Saturday, 21 November 2020

తిలోత్తమ

  

తిలోత్తమ

(పౌరాణిక పద్యనాటకం)

 

తిలోత్తమ

 

రచన

పి.సుబ్బరాయుడు.

42/490 భాగ్యనగర్ కాలనీ

కడప 516001

సెల్-9966504951

 

ఇందలి పాత్రలు 

1. తిలోత్తమ/వృక్షక              2. సాహసికుడు 

3. దుర్వాసుడు                     4. నారదుడు 

5.ఇంద్రుడు                         6. సుందుడు 

7. ఉపసుందుడు                 8. బ్రహ్మ 

9. రంభా,మేనకలు

 

తిలోత్తమ

(పౌరాణిక పద్యనాటకం) 

మొదటి రంగము 

(తిలోత్తమ సాహసికుల ఆటాపాట)

 

సాహసికుడు:- ఆఁ...(ఆలాపన)

 తిలోత్తమ:- ఆఁ....(ఆలాపన)

 

సాహసికుడు:- ఆమనిరాకను మున్నేకనుగొని

                       ఈ వని స్వాగత గీతిక పాడెను.

 తిలోత్తమ:-  గీతికవిని ఆమని అడుగిడి

                   ఇల-కళకళలాడి మురిసినదీ

 సాహసికుడు:- 0గరు మీనపు గడుసుతాకిడికి

                     కదలిన కమలము పిలిచినదనుకొని

 తిలోత్తమ:- భ్రమరము ఝుమ్మని దరిచేరినదీ

                   కొలనికె యందము కూర్చినదీ

 సాహసికుడు:- ఆమని......

 తిలోత్తమ:- గీతిక....

 సాహ:-   వనసౌందర్యము - నకు తలయూచితొ

          ఔనో కాదో - నీసరినేగానో

          ఝుమ్మను భ్రమరము- నేనే యౌదును

             కొలని కమలమూ - నీవౌదువులే..../ఆమని/

 

తిలో:-    వనమహత్మ్యమో - ఆమని వరమో

           నీకలయికమది - గుబులురేపెను

           వలపోకాదో - యే మయ్యినదో

           తగిలెనుపో హృది - మదనుని బాణము.../ఆమని/

         ఆఁ... ఆఁ... (ఇద్దరూ ఆలాపనచేస్తూ చేయీచేయి పట్టుకొని వలయకారంలో తిరుగుతుండగా తిలోత్తమ మేలిముసుగు గాలికి లేచిపోయి స్టేజి బయట పడిపోవును

  దుర్వాసుడు:-(మేలిముసుగు చెతితో పట్టికొని కోపంతో వచ్చి) ఆపండి. ఏమి మీకండకావరము. ఇది పవిత్ర గంధమాదన పర్వతమనీ.. అందునా మునివాటికయనీ తెలియదా? ఒడలెరుగని మదోన్మత్తులై తపోదీక్షలో నున్నమాపై మీ మలినపు వలువ విసురుదురా? మీరు శిక్షార్హులు. (తిలోత్తమ వైపు తిరిగి)ఇదే నా శాపము.

         కం:        కనులకు మదమెక్కి మునుల

                  వనమున శృ0గారమొలుకు వనితా వడిమై

                  ఘనరాక్షస వంశంబున

                  తనయగ జన్మంబునంది ధరపై బడుమా!

 (సాహసికుని వైపు తిరిగి) ఓరీ సాహసికా .. హరిభక్తుడవనిఉత్తముడవని దలచి నిన్నీప్రదేశమున నుండనిచ్చితిమి. ఇంత క్రొవ్వెక్కి ప్రవర్తింతువానీవునూ శాపమనుభవింపుము.

          కం:       మదమున కన్నులు గానక

                  సుదతీ మోహంబునబడి శుంఠగ దిరుగన్

                  ఇది మొదలు గార్ధభంబై

                  కదలాడుము పుడమిమీద కడు మలినుడవై.

 సాహ:- మునీంద్రా! మమ్ముక్షమింపుడు.

 తిలో:- కరుణించి శాపము మరల్పుడు. (ఇద్దరూ కాళ్ళ పై బడుదురు)

 దుర్వాసుడు:- లెండు. వైదొలగుడు. మీరు యేమాత్రమూ క్షమార్హులు కారు. నా కింకనూ కోపము తెప్పింపకుడు. తక్షణమే యీ ప్రదేశము విడిచి వెళ్ళుడు... ఊ పొండు.

 నారదుడు:- (ప్రవేసిస్తూ)  నారాయణ నారాయణ. మహాత్మా.. అనసూయా నందనా! శాంతించండి శాంతించండి

దుర్వాసుడు:- మునీంద్రా! నమస్సులు. (నమస్కరించి) వీరు కామాంధులై హద్దుమీరి చరించుటేగాకయీమె పయ్యెద తపమాచరించుకొంటున్న నాపైకి విసరినది. వీరు శిక్షార్హులు. క్షమార్హులేమాత్రమూకాదు.

 సాహ:- మీ బిడ్డల వంటివారము. చేసినతప్పుకు పశ్చాత్తాప పడుచున్నాము.

 తిలో:- మహర్షులార! మాపై దయచూపండి  పొరపాటున నావల్ల తప్పుజరిగినది మమ్ముక్షమించండిశాపవిముక్తిని ప్రసాదించండి

                (ఇద్దరూ మళ్ళీ నమస్కరింతురు)

నారద:- మునీంద్రా!

         తే:గీ.       ఈమె లోకోపకారిణి యితడు హితుడు

                    వయసు మీదున్న వీరల వర్తనమ్ము

                    సైప దగునయ్య తగదయ్య శాపమియ్య

                    కరుణ కురిపించి వీరిని కావవయ్య.

 

దుర్వాస:- (కోపంగా) నారదమహర్షీ! ...

 

నారద:- మునిగణశ్రేష్టా!.. మీకు తెలియని దేమున్నది. ఈ తిలోత్తమ పరమోత్తమురాలు. విశ్వవిపత్తును బాపుటకు బ్రహ్మానుమతిని బడసి  విశ్వకర్మచే నిర్మింప బడిన సుందరి. ఈమెవల్లనేకదా లోకకంటకులైన  సుందోపసుందుల పీడ విరగడైనది. దేవతల స్తుతులంది చంద్రలోకయాత్ర చేస్తూ యీ గంధమాదన కోనలోమన సాహసికుని ప్రేమలోపడి మీ ఆగ్రహమునకు గురియైనది. (సాహసికుని వైపు తిరిగి) మరి యీ సాహసికుడో హరిదాసుడు. మీదుమిక్కిలి మీపై భక్తిప్రపత్తులు గలవాడు. సాత్వికుడు. వీరిని కనికరించండి. వీరు నిజంగా క్షమార్హులు(సైగచేయును ఇరువురూ దుర్వాసుని కాళ్ళపై బడుదురు.)

 దుర్వా:- లేవండి. మీకు శాపము అనుభవింపక తప్పినది కాదు.

 సాహ/తిలో:- మహాత్మా!

 దుర్వాస:- భయపడకండి.. ఈ శాపములు మీయెడ వరములై భాసిల్లగలవు.. తిలోత్తమా! మహాతపస్సంపన్నుడూ పరమశివభక్తుడుశివతాండవము వేళ మృదంగము వాయించు కళాకారుడూ నైన బాణాసురునకు పుత్రికవై పుట్టి "ఉష" యన్న పేరున ప్రఖ్యాతి గాంచెదవు. పార్వతీదేవి శిష్యురాలవై లాస్యమును కైలాసము నుండి భువికి దించి వ్యాపింపజేయగలవు. శ్రీకృష్ణుని పౌత్రుడగు అనిరుద్ధుని వివాహమాడి పుత్రపౌత్రాభివృద్ధినిపొంది తరింపగలవు.. సాహసికా! నీవు బృందావనమున గార్ధభాసురుడవై చరించుచుండగా శ్రీకృష్ణపరమాత్మ నిన్ను వధించి కైవల్యము ప్రసాదింపగలడు. శుభమస్తూ!

