Sunday, 18 July 2021

శ్రీకృష్ణ-శకుని,Srikrishna-sakuni.

శ్రీకృష్ణ-శకుని

     



కృష్ణ:- ఆహా... యీ యమునాతీరమెంత ఆహ్లాదకరముగా నున్నది.

 

    చకనులకు విందుసేయు  కనకాంబురుహంబుల నవ్యతేజమున్

          త నువు గగుర్పులొంద వడితాకు  ప్రపాత  తుషార తెమ్మెరల్

         మసున శాంతిగూర్చు  మహిమాన్వితమై  యలరారు  హంసలున్

         నెనయగునేది? యమునయేటి తటంబున కెయ్యదేనియున్.     

                                      

నా బాల్య రాసక్రీడా విశేషంబులన్నియు మరల నా మనోఫలకమున కదలాడుచున్నవి.ఆముచ్చట లిక తలచుకొనుటకేగాని  మరల  ఆనందమును మరలింప నసాధ్యముగదాఅదీ కాలమహిమపరిసరములింత ప్రశాంతముగనున్ననూ మేధస్సు నిరంతర వ్యూహాత్మక రచనలతో నిండి వేడెక్కు చున్నదినేనీ హస్తినకు పాండవరాయబారినై వచ్చితినిసంధి విఫలమైనదిఎన్నివిధముల నచ్చజెప్పినూ దుర్యోధనునకు శాంతి రుచించలేదుకర్ణ శకుని దుశ్సాసనాదు లతనిని హితము విననీయలేదు కడకు రాయబారినైన నన్ను బంధించుటకు సైతము విఫల యత్నము గావించినారుకృష్ణరాయబారము విఫలమైనదని లోకము భావించుచున్నదికానిమ్ము యీ పర్యవసానము నే నూహించనిది కాదుగదాఊహించినదేవిఫలకార్యమున సైతమూ ననుకూల ఫలితముల బోందుటే  వివేకవంతుని లక్షణముఒక విధమున జూచిన నా ప్రయత్న మిప్పటికే సత్ఫలితముల రాబట్టినదియుధిష్ఠిరుడు ధర్మాత్ముడుదుర్యోధనుడే దుష్ఠుడను ముద్ర వాని వీపున యిప్పటికే ముద్రించివైచితిని గుడ్డిరాజు దృతరాష్ట్రుడు కపటి పుత్రపక్షపాతి 

యని లొకమున వెళ్ళడియగు నట్లు జేసితినిఇక  కర్ణుడున్నాడు  అతడజేయవిక్రముడుఅతడు కుంతీ పుత్రుడన్న వాస్తవమతనికి తెలియవలసి  యున్నదికుంతీకర్ణులు కలసి  తల్లీబిడ్డల బంధముధ్వేగమునకు దారితీసి అతని వలన పాండవులకగు నపకారమును నివారించవలసియున్నదిఅతని వీరాటోపములన్నియు కురుక్షేత్రమున వీరస్వర్గమలంకరించుటకే గానీ దుర్యోధనుని గెలిపించుటకేమాత్రముపయోగ పడరాదు కార్యము రేపు సూర్యోదయమున నిర్వర్తించెదగాక!  ఇప్పుడు శకునితో సమాలోచనము జరుపుట నా ముఖ్య కర్తవ్యము అతని సందర్శనమునకై నా మనస్సు తొందర పడుచున్నదిఅతడు నా కత్యంత ప్రియతముడు ధర్మజుడు రాజ సూయమున  మాకు  కాన్కగా నిచ్చిన  ప్రియదర్శినిలో దర్శించిన బలరామసాత్యకులకీ విషయమిప్పటికే విదితములోకమునకిది ప్రస్తుతము రహస్యము.అతడిచ్చట నన్ను కలుసు కొందునని మాట యిచ్చి యున్నాడుగాంధారనరేంద్రుడిచ్చిన మాట  తప్పడుఇప్పటికిచ్చటికి వచ్చి యుడవలసినదే.. యింకనూరాడే?... అడుగో మాటలోనే వచ్చుచున్నాడు... గాంధారభూపతులకు సాదర ప్రణామములురండు.. మీకొరకే నిరీక్షిస్తున్నను.

 

శకుని:-శ్రీకృష్ణా కపటవేషధారీ.. నమస్కృతులు.

 

కృష్ణ:- గాంధారరాజా.. శకునీనన్నెందుకట్లు సంభోదించుచున్నారో..  మరి నేను కనబరచిన కపటమేమున్నది.. నన్నపార్థము జేసుకొంటిరి.

