లునాదే అందరూ నావారె వారిలో మీరొకరు అదే సమయంలో ఏ యిల్లూ నాదికాదు. ఏ బంధుత్వములు నాకులేపు నేనురేపటి మధ్యాహ్న బిక్షమీ ఇంటస్వీకరింతును. అప్పుడులేదనక బిక్షపెట్టుడు. మేముమాఅనుచరగణముతో ఆనందముగ స్వీకరింతుము మీరిక నిశ్చింతగా వెళ్ళిరండి. (బుద్ధంశరణం గచ్చామి, సంఘం శరణం గఛ్చామి - ధర్మం శరణం గఛ్చామి అంటూ అంటూ వెళ్ళును)
- శుద్ధో:- చెన్నూ... (దుఃఖించును)
- చెన్ను:- ప్రభూ... చింతించకండి. అతడిప్పుడు మీకుమాత్రమే పరిమితుడైన సిధ్దార్థుడు కాడు. జగన్నియామకుడు బుద్ధదేవుడు. అతనిది వసుధైక కుటుంబం. అంతటివాడు మీ పుత్రుడైనందుకు మీరు సంతోషించాలి.
- శుద్ధో:- చెన్నూ...నా జీవితానికి కడకు మిగిలిందింతేనా?
- చెన్ను:- ఊరడిల్లండి మహారాజా...ఊరడిల్లండి పదండి రాజనగరుకు వెళదాం (అందురూ వెళ్ళును)
- తెరవాలును
- 12వ రంగం
- (రాజాంతపుర ప్రవేశద్వారం - బుద్ధుడు శిష్యగణంతో ప్రవేశం)
- బుద్ధ:- భవతి బిక్షాందేహి...భవతి బిక్షాందేహి ... భవతిబిక్షాందేహి.
- యశోధర:- (వచ్చి) బుద్ధభగవానులకు ప్రణామములు.
- బుద్ధ:- శుభమస్తు! యశోధరాదేవీ ఈ తధాగతుడు మీ గడప వద్ద బిక్షయాచిస్తున్నాడు.
- యశో:- బిక్ష...తమరు బిక్ష నిస్సంకోచముగా యాచించుచున్నారు. కానీ ఈదీనురాలి వద్దయిచ్చుట కేమున్నది స్వామీ.
- బుద్దు:- దేవీ...మాకు బిక్షలేదందురా?
- యశో :- లేదనక ఉన్నదనుటకు నాదన్నదేమున్నది స్వామీ ఈ రాజ్యము ఈసంపద. ఈ వైభవము సర్వస్వము మీది. ఇందులో నా యనునది... (కాస్తాయోచించి) ఉన్నది. పొరబడితిని ఉన్నది స్వామీ ఒక్క క్షణమాగండి. మీకు బిక్షగా సమర్పించిటకు నాదన్నదొకటుంది... ఆగండి బిక్ష సమర్పిస్తాను (అంటూలోనికి వెళ్ళిరాహులుని వెంట నిడుకొని వస్తుంది)
- బుద్ధు:- యశోధరా...
- బుద్ధు:- ఇదిగోండి..వీడు మన ప్రేమ చిహ్నము . నావరాలకొండ నాప్రేగుత్రెంచికొని పుట్టిన బిడ్డ. వీణ్ని బిక్షగాగైకొనండి.
- ఉ: గేహము ముంగిటన్ నిలిచి కేకిడి మీరలె జోలెచాచగన్
- మోహము వీడెనేటికి విమోచనమయ్యెను వీడె బంధముల్
- దేహళిదాటి నిచ్చితిని తీసుక పొండిక నాకు మారునిన్
- దేహము చీల్చియిచ్చుగతి తెంపున బిక్షగ నిచ్చితిన్ జుమీ.
