Sunday, 27 December 2020

శకుని

శకుని

[ఏకపాత్రాభినయం]


రచన
పి.సుబ్బరాయుడు.

 
(వికటాట్టహాసం)...... ఇన్ని సంవత్సరములకు యీ శకుని పథకము   ప్రయోగించు సమయము దొరికినది... నేడు నాకు మహదాఆనందముగానున్నది...తండ్రీ.. సుబల మహారాజా! నీ కనిష్టపుత్రుడనైన నేను, ఆనాడు మీ కిచ్చిన మాటప్రకారము  పగతీర్చుకొనుటకు సమయ మనుకూ లించుచున్నది. యీ కురువంశమును సర్వనాశనము వైపుకు మరల్చు కాలము దగ్గరించుచున్నది.
 
 :    వేచితి నిన్నినాళ్ళు కడువేదన లోనభరించి పైకి యా
        నీచులతోడ నే నడచి నెయ్యము జూపితి నమ్మబల్కితిన్
        గీచినగీటు దాటడిక కిమ్మనకుండు సుయోధనుండు నా
        పాచిక పారె వీరినిక పంపెద కాలుని ప్రోలుజూడగన్.
 
త్వరితగతిని  పనిముగించి  దివిజాధిపలోకనివాసులైన మీకు సంతృప్తి కలిగించెద. మీఆత్మలకు శంతిజేకూర్చేద. నన్ను ఆశీర్వదించు తండ్రీ..మనసార ఆశీర్వదించు. దుర్యోధనాకఠిన కర్కష పషాణ హృదయా! మధాంధుడా! ఏమి నీ కండక్రొవ్వు.
 
శా:   ఆలోచించవు నీకునీవు మరి మీ యాచార్యులున్ పల్కగా
        చాలుం చాలని నడ్డగింతువు సదా సద్భావనల్ జేసి నీ
       మేలేగోరెడి భీష్మునొల్లవెపుడున్ మేలాయె నామాయ నిన్
       కూలంజేసెద బంధు మిత్రతతితో క్రూరాత్మ దుర్యోధనా
 
నీచుడా! నీతల్లికి జన్మనిచ్చిన తండ్రి యని యైనా తలంచక, సాటిరాజన్యుడనియైనా గణించక గాంధారభూపతియైన నా తండ్రినీ,నన్నూ, నాశతసహోదరులను కపటమున జయించి బంధించి భూకారాగృహమున నుంచి రోజున కొక్కమెతుకు మాకు చూపించి మలమలమాడ్చి నాతండ్రినీ సోదరులను పొట్టనబెట్టుకొంటివి. అహంకార దుర్విదగ్దమదాంధా! నీ బంధుప్రీతిని నే నేవిధమున పొగడనురా! మదోన్మత్తా దుర్యోధనా! నా తండ్రి..
 
:  క్రమమున నీరసించి కొనకన్నుల జీవమునిల్పి సౌబలా     
    మముమరువంగబోకు పగ మానగ నియ్యకు ధార్తరాష్ట్రులన్
    సమయముజూచి నా యెముకసారెలమాయల ముంచి సర్వమున్
    సమయగ జేసి  పెట్టుమని శ్రాద్ధము  వీడెను గాదె ప్రాణముల్.
 
ఆనాటి రాత్రిని నేనెట్లు మరువగలనురా! అంత్యదశకు సమీపించిన నా తండ్రి నన్ను పిలిచి, నాయనా శకునీ!  నీవు  గాంధారేయకనిష్ఠుడవు రాజ్యకాంక్ష యిసుమంతైనా లేని వాడవు. నిస్వార్ఠపరుడవు.వినుత ప్రఙ్ఞాదురంధరుడవు, రణవిద్యా పారంగతుడవు. కనుక మనకు జరిగిన యీ దారుణ అపకారమునకు  ప్రతీకారము, పగ  తీర్చుకొనుటకు నీవే తగినవాడవు. పగ  కలనైనా మరువకు కురువంశ మును  కూకటివేళ్ళతో పెగలించునంతవరకు విశ్రమించకు. అందుకు నీవు సజీవుడవైవుండుట అత్యంతావశ్యకము. సంకోచించకు, సంకోచించకు పుత్రా సంకోచించకునీవు నా మాంసభక్షణము జేసి జీవించు. అంటూ తనచేతిలోచేయి వేయించుకొని నాచేత మాట దీసుకొని ప్రాణములు వదిలెను.
 