 

శకుని:- కృష్ణానా కుటిలత  నీ కపటము లోకమునకు తెలియక పోవచ్చును కానీ నా విషయము నీకు నీ విషయము నాకు ప్రస్ఫుటమే కదాఇంకనూ ముసుగులాటలో గుద్దులాటలెందులకు.. నందనందనా సంధిచెడి యుద్ధమనివార్యమైనదిఇక మనము రణరంగమున తారసిల్లవలసి యుండగా యీ అనవసర సమావేశమేల అభిలసించితివి.ఇంకనూ మనకీ యెత్తులు పైయెత్తులు అవసరమాఇంతకూ నన్నిక్కడకు రమ్మనుటలో నీ ఆంతర్యమేమికృష్ణా తెలియజేయుము.

 

కృష్ణ:- ఐనదేదో అయినదిరాజా శకునిఇక నేనూనీవు తలలు బ్రద్దలు కొట్టుకొని యోచించు సమయము గతించినదిమనమిక  కురుపాండవ బలాబలప్రదర్శన కురుక్షేత్రమున తిలకించ వలసి యున్నదిశకునీ మనమీ ధరాతలమున యెంతకాలముందుమో మనకే తెలియదుఇదే మనము నాలుగు మాటలు మాట్లడుకొనుటకు తుది యవకాశముఇప్పుడైనా మన మిరువురము కలసి అరమరికలులేక మనసువిప్పి మాట్లడుకొనలేమా?

 

శకుని:- కృష్ణా.. నిక్కము బల్కితివి రాజకీయ కుల్లూకుతంత్రములతో మునిగితేలి విసిగి వేసారినమాట వాస్తవముత్రికరశుద్దిలేని ప్రవర్తనతో గుండెబరువెక్కి యుండుటయూ నిజముఇకేమి కావలయును. కావలసిన దంతయూ అయిపోయినదిఇకనేను నిజముజెప్పిననూ కల్లలాడిననూ కాదనువారునూ లేరుకాదగు కార్యమూలేదునిజమే చెప్పెదనుఅదియూ మనసువిప్పి మాటాడెదనుకొంత గుండెబరువైనను తగ్గును.

 

కృష్ణ :- మంచిది మనము  మనసువిప్పి మాత్లాడుకొనెదముసరి.. గాంధారరాజా.. దుర్యోధనుడు నీ మేనల్లుడుమేనమామయన మేనుకుమేనైన వాడని లోక నానుడి  నిజమునకు నీవాతని మేలు కోరవలెనుకానీ సంధి ప్రస్తావానను పట్టుబట్టి చెడగొట్టిఅతనిని యుద్ధోన్మాదిని చేసి మృత్యువుదరి చేరుస్తున్నావు.. కాదంటావా?

 

శకుని:- కృష్ణా..నీవు సమాన్యుడవు కావునీవునా హృదయగత విషయమునిట్టే పసిగట్ట గలిగితివిఇక దాపరికమెందులకు.. వినుము కురువంశీయులు పరమ దూర్తులుకఠినపాషాణ హృదయులువీరి దౌర్జన్యమున కంతేలేదుకానీ  వీరు శక్తిమంతులుఅందుకే వీరు ఆడినది ఆటగా పాడినది పాటగా చెల్లుబాటైపోతున్నదికాలమెప్పుడూ  బవంతులవైపే మొగ్గుచూపుతుందిఔను..అందుకే వీరి మాటే వేదమువీరు చేసినదే న్యాయముదానికందరూ తలలూప వలసినదేఎదురుపల్కు సాహస మెవ్వరు చేయగలరు?

 

కృష్ణ:-శకునీ.. ఎందులకట్లనుచున్నవువారు నీకు చేసిన అన్యాయ మేమున్నది.

 

శకుని:- అన్యాయము అక్రమము.. వరుసగా వారు చేసినదంతయు అన్యాయము అక్రమము దౌర్జన్యమేప్రేమావాత్సల్యములను పదములే తెలియని కఠినుడు వీరి పితామహుడు భీష్ముడుఅతడు అంధదృతరాష్త్రునకు నా సహోదరినిమ్మని అడుగుటకు వచ్చెను నా సహోదరి గాంధారి జగదేక సుందరి సుగుణాలరాశిఒక పుట్టుగ్రుడ్డికి ఆమె నిచ్చుటకు నాకు ససేమిరా ఇష్టము లేదుకానీ  బశాలినిరంకుశుడు నైన భీష్మునికి తలయొగ్గి మా తండ్రి సుబలమహారాజు నా నోరు నొక్కివైచెను.