- (ఇది గోడిం బిక్ష గైకొనండి అంటు రాహులుని చేయి బుద్ధుని కందించును)
- బుద్ధ:- యశోధరా. నీవు ఆవేశములో ఈపని చేయుట లే దుకదా! నాపై కోపము చూపుట కిది మార్గముగా నెంచుకొంటివా యేమి? నేను నీ అనుమతి పొం దకనే ఇల్లువీడి సన్యసించుట నిజముగా నా తప్పిదమే. అంగీకరింతును కానీ నేనేమి చేయుదును.
- ఉ: దీనత క్రుంగిపోతి జగతింగల దుఃఖము జూడజాలకన్
- మానస శాంతి గోల్పడియమాంతము నాహృదిరేగినట్టిదా
- వానల ధాటికిన్ నిలిచియాదిన మందున తాళనైతినే
- కానగ నైతి నిన్ను , వడికానల కేగితి సన్యసించితిన్.
- (ఇంతలో శుధ్దోధన మహారాజు ప్రవేశించి అంతా వింటాడు)
- యశోధరా ఈ విశ్వము నావరించి యున్న దుఃఖము బాపుటెట్లను ఆ వేదనలో నన్ను దారా సుతుల బంధము బంధించలేక పోయింది చింతా క్రాంతమైన నామనసు మిమ్ముగూర్చి ఆలోచించ లేకపోయింది యశోధరా నేను క్షమార్హుడను.
- యశో:- అంత మాటెందుకు స్వామి.
- తే!!గీ!! నాకుటుంబము నాభార్య నాకుమారు
- లనెడు సంకుచితత్త్వంబు నధిగమించి
- విశ్వశోకనివారణ విధము నెఱుగ
- కదిలె నానాథు డననాకు ఘనతగాదె.
- మీరు అనుకొన్నది సాధించి విజయులై లోకమంతటికి స్వాంతనము ప్రసాదించి తిరిగి మమ్ముజాచుటకు , కాదు కాదు మమ్మనుగ్రహించుటకు వచ్చినారంటే నా కెంతో ఆనందంగా వుంది.
- శుద్ధో:- అమ్మా యశోధరా ... ఏమిటినీ వంటున్నది. భర్తరాకకోసం ఇన్నేళ్ళు ఎదురుచూచి...తీరా వచ్చిన తర్వాత బిడ్డనప్పజెప్పి ఆనందంగా వుందటున్నావా!
- యశో:- మహారాజా. మీరే పొరబడుతున్నారు...నిదానంగా సావధానంగా ఆలోచించండి. జరిగిన పరిణామాన్ని గుర్తించి విషయమేమిటో అర్థం చేసుకోడిండి. మనొక్కరికి మేలో కీడో జరగడంకాదు. మొత్తం విశ్వానికే నాభర్త వల్ల మహోపకారం జరిగింది. మేలు పడిన ఆ విశ్వంలో మనమూ భాగస్వాములమన్న విషయం మరిచిపోకండి.
- శుద్ధో:- అమ్మా యశోధరా!
- బుద్ధు:- మహారాజా.. మీరూనామార్గాన్నసురించ డానికి అభ్యంతర మేమున్నది. కోసల, మగధ దేశాధీశు లిప్పటికే నన్ననుసరించి బౌద్ధులయ్యారు. తపోనియమములతో నిర్వాణమును తధాగతుడు అభిలషించుటలేదు. కానీ అంతమాత్రమున నతడు ప్రాపంచిక సుఖములలో తేలియాడు చున్నాడనికాదు . సంపదతో తులతూగు చున్నాడనిగాని యెంచరాదు. తథాగతుడు మధ్యమ మార్గమును కొనుగొన్నాడు. మహారాజా యిట్టి నామార్గము ననుసరించి నీ దుఃఖము నధిగమించుటకు మీకే మభ్యంతరముగలదు? ప్రజానురంజకమైన పరిపాలన సాగించండి. అహింసా మార్గమున మీ నిర్వాణ మునకై యత్నింపుడు తరింపుడు. బుద్ధం శరణం గఛ్చామి - సంఘం శరణం
- గఛ్చామి - ధర్మశరణం గఛ్చామి.