: జీవము మేననిల్ప గతజీవుని తండ్రిని చీల్చి మంసమున్
       సేవన జేయుచో హృదయసీమన రేగిన మంటలారునే
       రావణకాష్టమై రగిలి రాగల యుద్ధమునందు కాల్పదే
      కావరమెక్కి నిక్కు పలుగాకుల కౌరవజాతి తుచ్ఛులన్.
 
తండ్రి ఆఙ్ఞను శిరసావహించి  పిత్రుశరీర భక్షణము జేసి శరీరమున ఊపిరి నిలిపితిని. ఓరీ గుడ్డిరాజుకొడుకా! అఙ్ఞానాంధకారమగ్నా, యీ నా జుగుప్సాకరమైన చర్య పగ చల్లారకుండా నిత్యమూ రగులుస్తూనేవుంది. పిత్రుమాంస భక్షణము ఙ్ఞప్తికి వచ్చినప్పుడల్లా నా యెద భగ్గున మండుచున్నది. ఆపాదమస్తకమూ మంట లెగయుచున్నవి. నాయెదలో రగిలిన యీ మంట దావానలమై మిమ్ములను బంధుమిత్ర సమేతముగా దహించి బూడిదచేయగలదు. బంధుద్రోహీ... నీకు మేము చేసిన అపకారమేమైనా గలదానా సోదరి గంధారికి వైధవ్యప్రాప్తి గలదని తెలిసి దాని దోషము  పోగొట్టుటకొరకై  తొలుత  ఒక మేకపోతుతో  వివాహతంతు జరిపించి  పిదప దానిని చంపి  దోషపరిహారము గావించితిమి. తదనంతరము నీ తండ్రి దృతరాష్త్రునకిచ్చి పెండ్లి జరిపించినాడు మా తండ్రి. అది తప్పా!
 
: పెద్దలమాట వల్లెయని పెండిలి మేషముతోడ చెల్లికిన్
      పద్దతి యంచు జేసితిమి పాపము గాదది దోషమింతకున్
     దిద్దితి మంతెగాని యది తెచ్చెనె మీయెడ కీడు దుర్మతీ
     వద్దని తాతపై పగ నివారితు జేయరె ఒక్కరేనియున్.
 
ఐనా నీకెవ్వరు  బుద్దిచెప్పగలరు. మేము జరిపిన ఉత్తుత్తి పెళ్ళి మాత్రముననే మీరు విధవాపుత్రులైతిరా! మాతండ్రి చేసిన కార్యమువల్ల నీ తండ్రి దృతరాష్త్రుడు చావక మీ తల్లితాళి నిలిచి భూమికి బరువైన మీ దుష్టశతము పుట్టడము జరిగినది. ఇది మేము జేసిన గొప్ప దుష్కార్యమేఛీ...పాముకు పాలుపోసినట్లైనది.
 
  తే.గీదుష్టజన సంగమము దెచ్చు దురిత మనక
             చేసి వియ్యము వీరితో చెడితి మిట్లు
             వీరి నిట్టులె సహియించి విడువ దగదు
            కుటిల మార్గమున నయిన కూల్చ వలయు.
 
చీకురాజుకొడుకు విషపుపురుగు. కీడుగాక మేలు చేయడని నిరూపించెను.. దౌహిత్రా దుర్యోధనా! రా రమ్మని ప్రేమతో ఒడిలోచేర్చుకొని నీకు విలువైన కానుకలిచ్చి లాలించిన తాతను .
మేనుకు మేన యిన  హితోభిలాషులగు మేనమామలను చిత్రహింసలకు గురిచేసి చంపితివికిరాతకుడా! నీకు నిజమేమి తెలియును  నాసహోదరి గాంధారిని నీ తండ్రి కిత్తుమని మీ భీష్మపితామహుని ప్రాధేయపడితిమా? లేదే! భీష్ముడే వచ్చి మమ్ము అర్థించి ప్రాధేయపడి గ్రుడ్డివాడైన మీ తండ్రితో వివాహము జరిపించె. ఇది ఆనాడే నాకు ససేమిరా ఇష్టము లేదు. ప్రకటాభీల పటుప్రతాప బల దుర్వారుడైన గాంగేయుని నిలువరించలేని మా శక్తిహీనత మానోరు కట్టివైచినది. లేకున్న సకల సుగుణాలరాశి, వినయ వివేకశీల, సుమకోమలాంగి యైన నా అనుంగుసహోదరి గాంధారిని ఒక జాత్యంధుని కిచ్చుట జరిగియే యుండదు.
 
  తే.గీ:   భీష్ముడంతటి వాడొచ్చి పిల్ల నడిగె
         అతని నెదిరించి నిలువగ నౌనె మనకు
         నింక దృతరాష్ట్రునకు బిడ్డ నియ్యవలయు
         ననగ మా తండ్రి  నోరెత్త నపుడు నేను.
 