 సాహ/తిలో:- మహాప్రసాదము. (నమస్కరింతురు. స్టేజి స్టిల్ అయిపోతుంది)

 నారద:- (ముందుకువచ్చి) నిజమే దుర్వాసులవారి శాపము వీరియెడ వరమేయైనది. సాహసికునకు కైవల్యము ప్రాప్తించనున్నది. మరి తిలోత్తమవిషయమో? ఆమె మరొక మహత్తర కథకు కథానాయిక కానున్నది.  సంతోషము చాలా సంతోషము. నారాయణ..నారాయణ. (మరొక మైకు దగ్గరకు మారి) ప్రేక్షక మహాశయులారా! కళాభిమానులారా! ఈ అతిలోకసౌందర్యరాశి "తిలోత్తమ" కథను నాటక రూపమున తిలకింప మనసగు చున్నదికదా!.. ఆవశ్యము తిలకింతురు గాక! ఒకనాడు నేను ఆకాశగమనుడనై...

 (లైట్లు ఆర్పేయాలి - ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళుటకు నారదుడు బయటకువెళ్ళాలి. ఆకాశం సీను దించి మళ్ళీ నారదుడు ప్రవేసించాలి)

 సూచన:- ఇక్కడ నాటకసంస్థ వివరాలూసన్మాన కార్యక్రమమునకు సంబంధించిన వివరాలు కూడా నారదపాత్రద్వారా చెప్పించి సభను కూడా

జరుపు కొన వచ్చును. సభానంతరం నాటకం తిరిగీ ప్రారంభించవచ్చును.)

  

రెండవ రంగం

 (ఆకాశవీధి సీన్ ముందు నారదుడు)

 నారద:- పాట.
 హరీ..... నారాయణా - హరినారాయణా
శ్రీమన్నారాయణా! - లక్ష్మినారాయణా
 (ఆనంద పారవశ్యమున నృత్యం చేయును.)
హరబ్రహ్మాదులు - అనంతుడనరే
మాతరమా ప్రభూ - నిను కొనియాడ
నీరజనయనా - భవభయ హరణా.../హరీ/
 
         కోరెడి విబుధుల - కాదని నిన్నే 
         కోరి నీయెదనే - కొలువయ్యె రమా
         నీకై తపియించు - నీభక్తులకూ
         కల్పవృక్షమై - వరముల నిత్తువు../హరీ/
 
 
వైభవమలరగ - మునిజనకోటి
నిన్నేదలచుచు - పరమ హంసలై
నీదయ కలుగగ - సాయుజ్యము గని
తరియించిరిగద - నీరదశ్యామా.../హరీ/
 
(పైనుంచి బాగా పరికించిచూచి) ఆహాఁ.. యీ అటవీ ప్రాంతమెంత  శోభాయమానముగా నున్నది.
 
:         నీలపురంగు నింగిఁ గిరి నెత్తికి నెత్తుక నిల్చి నట్టులౌ
          శైలపుటంచు నుండి దిగజారు ఝరుల్ సితకాంతులీనెబో
          వేలవిరుల్ సువర్ణరుచి వింతగ నింపుచు తీవెలూగుచున్
          నేలకు నిన్ని యందములు నిండుగగూర్పవె హాయిగొల్పుచున్
 
చూడ ముచ్చటగా నుండుటయేగాదు. అధ్యాత్మిక దివ్యప్రకంపనలతో మనస్సుకు మహదానందము కలిగించుచున్నది. ఏమది ఆ అశ్వత్థ వృక్ష చ్ఛాయలో ఒక మహిళామణి వ్రతదీక్షలో నున్నట్లున్నది. దీక్షప్రభావము కాబోలు నీరసించియున్ననూ పసిడి శలాకవలె కాంతివంతమై ప్ర కాశించు చున్నది. ఈమె దర్శనము శుభదాయకము. వెళ్ళి పలుకరించెద గాక. నారాయణ.. నారాయణ..
 
(లైట్స్ ఆఫ్. ఆకాశం సీన్ తొలగును నారదుడూ బయటికి లెళ్ళును. లైట్స్ ఆన్ చెట్టుక్రింద ఒక స్త్రీ ధ్యానంలో వుండును)
 
నారద:- (ప్రవేసిస్తూ) నారాయణ.. నారాయణ.. వనితామణీ.. (పలుకరించును)
 
వృక్షక:- (ధ్యానముద్ర విడచి. లేచి) మునీంద్రా! భృగువంశ సంజాత యైన యీ వృక్షక తమపాదములంటి ప్రణమిల్లు చున్నది. ఆశీర్వదించండి.(పాదాభివందనంచేయిను)
 
నారద:- శుభమస్తు! వనితామణీ! భృగునందనవంటున్నావు.. ఇక్కడ.. యీవనంలో...
 
వృక్షక:- దేవమునీ...
 
 
 
 
        కం:        పుట్టితి భృగుపుత్రికనై
                  పట్టితి వేదాంతవేద్యుపాణిన్ చెరగన్
                  బొట్టు  నతిశీఘ్రగతి నే
                  పట్టితి దీక్ష హృదినింపి భగవద్భక్తిన్.
 
లేత వయస్సులోనే వైధవ్యముపొందిమనసు దిటవుజేసుకొని మాఘస్నాన వ్రతంబుబూని ఈ వనమున కుటీరము నిర్మించుకొని పరమేశ్వరధ్యానమున  కాలము గడుపుచున్నాను.(అరుగు చూపి కూర్చోమనును. నారదుదు కూర్చొనును)
 
నారద:- ఇప్పుడు నాకు సర్వమూ జ్ఞప్తికి వచ్చినది. అమ్మా.. వృక్షకా! నీ ఘనత వేనోళ్ళ కొనియాడబడుచున్నది. సమవర్తిని సహితం శాసించగల శక్తి నీకున్ననూభర్తను బ్రతికించుకొనుయత్నము చేయకవిధిలిఖితమునకు తలయొగ్గి వ్రతదీక్షలో జన్మధన్యము గావించుకొన నెంచితివి. నీజీవితము లోకమునకత్యంత ఆదర్శప్రాయము. భగవంతుడు నిన్ను తప్పక అనుగ్రహిస్తాడు. అంతేగాదునీచరిత్ర లోకప్రసిద్ధము కాగలదు. శుభం.
 
(తెర పడును)
 
మూడవ రంగం
 
(ఇంద్రసభ -  రంభామేనక  నాట్యం - పాట)
 
రంభ:- రంభనునేను- ప్రేమాస్పదను
            అందుకె లోకము - నా వశము
 
మేనక:- మేనకనేను - ప్రణయాంచితను
             అందుకె విశ్వము - నా వశము 
  
రంభ:- నాకను బొమగన - మదనుని ధనువు
            నా కొసచూపులు - మరుని తూపులు
           నా చిరునవ్వులు - మల్లెల జల్లులు
           నా లయహొయలు - మోహపాశములు...../రంభను/
 
మేనక:-    నా మృదుగీతలు - వీనులవిందులు
             నా నటనములూ - కనుల పండువలు
             నా ముఖబింబము - భువనమోహనము
             నా తను బిగువులు - హృదయ హరణములు.../మేనక నేను/
 
                 (మిత్ర)
 
రంభ:- మమ్ము గాంచి మా వలపుల జిక్కని
            మగధీరుండే లోక మందునను
 
మేనక:- లేడు లేడు లేడంచు బల్కెదము
             కలడను వాదము - నిలువదు లే
 
 
రంభ:- రంభను....
 
మేనక:- మేనక నేను....
 
(నాట్యం పూర్తికావస్తుండగా ఓం నమో బ్రహ్మదేవాయ..ఓం నమో బ్రహ్మదేవాయ.. అన్న అష్టాక్షరీ మంత్రం నినదిస్తుంది(ఎకో) [రెండువైపుల నుండి పొగ స్టేజి మీదకు క్రమ్ముక వస్తుంది. ఆహాకారాలు చెలరేగుతాయి]
 
ఇంద్రుడు:- ఏమి యీ విపరీతము. ఈ బ్రహ్మమంత్ర ధ్వనీయీ పొగలూ
 సెగలూ ఎక్కడివి? అమరావతి కేదో కీడు సంభవించ నున్నది కాబోలు.
 