- శుద్ధో:- బుద్ధదేవా... ఇప్పుడు నాకు జ్ఞానోదయమైనది. మీ బోధలోని సారాంశం ఒకింత అర్థమైనది. నాదుఃఖము పటాపంచలైనది. ఇన్నాళ్ళూ నాబిడ్డ సన్యాసియై దీనత బిక్షాటన చేసుకొని పొట్ట పోసుకుంటున్నాడని భ్రమపడ్డాను. నిజంగా నాకుమారుడు చక్రవర్తయ్యాడు. విశ్వజన హృదయాల నేలు మహాచక్రవర్తయ్యాడు. నా అవివేకమున నేనీ వాస్తమును ఇన్నేళ్ళు గుర్తించ లేకపోయాను. జ్యోతిష్యులుచెప్పిన మాట అక్షర సత్యమైంది. నామాయ ఆనాడు తన గర్భవాసమున కుడిపైపునుండి నాల్గు దంతముల తెల్లయేనుగు ప్రవేశించిందంటే యేమో అనుకొన్నాడు. కలలకర్థముండదను కొన్నాను. ఆహా ఆయేనుగు స్వచ్ఛతకు మహత్తుకు చిహ్నము. అంతా యిప్పుడు స్పష్టముగా అర్థమైనది. నాకుమారుడు చక్రవర్తి చక్రవర్తి....చక్రవర్తయ్యాడు.
- యశో:- నిజంమహారాజా... మీకుమారుడు లోకైక చక్రవర్తి.
- బుద్ధ:- (కుమారునిచూచి) రాహులకుమారా ఇదిగో వీరంతానీ సోదరులు (శిష్యునుచూపి) వారితో కలిసి నీవిక సంఘసేవకుపక్రమించవలసి యున్నది.
- రాహులుడు:- అమ్మనాకు అంతా బోధపరిచింది. మిమ్మనుసరించటకు నేను సర్వసన్నద్ధముగా వున్నాను. ఈ అన్నలతో గలసి సంఘసేవ చేయుటకు ఈ క్షణమే కంక ణబద్ధుడై యున్నాను.
- తే:గీ: అమ్మ వివరించి మున్నెనాకంతదెలిపె
- విశ్వగురుడగు నాతండ్రి వెంటనడువ
- చింత యొక్కింత లేదునే చేరిపోతి
- బిక్షకులసంఘ ముననేడు ప్రియముతోడ.
- చెన్ను:- బుద్ధదేవా.... (అని చేతులుచాచును)
- బుద్ధ:- నీవు మాత్ర మన్యుడవెలా అవుతావు చెన్నూ ఇకనీదీ నామార్గమే. కానీ రాజ్యము రాజు లేనిదై పోరాదు కదా. నీవు చాలాసమర్థుడవు. శుద్ధోధన మహారాజుకు నీ సేవా సహకారములు కొనసాగించు. ఆదర్శ బౌద్ధసామ్రాజ్యస్థాపనకు కృషిచెయ్యి. బౌద్ధుడవై నిర్వాణపదము నందుకో.
- (బుద్ధం శరణం గఛ్చామి. సంఘం శరణం గఛ్చామి. ధర్మంశరణం గఛ్చామి అను శబ్ధం మారు మ్రోగుతుండగా)
- - తెరవాలును -
- 13వ రంగం
- (కుశనగరం - ఆరామం)
- మహానామ:- ఆహాకాలమెంత చిత్రమైనది దేశదేశముల సంచరిస్తూ తన మధ్యమార్గమనదగు బౌద్ధము వ్యాపింప జేస్తూ సాగుతున్న తదాగతుని కదలిక కప్పుడే ఎనుబది వసంతములు దాటినవి. నేడీ కుశనగరమొక మహత్తర ఘట్టమునకు సాక్ష్యమైనిలువ నున్నదని నామనస్సు హెచ్చ రించుచున్నది. అంతయేగాదు బుద్ధభగవానులు తమ అంతేవాసులలో మఖ్యలందరిని ఈ ఆరామమునకు కదలి రండని వర్తమాన మంపి పిలిపించుకొన్నారు.