 

కృష్ణ:-అట్లనెదవేల శకునిరాజానీ సహొదరి ఇష్టపడి దృతరాష్ట్రుని పరిణయమాడెనట గదాఇది లోకవిదితమైన  విషయముగదామరిమీరేమో..

 

శకుని:- గాంధారి  మహావిఙ్ఞురాలు.. ఆమె  మనసులోనిమాట నేనెరుగను గానీ.. నా కర్థమైనది మాత్రమొక్కటేనా సహోదరి మమ్ము మా రాజ్యమును కాపాడగోరి..  భీష్ముని ప్రతాపాగ్నికి సమిధలము కాకూడదని  మదినెంచి అలా వెల్లడించినదని  నా సందేహముమా కొరకామె త్యాగముచేసినదని నా నమ్మికకాకున్న ఆయమకేమి తక్కువని జాత్యంధుని కోరి వివాహ మాడును.

 

కృష్ణ:- యోచించిన నీ నమ్మికా.. సక్రమమైనదనే అనిపిస్తున్నది.. ఔరా పురుషాధిక్యతకు అహంకారమునకు మహిళామతల్లు లిట్లెందరు బలై యుందురో గదా!

 

శకుని:- కదాయని దందేహము వెలిబుచ్చనేల.. కాశీరాజనందన అంబజీవితము నీ భీష్ముడు రెంటికీచెడ్డ రేవడి గావింపలేదాఆమె యెదురుతిరిగి న్యాయమడిగి సర్వనాశనమైనదిఇది లోకమునకు తెలియదా?

 

కృష్ణ:- నిజమేఆఖరకు భీష్మునిగురుడు పరుశు రాముడు  కూడా ఆమెకు ఇసుంతైనా న్యాయము చేయలేకపోయెను.

 

శకుని:- అదీ.. అదీ వీరి పౌరుషముఅబలల లబలబలాడించిననూ ప్రశ్నించు వారే లేరైరి.

 

కృష్ణ:-అది సరే గాంధారభూపా..భీష్మునిపై కోపము మేనల్లుల్లపై జూపుదువా ఇదేమి న్యాయం.

 

శకుని:- వస్త్రములోనివే యీ పోగులుదుర్యోధనుడు తండ్రి తాతలను మించిన  క్రూరుడుకృతఘ్నుడునాతండ్రినీ సోదరులను పొట్టన బెట్టుకొన్న భూతము.

 

కృష్ణ:-నే నొకమారు సూచాయనగ వింటినికాని దుర్యోధనునితో నీ మైత్రిని చూచి ఆదేమాత్రము నమ్మనైతిని.

 

శకుని:-ఔను లోకము నా పగ మరచిపోయితి నన్నతగా నేను వానితో కలసిపోయితినిసమయమునకై వేచియుండి వాని వ్రేలితోవాని కన్నేపొడవనెంచితినివాని సర్వనాశనము కనులారజూడనెంచితిని.

 

కృష్ణ:- ఔరా... ఒక దుఃఖసాగరమే నీ హృదయమున సుడులు దిరుగు చున్నట్లున్నదిశకునిరాజా.. నాకు నీ యెడల అత్యంతసానుభూతి యున్నది. మీ చరిత్ర తెలికొనవలయునని కుతూహలముగానున్నదివివరించండి.

 