ఉ:       ఎక్కడినుండి వచ్చె పొగలీగతి నాకము నెట్లు సొచ్చెనో
         దిక్కులుతోచవయ్యె నిదె దేవగణంబులు భీతినొందెడిన్
         ఇక్కడ నిట్టులుండె నిక నిత్తరి తక్కిన లోక వాసులున్
         నిక్కము కుందియుండెదరు నేనిక నెవ్విధి గాతు నందరన్
 
ఆకాశవాణి:- (ఎకో) దేవేంద్రా! ఈ ధూమము భూలోకములోని వింద్యాటవులనుండి రేగినది. హిరణ్యకశిపు వంశజులైన నికుంభుని పుత్రులు  సుందోపసుందులు  ఘోరతపము చేయుచున్నారు. నిదాఘకాలంబున పంచగ్ని మధ్యంబుననుశీతలకాలమున కొలని మంచునీటియందుననూ నిలిచి బ్రహ్మదేవుని గూర్చి ఘన తపంబు చేయుచున్నారు. వారి తపఃప్రభావమే యీ పొగలూయీ సెగలు.
 
ఇంద్ర:- ఔరా! యేమి వీరి సాహసము. వీరి తపములు నా యాధిపత్య భంగమునకు  కాదుగదా! ఏమో యేదియేమైననూ వీరి తపముల నిప్పుడే చెరుపవలెను. రంభామేనకా (వచ్చి నిలబడుదురు) వెంటనే భూమిపై గల వింద్యపర్వతములకెళ్ళి సుందోపసుందుల తపోభంగము గావింపుడు.
 
రంభ/మేనక:- చిత్తము. ఏలినవారి ఆజ్ఞ..(నమస్కరింతురు)
 
(తెరవ్రాలును)
 
 
నాల్గవ రంగం
 
(వింధ్యాటవి - సుందోపసుందుల తపస్సు)
 
సుందోపసుందులు:- (ఒంటికాలిపై నిలిచి చేతులు తలపై జోడించి)ఓం నమో బ్రహ్మదేవాయ..ఓం నమో బ్రహ్మదేవాయ..  
 
(రంభామేనకలు వచ్చి వారి చేతి కంకణముల శబ్దం చేస్తారు. కాలిగజ్జలసవ్వడి చేస్తారు. రెండు ఆవృత్తాల నాట్యాలు గజ్జల సవ్వడులు మారుమ్రోగేట్లు చేస్తారు. కానీ సుందోపసుందులలో కదలికరాదు. బ్రహ్మ మంత్రం అలనే జపిస్తుంటారు. కాస్తా ఆలోచించి రంభామేనకలు ఆటాపాటా ప్రారంభిస్తారు)
 
 
రంభ:-   ప్రియ సఖుడా నీ తలపే
                 మరిమరి మదిలోన కలిగి
 
మేనక:- మధుర భావములను రేపి
         మనసు పరవ సింప జేసె
 
రంభ:-            నీ అధర ఫలరసము గ్రోల
                 వనశారిక నౌదు నేను
                 నీపద కమలముల వ్రాల
               ఉదయారుణ కిరణ మౌదు.  /ప్రియసఖుడా/
 
మేనక:-            నీ తను బిళ్వమును ప్రాక
                 మాధవిలత నౌదుదు నేను
                 నీహృదయా కాశవీధి
                 తారక నై వెలిగిపోదు  /ప్రియసఖుడా/
 
(నృత్యం చాలించాలిస్తారు)
 
రంభ:-( సుందుని దరి జేరి) మగరాయడా! మనసైన సుందరి నీ యెదుటనిలచినది లే కనువిచ్చి చూడు..
 
మేనక:-(ఉపసుందుని వద్దకేగి) మన్మదాకారా! ఈ తపములేలమాపొందునకేగదా? రా! రావేల మమ్మేలుకొన వేగిరమె రావేల? లే!
              (అంటూ వారిని తాకి కదిలిస్తారు.)
 
(సుందోపసుందులు కళ్లు తెరచి కోపంగాభయంకరంగా రంభామేనకలవైపు గుడ్లురిమి చూస్తారు - రంభామేనకలు భయకంపితులై స్టేజి బయటకు వెళతారు -సుందోపసుందులు తపస్సు కొనసాగిస్తారు - ఇంద్రుడు వచ్చి చేయిచాచి యేదో మంత్రము చెప్పి వారిపై తీవ్రమైన హోరుగాలిఉరుములూమెఱుపులూ ప్రయోగిస్తాడు. వారు చలించరు. ఇంద్రుడు ఓటమి తో వెళ్ళిపోతాడు.)
 
సుందోపసుందులు:- (గట్టిగా)ఓం నమో బ్రహ్మదేవాయ..ఓం నమో బ్రహ్మదేవాయ..  
 
సుందుడు:- ఓ బ్రహ్మదేవా! కరుణింపరావా
          దేవి శారదనేలు దివ్యస్వరూపా!
 
ఉపసుందుడు:- చతురాననా! దేవా! వేదాంతవేద్య
                         నొసటి వ్రాతలు వ్రాయు విరించి దేవా!
 
సుందుడు:- రాయంచవాహనా! సత్యలోకాధిపా!
             సృస్టికర్తా! దేవా దయచూపవా!
 
ఇద్దరు:- దయచూపవేని మా గదలతో తలలు వ్రక్కలు జేసుకొని ప్రాణముల విడుతుము.(గదలు పై కెత్తుకొని)ఓం నమో బ్రహ్మదేవాయ..ఓం నమో బ్రహ్మదేవాయ..(అంటూ యిక తలలు పగులగొట్టుకో బోతారు)
 
బ్రహ్మ:- (ప్రత్యక్షమై) సుందోపసుందులారా!..  శాంతించండి. మీ తపస్సుకూ సాహసమునకూ మెచ్చితి. వరములీయవచ్చితి.
 
సుందుడు:- నామో బ్రహ్మదేవాయ.
 
ఉపసుందుడు:-నమోనమః
 
సుందుడు:
 
   అకలంకంబగు భూరిశక్తి కొఱకై యశ్రాంతమున్ మ్రొక్కెదన్
        సకలస్థావర జంగమాత్మక జగత్సంసార నిర్మాణ క
        ర్తకు నానా దురితాపహర్తకు సమస్తామ్నాయ సంధర్తకున్
        బ్రకట స్మార్త మనో విహర్తకును వాక్పద్మేక్షణా భర్తకున్.
 
ఉపసుందుడు:
               ఆతత భక్తి మ్రొక్కెద సమస్త చరాచర భూతసృస్టి వి
                 జ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి ని
 
                 ర్ణేతకు సత్యలోక వరనేతకు గల్మషజేతకున్ నత
                 త్రాతకున్ ధాతకున్ నిఖిలతాపస లోకశుభప్రదాతకున్.
 
సుందుడు:- దేవా! కోరిన వారికి కోరిన వరముల నిచ్చుటలో మీకుమీరే సాటి వరముల కోరుకొందుము ప్రసాదించండి ప్రభూ..
 
ఉపసుందుడు:- కామరూపత్వముకామగమనత్వమూ
 
సుందుడు:- సకలమాయావిత్వముఅమరత్వమూ
 
ఉపసుందుడు:- మాకు ప్రసాదించండి ప్రభూ..
 
బ్రహ్మ:- రక్షోకులశ్రేష్ఠులార! పుట్టిన ప్రతిజీవీ గిట్టక తప్పదు. గాన అమరత్వము సాధ్యపడదు.
 
సుందుడు:- అట్లైన మాకు ఇతరులెవ్వరిచేతా ..
 
పసుందుడు:- మరణము లేకుండునట్లు వరమీయుము దేవా!
 
బ్రహ్మ:- తథాస్తు! అమరత్వము దక్క మిగిలిన వరములన్నియూ మీకు ప్రసాదించితిని. లెండు. ఇక సంతోషచిత్తులై మీ నిజనివాసముల కరుగుడు. శుభం. (బ్రహ్మ మాయం. వెంటనే సుందోపసుందులు లేచి వికటాట్టహాసం చేయుదురు.)
 
 
సుందుడు:- తే:గీఇవ్వననుచునె అమరత్వ మిచ్చె బ్రహ్మ
                     చంపలేరెవ్వరు మనకు చావులేదు.
 
ఉపసుందుడు:-      ఎదిరి మనయెదుట నిలిచి నెవడు బ్రతుకు
                    తిరుగు లేదు మనకిక యీ త్రిభువనముల
 
సుందుడు:- మరొకరిచేత మనకు చావులేదు. కనుక మన మమరులమే.
 
ఉపసుందుడు:- ఈ సుందోపసుందులు అమరులూఅజేయులు.
 