- (అంటుండగానే కొందరు శిష్యులు రంగంమీదికొస్తారు. వారివెనుక బుద్ధుడు ప్రయాసతో చిన్నగా నడుస్తూ శిష్యులసాయంతో రంగంమీదికి వస్తారు. బుద్ధుడు అరుగుపై కూర్చొంటాడు.)
- బుద్ధ:- బుధ్ధం శరణం గఛ్చామి. సంఘం శరణం గఛ్చామి. దర్మం శరణం గఛ్చామి (అంటూ ఆపి) నాసహచరులారా బిక్షువులారా నేనిక అంతిమ మహానిర్వాణ పథము నందుకొనవలసి యున్నది.
- శిష్యులు:- (ఒక్కసారే) బుద్ధదేవా!
- బుద్ధ:- ఆవేశపడకండి నాయనా... జరామరణములు సర్వజీవులకు సహజ సిద్ధములు . అవిసమీపించునపుడు మనమెవ్వరము దుఃఖించ పనిలేదు వాస్తవమును అర్థము చేసికొనక తద్విరుద్ధముగా ఆలోచించుట శోకించుట నిరర్థకము అవివేకము.
- కన్నడు:- కావచ్చు మహాత్మా - అయినా మీరు అప్పుడే మమ్మువీడి వెళతారా!
- బుద్ధు:- అప్పుడేనా? అంటున్నావా మిత్రమా ఈ శరీరాని కప్పుడే ఎనుబది యేడ్లు నిండినవే.
- అంగుళి:- మహాత్మా మీరు ఎంత సముదాయించినా - మేము మీరు లేని లోకాన్ని ఊహించ లేకుండా వున్నాము.
- బుద్ధు:- ఆభ్రమనుండి విడివడటం అంతసులభం కాదు నాయనా నాఅష్టాంగ యోగాన్ని శ్రద్ధతో ఆచరించండి. మీకుభ్రమ వీడిపోతుంది.
- కొండన్న:- పుట్టలోని చెదలు వెలె పుట్టుట గిట్టుట మావంటి వారి మరణం మీరన్నట్లు లెక్కలోనిది కాదుగాని, మీవంటి అవతారపురుషుల ఎడబాటు భరించ గలమా మహాత్మా.
- బుద్ధ:- ఎంతవారికైనా ఈ జనన జరా మరణావస్థలు సమానములు నాయనా మహాత్ములన్నవారే వీటికి అతీతులము కామని ఎరుగక పోతే ఇక సామాన్యులెలా గ్రహిస్తారు నాయనా. మీరిక ఊరడిల్లండి. ఆఖరుసారిగా నా ఆదేశములను శ్రద్ధగా మరొక్కసారి వినండి. జీవహింస చేయకండి. దొంగతనము తగదని తెలిసి బోధించండి. వ్యభిచరించడం తప్పని గట్టిగా చెప్పండి. కల్లలు కలలో నైనా ఆడకండి అపనింద పొరబాటున కూడా యితరులపై వేయకండి. మాటలో కఠినత్వం చూపకండి. వృధా మాటలతో
- సమయం గడపకండి పరులసొత్తుకై ప్రాకులాడకండి. ద్వేషం దరిచేర నీకండి. సదా ధర్మచింతన చేయండి. ఇవి తధాగతుని ఆదేశములు . పాటించదగ్గవి. ఇకమీరు బోధించదగ్గవి.
- కన్నడు:- ఇంకా ఏమైనా చెప్పండి మహాత్మా....