ఆనాడు మీపెద్దల బలదర్పాటోపమే జయించినది. దూర్తదుర్యోధనా! మమ్ము హింసించు నాడు ఒక్కమారు, ఒక్కమారు మా మాట విననిచ్చగించియుండిన  యివన్నీ నీకు తెలిసియుండెడివి. నీవేల వినెదవు...మీవంశమున ఒకరి మాట వినువాడెపుడైనా జనించెనాలేదుమీవంశమేఅంతఅది కేవలము మాదురదృష్టము. నిన్నని ఫలమేమి?..... నేటికి  మీకు పోగాలము దాపురించినది లేకున్న  నన్ను నమ్మి నేను చెప్పినట్లు నాట్యమాడవు. జూదమునకు సమయము సమీపించుచున్నది. ఇవిగో పాచికలు...కాదు.. ఇవి పాచికలు కాదు.. నేను తినగా మిగిలిన నా తండ్రి సుబలమహారాజు శరీరమందలి శల్యశకలములు.. శల్యశకలములు
 
: పాచికలందుమే తగదు ప్రాణముగల్గిన తండ్రిశల్యముల్
      చూచినచూపు మాత్రమున సూద మొకింతయు లేక పొర్లుచున్
      గాచిన పందెముల్ గెలిచి కౌరవులుబ్బగ పాండుపుత్రులన్
      దోచి పగన్ రగిల్చి నని దూకగజేసి నశింప జేసెదన్.
 
(వికటాట్టహాసం) అల్లుడా దుర్యోధనా...
 
  కం:    మిడిసిపడెద వెందుకురా
         నడుమన విరిగిపడెద వీవు నామాయలకున్.
         విడువను నిను దుర్యోధన
         విడిచిన పాపముగదా వివేకవిహీనా!
 
ఈసారెల సహాయమున నీకు తాత్కాలిక విజయము జేకూర్చి సంతోషపరచి నిన్ను తబ్బిబ్బులు చేసి అనంతబలోగ్ర సమగ్ర సాహసోద్వేగసంపూర్ణులైన పాండునందనులతో వైరము కలిగించి. వైరాగ్ని సమసిపొకుండా నిత్యము   ఆజ్యము పోసి పెంచి పోషించి, మీలోమీకు  కలిగిన  కలహము  తుదకు ఒకరి శిరస్సునొకరు ఖండించు కొనుటకై రణరంగమున తారసిల్లు నంతవరకు మిమ్ము విడువను. నామాయాజాలమున మీరెల్ల చిక్కుకొని  చచ్చునంతవరకు మిమ్ము విడువను. యుద్ధయఙ్ఙంలో మీకైమీరు అఙ్ఞానులై శలభములవలె అగ్నిలోబడి నా కన్నుల యెదుట మలమలమాడి మసైపోవుట జూచి నా పగ చల్లారుగాక.
 
  కం;   మచ్చునకొక్కరు మిగలక
         చచ్చెద రనిలోన మీరు చల్లాచెదురై
         జొచ్చెద రందరు యమపురి
         ఇచ్చక మీడేరి నాదు హృదయము పొంగన్.
 
పరలోకవాసులైన మా పిత్రుదేవుల ఆత్మ ఆనందపరవశమున నోలలాడి ననుదీవించుగాక.. నాచే రగిలించబడిన యీ యుద్ధక్రతువున కాహుతియై కౌరవులు చేయు ఆహా కారముల కన్నల ఆత్మలు సంతసించి  నన్నభినందిం చును గాక ! వారి ఆత్మలకు శాశ్వత స్వాంతనము జేకూరుగాక! వారు  నిరంతర శాంతినిధానమందైక్య మగుదురుగాక. అదిగో దూర్త దుర్యోధనుడు నా సదనమున కిదే వచ్చు చున్నాడు... ఆఁ...అల్లుడా సుయోధనా! పదద్యూతగృహప్రవేశమునకు యిదే సుముహూర్తము.
(అంటూ రంగస్ఠలము వీడి ఒక వైపుగా బయటికి వెళ్ళును)
 
v 
(సమాప్తము)


[ఏకపాత్రాభినయం]


నాకు చదువురాదు, Naaku Chaduvu Raadu

  నాకు   చదువు   రాదు ( ఏకపాత్రభినయము )     (పాత్ర: ఓ 50 సంవత్సరాల  పేద పెద్దమనిషి ) అమ్మా!  శారదా ... ( బోరున   యేడ్చును ).  తల్లీ   యీ   గ...