సుందుడు:- మనకిక త్రిభువనములలో తిరుగు లేదు.. లేదూ..లేదు.
                 (వికటాట్టహాసం)
 
ఉపసుందుడు:- మాసాటి మగధీరు లేరీ - ఏడేడులోకాల వెదికీ                  చూచినగాని
 
సుందుడు:- ఏరి... మాసాటి మగధీరు లేరి.. (ఉదృతంగా నాట్యం చేస్తారు) 
 
 
 
(తెర పడును)
 
ఐదవ రంగం
(ఇంద్రసభ)
 
ఇంద్రుడు:-మహర్షులారా! మునులారా! సమస్తదేవతలారా! శ్రీహరి దయవల్ల యింతకాలం మనం సుఖసంతోషాలతో వుండగలిగాం. కాలము దైవాధీనము. తిరిగీ మనకు కష్టకాలము దాపురించింది.  సుందోప
సుందులు వరగర్వమున లోకములందల్లకల్లోలము సృష్టించుచున్నారు. వారు అకాలకౌముది వ్రతంచేత మరింత బలవంతులై పులిబెబ్బులిసింహరూపములు ధరించి మునిపల్లెలను భయపెట్టుచున్నారు. యజ్ఞవాటికలను అపవిత్రము చేయుచున్నారు. అంతటితో ఆగక  దిక్పాలక భువనములను సైత మాక్రమించి యమ వరుణ కుబేరాదులను బంధించి హింసించి విడిచినారు. ఇక నేడో రేపో అమరావతిపై దాడిచేయక మానరు. మనం అప్రమత్తతతో మెలగాలి. (ఇంతలో అల్లరి శబ్దాలు వినిపిస్తాయి)
 
రాక్షసులు:-(బయటి నుండి) జగత్ విజేత సుందులవారికీ... జై. మహాప్రతాపసింహ ఉపసుందులవారికీ.. జై.(మాటిమాటికి జయజయ ధ్వానాలు సభదద్దరిలేట్లు చేస్తారు. సుందోపసుందులు స్టేజిపైకి వచ్చి ఇంద్రుని ప్రక్కకునెట్టి వారు సింహాసనంపై కూర్చుంటారు. ఇంద్రుడు చేతులు కట్టుకొని ఒదిగి ప్రక్కకు జరిగి నిలబడతాడు.)
 
ఉపసుందుడు:- ఇంద్రా! రప్పించు అప్సరసలను. ఆడించు నాట్యం.
 
ఇంద్రుడు:-చిత్తం.. రంభా.. మేనకా.. (రంభా మేనకలు వచ్చి వణుకుతూ నిలబడతారు.)
 
సుందుడు:- ఏమిటా యేడుపుముఖాలు. ఏడుస్తూ నాట్యమేంచేస్తారు.
 
ఇంద్ర:- లేదులేదు. సంతోషంగా చేస్తారు. రంభామేనకా వీరు బ్రహ్మవర ప్రసాదితులు. మాన్యులు మనకు అతిథులు మీరు చక్కటి నాట్యప్రదర్శన గావించండి.(ఆటా పాటా మొదలౌ తుంది)
 
మేనక:-    సంగీతసాహిత్య సారంబు గ్రహియించి
             లయలు హొయలను గూర్చి
             అభిన యంబున జూపు
             నటన మే కడు రమణము
            (ఈ) మేనక నాట్యమే ప్రఖ్యాతము.
 
రంభ:-    నాపాద మంజీర రవళుల పులకించి
             పూల జల్లులు రాల్చె సురపొన్న శాఖలు
             నామంద హాసాల రుచులను తిలకించి
             పల్లవించిన విట్టె సహకాస్రములు మెచ్చి  
             రంభకు సరిసాటి రంభయె యనగా
 
మేనక:-            నాహావ భావాల నటనము నకు పొంగి
                 కొండ చరియల ఝరులు త్రుల్లింత విడి జారె
 
                 నామేని జిగిబిగి వయ్యారము గనీ
               విద్యుల్లత చాల విప్పారి మెఱిసె - /సంగీత/
 
రంభ:-  నా‌ఆలాపన లహరులవిని పికము
         తనగొంతు సవరించి నా తోడ పాడెను
             నా లాస్యముగని నెమలులు నా దరి
             పురివిప్పి ఆడగ ఉత్సాహమున జేరె. /నాపాద/
 
సుందుడు:- నాట్యము బహురమ్యముగానున్నది. ఇకచాలు వెళ్ళండి. (వెళ్లుదురు)
      (సుందోపసుందులు సింహసనం దిగి సంతోషంతో నృత్యం చేస్తారు. ఒకరి తర్వాత ఒకరుగా పాట మొరటుగా పాడుతారు. )
 
        మాసరి మగధీరులేరి..
         ఏడేడూ లోకాల వెదికి చూచినగాని
         ఏరీ... మాసరి మగధీరులేరి
 
         యముడు వరుణుడు అగ్నీ మరియు
         నేటితొ ఇంద్రుడు మాయధీనులు /ఏరీ/
         
         భూమియు మాదే స్వర్గముమాదే
         అతల వితల పాతాళము మాదే.
            మాసరి....
 
ఉపసుందుడు:- ఇంద్రా! 
 
ఇంద్ర:- చిత్తం..
 
సుందుడు:- వెళ్ళు..వెళ్ళి సింహాసనం పై కూర్చో..(ఇంద్రుడు తడబడతాడు)
 
ఉపసుందుడు:- వెళ్ళు.. (కసరుకొంటాడు.)
 
ఇంద్ర:- చి..త్తం..(భయం భయంగా వెళ్ళి కూర్చొంటాడు)
 
సుందుడు:- మా ప్రతినిధిగా పరిపాలన సక్రమంగా సాగించు.
 
ఉపసుందుడు:- ఇంద్రా! ఏమిటిది.. సరిగ్గా కూర్చో.. ఎందుకా ఏడుపు ఊఁ
ఠీవిగాకూర్చో (ఇంద్రుడు సర్దుకొని కూర్చొనును) ఆఁ అదీ అలాగుండాలి.
 
సుందు:- ఈ సారి మేము వచ్చినపుడు నవ్వుతూ స్వాగతం పలకాలి. పారిజాతసుమాల మాలలతో సత్కరించుఉత్సాహవంతంగా అచ్చరల నాట్యంతో మాకానందం కలిగించు.
 
ఉపసుందుడు:- సరియా!
 
ఇంద్ర:- సరిసరి..
 
 
 
సుందోపసుందులు:- (మళ్ళీ) మాసరి మగధీరులేరీ..
                               ఏడేడు లోకాల వెదికి చూచినగాని
                        మాసాటి మగధీరులేరీ.. ఏరీ..
 
(ఆంటూ కులుకుతూ వెళ్ళిపోతారు)
 
నారద:-(ప్రవేశిస్తూ) నారాయణ నారాయణ.
 
ఇంద్ర:- నారద మునీంద్రులకు నమస్కృతులు.
 
నారద:-    తే:గీ:        నిరత కళళకు నెలవైన  సురలవీడు
                       మసకబారెను ఇంద్రుడు విసుగుజెందె
                       ఇంత దైన్యత నెలకొన హేతువేమొ
                       తెలియ వెదుకమె గట్టెక్కు తెరువు కొఱకు.
 
ఇంద్ర:- నిజమే మహాత్మా! మార్గాన్వేషణము తప్పక జరుప వలసిన సమయమిది. సుందోపసుందులు మితిమీరి పోయారు.
 
:   ధాతవరంబుతోన్ బలిసి దారుణ హింసలురేపి క్రూరతన్
       భూతపిశాచ బృందముల పోరికి దింపి నవారితంబుగన్
       భూతల యజ్ఞముల్ చెరచి భూపతిశ్రేష్ఠుల కాలదన్నియున్
       నాతత శక్తిమంతులయి యల్లరిజేసిరి నాకమందునన్
 
వారు భూలోక దేవలోకములనే కాదు సమస్త చరాచర సృష్టినీ కలవర పెట్టుచున్నారు.
 
నారద:- ఆహఁ.. విశ్వమింత అరాచకమైనదా! ఇక మనకు వేరు మార్గములేదు.  సత్యలోకము వెళ్ళవలసినదే. వరములిచ్చిన ఆ విరించినే వేడుకొని పరిష్కారము కోరవలసినదే.
 