శకుని:-కృష్ణా విను.ధర్మాధర్మముల నీవైనా నిర్ణయించుమా సహోదరి గాంధారికి జాతకరీత్యా వైధవ్యప్రాప్తి గలదని తెలిసీ దాని పరిహారార్థమై ఆమెకు తొలుత నొక మేకపోతుతో వివాహము జరిపించిదానిని వధించి  తదనంతరము నిశ్చయమైన వివాహమును జరిపించమని జ్యోతిషులు సలహా నొసంగిరిమేమట్లే చేసితిమిఅది తప్పా కృష్ణాఅది కేవలము పండితుల  సలహా  మేరకు శుభమునాసించిచేసిన ఒక   దోషనివారక చర్యఅంతియేగదాకానీ  దుష్టదుర్యోధనునకది  ఘోరతప్పిదముగా తోచినది మేమువానిని విధవపుత్రునిగా మార్చితిమట.మచ్చలేని వాని వంశమునకు మచ్చ దెచ్చితిమటపిల్లకాకి వానికేమితెలియునువాని వంశచరిత్ర.. వీని ప్రపితామహుడు  శంతనుడు మత్స్యగంధిని పరిణయమాడునాడు మంట గలియలేదావీరి వంశచరిత్రవీని తండ్రి దృతరాష్ట్రుడు విధవయైన అంబికకు వ్యాసుని ద్వారా కాదా జన్మించినదిఅప్పుడేమైనది వీరి ఆభిజాత్యముఅంతెందులకు వీరి పూర్వీకుడైన భరతమహారాజు భరద్వాజుడను బ్రాహ్మణ బాలుని దత్తత గైకొన్న తర్వాత అతనికి పుట్టిన సంతతి కాదా యీ కురువంశముఐననూ వీరొకరుచెప్పు మంచిమాటలేనాడైనా వినిరావినరుగదామేము నీ తండ్రి క్షేమమునకే  మేషవివాహతంతు జరిపించితి మని యెంత నచ్చజెప్పినను వాడు వినలేదు సరిగదామరింత అగ్రహోదగ్రుడైనాడు. 

 

కృష్ణ:- ఏదో కుర్రతనముమొండివాదనక్షమించి మిన్నకుండిన సరిపోయెడిదిగదాకాలక్రమమున వాని కోపముపశమించి పోయి యుండెడిది గదా!


శకుని:- మేమునూ అట్లే యనుకోని యేమరితిమిఖలుని యలుక అంతటితో అంతరించదని తెలియకపోతిమివాడు గాంధారరాజ్యముపై శతసోదర మేతుడై దాడిసలిపి మా నూర్గురు సహోదరులతోసహా వృద్దుడైన మా తండ్రిని భూకారాగృహమున బంధించి అన్నపానీయములీయక మలమల మాడ్చెనుదినమున కొక మనిషికి ఒక మెతుకుచొప్పున అన్నమిడి మమ్మేడిపించెను.గాంధారేయకనిష్ఠుడనగు నన్ను మాఅన్నలూ తండ్రీ కలసినన్నొక్కని బ్రతికించదలచి వారి నూరు మెతుకులూ నాకిచ్చి ప్రాణములు విడిచిరిఒకరొకరుగా నేల కొరిగిపోతుండగా నా తండ్రి తన చేతిలో నాచేయి వేయించుకొని కడసారి పలికిన పలుకులు నా చెవులలోమారుమ్రోగుచున్నవి.


 

కృష్ణ :- కటకటా.. ఎంత విపత్కరపరిస్థితి నెదురుకొంటిరివినుచున్న నాకే ఒడలు కంపిచుచున్నవి...

 

శకుని;- కృష్ణా.. నన్ను మాట్లాదనిమ్ముఅడ్డుతగులకు-

 

కృష్ణ:- సరి.. మీరిక చెప్పవచ్చును.

 

శకుని:- నాడు నాతండ్రి నాతో నుడివిన పలుకులేమో తెలుసాచెప్పెదవినుముకుమారాశకుని నీవు గాంధాంరేయకనిష్టుడవురాజ్యకాంక్ష ఇసుమంతైనా లేనివాడవు కనుకనే నిన్ను బ్రతికించుకొంటిమిమనల నింత చిత్రహింసలకు గురిచేసిన  కౌరవులను వదలకుపగ తీరునంతవరకు విశ్రమింపకుఏపరిస్థితులలోనూ నీవు మరణించుటకు వీలులేదునేటినుండి నా మాంసమాహారముగా గొని జీవించు కౌరవుల బంధు పుత్ర మిత్ర సమేతముగా సర్వనాశనమయ్యే వరకు వదలకు.. వదలకు.. అంటూ తుదిశ్వాస విడిచెను.నేనాదినమునుండి నాకిచ్చిన మెతుకును కాలరాసి మనసు రాయి చేసుకొని పిత్రుశవమన్న మాట హృదయమునుండి తుడిచివైచి

 

 జీవము మేననిల్ప గతజీవుని తండ్రినిచీల్చి మాంసమున్

        సేవన జేయుచో హృదయసీమన రేగిన మంటలారునే

       రావణకాష్ఠమై రగిలి రాగల యుద్ధమునందు కాల్పదే

       కావరమెక్కి నిక్కు పలుగాకుల కౌరవ జాతి తుచ్ఛులన్.