- బుద్ధ:- ఏమున్నది కన్నా.. పలుమార్లు చెప్పితిని. అయినా వినుడు. మీ నిర్యాణమునకై మీరే పాటుపడవలెనని ఎఱుగండి. ఆ ప్రయత్నములో నిత్యం అప్రమత్తత తో సాధన సాగించండి. పాత్రమెఱిగి దానంచేయండి. శుభచింతన చేయండి. పరోపకారం మన ముఖ్యధర్మమని తలచండి. పెద్దలయెడ గౌరవంతో మెలగండి మీ పుణ్యఫలాన్ని ఇతరులకు త్యాగంచేయండి. అట్లే ఇతరుల పుణ్య ఫలాలను కృతజ్ఞతతో స్వీకరించండి. ఎప్పటికప్పుడు మీ దోషములను సరిదిద్దుకోండి. ధర్మబోధ మీ బాధ్యతగా తలచండి. ఇకనాకు సెలవివ్వండి నాయనా.
- అంగుళి:-
- సీ!! నీపాదములుసోకి నేడీ హరితతృణ
- పుంజంబుతో భూమి పుణ్యయయ్యె
- నీనఖంబులుతాకి నేడు నానాలతా
- తరుసంఘములు గృతార్థంబు లయ్యె
- నీకృపాదృష్టిచే నేడు నదీశైల
- ఖగమృగంబులు దివ్యకాంతి జెందె
- నీ బోధనలవిని నేడు జాగృతమైన
- జనముల పుట్టువు సఫలమయ్యె.
- తే!!గీ!! అట్టినీవనవరతంబు నవని తిదిగి
- ప్రకృతినెల్లను దివ్యమౌ ప్రభల నింపి
- జనుల చైతన్యపరచుచు జగమెఱుంగ
- దేశికోత్తములైరి మీ తేజమలర.
- బుద్ధ:- నాయనలారా నాకిక సమయమైనది వైశాఖపౌర్ణమి సమీపించినది అదే అదే ఆ వైశాఖవున్నమే....
- తే:గీ: యేను జన్మించి తిలపైన ఈదినంబె
- అందెలే జ్ఞాన మీతిధి యందెనాకు
- తిరిగి పోవలె నీనాడె ధరణి వీడి
- సెలవు సెలవయ్య హితులార సెలవు సెలవు.
- (అంటూ అలాగే ఆరుగుపై వాలి పోతాడు)
- శిష్యులు:- (అందరూ) మహాత్మా... మహాత్మా...
- కన్నడు:- బుద్ధభగవానలు తమ భౌతిక కాయాన్నివీడి మహానిర్వాణ పథము నలంకరించినారు ఇక మనము వారి బోధలే ప్రాణముగా ధరించి జీవయాత్రసాగించ వలసియున్నది (కన్నీరు తుడుచుకొనును).
- (క్రింది పద్యం శిష్యులు ఒక్కొక్కరు ఒక పాదం పాడతారు)
- సీ: ఏదీనువేదనల్ ఎరిగి దీర్పంగ నో
- భువికేగు దెంచెనీ బోధకుండు
- ఏబాధి తుని బాధ లీడేర్ప నెంచెనో
- వెడలె నిల్వడచినీ వేల్పుసముడు
- ఏపాపి పాపముల్ ఏరి పారేయనో
- తపమాచరించెనీ త్యాగజీవి
- ఏయసమానతల్ నింపుమై దుడుపనో
- ఇన్నేళ్ళు కష్టించె నీఘనుండు.
- తే:గీ: ఇట్టి యస మాన చరితుడు యిలను విడచి
- యరిగె నిర్వాణ పథము నో యన్నలార
- కడకు నీతని మార్గమే కలదుమిగిలి
- యనుసరించి తరించగా నవని లోన.
- (అందరూ కేల్మోడ్చి నిలుచుందురు) (తెరవాలు తుండగా)
- శ్లో!! అసతోమా సద్గమయ
- తమసోమా జ్యోతిర్గమయ
- మృత్యోర్మా అమృతంగ మయ
- ఓం శాన్తి శాన్తి శాన్తిః
- *
No comments:
Post a Comment