 
        కం     ఎరిగించగలడు బ్రహ్మయె
                 తరునోపాయంబు మనకు తడవదిలేకన్
                 అరుగుదము సత్యలోకము
                 చరణములంటెదము ధాత శరణార్థులమై.
 
ఇంద్ర:- అవశ్యము. అందుల కిదే సరైన సమయము.
 
నారద:- శుభం...నారాయణ నారాయణ.
 
(తెర పడును)
 
ఆరవ రంగం
 
(బ్రహ్మలోకం - ఇంద్రుడునరదుడు ప్రవేశించుదురు)
 
ఇంద్రుడు/నానరదుడు:- నమో బ్రహ్మదేవాయ.. నమో సత్యలోకాధిపా! నమోనమః
 
ఇంద్రుడు:- అంచితకళా శిల్పివై అనల్పముగా యీ విశ్వనిర్మాణము గావించిన సృష్టికర్తా ! ప్రాణుల ఫాలపట్టికల నర్హమగు వ్రాతలువ్రాయు ధాతా! వేదనిర్ణేతా శారదామనోనేతా! పాహిమాం పాహిమాం.
 
బ్రహ్మ:- దేవేంద్రా! నీ రాకలోని ఆంతర్యమేమి. నీవేదో మహోపద్రవమునకు గురియైనట్లున్నావు. ఆలసింపక విషయమేమిటో వివరించు.
 
ఇంద్ర:- దేవా!
 
        తే:గీ:      వడసి సుందోపసుందులు వరములెన్నొ
                   క్షోభపెట్టుచు నున్నారు సురల మునుల
                   వారి నెదిరించి నిల్చెడు వారులేక
                   రేగె నోదేవ యలజడి సాగె హింస.
 
నారద:- ఔను దేవా! మీరిచ్చిన వరములవల్ల వారు గర్వితులై లోకవిద్రావణులైనారు.
 
బ్రహ్మ:- నారదా! నీకు తెలియదా! మాకు వైషమ్యభావ మెక్కడిది. వారి తపస్సుకు ఫలితముగనే వారు వరముల బొందిరి. హింసరేపుట వారుచేసిన తప్పు.
 
ఇంద్ర:- దేవా! అట్లయిన..
బ్రహ్మ:- ఇంద్రా! యేల చింతించెదవు. తపస్సునకు ఫలితం వరములైతే.. హింసకు ఫలితం దారుణ మరణం. వారి అంతం సమీపించింది.
 
నారద:- వారు వరప్రభావులు. ఇతరులచేత చావరు గదా దేవా!
 
బ్రహ్మ:- నిజమే!
 
:  వారినిజంపలేరు బలవంతులు వేవురు పొరుసల్పినన్
      వారినివారె జంపుకొను వైనము నేర్పడ గూర్చు సుందరిన్
      వారలమధ్యకంపి కడువంచనచే పొరగల్గ జేసినన్
      పోరికిజొచ్చి వారు వడి పోవరె కాలుని ప్రోలు జూడగన్.
 
నారద:- చక్కని యోచన... కానీ..
 
బ్రహ్మ:- నీ అనుమానము మా కర్థమైనది. నారదా! తపోదీక్షాసమయము నాటి నిగ్రహము వారి కిప్పుడులేదు. అట్లుండినట్లైన వారీ లోకభయంకర చర్యలకు పాల్పడియేయుండరు.
 
ఇంద్ర:- మరి దేవా! 
బ్రహ్మ:- ఇంద్రా! నీ వనుకొన్నట్లు నీవద్దనున్న అప్సరసలు యిందుకు చాలరు. మహామహిమాన్వితతపశక్తియుతఅనన్యసామాన్య తేజోవిరాజితలలిత లావణ్య సుకుమార సౌందర్యరాశి యైన నూతనాప్సరస సృష్టి జరుగవలసి యున్నది. ఇదంతయూ నేను ముందుగనే ఊహించివిశ్వకర్మను రావించి అతని నీవిధముగా నాజ్ఞాపించితిని.
 
ఉ:   ఉత్తమవస్తుజాలముల నోతిలయంతటి శ్రేష్ఠ భాగముల్
      చిత్తముజేర్చి గైకొనుచు చేతనముట్టిపడంగ జేయుమీ
      క్రొత్తరుచుల్ బయల్‍పడగ కోమలి శిల్పము దివ్యమౌ విధిన్
     హత్తెద నుత్తమాత్మను మహాద్భుతలీల శుభంబు గూర్పగన్.
 
నా ఆజ్ఞానుసారము ఆతడుచేసిన శిల్పము అక్కడున్నది చూదుడు.(బ్రహ్మ అటుచూపును ఇంద్రుడునారదుడు అటుచూతురు.)
 
ఇంద్రుడు:- ఆహాఁ.. ఏమి అందము.. మహాద్భుతము.
 
బ్రహ్మ:- నారదా! భృగుపుత్రి వృక్షక తెలియును గదా!
 
నారద:- ఎందుకు తెలియదు దేవా!
 
        తే:గీ:      భర్త మరణింప వైధవ్య భయమువీడి
                   మాఘమాసపు దీక్షల మహిమ లెఱిగి
                   ఆత్మదర్శన కాంక్షియై నహరహంబు
                   తపన జెందుచు వనమున తనువు విడిచె.
 
బ్రహ్మ:- ఆ మహామహిళామణి దివ్యాత్మ సత్యలోకము జేరియున్నది. ఆ దివ్యాత్మ ముందట రాక్షసమాయలు వ్యర్థములు. ఇదిగో ఆ దివ్యాత్మను ఈ నూతనశిల్పమున ప్రవేశ పెట్టుచున్నాను. (కమండలువు లోని నీరు అటువైపు జల్లును. అటు వైపునుండి గలగల శబ్దం చేస్తూ ఒక సుందరి స్టేజిపైకివచ్చి నాల్గుదిక్కులా కలయ దిరుగుతుంది.)
 
ఇంద్ర:- (స్వగతం) ఔరా! యేమి యీ సౌందర్యము. ఈ సుందరి రూపు తిలకింప వేయికన్నులు చాలవుగదా!
 
బ్రహ్మ:- తనలో) సృష్టికర్తను నాకే విభ్రమము కలుగుచున్నది. నా చతుర్ముఖత్వము నేడు సార్థకమైనది. ఈ సుందరి సౌందర్యమును ముఖము త్రిప్పకయే కనులార నాల్గుముఖములున్నందున చూచి ఆనందించగల్గితిని.(ప్రకటముగా) ఉత్తమపదార్థములయందలి తిలప్రమాణములు గూర్చి నిర్మింపబడినదగుటచే యీ సుందరికి "తిలోత్తమ" యని నామకరణము చేయుచున్నాము. (తిలోత్తమ.. తిలోత్తమ యను ప్రతి ధ్వని వినబడుతుంది)
 
నారద:- సముచిత నామము.
 
బ్రహ్మ:- తిలోత్తమా! నీవిక మహత్తర దేవకార్యము నిర్వర్తింపవలసియున్నది. ఇదిగో.. యీతడే స్వర్గాధిపతి దేవేంద్రుడు. నీవు దేవసభ నర్తకివై పేరొందుటేగాక సుందోపసుందులను ధూర్తరాక్షసుల ఆట కట్టించవలసి యున్నది. సర్వమూ నీ కెఱుక పడగలదు. ఇక తిలోత్తమను మీవెంట తీసికొని పొండు. శుభం.
 
నారద:-ఆహాఁ .. ధాతా! పరమేష్టీ! మీ దర్శనము ద్విగుణీకృత ఫలదాయకమైనది.
        తే:గీ     తీరు సంక్షోభ మీయింతి కారణమున 
                   అమరసభజేరె నికొక్క అప్సరసయు
                   మేలుపై మేలు జేకూరు కాలమయ్యె
                   జేకొనుము దేవ దండమ్ము సెలవు మాకు.
 