 

వాడికి పోగాలము దాపురించి గాబోలు నా దీనావస్థకు కల్లబొల్లి మాటలకు యేడ్పులకు జాలిజూపి నను విడిపించి వెంట తిరుగ నిచ్చెనునేనును వాని హితము గోరు వానివలె నటించుచు బలశాలురైన పాండవుల మీద పగ నూరిపోయుచు లాఘవముగా నా గాంధారమును నేను కాన్కగా మరల బొందితినికృష్ణాధర్మజుని ద్యూతమునకు పిలిపించి నా మాయాజాలమున ఇరికించి ఓడించి పగచల్లారకుండా అగ్నికి ఆజ్యము పోసిన యీ అడ్డసారెలను..

 

: పాచికలందుమే తగదు ప్రాణముగల్గిన తండ్రిశల్యముల్

      చూచినచూపు మాత్రమున సూద మొకింతయు లేక పొర్లుచున్

      గాచిన పందెముల్ గెలిచి కౌరవులుబ్బగ పాండుపుత్రులన్

      దోచి పగన్ రగిల్చి నని దూకగజేసి నశింప జేసెదన్.

 

అని అనుకొన్నదనుకొన్నట్లు కార్యము నెరపితిని.  కృష్ణాఇక నీ రాయబారమున బమ్మినితిమ్మి తిమ్మినిబమ్మీ జేసి కౌరవపాండవుల మైత్రి ఘటింపజేతువేమో నని కొంత వంత జేందితినికానీ అందుననూ నా మాయోపాయమే నెగ్గినదిసంధి చెడినది.  కౌరవులకిక యమపురి దర్శనము శీఘ్రమేకానున్నదిఅహహహాహ...(వికటాట్టహాసము)

 

కృష్ణ:-గాంధారరాజాఅసాద్యుడవయ్యా.. మహాబడబానలము నుదరమున భరించి ఇంత ప్రశాంతతనెట్లభినయించుచున్నా వయ్యా.. ఆహాఇది అనితరసాద్యముగదా!

శకుని :- నిజమే దూర్తదుర్యోధనుడుప్రేమతో దౌహిత్రా రమ్మని ఊరువులమీద నెక్కించుకొని ముద్దాడి కాన్కల  ని చ్చి ఆనందించిన తాతనూఅల్లుడారమ్మని భుజముపై నెక్కించుకొని త్రిప్పిన మామలనూ మలమల మాడ్చి చంపిన వాడు కురుక్షేత్రరణరంగమున  భీమగదాదండ తాడనమున తొడలు నుజ్జునుజ్జయి గిజగిజ తన్నుకొని చావవలెదివిజాధిపలోకనివాసుండగు నా తండ్రిఆత్మ శాంతించవలెనన్న యీ మాత్రపు అభినయమునిరీక్షణ అవసరము కావా కృష్ణా!

 

కృష్ణ:- అవశ్యము,  అవశ్యము నీ కోరిక నేరవేరి తీరునుగాంధారభూపా మనసువిప్పి ఇన్ని రహస్యములను బాహాటముగా అరమరికలు లేక వివరించిన నీకు నా మనోగతమును సహితము తేటతెల్లముజేయుట నా విధి యనుకొందునువినుమునేను ధర్మపక్షపాతినిక్షీణించిన ధర్మమునుద్దరించుటే నా కర్తవ్యముగాంధారభూపతీ..

 

చంఎరుగవు నీవు నన్ను పగ నెవ్వరి యందును లేదు నాకు నీ

        ధరణిన గల్గు నేలికలు ధర్మము వీడి చరించుచు, నిర్మలాత్ములన్

        పరిపరి రీతులౌ వ్యధలపాలొనరింతురు నట్టి వారికిన్     

        తిరుగదిలేని శిక్షలిడి త్రెల్లగ జేసెద యుద్ధవహ్నిలోన్    .

                          

శకుని:- కృష్ణనీకు పగ ఎవ్వరి పైనను లేకున్నను నాకు గుడ్డిరాజు కొడుకులపై  విపరీతమైన పగ ద్వేష మున్నను మనిద్దరి ఉద్దేశ్యమూఒక్కటి యే యైయున్నది.  అది కౌరవ సమూలనాశనము.