 (చేతులెత్తి నమస్కరించును) నారాయణ.. నారాయణ
 
(తెరపడును)
 
 
ఐదవ రంగం
(వింద్యాటవి)
 
తిలోత్తమ:- (ప్రవేశించి) ఆహాఁ.. ఈ వింద్యాటవి ఎంత సుందరమై యున్నది. ఈ కొలనులూ అందలి కమలములూవాటి నాశ్రయించి తిరుగు షట్పదములుఆ షట్పదములు చేయి ఝుంకారములు కనులకింపై కర్ణపేయమై ఆనందము గూర్చుచున్నవి. ఔరా ఈ వనమల్లియ సాలమును పెనవేసుకొని ప్రాకిన విధము అద్భుతముగ నున్నది. శుక,పికవనకుక్కుటారావములు సైతమూ ఆహ్లాదములు గొల్పుచున్నవి. ఇది మున్ను ప్రచేతస పుత్రుడైన దక్షుడు తపమాచరించి హరిచే     వరములబడసిన ప్రదేశము. మోదంబై పరిదూషితఖేదంబై శాబరీద్ద కిలికించిత దృగ్భేదంబై యొప్పు బహుసౌమ్య రమ్యస్థలంబు.
        కం:       పుణ్యంబై మునివల్లభ 
                  గణ్యంబై కుసుమఫల నికాయోత్ధిత సా
                  సాద్గుణ్యంబై వింద్యాఖ్యా
                  రణ్యంబు నుతింపదగు నరణ్యంబులలోన్
ఇట్టి ఈ ప్రదేశము సుందోపసుందులకు వాసంబై ఆధ్యాత్మిక వైభవశూన్యంబైనది. ఇక నేను ప్రవేశించితినిగదా! పూర్వవైభవము త్వరితగతిని సంతరించుకోగలదు. చూచెదగాక ఈ సుందోపసుందు లెంతటి శక్తిమంతులో.
 
        ఆ:వె:     కాలు గెలువవచ్చు కరిబలుల్ గావచ్చు
                  మృత్యుభయము తొలగి మెఱయవచ్చు
                  ఆడుదానిచూపుటంపరలకు తాలి
                  నిలువ తరమె చూడవలయు నిపుడు.
 
అడుగో ఉపసుందుడు కాబోలు యిటే వచ్చుచున్నాడు. ముగ్గులోనికి దించుటకిదే తగిన సమయము. (కాలు జారి పడినట్లు నటించి) అమ్మో..(కేకవేయును)
 
ఉపసుందుడు:- ఎవరక్కడ (పరుగున వచ్చి -  స్వగతం) ఎవరీసుందరి (వెళ్లి తిలోత్తమ కాలు తన ఒడి లోనికి తీసుకొని మర్ధన చేయును. తిలోత్తమ లేచి నడువలేనట్లు నటించును. ఉపసుందునిపై వాలును. తిలోత్తమస్పర్శకు ఉపసుందుడు పులకించి పోవును. ఒడిసి పట్టుకొని నడిపించును. తిలోత్తమ కాసేపటికి బాగా నడచును)
 
తిలోత్తమ:- జారి పడితినంతే.. ప్రమాదమేమీ జరుగలేదు. (అంటూ వెళ్ళి రాతిపై కూర్తొండును. వెనక్కు జరిగి ఉపసుందుని అనుమానంగా చూచును.
 
ఉపసుందుడు:- సుందరీ! యేల నీకు జంకు.
 
        తే:గీ    భీతహరిణేక్షణా నిను నీతలమున
                   గాననెన్నడు నెవ్వరిదానవీవు 
                   నిటుల నొంటిమై చరింప హేతువేమి
                   పలుక వెరపేల నేనుండ భయమదేల.
 
తిలోత్తమ:- హితుడా! నేను బ్రహ్మలోకవాసిని. అప్సరసను చెలులగూడి వింద్యా విహారమునకు వచ్చితిని. మంత్రము మరచి నేలకూలబడితిని. చెలులేమో బ్రహ్మలోకమునకేగిరి.(బేలయై యేడ్చును)
 
ఉపసుందుడు:- (కన్నీరు తుడిచి) ఏడవకేడవకు నీకువచ్చిన ఆపద లేదు. ఇక్కడ నీ కేకొదువారాదు.
 
తిలోత్తమ:- ఇంకనాకు మా లోకము వెళ్ళు మార్గమేలేదా! 
 
ఉపసుందుడు:- ఏమున్నది బ్రహ్మలోకమున? మా సామ్రాజ్యమైన ఈ విద్యాటవీ సానువులు సుందరములు. నీవో మహాసుందరివి మీదుమిక్కిలి నా యండయున్నది. ఇక్కడ నీవు యిచ్ఛవచ్చినరీతి హాయిగా విహరింపుము.
 
తిలోత్తమ:- నిజముగ నీవు నాకు ఆండగ నిలుతువా
 
ఉపసుందుడు:- నీయంతటి సుందరికి తోడుగ నిలుచుటకంటే భాగ్యమున్నదా?
 
సీ:    నిండుచందురుబోలు నెలతుక నెమ్మోము
             భ్రమర పిండుకు తోడు భామకురులు
      పద్మములకు సాటి పడతి నేత్రంబులు 
             తిలపుష్పమకు సాటి లలన ఘ్రాతి 
      ముత్యములకుసరి ముదిత దంతచయము 
             బింబఫలముసాటి ప్రియయధరము
      ముకురంబులకుసాటి ముదిత కపోలముల్
             శంఖమునకుసాటి సఖియ కంధి
 
ఆ:వె:     హేమకాంతికి సరి యింతి దేహఛాయ
          జక్కవలసరి చెలి చన్నుదోయి
          చిగురుటాకులసరి చెలి కరచరణముల్
          తనకుతానెసాటి తరుణిమూర్తి.
 
తిలోత్తమ:- నేనంత అందంగా ఉన్నానా?
 
ఉపసుందుడు:- నీయందము నీ కెటుల తెలియునుమాకుగదాతెలియును.(ఇద్దరూ నవ్వుదురు)
 
 
పాట
 
        ప్రేయసీ...
 
                 నినుగనినంతనె - నాయెదనేదో
                 తెలియగలేని - కలవరమాయె
 
తిలోత్తమ
        ప్రియా....
 
                 నినుగనినంతనె - నాయెదనేదో
                 తెలియగలేని - కలవరమాయె
ఉపసుందుడు
 
               ఈ వని నందన - వనముకు సరియై
               ఈ భూజములే - కల్పతరువులై
                 పారిజాతవిరి - జల్లులు మనపై
                 కురిపించీ మై - మరపించినవీ..../నినుగని?
తిలోత్తమ:
 
               ఇదియే అదనని - మదనుడు విలుగొని
                 విరితూపులనే - కసిగా విడువగ
                 ఎద తాకిన ఆ - మృదుబాణములకు
                 పరవశమైనది- నా మానసము
ఇద్దరు:
               ఇకపై ఒకటై - మనమిరువురము
                 రతిమన్మదులకు -  మారురూపమై
                 అవధు లెరుంగని - ఆనందమ్మున
                 విహరింతములే - ఈ వన భూముల
 
(లైట్స్ ఆఫ్ అండ్ ఆన్ - ఇంతలో మరొక అడవి శీను మార్చాలి)
 
(అరుగువంటి రాతిపై తిలోత్తమ ధ్యానముద్రలో నిశ్శబ్దంగ కూర్చొని వుంటుంది. ఒంటికన్ను తెరచిఅటూఇటూ చూచిలేచివయ్యరంగా నడచిసుందుడు వచ్చుట గమనించివెంటనే వెళ్ళి మళ్ళీ ధ్యానముద్రలో కూర్చొంటుంది)
 
సుందుడు:- (ప్రవేశించి) ఎవరీ లావణ్యవతిఆ ముక్కుమొగముకనుబొమలు యెవరో మహాశిల్పి కొలతలు నిర్ణయించి మలచినట్లున్నది. శరీరవర్ణము జంబీరఫల సమమై కాంతులీనుచున్నది. పలుకరించి చూతము... రమణీ..  ఓ రుచిరాంగీ! (తిలోత్తమ కనులువిచ్చి చూస్తుంది.)
 
తిలోత్తమ:- (లేచినిలచి కులుకులొలుకుతూ) ఎవరూ.. ఎవరుమీరు. నా ప్రియుని సమాగమమునకై తపముచేసుకొనుచుంటిని. భగ్నముచేసితిరి. (అలక నటించును)
సుందుడు:- ఏమంటివినీ ప్రియుని కొఱకై తపముచేయుచుంటివాఎవరు.. ఎవరు నీప్రియుడు.
 
తిలోత్తమ:- ఏమో.. నాకేమెఱుక..
 
        తే:గీ     విధము వివరించి మాతండ్రి విశ్వకర్మ
                   ప్రియుని కొఱకై తపములు నియతితోడ
                   జేయమని జెప్పి వింద్యకు జేర్చి చెనియె
                   కూర్మితోడుత నేనిట కూరుచుంటి
 
సుందుడు:- ప్రియుడెవడో తెలియదా? అతనికై తపము చేయుచుంటివా?
 
తిలోత్తమ:- (హొయలొలకబోస్తూ) ఔను మాతండ్రి విశ్వకర్మ జెప్పెనుతపోబలసంపన్నుడువీరాధివీరుడుసుంద నామధేయుడు వచ్చి నను వరింపగలడట. అంతవరకూ నేనిట తపము చేయవలె.
 
సుందుడు:- (మందహసము చేసి) రమణీ.. నీ తపస్సు మొదలుపెట్టిననాడే ఫలించినది. నేనే.. నేనే.. ఆ సుందుడను. అరివీరభయంకరుడనువిరించి వరప్రసాదిత మహాతేజుడను.
 
తిలోత్తమ:-ప్రియా!.. (ఆనందముతో చేతులుచాచును) రావా! నన్నేలరావా!
 
సుందుదు:- (నవ్వి) అదృష్టవంతుడెవడైనా వలచివచ్చిన సౌందర్యరాశినివదలుకొనునాఇకనీవే నా రాణివి.
తిలోత్తమ:- ఔను.. మాతండ్రి యీమాటే చెప్పెను "నీవే నా రాణివి" అంటూ నీ ప్రియుడు నిను చేరవచ్చునని ఒక సంజ్ఞగా చెప్పెను. నీవు నాసుందుడవే..ప్రియా! (అంటూ దరిచేరును)
 
సుందుడు:- ప్రేయసీ..(అక్కున జెర్చుకొనును. కొంతసేపటికి వదలి) సుందరీ నీ యందము అద్భుతము..
 
        సీ:  మేనక కీపాటి మేనివర్ణములేదు
                 కాన నీ సరివచ్చు కాంతకాదు
             రంభకు నీసరి రసికత కనరాదు
               కాన నీ సరివచ్చు కాంతకాదు
                 ఊర్వశి యందిట్టి ఒడుపులేమియులేవు
                          కాన నీ సరివచ్చు కాంతకాదు
                 విశ్వాచి కింతటి వికసనంబులులేవు
                          కాన నీ సరివచ్చు కాంతకాదు
 
        తే:గీ     పొగడనలవియె కానట్టి సొగసు గలిగి
                   కనగ తనివి తీరని రూప మనగ నెగడి
                   ధాతచేసిన యింతుల తరచిచూడ
                   నీకు సరివచ్చు తన్వంగి నీవె సుమ్ము.
 
తిలోత్తమ:- చతురుడవే...
 
పాట
 
సుందుడు:-        మెఱుపు తీవెవై - దివివిడి భువికి
                    దిగివచ్చిన నా - దేవతవీవు
 
తిలోత్తమ:-     భువిపై రవివై - నావ్రత ఫలమై
                   నాకై వెలసినా- మగధీరుడవూ
 
సుందుడు:-        నామానస కా - సారము నందున
                          వికసించిన కాం - చన కమలమవు
 
                     నాజీవన వన - మున అడుగిడిన
                                    మధుమాసంబన-నీవే కావా!...../మెఱుపు/
 
  తిలోత్తమ:-       నా హృదయంబను - వీణియ పైనా
                 పలికిన సుమధుర - గీతము నీవె
                నా మానస పం - జరమున జిక్కిన
                వనశారికవూ - నీవేకావా!......./భువిపై/
 
ఇబ్బరు:-  మనసునమనసై - తనువున తనువై
              ప్రకృతిపురుషుల - సంగమేయై
              ఈ వనశోభకు - ప్రాణము మనమై
            ఆనందావధి - మీరి చరింతమా! 
 
సుందుదు:-  మెఱుపు దీవెయై....
 
తిలోత్తమ:- భువిపై రవివై...
 
(తెర పడును)
ఆరవ రంగం
 
(సుందోపసుందుల స్థావరము)
 
(సుందుడు కండలు చూపుతూ వ్యాయామం చేస్తూ వుంటాడు. ఉపసుందుడు ఖడ్గమునకు రాతిపై పదను పెడుతూ వుంటాడు)
 
ఉపసుందుడు:- అన్నా యీనాడు తమరు చాల ఉత్సాహంగా నున్నారు. కారణమేమిటో తెలిసికొనవచ్చునా?
 
సుందుడు:- (వ్యామామం చాలించి) తమ్ముడూ.. నా విషయం చక్కగా గ్రహించావు. కానీ నీలోకూడా యేదో తెలియని కళ ఉట్టిపడుచున్నది.
 
ఉపసుందుడు:- నిజమే అన్నయ్యా.. మీరూ సరిగానే ఊహించారు. నాజీవితంలో కల్యాణఘట్టం సంఘటితం కానున్నది. నేనొక సుందర కాంతను చూశాను. ప్రేమించాను. ఆసుందరీ నన్ను ప్రేమించింది.
 
సుందుడు:- అరే.. తమ్ముడు.. నీవు నా కథ చెబుతున్నావు.
 
ఉపసుందుడు:- మీ కథా..
 
సుందుదు:- ఔను నేనొక రమణిని చూశాను. నాకోసమే ఆ రమణి దివినుండి భువికవతరించినది. ఆ యింతికి నా మనసిచ్చేశాను. లేదులేదు ఆ యింతియే నా మనసు హరించేసింది.
 
ఉపసుందుదు:- చాల సతోషము. అన్నగారికి వివాహము గాకుండా ఏనెట్లు నుద్వాహము కావలెనని విచారించుచుంటిని. ఆ విచారము తీరిపోయినది. ఇక మనిద్దరి వివాహములకూ ఒకే ముహూర్తము.
 
సుందిడు:- ఆహాఁ... మహదానందము.
        తే:గీ      జననమైతిమొకే గృహంబునయమోఘ
                    తపము జేసితి మొక్కటై ధాత దలచి
                    ఒక్కటై వరములగొని ఒక్కటౌచు
                    విజయముల బొంది బడయమె వినుతకీర్తి.
ఉపసుందుదు:- అన్నా...
        తే:గీ.      అట్టి మనకొక్క దినమందె అంగరంగ
                    వైభవంబుగ పెండ్లియై వరలుచుండ
                    సమరమునసార సంసార గమనమునను
                    లేరుమనకింక సరివచ్చు వారు లేరు.
 
సుందుడు:-తమ్ముడూ మనమిప్పుడేలెళ్ళి మనల వలచిన నతివలను గొనివత్తము. కులగురువులకు కబురు పంపెదము బంధు మిత్రుల నాహ్వానించెదము.(ఇంతలో తిలోత్తమ యెదురుగా కనిపిస్తుంది) ఆహాఁ.. నాచెలి అనుకుంటుండగానే విచ్చేసినది. అదిగో ఆమే నీకు కాబోయే వదిన.
 
ఉపసుందుడు:- అన్నా.. పొరబడుతున్నావు. ఆ యింతీ నాప్రేయసి. నేను వివాహము చేసుకొనబోవు సుందరి.
 
సుందుడు:- తమ్ముడూ.. సరిగాజూడుము నీవు పొరబడుచున్నావు.
 
ఉపసుందుడు:- (విసుగ్గా) అన్నా..హాస్యాలికచాలు. ఆమె నీకు కాబోయే మరదలు. నాకు కాబోయే బార్య.
 
సుందుదు:- ఇది హాస్యములాడు విషయమా? (కోపంగా) ఉపసుందా! నీవు నిజముగా పొరబడుచున్నావు. జాగ్రత్తగాచూడు..
 
నారద:- (ప్రవేసించి) నారాయణ.. నారాయణ. సుదోపసుందులవారు యేదో తీవ్రవిషయమై చర్చించు కొంటున్నట్లున్నారు.
 
సుందుడు:- నారదమినీంద్రులకు వందనములు.
 
ఉపసుందుడు:- నమస్కారములు.. దయచేయండి మహర్షి.. వచ్చి ఆసీనులు కండి.(నారదుడు కూర్చుండును)
 
నారద:- మహిళమణీ.. వీరికి కావలసినదానివలె కనుపించుచున్నావు. రమ్ము వచ్చి నీవునూ కూర్చొనుము. (తిలోత్తమ వచ్చి కూర్చొనును)
 
సుందుడు:- మహర్షీ.. యీ యువతి నాకు కాబోయె భార్య.
 