  

కృష్ణ:- శకునీనేనీ భూమండలము శాంతిసౌఖ్యములతో కళకళ లాడు చుండ నెంచితినిఅందులకు దూర్తరాజన్యలోకమునకు అనేక అవకాశముల నిచ్చి వారికైవారు దారికివచ్చు మార్గముల సూచించితిని గానీ లొంగిరాని దుష్ఠులనిక దండించక తప్పదు.అదీనా నియమమునీవు గమనించితివో లేదో శిశుపాలుని అడుగడుగునా క్షమించి వదలివైచితినికడకతని నూరు తప్పులూ సహించితినిగానీ దారికిరాడయ్యెనుఅందులకే అతనిని గత్యంతరము లేక వధించితినికంసునికీ సుదీర్ఘావకాశము లిచ్చితినికానీ అతడు యిచ్చిన ప్రతి అవకాశమునూ దుర్వినియోగపరచి కడకు నాచే జచ్చెనుఅట్లే యీ దుర్యోధనునకూనా ఓపినంత చెప్పిచూచితినిపెడచెవిని బెట్టెనురణరంగమున బంధు పుత్ర మిత్ర సహితముగా చచ్చుటకు సంసిద్ధుడాయెనుశకునీ  యిందు నేను నిమిత్తమాత్రుడనుఎవరికై వారు  వారి వినాశనము వైపునకు అమితోత్సాహముగా పరుగిడు తున్నారుపరుగిడనిండురాబోవు యీ కురుక్షేత్ర  సంగ్రామమున కేవల కౌరవనాశనమునకు నీ వెదురు చూచుచున్నావుకానీ కౌరవ పాండవ పక్షమన్న బేధములేక దారికిరాని సమస్తరాజలోకమునకూ ఇది బలిపీఠముగా భాసిల్లవలెనని నే నెదురుచూచుచున్నానుయీ రణహోమమున  దగ్ధ మగుటకు పద్దెనిమిదక్షౌహిణుల సైన్యరూప సమిధలు సిద్ధమైయున్నవిస్వపర బేధమేమియు లేక అంతయు బూడిదకాక మానదురాబోవు కాలము నిష్కళంకమై నిర్మలమై సజ్జనజన యుతమై ధర్మరాజను పేరుగడించిన యుధిష్ఠిరుని పాలన క్రిందికి రాగలదుఅది...  అదీ నా ఆకాంక్షనేనే కాలుడను నేనే యీ విశ్వావిశ్వాంత రాళము లంతటనూ వ్యాపించియున్న  "భూమా” ను .  నేనే హరినినారాయణుడను  నేనే .  ప్రకృతి నా అధీనము.  రాబోవు మహాసంగ్రామమున సమీకరణల రూపమున నా శక్తి నంతయు  వినియోగించి సర్వవినాశకర పథకమును నేనే రచించు చున్నాను.

 

శకుని:- కృష్ణానీవు అవతారపురుషుడవన్న సత్యము నా కొకింత మున్నే అర్థమైనదిఅది కురుసభామద్యమున నిన్ను మాయోపాయముచే బంధించ యత్నించి విఫలమైన క్షణమున మరింత దృఢమైనదినన్ను క్షమింపుముచేసిన పాపపుణ్యముల నేవో చేసివైచితినిఇక దైవమగు నీవు నాకు విధించు శిక్షల నీ కర్మభూమియందనుభవించుటకు సంసిద్దముగనున్నానురణరంగమున జయాపజయము ల కన్నా జనక్షయమే ప్రాధాన్యత సంతరించుకోనున్నదను విషయమిప్పుడే నీ మాటల వలన విషదమైనదికానిమ్ము యీ కురుక్షేత్ర మహారణరంగమున నేనునూ వీరమరణ మందినను విచారములేదుకృష్ణాఇక నాకు సెలవు... వెళ్ళివచ్చెద.

 

కృష్ణ:- గాంధారరాజామనిద్దరి ఆలోచనా వేరువేరైననూ ధ్యేయ మొక్కటి యేయని విషదమైనదికానిమ్ముఇక మన పునఃసమాగమము ధర్మక్షేత్ర మైన కురుక్షేత్రముననే.

 

శకుని:- అట్లే కానిమ్ము కృష్ణాఅంతాదైవేచ్ఛవందనములు.

(నమస్కరించి వెళ్ళును -తెరపడును)  

 

(సమాప్తము)

No comments:

Post a Comment

నాకు చదువురాదు, Naaku Chaduvu Raadu

  నాకు   చదువు   రాదు ( ఏకపాత్రభినయము )     (పాత్ర: ఓ 50 సంవత్సరాల  పేద పెద్దమనిషి ) అమ్మా!  శారదా ... ( బోరున   యేడ్చును ).  తల్లీ   యీ   గ...