ఉపసుందుడు:- అన్నా ..(కోపంగా) మరల అదేమాట. ఆయింతి నా ప్రేయసి
 
సుందుడు:- ఉపసుందా! హద్దుమీరు తున్నావు. (కోపముతో గుడ్లురిమి చూచును)
 
నారద:- ఇదేదో జటిల విషయముగానున్నది. నేను విచారించెద. కొంత సంయమనము పాటింపుడు.(తిలోత్తమవైపు చూచి) మహిళామణీ యింతకూ వీరిలో నీప్రియుడెవరు
 
తిలోత్తమ:- దేవర్షీ.. వీరు నామాట వినునట్లు లేరు. ఒకవేళ నేనేదైనా చెప్పిననూ వీరి కలహ మధికమగునేకానిశాంతించరు. నామాట యేఒక్కరికి నచ్చకపోయిననూ రెండవవారు నా ప్రాణములు తీయక మానరు. కనుక నేనొక నిర్ణయమునకు వచ్చితిని. మహర్షీ.. వీరిరువురూ పరాక్రమవంతులు ఘనులు వీరిలో యెవరైననూ సరియే వివాహమాడెదను.
 
సుందుడు:- చెలీ.. నేను.. సుందుడను. నాకోసమే నీవు పుట్టితివి.
 
ఉపసుందుడు:- సుందరీ.. నేను ఉపసుందుడను.. నేనే నీ ప్రియుడను.
 
తిలోత్తమ:- మహావీరులారా నేనేమిచేయుదును  అబలను. నేనేమి చెప్పిననూ ఒకరికి నచ్చునుమరొకరికి నచ్చదు. ఎట్లైననూ నాకు ఆపదతప్పదు. అంతేకద! కనుక
 
        కం:       వలచెద మీయందొక్కని
                  తెలుపుడు నావరు డేవండొ తేలిన వెనుకన్
                  తలపను మనమున నితరుని
                  నెలతన్ నను కష్టపెట్ట నీతియె మీకున్
 
నారద:- ఈ పరిస్థితులలో కాస్తా కష్టమేయైనా.. పరిష్కరించవలసింది నీవేనమ్మా..
 
తిలోత్తమ:- దేవర్షీ వీరిలో బలవంతు డెవ్వరో వారినే వివాహమాడెదను. ఆప్పుడు బలహీనునుని వల్ల నాకాపద రాదుగదా!
 
        కం      బలవంతుండెవ్వం డని
                 యలుపెరుగని వీరుడెవడు ఆతడెనన్నున్
                 వలచెడి వాడైన సరియె
                 నిలుపుడు నాయెదుట. వాని నెయ్యము శుభమౌ.
 
సుందుడు:- అట్టి బలవంతుడ నేనే..
 
ఉపసుంద:- కాదుఅట్టి వీరాధివీరుడ నేనే..
సుంద:- బ్రహ్మ నాతపమునకే ప్రత్యక్షమాయెను. వీడునూ ప్రక్కనుండుట వల్ల దర్శించెను... అసలు నేనే నిజమైన వరప్రసాదితుడను.
ఉపసుంద:- ఔరా! ఎంతమాట? ఇది అబద్దము. అంతెందుకూ ఇంద్రయమవరుణాది దుక్పాలకుల నెదిరించి గెలిచినదెవరు. నేనుకాదా?
 
సుంద:- నావెనుక నడిచి నీవునూ కీర్తి బొందితివి. అంతియేకానీ..
 
ఉపసుంద:-(కోపముతో) అన్నా..  భూలోక సంక్షోభము నా పనికాదా?.. నిజము చెప్పుము. 
 
సుంద:- అందులో కొంత చేసితి వనుకొందును. అదియూ మునిపల్లెలు తగులబెట్టుటయజ్ఞయాగాది క్రతువుల చెరచుట వంటివి.. అంతే అదియూ వీరత్వమే?
 
ఉపసుంద:- అన్నా.. నా ఓర్పునకు పరీక్ష పెట్టుచున్నావు.
 
సుంద:- అల్పుడివి.. నీవేమి చేయగలవు.
 
ఉపసుంద:- (ఆగ్రహంతో) అన్నా..(పళ్ళు పటపటా కొరుకును మీదికి పోబోవును)
 
నారద:- ఆగండి.. ఆగండి.. ఇక యీ విషయము ఇంతటితో తేలునది కాదు.
సుందుడు:- దేవర్షీ.. ఇకమీరేతేల్చవలసి యున్నది. పెద్దలు.. మీ నిర్ణయము మాకు శిరోధార్యము.
 
ఉపసుందుడు:- దేవమునుల తీర్పు మాకునూ సమ్మతమే.
 
నారద:- ఇక చేయునదేమున్నదిమీలో బలవంతులూవీరులూ యెవరో తేలవలెనన్న.. తులారణమే శరణ్యము.
 
ఉపసుందుడు:- నిజమే.. ఇంతకంటే గత్యంతరము లేదు.. నేను సిద్ధమే (జబ్బలు చరుచును)
 
సుందుడు:- నేనూ సిద్ధమే..రా తేల్చుకొందము.
 
(ఇద్దరూ కలబడుదురు .. ఘోరంగా మల్లయుద్దము చేయుదురు. ఆఖరుకు సహనము నశించి పెద్దగా పొడబొబ్బలుపెట్టి ఒకరిపై ఒకరు గండశిలలను ఒకేసారి వేసికొందురు. తలలు పగిలి నేలబడి చత్తురు. ఇదంతయూ కలర్ వీల్ తో స్టేజ్ బ్లర్ చేసి చూపించి రక్తి కట్టించవచ్చును.)
 
ఇంద్రుడు:- (ప్రవేశించిసుందోపసుందుల మృతదేహాలను గమనించి) ఆహాఁ.. నేటికి యీ లోకకంటకుల పీడ విరగడైనది. తిలోత్తమా నీకు ముల్లోకములూ ఋణపడి యున్నవి. నీవు ధన్యురాలవు.
నారద:- తిలోత్తమా! నీ యవతారము సఫలీకృతమైనది. ఇక స్వేచ్ఛగా నీవు ఇచ్ఛవచ్చిన లోకముల సంతోషముగ నుండవచ్చును.
 
తిలోత్తమ:- మహాత్ములార.. గమనించితిరిగదా! స్త్రీవ్యామోహమున విడదీయరాని సోదరులూమహాబలవంతులూవిరించివరప్రసాదితులూ నైన సుందోపసుందులు నేలకొరిగిరి. అంతియెకాదు హింసాప్రవృత్తితో లోకముల నల్లకల్లోలము గావించిన వారికి పతనము తప్పదని వీరి చరిత్ర మరొకసారి నిరూపించినది. ఈ సుందోపసుందుల జీవితములు సమస్త జీవకోటికీ ఒక మేలుకొలుపు.
 
నారద:- తిలోత్తమా! సత్యము వచించితివి. తామసులు చెడెదరుసాత్వికులు  శుభములందెదరు. ఇదియే సృష్టిరహస్యము. దైవ నియమము.
 
తిలోత్తమ:- ఇక నేను గంధమాదన పర్వతములకు వెళ్ళి కొన్నాళ్ళు విహరించివిశ్రాంతి గైకొని చంద్రలోకయానము చేయదలచితిని. నాకిక సెలవు దయచేయుడు.
 
ఇంద్రుడు:- అవశ్యము. తిలోత్తమా! బ్రహ్మనియమానుసారము నీవు దేవలోక నర్తకివి. ఈ పదవి నీకు శాశ్వతము. నీ యిష్టానుసారము నీవు లోకముల విహరించితదనంతరము నీ పదవి నీవు గైకొన వచ్చును. నీరాకకై మేము వేచియుందుము.
 
నారద:- శుభం.
 నీగుణజాలమూ - లెన్నగలేక

***

No comments:

Post a Comment

నాకు చదువురాదు, Naaku Chaduvu Raadu

  నాకు   చదువు   రాదు ( ఏకపాత్రభినయము )     (పాత్ర: ఓ 50 సంవత్సరాల  పేద పెద్దమనిషి ) అమ్మా!  శారదా ... ( బోరున   యేడ్చును ).  తల్లీ   యీ   గ...